22, డిసెంబర్ 2024, ఆదివారం

39వ భాగం : ఎలుక ఎగిరింది


`తాతా..తాతా.. ఏదైనా కొత్త కథ చెప్పవా?  

`కథా.. అందులోనూ కొత్త కథా.. వెంటనే గుర్తుకు రావడం లేదురా

`నువ్వు కథ చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు తాతా

`ఇప్పటికే నీకు చాలా కథలు చెప్పాను కదారా. కొత్త కథ అంటున్నావ్ కదా, సర్లే,  ఓ అద్భుతమైన కథ చెప్తాన్రా

`చెప్పు తాతా.. ఈ కథలో డైనోసార్లు ఉంటాయా?’

`డైనోసార్లు ఉండవు, కానీ ఓ జంతువు అయితే తప్పకుండా ఉంటుందిరా, అది బోలెడు గమ్మత్తులు చేస్తుంటుందిరా

` ఏ జంతువబ్బా!! 

`నీకు బాగా తెలిసిన జంతువేరా. అది ఎలుక

`ఎలుక కథా..సర్లే చెప్పు

`ఎలుకే కదా అని తీసిపారేయకురోయ్. అది సాహసయాత్ర చేసింది  

`అవునా తాతా, మరి ఆ కథ పేరేమిటి?

`కథ పేరా?? ఊ.. ఆ.. కథ పేరు - `ఎలుక ఎగిరింది

`భలే భలేఎలుక ఎగిరిందా.. బాగుంది. చెప్పు తాతా..చెప్పు..

తాత కథ చెప్పుకుపోతున్నాడు. మనవడు ఊ..కొడుతున్నాడు.

***

అనగా అనగా ఒక ఊర్లో  చింటు అనే ఆరేడేళ్ళ అబ్బాయి ఉన్నాడ్రా. అచ్చు నీ లాగానే ఉంటాడు. నీలాగానే వాడికి కూడా జంతువులంటే చాలా ఇష్టమన్నమాట. వాటితో మాట్లాడుతుంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఆవు దూడలతో దోస్తీ కట్టేశాడు. మేక పిల్లలతో కలిసి తిరుగుతుంటాడు.చిలుకలతోనేమో బోలెడు కబుర్లు. ఇంకా ఉడతలతోఊసులు. జామచెట్టు ఎక్కి దోరగా పండిన జామ కాయలు తను తింటూ ఉడతలకు పెడుతుంటాడు. 

 అంతలో, ఓ రోజున.. వాడికి ఒక ఎలుకతో దోస్తీ కుదిరిందిరా. తన కొత్త ఫ్రెండ్ కి   గింజలు పెడుతూ దాంతో పాటుగా తానూ తింటూ గెంతుతుండే వాడన్న మాట. 

 

అలా కొద్ది రోజులు గడిచే సరికి ఆ ఎలుకకి కూడాచింటు అంటే బోలెడు ఇష్టం పుట్టేసింది. వాడి దగ్గరకు వచ్చిప్రేమతో కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుండేది.  వాడు చెప్పే కబుర్లు శ్రద్ధగా వింటుంటుంది. ఈ ఎలుకకేమో `రాజు అని పేరుపెట్టాడు చింటు.

ఓ సారి చింటు గాడు ప్రపంచ పటం తెరిచి దేశాల పేర్లు పైకి చదువుతుంటే ఎలుక రాజు స్కూల్ పిల్లాడిలా బుద్ధిగా వింటున్నాడు. 

 

చింటు దగ్గర ఉన్న అట్లాస్ బక్ తాను లాక్కునివరల్డ్ మ్యాప్ ని ఎంతో ఆసక్తితో చూడటం మొదలుపెట్టాడు. ఇది గమనించి చింటు దేశాల గురించి చెప్పడం,  రాజేమో శ్రద్ధగా వినడం జరిగిపోతున్నది. 

  అలా వినగా వినగా, ఎలుక రాజు చిట్టి బుర్రలో ఓ కోరిక పుట్టింది. తాను కూడా దేశాలు చుట్టుముట్టాలి. కనీసం ఏదో ఒక దేశమన్నా వెళ్ళాలి. అక్కడి వింతలు చూడాలి. తన కోరికని చింటుకి చెబితే, వాడేమో కాసేపు బుర్రగోక్కున్నాడు. తన ఫ్రెండ్ ఎలుక గాడిని విదేశాలకు ఎలా పంపాలా అనితెగ ఆలోచించాడు. వాడి బుర్రకు ఐడియా తట్టలేదు.  వాడి బాబాయికి చెబ్తే, ఈ బాబాయి గాడేమో పాస్ పోర్ట్, వీసా అంటూ ఏవో చింటూకి అర్థం కాని మాటలు చెప్పాడు.

`ఈ రెండూ వచ్చేస్తే ఎవరైనా విమానం ఎక్కేసి వేరే దేశం వెళ్ళవచ్చా అని అడిగాడు చింటు.   

`ఎస్, వెళ్లవచ్చు’ అని చెప్పేసి బుక్ లో తలదూర్చేశాడు బాబాయి గాడు. 

ఈ సంగతంతా రాజుకి చెప్పాడు చింటు. 

రాజు బుర్రలో మెరుపు మెరిసింది.

 

 మర్నాడు పాస్ పోర్ట్ కార్యాలయం ఎక్కడుందో కనుక్కుని వెళ్ళాడు. అక్కడేమే పెద్ద క్యూ ఉంది. తన వంతు రాగానే ..

`పాస్ పోర్ట్ కావాలని’ అడిగాడు. 

`నువ్వు ఎలుకవి, నీకు పాస్ పోర్ట్ లు, వీసాలు ఇవ్వరు అన్నది అక్కడ కూర్చున్న ఓ అధికారి. దీంతో పాపం రాజు హర్ట్ అయ్యాడు.  

`పాస్ పోర్ట్, వీసాలు లేకుండా జంప్ చేయడం ఎలా..?’ అని ఆలోచించసాగాడు రాజు. పాస్ పోర్ట్ ఆఫీస్ కి దగ్గర్లోనే ఓ గుడి ఉంటే అక్కడకు వెళ్ళాడు రాజు. దాహంతో అటూ ఇటూ చూశాడు.  అక్కడో పాత్రలో నీళ్ళు ఉంటే  దాహం తీర్చుకున్నాడు.  

కానీ, ఆ తర్వాత ఏమైందో ఎలుక రాజుకి తెలియదు. 

***

ఎలుక చెవులు ఉన్నట్లుండి పెద్దవయ్యాయి. అంతే కాదు, రెక్కలు పుట్టుకొచ్చాయి. రెక్కలను అటూ ఇటూ ఊపుతుంటే అదో రకం శబ్దం వినబడుతోంది. ఇదేదో బాగుందనుకుని రాజు గాడు చెవులను, రెక్కలను అదే పనిగా ఊపడం మొదలుపెట్టాడు.

 

అంతే..

ఆకాశంలోకి ఎగర గలుగుతున్నాడు. వాడికి బోలెడు ఆశ్చర్యమేసింది. 

మొదట్లో ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు గెంతాడు. క్రిందపడకుండానే నేర్పుగా ఎగురగలిగాడు వాడు. ఉత్సాహం ఉప్పెనలా ఎగిసింది. ఈసారి మరింత బలంగా వేగంగా చెవులు రెక్కలు ఊపుతూ ఎగిరాడు. 

రాజు చాలా ఎత్తులో ఎగురుతున్నాడు. ఆకాశంలో పక్షిలా ఎగురగలుగుతున్నాడు. క్రింద నుంచి ఈ దృశ్యం చూస్తున్న పిల్లలు కేరింతలు కొడుతున్నారు. పెద్దవాళ్లు సైతం `ఏమిటీ వింత అని ఆశ్చర్యపోతున్నారు. ఎలుక ఎగరడం ఏమిటీ...!!ఎలుక పక్షిలా మారడమేమిటీ!!

 

 ఈ వింత తెలుసుకుని మీడియా వాళ్లు పరుపరుగున వచ్చేశారు. టివీల్లో ఎగురుతున్న ఎలుక గురించి వార్తలు రావడం మొదలయ్యాయి. కొన్ని టీవీల్లో ఐతే చర్చ కార్యక్రమం కూడా పెట్టేశారు. మొత్తానికి `ఎలుక ఎగిరింది ...’  దో సంచలన వార్త అయింది. 

 

 రాజుకి ఇవన్నీ తెలియవు. అది అలా ఎగురుతూ పోతుంటే తన పై నుంచి విమానం ఎగురుతూ వెళ్లడం చూసింది.

 

అంతే, ఆ విమానం వెళుతున్న దారిలోనే దాన్నే ఫాలో అవుతూ తానూ ఉత్సాహంగా ఎగరడం మొదలుపెట్టాడు. అలా ఎగిరి ఎగిరి, విమానం దిగుతుంటూ తాను దిగడం మొదలుపెట్టాడు.  అక్కడో బోర్డ్ కనిపించింది. 

WELCOME TO   LONDON

చింటు మాటలు గుర్తుకు వచ్చాయి.

లండన్  ఇది ఇంగ్లండ్ దేశానికి రాజధాని. 

`అంటే వేరే దేశానికి వచ్చేశానన్న మాట’ - రాజు గాడికి బోలెడు సంతోషమేసింది.

` పాస్ పోర్ట్, వీసా..ఇవేవీ లేకుండానే లండన్ లో దిగేశానోచ్’ – కిచ్..కిచ్..కిచ్’ అంటూ ఆనందంతో అరిచేశాడు. 

 

 

`ఇక ఇక్కడో ఫ్రెండ్ గాడిని పట్టుకోవాలి. వాడిని అడిగి బోలెడన్ని వింతలు చూడాలి’ - ఇలా అనుకుంటూ వాడు మహానగరంలో నడుచుకుంటూ పోతున్నాడు. నడవడం మొదలుపెట్టగానే రెక్కలు మాయమయ్యాయి. చెవుల సైజ్ కూడా మామూలుకు వచేశాయి. 

లండన్ వీధిలో వడివడిగా నడుచుకుంటూ పోతుంటే వాడికి ఓ పిల్లాడు తగిలాడు. హాయ్ అంటే హాయ్ అనుకున్నారు. అంతే వాడు వీడికి ఫ్రెండైపోయాడు. వాడి పేరు విరాజ్. మరో ఇద్దరు కూడా రాజు కి ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ల పేర్లేమో ఛోటు, విహాన్ అన్నమాట. 

వీరంతా కలిసి ఇంగ్లండ్ లో ఏమేమి చూడాలో ఏమేమి తినాలో ప్లాన్ చేసుకున్నారు. రాజు ముఖం వెలిగిపోయింది. కానీ ఒక్కోసారి మాత్రం ముఖం చిన్నబుచ్చుకుంటూనే ఉన్నాడు. దానికి కారణం లేకపోలేదు. 

`ఓరే ఎలుకరా, చూడరా ఎలా టోపీ పెట్టుకున్నాడో, ఎలుక గాడికి ఎన్ని ఫోజులో.. ‘ – అంటూ తనను చూసిన వారు ఎవరైనా అన్నప్పుడు రాజు గాడికి కోపం వచ్చేది. రాదా మరి తానేమైనా మాములు ఎలుకనా ఏమిటీఎగుర గలిగే ఎలుకనాయె- అర్థం చేసుకోరూ.. ఇది వాడి ఆలోచన. అయితే, ఈ కోపం కాసేపే. `ఇవన్నీ పట్టించుకోవద్దురా రాజు అంటూమిత్రులు ప్రోత్సహింస్తుండటంతో ఇంగ్లండ్ లోని బోలెడు ప్రదేశాలు చూశాడు. 

 లార్డ్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది చూద్దామా అన్నాడు విరాజ్. 

సరే అన్నాడు రాజుగాడు.

 

 స్టేడియం కిక్కిరిసి ఉంది. అయినా ఎలాగో వీరిద్దరు లోపలికి దూరారు. రాజు గాడు ఇండియన్ టీమ్ జెర్సీ వేసుకున్నాడు. కూలింగ్ గ్లాస్ లు పెట్టుకున్నాడు. ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది అక్కడ. హాయిగా చలాకీగా క్రికెట్ మ్యాచ్ చూశాడు. 

 

 కారు ఎక్కి నడపాలని తెగ మనసుపడ్డాడు రాజు. నిజం కారుని లైసెన్స్ లేకుండా నడపకూడదని, బొమ్మ కారు ఎక్కమని విరాజ్ ఇచ్చిన సలహా రాజుగాడికి బాగా నచ్చేసింది. అంతే బొమ్మ కారు ఎక్కి రయ్యిరయ్యిన పోతున్నట్లు తెగ ఫీలైపోయాడు.

 

ఒక పెద్ద కొండ ఎక్కి క్రిందకు చూశాడు. భలేభలే.. క్రింద కార్లు, బస్సులు చాలా చిన్నవిగా కనబడుతుంటే ఆశ్చర్యపోయాడు రాజు. 

 

టౌన్ సెంటర్ లో పోతుంటే ఓ రెస్టారెంట్ లో వాడికి బన్స్ కనిపించాయి. వెంటనే వాడికి రైమ్ గుర్తుకు వచ్చింది..

 

హాట్ క్రాస్ బన్స్

హాట్ క్రాస్ బన్స్..

వన్ ఏ పెన్నీ, టూ ఏ పెన్నీ అంటూ పాడుకుంటూ  రెస్టారెంట్ లో హాట్ క్రాస్ బన్స్ ని చప్పరించాడు. 

అలాగే మరో రైమ్ వాడికి గుర్తుకు వచ్చింది. 

లండన్ బ్రిడ్జ్

లండన్ బ్రిడ్జ్ 

ఫాలింగ్ డౌన్..

 

రైమ్ లో ఉన్న లండన్ బ్రిడ్జ్ చూశాడు. కానీ అది పడిపోవడం లేదు. బాగానే ఉంది. కాలవలో నౌకలు వస్తున్నప్పుడల్లా పైన బ్రిడ్జ్ లేస్తున్నది. ఇదో వింతగా ఫీలైయ్యాడు రాజు గాడు.

 

  ఆకలేస్తుందని అన్నాడు. ఆ మాట వినగానే విరాజ్ పండ్ల తోటలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ కొన్ని పండ్లుకొని బుట్టలో పెట్టుకుని రాజుగాడికి అందించాడు విరాజ్. తోటలో పండ్లు ఛటక్కున తినేయకూడదట. నీట్ గా కోసి ఓ బుట్టలో వేసుకుని తోట యజమానికి ఇస్తే వాటిని తూకం చూసి డబ్బులు కట్టమంటాడు. డబ్బులిచ్చాకనే తినాలట. ఇవన్నీ రాజు గాడికి తెలియవు కదా. విరాజ్ చెప్పాడు. వీడు విన్నాడు. 

 

మంచి స్నేహితుడు దొరికినందుకు రాజు చాలా సంతోషించాడు. కాసేపు  స్ట్రాబెర్రీల తోటలో కలియతిరిగారు. తాను ఆకుల మాటున దాక్కునిఫ్రెండ్స్ తో దాగుడు మూతల ఆట ఆడాడు రాజు. అలా ఆకుల మాటున ముద్దుగా ఉన్నావంటూ విరాజ్ కెమెరా క్లిక్ అనిపించాడు.  

 

ఇంగ్లండ్ లో నాటకాలను ఇప్పటికీ బాగానే ఆదరిస్తుంటారని తెలుసుకుని నాటకం చూడటానికి బయలుదేరాడు. హారగేట్ లోని   ఒక థియేటర్ దగ్గర నల్లటి టోపీ, కళ్లజోడు పెట్టుకుని ఫొటోకి ఫోజుచ్చేశాడు. అక్కడ థియేటర్ లో పాప్ కార్న్ తింటూ  `The EMPEROR’S NEW CLOTHS’ చూసి పగలబడి నవ్వాడు. 

 

`నాటకం చూపించావు, మరి సినిమా చూపించవా?’అని అడిగితే రాజుని `రెక్స్’  అనే సినిమాహాలుకి తీసుకువెళ్ళాడు విరాజ్. అదేమో చాలా పాత సినిమా హాలు. దానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని తెలుసుకుని అక్కడో ఫోటో దిగాడు రాజు గాడు. అక్కడే అతి పురాతన మైన ప్రొజెక్టర్ చూసి బోలెడు సంగతులు తెలుసుకున్నాడు.  చాలా ఇష్టమైన `బాహుబలి సినిమాను చూపించిన విరాజ్ కి బోలెడు థాంక్యూలు చెప్పాడు రాజు.  

 

అంతలో విరాజ్ పుట్టినరోజు వచ్చేసింది. ఆ పుట్టిన రోజు తనదే అన్నంతగా సంబరపడిపోయాడు రాజు గాడు. వీడి సంబరం చూసిన విరాజ్ రయ్యిన బయటకు వెళ్ళి, రాజు కోసం ఓ బుజ్జి  కేక్ తెచ్చాడు. రాజు గాడి చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుక చేయించారు. తన జీవితంలో ఎప్పుడూ పుట్టన రోజు వేడుక జరగకపోవడంతో రాజు గాడి కళ్లు చెమ్మగిల్లాయి. విరాజ్ కీ, విహాన్, ఛోటు గాళ్ల వైపు ప్రేమతో చూశాడు. 

 

 

  ఓ సారి,   రాజు గాడు బుక్ స్టోర్స్ కి వెళ్ళాడు. అక్కడబోలెడు పుస్తకాలున్నాయి. ఒక చోట న్యూస్ పేపర్లున్నాయి. వాటిలో నుంచి ఓ పేపర్ తీసుకున్నాడు. కొన్ని చోట్ల న్యూస్ పేపర్స్ ని ఫ్రీగానే తీసుకోవచ్చట. మరేమో, వాళ్ల ఊర్లో చింటు గాడి బాబాయి గాడు లేడూ, వాడు రోజూ కుర్చీలో కూర్చుని పేపర్ చదవడం చూసిచూసి తానూ అలాగే చదవలానుకున్నాడు. కానీ ఆ ఊర్లో కుదరలేదు. ఇదిగో ఇప్పుడు ఆవకాశం వచ్చేసింది. న్యూస్ పేపర్తీసుకుని ఇంటికి వెళ్ళాక బాబాయి గాడిలాగానే దర్జాగా కుర్చీలో కూర్చుని పేపర్ లోని వార్తాలు తెగ చదివేశాడు. ఇది చూసి ముచ్చట పడి విరాజ్ ఓ ఫోటో తీసేశాడన్న మాట. 

 

వీకెండ్ వచ్చేసింది. విరాజ్ తో పాటుగా ఫ్రెండ్స్ అంతా పల్లెటూరు వెళ్ళారు. అక్కడ పచ్చటి చేలు, పూలతోటలు చూడ ముచ్చటగా ఉన్నాయి.  పంట చేలల్లో తిరుగుతూ కాలక్షేపం చేశారు. 

 

`అదేదో నీడిల్స్ అంట. సముద్రం మధ్యలో కోసుగా ఉండే మూడు రాళ్ళు ఉంటాయట. టూరిస్ట్ లు తెగ ఎగబడి చూడటానికి పోతుంటారు. మనమూ వెళదామా అని విరాజ్ అంటే రాజు గాడు ఒకే అనేశాడు. అక్కడ చైర్ లిప్ఠ్ (రోప్ వే చైర్) ఎక్కి తెగ సంబడపడిపోయాడు. ఆ లిఫ్టేమో చెట్ల పై నుంచి ఎగురుతుంటే వాడికి భలే సరదాగా అనిపించింది. 

 

చింటు బాబాయి గాడికి- తనకు ఇంగ్లీష్ బాగా తెలుసని పెద్ద ఫోజు. షేక్స్పియర్, వరల్డ్ వర్త్ లాగా ఫోజిస్తుంటాడు. ఓసారి డఫెడిల్స్ పూలు చాలా అందంగా ఉంటాయని వర్డ్ వర్త్ కవి వర్ణించాడని చదివితే విన్నాడు. ఆ పూల మొక్కలు ఇంగ్లండ్ లో చాలా చోట్ల ఉంటాయని తెలిసింది.  అదే చెబితే, `ఓస్,అంతేకదా ప్రక్కనే పార్క్ లో డెఫడిల్స్ పూల మొక్కలు బోలెడన్ని ఉంటాయిరా పదా’ అంటూ రాజు గాడ్ని తీసుకు వెళ్ళాడు విరాజ్. అబ్బో రాజు గాడికి ఎంత సంతోషమేసిందో. 

`I wandered Lonely as a Cloud’ - అని పాడుకుంటూ తానే Wordsworth అయినట్లు తెగ ఫీలయ్యాడు రాజు గాడు. 

అక్కడితో ఆగలేదు. షేక్స్ ఫియర్ పుట్టిన ప్లేస్ చూసి తానూ గొప్ప రచయితనైపోయినట్లు ఫీలైపోయాడు.అక్కడ ఉన్న లావుపాటి పుస్తకాల్లో కాసేపు తలదూర్చాడు. ఏలాగైనా ఇంటికెళ్ళాక బోలెడు నాటకాలు వ్రాసేయాలని అనుకున్నాడు.

 

 ఓ సారేమో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ , మరో సారేమో కేమ్ బ్రిడ్జ్ యూనివర్శిటీ వెళ్ళి చూసొచ్చాడు. కేమ్ నదిలో పడవలో షికార్లు కొట్టాడు. ఈ నదిమీద బోలెడు వంతెనలు కనిపించాయి. ఒక వైపున యూనివర్శిటీ కాలేజీలను చూసి చదివితే ఇక్కడే చదవాలని అనుకున్నాడు రాజు గాడు. 

 

 ఎలుక రాజు లో ఉన్నట్లుండి ఆధ్యాత్మిక చింతనపెరగసాగింది. రోజూ పొద్దున్నే లేచి పూజలు చేయడం మొదలెట్టాడు. ఎలాగైనా మంచి మంచి టెంపుల్స్ చూడాలని తన ఫ్రెండ్ విరాజ్ కి చెబితేవాడేమో బర్మింగ్ హామ్ తీసుకువెళ్ళి అక్కడ బాలాజీ టెంపుల్ లో దర్శనం చేయించాడు. అంతే కాదు, లండన్ లో ఒక చోట మహాలక్ష్మి టెంపుల్ ఉంటే తీసుకెళ్ళాడు విరాజ్. అమ్మవారిని చూసి మురిసిపోయాడు రాజు గాడు. అక్కడే గణపతి వారిని దర్శించుకున్నాడు. గణేశ్ ని చూడగానే పరుపరుగున వెళ్ళి ఆయన పాదాల చెంత నిలిచాడు. 

 

లండన్ లోని Madame Tussauds కి వెళ్ళి నిజంలా అనిపించే బోలెడు మైనపు బొమ్మలను చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడే విక్టోరియా రాణి మైనపు బొమ్మ చూసి ఆమె ప్రక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాడు. మోదీతో కరచాలనం చేసేశాడు.అక్కడో చిన్న వేదిక లాంటిది ఉంటే దాని మీద ఎక్కి తానే ఓ మైనపు బొమ్మలా కదలకుండా నిలుచుని సందర్శకులను ఆశ్చర్యపరిచాడు. 

 

విరాజ్ ఓ సారి - రోమన్ బాత్ గురించి చెబితే రాజు గాడు ఆశ్చర్యపోయాడు. ఆ కథ అంతా శ్రద్ధగా విన్నాడు. `మనం చూసి వద్దామా అడిగాడు. సరే అన్నాడు విరాజ్. రోమన్ బాత్ కి వెళ్ళి అక్కడి వింతలు చూసేశాడు. సహజసిద్ధంగా ఉబికే వేడి నీటిని రోమన్లు కొలనులోకి తరలించి ఎంచక్కా జలకాలాడుకునే వారట. ఇది విన్న రాజు గాడు నేనూ కొలను దిగుతానని మారం చేస్తే విరాజ్ వద్దని వారించాడు. అక్కడే రోమన్ దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తితో కలిసి ఫోటో కూడా దిగాడు. 

 

బీచ్ చూద్దామని ఓ సారి బయలుదేరారు. అక్కడ పిల్లల కేరింతలు చూసి తానూ వాళ్లలో ఒకడిగా కలిసిపోయాడు రాజు గాడు. బీచ్ లో ఎంజాయ్ చేశాడు. పిచ్చుక గూళ్లు, కోటలు ఇసుకతో కట్టేసి ఆనందపడిపోయాడు. కానీ అంతలో అలలు వచ్చి తుడిచిపెట్టేయడంతో దిగాలు పడ్డాడు. 

 

తన స్నేహితులైన విరాజ్, విహాన్, ఛోటులతో కలిసి ఫుట్ బాల్ ఆడాడు. కాసేపు గోల్ కీపర్ గా కూడా ఉన్నాడు. బాల్ గోల్ పడకుండా నేర్పుగాఆపేసినప్పుడు బోలెడు సంతోషమేసింది రాజు గాడికి. 

 

అప్పటికే ఇండియా వదిలేసి చాలా రోజులైంది.   ఓ రోజున వాడికి తన ఊరి మీద దిగులేసింది. ఓ రాత్రి పూట ఎత్తైన టవర్ ఎక్కి నగరాన్ని ప్రేమగా చూస్తూ,తన ఫ్రెండ్స్ కి బైబై చెబుతూ, కళ్లు తుడుచుకుంటూ ఎగిరాడు. వాడు ఎగరడం మొదలుపెట్టగానే చెవులు పెద్దవయ్యాయి. రెక్కలు మొలిచాయి. అంతే ఆకాశంలో ఎగురుతూ తన భారత దేశం దిశగా సాగిపోతున్నాడు రాజు. 

****

తాత కథ చెప్పడం ఆపాడు. 

మనవడికి నిద్ర ముంచుకొస్తున్నది. 

ఆవలిస్తూనే అడిగాడు...

తాతా, ఆ ఎలుక నువ్వేనా? ఈ కథ నీదేనా??

అవునేమోరా మనవడా.

********

తాత మనసు తేలికైంది. 

శరీరం కూడా తేలికైంది. 

నడవలేని వయసులో పరిగెత్తమంటోంది మనసు. 

కొత్తకొత్త ప్రాంతాలు చూడమంటోంది.

ఇంగ్లండ్ కి వెళ్ళి మనవళ్లతో ఆడుకోమంటోంది. 

తనకు రెక్కలు మొలిచిన భావన. 

ఆకాశంలో ఎగిరి వెళుతున్నట్లు కలలు. 

చిన్నప్పుడు ఇలాంటి కలలే వచ్చాయి. 

మళ్ళీ ఇన్నాళ్లకు , ఈ ముసలి వయసులో ..ఏమిటో...

***

ఇంగ్లండ్ లో చూసిన పర్యాటక ప్రదేశాలు కొన్ని సినిమా రీలులా కళ్లముందు కదలాడాయి.

 

 

17, డిసెంబర్ 2024, మంగళవారం

38వ భాగం : తెలుగు వెలుగు

 


 

   నా కళ్లు అటూ ఇటూ ఆశగా చూస్తున్నాయి. అక్కడంతా యూనివర్శిటీ అమ్మాయిలు, అబ్బాయిలు - రక రకాల డ్రెస్సుల్లో కనబడుతున్నారు. కానీ నన్ను ప్రేమగా పలకరిస్తూ,  నిత్యం నడిపించేది.. ఏది ఎక్కడ? కనిపించదే. ఎక్కడ దాక్కున్నదో.. వెతికి పట్టుకోవాలి. ఎందుకో చాలా తపనగా ఉంది. ఎలాగైనా చూసి తీరాలి. సరిగా అర్థం చేసుకోవాలి.

అంతలో  ఒక అమ్మాయి నా వైపు చూస్తూ, పలకరింపుగా నవ్వింది. నేను నవ్వాను. కానీ నా చూపు మాత్రం నలు దిశలా తిరుగుతోంది. అంతలోలైబ్రరీ సహాయకుడు కనిపిస్తే అడిగాను. ఎక్కడుందో వివరంగా చెప్పాడు. అంతే, నడకలో వేగం పెంచాను. మెట్లు ఎక్కాను. మలుపు తిరిగాను. ఒకగదిలోకి ప్రవేశించాను. ఒక మూల.. అదిగో, అక్కడ కనిపించింది. 

 

కొత్త మలుపు 

 

జీవితంలో కొన్ని  మలుపులు చిత్రంగానే ఉంటాయి. తెలుగు భాష కారణంగా నాలో కొత్త వెలుగు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. దారి తప్పిన మనిషిని సరైన బాటలోకి తెలుగు భాష నన్ను నడిపిందేమో.  కాలేజీ విడిచి పెట్టిన తర్వాత పూర్తిగా సైన్స్ సబ్జెక్ట్ మీదనే దృష్టి పెట్టాను. సైన్స్ లెక్చరర్ అవుదామన్నదే నా ఆశ..ఆశయం. కానీ విధి నన్ను మరో వైపుకు లాగింది. ఉన్నట్లుండి జర్నలిస్ట్ అవతారం ఎత్తాను. ఈ మధ్యలో తెలుగు భాష పట్ల ఆసక్తి పెరగడానికి కొన్ని సంఘటనలు కారణమయ్యాయి. వాటిలో ప్రధాన మైనది, UPSCపరీక్షకు ప్రిపీర్ అవడం. లైబ్రరీలకు తరచు వెళ్ళడం.అన్ని సబ్జెక్ట్స్ మీద ఎంతో కొంత విషయ జ్ఞానం ఉండాలి. అప్పటి వరకు సైన్స్ పరిధి దాటని నేను ఇప్పుడు హిస్టరీ, పాలిటిక్స్, జాగ్రఫీ, తెలుగు..ఇలా అన్నింటి పట్ల ఆసక్తి పెంచుకోవడం మొదలెట్టాను. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన అంశాలను సేకరిస్తూ, వాటిని విశ్లేషిస్తూ వ్యాసాలు వ్రాసి పేపర్స్ పంపేవాడిని. వాటిలో కొన్ని ప్రచురితమయ్యాయి.  

నేను వైజాగ్ లో ఉన్నప్పుడు మొదటి సారిగా ఆంధ్రా యూనివర్శిటీ లైబ్రరీకి వెళ్ళాను. అది చాలా పెద్దది. చదవాలన్న ఆసక్తి ఉండాలే కానీ పుస్తకాలకు కొదవు లేదక్కడ. లైబ్రరీలో అనేక వింగ్స్ ఉన్నాయి. ఒక్కో వింగ్ లో ఒక్కో అంశంమీద పుస్తకాలను చాలా పొందికగా అమర్చారు. పుస్తకాలను తీసుకునిహాయిగా కూర్చుని చదవుకునే వీలుంది. అక్కడక్కడాబారుగా ఉన్న బల్లలు, వాటిని ఆనుకునే కూర్చీలు బోలెడు ఉన్నాయి. చదువుకుంటూనే నోట్స్ వ్రాసుకోవడానికి అనువుగా ఉంది ఆ ప్లేస్.  లోపలకు అడుగుపెట్టగానే అనేక పుస్తకాలు ఆకర్షిస్తుంటాయి. ఆకాశంలో నక్షత్రాల్లా మిళమిళా మెరిసిపోయే రంగురంగుల కొత్త పుస్తకాలు కొన్ని..  రంగు వెలిసినవి ఇంకొన్ని. కొత్త పుస్తకాలు నూతన వధూవరుల్లా అందంగా కనబడుతున్నాయి. `చూశావా మా అందం.. చందం అన్నట్లు ఠీవీగా బుక్ రాక్స్ లో నిలబడి ఉన్నాయి. మరి కొన్ని మధ్యవయస్సున్న మనుషుల్లా గుంభనంగా ఉన్నాయి. ఇంకొన్ని మరీ పాతవి. పుస్తకం మీద చేయి వేస్తే చాలు అట్ట ఊడి వచ్చేలా ఉన్నాయిఅయినా అవి - `రండర్రా, నా దగ్గరకు రండర్రా, ఎన్నో జ్ఞాపకాలు నా పుటల్లో దాగి ఉన్నాయి. కదిలిస్తే తరాల అంతరాలు తొలిగిపోయేలా కబుర్లు చెబుతాను, రండి.. నన్ను దగ్గరకు తీసుకోండి. నా అనుభవ సారాన్ని అందుకోండి – అన్నట్లు చూస్తుండేవి. కానీ ఎందుకో తెలియదు కానీ చాలా మంది నవయువత వీటి జోలికి పోవడం లేదు. కొత్త పుస్తకాల మోజులో పాత వాసనలు పట్టించుకోవడం లేదేమో. నాకెందుకో ముసలి పుస్తకాలను చూస్తే జాలి వేసింది. ఎవ్వరూ పట్టించుకోకపోతే ఇవి ఏమవుతాయి? కొన్నాళ్లకు బుక్ రాక్స్ నుండి తప్పుకుంటాయి. కనుమరుగైపోతాయి. 

 

ఎఱ్రావు – పాత పుస్తకం 

అడవిరావులపాడులో మాకు చాలానే ఆవులుండేవి. వాటిలో ఎఱ్ఱావు ని మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. ఎందుకంటే అది చాలా నెమ్మదిగా నడిచేది. నడకలో మిగతా ఆవులకంటే బాగా వెనుకపడేది. అన్ని ఆవులు ఇంటికి చేరిన కాసేపటికి నిదానంగా చరేది. తానెవ్వరికీ పోటీ కాదన్నట్లుగా ఉండేది. గడ్డి త్వరత్వరగా తినాలన్న ధ్యాస కూడా ఉండేది కాదు. పడుకోవాలన్నా లేవాలన్నా చాలా సేపు పట్టేది. మిగతా ఆవులకు భిన్నంగా ఉండటంతో ఈ ఆవు నాకు బాగా గుర్తిండిపోయింది. దాని సంతానం చాలానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మా ఇంటి పశు సంపద అంతా దాని చలవే.  దాని కొమ్ములు ఎప్పుడైనా ఊడిపోతాయా అన్నట్లు కదులుతుండేవి.  

ఓ సారి అమ్మని అడిగాను..

`అమ్మా, దాని కొమ్ములు ఎందుకనే అలా ఊగిపోతున్నాయి. ఎందుకని అది మిగతా ఆవుల్లా నడవలేకపోతున్నది..

`అది ముసలిదైపోయింది కదరా..

`అంటే బామ్మ లాగా అయిపోయిందా?’

`అవున్రా

`మరి నువ్వు కూడా ముసలి దానివి అయిపోతావా అమ్మా?’ – ఈ ప్రశ్నలోనే గొంతులో కాస్తంత కంగారు ధ్వనించింది.  

` నేనూ ముసలిదాన్ని అయిపోతాను. కంటి చూపు తగ్గుతుంది. నడుము వంగిపోతుంది.  కర్ర సాయం లేకుండా నడవలేను. పళ్లు ఊడిపోతాయి. నా పని చేసుకోవడమే నాకు కష్టమవుతుంది. ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మ...

ఏమిటో అమ్మ ఇంకా ఏదో చెప్పుకుపోతూనే ఉంది. ఆమె చూపు నా మీద లేదు. శూన్యంలోకి చూస్తున్నట్లుంది. అప్పటి దాకా చదువుతున్న పుస్తకం అమ్మ చేతుల్లో నుంచి జారి క్రింద పడిపోయింది. అది చాలా పాత పుస్తకం. జారి క్రిందపడగానే అట్ట ఊడిపోయింది. కొన్ని పేజీలురాలిపోయాయి. ఎండుటాకుల్లా. పుస్తకం పుటల్లో నుంచి ఏదో వాసన కూడా వస్తున్నది. స్కూల్ పుస్తకాలు కొత్తవి నాన్న కొని ఇంటికి తీసుకువచ్చినప్పుడల్లా ఆ పుస్తకాల్లో నుంచి కమ్మటి వాసన వచ్చేది. ఆ వాసన అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇదేమిటీ , వెగటు పుట్టిస్తున్నదేం? పుస్తకం పాత పడితే ఇలాంటి వాసనే వస్తుందాఅంటే.. ఈ పుస్తకం కూడా ముసలిదైపోయిందా..?అడుగుదామని అమ్మ వైపు చూశాను. కానీ అమ్మ నన్ను పట్టుంకునేలా లేదు. ఏదో చెబుతునే ఉంది. ఆ మాటలు నేను గతంలో విన్నవి కావు. అర్థం కాక బుర్ర గోక్కున్నాను. 

అమ్మ చేతిలో ఈ పుస్తకం చాలా సార్లు చూశాను.  ఏ మాత్రం తీరుబడిగా ఉన్నా గూట్లో పెట్టిన ఈ పుస్తకం తీసి చదువుకునేది. కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు. పరధ్యానంలోకి వెళ్ళడం, పుస్తకం జారి పడటం నేను చూడలేదు. అందుకే ఆ పుస్తకం అట్ట మీద ఉన్న అక్షరాలు చదివాను. 

భ గ వ ద్గీ త .

 ఇది హిందువులకు పరమ పవిత్ర గ్రంథమని నాకప్పుడు తెలియదు. కానీ సినిమాల్లో అప్పటికే చూశాను. శ్రీకృష్ణుడు అర్జునికి గీతోపదేశం చేయడం, అది అయ్యాక అర్జునుడేమో జోరుగా యుద్దం చేయడం. నేను నెమ్మదిగా ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. పుస్తకం అట్ట మీద శ్రీకృష్ణుడు అర్జునికి గీతోపదేశం చేస్తున్న  బొమ్మ కలర్ లో ఉంది.రంగు మాత్రం బాగా వెలిసిపోయింది. పుస్తకంలో ఏమున్నదన్న విషయం కంటే అది పాతపడిపోయిందన్న దిగులు ఎక్కువైంది. 

ఎఱ్ఱావు,

బామ్మ,

పాత పుస్తకం,

రేపు అమ్మ,

తర్వాత..??

నాకెందుకో భయం వేసింది.  

అమ్మ చెప్పిన మాటల్లో ఒకటి అర్థమైంది. రేపు నేను కూడా ముసలాడినైపోతాను. అమ్మని చూస్తే ఎప్పుడూ భయం వేయలేదు. కానీ ఇలా మాట్లాడుతున్న అమ్మని చూస్తే మాత్రం ఆ క్షణం భయం వేసింది. 

భగవద్గీత పుస్తకాన్ని జాగ్రత్తగా చేతుల్లో పట్టుకుని అమ్మని ఒకే ఒక్క ప్రశ్న అడిగాను. 

`అమ్మా, ఇందులో ఏముంది?

అమ్మ  సమాధానం చెప్పలేదు. కానీ నావైపు ప్రేమగా చూస్తూ నా చేతుల్లోని పుస్తకాన్ని అందుకుని కళ్లకు అద్దుకుంది. అమ్మకు ఇష్టమైనది కనుకనే నేనూ ఆ పుస్తకాన్ని ప్రేమించడం మొదలు పెట్టాను. 

 

సద్గురువు :

 

అప్పటి నుంచి భగవద్గీత పుస్తకాన్ని ఎప్పుడు చూసినా, ఏదో అమూల్యమైన వస్తువుని చూసినంత సంబరం కలిగేది. కాస్త పెద్దయ్యాక, చదవడం తెలిశాక భగవద్గీత పుస్తకం తెరిచాను. 



కానీ అందులోని శ్లోకాలు సంస్కృతంలో ఉన్నాయి. కేవలం అక్షరాలు మాత్రమే తెలుగు. చదవగలను. కానీ అర్థం తెలియదు. అర్థం తెలియకుండా ఎంత చదివితే ఏం లాభం? ఈ రకం ఆలోచనలే భగవద్గీత శ్లోకాలకు అర్థం చెప్పే పుస్తకాల ఏవైనా ఉన్నాయా..? అన్న వెతుకులాటకు దారి తీసింది. 

 

కోరినది..దరి చేరినది :

 

ఆంధ్రా యూనివర్శిటీ లైబ్రరీలోకి అడుగు పెట్టగానే నా కళ్లు అటూ ఇటూ వెతుకుతున్నాయి. నేను చూడాలనుకున్నది, కోరుకున్నది అప్పుడు కనిపించింది. అందీ అందనట్లుగా ఉంది. అతి కష్టం మీద చేతికి చిక్కింది. అది భగవద్గీత శ్లోకాలకు తెలుగులో అర్థం చెప్పే పుస్తకం. చాలా పాతదైపోయింది. పుస్తకం పై అట్టను ప్రేమతో నిమిరాను. దుమ్ము నిదానంగా దులిపాను. ఓ మూల కూర్చుని చదవడం మొదలుపెట్టాను. తెలుగు అనువాదం చాలా బాగా వ్రాశారు. అయినా చాలా చోట్ల నేనే సరిగా అర్థం చేసుకోలేక పోతున్నాను. 

   ఎన్నో సందేహాలకు సమాధానాలు దొరుకుతున్నట్లే అనిపించింది. గజిబిజి జీవితాలకు మార్గం చూపేమహా గ్రంథంలా కనిపించింది. కర్తవ్యాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు అవునో కాదో నాకు తెలియదు. కానీ ఆయన సద్గురువు.

 

జ్ఞాన గవాక్షం 

 

 నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో  ఘంటసాల మాష్టారి భగవద్గీత ఆడియో విడుదలైంది. అది మా ఇంటికి చేరినప్పటి నుంచి అనేక సార్లు విన్నాను. ఆత్మ, జీవాత్మ, కర్తవ్యం, కర్మ...వంటి మాటలకు అర్థం ఎంతో కొంత తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పుస్తకం చదువుతుంటే కాంతి రేఖలు మరింతగా ప్రసరించినట్లు, వేయి సూర్యుల వెలుగు ప్రకాశించినట్లు అనిపించింది. శ్లోకాలు అర్థమవుతుంటే వాటి సారం తెలుసుకుంటుంటే జ్ఞాన గవాక్షాలు తెరుచుకుంటున్న భావం పెరిగింది.

 సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతుండటంతో అన్ని సబ్జెక్స్ మీద ఆసక్తి పెరిగింది. కొన్ని విపరీతంగా ఆకర్షించాయి. అందులో ఒకటి తెలుగు సాహిత్యం. ప్రబంధ సాహిత్యం మొదలు విప్లవ సాహిత్యం వరకు అన్నీ చదవడం మొదలుపెట్టాను. ఒక్కో పుస్తకం చదువుతుంటే తెలుగు భాష పట్ల మక్కువ పెరగ సాగింది. బహుశా ఈ మక్కువే, ఎంఏ తెలుగులో పట్టా అందుకున్న అమ్మాయి అనితెలిసినందువల్లనే ఇంట్లో పెద్దలు చెప్పిన ఒక సంబంధం వైపు ఆకర్షితుడినయ్యేనేమో. అలా మన్నవ గిరిధర రావు గారి పెద్దమ్మాయి (శ్రీదేవి)ని పెళ్ళి చేసుకున్నానేమో. జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటే వింతగానే అనిపిస్తుంటాయి. మరి కొన్ని నవ్వు పుట్టిస్తుంటాయి. 

 

తూర్పూ – పడమర

 

నేను చదివింది సైన్స్. 

ఆమె చదివింది తెలుగు.

నేను ఎమ్మెస్సీ చేసింది బొంబాయిలో,

ఆమేమో ఎంఏ , నాగార్జునా యూనివర్శిటీలో. 

ఆమె తూర్పు. 

నేను పడమర. 

అయినా, తెలుగు భాష మమ్మల్నిద్దరినీ కలిపింది.  అదేదో సినిమాలో కృష్ణమ్మ ఇద్దరినీ కలిపినట్లు...

`నువ్వా దరిని

నేనీ దరిని 

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

అందుకే ఈ పాట గుర్తుచేసుకుంటూ ఉంటాము. 

 

పాటల పెట్టె రేడియో:

 

అవును, ఈ సినిమా కవులు చాలా చిత్రంగా పాటలు వ్రాస్తుంటారు. కాలేజీలో చదివి రోజుల్లోనే తెలుగు పాటల పట్ల మక్కువ పెరిగింది. పాత పాటలు, కొత్త పాటలు చాలానే వినేవాడ్ని. పాటలోని రాగంతో పాటుగా సాహిత్యం మనసుకు పట్టేసేది. తెలుగు భాష పట్ల మక్కువ పెరగడానికి  సినిమా పాటలు కూడా ఓ కారణం. సినిమా చూస్తున్నప్పుడు పాట వింటే అది అంతగా బుర్రకెక్కేది కాదు. కానీ విడిగా వింటున్నప్పుడే నోటికి వచ్చేసేదిఈ రేడియా వాళ్లున్నారే, వీళ్లు బహు చతురులు. జనరంజని పేరిట ఓ కార్యక్రమం పెట్టి రోజూ శ్రోతలు కోరుతున్నారంటూ బోలెడు తెలుగు పాటలు వినిపించే వారు. అవి మనసుకు హద్దుకునేవి. ఎంతగా అంటే, ఇంట్లో ఏ పనిచేస్తున్నా పాట నోట్లో నుంచి వస్తుండేది. మా ఊర్లో రెండు సినిమా థియేటర్లు ఉండేవి. రోజుకు మూడు ఆటలు వేసే వారు. ప్రతి షోకి ముందు థియేటర్ వాళ్లు బయట లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు వినిపించే వారు. ఊరు చిన్నది కావడంతో దాదాపుగా ఆ పాటలు ఊరంతా వినబడేవి. ఇలా ఇటు రేడియో, అటు మైకుల్లో పాటలు..మొత్తంగా పాఠాల కంటే పాటలే ఎక్కువగా మనసులోకి దూరేవి. ఆ రోజుల్లో ఎక్కువ పాటల్లో మ్యూజిక్ రొద ఉండేది కాదు. సంగీతం శ్రావ్యంగా ఉండటంతో సాహిత్యం కూడా బాగానే బుర్రకెక్కేది. ఏ పదం ఏ సందర్భంలో వాడుతున్నారో తెలుస్తుండేది.

 

పంతులమ్మ -  పద్యాలు:

 

హైస్కూల్ చదివే రోజుల్లో తెలుగు పాఠాలు చెప్పడానికి పంతులమ్మ వచ్చేవారు. ఆమె తన తీయటి గొంతుతో పద్యాలు ఆలపిస్తూ, వాటి అర్థాలు చెబుతుంటే ఎందుకో తెలుగు పట్ల ఆకర్షితుడయ్యేవాడని. అసలు చిన్నప్పటి నుంచి హరికథలు, బుర్రకథలు, నాటకాలు చూశాను. పద్యాలు నన్ను బాగా ఆకర్షించేవి. భక్త ప్రహ్లాద సినిమా చాలా చిన్నప్పుడు చూసేసి, అందులోని పద్యాలను పాడటానికి ప్రయత్నించాను. ఇంట్లో వాళ్లు మెచ్చుకోవడంతో గర్వంగా ఫీలయ్యేవాడిని. పెద్దయ్యాక పోతన గారి పద్యాలే ఇవి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ప్రహ్లాదుడు పసివాడు కాబట్టే అలాంటి వాడు పాడే పద్యాలు కూడా లేత లేత పదాలతోనే ఉండాలని పోతన అలా వ్రాశారేమో. మరి కొన్ని చోట్ల ఎంతో గంభీరంగా వ్రాశారు. ఉదాహరణకు నరసింహావతరణం ఘట్టంలో పోతన వ్రాసిన వర్ణన ఎప్పుడు విన్నా ఒళ్లు జలదరిస్తుంటుంది. నరసింహ స్వామి వారి రూపాన్ని అంత అద్భుతంగా వర్ణించారు. నా చిన్నప్పుడు మేము మంగళగిరిలో ఉన్నాము. నరసింహస్వామి వారికి అలంకారాలు వేసినప్పుడనుకుంటా స్తంభం నుంచి నరసింహస్వామి ఆవిర్భవించే ఘట్టాన్ని ఓ రోజు ఆలయంలో ప్రదర్శించే వారు. పెద్ద శబ్దంతో స్తంభం విచ్చుకునేది. వెలుగులు చిమ్ముతూ నరసింహస్వామి ఉగ్రరూపంలో కనిపించే వారు. 

నరసింహ స్వామి ఆవిర్భావ వర్ణన :

   శ్రీహరి ఎక్కడైనా ఉంటాడని ప్రహ్లాదడు అనగానే హిరణ్యకశిపుడు తన ఎదురుగా ఉన్న స్తంభాన్ని చూపిస్తూ  ఇందులో ఉంటాడా నీ హరి? అని ఎద్దేవగా ప్రశ్నిస్తాడు. ఉంటాడు, చూసుకో అంటాడు ప్రహ్లాదుడు. దీంతో కోపంతో, ఎర్రబడిన కళ్లతో తన చేతిలోని గదతో స్తంభాన్ని కొడతాడు. స్వామి వారి ఆవిర్బావ సంఘటను పోతన గారు ఎంత గంభీరంగా వ్రాశారో చూడండి. ఈయనేనా లేత లేత పదాలతో పద్యాలు వ్రాసిందని అనిపిస్తుంది. ఓ సారి చదవండి..




ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండునువైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండునురోషానలజంఘన్యమాన విజ్ఞాన వినయుండునువినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండునుతామస గుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందుఁ జూపు మని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం బగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశదిశలను మిడుంగుఱులు చెదరం జిటిలి పెటిలిపడి బంభజ్యమానం బగు నమ్మహాస్తంభంబువలనఁ బ్రళయవేళాసంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరరజోఘుష్యమాణ మహా వలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష నికాశంబు లయిన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్య మానంబులై యెగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు జేసి నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్రచాపహలకులిశఅంకుశజలచర రేఖాంకిత చారు చరణతలుండునుచరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండునుదుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండునుఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండునునిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండునుముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండునుకులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండునుదుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండునుశంఖచక్రగదాఖడ్గకుంతతోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండునుమంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హారకేయూరకంకణకిరీటమకరకుండలాది భూషణ భూషితుండునుద్రివళీయుత శిఖరిశిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండునుబ్రకంపనకంపిత పారిజాతపాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండునుశరత్కాల మేఘజాలమధ్య ధగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండునుకల్పాంతకాల సకలభువనగ్రసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండునుమేరు మందర మహాగుహాంతరాళవిస్తార విపుల వక్త్ర నాసికారంధ్రుండునునాసికారంధ్ర నిస్సరన్నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండునుపూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండలసదృక్ష సమంచిత లోచనుండునులోచనాంచల సముత్కీర్యమాణ విలోలకీలాభీల విస్ఫులింగ వితానరోరుధ్యమాన తారకాగ్రహమండలుండునుశక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతా బంధ బంధురభయంకర వదనుండునుఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండునుసంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండునునిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండునుమంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణవేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకారాకార భాసుర కేసరుండునుపర్వాఖర్వ శిశిరకిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండునుధవళధరాధరదీర్ఘ దురవలోకనీయ దేహుండునుదేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురంబ గర్వాంధకారుండునుబ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండునుమహాప్రభావుండును నయిన శ్రీనృసింహదేవుం డావిర్భవించినంగనుంగొని

 ఇలా సాగుతోంది పోతన గారి రచన. ఇది చదివినప్పుడల్లా నా కళ్ల ముందు మంగళగిరి నరసింహస్వామి ఆవిర్భావ సన్నివేశం కనబడుతుంటుంది. 

 

తెలుగులో వార్తా యజ్ఞం :

 

తెలుగు దినపత్రికల్లో పనిచేయడం, జర్నలిజమే వృత్తి కావడంతో తెలుగు భాషలోనే అనేక వార్తలు, వ్యాసాలు వ్రాయవలసి వచ్చింది. దీంతో తెలుగు భాష పట్ల మరింత మక్కువ పెరిగింది. జర్నలిజంలో ఉంటూ నిత్యం తెలుగులో రచనలు చేయడమన్నది ఓ యజ్ఞంలా సాగింది. నాలుగు దశాబ్దాల నుంచి ఈ యజ్ఞం కొనసాగుతూనే ఉంది. మీడియాలో రూపాలు మారవచ్చు. పత్రిక వదిలేసినా వెబ్ పత్రికలు, టివీ సంస్థల్లో పనిచేసినా తెలుగు మాట్లాడటం, వ్రాయడం నా వృత్తిలో భాగం అయిపోయింది. సరిగా ఈ టైమ్ లోనే సోషల్ మీడియా ఎంటరైంది. చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందిన మీడియా ఇది. చివరకు వికృత పోకడలు పోతుండటం చూస్తుంటే చాలా బాధ కలుగుతున్నది. అయినా తెలుగు భాష అభివృద్ధిలో దీన్ని కూడా ఉపయోగించుకోవాలన్న తపన ఎక్కువైంది. 

 

ఏయులో ప్రసంగం:

 

ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏయు) తెలుగు డిపార్ట్ మెంట్ వారు మాతృభాషాదినోత్సవం రోజున సదస్సు ఏర్పాటు చేసి నన్ను కూడా విశిష్ట అతిధిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నేను తెలుగు భాష – సోషల్ మీడియా పాత్ర అన్న అంశంపై పరిశోధనాత్మక వ్యాసం సమర్పించాను. 



ఇదే అంశంపై ప్రసంగించాను. సరే, సందర్భం వచ్చింది కనుక, పాఠకులకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వ్యాసాన్ని యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. 

 

తెలుగు భాషాభివృద్ధి – సోషల్ మీడియా పాత్ర:

 

what’s appFacebook వంటి సోషల్ మీడియా సమాజాన్ని శాసిస్తున్న రోజులువి. ఎంతో వేగంగా సమాచారం వ్యాప్తి చెందుతున్న రోజులు వచ్చేశాయి. క్షణాల్లో భావజాలు ఖండాలు దాటిపోతున్నది. ఇది ఒక్కోసారి ప్రమాదకారి కూడా. తప్పుడు, అసభ్య సమాచారం క్షణాల్లో వ్యాప్తి చెందడం వల్ల సామాజిక విలువలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలకు ముప్పు వాటిల్ల వచ్చు. రాజకీయ కుట్రలకు దారితీయవచ్చు. కానీ ఏ సమాజమైనా సమగ్ర అభివృద్ధి సాధించడంలో సాంకేతిక పురోభివృద్ది యొక్క పాత్రని కూడా మరచిపోలేం కదా. సోషల్ మీడియా ఓ అస్త్రం లాంటిది. దీన్ని మంచికి వాడితే చెడు నశిస్తుంది. అదే చెడు ప్రచారానికి ఉపయోగిస్తే సమాజంలో మంచి కనుమరుగవుతుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఒకటే. మనం వాడే స్వభావం, పరిస్థితులను బట్టి దాని రూపం మారుతుంటుంది. ఈ ప్రకృతి కూడా అంతే. గాలి, నీరు, అగ్ని ..అన్నీ అవసరమే. కానీ అవే ఒక్కోసారి ప్రళయం సృష్టిస్తుంటాయి. మనిషి నేర్పుగా తన అవసరాలకు తగ్గట్లుగా, తగినంతే వాడుకోవాలి. సోషల్ మీడియా కూడా అంతే. సోషల్ మీడియా ఒక ప్రక్క చెరుపు చేస్తున్నా, అదే వేదికను ఉపయోగించుకుంటూ మంచి పనులు విస్తారంగా చేపట్టాలి. అందులో ఒకటి తెలుగు భాషా వికాసానికి సోషల్ మీడియాను వాడుకోవడం.  

సమాజం - మాతృభాష - సాంకేతిక వికాసం ఈ మూడు అంశాలు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోతున్నాయి. అందుకే తెలుగు భాషా వికాసానికి సోషల్ మీడియా పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సోషల్ మీడియా ఈ రోజున ఎప్పటి నుంచో ఉన్న సమాచార మాధ్యమాల కంటే ఎన్నో రెట్లు అధికంగానూ ఎంతో వేగంగానూ దుసుకుపోతున్నది. సోషల్ మీడియా అంటే ఏమిటీసరళంగా చెప్పుకోవాలంటే మనలో చాలా మంది ఉపయోగిస్తున్న వాట్సప్యుట్యూబ్వెబ్ సైట్స్ఫేస్ బుక్ఇంటర్నెట్ రేడియోఅంతర్జాల ఆధారిత ఛానెల్స్ వంటివి. ఐదారేళ్ల క్రిందటి వరకు వీటిలో కొన్నింటి పేర్లు మనం వినలేదు. ఉదాహరణకు వాట్సప్ పేరు మనలో చాలా మందికి ఏడెనిమిదేళ్ల క్రిందటి తెలిసిండక పోవచ్చు. మొదట్లే వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపని వారు కూడా ఈ రోజున వాట్సప్ ఫేస్ బుక్ వంటివి నిత్యం చూసే స్థితికి చేరారు. వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇంట్లో మన పిల్లలే మనకు శిక్షకులు. వారు `ఇలా చూడాలిఅలా చేయా'లని నా బోటి వారికి గైడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా చూడటం పట్ల ఆసక్తి పెరిగ్గానే అది అక్కడితో ఆగదు. మనలోని ఆలోచనలను అందులో నిక్షిప్తం చేయాలన్న తపన మొదలవుతుంది. ఈ తపనే 60 దాటిన పెద్దల్లో కూడావారి వయసు వెనక్కి లాగుతున్నా మనసు ముందుకు పరిగెట్టేలా చేస్తోంది. ఆ వయసులో సాంకేతిక అంశాల పట్ల అంతగా ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ చిన్న చిన్న సాంకేతిక విషయజ్ఞానం అందిపుచ్చుకోవడానికి ఈ తరహా తపనే కారణమవుతున్నది. ఈ తపనతోనే వయో వృద్ధులు సైతం సోషల్ మీడియాని తమకు అనుకూలంగా ఎలా వాడుకోవచ్చునో తెలుసుకుంటున్నారు. ఇందులో పండితుల నుంచి పామరుల వరకు ఉన్నారు. ఇక్కడ మరో విషయం గమనించాలి. ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి తొంగిచూడటం వరకు వెళ్ళాక. మనం కూడా తెలుగులో మన భావనజాలాన్ని నలుగురికీ పంచాలన్న తపన కలుగుతుంది. సరిగా అప్పుడు ప్రధానంగా అడ్డు వచ్చే సమస్య తెలుగులో టైప్ చేయడం ఎలా అన్నది. 1990వ దశకంలో కంప్యూటర్ల సాయంతో తెలుగు భాషలో సైతం అక్షరాల రూపకల్పన జరిగింది. నా మటుకు నేను ఆంధ్రప్రభ దినపత్రికలో పనిచేసే రోజుల్లో 90 దశకం చివరి రోజుల్లో తెలుగులో కంప్యూటర్ కీప్యాడ్ పైనే వాక్యాల నుంచి వ్యాసాలు టైప్ చేయడం మొదలెట్టాను. అంతకు ముందు వరకు తెలుగు టైప్ రైటర్లు అందుబాటులో ఉండేవి. కంప్యూటర్ శకంలో వాటి అవసరం తగ్గిపోయింది. తెలుగు అక్షరాలను కంప్యూటర్ కీ ప్యాడ్ మీద టైప్ చేయడం కోసం అనేక ఫాంట్లుపద్ధతులు రూపుదాల్చాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫాంట్లు తయారు చేయడంలో పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. వాడకం దారులు సునాయంసంగా తెలుగులో టైప్ చేయగలగడం మొదలైంది. ఇంటర్నెట్. దీన్నే మనం అంతర్జాలం అంటున్నాము. కంప్యూటర్ దగ్గర కూర్చుని తెలుగులో రాసిన వ్యాసాన్నో లేదా ఇతర అంశాలనో నలుగురికి పంచిపెట్టడంలో ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. మన భావజాలాన్ని మన మాతృభాషలోనే ఇతరులకు పంచిపెట్టడం ఈ యుగంలో ఎంతో సులువైంది. ఒక్క బటన్ నొక్కితే చాలు క్షణాల్లో మనం అందించే సమాచారం యావత్తూ ప్రపంచమంతటికీ చేరిపోతున్నది. ఈ సౌకర్యం రావడం తెలుగు భాషాభిమానులమైన మనందరికీ ఒక వరం. ఒక అదృష్టం. మొబైల్ ఫోన్. దీన్ని చరవాణి అని మనం పిలుచుకుంటున్నాము. ఇది కూడా అక్షరబద్ధమైన మన ఆలోచనలను అత్యంత వేగంగా చేరవేయడంలో సహకరిస్తున్నాయి. వాట్సప్ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల యాప్ ల సాయంతో ఇంటర్నెట్ అనుసంధానంగా స్మార్ట్ ఫోన్లు ఇందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తెలుగు భాషా వికాసం గురించిదాని వ్యాప్తి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కచ్చితంగా ఈ మొత్తం సాకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి దోహదపడిన మహనీయులందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. సరే చక్కటి అవకాశాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు భాషాభిమానులమైన మనం ఏం చేయాలి ఈ విషయం కూడా ఆలోచించాలి. సోషల్ మీడియాలోకి ప్రవేశించగానే మనకు అనేక వయసులవారికి తగ్గట్టుగా అనేకానేక అంశాలు కనబడుతుంటాయి. లేదా వినబడుతుంటాయి. మనం ఏం చేయాలంటేవయసులవారీగా వారిని ఆకట్టుకునేటట్లు తెలుగు భాషలో అంశాలను చేరవేయాలి. ఉదాహరణకు ఐదేళ్ల లోపు పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయిలో కోకోమిలన్ వంటి సంస్థలుఊహకూడా తెలియని పిల్లలకు ఇంగ్లీష్ లేదా ఇతర భాషల పట్ల పరోక్షంగా అవగాహన కల్పిస్తున్నాయి. తెలుగులో ఇలాంటి సంస్థలను వేళ్లతో లెక్కించవచ్చు. వీటి సంఖ్య పెరాగాలంటే వాటిని మనమంతా ప్రోత్సహించాలి. ఇంటి గుట్టు చెప్పకూడదుకానీమన పిల్లలకు ఇంగ్లీష్ రైమ్స్ చిట్టి బుర్రల్లోకి ఎక్కించడంలో ఉన్న శ్రద్ధ తెలుగు పాటల ద్వారా బుజ్జాయిల్లో ఊహాశక్తి పెంచడానికి ఏ మాత్రం శ్రద్ధ పెడుతున్నాంచెప్పండి. తెలుగు అక్షరాలు నేర్పడంపదాలు సరిగా పలికేలా చూడటం తల్లిదండ్రులుఇంటి పెద్దల పాత్ర. కానీ వారు ఏమేరకు ఈ పాత్రను సరిగా పోషిస్తున్నారో ఆలోచించాల్సిన పరిస్థితి ఈనాడు ఉంది. పాఠశాలకు వెళ్ళే పిల్లల కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ మరింత సమాచారం అందించాలి. ఇంగ్లీష్ చదువు ఎలాగో పాఠశాలల్లో నేర్పుతుంటారు. అందుకే ఇంట్లో తెలుగు భాష యొక్క సౌందర్యంతెలుగు మాట్లాడటంలోని ఆనందం తెలుగు రుచిలోని కమ్మదనం ఏమిటో పిల్లలకు చెప్పాలి. ఇందుకు అవసరమైన సమాచారం అందరికీ పంచడానికి సోషల్ మీడియా దోహదపడుతుంది. అలాగే మిగతా వయస్సుల వారికీ తెలుగు భాష వైభవం అర్థమయ్యేలా మనమంతా కృషి చేయాలి. ఈ దిశగా మరింత శ్రద్ధ పెట్టాలి. మనలో చాలా మంది ఈపాటికే చూసే ఉంటారు. హిందీ నేర్చుకోవడం ఎలా ఇంగ్లీష్ సులువుగా నేర్చుకోవడం ఎలా వంటి అంశాలతో అనేక వీడియోలు చూడగలుగుతున్నాము. అలాగే తెలుగులో తప్పులు లేకుండా మాట్లాడటం ఎలాఎక్కడ మనం తరచు తప్పులు చేస్తుంటామువంటి విషయాలపై పరిశోధన చేస్తున్న వారు వీడియోలను సోషల్ మీడియా ద్వారా లక్షలాదిమందికి చేర్చే పని వేగవంతం కావాలి. వీడియోల మాటేమో కానీ ఫేస్ బుక్ వంటి వాటి ద్వారా ఇప్పటికే కొంత మంది తప్పులు లేకుండా తెలుగు మాట్లాడటంవ్రాయడం ఎలా అన్న అంశాలపై వివరణలు ఇస్తూ పోస్ట్ లు పెడుతుడటాన్ని నేను గమనించాను. వారికి ఈ సందర్భంగా అభినందనలు. తెలుగు భాషలోని అందాలను చాటిచెప్పే మరో అంశం పాటల సాహిత్యం. ముఖ్యంగా తెలుగు సినిమా పాటల్లో భాషా మధురిమలు అన్న అంశంపై కూడా అనేక మంది పరిశోధనలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా నా సంపాదకత్వంలో నడుస్తున్న ఛానెల్ 5ఏఎంలో ఘంటసాల శత జయంతి సందర్భంగా వంద రోజుల పాటు వంద కార్యక్రమాలను దేశ విదేశాల్లోని గాయకులతో అందించడం జరిగింది. అలాగే అన్నమాచార్య జయంతి సందర్భంగా వారోత్సవంమహా శివరాత్రి నాడు రోజంతా గంటగంటకీ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల సోషల్ మీడియా తెలుగు అభిమానులకు మరింత చేరువ అవుతుందన్నది నా నమ్మిక. అలాగేతెలుగు నిఘంటువులు ఇంటర్నెట్ ఆధారిత వెబ్ సైట్స్ లో లభిస్తున్నాయి. అటు ఇటుగాతెలుగు భాషకు సంబంధించిన అన్ని విషయాలుఅంశాలు అంతర్జాల ఆధారితంగా నేడు లభ్యమవడం ముదావహం. తెలుగులో ఆదికవి నన్నయ్య నుంచి నేటి కవుల వరకు వ్రాసిన అనేకానేక పద్యాలుకవితలుకథలునాటికలునాటకాలుఇంకా అనేక తెలుగు కళారూపాలకు సోషల్ మీడియా చక్కటి వేదికగా నిలిచే రోజు చాలా దగ్గర్లోనే ఉంది. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే కొంత మంది తెలుగు భాషా వైభవాన్నిపద్యం రూపంలోనో వచన రూపంలోనో ఇంకా ఇతరంగానో పంచిపెడుతున్నారు. వీరంతా ఏమీ ఆశించి చేయడంలేదు. కేవలం వారి మనో ఆనందం కోసమో లేదా భాష పట్ల ఉన్న అభిమానంతోనూ చేస్తున్నారు.అలాంటి వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనకు తలెత్తే ప్రశ్నలకు సమాధానం కోసమో లేదా ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాల కోసమో లేదా వినోదం కోసమో ఇలా ఏదో అవసరం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాము. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన గురువుఇది మనకు అనుభవ సారంగా తగు సలహాలు చెప్పే ఓ అత్తఓ అమ్మఓ గైడ్ఓ సలహాదారుడుఓ ఫ్రెండ్. సోషల్ మీడియాని సరిగా ఉపయోగించుకుంటే ఇప్పుడు చెప్పిన వీళ్లంతా కనిపిస్తారు. పలకరిస్తారు. మనకో మార్గం చూపడానికి మేమున్నామని వెన్నుతడతుంటారు. పుంఖాను పుంఖాలుగా వస్తున్న సమాచారానికి ప్రామాణికత ఏమిటన్న ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు జాగ్రత్తగా ఆలోచించాల్సిందే. దీనికి ఓ నిర్ణీత వ్యవస్థ సమీప కాలంలో రావచ్చేమో. వేచి చూద్దాం. ఇదంతా వింటుంటే మనకేం అనిపిస్తోందిసోషల్ మీడియాను త్రోసిపుచ్చి తెలుగు భాషా వికాసం గురించి మాట్లాడుకోవడం ఇక కుదరదనేగా. నిజమేతెలుగు భాషాసంస్కృతిని ఈ తరం వారికి చేరవేయడంలో ఇప్పటికే సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే ఇది చాలదు. చేయవలసింది ఇంకా ఉన్నది. సాంకేతిక యుగంలో ఉన్న మనకు మరో అద్భుతం ఆవిష్కృతమైనది. అదే AI గా పిలుచుకునే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్. కృత్రిమ మేథా సాధనాలను ఉపయోగించుకుంటూ తెలుగు భాషా వికాసానికి దోహదపడటంలో మన వంతు కృషి చేయవచ్చు. ప్రస్తుతానికి AI వినియోగం కొత్త అనిపించవచ్చేమో కానీఅతి త్వరలోనే తెలుగు భాషా వికాసానికి ఇది కూడా ఉపయోగపడుతుందన్న నమ్మకం నాకుంది. సాంకేతిక రంగం ఎప్పటికప్పుడు అనేక కొత్త ఆవిష్కరణలను మానవాళికి అందిస్తూనే ఉంటుంది. కృత్రిమ మేథ తర్వాత ఇంకా ఏమి రాబోతున్నాయో ఇప్పుడు మన ఊహకు కూడా అందని విషయం. అయితేఎన్నైనా రానియనివ్వండి తెలుగు భాష వికాసానికి వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చన్న స్పృహ మనలో ఉంటే చాలు. ఆయుధం చేతబూనిన ప్రతి వ్యక్తి సమాజానికి నష్టం కలిగిస్తాడనుకోకుడదు. అదే ఆయుధం ధరించి మానవాళికి మంచి జరిగే పనులూ చేయవచ్చు. సోషల్ మీడియా కూడా ఓ ఆయుధం లాంటిదే. దీని వల్ల చెరుపు ఎక్కువగా జరిగిపోతుందని కలవరపడటం కంటేఅదే ఆయుధాన్ని చేతబూని తెలుగు భాషా వికాసానికి ఉపయోగించే ప్రక్రియను విస్తృత పరచాలి. వేగవంతం చేయాలి. సాంకేతిక పరికరాలను సృష్టించడమన్నది సాంకేతిక విద్యనార్జించిన వారి పని. మనకు ఈ అంశంతో సంబంధం లేదు. ఆవిష్కృతమైన సాంకేతిక పరికరాలను మనకు వీలుగా ఎలా ఉపయోగించుకోవాలన్నది తెలిస్తే చాలు. ఏ సాంకేతిక పరికరమైనా దాని తయారీదారుడు వాటిని వినియోగదారుడిని దృష్టిలో ఉంచుకునే తయారుచేస్తాడు. అంటే యూజర్స్ ఫ్రెండ్లీగానే ఏ టెక్నికల్ టూల్ అయినా ఉంటుంది. మనలో కొంత మంది - `ఇదంతా కొత్త పద్ధతి. మాకు అలవాటు లేని వ్యవహారం. మేము వాటికి దూరంఅనుకోవచ్చు. కానీ ఒక సారి వాడటం మొదలుపెడితే `అరేఇంత సులువాఅనుకోవడం ఖాయం. అందుకు కావల్సిందల్లా సరైన సంకల్పం చెప్పుకోవడమే. 80ఏళ్లు పైబడిన వారు కూడా ఈ రోజున సోషల్ మీడియా ద్వారా వారికి నచ్చిన అంశాలను చదవ గలుగుతున్నారు. చూడగలుగుతున్నారు. అలాగే అక్షరాలు నేర్వని పసిపాప కూడా సోషల్ మీడియా తెరిచి తనకు కావలసిన వీడియో చూడాలనుకుంటున్నది. తెలుగు భాషా వికాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి అందుకు కీలక పాత్ర పోషించే సోషల్ మీడియాను విస్మరించ వద్దని సవినయంగా ప్రార్థిస్తున్నాను. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే విశిష్ట సేవలందిస్తున్న వారిని ప్రభుత్వం కూడా గుర్తించాలి. అసలు మీడియాసోషల్ మీడియా అంటూ విడివిడిగా చూడకుండా సమభావంతో చూడాలి. ప్రభుత్వేతర సంస్థలు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. సమాజంలోని చెడుకి ఉపయోగపడుతున్న ఈ సాంకేతిక పరికరాలతోనే సమాజంలో మంచిని పెంచడానికీ పంచడానికీ మనం నడుం బిగించాలి.

మొత్తానికి తెలుగు వెలుగు నా జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవనసాఫల్య పురస్కారం అందుకునేలా చేసింది. అందుకే తెలుగు తల్లికి నమస్కరిస్తూ ఈ భాగ రచన ఆమెకు అంకితం చేస్తున్నాను. 

(మళ్ళీ కలుద్దాం)