23, సెప్టెంబర్ 2024, సోమవారం

26వ భాగం : “ఠీవీ”గా..

 


ఆదివారం ఉదయం 9 గంటలు కావస్తోంది.  గేటు చప్పుడు అవడంతో అటుగా చూశాను. వాడే , మా ఫ్రెండ్ గాడే. సైకిల్ లోపలపెట్టి దాదాపు పరుగులాంటి నడకతో లోపలకు వచ్చి  నేల మీద చతికిలపడ్డాడు. అప్పటికే హాల్ లో పిన్నా పెద్దా కలిసి ఓ పదిమంది కూర్చుని ఉన్నారు. అందరూ సర్దుకునే సరికి గడియారం 9-30 సూచిస్తోంది.  ఇంట్లో ఓ వారగా టివీ సెట్టు  ఠీవీగా నిలబడి ఉంది. అందరూ వచ్చారా అన్నట్లుంది దాని చూపు.  అంతలో టివీ తెరపైన మరికొద్ది క్షణాల్లో  రామాయణ్ అన్న వాక్యాలు కనబడ్డాయి. 



మా ఫ్రెండ్ గాడు తన ముఖానికి పట్టిన చమట తుడుచుకుంటూ కాస్తంత ఫ్యాన్ దగ్గరకు జరిగాడు. వాడి పేరు పార్థసారధి. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో వీడి పేరు ప్రస్తావించాను. నాకున్న ఆత్మీయ స్నేహితుల్లో ఇతగాడు కూడా ఒకడే. వీడిది నందిగామ దగ్గర్లోని అనాసాగరం. వాడూ నేను ఒకే స్కూల్లో, ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాము. వాడి నాన్నది బట్టల వ్యాపారం. ఆదివారం షాపుకి సెలవు. అందరూ ఇంట్లోనే ఉంటారు. కానీ వీడు మాత్రం ఆదివారమైనా ఏదో పనిపెట్టుకుని నందిగామ వచ్చి, మా ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసేవాడు. ఇప్పుడు మాత్రం కేవలం టివీలో రామాయణం చూడటం కోసమే నందిగామ వచ్చాడు. టైమ్ కి చేరుకోవాలన్న తొందరలో సైకిల్ స్పీడ్ గా తొక్కడంతో పాపం వాడు అలసిపోయాడు. 

ఆ రోజుల్లో (80వ దశకం) చాలా మంది ఇళ్లలో టివీ సెట్లు లేవు. ఒక వేళ ఉన్నా, కలర్ టీవీలైతే దాదాపు లేనట్లే. కలర్ టీవీ కదా అని ఆ సెట్లో ప్రత్యక కార్యక్రమాలంటూ ఏవీ ఉండవు. `బ్లాక్ అండ్ వైట్ అయినా, కలర్ టివీ అయినా ప్రసారాలు ఒక్కటేరా అని మరో ఫ్రెండ్ మా ఇంట్లోకి టీవీ రావడానికి చాలా రోజుల ముందే,నాకు కొంతలో కొంత జ్ఞానోదయం చేశాడు. అప్పటికే తెలుగు సినిమాల్లో కూడా కలర్ మూవీస్ సంఖ్య క్రమంగా పెరగసాగింది. కలర్ ఫిల్మ్ ఖర్చు నిర్మాతలు భరించే స్థాయికి తగ్గింది. ఈస్ట్ మన్ కలర్ ఫిల్మ్  (ఈస్ట్ మన్ కొడాక్ కంపెనీవారి ఫిల్మ్)తో తీస్తే ఆ సినిమా సప్తవర్ణాలతో తళతళా మెరిసిపోతుండేది. అలాగే గేవా ఫిల్మ్ తో కూడా కలర్ లో సినిమాలు తీసేవారు. మొత్తానికి కలర్ సినిమాలు, వాటికి వాడే ఫిల్మ్ నాణ్యత గురించి స్నేహితుల్లో కొందరు అప్పుడప్పుడు క్లాస్ లు పీకుతుండటంతో నాకూ బోలెడు నాలెడ్జ్ వచ్చినట్లు ఫీలయ్యేవాడ్ని. తెలుగులో లవకుశ (1963) పూర్తి నిడివి ఉన్న కలర్ సినిమా. దీన్ని గేవా కలర్ తోనే తీశారని నా కాలేజీ  ఫ్రెండ్ ఓసారి చాలా వివరంగా చెప్పాడు. సినిమా చూడటం నాబోటి వాడు చేసేపని అయితే, వాడేమో సాంకేతిక పరిజ్ఞానం కూడా సంపాదించుకుని అవన్నీ తెగ ఫోజులిస్తూ  మాకు చెబుతుండేవాడు. లవకుశ తీసిన మరుసటి ఏడాదే అంటే 1964లోనే ఈస్ట్ మన్ కలర్ ఫిల్మ్ తో అమరశిల్పి జక్కన్న సినిమాని పూర్తి నిడివితో కలర్ లోనే తీశారనీ, అయితే అంతకు ముందే, 1963లో బందిపోటు అనే సినిమాలో ఈస్ట్ మన్ కలర్ ఫిల్మ్ ని బందిపోటు సినిమాలో  ఓ పాటలో వాడారని ...ఇలా ఏవేవో చెప్పేవాడు.  అప్పట్లో వాడేదో మేధావి అని మాకనిపించినా, `హాయిగా సినిమా చూసి ఎంజాయ్ చేయకుండా ఎందుకీ తపన అని ఆ తర్వాత వాడి మీద జోకులు వేసుకునే వాళ్లం. 

సరే, ఇప్పుడేమో టివీల్లో కూడా రెండు రకాలు ఉన్నాయని తెలిసింది. కాకపోతే మా ఊర్లో కలర్ టివీ సెట్ కొనుక్కున్న వాడు ఆ రోజుల్లో చాలా తక్కువ. ఏ టీవీ అయినా దూరదర్శన్ వాళ్లు అందించే ప్రసార కార్యక్రమాలే దిక్కు. అప్పటికే రేడియో స్టేషన్లు పాటించే ప్రసార వేళలనే దూరదర్శన్ వాళ్లూ పాటించేవారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రసారాలు అంచెలంచెలుగా ఉండేవి. దూరదర్శన్ లో చిత్రలహరి అనే కార్యక్రమం చాలా పాపులర్ అయింది. తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఇది. అప్పటి వరకు ఆకాశవాణి (రేడియో) ప్రసారం చేసే పాటలు వింటూ ఆనందించే శ్రోతలు ఉన్నట్లుండి ప్రేక్షకులుగా మారిపోయి, అవే పాటలను ఇంట్లో కూర్చుని వీక్షించడం ఓ మధురమైన అనుభూతి. చిత్రలహరి వస్తున్న సమయంలో కరెంట్ పోతే ఉన్నట్లుండి అందరిలో నిరాశ నిస్పృహలు ఆవరించేవి. కరెంట్ వాడిమీద  బోలెడు కోపం కూడా వచ్చేది. ఈ సందర్భాన్నే ఓ సినిమా కవి తన పాటలో..

`చిత్రలహరిలో కరెంట్ పోతే టెకిటీజీ పాలసీ...అంటూ వ్రాశాడు. కానీ అంత ఈజీగా తీసుకోలేకపోయేవాళ్లం. మంచి పాట , అచ్చు సినిమా హాల్లో కూర్చుని చూస్తున్నట్లు ఫీలవుతుంటే వీడు  కరెంట్ గాడు పుటుక్కున వైరు తెంపినట్లు, ఫీజు పీకినట్లు చేస్తే మరి కోపం రాదా ఏంటీ..?

తీరా కరెంట్ వచ్చే సరికి  చిత్రలహరి అయిపోయేది. ఏదో చెత్త కార్యక్రమం  వస్తుండేది. పాపం  దూరదర్శన్ వాళ్లు మాత్రం చాలా మంచి కార్యక్రమం అనే ప్రసారం చేసినా మాకేమో చెత్త..పరమ చెత్త కార్యక్రమం అన్న భావనే కలిగేది. 

అసలు ఈ కరెంట్ వాళ్లకు ఎంటర్టైన్ మెంట్ వాల్యూ తెలియదు. రేడియోలో నాటికలు, నాటకాలు లేదా సంక్షిప్త శబ్ద చిత్రాలు వచ్చేటప్పుడు కూడా ఇలాగే పుటుక్కున కరెంట్ ఆపేసేవాడు. నా దృష్టిలో ఈ కరెంట్ వాడు ఓ శాడిస్ట్. పైగా ఒకసారి కరెంట్ పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. రాత్రి పూటైతే మనం నిద్రలోకి జారుకున్నాక కరెంట్ వచ్చేది.  టివీ సెట్ స్విచ్ ఆఫ్ చేయడంమరచిపోతే  `గుర్ర్..ఘుర్రూ..గుర్..’ వంటి శబ్దాలు చేసేది. ఆ విచిత్ర సౌండ్స్ కి మొదట్లో భయమేసేది. ఏ జంతువో వచ్చిందని అనుకునేవాళ్లం. తీరా చూస్తే, కరెంట్ రావడంతో సెట్ ఆనవుతుంది. కానీ అప్పటికే దూరదర్శన్ వాడు మౌనముద్రలోకి వెళ్లడంతో ఇదిగో ఈ విచిత్ర సౌండ్స్ వచ్చి మమ్మల్ని కలవరపరిచేవి. 

 రేడియో పరిస్థితి అంతే. కాకపోతే రేడియో సెట్లలో కొన్నేమో బ్యాటరీతో నడిచేవి. కరెంట్ రేడియో ఉన్న ఇళ్లలో ఏ నాటకమో, లేదా మరో మంచి కార్యక్రమమో వింటుంటే, సరిగా ఆ సమయంలో కరెంట్ పోయేది. ఈ గోల భరించలేక చాలా మంది కరెంట్ రేడియో ఉన్నప్పటికీ బ్యాటరీ రేడియో సెట్ ఒకటి కొనిపెట్టుకునేవారు.  ఇలాంటి ఇబ్బందలను సున్నితంగా చెబుతూ నండూరి వారి నాటికఅనుకుంటా -  ` నాటకం విన్నారుప్రసారమైంది. ఓ ఇంట్లో  పిన్నా పెద్దా   నాటకం వినడానికి రేడియో సెట్ దగ్గర కూర్చున్నారు. వాల్యూమ్ పెంచి శ్రద్ధగా వినడానికి సిద్ధమయ్యారు. రేడియోలో ఎనౌన్సర్ 

`ఇప్పుడు నాటకం వింటారు..’ అని ఎనౌన్స్ చేయగానే అంతా చెవులు రిక్కించారు. కానీ..అంతలో కరెంట్ పోయింది. ఇంట్లో అందరూ నిరుత్సాహపడ్డారు. కాసేపు అయ్యాక కరెంట్ వచ్చింది. రేడియో తిరిగి ఆన్ అయింది. అప్పుడు ఆ రేడియో సెట్ నుంచి వచ్చిన మాటలు  - `నాటకం విన్నారు  అని. ఇది ఎనౌన్సర్ ఇచ్చిన క్లోజింగ్ ఎనౌన్స్ మెంట్.

ఇలాంటి ప్రయోగాత్మక నాటికలు ఆ రోజుల్లో ఆకాశవాణి నుంచి వచ్చేవి. నేనూ ఇలాగేరేడియోకి నాటికలు వ్రాయాలని అనుకున్నాను.కానీ కోరిక తీరుతుందా..? 

భగవంతుడు ఏమనుకున్నాడో ఏమో.. ఆ కోరిక విజయవాడలో నేను పనిచేస్తున్నప్పుడు తీరింది. 

ఆ రోజుల్లో రేడియో కళాకారులకు భలేగా క్రేజ్ ఉండేది. వివిధభారతి కార్యక్రమాలు పాపులర్ అయ్యాక ఆ ఎనౌన్సర్లను చూడాలని తెగ అనుకునేవాళ్లం. వారి శ్రావ్యమైన గొంతుని బట్టి వారి ఆకారాన్ని ఊహించుకునే వాళ్లం. మా ఊహల్లో వారంతా హీరోలు..హీరోయిన్లే. ఇలాంటి వారిని చూడాలని నేనూ కలలు కన్నాను. నా కలల కోరిక తీరింది.  రేడియో రామం గార్నీ, డిఎస్సార్ ఆంజనేయులు, ఉషశ్రీ వంటి వారిని చూడటం తస్థించింది. రామం గారితో ఛానెల్5ఏఎంలో ప్రత్యేక కార్యక్రమం కూడా ఇచ్చాను. ప్రయాగ రామకృష్ణ గారిని తరంగా స్టూడియోకి ఆహ్వానించి వారితో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాను. న్యూస్ రీడర్స్ కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ వంటి ప్రముఖలను చూడటమే కాకుండా, వారి ప్రక్కన కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఎంవీఎస్ ప్రసాద్ వంటి అధికారులతో కలసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆంధ్రప్రభ- విజయవాడలో పనిచేస్తున్నప్పుడు ఉషశ్రీ గారు తన స్క్రిప్ట్ ని పట్టుకుని కార్యాలయానికి వస్తుండేవారు. అలా ఆయన పత్రికాఫీస్ లోకి ఎంటరవుతూనే, ఏదో ఒక సబ్ ఎడిటర్ని పిలిచి 

`ఒరేయ్ ఇటు రా.. 

ఆ సబ్ ఎడిటర్ పెద్దాయన దగ్గరకు వచ్చే వాడు. 

` సుబ్రహ్మణ్యం లేడా అని అడిగేవారు. 

సుబ్రహ్మణ్యం అనే ఆయన ఎడిటర్ గారికి పీఏ.

ఏదో పనిలో ఉన్న మనం ఆ కంచుకంఠం వినగానే తెలియని ఆనందం కలిగేది. ఎందుకంటే ఈ కంఠమే రేడియోలో రామాయణం, మహాభారతం ప్రతి ఆదివారం వినిపించేది.  వారిని చూడటం ఓ అదృష్టంగా భావించాను. ఊషశ్రీ  గారి రామాయణం, మహాభారతం అంటే నాకు చాలా ఇష్టం. రేడియో లో ఆదివారం మధ్యాహ్నం ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా వినేవాడ్ని. దీంతో ఆయన వాయిస్ ఇమిటేట్ చేయాలని అనిపించేది. కొంత వరకు సాధన చేశాను కూడా. ఒకటి రెండు సార్లు ఉషశ్రీ కంఠాన్ని కాలేజీ కార్యక్రమాల్లో అనుకరణ చేసి మెప్పుపొందాను కూడా. ఉషశ్రీ గారి కుమార్తెలతో నేను, తరంగాలో ప్రొగ్రామ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు  ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాను. పురాణపండ వైజయంతి గారితో నా పరిచయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆమెతో ఛానెల్ 5ఏఎంలో కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేశాను. ఉషశ్రీ గారి పేరు తలచుకున్నప్పుడల్లా ఇప్పటికీ నా నరాల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంటుంది. విశ్వనాధుల వారిలాగానే వీరు కూడా నా మనోఫలకంపై చెరగని ముద్ర వేశారు. 

టివీ వచ్చాక మనిషి కనబడుతుండటంతో వాళ్లు వేసుకున్న డ్రెస్, మేకప్ , హావభావాలు వంటి వాటి గురించి తెగ చెప్పుకునే వాళ్లం. ఆడవాళ్లైతే ఏ ఎనౌన్సర్ ఏ బోర్డర్ చీర కట్టుకుంది. ఆమె ఎలాంటి బొట్టు పెట్టుకుంది వంటి అంశాలు కాలక్షేపం కబుర్లుగా చెప్పుకునే వాళ్లు. కలర్ టీవీలు ప్రాచుర్యంలోకి వచ్చాక రంగుల ప్రసక్తి కూడా మాటల్లో దొర్లడం మొదలైంది.  

దూరదర్శన్ వాళ్లు ప్రజాహిత కార్యక్రమాలు అనేకం ప్రసారం చేసేవారు. అయితే ప్రేక్షకుల్లో చాలా మందేమో వినోద కార్యక్రమాలు, సినిమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఈ అంతరం కారణంగా డిడీని ఎక్కువ మంది విమర్శిస్తుండే వారు. అలాంటి విమర్శల్లో ఒకటి  డిడీ ఎప్పుడూ పందుల పెంపకం, గొఱ్ఱెల పెంపకం, పొలం పనులు నుంచి పిడకలు చేయడం ఎలా ? వరకు చూపిస్తున్నదన్నది. ఇలాంటి కార్యక్రమాలు రేడియోలో వచ్చినా కేవలం అది శబ్దానికే పరిమితం అవడంతో ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కానీ దృశ్యం కూడా కలవడంతో డిడీలో ఇలాంటి కార్యక్రమాలు ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉండేది. అయితే కొన్ని కార్యక్రమాలు మాత్రం చాలా పాపులరయ్యాయి. పైన చెప్పినట్లు చిత్రలహరి లాగానే తెలుగు సినిమాల ప్రసారం, ఆదివారం వచ్చే రామాయణం, మహాభారతం వంటివి అందర్నీ టీవీ సెట్ల ముందు కూర్చోబెట్టేవి. అలాగే, తెలుగులో వార్తలు  ఆ రోజుల్లో అందరూ ఆసక్తిగా గమనించేవారు. శాంతిస్వరూప్ , విజయదుర్గ, రోజారాణి వంటి వాళ్లు వార్తలు చాలా చక్కగా అక్షర దోషాలు లేకుండా చదివేవారు. ఆ రోజుల్లో డిడీ వాళ్లు కొన్ని సీరియల్స్ కూడా ప్రసారం చేసేవారు. నాకు గుర్తున్నంత వరకు ఋతురాగాలు బాగా సక్సెస్ అయిన సీరియల్. ఆ రోజుల్లో చానెల్స్ మార్చే అవకాశమే లేదు. దీంతో రిమోట్ అవసరమే ఉండేది కాదు. నిర్ణీత వేళల్లో టివీ సెట్ ఆన్ చేస్తే చాలు కార్యక్రమాలు వస్తుండేవి. టివీలో బొమ్మ సరిగా కనపడాలంటే ఇంటి కప్పుమీద యాంటినా బిగించేవారు. అది గాలికి అటూ ఇటూ కదిలినా ఇంట్లో టీవీ సెట్లలో బొమ్మ మాయమై ఆ స్థానంలో చిత్రవిచిత్రంగా గీతలు, చుక్కలు దర్శనమిచ్చేవి. ఎవరో ఒకరు వెళ్ళి యాంటినా సరిచేయాల్సి  వచ్చేది. యాంటినా మేడమీద ఉంటే మెట్లు ఎక్కి వెళ్ళాలి. పెంకుటిల్లు అయితే పైకెక్కడం చాలా కష్టంగా ఉండేది. తుపాన్లు, ఈదురు గాలులు వీచేటప్పుడు చెట్టు కొమ్మలు విరిగిపడి యాంటీనా పాడైపోయేది. దీంతో ఇంట్లో టీవీ సెట్ మూగనోము పట్టేది. ఇలాంటి ఎన్నో సాంకేతిక ఇబ్బందులు, ప్రసార పరమైన ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ఇంట్లో కదిలే బొమ్మ చూడటం మాత్రం ఎంతో ఆనందాన్నీ, మరెంతో ఉత్సాహాన్ని కలిగించేది. ఇంట్లో టివీ ఉంటే ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్లు.   

ఏదైనా కాలపరిమితికి లోబడి ప్రసారాలు ఉండటంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు టివీని వీక్షించే అవకాశం ఆ రోజుల్లో ఉండేది కాదు. 90వ దశకంలో శాటిలైట్ ఛానెల్స్ రావడంతో ఈ సమస్య తొలిగిపోయింది. ఈటీవీ రాకతో టివీ ప్రేక్షకుల్లో నూతనోత్సాహం వచ్చినట్లయింది. దీనికి తోడు కేబుల్ టివీ సౌకర్యం రావడంతో మరికొన్ని వినోద కార్యక్రమాలు చూడటానికి వీలుచిక్కేది. కొన్ని చోట్ల కేబుల్ ఆపరేటర్ తన స్టూడియో నుంచి వార్తలు కూడా ప్రసారం చేసేవాడు. ఇలా టివీ బొమ్మ చూడటంలో స్వేచ్ఛ అందుకోవడం మొదలైంది. టీవీ చుట్టూ ఎన్నో కబుర్లు , కథలు ఆ రోజుల్లో వినేవాడ్ని. 

    1982లో  మన దేశం ఆసియన్ గేమ్స్ కి ఆతిథ్యమిస్తున్నప్పుడు కలర్ లో దూరదర్శన్ ప్రసారాలు మొదలయ్యాయి. అపట్లో ఇదో వింత. నెమ్మదిగా సాంకేతికంగా పుంజుకుని దూరదర్శన్ తెలుగు ప్రసారాలు కూడా కలర్ లో ప్రసారం కావడం మొదలైంది. అప్పటి వరకు బ్లాక్ వైట్ బుల్లితెరమీద చూసిన ముఖాలు ఉన్నట్లుండి కలర్ లో చూసేసరికి ప్రేక్షకుల్లో నూతనోత్సాహం వచ్చినట్లయింది. 1987-88లో నేను విజయవాడ ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు (రిలయన్స్ వరల్డ్ కప్ పోటీలు) జరిగాయి. అప్పటికే కాస్తో కూస్తో స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకోవడంతో ప్రభ వాళ్లు నన్ను స్పోర్ట్స్ పేజీ చూడమన్నారు. ఈ విషయం తెలిసి నవభారత్ పబ్లిషర్స్ ప్రకాశరావు గారు పిలిపించుకుని అప్పటికే సిద్ధమైన క్రికెట్ మీద పుస్తకంలో వన్ డే క్రికెట్ గురించి యాడ్ చేయమని కోరారు. మిత్రుడు వెంకటేశ్ ఈ పుస్తకంలో క్రికెట్ చరిత్ర వ్రాశాడు. అయితే వన్ డే క్రికెట్ ప్రస్తావన లేకపోవడంతో అది పూర్తి చేసే అవకాశం నాకిచ్చారు. నేను ఆ పని చేసినందుకు ఆ రోజుల్లో రెండువేల రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆ డబ్బుని వేస్ట్ చేయకుండా బ్లాక్ వైట్ టీవీ (ఒనిడా కంపెనీ) పోర్టబుల్ సెట్ కొన్నాను. అది మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లోనే కాదు, ప్రక్క ఇళ్ల వాళ్లలోనూ ఉత్సాహం వెల్లివిరిసింది. ఒనిడా టీవీ వాడి యాడ్ చాలా పాపులరైంది. అది ఇలా ఉండేది...

`Neighbour’s envy,

Owners pride’

 ఈ ప్రకటన టివీలో వచ్చేటప్పుడు ఓ డెవిల్ ప్రత్యక్షమయ్యేది. గుండుతో ఉండే భూతానికి రెండు కొమ్ములు కూడా ఉండేవి. కాస్తంత వింతగానూ, ఆసక్తి కలిగించేదిగానూ ఈ యాడ్ ని రూపకల్పన చేయడంతో 80వ దశకంలో ఒనిడా టీవీ పాపులర్ అయింది. 

బ్లాక్ అండ్ పోర్టబుల్ టివీ ఇంటికి రాగానే ఇంట్లో పిల్లలకు అందకుండా ఎత్తైన చోట పెట్టాలని అనుకున్నాము. దాని కోసం ప్రత్యేకంగా గోడకు చెక్క ప్లాట్ ఫామ్ బిగించడం కుదరలేదు. ఎందుకంటే ఇంటి ఓనర్ చాలా కఠినాత్ముడు. పైగా అతగాడి కళ్లు, చెవులు ఎప్పుడూ అద్దెకున్న వారిమీదనే కేంద్రీకృతమయ్యేవి. గోడకు మేకు కొట్టాలన్నా భయం. దీంతో అప్పటికే గోడకు బిగించి ఉన్న షో కేస్ లోనే మా బుజ్జి టీవీని దూర్చేసి ఊపిరిపీల్చుకున్నాము. అయినా మా పిల్లోడో, ప్రక్కింటి పిల్లలో ఎవరన్నా బంతి విసిరితే టివీ ఏమైపోను అని మా ఆవిడ అనగానే నాకూ అదే డౌట్ వచ్చింది. అందుకే టివీ చూడనప్పుడు ఆ షోకేస్ తలుపులు వేస్తే, టివీకి రక్షణ వచ్చేస్తుందని చెప్పాను. ఆ రోజుల్లో టివీ రాగానే దానికో అందమైన పెట్టే కూడా ఏర్పాటు చేసుకునేవారు. దానికి స్లైడ్ చేసే డోర్ ఉండేది. ఇంకొందమంది సినిమా హాలు తెరకు కర్టెన్ పెట్టినట్లుగా ఇంట్లో టీవీకి ఒక మంచి క్లాత్ తో తెర ఏర్పాటు చేసేవారు. ఇంట్లోకే సినిమా హాలు వచ్చినట్లు సంబరపడేవారు. కొంత మందైతే టివీ సెట్ రాగానే గుమ్మడి కాయతో దిష్టి తీసేవారు. బొమ్మ కనబడగానే అగరబత్తి వెలిగించి, హారతులు ఇచ్చేవారు. ఇదంతా అమాయకత్వం అని ఇప్పుడు అనిపించినా, ఆ రోజుల్లో టివీ పట్ల ఉన్న మోజుకి, ప్రేమకి ఈ చర్యలు నిదర్శనమనే చెప్పాలి. 

 కుటుబం ఎదుగుతున్నట్లుగానే టివీ సెట్ లోనూ సాంకేతిక పరమైన ఎదుగుదల చోటుచేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ స్థానంలో టిసీఎల్ కలర్ టీవీ వచ్చేసింది. దశబ్దాలు దొర్లుతున్న కొద్దీ ఇంట్లోకి స్మార్ట్ టివీలు వచ్చేసింది. ఇలా మన ఎదుగుదలకు సూచికగా టివీలో మార్పులు చోటుచేసుకున్నాయి.

  దూరదర్శన్ లో ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు రావు కనుక, కొంత మంది వీసీఆర్ (వీడియో రికార్డ్ ప్లెయర్) లేదా వీసీపీ (వీడియో క్యాసెట్ ప్లెయర్)లాంటివి ఏర్పాటు చేసుకునేవారు. ఈ సౌకర్యం రావడంతో వీడియో క్యాసెట్ల అమ్మకాలు ఊపెక్కాయి. అంతకు ముందు టేప్ రికార్డర్లలో టేప్ క్యాసెట్లు పెట్టి సినిమా డైలాగ్ లు, పాటలు వినడం అలవాటైంది. అదే ఇప్పుడు ఆడియో నుంచి వీడియోకి రూపాంతరం చెందిందన్న మాట. ఆ రోజుల్లో  నేనెప్పుడు విజయవాడ లెనిన్ సెంటర్ కి వెళ్లినా అక్కడ కుప్పలతెప్పలుగా ఈ ఆడియో క్యాసెట్లు, ఆ తర్వాత వీడియో క్యాసెట్లు అమ్మే వారు. 

అలాంటి రోజుల్లోనే నందిగామ గాంధీ సెంటర్లో ఓ మినీ థియేటర్ వెలిసింది. రెండు షాపుల మందం ఉన్న హాల్ ల్లో  ఒక వైపున టివీని పెట్టి దాని క్రింద వీడియో ప్లెయర్ ని ఉంచి అందులో రకరకాల సినిమాలు వేస్తుండేవారు. ఈ సెట్ కి ఎదురుగా సినిమా హాల్లో మాదిరిగా కుర్చీలు వేయించారుచీకటి చేయడం కోసం కిటికీలకు, తలుపులకు మందపాటి కర్టెన్లు కట్టించారు.  హాల్లో కాస్తంత ఫెర్ఫ్యూమ్ జల్లేవారు. దీంతో చూసేవారికి సినిమా హాల్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చేది. అలాంటి మినీథియేటర్ లో నేను గాంధీ సినిమాను తొలిసారిగా చూశాను. వ్యాపారం రుచిమరగడంతో మినీథియేటర్ యజమాని రాత్రివేళ బ్లూఫిల్మ్ లు వేయడం మొదలుపెట్టాడు. ఇది పోలీసుల చెవికి సోకింది. దీంతో రైడ్ చేసి మినీ థియేటర్ ని మూసేయించారు. ఈ మధ్య విజయవాడ బస్టాండ్ లో ఓ రెండు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎవరో చెప్పారు. ఏసీ రెస్ట్ రూమ్ ఉందనీ, అందులో హాయిగా కూర్చుని సినిమా చూస్తూ టైమ్ గడిపేయవచ్చని. చూద్దామని వెళ్ళాను. పెద్ద హాల్లో సోపాలు వేసి ఉన్నాయి. ఏసీ గాలి తగలగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఎదురుగా టివీ సెట్ లో సినిమా వేస్తున్నారు. అప్పుడు ఇందాక చెప్పిన నందిగామ మినీథియేటర్ సంగతి గుర్తుకువచ్చింది. 

 ఇంటింటా టీవీలు రావడంతో చాలా చోట్ల పాపం రేడియో సెట్లు అటకెక్కాయి. మా ఇంట్లో కూడా అదే జరిగింది. మహా ఉంటే ట్రాన్స్ సిస్టర్ రేడియోతో సరిపెట్టుకునే వాళ్లం. పెద్దపెద్ద రేడియో సెట్ కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించడం, కార్యక్రమాలు వచ్చినప్పుడు దాని దగ్గరే కూర్చోవడం వంటి చేష్టలు కనుమరుగైపోయాయి. అప్పటి వరకు రోజూ పొద్దున్నే ఐదు గంటల 55 నిమిషాలకల్లా లేచి రేడియో సెట్ దగ్గరకు వచ్చి సెట్ ఆన్ చేసే ఇంటి పెద్దోళ్లు ఆ తర్వాత టివీ సెట్లను ఆన్ చేయడం అలవాటు చేసుకున్నారు.  ఇప్పుడైతే బోలెడన్ని ఛానెల్స్. ఇంట్లో పెద్దవాళ్లు లేచీలేవగానే టీవీ ఆన్ చేసి భక్తి ఛానెల్స్ పెట్టడం, ఆ సౌండ్ కి ఇంట్లో కుర్రోళ్లు కసురుకోవడం అక్కడక్కడా కనిపించే నిత్య దృశ్యమే. రేడియో నాటి అలవాటు మానలేక ఇలా సర్దుకుపోతున్నారని కుర్రగ్యాంగ్ అర్థం చేసుకోరూ...

టీవీ ప్రాధాన్యత పెరగడంతో టివీ స్టేషన్ల సంఖ్య కూడా పెరగసాగింది. ప్రైవేట్ ఛానెల్స్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో బడాబడా వ్యాపరస్థులు తమ సొంత ఛానెళ్లు పెట్టుకోవడం మొదలెట్టారు.  నెమ్మదిగా టివీ సంస్థల్లోకి రాజకీయ వాసనలు కమ్ముకోవడం మొదలైంది. ఛానెల్ పేరు చెప్పగానే అది ఏ పార్టీకి కొమ్ము కాస్తుందో ఇట్టే చెప్పేసే రోజులొచ్చేశాయి. ఒకప్పుడు రోజుకి మూడు నాలుగు సార్లు మాత్రమే వచ్చే వార్తా ప్రసారాలు ఇప్పుడు 24 గంటలూ వస్తుండటంతో క్రమంగా వార్తల నిబద్ధత, నిజాయితీ వంటి గుణాలు తగ్గిపోసాగాయి. చివరకు ఏది వార్తో , మరేది కాదో తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది. 

ఎలక్ట్రానిక్ మీడియో మీద మోజు పెరగడంతో అప్పటి వరకు ప్రెస్ మీడియాలో పనిచేసిన జర్నలిస్ట్ లు టీవీ సంస్థల్లో చేరడం 90వ దశకం చివర్లో మొదలైంది. విజయవాడలో కంటే హైదరాబాద్ లో  టివీ సంస్థలు ఎక్కువగా ఉండటంతో జర్నలిస్టుల వలసలు మొదలయ్యాయి.

పోటీ పరీక్షలో ఓ సారి  దూరదర్శని గురించి వ్యాసం వ్రాయమని ప్రశ్న ఇచ్చారు. నాతోపాటు చాలా మంది పరీక్ష వ్రాశారు. ఈ ప్రశ్నకు నేను దూరదర్శన్ గురించి మూడు పేజీల దాకా దంచి కొట్టాను. తీరా ఇంటికొచ్చాక, కొశ్చిన్ పేపర్ చూసిన మా అన్నయ్య, ఈ ప్రశ్నకు ఏమి వ్రాశావురా..అని అడిగాడు. నేను డిడీ గురించి చెప్పాను.  పప్పులో కాలేశావ్. వారు అడిగింది దూరదర్శని  అంటే టెలిస్కోప్ అన్నాడు. దీంతో నేను నీరుగారిపోయాను.  

టివీ కబుర్లు చాలానే ఉన్నాయి. టివీ సంస్థలో చేరడం నా కెరిరీలో మరో మలుపు. టీవీ సంస్థలో చేరడమే కాదు, ఆ సంస్థకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు (నంది అవార్డు, యునిసెఫ్ అవార్డ్ ) అందించగలగడం నాకెంతో తృప్తినిచ్చింది. ఆ వివరాలు మరో సారి ప్రస్తావిస్తాను. 

(మళ్ళీ కలుద్దాం)

16, సెప్టెంబర్ 2024, సోమవారం

25వ భాగం : టెనెంట్ ని కరిచిన ఓనర్

 


 కొన్ని సంఘటనలు ఆశ్చర్యంగానే ఉంటాయి.  అలాంటి వాటిలో `టెనెంట్ ని కరచిన ఓనరుడు  సంఘటన ఒకటి. మేము పదకొండు అద్దె ఇళ్లు ఇప్పటి వరకు మారాము. ఒక్కో వోనర్ ది ఒక్కో స్టైల్. ఒనర్లు, ఓనరమ్మల్లో మంచి వాళ్లు ఉన్నట్లే అప్పుడప్పుడు పరమ గయ్యాళి వాళ్లూ తారసపడుతుంటారు. అంతే కాదు కొన్ని అద్దె ఇళ్లు మనల్ని నానా అవస్థలు పెడుతుంటాయి`ఏదో దెయ్యాల కొంపలో ఉన్నామా అనిపిస్తుంటుంది. ఇలాంటి ముచ్చట్లు ఈ భాగంలో మీతో పంచుకుంటున్నాను. 

  

 ఆంధ్రప్రభ విజయవాడ ఆఫీస్ లో పనిచేస్తున్న రోజులవి. రాత్రి ఏడుగంటలవుతోంది.  మరో గంటలో డ్యూటీ అయిపోతుంది. నాకు అప్పగించిన పేజీ పెట్టించే పనిలో బిజగా ఉన్నాను. ఇంతలో అటెండర్ రామారావు నా దగ్గరకు వచ్చి , `మీకు ఇంటి నుంచి ఫోన్ వచ్చిందండి  అని చెప్పాడు. పేజినేటర్ కి తర్వాత ఐటెమ్ ఎది తీసుకోవాలో, దాన్ని పేజీలో ఏ ప్లేస్ లో పెట్టాలో గడగడా చెప్పేసి పరుగులాంటి నడకతో న్యూస్  డెస్క్ లో ఉన్న ఫోన్ దగ్గరకు చేరాను. 

`హలో..

`నేనండి, శ్రీదేవిని

మా ఆవిడి కాల్ అది. 

`ఏంటి చెప్పు...’ నా గొంతులో ఆదుర్దా. 

నా కంగారు అర్థం చేసుకున్నట్లుంది. 

`అంతా బాగానే ఉన్నాము. కాకపోతే మన ఇంటి ఓనర్ గారు టెనెంట్ ని కొరికాడట. ఇక్కడంతా గొడవగా ఉంది. మీరు తొందరగా వచ్చేయండి

నాకు ఓ క్షణం అర్థం కాలేదు. ఓనర్ ఏమిటీ, టెనెంట్ ని కొరకడమేమిటి !!

వెంటనే మా డెస్క్ ఇన్ ఛార్జ్ తో చెబితే , 

`ఇందులో చాలా న్యూస్ ఉందోయ్. టెనెంట్ ని కొరికిన ఓనర్... అబ్బో, హెడ్ లైన్ అదిరిపోయింది. సరే, పని తొందరగా కానిచ్చుకుని వెళ్ళు. ఏమైనా సాయం కావాలంటే ఫోన్ చేయి. అంటూ తనలోని న్యూస్ మైండెడ్ డ్యూటీనీ, స్నేహ ధర్మాన్ని మిక్స్ చేస్తూ చెప్పుకుపోతున్నాడాయన. 

నేనప్పుడు స్పోర్ట్స్ డెస్క్ లో పనిచేస్తున్నాను. రిలీవర్ వస్తేనే కానీ డ్యూటీ మధ్యలో వెళ్ళలేని పరిస్థితి. అదృష్టం.. ఇంతలో  నైట్ ఇంఛార్జ్ డ్యూటీ ఎక్కాడు. వెంటనే అతనికి నా మిగిలిన పని అప్పగించి హడావుడిగా నా టివీఎస్ మోపెడ్ స్టార్ట్ చేశాను. 

 

నో మొబైల్ ఫోన్ :

 

 ఇంటి నుంచి ఆఫీస్ కి పదేపదే ఫోన్ లు చేయడం కుదరదు. ఇంకా అప్పటికి (90వ దశకం ప్రారంభం) మా ఆఫీస్ వాళ్లు నాకు ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ఆ రోజుల్లో టెలికామ్ శాఖ వారు బిగించే ల్యాండ్ లైన్ తప్ప ఇతరత్రా ఫోన్లు లేవు. ఫ్యూచర్ లో మొబైల్ ఫోన్లు వస్తాయన్న ఆలోచన కూడా లేదు. ఫోన్ అంటే అది ఉన్న చోటుకు మనం వెళ్ళాల్సిందే. మన వెంట తిప్పుకోవడం కుదరదు. అయితే, ల్యాండ్ లైన్ ఫోన్ నే కదిలే ఫోన్ గా కొంత మంది వాడేవారు. ఆ పద్ధతి తమాషాగా ఉండేది. 

పాత సినిమాల్లో జమందార్ ఇళ్లలో `తీగ ఉన్న మొబైల్ ఫోన్ వాడకం చూసి తెగ ఆశ్చర్యపోయేవాడ్ని. ఒక బంట్రోతు పెద్ద పళ్లెం లాంటి ట్రేలో ఫోన్ సెట్ పెట్టుకుని ఉంటాడు. ఆ పళ్లెంలో టెలిఫోన్ తీగ చుట్ట ఉంటుంది. యజమాని ఫోన్ రిసీవర్ తీసుకుని మాట్లాడుతూ నడుస్తుంటే బంట్రోత్ తన చేతి పళ్ళెంలోని వైర్ కట్టను లూజ్ చేస్తూ వైర్ ని నెమ్మది నెమ్మదిగా వదిలిపెడుతుంటాడు. యజమాని అలా మాట్లాడుతూ మొదటి అంతస్థు నుంచి క్రిందకు దిగుతుంటాడు. అదే మొబైల్ ఫోన్. వైర్ లెస్ ఫోన్లు వస్తాయని అనుకోలేదు.  ఆంధ్రప్రభలో ప్రమోషన్ వచ్చినప్పుడు ఆఫీస్ వాళ్లు ఫోన్ బిల్లు కడతామన్నారు. కనెకషన్ చార్జెస్ కూడా వాళ్లవే. అలా ఆ తర్వాత ఇంట్లోకి ల్యాండ్ లైన్ వచ్చింది. టెలిఫోన్ శాఖ నుంచి ఓ అమ్మాయి వారానికోసారి వచ్చి ఫోన్ సెట్ ని శుభ్రం చేసి అందులో కాస్తంత సెంట్ వ్రాసి వెళుతుండేది.అదేదో చాలా గొప్పగా ఫీలవుతుండేవాళ్లం.ఇంట్లో ఫోన్ నాకు కొత్తేమో కానీ మా ఆవిడకు కాదు. వాళ్ల నాన్న గారు మన్నవ గిరిధర రావు గారు ఎమ్మెల్సీగా చేసిన రోజుల్లోనే వారింట్లో ల్యాండ్ లైన్ ఉండేది. కాకపోతే ఇప్పుడు తన ఇంట్లో ఫోన్ రావడం ఆమెకూ బోలెడు ఆనందం కలిగించింది. పైగా మధ్యతరగతి ఇళ్లలో ఫోన్ సౌకర్యం ఎక్కువగా ఉండేది కాదు. అందుకే మన ఇంట్లోకి ఫోన్ వస్తుందని తెలియగానే అంతకు ముందు పరిచయం లేని వాళ్లు కూడా ఇంటికి వచ్చి పరిచయం పెంచుకునే వాళ్లు. చివర్లో  `ఎప్పుడన్నా మీ ఫోన్ వాడుకుంటాము, ఏమీ అనుకోకండి  అనో, ` హైదరాబాద్ లో మా అన్నయ్య వాళ్లు ఉంటారు, ఎప్పుడైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తారు, మీ నెంబర్ ఓ మారు ఇస్తారా అనో మమ్మల్ని `వాడుకోవడం’ మొదలుపెట్టారు. మొహమాటానికి మా ఆవిడ కాదనలేకపోయేది. మొదట్లో అలా ఇవ్వడం గర్వంగా ఉన్నా, ఆ తర్వాత ఫోన్ కాల్స్ తెచ్చే కష్టాలతో విసుగుపుట్టేది. నాకు నైట్ డ్యూటీలు ఎక్కువ. రాత్రి పూట మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ రింగయ్యేది. ఇంట్లో వాళ్లకు నిద్రా భంగం. కాకపోతే, నైట్ డ్యూటీలో ఉన్న నేనేమన్నా ఆఫీస్ నుంచి ఫోన్ చేశానేమో అని మా ఆవిడనిద్రకళ్ళతో లేచి వచ్చి రిసీవర్ ఎత్తితే, `పక్కింటి అనసూయమ్మ గారిని ఓ సారి పిలుస్తారా -అవతలి గొంతు. 

చేసేది ఏమీ లేక పిలిస్తే , చివరకు అనసూయమ్మ గారు ఓ గంట ఫోన్ లో మాట్లాడి వెళుతూ `థాంక్స్ అమ్మా...’ అంటూ జారుకునేది. పోనీ అర్జెంట్ కాల్ అనుకుందామా అంటే, అదీ కాదు. సుత్తీ సోది. దీంతో రాత్రి పూట ఫోన్రింగైతే మా ఆవిడ విసుక్కునేది. ఒక దశలో ఫోన్ అంటే భయం పట్టుకుంది.  సరే, ఓనర్ తెచ్చిన తంట గురించి కదా చెబుతుంటా..అక్కడికే వెళదాము పదండి..

 అసలేం జరిగింది ఇంటి ఓనర్ ఏమిటీ, టెనెంట్ ని కొరకడమేమిటీ?? ఓనర్ కోపిష్ఠి వాడని తెలుసు, కానీ మరీ కొరికేటంత కోపమాపైగా కొరకడం జంతు లక్షణం. వాడేమన్నా కుక్కా, పందాఇలా ఆలోచిస్తూ నా టివీఎస్ మోపెడ్ వేగం పెంచాను. 

 

మోపెడ్ యాత్ర :

 

నిజానికి మోపెడ్ వేగం ఎంత పెంచినా అది 40 కిలోమీటర్ల స్పీడ్ దాటితే కంట్రోల్ తప్పుతుంది.పాపం, `రక్షించండర్రా అంటూ గజగజా వణికిపోతుంది. 30 -35 కిలోమీటర్ల వేగం అయితేనే బాగా స్పీడ్ గా వెళుతున్నట్లు లెక్క. ఆ రోజుల్లో  మా ఆఫీస్ లో స్కూటరో లేకుంటే సైకిలో ఎక్కువ మంది వాడేవారు. టివీఎస్ బండ్లు ఒకటో రెండు ఉన్నప్పటికీ అవన్నీ ఓల్డ్ మోడల్ అన్న మాట. దీంతో నా కొత్త మోడల్ టివీఎస్ మోపెడ్ ఆపీస్ కు రాగానే ఆఫీస్ ఆవరణకే అదో ప్రత్యేక ఆకర్షణ అయింది. మా న్యూస్ ఎడిటర్ గారైతే ప్రేమగా వచ్చి విషెస్ చెప్పి ఆఫీస్ ఆవరణ చుట్టూ ట్రైల్ రన్ చేశారు.  బాగుందోయ్ నీ బండి. చూడ ముచ్చటగా ఉంది  అంటూ కితాబు ఇచ్చారు. ఆ రోజుల్లో పదవుల బేషిజాలు ఆట్టే కనిపించేవి కావు. అంతా సరదాగా కలసిమెలసి పనిచేస్తుండేవాళ్లం. నా సీనియర్ మిత్రులు లంకా వెంకట రమణ గారికి  ఇలా నేను మోపెడ్ కొనుక్కోవాలనుకుంటున్నాననని చెబితే, షో రూమ్ కి తీసుకువెళ్ళి బండి ఇప్పించారు. నాలుగైదు రంగుల్లో ఉన్నా నాకెందుకో పోస్టల్ రెడ్ కలర్ నచ్చింది. కానీ తర్వాత మా ఇంట్లో వాళ్లు `ఏమిటీ రంగు, కదిలే పోస్టల్ డబ్బాలా ఉంది అంటూ సెటైర్లు వేశారు. అయినా నేను పట్టించుకోలేదు. పార్కింగ్ షెడ్ లో నాలుగు బండ్లు పెడితే నా బండి కొట్టొచ్చినట్లుకనిపించేది. లంకా వెంకట రమణ గారు బందర్ రోడ్డులో ఉన్న షో రూమ్ కి తీసుకువెళ్ళి బండి ఇప్పించి`ఇక ఇంటికి వెళ్ళు..’ అంటూ తన దారి చూసుకున్నారు. `ప్రక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో ఓ లీటర్ పెట్రోల్ కొట్టించుకో అని ఓ ఉచిత  సలహా ఒకటి. నాకు మోటర్ వెహికల్ నడపడం అదే కొత్త. పైగా విజయవాడ బందర్ రోడ్డు మీద మొదటి సారిగా కొత్త మోపెడ్ నడపడటం అంటే ...అమ్మో నాకు చెమటలు పట్టేశాయి. అయినా ఏదో మొండి దైర్యం ఆవహించింది. లీటర్ పెట్రోల్ కొట్టించాను. బండి నిదానంగా నడుపుతూ తెలిసిన దారిలో నెమ్మదిగా ఇంటికి చేరి  అమ్మయ్యా...అంటూ గాలి పీల్చుకున్నాను. మా ఆవిడ సంతోషించింది. సైకిల్ గోల వదిలింది. పైగా  మెపెడ్ అయితే తానూ ఎక్కవచ్చు. అది ఆమె ఆనందం. అందుకే ఆ రాత్రి ప్రపొజల్ పెట్టింది. రేపు ఉదయం మాచవరం ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వాహన పూజ చేయిద్దామని. 

ఆ మాటతో నాకు మళ్ళీ చెమటలు పట్టడం మొదలైంది. ఇంకా బండి సరిగా నడపడం రాలేదు. అసలు మా నాన్న గారేమో సైకిల్ కొనుక్కోరా... నీ అవసరరాలకు సరిపోతుంది అని అంటుండేవారు. నాకేమో నచ్చలేదు. స్కూటర్ కొనుక్కోవాలన్నది నా ఆశయం. చివరకు ఈ రెండు కాకుండూ బడ్జెట్ లో వస్తుందని మోపెడ్ తో సరిపెట్టుకున్నామన్న మాట.

మర్నాడు పొద్దున్నే మోపెడ్ ని విజయవంతంగా మాచవరం డౌన్ ఆంజనేయస్వామి వారి గుడికి తీసుకువెళ్ళి పూజలు చేయించి ఇంటికి రాగానే ఏదో ఘన విజయం సాధించినట్లు మేమిద్దరం ఫీలయ్యాము. ఇరుగు పొరుగు వాళ్లు కూడా ఎంతో సంతోషించారు. 

 

వేటూరితో `వింత బంధం :

 

కొత్త మోపెడ్ వేసుకుని ఠీవీగా ఆఫీస్ కు వెళ్లగానే లంక వెంకట రమణ గారు , `ఏమోయ్, ఎలా ఉంది కొత్త బండి అంటూ పలకరించారు. రమణ గారు తెలుగు సినీ రచయిత, కవి వేటూరి సుందరరామ్మూర్తి గారికి స్వయాన మేనల్లుడే. అలా నాకు పెద్దాయనతో పరిచయం ఏర్పడింది. ఒక సారి ఆఫీస్ కి వెళ్ళిన కాసేపటికి రమణగారు నా దగ్గరకు వచ్చి క్యాంటీన్ కి తీసుకువెళ్ళారు. ఆలా క్యాంటీన్ లో టీ త్రాగుతుండగానే ఓ పెద్దాయన అక్కడకు వచ్చారు. ఆయన్ని నాకు పరిచయం చేశారు రమణ గారు. ఆయన మరెవరో కాదు. ప్రముఖ సినికవి వేటూరి సుందర రామ్మూర్తి గారు. వారి గురించి వినడమే కానీ, ఎప్పుడూ చూస్తాననుకోలేదు. మా కాలేజీ లైఫ్ లో వారు వ్రాసిన పాటలు మారుమ్రోగేవి. ముఖ్యంగా `అడవి రాముడు`యమగోలపాటలైతే మా యూత్ చేత చిందులు వేయించాయి. `వీడెవడో ఆత్రేయని మించి పోయాడ్రా ‘ అని మా ఫ్రెండ్ గిరీష్ అనడం నాకిప్పటికీ గుర్తు. ఆ రోజుల్లో సినిమా పాటలంటే చెవి కోసుకునే బ్యాచ్ మాది. అసలు సంగీతం నేర్చుకోవాలని , పాటలు పాడాలని కూడా డిసైడ్ అయ్యాము.

 

జాలాదిని చూసిన రోజు

 

అనుకోకుండా నందిగామ పాత బస్టాండ్ దగ్గర్లోని ఓ మేడ మీద సంగీతం నేర్పే మాష్టారు ఉన్నారని గిరిష్ నన్ను మరో మిత్రుడిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. మేడ మెట్లు ఎక్కి ఓ చిన్న గదిలోకి వెళ్ళాము. అక్కడ ఒకాయన హార్మోనియం పెట్టె ముందు కూర్చుని స్వరాలు వాయిస్తున్నారు. గిరీష్ చెప్పాడు, ఆయన జాలాది రాజారావు గారని. అప్పుడు అనుకోలేదు, వీరే ప్రముఖ సినీ రచయిత  జాలాదిగా ప్రసిద్ధి చెందుతారని.

వారి కుమార్తె జాలాది విజయ గారు  తానా ప్రపంచ సాహితీ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆమెను చూశాను. అదే సభలో నేనూ విశిష్ట అతిథిగా పాల్గొన్నాను. ఆ సమయంలో ఈ పాత సంఘటన గుర్తుకు వచ్చింది. ఇది వ్రాస్తున్నప్పుడే విజయగారితో ఫోన్ లో మాట్లాడాను. వారెంతో సంతోషించారు. నందిగామ నుంచే సిని అవకాశాల కోసంనాన్నగారు మద్రాసు వెళ్ళారనీ, వారి మొదటి సినిమా పాట  చూరట్టుకు జారతాది, చిట్టుక్కు చిట్టుక్కు వాన చుక్క- (పల్లె సీమ- 1976) అని చెప్పారు. విజయగారు కూడా తన చిన్ననాటి నందిగామ విశేషాలను కాసేపు నాతో పంచుకున్నారు.  

 సరే, మళ్ళీ వేటూరి గారి దగ్గరకు వెళదాము..  అడవి రాముడు సినిమాలో వారు వ్రాసిన `కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు  అన్న పాట ఇప్పటికీ ఓ స్ఫూర్తిదాయకం. 

కొన్ని పరిచయాలు ఎందుకు ఏర్పడతాయో, అవి ఎటు దారితీస్తాయో ఎవ్వరికీ తెలియదు. 

వేటూరి గారు బ్యాంక్ లోన్ తీసుకోవడమేమిటీ, వారు ఆ లోన్ కట్టారా లేదా అని నేను పదేపదే ఆరా తీస్తూ వెంబడపడటమేమిటీ !! వినడానికి చిత్రంగా ఉన్నా, ఇదే జరిగింది. ఓ రకమైన విచిత్ర బంధం కూడా ఏర్పడింది. వేటూరి గారికి టివీ సీరియల్ (ఝుమ్మంది నాదం అనుకుంటా) నిర్మాణం  నిమిత్తం లోన్ కావాల్సి వచ్చింది. లక్షరూపాయలు ఇండియన్ బ్యాంక్ వాళ్లు ఇస్తామన్నారు. కాకపోతే షురిటీ సొంతకం కావాలన్నారు. రమణ గారు వేటూరి మాష్టార్ని మా ఆఫీస్ కి తీసుకువచ్చి నాకు పరిచయంచేసి సాయం చేయమన్నారు. వేటూరి గారు సినీరంగం ప్రవేశానికి ముందు తొలినాళ్లలో ఆంద్రప్రభ విజయవాడలోనే సబ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఆ విషయం రమణ గారు అప్పుడే నాకు చెప్పారు. రెండవ షూరుటీ దారునిగా సంతకం చేసే విషయంలో నేను కాదనలేకపోయాను. లక్ష రూపాయలకు షూరిటీ సంతకం చేశాను. కానీ...

వేటూరి గారు అనుకున్న సమయానికి లోన్ తీర్చలేకపోయారు. దీంతో బ్యాంక్ నుంచి నాకుకూడా నోటీసులు రావడం మొదలయ్యాయి.  నేను గాభరా పడేవాడ్ని. రమణ గారు వారి మేనమామతో మాట్లాడి కొంత సొమ్ము కట్టేంచేలా చూసేవారు. ఇలా సాగదీత వ్యవహారంగా ఈ నోటీసుల బంధం నేను హైదరాబాద్ వచ్చిన తొలినాళ్ల దాకా సాగింది. ఆ తర్వాత పూర్తిగా లోన్ కట్టేసి, వేటూరి గారు నాకు ఫోన్ చేసి  `థాంక్స్ రా అబ్బాయి..’ అంటూ  చల్లటి కబురు చెప్పారు. గండం గట్టెక్కినట్లు ఊపిరి పీల్చుకున్నాను. 

అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఎక్కడా షూరిటీల మీద సొంతకాలు చేయకూడదని. ఆ మాట మీదనే నిలబడ్డాను.  మొత్తానికి వేటూరి గారి లోన్ విషయం నాకు ఆందోళన కలిగించినా వారి పట్ల గౌరవం మాత్రం తగ్గలేదు. 

  ఆ మాపెడ్ బాగా కలిసొచ్చింది. మా కుటుంబం పెరిగింది. మా అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో చేరడం కోసం హైదరాబాద్ వెళుతుంటే నేనూ ట్రాన్సఫర్ పెట్టుకున్నాను. యాజమాన్యం అంగీకరించడంతో ఫ్యామిలీ షిఫ్ట్ చేశాము. మాతో పాటుగా టీవీఎస్ మోపెడ్ కూడా చైతన్యపురికి దగ్గర్లోని వివినగర్ అద్దె ఇంటికి చేరింది. నేను తెలుగువన్ డాట్ కామ్ లో న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్నప్పుడు ఓ మిత్రునికి ఈ మోపెడ్ ని అతి తక్కువకి ఇచ్చేశాను. ఇంటికి బజాజ్ మోటర్ సైకిల్ రావడంతో పాపం ఈ మోపెడ్ గారు, అప్పటికే ఓ మూల దిగులుగా చూస్తుండేది. `నీకూ, నీ కుటుంబానికి ఎంతో సేవ చేశాను. నన్ను పట్టించుకోవా..’ అన్నట్లు ఉండేవి దాని చూపులు. కాకపోతే ఓ మంచి మిత్రునికే అప్పగించాను. అలా టీవీఎస్ మోపెడ్ కథ ముగిసింది.

 

మనిషి కాటు :

 

 సత్యనారాయణ పురంలోకి మోపెడ్ ప్రవేశించింది. అక్కడి నుంచి అద్దె ఇల్లు చాలా దగ్గరే. ఆ ఓనరుడు అసలెందుకు టెనెంట్ ని కొరికాడన్నది నా మదిని తొలుస్తున్న పజిల్.మనిషి కాటుకు మందే లేదంటారు.  పైగా కేసు పెడితే జైలుకు పోవడం ఖాయం. 

ఇంటి ముందు జనం గుంపుగా చేరారు. నేను ఓ వారగా మోపెడ్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాను. మా ఆవిడ చెప్పుకుపోతున్నది..

మేము అద్దెకుంటున్న ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఐదు ఫోర్షన్లు, పైన మొదటి అంతస్థుల్లో ఐదు పోర్షన్లు ఉన్నాయి. ఓనర్ పైన రెండు పోర్షన్లు మినహా మిగతావి అద్దెకు ఇచ్చారు. ఆయనకు బీపీ ఎక్కువ అని అంటారు. మామూలుగా చాలా పద్దతి గల మనిషి. ఎంత `పద్ధతి ?అంటే ఐదో తారీఖునాటికి అద్దె డబ్బులు ఇవ్వకపోతే పదేళ్ల వాళ్లబ్బాయిని పంపించేవాడు. వాడు తారాజువ్వలా ఇంట్లోకి దూసుకు వచ్చి -  `ఇంట్లో ఉంటారా, ఖాళీ చేస్తున్నారా..? నాన్న గారు కనుక్కుని రమ్మన్నారు  అనే వాడు. పైగా ఈ ఓనర్ స్త్రీ ద్వేషి.  అద్దెకుండే ఆడవాళ్లకు షరతులు పెట్టేవాడు. కూరగాయల వాడితో మాట్లాడినా తట్టుకోలేడు. ఇద్దరు ఆడవాళ్లు నిలబడి మాట్లాడుతుంటే కోపంతో ఊగిపోయేవాడు.  ఇలా ఉండేది ఓనర్ తీరు. వాడికి క్లాస్ పీకాలన్నంత కోపం వచ్చేది నాకు. ఆయనతో మనకెందుకండీ, టైమ్ కి అద్దె కట్టేయండి, మిగతా విషయాలు మనకెందుకు అనేది మా ఆవిడ. పైగా, వాళ్లావిడ చాలా మంచిది. తోడునీడగా ఉంటుందని మా ఆవిడ చెప్పడంతో నేను మెత్తపడేవాడ్ని.  

పై ఫోర్షన్లో ఉన్న ఒకాయనతో ఓనర్ గారు తగాదా పెట్టుకున్నారట. ఇద్దరికీ మాటామాట పెరిగాయి. చివరకు చేతులకు పనిపెట్టే దాకా వెళ్ళింది. ఓనరుడు అక్కడితో ఆగలేదు. టెనెంట్  చేతిని కొరికేశాడు. దీంతో టెనెంట్ రక్తం కారుతున్న చేతిని అలాగే పట్టుకుని సత్యానారాయణ పురం పోలీస్ స్ఠేషన్ కు వెళ్ళాడు. అప్పుడు కానీ ఓనర్ ఆవేశం చల్లారలేదు. `లా తెలిసొచ్చింది. చట్టాలు కళ్లముందు కనిపించాయి. టెనెంట్ కేసు పెడతాడేమో అన్న భయం ఆవహించింది.  వాళ్లావిడ మా ఇంటికి పరిగెత్తుకుని వచ్చి, విషయం చెప్పింది. దీంతో మా ఆవిడ ఆఫీస్ కి కాల్ చేసింది. ఇదీ కథ. పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఏదో సర్దుబాటు చేశాము. మొత్తానికి కేసు పడకుండా టెనెంట్ ని శాంతింపజేశాము

ఈ సంఘటనతో మా ఇంట్లో కొత్త చర్చ తెలెత్తింది. ఇలాంటి ఇంట్లో ఉండటం క్షేమం కాదని అర్థమైంది. నెమ్మదిగా బయటపడాలనుకున్నాము. ఇల్లు చూసుకోవడం మొదలుపెట్టాము. ఆ ఇంట్లో అప్పటికే ఏడేళ్ల నుంచి ఉన్నాము. ఇంటితో చక్కటి అనుబంధమే ఉంది. కానీ ఏం చేస్తాము... నాకు కోపం వచ్చినా, ఓనర్ కి కోపం వచ్చినా కరిచేది ఓనరే అని తేలిపోవడంతో  ఇల్లు మారాము. అక్కడికి దగ్గర్లోనే ఓ చిన్న పోర్షన్ తీసుకున్నాము. 

  నాకు పెళ్ళి కాకముందు,  ఓ మిత్రుడితో కలిసి పూర్ణానందం పేటలోని ఓ మేడమీద గదిలో అద్దెకు దిగాను. పెళ్ళయ్యాక పెట్టాబేడా సర్దుకుని అద్దె ఇంట్లో కాపురం పెట్టాను. అప్పట్లో ఆఫీస్ వాళ్లు ఇచ్చే నెల జీతంలో సగభాగం అద్దెకీ కరెంట్ బిల్లులకు సరిపోయేది. అయినా పెద్దగా ఖర్చులు తెలియని కొత్త సంసారం కావడంతో హాయిగానే రోజులు సాగిపోయాయి. ఈ ఇంట్లో ఓనరమ్మదే హవా. ఓనర్ గారు చనిపోయారు. పిల్లల్ని చదివిస్తూ ఓనరమ్మ ఉండేది. ఆమె చెప్పే కబుర్లకు మా ఆవిడ పడిపోయి అడిగిన వస్తువులు ఇస్తుండేది. వాళ్లకో కుక్క కూడా ఉండేది. `మా కుక్కకు పాలు కావాలమ్మా ‘ అంటూ మొహమాటం లేకుండా అడుగుతుండేది.  ఈలోగా నాకు జీతం పెరిగింది. మంచి ఇంట్లోకి మారదామనుకున్నాము. ఇదిగో అప్పుడే `కరిచే ఓనరుడి ఇంటికి మారింది. ఆ తర్వాత రెండు ఇల్లు మారాక మా ఆవిడ ఇక తాను అద్దె ఇళ్ల గోల భరించలేనంది. దీంతో లోన్ వస్తుందని తెలియడంతో సొంత ఇంటి ప్లాన్ చేశాము. అయోధ్యనగర్ లో అప్పట్లోనే కట్టిన సూర్యా బాలా ఎపార్ట్ మెంట్లో  ఓ ఫ్లాట్ తీసుకున్నాము. ఎందుకో ఆ ఇల్లు మాకు కలిసిరాలేదు. వచ్చిన వారం పదిరోజుల్లోనే ఇంటి వెనుక ట్రాన్స్ ఫార్మర్ పేలి మంటలు వచ్చాయి. పిల్లలను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. దీంతో ఇల్లు అద్దెకు ఇచ్చేసి సత్యనారాయణ పురం శివరావు వీధిలోకి మారాము. అక్కడ వసతి బాగానే ఉంది. కొన్నాళ్ల తర్వాత సొంత ఇల్లు అమ్మేశాను. ఈలోగా ట్రాన్సఫర్ పెట్టుకుని హైదరాబాద్ చేరాము. 

 

అద్దె ఇల్లు  భయాలు

 

ఏదో అద్దె ఇల్లే కదా అని చేరితే ఒక్కోసారి అవి మనల్ని భయపెడతాయి. ఊపిరి పీల్చుకోనివ్వవు. సొంత ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మా ఫ్రెండొకడు అనుభవసారంగాచెప్పేవాడు. వాడు చెప్పిన మాటలను నన్ను ఎంతగా ఆలోచింపజేశాయంటే, ఒకటి రెండు నాటికలు వ్రాసేటంతగా.

  హైదరాబాద్ లో మేము మొదటి సారిగా చేరిన అద్దె ఇల్లు శ్మశానానికి దగ్గర్లోనే ఉండేది. (డింగరి  అన్న భాగంలో ఈ ఇంటి ప్రస్తావన తీసుకువచ్చాను) మొత్తానికి క్షేమంగా ఆ ఇంటి నుంచి బయటపడ్డాము. మా బంధువుల్లో ఒకాయన అద్దె ఇంట్లో చేరగానే `మరో మనిషి ఆ ఇంట్లో ఉన్నాడన్న ఫీలింగ్ కలిగిందట. భార్యా భర్తలు  ఇద్దరు పిల్లలు. ఇంతే వారి కుటుంబం. కానీ `ఐదో మనిషి ఎవరో ఇంట్లోకదులుతున్నట్లు ఫీలయ్యామని నాతో చెప్పారు.  

ఒక మిత్రుడొకడు  ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చి హడావుడిగా అద్దె ఇంట్లో చేరాడు. అప్పటికి అతగాడికి పెళ్ళి కాలేదు. చేరిన కొద్ది రోజులకు ఇల్లు పరిశీలనగా చూస్తుంటే, కిటికీ ఊడ పీకి మళ్ళీ బిగించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అలాగే చెక్క తలుపు పగలగట్టినట్లు పగుళ్లు,చారలు కనిపిస్తున్నాయి. పాత తలుపుకి కొత్త గొళ్లెం బిగించినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఆ తర్వాత అతని అమ్మా, నాన్న వచ్చి ఆరా తీస్తే భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి. అంతే..

 ఆ ఇంట్లో అంతకు ముందు ఇద్దరు ఒకే సారిఆత్మహత్య చేసుకున్నారు. వీడు పడుకున్న మంచం పైన ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఒక అమ్మాయి చనిపోయిందట. మరో వ్యక్తి బాత్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడట. ఆ శవాలను బయటకు తీయడానికే తలుపులు బద్దలు కొట్టాల్సి వచ్చిందనీ, కిటికీ తలుపులు కూడా తీయాల్సి వచ్చిందని పనిమనిషి ద్వారా తెలిసింది. దీంతో మా వాడికి హడల్.  వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి, కొత్త ఇంట్లోకి చేరాడు. అప్పటి నుంచి వాడు ఎప్పుడు ఎక్కడ అద్దె ఇల్లు చూసినా, గోడలు, కిటికీలు, తలుపులను, ఇంటి పరిసరాలను ఓ డిటెక్టీవ్ దృష్టితో చూడటం అలవాటు చేసుకున్నాడు. ఇంటి ప్రక్కన శ్మశానం గట్రా ఉన్నాయోమో అని కూడా ఆరా తీయడం అలవాటు చేసుకున్నాడు. వాడి భయం వాడిది. 

  అందుకే అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వాడు అందరికీ హితబోధ చేస్తుంటాడు. ఈ భయాలతో పాటుగా ఇంటి ఓనర్ మంచివాడు కాకపోతే అదో ఇబ్బంది. పైన ఓనర్ ఉండి, క్రింద మనం ఉన్నామనుకోండి, వారు పెట్టే రూల్స్ పాటించలేక , ఎదురుతిరగలేక అష్టకష్టాలు తప్పవు. ఓనర్ లేదా ఓనరమ్మ పెట్టే బాధలు పడలేక అద్దె ఇంటి నుంచి విముక్తి కోసం ఆ దేవుడ్ని ప్రార్థించే వారి ఎందరో ఉన్నారు. ఇలాంటి ఇతివృత్తంతోనే నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కోసం  `నరుడే వోనరుడైతే అన్న నాటిక వ్రాశాను. అద్దె ఇంటి ఓనర్ పెట్టే కష్టాలు తట్టుకేలేక ఒక మధ్యతరగతిసంసారి (నరుడు) సొంత ఇల్లు కోసం తపిస్తుంటాడు. అతని తపస్సుకు మెచ్చి దేవత ప్రత్యక్షమై కోరిక తీరుస్తుంది. వర ప్రభావంతో అతగాడు త్వరలోనే  ఓనరుడైపోతాడు. దీంతో పాటుగా అతని మనస్తత్వం కూడా మారిపోతుంది. అంతవరకు  టెనెంట్ (సామాన్య నరుడి) గా పడిన కష్టాలు మరచిపోయి, వోనరుడి అవతారం ఎత్తి టెనెంట్ ని అంతే స్థాయిలో కష్టాలు పెడతాడు. దీంతో దేవత ఆగ్రహించి, అతడ్ని మళ్ళీ టెనెంట్ గా మారుస్తుంది. ఇదంతా కల అని తెలుసుకుని ఆ సంసారి తాను ఓనర్ అయితే టెనెంట్లను ఏడిపించ కూడదని తీర్మానించుకుంటాడు. -ఇది ఈ నాటిక సంక్షిప్త రూపం. 

 అద్దె ఇళ్ల వేట కంటే సొంత ఇంటి వేట ఇంకా క్లిష్టతరమైనది. ఈ వివరాలు మరో భాగంలో ముచ్చటిస్తాను. 

(మళ్ళీ కులుద్దాం )