ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు భాషారత్న జీవన సాఫల్య అవార్డు గ్రహీత. రచయిత, జర్నలిస్ట్
28, జూన్ 2024, శుక్రవారం
14వ భాగం : డింగరీ
డింగరీ ని చూస్తే చాలు, తెగ భయం వేసేది. నేనే కాదు, మా ఇంట్లో వాళ్లూ గజగజా వణకి పోయేవాళ్లు. డింగరీ ఎవరి మాట వినదు. అచ్చు సీతయ్య తంతే. అది ఇంటి ముందుకు వచ్చిందంటే చాలు ఇంట్లో ఉన్న మేమంతా భయపడిపోయే వాళ్లం. అది అరిస్తే మా గుండెలు దడ దడా. దాని కన్ను గప్పి గుమ్మం దాటి బయటకు వెళ్లలేము. దాని చూపులు చాలా తీక్షణంగా ఉండేవి. అది అరిస్తే ఉరిమినట్లే..
మా ఇంట్లో వాళ్లందరినీ క్రమశిక్షణలో పెట్టేది, అది కూడా కంటి చూపుతోనే.
ఇది ఎలాంటిదంటే, మొదట్లో మమ్మల్ని తెగ భయపెట్టి, ఆ తర్వాత మమ్మల్నిందర్నీ తన దారికే తెచ్చుకున్న బహు గడుసరి. అయితే చివరకు అది మా ఇంట్లోని అందరి మనసులు గెల్చుకుంది. ఇంతకీ డింగరీ అంటే ఎవరో, ఏమిటో చెప్పలేదు కదూ... చెబుతాను.
డింగరీ ఒక ఊర కుక్క. బాగా బలిసిన కుక్క. పొగరెక్కిన కుక్క. గోధుమ రంగు ఛాయలో అది గుమ్మం ముందు పడుకుని ఉంటే సింహం గుహముందు పడుకున్నట్లే ఉండేది. దీన్ని చూస్చే వీధిలో వాళ్లందరికీ హడల్. కూరగాయలు అమ్ముకునే బండి వాళ్లు సైతం ఓ పది అడుగుల దూరంలోనే అగిపోయి `అమ్మాగారూ, తోటకూర, పాలకూర, వకాయలు, బెండకాయలు’ అంటూ కేకలేయాల్సిందే. సపోజ్, డింగరీ వాళ్ల దగ్గరకు వెళితే మాత్రం అర్భక బండి వాడు పరుగే పరుగు. అంచేత.. మా ఆవిడే కేక వినబడ గానే వెంటనే గుమ్మం దాటేసేది. డింగరీ రూల్ పెట్టిందంటే దానికి తిరుగే లేదు. ఈ కుక్కకి `డింగరీ’ అన్న పేరు పెట్టింది నేనే. మొదట్లో మమ్మల్ని తెగ భయపెట్టిన డింగరీని ఆ తర్వాత ఎప్పుడు గుర్తు చేసుకున్నా మనసు బాధతో మూలుగుతూనే ఉంటుంది. డింగరీని రక్షించలేకపోయానేమో అన్న భావన మెలి తిప్పుతుంటుంది. కానీ ఏం చేస్తాం. అలా జరిగిపోయింది. కాలాన్ని వెనక్కి తిప్పే శక్తి ఉంటే డింగరీని రక్షించుకునే వాడ్నేమో.
నేను ఆంధ్రప్రభ విజయవాడ ఎడిషన్ లో పనిచేస్తున్నప్పుడు కాలం గిర్రున తిరిగిపోయింది. ట్రైనీ సబ్ ఎడిటర్ గా చేరిన నేను మరుసటి ఏడాదే పెళ్ళిచేసుకున్నాను. ఆ తర్వాత పిల్లలు వారి చదువులు, ఆఫీస్ పని, కొత్తకొత్త స్నేహితులు సాంస్కృతిక కాలక్షేపాలతో కాలం గిర్రున దొర్లింది. ఆంధ్రప్రభ లోని ఆనందకర ముచ్చట్లు మరో సారి వివరంగా చెబుతాను.
హైదరాబాద్ కి ట్రాన్సఫర్ పెట్టుకుని మహానగరానికి వచ్చేశాను. అబ్బాయి (రాజేష్) ఇంజనీర్ కాలేజీ చేరిన సంవత్సరం అది. అమ్మాయి (దివ్య) ఆరో తరగతిలో చేరిన ఏడాది. పిల్లల చదువులు, నా అవసరాలు అన్నీ కలిపి కొంత అయిష్టత ఉన్నప్పటికీ మహానగర వాసులమైపోయాం. ట్రయల్ క్రింద వచ్చినప్పుడే బంధువుల సాయంతో దిల్ షుక్ నగర్ ప్రాంతంలోని వి.వి.నగర్ (వివేకానంద నగర్)లో అమ్మాయి స్కూల్ కి దగ్గర్లోనే అద్దె ఇల్లు ఫిక్స్ చేశాం. లారీడు సమాన్లతో హైదరాబాద్ చేరాము. ఆ ఇంట్లోకి ఓ రాత్రివేళ సమాన్లు దింపినప్పుడు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి అది కూడా ఇందాక ప్రస్తావించిన కుక్కతో.
అంతకు ముందు ఇంటి ఓనర్ తో మాట్లాడినప్పుడు ఎందుకో తెలియదు గానీ, ఈ కుక్క గారు కనబడలేదు. ఆహా, విజయవాడలో మనం పెట్టే రెంట్ కే ఇక్కడా దొరికిందంటూ మేము సంతోషపడ్డాం. తుపాను ముందు ప్రశాంతత ఇలాగే ఉంటుంది మరి. లారీడు సామాన్లు దింపుతున్నప్పుడు అది తన ఉనికిని చాటుకుంటూ అరిచింది. కానీ సామాన్లు దింపే వాళ్ల మాటలు, ఆ హడావుడి కారణంగా కాస్తంత వెనకడుగు వెసినట్లుంది. రాత్రి సామాన్లు అరకొరగా సర్దుకున్నాక కాసేపు పడుకున్నాము. తెల్లవారగానే పాల ప్యాకెట్ తీసుకు రావాలి కదా. నేను తలుపు తీశాను. అంతే..
వీధి గేట్ దగ్గర కుక్క నా వైపు అదోలా చూసింది. ఆ చూపులో నా పట్ల అవిధేయతే కాదు, నిర్లక్ష్యం శత్రు భావం స్పష్టంగా కనిపించాయి. కాసేపు ఒక్క అంగుళం కూడా కదలకుండా నిలబడి దానివైపే చూస్తుండి పోయాను. అలా ఓ రెండు నిమిషాల పాటు గడిచాక కుక్కగారు ఏమనుకున్నారో ఏమో, దారి విడిచారు. పక్కకు వెళ్ళిపోయారు. బతుకు జీవుడా అని నేను వీధి చివరకు వెళ్ళి పాలప్యాకెట్లు తీసుకున్నాను. అప్పుడు ఆ కుక్కగారు గుర్తుకు వచ్చి, దాని కోసం రెండు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను. నా వ్యూహం నాది. చూద్దాం, ఎలా ఫలిస్తుందో.
ఇంట్లోకి క్షేమంగా చేరాను. బిస్కెట్ ప్యాకెట్లు చేతిలో చూసి మా అమ్మాయేమో తనకే అనుకుంది. తినబోతుంటే, `నీకు కాదు, బయటఉన్న కుక్కకి’ అన్నాను. ఆ మాటలకు ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్య పోయారు. పోరా మరి, అప్పటికే వీళ్లకి కూడా కుక్కగారి శౌర్య ప్రతాపాలు కొద్దో గొప్పే తెలిశాయి. అరిచే కుక్కకీ, మీదకి ఉరికే కుక్కకీ బిస్కెట్లా అన్నట్లున్నాయి ఇంట్లో వాళ్ల చూపులు. అయితే వీటితో సంబందం లేనట్లుగా పాలప్యాకెట్లు మాత్రమే ఇంట్లో ఇచ్చి రెండు బిస్కెట్ ప్యాకెట్లు చేతిలో పట్టుకుని పక్కనే ఉన్న మేడమెట్ల మీద కూర్చున్నాను. లోపల భయంగానే ఉంది. సింహాన్ని లొంగదీసుకోగలనా లేదా అన్నదే ఈ భయానికి కారణం. ఇంతలో మెట్ల క్రింద ఉన్న చిన్న గూడు దగ్గర ఏదో కదిలినట్లు అలికిడి అయింది. అటు వైపుకి తలతిప్పి క్రిందకు చూశాను. గుహలో నుంచి నిద్రలేచి ఆవలిస్తూ సింహం బయటకు వచ్చినట్లుగా కుక్క గారు బయటకు వస్తున్నారు. ఒక సారి తలఎత్తి నా వైపుకు చూసింది. మరోసారి ఇద్దరి చూపులు కలిశాయి. మూగభాసలు మొదలయ్యాయి.
నాలోని భయాన్ని కప్పిపుచ్చుకుంటూ ఓ బిస్కెట్ ప్యాకెట్లు సీల్ తీసి తింటున్నట్లు నటించాను. కుక్క గారు కూడా నన్నూ నా చేతిలోని బిస్కెట్ ని అదే పనిగా చూస్తున్నది. నేను ఇక ఆలోచించదలచుకోలేదు. బిస్కెట్ ని దాని వద్దకు విసిరాను. అది గడుసరి కుక్క గారే కాదు, జంపింగ్, క్యాచింగ్ ల్లో కూడా బహు నేర్పరిలా ఉంది. బిస్కెట్ ముక్క గాలిలో ఉండగానే ఎగిరి నోట కరుచుకుంది. కుక్కలకే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఇస్తే ఈ కుక్కగారు పతకం గెల్చుకోవడం ఖాయమని అనుకుంటూ మరో బిస్కెట్ వేశాను. అంతే నేర్పుగా నోట కరుచుకుంది. అలా ఒక్కో బిస్కెట్ తింటున్న కొద్దీ దాని చూపులో నా పట్ల ప్రేమ, అభిమానం కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. ఇది చాలు, నేను విజయం పూర్తిగా సాధించడానికి.
అవును, నేను గెలిచాను. ఆ కుక్కగారు ఇప్పుడు నా కాళ్లు నాకుతూ నా చుట్టూ తిరగాడే పెంపుడు కుక్కగా మారిపోయారు. ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లాలన్నప్పుడల్లా నా సాయం తీసుకునే వారు. రెండు మూడు రోజుల్లో ఆ పరిస్థితి దాటిపోయి, మా ఫ్యామిలీ మొత్తాన్నీ తన ప్రేమ చూపులతో `ప్యామిలీ ప్యాక్’ క్రింద తన వైపుకు తిప్పుకుంది. ఆ సమయంలోనే దానికి ఓ పేరుపెట్టాలనుకున్నాను.
మరి, పిలవాలి కదా. `ఏయ్ కుక్కా రా..’అంటే దానికి కోపం వచ్చి మళ్ళీ బిగుసుకుపోతే నా ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరే కాదా. అందుకే దానికి నామకరణ మహోత్సవం ఏర్పాటు చేశాను.
పాతాళభైరవిలో డింగరీ అన్న పదాన్ని (ఫుట్ నోట్ : చూ.. 14) పింగళి గారు వాడనే వాడారు కదా. అదే దీనికి పెడదామని అనగానే మా పిల్లలకు ఇదేదో సరదాగా అనిపించి `ఒకే’ అనేశారు. ఆ క్షణం నుంచీ డింగరీ మా ఇంట్లో సభ్యత్వం పొందింది. మా అందరి సెక్యూరిటీ బాధ్యతలను తీసేసుకుంది. మా భయం పోయింది. మాకు ఊరట లభించింది. అలా మహానగరంలో `తొలి స్వేచ్ఛా పోరాటం’లో విజయం సాధించామన్న మాట.
`ఏయ్..డింగరీ..’ అనగానే బాణంలా దూసుకు వచ్చేది. మరి ఈ డింగరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తర్వాత మా ఓనర్ ని అడిగాను. ఓనర్ గారు వేరే పేటలో ఉంటారు. ఈ ఇల్లు అద్దెకు ఇస్తూ ఉంటారన్న మాట. ఇంతకు ముందు అద్దెకు దిగిన వారు ఈ కుక్కను పెంచుకున్నారట. మంచి బ్రీడ్. గోధుమరంగు ఛాయలో బలిష్టంగా ఉండేది. పెంచిన వాళ్లు మరెందుకో తెలియదు గానీ దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇది వీది కుక్కగా మారిపోయింది. విశ్వాసం సన్నగిల్లక ఇంకా ఆ ఇంటినే పట్టుకుని ఉండేది. అలాంటప్పుడు మేము ఆ ఇంట్లోకి దిగాము. ఇంతకు ముందు దానికి ఏం పేరు పెట్టారో నాకు తెలియదు కదా. అందుకే నేను నా క్షేమం కోసం, నా కుటుంబ క్షేమం కోసం దాన్ని మచ్చిక చేసుకుని డింగరీ అని నామకరణం చేశాను. అదన్న మాట డింగరీ ప్లాష్ బ్యాక్ స్టోరీ. ఆ ఇల్లు మాకు బాగానే నచ్చింది. కానీ ఇంటికి అతి చేరువలోనే శ్మశానం ఉందన్న సంగతి, ఆ భయాల సంగతి చెప్పకుండా డింగరీ కథ పూర్తి కాదు.
ఇటు ఇల్లు - అటు శ్మశానం
మా ఇంట్లో వాళ్లకు కుక్కలు, పిల్లులు పెంచుకోవడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా మా ఆవిడికి (శ్రీదేవి) జంతువులను పెంచుకోవడంపై కచ్చతమైన అభిప్రాయాలు ఉండేవి. ఏదైతేనేం, మేము ఆ ఇంట్లో ఉన్న ఐదేళ్లూ డింగరీ మా ఇంటి సభ్యులందరికీ సెక్యూరిటీ గార్డ్ లా పనిచేసింది. మా ఆవిడ బజారుకు వెళ్ళినా తానూ ఆమె వెంట వచ్చేది. నేను అప్పుడు ఆంధ్రప్రభలో పనిచేసేవాడినని చెప్పాను కదా. నాకు నైట్ డ్యూటీలు ఎక్కువ. సిటీ ఎడిషన్ అయ్యాక మోటారు సైకిల్ మీద బంజారాహిల్స్ నుంచి బయలుదేరి ఇంటికి చేరే సరికి ఏ రాత్రి రెండో, రెండున్నరో అయ్యేది. అంత అర్థరాత్రి వేళ ఇంటికి చేరువకు రాగానే వెహికిల్ చప్పుడు గుర్తుపట్టేసి ఒకటి రెండు ఫర్లాంగుల ముందే నా బండి ముందుకు వచ్చి, ఇంట్లోకి వెళ్ళే దాకా నాకు రక్షణ కల్పించేది. `రక్షణ’ అని ఎందుకంటున్నానంటే సరిగా ఆ ప్రాంతంలోనే శ్మశానం ఉంది. పగలంతా శవాలు కాల్చిన నేలలో ఇంకా వేడి తగ్గన్నట్లు ఆ ప్రాంతానికి రాగానే కాస్తంత వెచ్చగా ఉండేది. శ్మశానం గోడ పక్కగా వెళ్ళి మరో మలుపు తిరిగితే మా ఇల్లు వచ్చేది. అసలు శ్మశానం ప్రక్కనే ఇల్లు ఎందుకు తీసుకోవలసి వచ్చింది? ఓ చిన్న పొరపాటు. స్కూల్ కి దగ్గర్లో ఇల్లు తీసుకుందామన్న తొందరో ఇల్లు ఫిక్స్ చేసేసి దగ్గర్లోని బస్టాప్ వద్ద సిటీ బస్సు ఎక్కి విండోలో నుంచి ప్రక్కకు చూద్దుము కదా, శ్మశానం గేటు. లోపల కాలుతున్న శవాలు. దూరాన మరో శవం వస్తున్నట్లు డప్పు శబ్దం. సీన్ అర్థమైంది. ఎలా..? వేరే ఇల్లు చూసుకోవాలంటే కుదరదు. అప్పటికే రెండు నెలల అద్దె (నాలుగువేల నాలుగు వందలు) కట్టేశాము. ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద మొత్తం. చూస్తూ చూస్తూ వదులుకేలేము. మా బంధువు (పెద్దాయన) దగ్గర ఈ విషయం చెబితే ఆయన నవ్వేస్తూ - ` ఈ హైదరాబాద్ సంగతి మీకు తెలిసినట్లు లేదబ్బాయి. అసలు ఈ నగరంలో సమాధాలు లేని చోటు లేనే లేదు. మరేం భయపడకండి. అయినా శ్మశానం అంటే శివుని స్థలమోయ్, మీ ఆత్మబలం, దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంటుంది’ అని దైర్యం చెప్పారు. ఇక ఏమీ చేసేది లేక సర్దుకుపోయాము. ఒక ఏడాది కాగానే ఇల్లు మారదామనుకున్నాము. కానీ విధి ఆడించే నాటకంలో మన ప్రేమయం ఏమి ఉంటుంది చెప్పండి. ఆ ఇంట్లోనే ఐదేళ్లు ఉండాల్సి వచ్చింది. అది కూడా ఎలాంటి భయాలు లేకుండా. పైగా డింగరీ లాంటి కుక్క మా ప్రక్కన ఉండగా మాకేల చింత అన్నట్లుండేది. డింగరీ మా ఫ్యామిలీకి దేవుడిచ్చిన `రక్ష రేకు’. అయితే ఐదేళ్ల తర్వాత మేము ఇళ్లు మారాల్సి వచ్చింది. మరో చోటకు వెళ్ళిపోయాము. డింగరీని కూడా తీసుకు వెళదామనుకున్నాను. కానీ కుదరలేదు. అప్పటికే అది పెద్దదైంది. చురుగ్గా నడవలేకపోతున్నది. ఓ సారి దాని కాలికి గాయం అయింది. రక్తం కారుతోంది. అలాగే ఇంట్లోకి వచ్చింది. నేను పేపర్ చదువుకుంటూ కుర్చీలో కూర్చుని ఉంటే అది నా ప్రక్కనే వచ్చి కూర్చుంది. బాధతో మూలుగుతోంది. నేలమీద రక్తం మరకలున్నాయి. దాని బాధ అర్థం చేసుకున్నాను. శ్రీమతిని పిలిచి గాయాలకు కట్టుకట్టే బ్యాండేజ్ క్లాత్, దూది టించర్ పట్టుకు రమ్మనమన్నాను. నేను క్రింద నేలమీద కూర్చుని గాయమైన డింగరీ కాలుని వొళ్లోకి తీసుకుని దూదితో రక్తం తుడిచాను. టించర్ వేసి బ్యాండేజ్ క్లాత్ చుట్టి ఊడి పోకుండా ముడి వేశాను. ఇంత చేస్తున్నా అది అరవలేదు. కోపంతో ఊగిపోలేదు. తన మంచికే ఇదంతా చేస్తున్నాడన్న భావన, నా పట్ల పూర్తి నమ్మకం, విశ్వాసం దాని కళ్లలో నేను అప్పుడు చూడగలిగాను. కట్టుకట్టాక కుంటూతో బయటకు వెళ్ళింది. ఆ మార్నాడు కట్టు ఊడిపోతే మళ్లీ నా దగ్గరకు వచ్చి కట్టుకట్టమన్నట్లు చూసేది. ఇలా నాలుగు రోజులు గడిచాక గాయం మానింది. మళ్ళీ చలాకీ నడవడం ప్రారంభించింది.
డింగరీకి నివాళి:
అలాంటి డింగరీ మేముండగానే ముసలిదైపోయింది. ఆ పొగరు, ఆ అరుపు తగ్గింది. ఎప్పుడూ మూలన పడుకుని ఉండేది. అదివరకటిలా మాకు ఎస్సార్ట్ గా ఉండేది కాదు. అయినా ఇంట్లోకి మాత్రం వేరే వాళ్లని రానిచ్చేది కాదు. మా అబ్బాయి ఫ్రెండ్స్ తరచు వస్తుంటే వాళ్లనీ అడ్డగించేది. చివరకు వీళ్లందరినీ తోకాడిస్తూ రానిచ్చేది. మేము ఇల్లు మారినప్పుడు డింగరీని వదలలేక వదిలి వెళ్ళాము. చివర్లో ఓనర్ కి ఫోన్ చేసి డింగరీని జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు పెట్టాను. అయినా దాని చివరి కాలంలో పెద్దగా చేయలేకపోయానన్న దిగులు మాత్రం ఇప్పటికీ అలాగే ఉండి పోయింది. ఆ తర్వాత కొంత కాలానికి ఎవరి వల్లనో తెలిసింది. డింగరీ చనిపోయిందని.
ఏమిటీ అనుబంధం. ఎందికీ ఆప్యాయత ? ఎంత వరకు ఈ బంధం ? ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. డింగరీ ఇప్పటికీ మా పిల్లలకు బాగానే గుర్తు. దాని గురించి తలుచుకుంటూనే ఉంటారు.దాని మీద ప్రేమ తగ్గలేదు. మా అమ్మాయి దివ్య వాళ్లబ్బాయిని ముద్దుగా డింగరీ అని పిలవడం అందుకు నిదర్శనం.
డింగరీ నువ్వు ఏ లోకంలో ఉన్నా, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇదే నా నివాళి. ఓం శాంతి శాంతి శాంతిః
మోగ్లీ :
ఏమిటో నా జీవిత యాత్ర చెబుతున్నప్పుడు మరో వీధి కుక్కని కూడా ప్రస్తావించక తప్పడం లేదు. డింగరీ కంటే ముందు జరిగిన సంఘటన ఇప్పుడు నేను చెప్పేది. మేము విజయవాడ సత్యనారాయణ పురం – మారుతీ వ్యాయామశాల దగ్గర అద్దెకు ఉన్నప్పుడు ఓ నల్లటి కుక్క నాకూ, మా కుటుంబ సభ్యులకు బాగా దగ్గరైంది. దానికి నేను పెట్టిన పేరు` మోగ్లీ’. డింగరీ మొదట్లో నా రాకపోకలను ఎలా ఆటంక పరిచేదో అలాగే ఈ మోగ్లీ కూడా. దీన్ని లొంగదీసుకోవడానికి వాడిన టెక్నిక్ నే ఆ తర్వాత డింగరీ విషయంలోనూ ఉపయోగించానన్నమాట. డింగరీ గోధుమ రంగు ఛాయలో ఉంటే ఈ మోగ్లీ గాడేమో నల్లగా జంగిల్ బుక్ లో భగీరా లాగా ఉండేది. కాకపోతే ఇదేమో కుక్క అంతే తేడా. చీకట్లో ఏ మాత్రం వెలుతురు పడినా మోగ్లీ కళ్లు మిలమిలా మెరిసేవి. అంతే చురుగ్గా మీదకు లంఘించేది. అందుకే ఆ వీధిలో దీన్ని చూస్తే భయం. నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు రాత్రి వేళ నా టూవీలర్ (మోటార్ సైకిల్ కాదులేండీ, అప్పుట్లో టివీఎస్ మోపెడ్ ఉండేది అదన్న మాట)మీద ఇంటికి చేరగానే మొదట్లో ఎటాక్ చేసేది. మచ్చిక అయిన తర్వాత తోకాడిస్తూ నా వెంటే లోపలకి వచ్చేది.
మా ఆవిడకి రెండవ కాన్పు విజయవాడలోని సత్యానారాయణ పురంలోని జనాతా క్లినిక్ లో జరిగింది. నొప్పులు వస్తుంటే ఆస్పత్రికి తీసుకు వెళుతుంటే ఈ మోగ్లీ కూడా రిక్షా వెనుకే ఆస్పత్రిదాకా వెళ్ళింది. చిత్రమేమంటే శుక్రవారం ఉదయం మా అమ్మాయి (దివ్య) పుట్టినప్పుడు మగవాళ్లమంతా ఇంట్లోనే పడుకుంటే మోగ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం దగ్గర అదో రకంగా అరుస్తూ పిల్లిమొగ్గలు కొడుతోంది. ఏమిటా ఇది ఇలా చేస్తున్నదని అనుకుంటూ మా బావమరిది (మారుతీ ప్రసాద్)ని తోడు రాగా ఆస్పత్రికి వెళ్ళాము. ఓ అరగంట క్రితమే పాప పుట్టిందని చెప్పారు. అప్పుడు అర్థమైంది ఈ శుభవార్తను ఆస్పత్రి నుంచి ఇంటికి చేరవేయడానికే మోగ్లీ పరుగుపరుగున వచ్చిందనీ, అందుకే ఇంటి గుమ్మం ముందు `ఆనంద నాట్యం’ చేసిందని. మా అమ్మాయికి (పాపాయిగా ఉన్నప్పుడు) కూడా ఈ మోగ్లీ అంటే భయం ఉండేది కాదు. ఇదేమో పారాడుకుంటూ గుమ్మం దగ్గరకు వస్తే, అదేమో గుమ్మం అవతల నిలబడి పాపాయిని ప్రేమగా చూడటం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
ప్రేమ, ఆప్యాయత ఎక్కడ ఉంటే మూగజీవాలు అక్కడే ఉంటాయి. మన చుట్టూనే తిరుగుతాయి. మన క్షేమం ప్రతి క్షణం ఆలోచిస్తుంటాయన్న సత్యం ఈ రెండు సంఘటనల కంటే ముందే , నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే అర్థమైంది. ఆ ముచ్చట్లోకి..
తువ్వాయి:
అడవిరావులపాడు గ్రామంలో మా చిన్నప్పుడు పాడి పంట సంవృద్ధిగా ఉండేవి. మా బామ్మ (అన్నపూర్ణమ్మ)గారు వ్యవసాయం పనులు చూడటం కోసం ఎప్పుడూ ఈ పల్లెనే అంటిబెట్టుకుని ఉండేవారు. నాన్నగారిది బదలీల మీద తిరిగే ఉద్యోగం. నాన్నలది ట్రాన్సఫర్బుల్ ఉద్యోగమైతే పిల్లలు కూడా అనేక ఊర్లో చిన్నతనంలోనే చూసేయొచ్చన్న మాట. వేసవి సెలవులప్పుడు ఎంచక్కా సొంత ఊరు వెళ్లొచ్చన్న మాట. అలా ఓసారి అడవిరావులపాడు వెళ్ళినప్పుడు ఓ ఆవు దూడ నాకెంతో ఇష్టమైన ఫ్రెండ్ అయిపోయింది. దీన్ని `తువ్వాయి’ అని పిలుచుకునే వాడ్ని. ఇదేమో ఎర్రగా ఉన్నా తెల్లటి చుక్కలతో బలే గమ్మత్తుగా ఉండేది. మా ఇంట్లో ఆ రోజుల్లో పదకొండు దాకా ఆవులు, దూడలు ఉండేవి. ఓ రెండు కోడెలు, ఇంకో రెండు ఎద్దులు కూడా ఉండేవి. వీటన్నింటితో గొడ్ల కొష్టం కళకళలాడుతుండేది. తువ్వాయితో స్నేహం బాగా కుదరగానే సెలవులు అయిపోయేవి. బామ్మ బండి కట్టించేది. చూడటానికి ఎడ్ల బండే అయినా దానికి గూడు కట్టి అందంగా అలంకరించేవారు. కూర్చోవడానికి ఎండు గడ్డితో మెత్తలు పరిచే వారు. తొట్టిలో కూర్చుని జీతగాడు బండి నడిపేవాడు. అప్పుడప్పుడు మా చేత బండి నడిపించే వాడు. అయితే ఈ విషయం ఎడ్లకు ఎలా తెలిసేదో నాకు అర్థం కాలేదు గానీ, నాబోటి వాడు తొట్టిలో కూర్చుని బండి నడపడం మొదలుపెట్టగానే అవి నత్తనడక నడిచేవి. మొండికేసేవి. అదే జీతగాడు తొట్టిలో కూర్చుని తనదైన భాషలో – `ఓసి నీ సిగతరగ’, `నిన్ను బందెల దొడ్లోకి తోల’ వంటి పదాలతో అదిలిస్తుంటే ఎడ్లు నడకలో వేగం పెంచేవి. ఇంకో గమ్మత్తు చెప్పనా, ఇంటి నుంచి వేరే ఊరికి వెళ్లేటప్పుడు కంటే సొంత ఊరికి చేరేటప్పుడు మాత్రం జీతగాడు అదిలించక పోయినా ఎడ్లు ఉత్సాహంతో పరుగులు పెట్టేవి. ఇంటికి తొందరగా చేరడం కోసం అన్న మాట. మా అన్నయ్యేమో ఎడ్లకు కోడె దూడలకు పేర్లు కూడా పెట్టేవాడు. ఒక ఎద్దుకు `కాటుక కళ్లది’ అని, మరో దానికేమో `బూడిద కళ్లది’ అని. ఎందుకంటే ఒక దాని కళ్ల దగ్గరేమో కాటుక పూసినట్లు చారలుంటే, మరో దానికి బూడిద పూసినట్లు కళ్ళ దగ్గర చారలుండేవి. అలాగే ఆవులకు పేర్లు పెట్టడం పల్లెటూర్లలో మామూలే. ఎఱ్రది. బోడిది (దాని కొమ్ములు చాలా చిన్నవి), నల్ల మచ్చలది, తెల్ల మచ్చలది, కర్రిది (నల్లగా ఉండేది), తిక్కది (దానికి కోపం జాస్తి), పొగరుబోతు, మంచావు, మొండావు ...ఇలా పేర్లు పెట్టేవారు.
వాటన్నింటి సంగతి ఎలా ఉన్నా నా బుజ్జి ఆవు దూడకు నేను పెట్టిన పేరు మాత్రం `తువ్వాయి’. సెలవలు అవగానే గూడు బండి కట్టించి మమ్మల్ని నందిగామ పంపేది మా బామ్మ. అక్కడి నుంచి బస్సు ఎక్కి పట్నం పోతుండే వాళ్లం. మళ్ళీ వేసవి సెలవులకే రావడం. ఏటికేడు తువ్వాయి బాగా పెరిగిపోతున్నది. అలాగే మా నడుమ స్నేహం కూడానూ. ఓ సారి మేము బండి కట్టించుకుని తిరుగు ప్రయాణంలో ఉంటే ఈ తువ్వాయి గాడు బండి వెనకే చాలా దూరం వచ్చాడు. వాడికి నేనంటే అంత ప్రేమ అన్న మాట. ఆ తర్వాత చాలాకాలానికి సొంత వ్యవసాయం ఆపేసినప్పుడు ఆవులను, ఎద్దులను ఒకటొకిటిగా అమ్మేశారు. అప్పటికే తువ్వాయి కాస్తా ఆవుగా, అమ్మగా...అమ్మమ్మగా మారే ఉంటుంది. ఆ తరువాత అదెప్పుడూ నాకు కనబడలేదు. ఒక వేళ కనిపించినా నేను గుర్తుపట్టలేదేమో. ఏమో..
ఆటు కుట్టి:
మేకపిల్లను తమిళంలో ఆటుకుట్టి అంటారు. కుట్టి అన్న పదం పిల్లలకు అక్కడ ముద్దుపేరుగా పెట్టే వారు. మా అక్క వరలక్ష్మి పెళ్ళి మద్దాలి సీతారామారావు గారితో జరిగింది. అప్పటికే బావగారు మద్రాసులో పనిచేస్తుండటంతో అక్కడే సెటిల్ అయ్యారు. వారికి ఇద్దరు మగపిల్లలు. పెద్ద వాడు విజయ్, చిన్న వాడు అజయ్. మా పెళ్ళప్పుటికి వీళ్లిద్దరూ 5 నుంచి ఏడేళ్ల వయసు వాళ్లు. మాకు అబ్బాయి (రాజేష్) పుట్టాడు. వాడు పుట్టినప్పటి నుంచీ సన్నగా బక్కపలచగానే ఉండే వాడు. మద్రాసు నుంచి ఈ పిల్లలు వస్తూ రాగానే వీడిని చూస్తూ – `అమ్మా వీడు ఆటుకుట్టిలాగా ఉన్నాడే...’ అనడం మొదలుపెట్టారు. ఇదీ సంగతి. అప్పటి నుంచి మా వాడి ముద్దుపేరు `ఆటు కుట్టి’ అయింది. ఎంత పెద్దయినా వాడి అమ్మ మాత్రం – `కుట్టీ..కుట్టీ’ అంటూ ప్రేమగా పిలుచుకుంటూనే ఉంది. చిత్రమే, తమిళనాడులోని ముద్దు పేరు ఇలా మా ఇంట్లో పాపులరవడం.
మూగజీవాలను మరువకండి:
శ్రీదేవితో నా పెళ్ళి 1985 ఏప్రిల్ 24న గుంటూరులోని కృష్ణనగర్ – బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వరా కల్యాణ మంటపంలో జరిగింది. మా అత్తగారు లక్ష్మీరాజ్యం, మామగారేమో మన్నవ గిరిధర రావు గారు. ఇదెందుకు ప్రస్తావిస్తున్నానంటే, మామగారికి మూగజీవాల పట్ల ప్రేమ ఎక్కువ అని చెప్పడానికి. ఆయన తరచూ చెబుతుండే వారు ఆవులు, కుక్కలు, పక్షులు ఇలాంటి వాటికి రోజూ ఆహారం, నీరు అందజేస్తే మనకు సంతోషంతో పాటు జీవితం ఆనందకరమం అవుతుందనీ, మనం గతంలో చేసిన పాప కర్మల ఫలం నశిస్తుందని చెప్పేవారు. ఆయన రోజూ పక్షుల కోసం గింజలు, చీమల కోసం బెల్లం ముక్కలు, ఆవుల కోసం కూరగాయలు పండ్లు వంటివి రెడీగా ఉంచేవారు. దాహంతో వచ్చే పశువుల కోసం ఇంటి ముందు నీటి తొట్టి లాంటిది పెట్టి అందులో నీరు పోసి ఉంచేవారు. మమ్మల్ని కూడా అలా చేయమనేవారు. ఆయన నేతృత్వంలో చాలాకాలం వచ్చిన భారతీయ మార్గం మాసపత్రికలోనూ, ఇంకా ఆయన వ్రాసిన కొన్ని పుస్తకాల్లోనూ (హిందూ ధర్మ వైభవం, మణి పూసలు, కాంతి రేఖలు వంటివి వాటిల్లోనూ) ఈ ప్రస్తావన తీసుకువచ్చేవారు. మనవళ్లకీ, మనవరాళ్లకీ కథల రూపంలో ఇలాంటి మంచి సంగతులు బోలెడు చెప్పేవారు. ఇలాంటి తాతలు దొరకడం మనవళ్లు, మనవరాళ్ల అదృష్టమే కదా.
విశాలమైన ఇళ్లు మనకు లేకపోవచ్చు. కానీ విశాలమైన మనసు ఉంటే మూగజీవలకు ఇంత పెట్టడం, మనమూ ఆనంద పడటం పెద్ద కష్టమేమీ కాదు. ఓ సారి ఆలోచించండి.
ఇలా నా జీవన యాత్రలో తమతమ పాత్రలు పోషించిన మూగజీవాలను గుర్తుచేసుకుంటూ , ఆ విశేషాలను మీతో పంచుకునే అవకాశం ఇన్నాళ్లకు దక్కింది.
------ఫుట్ నోట్ : చూ. 14 ------
డింగరీ : 1951లో విడుదలైన పాతాళభైరవి సినిమా కోసం పింగళి గారు డింగరీ అన్న పదం వాడారు. అందులో నేపాలీ మాంత్రికుడైన ఎస్వీఆర్ తన శిష్యుడిని ప్రేమగా డింగరీ అని అంటూ ఉంటాడు. పింగళిగారు మాటల చాతుర్యం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అనేక పదాలను ఆయన సృష్టించారు. ఈ పదం కూడా ఆయన సృష్టి అని నేనూ అనుకున్నాను. అయితే ఈ మధ్యనే తెలిసింది, ఆయన ఈ డింగరీ అన్న పదాన్ని ఓ ఇంటి పేరు (సర్ నేమ్ ) నుంచి తీసుకున్నారని. ఆ తర్వాత తోడికోడళ్లు సినిమా (1957)లో కొసరాజు జానపద గీతం వ్రాస్తూ - `టౌను పక్కకెళ్లద్దురా డింగరీ’ అంటూ పాట వ్రాశారు. ఈ పదం జర్నలిస్టులను అనేక సార్లు హెడ్డింగ్ లు పెట్టేటప్పుడు ఆదుకున్నది. ఆంధ్రప్రభలో పనిచేసేటప్పుడు అనేక సార్లు ఈ పదం మిక్స్ చేస్తూ హెడ్ లైన్లు పెట్టినట్లు గుర్తు. `రైలు ప్రక్కకెళ్లద్దురా డింగరీ..’ అనో, `ఇంకేమీ చేయవలెరా డింగరీ’ అనో ఇలా సందర్భోచితంగా డింగరీని వాడేసి అరగదీశారు మా వాళ్లు. సరే నేను కుక్కకి ఈ పేరు పెట్టి ఆ పేరుని ఇంట్లో బాగా అరగదీశాననుకోండి. ఇదీ సంగతి.
(మళ్ళీ కలుద్దాం)
24, జూన్ 2024, సోమవారం
13వ భాగం : సాహసం చేయకురా డింభకా..
(హెచ్చరిక : ఈ భాగంలో నేను పేర్కొంటున్న సంఘటనల మాదిరిగా ఎవరూ చేయకూడదు. ముఖ్యంగా పిల్లలుగా ఉన్నప్పుడు ఏ సాహసకృత్యమైనప్పటికీ ఇంట్లో పెద్దవారికి చెప్పకుండా లేదా అధీకృత నైపుణ్యం గడించకుండా చేయకూడదని చెప్పడానికే ఈ సంఘటనలను తెలియజేస్తున్నానే తప్ప ప్రోత్సహించడానికి కాదని గమనించ గలరు – రచయిత)
****
చాలా పెద్దయ్యాక, ఇప్పటికీ కూడానూ, ఏ గుడికి వెళ్ళినా అక్కడ గాలి గోపురం ఉంటే, దాన్ని చూసినప్పుడల్లా, చాలా చిన్నప్పుడు అంటే పది పన్నెండేళ్లు కూడా లేని పిల్లాడిగా ఉన్నప్పుడు నేను చేసిన సాహసం కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. నిజానికి అది సాహసం కాదు, మరణమృదంగం. రెప్ప వాల్చి తెరిచే లోపు ఊపిరి ఆగిపోయేటంతటి ఉత్కంఠ సంఘటన అది. తలచుకుంటుంటే ఇప్పటికీ వొళ్లు జలదరిస్తూనే ఉంటుంది. ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయకూడదని ఆశిస్తూ ఆ సంఘటలోకి వెళుతున్నాను.
మంగళగిరి అనగానే కొండ పైన పానకాల స్వామి, దిగువన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి కదా. క్రింద ఉన్న గుడి చాలా విశాలమైనది. నాలుగు వైపులా గాలి గోపురాలు ఉంటాయి. అయితే వెనుక ఉన్న గాలి గోపురం పైకి లేవలేదు.
అది ప్రారంభ దశలోనే ఆగిపోయినట్లు ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. అలా ఎందుకు జరిగిందనడానికి ఏవో కొన్ని కారణాలు చెబుతారనుకోండి. సరే, ముందు వైపున చాలా ఎత్తైన గాలి గోపురం ఉంది. అది పదకొండు అంతస్థులతో ప్రక్కనే ఉన్న కొండకి నేనూ పోటీనే సుమా అన్నట్లుగా ఠీవీగా నిలబడి ఉంటుంది.
మా నాన్నగారు టెంపుల్స్ కి ఈవో కావడంతో కొన్నేళ్లు మంగళగిరిలో ఉన్నాము. అప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్ లో చదువుకుంటున్నాను. నాతోటి గ్యాంగ్ తో ఇంటి ప్రక్కనే ఉన్న రథం ఎక్కడం దాని మీద నుంచి క్రింద ఉన్న ఇసుక కుప్పలపైకి దూకేయడం వంటి సాహసాలు మాకు అలవాటే. అదో సరదాగా ఉండేది. భయం తెలియని రోజులవి. ఒక సారి ఏం జరిగిందంటే...
స్నేహితుల గ్యాంగ్ తో కలిసి గాలి గోపురం ఎక్కాలనుకున్నాము. క్రింద నుంచి మెట్లు ఉంటాయి. ప్రారంభంలోనే మెట్ల దారికి తలుపు ఉంటుంది. దానికి తాళం కూడా బిగించి ఉంటుంది. కానీ ఒక్కోసారి మరిచిపోవడం వల్లనో లేదా మరే కారణం వల్లనో ఆ తలుపు తెరిచినట్లు కనబడేది. మా సాహసకృత్యానికి ఈ లొసుగే ఆధారం. గాలి గోపురం ఎక్కడానికి దేవాలయం సిబ్బంది అందరికీ అనుమతి ఇవ్వరు. కాకపోతే ఈవో అబ్బాయిని కదా, చూసీచూడనట్లు ఊరుకునే వారు. అదే కొంప ముంచింది. కేవలం ఒక సెంటీమీటరో , మిల్లీమీటరో తెలియదు కానీ వెంట్రుకవాసిలో బ్రతికి బయటపడ్డ సంఘటన గురించే ఇప్పుడు చెబుతున్నది. కాలు ఇంకాస్త స్లిప్ అయిఉంటే ..
అమ్మో. తలుచుకుంటేనే భయం వేస్తుంటుంది. జరగకూడనిది ఆ రోజు జరిగి ఉంటే నేను ఈ స్థితికి ఎదిగే వాడిని కాను, ఈ వ్యాసాన్ని మీరు చదివే వారు కూడా కాదు. దేవ దేవుడు ప్రతిక్షణం మనల్ని కనిపెడుతుంటాడనీ, ఏవో దుష్ట గ్రహాల వల్ల కలిగే ప్రమాదాలను తృటిలో తప్పిస్తాడని చెప్పడానికి ఈ సంఘటన ఓ నిదర్శనం.
గాలి గోపురం నిర్మాణం చాలా విశిష్టమైనది. ఆ నాటి ఇంజనీర్ల (శిల్పుల) పనితనానికి అబ్బుర పోవాల్సిందే. పెద్ద పెద్ద బండలను, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమాన్నీ ఒక్కొక్క అంతస్థు లేపుకుంటూ అంత ఎత్తుకు చేరవేయడం అంటే మాటలు కాదు. ఇప్పటిలా లిఫ్ట్ లు, క్రేన్లు లేని రోజులవి. మరి ఆ మెటీరియల్ ని ఎలా పైకి, అంటే క్రింద నుంచి చివరకు పదకొండవ అంతస్థు వరకు ఎలా చేరవేయగలిగారు? ఇందుకు వాళ్లు ఒక టెక్నిక్ వాడినట్లు ఆ గాలి గోపురం ఒక్కో అంతస్థు ఎక్కి చూసినప్పుడు అర్థమవుతుంది. ప్రతి అంతస్థుకి కప్పు మధ్యలో నలు చదరంగా, కనీసం ఒకటిన్నర మీటర్ల పొడవు వెడల్పు ఉండేలా శ్లాబ్ వేయకుండానే వదిలేస్తారు. అది పై అంతస్థుకి వెళ్ళి చూస్తే ఫ్లోర్ మీద కంతలా (చిల్లులా) ఉంటుందన్న మాట. ఇలా ప్రతి అంతస్థుకి చేయడం వల్ల మొదటి అంతస్థు ఎక్కి పై కప్పు చూడగానే మధ్యలో ఉన్న రంధ్రం వల్ల పై అంతస్థులు కనిపించేవి. అలాగే, క్రిందకు చూస్తే దిగువ అంతస్థులు కనబడతాయి. ఈ కంత నుంచే మెటీరయల్ ని పైకి చేర్చే వారని ఆ తర్వాత అర్థమైంది. నిర్మాణ పని అయ్యాక ఎందుకో తెలియదు కానీ, ఈ కంతలను మాత్రం పూడ్చలేదు. అవి అలాగే ఉన్నాయి. (ఇప్పటి మాట కాదు, 1960వ దశకంలో నేను చూసినప్పటి మాట ఇది. ఇప్పుడు గాలి గోపురం లోపలి గదులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు)
భయపెట్టిన గాలి గోపురం:
గాలి గోపురం దగ్గరకు మా గ్యాంగ్ ఆ రోజు వెళ్లగానే తలుపులు తీసే ఉన్నాయి. అంతే ఒక్క ఉదుటున మెట్లెక్కడం మొదలెట్టాము. అలా ఎక్కుతున్నప్పుడు బోలెడు సంతోషమేసింది. ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం అన్నమాట. కానీ ఈ ఆనందం దిగేటప్పుడు లేదు. పూర్తిగా ఆవిరైపోయింది. దాని స్థానంలో భయం..ప్రాణభయం ఆవహించింది. ఎందుకంటే..
మెట్లమీద పిల్ల గ్యాంగ్ ఊపుగా, హుషారుగా ఒక్కో అంతస్థు ఎక్కుతున్నాము. ప్రతి అంతస్థులో పైకప్పుకి చిల్లు, అలాగే క్రింద మేము నిలుచున్న చోట మధ్యలో మరో చిల్లు. `అరే, మనం ఆడుకోవడానికే అలా కంతలు పెట్టర్రా‘ అనుకుంటూ గాలి గోపురం గదుల్లో చిందులు వేశాము. మాలో ఒకడేమో కాస్త పొడుగరి. అందుకు తగ్గట్టుగానే వాడి కాళ్లూ పొడుగే. ఉన్నట్లుండి వాడేమో ఈ కంతకి ఒక వైపున నిలబడ్డ వాడు కాస్తా హఠాత్తుగా గెంతి కంతకి అవతలవైపునకు సునాయాసంగా చేరాడు మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఒలింపిక్స్ లో పతకం గెల్చుకున్నట్లుగా విజయగర్వంతో ఊగిపోయాడు. అక్కడితో ఆగలేదు. రెచ్చగొట్టాడు. `మీరు చేయండర్రా భలేగా ఉంటుది’ అంటుండగానే మరొకడు కంతకి ఇటు వైపు నుంచి అటు వైపునకు గెంతాడు. వాడూ విజయం సాధించాడు. ఒకరికి ఇద్దరు తోడయ్యారు. వీళ్ళిద్దరి మాట విని మూడో వాడూ ఈ సాహసం చేసేశాడు. అయితే ఈ మూడో వాడేమో తడబడ్డాడు. కాస్తంత కంగారు పడ్డాడు. స్లిప్ కాకుండా ఎలాగో అవతలికి చేరి ఊపిరి పీల్చుకున్నాడు. కాకపోతే అంతలో సర్దుకుని తానూ విజయం సాధించానంటూ ఫోజిచ్చేశాడు.
ఇక మిగిలింది నేను. వీరందరి కంటే నేను పొట్టి. నా కాళ్లూ పాపం పొట్టివే కదా. కానీ ఈ ఫ్రెండ్స్ ఉన్నారే వాళ్లు ఊరుకోరు కదా. నేను భయపడుతుంటే ఎగతాళి చేశారు. `ఈ మాత్రం దూకలేవా?’ అంటూ సవాల్ విసిరారు. నాకు కోపం వచ్చింది. వీళ్లకి మల్లే నా కాళ్లు ఎందుకు పొడవుగా లేవన్న దిగులు పుట్టింది. ఇంటికి వెళ్లగానే అమ్మకి చెప్పి నా కాళ్లు పొడుగయ్యేటట్లు చేయమని అడగాలని అనుకున్నాను.
`ఏమీ కాదురా, దూకేయ్’ అని వాళ్లు అప్పటికే ఏ పదిసార్లో అనేశారు. అంతే, ఉన్నట్లుండి ధైర్యం కమ్మేసింది.
కంతలో నుంచి క్రిందకు చూస్తే దిగువన చాలా లోతు ఉన్నట్లు స్పష్టంగా కనబడుతూనే ఉంది. బహుశా అది ఏ ఐదో లేదా ఆరో అంతస్థో అయి ఉంటుంది. స్లిప్ అయితే అంతే సంగతులు అని తెలుస్తూనే ఉంది. అయినా తెలియని మొండితనం ఆవహించింది. దూకేశాను.
అది క్షణంలో ఎన్నో వొంతో తెలియదు గానీ నా స్నేహితుల్లో ఒకడు నా చేయి పట్టుకుని లాగినట్లు గుర్తు. నేను బయటపడ్డాను. కాదు, బతికి బయటపడ్డానని తర్వాత బాగా అర్థమైంది. కుడి కాలి పాదం చిల్లు అటువైపుకు చేరినా ఎడమ కాలి పాదం దాటలేకపోయింది. దీంతో బ్యాలెన్స్ తప్పి క్రిందకు పడిపోయే పరిస్థితి వచ్చేసింది. సరిగా అప్పుడు వాడు కాపాడాడట. వాడి పేరు ఇప్పుడు నాకు గుర్తులేదు. అయినా దేవుడికి పేరు ఉంటుందా..ఒక వేళ ఉన్నా మన తృప్తి కోసమే కదా. ఈ ప్రమాదంలో నా ఎడమ పాదం బాగా గీసుకుపోయింది.
బిక్కుబిక్కు మంటూ ఉత్సాహం ఆవిరి కావడంతో భయం భయంగా క్రిందకు దిగాము. ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దని గ్యాంగ్ లీడర్ నా చేత వొట్టు వేయించుకున్నాడు. అందుకే ఎవ్వరికీ చెప్పలేదు. మాట తప్పని మనిషిని కనుక ఇప్పటికీ చెప్పడం లేదు కాకపోతే వ్రాస్తున్నాను, అంతే కదా.
తెలిసీ తెలియని వయసులో చేసే సాహసాలు ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు సృష్టిస్తాయో అనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఆ తర్వాత చాలా కాలానికి నందిగామ మున్నేటిలో ఈతకు వెళ్ళడం, మునిగిపోవడం, మిత్రుడు కాపాడటం `ప్రాణ రక్షకుడు’ అన్న భాగంలో చెప్పాను కదా.
కనబడుట లేదు:
గుంటూరు - సాంబశివరావు పేటలో ఉన్నప్పుడు నేను చాలా చిన్న పిల్లాడినన్న మాట. అప్పుడు జరిగిన సంఘటనల్లో చాలా మటుకు గుర్తులేవు. అలాంటి రోజుల్లో ఓ సారి తప్పిపోయాను. ఇంటికి ఎలా చేరాలో తెలియలేదు. బాగా దాహం వేస్తుంటే వీధి పంపు దగ్గర ఆగి నీళ్లు త్రాగుతుంటే ఓ `నల్ల పిల్ల’ నా చేతిని గట్టిగా పట్టుకుని ఇంటికి చేర్చినట్లు గుర్తు. అంతే , అంతకంటే ఇంకా ఏవీ గుర్తులేవు. `ఆ నల్ల పిల్ల ఎవరై ఉంటారు అక్కా..’ అని ఈ మధ్యన అడిగితే `తాను పెద్దక్క అన్నపూర్ణరా’ అని చెప్పింది. జీవన యాత్ర ప్రారంభంలోనే అమ్మ నాన్నలకు ఐదుగురు సంతానం అని చెప్పాను కదా. వారిలో మొదట- అన్నయ్య (పురుషోత్తం రావు – మా తాతగారి పేరు పెట్టారు లేండి) రెండవ సంతానం పెద్దక్క (అన్నపూర్ణ - మా బామ్మ పేరు పెట్టారు) మూడవ కాన్పులో రెండో అన్నయ్య (కోటేశ్వర రావు), నాలుగవ సంతానంగా మరో అక్క (వరలక్ష్మి)
`పెద్దక్కేరా నీ చేయి పట్టుకుని ఇంటికి తీసుకు వచ్చింది’ అని అక్క చెప్పింది. అక్కడితో ఆగలేదు. పెద్దక్కయ్య చనిపోయిన సంఘటన గుర్తుకు తెచ్చుకుని కంటనీరు పెట్టుకుంది.
పెద్దక్కకు నివాళి:
పెద్దక్క తెల్ల కామెర్లు వ్యాధితో చనిపోయిందట. ఓ నల్ల పిల్ల ఇంట్లో తిరుగుతుండటం, నన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పడం వంటి చిన్నచిన్న సంగతులు తప్ప ఈ అక్కకు సంబంధించిన జ్ఞాపకాలు మరేవీ గుర్తులేవు. సాంబశివరావు పేటలో అద్దెకు ఉండేవాళ్లం. పెద్దక్కకి తెల్ల కామెర్లని గుర్తించి మందులు వేయడం మొదలు పెట్టేసరికి అది కాస్తా ముదిరిపోయిందట. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆస్పత్రిలో చనిపోయింది. డెడ్ బాడీని రిక్షాలో వేసుకుని తీసుకు వస్తే ఇంటి ఓనర్ అడ్డుపడి శవాన్ని బయటే ఉంచమనీ, లోపలకు తీసుకు రావడానికి వీలు లేదని తెగేసి చెప్పాడట. దీంతో పెద్దక్క మృతదేహాన్ని ఇంటి ముందే మురుగు కాలవ మీదనే గోడకు ఆనించి ఉంచి నందిగామ నుంచి ముఖ్యమైన బంధువులు వచ్చేవరకు ఆగి అంతిమ సంస్కారాలు చేశారట. ఆ సంఘటనని చాలా ఏళ్ల తర్వాత చిన్నక్క (వరలక్ష్మి) తలచుకుని కంట నీరు పెట్టుకుంటే నాకూ దుఃఖం ముంచుకొచ్చింది. ఇంటి ఓనర్లు ఇంత కఠినంగా ఉండటం ఆనాడే కాదూ, ఈనాడూ కనబడుతున్న ధోరణే. మనుషుల ధోరణి మారదు. పుట్టుకని వేడుకగా చూసే వారు మరణం అనే సరికి వెనకడుగు వేస్తారు. లేనిపోని భయాలతో ఇతరులను ఇబ్బందుల పాలుచేస్తుంటారు.
పుట్టిన వాడికి మరణం తప్పదు.
మరణించిన వానికి జననం తప్పదు.
అట్టి చావు పుట్టుకల మధ్య ఎంత తేడానో..పుట్టుక సమయంలో శిశువు ఏడుస్తాడు, చుట్టూ చేరిన వారు నవ్వుతారు. ఈ సందర్భంలో ఆత్రేయ ప్రేమనగర్ సినిమా కోసం వ్రాసిన పాట గుర్తుకు వస్తున్నది.
`నేను ఏడ్చాను,
ఈ లోకం నవ్వింది.
నేను నవ్వాను,
ఈ లోకం ఏడ్చింది.
నాకింకా లోకంతో
పని ఏముందీ..? డోంట్ కేర్’ – అని అంటాడు కవి.
చావు పుట్టుకల మర్మాన్నీ, వాటి మధ్యన సాగే జీవన యానంలో లోకం తీరుని ఇలా చెప్పగలగడం ఆత్రేయకే చెల్లింది. ఈ పాట ఎప్పుడు విన్నా ఈ జీవన సారం గుర్తుకు రాక మానదు.
సాంబశివరావు పేట ఇంట్లో ఉన్న నేను ఎందుకని బయటకు వెళ్ళానో నాకు తెలియదు. వీధి చివరి దాకా వెళ్ళాను. మలుపు తిరిగాను. అలా నడుస్తూ మరో వీధిలోకి వెళ్ళాను. ఇలా నాలుగైదు వీధులు దాటాక వెనక్కి చూస్తే ఇల్లు కనబడలేదు. నాకు దుఃఖం ముంచుకొచ్చింది.
దాహం వేస్తుంటే నీళ్ల పంపు దగ్గర ఆగినప్పుడు ఈ పెద్దక్కే వచ్చి నన్ను గట్టిగా పట్టేసుకుని ఇంటికి క్షేమంగా చేర్చింది. అందుకే ఈ భాగాన్ని పెద్దక్క (అన్నపూర్ణ అక్క) జ్ఞాపకార్థం అంకితం చేస్తున్నాను. పెద్దక్కకు ఇదే నా అక్షర నివాళి.
చిన్నప్పుడు తెలిసీ తెలియకుండా చేసే పనులు వల్ల ఒక్కోసారి ఎన్నో అనర్థాలు వస్తుంటాయి. అయితే బాగా ఊహ తెలిశాక అలాంటి తప్పులు చేయకూడదన్న జ్ఞానం వస్తుంది. పిల్ల చేష్టలు కనుమరుగై పెద్దరికం తొడుగులు వేస్తుంది. జీవితమంటే అంతే కదా.
రైలు నుంచి దూకడం :
ఇదేదో సినిమాలో స్టంట్ సీన్ కాదండి. బాగా పెద్దయ్యాకనే, అంటే నేను ముంబాయి (అప్పట్లో బొంబాయి)లో చదువుకుంటున్నప్పటి సంఘటన ఇది. బొంబాయిలో లోకల్ ట్రైన్స్ జన జీవనంలో అంతర్భాగమైపోయాయి. ఒక సారి లోకల్ ట్రైన్ ఎక్కి వెళుతుంటే మా ఫ్రెండ్ ఒకడు రైలు పూర్తిగా ఆగకముందే అంటే ప్లాట్ ఫామ్ వచ్చినా పూర్తిగా ఆగక ముందే, ఛటక్కున దూకేస్తూ `నువ్వూ దూకేయి రా..’ అన్నాడు. అప్పుడు నాకు బొంబాయి చాలా కొత్త. తెలుగు ఫ్రెండ్ గాడు ఏం చెబితే అది చెయ్యడమే మన పని. వాడు నేర్పుగా అంటే, రైలు ఇంజన్ వైపునకే ఫేస్ పెట్టి దూకేశాడు. ఆ పని మన వల్ల అవుతుందా కాదా అన్న ఆలోచన లేకుండా నేనూ దూకేశాను. కానీ రైలు వెళుతున్న వైపుకి కాకుండా ఫేస్ వెనక వైపు పెట్టి దూకడంతో ఫిజిక్స్ సూత్రం తన పని తాను చేసేసింది. అంతే , ప్లాట్ ఫామ్ మీద పడిపోయాను. కాకపోతే రైలు వేగం ఇంకా బాగా తగ్గడంతో పెద్దగా గాయాలు తగలలేదు. మోకాలు దగ్గర, మోచేతుల దగ్గర చర్మం చిట్లి నెత్తురు కారింది. రైలు వెళ్ళిపోతుంది. అప్పుడు స్కూల్ లో నన్ను ఇబ్బంది పెట్టిన రైలు – స్తంభం లెక్క పరీక్షలో చేయలేక రైలు బొమ్మ వేసిన సంఘటన గుర్తుకువచ్చి అంత బాధలో నవ్వుకున్నాను. జీవితమంటే ఇంతే.
అప్పటి నుంచి సాహసాలు చేసేటప్పుడు మన సామర్థ్యం తెలుసుకుని చేయాలని నిర్ణయించుకున్నాను. అంతే కానీ, ఎవరో చెప్పారనో, ఏమేమో అనుకుంటారనో సాహసం చేస్తే ఫలితం ఇదిగో ఇలాగే ఉంటుందని అర్థమైంది. అంతే కాదు, ఒకనికి సులువుగా అనిపించే పని మరొకరికి కష్టం కావచ్చు. ఆ ఒక్కడు రెచ్చగొట్టినా ఈ మరొకడు లొంగి పోకూడదన్న మాట. చాలా ప్రమాదాలు ఇలాగే జరుగుతుంటాయి. కారు నడుపుతుంటే మన ప్రక్కన కూర్చున్న వాడే స్పీడ్ పెంచు అంటూ రెచ్చగొట్టవచ్చు. ముందు వెళుతున్న కారుని ఓవర్ టేక్ చేయమంటూ గిల్ల వచ్చు. కానీ అతగాడి మాటలకు లొంగిపోతే ప్రమాదాన్ని కోరితెచ్చుకున్నట్లే అవుతుందన్న సత్యం నిదానంగా తెలిసింది. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు నేను ప్రధానంగా ఒక సూత్రం పాటిస్తాను. అదేమంటే, జీవితంలో ఎక్కడ తగ్గాలో , ఎక్కడ తలెత్తాలో తెలియాలన్నట్టుగానే కారు నడిపేటప్పుడు కూడా ఈ రెండూ తెలియాలి. జీవితం రాగాల అల్లిక అన్నట్లుగానే వాహనం నడపడంలోనూ సంగీతం ఉంటుందన్నది నా అభిప్రాయం. చక్కటి సంగీతం వింటున్నట్లుగానే ప్రయాణం సాగాలి. అంతే కానీ గందర గోళ సంగీతంలా మారిపోకూడదు.
చివరి మాట:
ఈ సంఘటనలు చదువుతున్న మీలో కొందరికైనా ఇలాంటి చేదు అనుభవాలు ఉండి ఉండవచ్చు. ఈ మాటే నా వాకింగ్ ఫ్రెండ్ కృష్ణ శర్మ గారు (ది రిట్రీట్, కోకాపేట) ఓ సంఘటన చెప్పారు. వాళ్ల ఊర్లో దిగుడు బావి ఉండేదట. బావిలోకి దిగడానికి స్పైరల్ గా మెట్లుండేవి. కొంత మంది పిల్లలు ఈత కోసం ప్రమాదకరమైన ఆ బావిలోకి దూకేవారట. చుట్టూ ఉన్న మెట్లలో ఎక్కడ తగిలినా ప్రాణాలు పోవాల్సిందేననీ, కానీ తోటి పిల్లలు రెచ్చగొట్టడంతో కొంత మంది నేర్పులేని వాళ్లు బలైపోతుంటారని శర్మగారు చెప్పారు. ఇలాగే మీరు చూసిన విన్న అనుభవాలు, సంఘటనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
(మళ్ళీ కలుద్దాం)
17, జూన్ 2024, సోమవారం
12వ భాగం : చూడు చూడు సినిమా
ఐదేళ్లు నిండి ఆరో ఏడు నడుస్తోంది. ఊహ తెలుస్తున్న వయసు. ఇంట్లో వాళ్లు సినిమాకని బయలుదేర దీశారు. నాకూ ఉత్సాహంగానే ఉంది. ఆ సినిమాలో నాలాంటి పిల్లలేనట, భలే చక్కగా పాటలు పాడతారట.
`అచ్చు అందులో ఒక పిల్లాడైతే ఇదిగో ఇలాగే వీడిలాగానే ఉంటాడటే’ అంటూ అమ్మ ఎవరితోనే చెబుతున్నది. ఆ మాట వినగానే నాలాగే సినిమాలో ఉన్న వాడిని చూడాలని నాకూ బోలెడు కోరిక పుట్టింది. ఆ సినిమా పేరు `లవకుశ’.
1963లో మంగళగిరిలో గుడి రోడ్డు చివర్లో ఒక థియేటర్ ఉంటే ట్రంక్ రోడ్ మీద మరో థియేటర్ ఉన్నట్లు గుర్తు. వీటిలో మరి ఏ థియేటర్ కి వెళ్ళామో గుర్తుకు రావడం లేదు. సినిమాకి టైమ్ అయిపోతుందంటూ సాయంత్రం ఐదు నుంచీ ఇంట్లో హడావుడి. అమ్మతో పాటుగా మేము సినిమాకు బయలుదేరాము. నాన్న గారు అంత త్వరగా సినిమాలకి రారు. ఆ కాలంలో ఇలాంటి నాన్నలు – అంటే వాళ్లూ వాళ్ల ఉద్యోగం తప్ప ఇంట్లో వారిని సినిమాకో, సరదాగా పార్క్ కో తీసుకెళ్ళాలన్న ధ్యాసే ఉండని వాళ్లు చాలా మందే ఉండే వారు. అలాంటి నాన్నలకు మా నాన్న లీడరేమో. ఆయన `సినిమా ద్వేషి’ ఏమోనని నాకు అనుమానం. అసలు ఆయన దగ్గర సినిమా కబుర్లు చెప్పాలంటే మాకు హడల్. అలాంటి కరడు గట్టిన సినిమా ద్వేషి తన జీవితంలో ఒకే ఒక్క సారి ఫ్యామిలీని సినిమాకు తీసుకు వెళ్ళారు. ఆ సంగతి తర్వాత చెబుతానేం.
సరే, లవకుశ సినిమా చూడటానికి బయలుదేరాం కదా.. మంగళగిరిలో ఆ రోజుల్లో ఆటోలు తిరిగిన గుర్తు లేదు నాకు. ఎక్కువగా గూడు రిక్షాలే కనబడేవి. సైకిళ్లు, రిక్షాలే వీధుల్లో తిరగాడుతుండేవి. ఈ బక్క ప్రాణులం – అంటే పిల్లలమన్న మాట అంత దూరం నడవలేరని అనుకుందేమో అమ్మ అటుగా వెళుతున్న గూడు రిక్షాను పిలిచింది. బేరం ఆడాక దాంట్లో ఎక్కి కూర్చోమంది. మాతో పాటు పొరుగింటి అమ్మలక్కలు కూడా బయలుదేరారు. వారేమో `మేము నడిచే వస్తాం. మీరు వెళ్ళడమ్మా’ అంటూనే `హాల్లోకి వెళ్ళాక మా కోసం పక్కన జాగా ఉంచండేం’ అంటూ రెండు తుండు గుడ్డలు ఇచ్చారు. సినిమా టికెట్ మీద సీట్ నెంబర్లు ఉండేవి కావు. అసలు నేల, బెంచీలకైతే చెప్పేదే లేదు. ఇరుకు ఇరుగ్గా కూర్చోవడమే కదా. అమ్మ ఆ రెండు తువ్వాళ్లు అందుకుని రిక్షావాడ్ని `పోనియ్యవయ్యా సినిమా మొదలవుతోంది’ - అంటూ తొందర పెట్టింది. మాతో పాటు బయలుదేరిన వాళ్లు నడకలో మహా గడుసరుల్లా ఉన్నారు. వేగంగా నడిచి పోతున్నారు. ఎవరి తొందర వారిది. తీరా సినిమా హాలుకి చేరే సరికి నేల, బెంచీ టికెట్ల వద్ద పెద్ద పెద్ద క్యూలున్నాయి. ఐతే ఆడ వారి క్యూ తక్కువగానే ఉండటంతో అమ్మ, అక్క చకచకా వెళ్ళి క్యూలో నిలబడి టెక్కెట్లు తీసుకొచ్చారు. టికెట్ ముక్కలు చేతిలో పడగానే గేట్ దగ్గరకు వెళుతుంటే అక్క అంది.
`అమ్మా, తమ్ముడికి టెకెట్ తీసుకోవడం మరిచిపోయామే’
`అవును గదా, మరిచిపోయానే. గేట్ కీపర్ ఎమాంటడో చూద్దాం’ అంటూనే ఓ క్షణం ఆలోచించి, ఆ వెంటనే నన్ను చంకనేసుకుంది. ముందే చెప్పాను కదా, నాకప్పుడు ఆరో ఏడు నడుస్తోంది. నేను చిన్న పిల్లాడినేమీ కాను. ఎవరైనా నువ్వు బుజ్జాయివి అంటే నాకు కోపం వచ్చేది కూడాను. నేను పెద్ద పిల్లాడినే అని గట్టిగా అరచి చెప్పాలనిపించేది. అమ్మ సందర్భాన్ని బట్టి నా వయసు మారుస్తుండేది. అంటే బస్సు ఎక్కినప్పుడు కండెక్టర్ రాగానే `మా పిల్లాడికి ఐదేళ్లు కూడా రాలేదింకా’ అంటూ టికెట్ కోయనివ్వకుండా అడ్డుపడేది. చాలా మంది కండెక్టర్లు నా ఆకారం చూసి వీడు బుజ్జాయే అని నమ్మేసే వారనుకోండి. కానీ కొంత మంది గడుసు కండెక్టర్లు మాత్రం `ఏదీ నిలబడు, ఇలా రా, ఈ స్తంభం (బస్సులో మధ్యమధ్యన ఉండే ఇనుప కడ్డీలన్న మాట) దగ్గర నిలబడు’ అంటూ హుకం జారీ చేసేవారు. అప్పుడు నాకు చాలా భయం వేసేది. `వీడెవడో స్కూల్లో మాష్టార్లా ఉన్నాడే’ అన్నట్లు చూసేవాడ్ని. ఆ స్తంభం మీద ఎత్తుని అంచనా వేయడం కోసం గీతలుండేవి. ఐదేళ్లు దాటిన పిల్లలను కనుక్కోవడానికి ఇదో టెక్నిక్ అన్నమాట. నేను వెళ్ళి నిలుచున్నాను. వాడు ఏమీ అనలేదు. పోయి కూర్చోమన్నాడు. ఎందుకంటే నేను గీత దాటలేదు కదా. అదన్న మాట.
ఈ తంతు అంతా జరుగుతున్నంత సేపూ అమ్మా ఆ కండెక్టర్ ని బుట్టలో వేసుకోవడం కోసం ఏదో చెబుతూనే ఉంది, ` వీడు పుట్టి ఐదేళ్లు కూడా దాటలేదు నాయనా. నేనేమన్నా అబద్దం చెబుతానా, కృష్ణానది పుష్కరం దాటిన తర్వాతనే కదా వీడు పుట్టింది అవును కదే’ అంటూ అక్క వైపు చూసేది. అక్క కూడా తల ఊచేది. ఈలోగా కండెక్టర్ నన్ను పంపించేసే వాడు. నేను దర్జాగా సీట్లో కూర్చునేవాడ్ని. అయితే కాస్త ముందుకు పోయిన వాడు మళ్ళీ వెనక్కి వచ్చి `ఇదిగో అమ్మో, మీ వాడికి టెకెట్ లేదు. ఒళ్లో కూర్చోబెట్టుకో. అలా సీట్లో కూర్చోబెట్టుకోకూడదు తెలుసా’ అని అరిచేసేవాడు. `ఏదోలే నాయనా, సీటు ఖాళీగా ఉంటే కూర్చున్నాడు అంతే, ఎవరైనా వస్తే నా వొళ్ళోకే వస్తాడు’ అంటూ రాగం తీసేది అమ్మ. ఇదంతా నాకు గుర్తే ..ఎందుకంటే నేను బుజ్జాయిని కాదుకదా..
సినిమా గేట్ దగ్గరకు రాగానే అమ్మ నన్ను ఛటక్కున ఎత్తుకుంది. అక్కడితో ఆగలేదు, `ఓరేయ్ నిద్రపో..’ అని నాకు మాత్రమే వినిపించేలా చెవిలో చెప్పింది అమ్మ.
అదేమిటీ సినిమా చూద్దువుగాని రారా అంటూ తీసుకుని వచ్చి ఇప్పుడేమే చంకనేసుకుని నిద్రపోరా అంటూ చిచ్చి కొడుతున్నది...నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసిందిలే అమ్మ మనసేమిటో.
గేట్ దగ్గర వాడికి అమ్మ టికెట్లు ఇచ్చింది. వాడేమో లెక్క చూసుకుని టికెట్లు చింపి సగం ముక్కలు చేతిలో పెడుతూ అదేంటమ్మా ఈ అబ్బాయికి తీసుకోలేదేం అన్నాడు. వాడెంత మందిని చూశాడో ఇలాంటి వాళ్లను.
`వీడికా, వీడికి ఈ మధ్యనే ఐదేళ్లు వచ్చాయి. ఐదేళ్లు నిండందే టికెట్ ఏమిటయ్యా, మరీనూ..’ లా పాయింట్ తీసింది.
అమ్మ ఇలా అంటంటే నేను మధ్యలో నా తలకాయ లేపుతుంటే అమ్మ తన చేతితో నొక్కి పెడుతూ, గేట్ కీపర్ తో – `చిన్న పిల్లాడయ్యా, వీడికేమన్నా సినిమా అంటే తెలుసా. నిద్రపోతున్నాడు చూడు’ అంటూ లోపలకి పోతుంటే , వాడు అనుమానంగా చూశాడు. మొత్తానికి వాడు దారి ఇవ్వగానే మేము లోపలకు వెళ్ళాము.
అప్పటికే సినిమా చూడటానికని వచ్చిన వాళ్ళలో చాలా మంది గుప్పుగుప్పున పొగ వదులుతున్నారు. ఇవన్నీ మామూలే అన్నట్లు అమ్మ తన చీర కొంగుని ముక్కుకు ఆనిచ్చుకుని ఖాళీ జాగా కోసం చూస్తున్నది. అది బెంచీ క్లాస్. వరుసుగా బెంచీలు పరిచారు. వీపు ఆనుకునే సౌకర్యం లేదు. కుర్చీ, రిజర్వ్ క్లాస్ లకు ఆ సౌకర్యం ఉంటుంది. అయితే నేల కంటే ఈ క్లాస్ కాస్త మెరుగన్నమాట. మేము కూర్చున్నాక ప్రక్కవాళ్లు ఇచ్చిన తుండుగుడ్డలు పరిచింది. ఎవరు వచ్చినా `ఇక్కడ ఉన్నారండీ, ఇప్పుడే బయటకు వెళ్ళారు’ అంటూ వారిని సాగనంపుతోంది. ఇదో టెక్నిక్ అన్న మాట. నాకిప్పుడిప్పుడే ఇలాంటి టెక్నిక్ లు తెలిసిపోతున్నాయన్న మాట. ఓ పావుగంట కాగానే ప్రక్కింటి పిన్నిగారు వాళ్లు వచ్చే దాకా అమ్మకు ఇదే పని.
సరే, సినిమా మొదలైంది. గేట్ కీపర్ చెకింగ్ కి వచ్చి అమ్మ ప్రక్కన హాయిగా కూర్చుని సినిమా చూస్తుంటే `ఏమమ్మో, టికెట్ తీసుకోలేదు, పైగా వాడికో సీటా వొళ్లో కూర్చోబెట్టుకోవమ్మా’ అంటూ కసిరాడు. ఇవన్నీ మామూలే ఉన్నట్లు అమ్మ వాడు కనుమరుగ్యయేదాకా నన్ను తన వొళ్లో కూర్చోబెట్టుకుని ఆ తర్వాత ప్రక్కన కూర్చోమంది.
కుశుడెందుకు నీలంగా..?
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రామాయణం కథ వింటూనే ఉన్నాను. కానీ వాళ్లు చెప్పిన కథలో రాముడి పిల్లల గురించి చెప్పినట్లు లేదు. కానీ ఈ సినిమాలో రాముడి పిల్లలు కనబడతారని ముందే అమ్మ చెప్పింది. సినిమా మొదలైనప్పటి నుంచి అమ్మను తడుతూ- `రాముడి పిల్లలేరీ?’ అని అడుగుతూనే ఉన్నాను.
అలా అడిగినప్పుడల్లా అమ్మేమో, `వస్తార్రా చూడు.. కథ నడవనీ , విసిగించక చూడు’ అంటూనే ఉంది. అలా ఓ పది సార్లు అడిగాక సడన్ గా అమ్మ అంది, `ఇదిగో వీరేరా రాముడి పిల్లలు’ అంది. ఇద్దరూ ఇంచుమించు నా ఈడు వారిలాగానే నా ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు. కాకపోతే ఒకరేమో ఎఱుపు ఛాయ, మరొకరు నీలం ఛాయ.
అదే నాకు ఆశ్చర్యమేసింది. `అమ్మా, వాడెందుకే నీలంగా ఉన్నాడు, ఇందాక రాముడు కూడా నీలంగా ఉన్నాడేంటే’ అని అడుగుతుంటే అమ్మకు ఏం చెప్పాలో అర్థం కాక నెత్తిమీద మొట్టికాయ వేసింది. ఈ అమ్మలంతే వాళ్లకి తెలియకపోతే ఆ విషయం ఒప్పుకోరు. పైగా మెట్టికాయ వేయడమో లేదా గిల్లడమో చేస్తుంటారు. కాస్త పెద్దయ్యాక తెలిసింది, రాముడు, కృష్ణుడు లాంటి వాళ్లకు సినిమా వాళ్లు , డ్రామాల వాళ్లు నీలం రంగు పులుముతారని. నీలం అంటే నలుపు అన్న అర్థం కూడా ఉన్నదని బోలెడు పెద్దయ్యాక తెలిసిందనుకోండి. నాటకాల వాళ్లు రామడిని, కృష్ణుడిని నల్లరంగు పులిమి స్టేజీ ఎక్కిస్తే జనం ఝడుసుకుంటారని నీలం రంగు పులమడం మొదలెట్టుంటారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఈ రంగు గోల లేదు. కానీ కలర్ సినిమాలు వచ్చాక రామడు, కృష్ణుడికి నాటకాల వాళ్లలాగానే ఓ డబ్బా నీలం రంగు తెచ్చి పులమడం మొదలెట్టారని టెన్త్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు వివరంగా నా యీ చిన్ననాటి డౌట్ తీర్చాడు.
సినిమా నాలెడ్జ్ వాడికి చాలా ఎక్కువ. సినిమా టైటిల్స్ మిస్సయ్యేవాడు కాడు. సినిమా అంటే ఎలా చూడాలో ఓ సారి పెద్ద క్లాసే పీకాడు. అదంతా రాస్తే చాటభారతం అవుతుంది కనుక, క్లుప్తంగా ఇస్తున్నాను..
సినిమా చూసేందుకూ ఓ పద్ధతి :
`ఓరేయ్.. సినిమాకి ఎలా వెళ్లాలంటే, ఓ పావు గంట ముందే సినిమా హాల్ కి చేరేలా చూసుకోవాలి. వచ్చేటప్పుడే ఓ వేరుశనగ కాయల ప్యాకెట్లో నాలుగు జీడీలో తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. సీట్లు ఖాళీగా ఉంటే ఫ్యాన్ క్రిందనే కూర్చోవాలి. లేటుగా వెళ్ళి సీటు దొరక్క, ఎక్కడో ఏదో మూలన దొరికిన సీట్ తో సర్దుకుపోయి ఫ్యాన్ గాలాడక, ఉక్కబోతతో ఇబ్బంది పడుతూ సినిమా చూడకూడదు. సినిమా హాల్లో లైట్లు ఆపేయగానే కర్టెన్ పైకి లేస్తుంది. ఇది తప్పకుండా చూడాల్సిందే. అలా నెమ్మదిగా కర్టెన్ లేస్తున్నప్పుడు చక్కటి మ్యూజిక్ వస్తుంటుంది. కర్టెన్ క్రింద భాగంలో కట్టిన రంగురంగుల లైట్లు నెమ్మదిగా పైకి వెళుతుంటే భలే థ్రిల్ గా ఉంటుంది. సగం కర్టెన్ లేవగానే స్వాగతం అన్న కార్డ్ స్కీన్ మీద పడుతుంది. ఆ తర్వాత హాలులో పొగ త్రాగరాదు అని వేస్తారు. మరేం ఫర్వాలేదు. నీ దగ్గర సిగరెట్ ఉంటే ముట్టించమని దాని అర్థమన్నమాట. ఆ తర్వాత నిశ్శబ్దం అన కార్డ్ పడుతుంది. మనం ఎలెర్ట్ అవ్వాలి. మొదట న్యూస్ రీల్ పడుతుంది. గంభీరమైన కంఠంతో వాడెవడో –
`బీహార్ లో వరదలు...
వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
సిక్కింలో కొండచెరియలు విరిగిపడి వందలాది మంది మృతి...ఇలాంటి భయపెట్టే వార్తలు చెప్పి, చివర్లో క్రీడలు అంటూ హాకీలో భారత్ కి స్వర్ణం అంటూ ముగిస్తాడు. ఇది చూడటానికి భలేగా ఉంటుందిరా. మిస్ కాకూడదు. అది అయ్యాక మళ్ళీ నిశ్శబ్దం అన్న కార్డ్ పడుతుంది. సినిమా మొదలవుతుందనే అనుకుంటాము. కానీ కాదన్న మాట. ఈసారి రాబోయే సినిమాల గురించి ట్రైలర్స్ వస్తాయి.
భయంకర పోరాటాలు.
మత్తెక్కించే పాటలు.
ఆనంద పరిచే నృత్యాలు.
ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు.
మీ అభిమాన థియేటర్లోకి ...త్వరలో...అతి త్వరలో...అంటూ సాగుతుంటుంది ఈ సినిమా ట్రైలర్. ఆ తర్వాత నిజం సినిమా మొదలవుతుందన్న మాట. టైటిల్స్ జాగ్రత్తగా చూడాలిరా. ఏ బ్యానర్ క్రింద రిలీజ్ అయిందీ, నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు. ముఖ్య పాత్రలను ఎవరు పోషించారు. పాటలు పాడింది ఎవరు.. రాసింది ఎవరు. డైలాగ్ లు ఎవరు రాశారు. ఫోటోగ్రఫీ ఎవరు.. ఆర్ట్ డైరెక్టర్ ఎవరు..ఇలా అన్నీ జాగ్రత్తగా స్కీన్ మీద చదివి బుర్రలోకి ఎక్కించుకోవాలి తెలుసా. సినిమా కథ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శుభం కార్డ్ పడే లోపుగానే హడావుడిగా బయటకు వెళ్ళిపోకూడదు.
ఇలా చెప్పేవాడు వాడు. అంత శ్రద్ధగా నేను ఏ సినిమా చూసేవాడ్ని కాదనుకోండి. నాకు మరో ఫ్రెండ్ విష్ణు ఉండేవాడు. వాడూ నేనూ సినిమా బాగోలేకపోతే మధ్యలోనే లేచి బయటకు వెళ్ళిపోయే వాళ్లం. కానీ ఇక్కడా ఒక ఇబ్బంది ఎదురయ్యేది. మధ్యలో బయటకు వెళతమంటే గేట్లు ఓ పట్టాన తెరువరు. కాసేపు వాగ్వాదం చోటుచేసుకునేదన్న మాట. చివరకు గేటు తెరవడం మేము బయటకు వెళ్ళి ఊపిరి పీల్చుకోవడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు జరిగేవి.
సినీమా పోస్టర్లు చూసి కథలు చెప్పేవారు, పాటల పుస్తకంలోని కథ చదివేసి సినిమా చూసినట్లు బిల్డప్ లు ఇచ్చే వారు కూడా తారస పడేవారు.
సరే, లవకుశ సినిమా దగ్గరకు వెళదాం పదండి. నీలం పిల్లాడి పేరు కుశుడు. అచ్చు నాలాగే బక్కగా ఉన్నాడు. వాడి తమ్ముడు లవుడేమో `బల’రాముడిగా బొద్దుగా ఉన్నాడు. సినిమా చూసి ఇంటికొచ్చాక చాలా రోజుల పాటు నన్ను నేనే కాసేపు కుశుడిగా భావించుకునే వాడ్ని. ఇంట్లో నీలం రంగు పొడర్ ఉందా అమ్మా అని కూడా నాలుగైదు సార్లు అడిగాను. నీలం రంగు పౌడర్ ఉండి ఉంటే, అమ్మ ఇచ్చి ఉంటే నేను ఒళ్లంతా పట్టించుకుని కుశునిగా మారిపోయి పద్యాలు చెప్పాలనుకున్నాను. సినిమా వాళ్లకు దొరికిన నీలం పౌడర్ నాకెందుకు దొరకలేదా అని ఆ తర్వాత కూడా చాలా కాలం ఆలోచించాను. చాలా పెద్దయ్యాక తెలిసింది ఇదంతా మేకప్ కిట్ మహిమ అని. సినిమా వాళ్లు, నాటకాల వాళ్ల దగ్గర ఇలాంటి మేకప్ కిట్ లు ఉంటాయని తెలిసింది.
జీవము నీవే కదా.. :
లవకుశ తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా 1967లో వచ్చిన భక్త ప్రహ్లాద. అప్పటికి నాకు పదేళ్లు వచ్చాయి. నేనేమీ చిన్న పిల్లవాడిని కానన్న ధీమా వచ్చేసింది. పాఠ్యపుస్తకాల్లోని చిన్న చిన్న పద్యాలు నేర్చుకోవడం అబ్బింది. అప్పుడప్పుడు సినిమా పాటలు కూడా పాడుతుండేవాడిని. భక్తప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడు పాడిన పద్యాల్లో కొన్ని కంఠస్తం చేయగలిగాను. ఎప్పుడైనా బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు, `మా వాడు భక్తప్రహ్లాద సినిమాలో పద్యాలు భలేగా పాడతాడు...’ అంటూ నలుగురి ముందు అమ్మ గొప్పగా చెప్పేది. దీంతో నాకు బోలెడు ధైర్యం వచ్చేది. `అవును, పాడతాను’ అంటూ రెడీ అయ్యేవాడినన్న మాట. అమ్మో, నాన్నో అప్పుడప్పుడు మన ప్రతిభ గురించి గొప్పగా చెబుతుంటే హుషారు వచ్చేస్తుందనీ, దీంతో పిల్లలు ఆ పని పట్ల ఆసక్తి పెంచుకుంటారని కొంత మంది తల్లిదండ్రులకు తెలియదనుకోండి.
`జీవము నీవే కదా
బ్రోచే భారము నీవే కదా...’
అంటూ సాగే పాట అంటే నాకు బోలెడు ఇష్టం.
ఈ పాట ఎవరన్నా పాడమనగానే పాము ఎక్కడుందా అని వెతుక్కునే వాడ్ని. నిజం పాము కోసం కాదనుకోండి. పాము లాగా మెడలో ఓ చిన్న తాడో, రిబ్బనో వేసుకునేవాడ్ని. చక్కగా చేతులు జోడించి కళ్లు తన్మయత్వంతో మూసుకుని `జీవము నీవే కదా..’ అని పాడుతుంటే విన్నవారు భలేగా మెచ్చుకునేవారు.
నలుగురిలో భయం లేకుండా పాడటం, మాట్లాడటం అలా అలవాటైందన్న మాట. ప్రహ్లాదునిగా నేను పాడిన పద్యాలు విన్న మా చిన్న మామయ్య ఓసారి మెచ్చుకోవడం నాకిప్పటికీ గుర్తే. స్టేజి ఫియర్ పోవడానికి ఇలాంటి సంఘటనలు పనికొచ్చాయని తర్వాత అర్థమైంది.
లవకుశ, భక్తప్రహ్లాద చెప్పిన తర్వాత నమ్మిన బంటు గురించి చెప్పకుండా ఉంటే ఎలా, పైగా మా నాన్న మాకు చూపించిన మొదటి సినిమా కదా.
నాన్న - నమ్మిన `బంటు’:
మా నాన్నగారు సినిమాల గురించి ఇంట్లో మాట్లాడటం నేను వినలేదు. అలాంటి ఆయన ఓ రోజున `సినిమాకి బయలుదేరండర్రా’ అంటూ ఓ ఆజ్ఞలాంటిది ఇచ్చారు. ఈ మాటతో అందర్నీలోనూ బోలెడు సంతోషం వేసినా పైకి మాత్రం గంభీరంగా ఉంటూ ఎవరికి వారం తయారవుతున్నాము. మా నాన్న నోట మరో మాట కూడా వచ్చింది. `మనం ఫోటో కూడా తీసుకుంటున్నాం, కాస్త బాగా తయారవ్వండి’ ఆశ్చర్యం, ఆనందం కలిసి ఆకాశంలో చెట్టాపట్టాలేసుకున్నాయి.
సాయంత్రం ఐదు కాగానే నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చేసి హడావుడిగా బయలుదేరదీశారు. అప్పుడు మేమున్నది గుంటూరులోని బ్రాడీపేటలో అన్న మాట. రెండు రిక్షాల్లో బయలుదేరాము. ఒక రిక్షాలో అమ్మా నాన్న కూర్చుంటే, రెండో రిక్షాలో ముగ్గురు పిల్లలం కూర్చున్నాము. రిక్షా బ్రాడీపేట దాటి ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి క్రిందకు దిగి ఏసీ కాలేజీ, జిన్నా టవర్ మీదగా రాధాకృష్ణా పిక్చర్ ప్యాలెస్ దగ్గరకు వెళ్ళింది. అక్కడకు దగ్గర్లోనే ఉన్న ఓ ఫోటో స్టూడియోలో మేమంతా గ్రూప్ పోటోలు దిగాము. ఇదే మా మొట్టమొదటి ఫ్యామిలీ ఫోటో అన్నమాట. అక్కడి నుంచి సినిమా హాల్ కి తీసుకువెళ్ళారు. ఈ సినిమా హాలుకి ప్రక్కనే వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. నాన్నగారు ఈవో కనుక ఆలయంతో పాటు ఈ సినిమా హాలు వాళ్ల దగ్గర పలుకుబడి ఉన్నట్లుంది. మేము రాగానే హాలు వాడు మమ్మల్ని వీఐపీల్లా లోపలకి తీసుకువెళ్ళి, రిజర్వ్ క్లాస్ లో ఒక మూలన ఉన్న ఐదు సీట్లు చూపించాడు. ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ బాటిల్స్ వచ్చాయి. ఇంతకీ మేము చూసిన ఆ సినిమా ఏమిటో తెలుసా..
నమ్మిన బంటు. అక్కినేని, సావిత్రి నటించిన చిత్రం. ఆ వయసులో సినిమా కథ అర్థం కాలేదు కానీ, నాన్నగారు సినిమా పూర్తిగా చూడకుండా మధ్యమధ్యలో లేచి బయటకు వెళ్లడం మేము గమనించాము. ఆ తర్వాత అమ్మని అడిగాను. ఎందుకని నాన్న అలా చేశారని. `మరేం లేదురా, హాలు ప్రక్కనే గుడి ఉంది కదా. ఈయన ఆఫీస్ పని చేసుకుంటూనే మనకు సినిమా చూపించార్లే’ అంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతోంది `నమ్మిన బంటు’ అంటే ఏమిటో, ఎవరో.
గుంటూరులోనే మరికాస్త పెద్దయ్యాక ఆ రోజుల్లో కొత్తగా కట్టిన రంగమహల్ థియేటర్ లో నేనొక్కడినే సినిమాకు వెళ్ళాను. ఇదో సాహసమే. నెల రోజులుగా అమ్మ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు పోగేసి ఓ రోజు ఫ్రెండ్ వాడింటికి వెళుతున్నానని చెప్పి మాట్నీ వేళకు రంగమహల్ కి చేరుకున్నాను. ఈ థియేటర్ లో హిందీ సినిమా ఆడుతోంది. శేషమహల్ కి ప్రక్కనే ఉంటుంది ఈ రంగమహల్. కొత్త థియేటర్ భలేగా ఉంటుందిరా అని స్కూల్లో ఫ్రెండ్స్ చెప్పడంతో ఈ సాహసం చేశాను. ఆ హిందీ సినిమా గొప్పదేమీ కాదు. లోపలకు వెళితే అసలు జనం లేరు. నాకు భయం వేసింది. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. దీనికి తోడు హిందీ కావడంతో కథ అర్థం కాలేదు. సినిమాలో కాసేపు పల్లెటూరి వాతావరణం, అంతలో మరి కాసేపు పట్నం సీన్లు దొర్లాయి. అరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అంతలో పాడుకుంటున్నారు. చేతికి వాచీ పెట్టుకునేటంతటి పెద్దోడిని కానుగా నేను. మాట్నీ షో అయినా గేట్లు మూసేసి చీకటి చేయడంతో కాసేపు ఆవగానే టైమ్ ఎంతైందో తెలియక బయట చీకటి పడిపోయిందేమో, అమ్మనాన్న అరుస్తారేమే అన్న దిగులు ఎక్కువైంది. నా అదృష్టం పండింది. ఇంటర్వెల్ కార్డ్ పడింది. లైట్లు వెలిగాయి. తలుపులు తీశారు. నేను పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశాను. గేటు వాడ్ని బతిమాలి రోడ్డెక్కాను. తీరా చూస్తే ఇంకా ఎండ బాగానే ఉంది. మిగతా సినిమా చూడకుండానే ఇంటికి చేరాను. ఇంట్లో వాళ్లు నా సాహసం గుర్తించలేదు. ఇలాంటి సాహసకృత్యాలు గుర్తించినా వారు మెచ్చుకోరు కదా. అందుకే కొన్ని సాహసా కార్యాలు మనలోనే ఉండిపోతాయన్న మాట.
పెద కాకాని తిరనాళ్లకు వెళ్ళినప్పుడు 16ఎంఎం ప్రొజెక్టర్ తో వేసిన సినిమాని వీధిలో చూశాను. అదో వింత అనుభవం. సినిమా అంటే హాల్ కి వెళ్ళాలన్న పద్ధతికి భిన్నంగా వీధిలోనే చిన్న తెరగట్టి దాంట్లో సినిమా చూపించడం విడ్డూరంగానే అనిపించింది. చిన్న తెరమీద సత్య హరిశ్చంద్ర , సత్యమేవ జయతే వంటి సినిమాలు చూశాను. స్కూల్ లో చదువుకుంటున్న రోజుల్లో ఎడ్యుకేషన్ మూవీస్ అంటూ వీటిని చూపించే వారు. అలాగే కొన్ని సినిమాలకు స్టూడెంట్ కన్సెషన్ ఉండేది. గుంటూరు హరిహర మహల్ లో ఓ సారి విద్యార్థులకు పావలాకే సినిమా (`నిండు సంసారం’ అనుకుంటా) చూపించారు. ఇలా సినిమా ముచ్చట్లు ఇంకా చాలానే ఉన్నాయి. సందర్భోచితంగా మరి కొన్ని చెబుతాను.
(మళ్ళీ కలుద్దాం)
11, జూన్ 2024, మంగళవారం
11వ భాగం : `బెల్ట్'మాష్టార్
రెండవ పానిపట్టు యుద్ధం..
హూఁ.. మొదటి పానిపట్టు యుద్ధమే బుర్రలోకి ఎక్కలేదు. ఇంతలో రెండవ పానిపట్టు యుద్ధమా? హతవిధి. ఈ సోషల్ బుక్ తెరిస్తే చాలు యుద్ధాలు, చంపుకోవడాలు, ఎప్పటివో ఆ సంవత్సరాలు, తేదీలు.. ఎన్నడూ వినని విచిత్రమైన పేర్లు. పైగా పేరుకి ముందు ఒకటవ రాజు, రెండవ రాజు, మూడవ వాడు..అంటూ రైలుకి బోగీలు తగిలించి నెంబర్లు అతికించినట్లు ఈ అంకెలగోల ఒకటి.. ఓహ్, పుస్తకం తెరవగానే నిద్ర ముంచుకు వచ్చేస్తుండేది. రాదా మరి.
కానీ ఏం చేస్తాం. పరీక్షలు-మార్కులు అనే రెండు గ్రహాలు పట్టి పీడిస్తుంటే, అనుభవించక ఏం చేస్తాం. ఈ మార్కుల యజ్ఞంలో సమిధలం కాక తప్పదు. సోషల్ పుస్తకంలో చరిత్రే కాదు, మిగతావి కూడా అంతే. మొత్తం మీద సోషల్ పుస్తకం ఓ బండరాయి.
సరిగా ఇలాంటి అభిప్రాయాలే ఉండేవి నేను హైస్కూల్ లో చదువుకునే రోజుల్లో. `ఆ టెన్త్ కాస్తా గట్టెక్కిస్తే ఈ సోషల్ ఆ హిందీ, గొడవ పోతుందిరా' అంటూ భవిష్య దర్శనం చేయించేవాడు ఓ ఫ్రెండ్. నాకు నచ్చని సబ్జెక్ట్స్ మూడు. అందులో ఈ సోషల్ ఒకటైతే, లెక్కలు, హిందీ మిగతా రెండన్న మాట.
లెక్కల చిక్కులు:
సోషల్ ఇలా ఉంటే, ఆ లెక్కలేమో మరీ గందరగోళం. అందులో అర్థమెటిక్స్ మరీ బోరు. ఆల్జీబ్రా అంటే గుండె గాబరా. నందిగామ హైస్కూల్ లో చదువుతున్నప్పుడు లెక్కలు చెప్పడానికి ఇద్దరు మాష్టార్లు మాకొస్తుండేవాళ్లు. వారిలో ఆల్జీబ్రా చెప్పడానికి వచ్చే భూపతి రావు మాష్టారంటే మాకు హడల్. ఆయన క్లాస్ రూమ్ లోకి ఎంటరవుతూనే తనప్యాంట్ కి బిగించి కట్టుకున్న బెల్ట్ తీస్తూ `ఓరేయ్..' అంటూ కేకలు పెడుతూ ఆకలిగొన్న సింహం, లేగ దూడలపై దాడికి దిగేటప్పుడు గర్జనతో దూకేసినట్లుగా వచ్చేవారు. నాబోటి బక్క ప్రాణులకు ఆయన వస్తున్నాడంటేనే హడల్.
క్లాస్ రూమ్ లోకి వస్తూనే..
`ఓరేయ్, నువ్వు లే...'
పాపం సదరు ప్రాణి లేచి నిలబడేది.
`ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంతరా?'
ఆ ప్రాణి గుటకలు మింగేది. వెర్రి చూపులు చూస్తుంటే.. ఆ క్షణంలో ఛళ్లున బెల్టు దెబ్బ తగిలేది. ఆ ప్రాణి కళ్లలో నీళ్లు ఉబికేవి.
క్లాస్ లో పొట్టిగా ఉన్న వాళ్లు ముందు వరసల్లో కూర్చుంటే పొడుగ్గా ఉన్న వారు వెనక బెంచీలు ఆక్రమించేవారు. ఇక్కడా నాకు దురదృష్టమే వెంటాడేది. నేను కాస్తంత పొట్టే. అందుకని మొదిటి రెండు వరుసల్లోని బెంచీల్లోనే కూర్చునే వాడ్ని. ఈ మాష్టార్లున్నారే, వీళ్ల దృష్టి అంతా మొదటి రెండు వరసల్లోని పిల్లకాయల మీదనే. దీంతో ఫస్ట్ బెంచీల పిల్లకాయల గుండెకాయలు ఇలాంటి మాష్టారు ఎంటర్ కాగానే అదిరేవి.. బెదిరేవి.
ఫస్ట్ బెంచోళ్లలో ఒక రకమైన భయంతో కూడిన భక్తి బాగా ఉండేది. మాష్టార్ల చూపు ముందుగా పడేది మనమీదనే అని బాగా అర్థం కావడంతో ఎందుకైనా మంచిదని రేపటి పాఠాలు ఇవ్వాళే నేర్చుకునే ప్రయత్నం చేసేవారు. ఈ ముందు చూపు వల్లనే మాష్టారు అడగ్గానే ఠక్కున చేయెత్తి చెప్పడానికి సిద్ధమయ్యే వారు. ఈ "భయంతో కూడిన భక్తి" కారణంగానే ఫస్ట్ బెంచీల వాళ్లకు బాగా చదువుతారన్న పేరు వస్తున్నదని పెద్దయ్యాక, లోతుగా ఆలోచించాక నాకు అర్థమైన సత్యం.
సరే, మాష్టార్లలో రకరకాల వాళ్లు ఉంటారని ఒక్కొక్క క్లాస్ ఎదుగుతుంటే క్లియర్ గా అర్థమవుతుంటుంది. పిల్లల్ని మందలించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రైల్. ఒకరేమో చాక్ పీస్ టీచర్ (కోపం వస్తే చాక్ పీస్ ముక్కలు విసిరేసే టీచర్ అన్న మాట), డస్టర్ టీచర్ (కోపం వస్తే చాలు చేతిలోని డస్టర్ విసిరేసే వారు) అలాగే నోట్ బుక్ టీచర్, బెత్తం టీచర్, బెల్ట్ టీచర్ ఇలా ఉండే వారు. కొంత మంది టీచర్లు శాంతమూర్తుల్లా, సహనానికి మారుపేరుగా ఉండే వారు. ఇంకొంత మంది చిటపటేశ్వర్రావ్ లేదా చిటపటేశ్వరీల్లా కనిపించే వాళ్లు. కనుక, టీచర్లలో బెల్ట్ టీచర్ వేరయా అని చెప్పడానికే ఇదంతా రాస్తున్నానని మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారు. తెలుగు పాఠాలు చెప్పే పంతులమ్మ శాంతంగా కుర్చీలో కూర్చుని అంతే శాంతంగా పాఠాలు చెప్పి, కథలు వినిపించి నాబోటి వాళ్లలో తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించేది. అదే లెక్కల మాష్టారు అదే నండి భూపతి రావు మాష్టారిని చూడగానే ఒళ్లంతా చెమటలు పట్టేవి.
భయం మాయం:
మొదటి బెంచీలో కూర్చున్న నేను వణకిపోతున్నాను. బెల్టు చేతిలో ఊగుతూ నా దగ్గరకే వస్తున్నది. అది యమపాశంలా ఊగుతోంది, నా గుండేమో అదురుతోంది.
`లేరా, భూషణం లే..'
ఎలా లేచాను తెలియదు.
`చెప్పరా... ఏ ప్లస్ బి హోల్ స్క్ర్వేర్ సూత్రం చెప్పు'
ఆ సింహగర్జనకు పై ప్రాణాలు పైనే పోయేటట్టున్నాయి.
అయినా, ధైర్యం తెచ్చుకున్నాను. ఆ ధైర్యం నా గుండెలో నుంచి రాలేదు. మెదడు లోంచి వచ్చింది. అలా ఎందుకంటే, ఆ సూత్రం నేను బట్టీ పట్టానుగనుక. ఇంట్లో చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను. కానీ ఇప్పుడు చెప్పగలనా లేదా అన్న సందేహం మాత్రమే మిగిలింది.
నా ఆకారం, నా భయం తెలిసిన మాష్టారు కనుక కాస్తంత శాంతించారు. బెల్టు ఆయన వెనక్కి వెళ్ళిపోయింది. ముఖంలో ఎగతాళి లాంటి నవ్వొకటి కనిపించింది. సినిమాల్లో అప్పుడప్పుడు విలన్ గాళ్లు కూడా నవ్వుతుంటారే అలా అన్న మాట.
చాలు, ఆ మాత్రం నవ్వు చాలు. నా మెదడుకి పనిచెప్పాను. మెదడు నుంచి సంకేతాలు అందుకున్న స్వరపేటిక విచ్చుకుంది. అంతే, పెదాలు కదిలాయి. సూత్రం చెప్పేశాను.
మాష్టారు విన్నారు. సంతృప్తి ముఖంలో కనిపించి, అంతలో అదృశ్యమైంది. నవ్వు మాయమైంది. మరో అస్త్రం సంధించారు ఈ బక్క ప్రాణిమీద.
`ఊహ్.. సరే, ఇది చెప్పు..
ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ సూత్రం..' అలవాటుగా బెల్ట్ పైకి గాలిలోకి లేచింది.
అప్పటి వరకు యాక్టీవ్ గా ఉన్న మెదడు మొద్దు బారింది. అంతే గుండె జారినట్లనిపించింది. చమటలు పట్టేశాయి. ఈ క్షణమో, మరు క్షణమో కుప్పకూలడం ఖాయం అనుకుంటుండగా...
పైకి లేచిన మాష్టారి చేయి ఆలోచనలో పడింది. "ఊ... కొడితే చచ్చేటట్టున్నావ్ కూర్చో" అన్నారు.
ఆ తర్వాత కాసేపటికి గానీ దడ తగ్గలేదు. ఇలా ఉంటుంది ఆయన క్లాస్. కానీ మర్నాడు ఇదే సూత్రం అడిగితే తప్పకుండా తడబడకుండా చెప్పాలని ఆ క్షణమే గట్టిగా అనుకున్నాను. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేశాను. ఓ ఇరవై ముప్పయి సార్లు వల్లె వేయడం, వ్రాయడం వల్ల సూత్రం ఒంట బట్టింది. మర్నాడు మాష్టారు మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. అడిగితే చస్తాడేమో అన్నట్లే ఉందీ ఆ చూపు. అయినా మాష్టారు కదా, అందునా బెల్ట్ మాష్టారాయే. ఆగరు. బెల్ట్ తీయకుండా ఉండలేరు.
`నిన్న అడిగిన సూత్రం నోటికి వచ్చిందా ?' అలా అడిగినప్పుడు ఆయన అసలు ఊహించి ఉండరు. ఈ బెదురు గొడ్డు గడగడా చెప్పేస్తుందని. అప్పటి నుంచి ఆయన నా పట్ల కాఠిన్యం వహించలేదు. ఇలా అనేదానికన్నా, ఆ బెల్ట్ ని చూస్తే నాకు అదివరలోలాగా భయం ఆవహించేది కాదంటే సబబుగా ఉంటుంది. భయం పోవడం వల్ల ఆల్జ్రీబ్రాలో పట్టు వచ్చంది. అదే టెన్త్ పరీక్ష గట్టెక్కించేలా చేసింది. అర్థమెటిక్స్ లో ఆ లెక్కలు నాకు అర్థమయ్యేవి కావు. ఏమిటో ఒక రైలు వస్తుంటుందట. ఆ రైలు పొడవు, వేగం ఇస్తారు. రైలు పట్టాల పక్కన ఓ సిగ్నల్ స్తంభం ఉంటుంది. ఈ రైలేమో ఆ స్తంబం దాటి వెళ్ళిపోతుంది. అయితే ఎంత సేపట్లో స్తంభం దాటి వెళుతుందన్నది లెక్క.
నాకేమో అంతా గందర గోళంగా అనిపించేది. అలాగే మరో లెక్కలో ఒక మేకను పచ్చిక మైదానంలో యజమాని గుంజకు కట్టేస్తారు. ఆ మేక ఎంత మేరకు గడ్డి తింటుందో చెప్పమనేవారు. ఇలాంటి లెక్కలను జీవితంలో ఎప్పుడూ మరిచిపోను. ఇప్పటికీ రైలెక్కి ఏ ఊరువెళుతున్నా, కిటీకీ లోంచి బయటకు చూస్తున్నప్పుడు స్తంభాల్లాంటివి కనబడగానే "రైలు - స్తంభం" లెక్క గుర్తుకు వస్తూనే ఉంటుంది. అలాగే ఆవులనో గేదెలనో పచ్చగడ్డి మైదానంలో కట్టేస్తే అవి గడ్డి తింటున్నట్లు కనబడితే చాలు, ఇందాక ప్రస్తావించిన ఆ రెండో లెక్క గుర్తుకు వస్తుంటుంది. అంటే, జీవితంలో ఇలాంటి లెక్కలు ఉపయోగపడతాయనే అనిపించేది. కాకపోతే నాకే బుర్రకెక్కలేదు. అంతే. స్కూల్లో చదివేటప్పుడు టీచర్లలో కొంత మంది ప్రభావం జీవితం చివరి వరకు ఉంటుంది. మరి కొందరి వల్ల చదువు పట్ల ఆసక్తే సన్నగిల్లుతుంటుంది. కొట్టినా, తిట్టినా అంతలో విద్యార్థులను ప్రేమిస్తూ వారికి ఇంకా బాగా అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పిన మాష్టార్లను ఎప్పటికీ గుర్తుతెచ్చుకుంటూనే ఉంటాము. మాష్టారు వల్ల నాకు ఆల్జ్రీబ్రాలో పట్టు రావడమే కాదు నేను టెన్త్ లెక్కల్లో పాస్ కావడానికి ఈ సంఘటన అక్కరికి వచ్చింది. లెక్కల సబ్జెక్ట్ కి రెండు పేపర్లు ఉండేవి. మొదటి పేపర్ 50 మార్కులకు అర్థమెటిక్స్ ఉంటే మరో 50 మార్కులకు ఆల్జీబ్రా ఉండేది. ఇందాకే చెప్పానుగా. అర్థమెటిక్స్ మన బుర్రకెక్కలేదు. ఆ పేపర్ పూర్తిగా చెడగొట్టాం. ఎలా అంటారా..
లెక్కల పరీక్షకి రంగు పెన్సిల్స్ :
లెక్కల పరీక్షలో బొమ్మలు వేసి, వాటికి రంగులు దిద్దే వాడ్ని మీరెక్కడైనా చూశారా? చూసి ఉండర్లేండి. ఎందుకంటే నా లాంటి వాడు మీకు తారస పడి ఉండకపోవచ్చు. టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ లో మాథ్స్ మొదటి పేపర్ రాయడానికి వెళ్ళాను. వెళ్లేటప్పుడు రంగు పెన్సిల్ ఉన్న బాక్స్ కూడా తీసుకు వెళ్ళాను. `ఇవెందుకురా' అని ఫ్రెండ్స్ ఆశ్చర్యంతో అడిగారు, నేను పట్టించుకోలేదు. లెక్కలు ఎలాగో సరిగా చేయలేం కదా, నీట్ గా బొమ్మలేసి పేపర్ దిద్దేవాడ్ని బుట్టలో వేసుకోవాలన్నది నా ప్లాన్. ఇది అందరికీ చెప్పకూడదు కదా. సీక్రెట్ ప్లాన్ అన్న మాట. చెబితే వాళ్లూ పేపర్లు దిద్దే వాడిని బుట్టలో వేసుకుంటారు కదా. అందుకన్న మాట. నేను కామ్ గా నా వ్యూహం అమలు చేస్తున్నాను.
కొశ్చిన్ పేపర్ ఇచ్చారు. నాకు వారిచ్చిన లెక్కల్లో చాలా మటుకు ఎలా చేయాలో తెలియదు. కొశ్చిన్ పేపర్ లో రైలు లెక్క ఇచ్చారు. సరే, పెన్ను తీసుకున్నాను. రైలు బొమ్మ గీశాను. దాని పొడవు ఎంతో వ్రాశాను. మధ్యలో ఎలక్ట్రిక్ స్తంభం బొమ్మ కూడావేశాను. బొమ్మ బాగుండాలని రైలుకి ఆ ప్రక్కా, ఈ ప్రక్కా పచ్చిక మైదానం లాంటిది, దూరంగా కొండలు వంటివి వేశాను. సంపూర్ణ చిత్రం రెడీ. `లెక్కల్లో ఈ బొమ్మలేమిటీ..? లెక్క చేయకుండా' అనుకున్నాడేమో ఇన్విజిలేటర్ చీటికీ మాటికీ వచ్చి చూసి బోలెడు ఆశ్చర్యపోతున్నాడు. బొమ్మ బాగా వచ్చిందని సంతృప్తి చెందాను. కలర్ పెన్సిల్స్ తీసుకుని రైలు ఇంజన్ కీ, రైలు పెట్టలకు రంగులు అద్దాను. పచ్చిక మైదానం, చెట్లు కొండలకి కూడా రంగులు పులిమాను. శహభాష్ రా అంటూ నా భుజం నేనే తట్టుకుంటుంటే, ఆ ఎన్విజిలేటర్ ఎవరితోనో అంటున్నాడు, `చూడు, ఆ రెండో బెంచ్ లో కూర్చున్న కుర్రాడు లెక్కల్లో తప్పడం ఖాయం. కావాలంటే రాసిస్తాను'
కొంత మంది చెప్పే మాటలను దేవుడు వినడు. ఆయన చెప్పింది జరగలేదు. నేను టెన్త్ ఫస్ట్ ఎటెంప్ట్ లోనే పాసయ్యాను. ఇదెలా జరిగింది ! మొదటి పేపర్ ని పూర్తిగా చెడగొట్టిన నేను మర్నాడు ఆల్జీబ్రా తదితర అంశాలతో కూడిన పేపర్ వ్రాయాలి. ఆ సాయంత్రం ఇంటి ఆరుబయట నులక మంచం వాల్చుకుని వెల్లికిలా పడుకుని ఆకాశం వైపు చూసాను. మబ్బులు ఏదో తొందర పని ఉన్నట్లు వేగంగా పరిగెడుతున్నాయి. నా కళ్లలో నీళ్లు అంతే వేగంగా లోపలి నుంచి తన్నుకుంటూ బయటకు వస్తున్నాయి. నా పరిస్థితి మా అన్నకు అర్థమైంది. బీఎస్సీలో డబుల్ మాథమెటిక్స్ ఫిజిక్స్ (దీన్ని ఎంఎంపీ గ్రూప్ అంటారు)తో పాసైనవాడు. ఆ రోజు రాత్రి ముఖ్యమైన లెక్కలు నా చేత చేయించాడు. తప్పులు సరిదిద్దాడు. బిట్స్ ఏవేవి రావచ్చో చెప్పాడు. తెల్లారింది. పరీక్షకు వెళ్ళాను. ఇన్విజిలేటర్ నన్ను అదోలా చూశాడు. `వచ్చాడూ, పెద్ద పోటుగాడిలా..' అని అనుకున్నట్లున్నాయి ఆ చూపులు. కానీ ఎక్స్ ట్రా పేపర్లు తీసుకుని తెగ రాసేస్తుంటే పాపం బిత్తరపోయాడు. చివరకు ఈ రెండో పేపర్ వల్ల వచ్చిన మార్కులతోనే నేను టెన్త్ గట్టెక్కాను. బెల్ట్ మాష్టారుకీ, చివర్లో హెల్ప్ చేసిన అన్నకి మనసులో థాంక్స్ చెప్పుకున్నాను.
బెల్ట్ మాష్టారు కారణంగా నాకో విషయం అర్థమైంది. గట్టిగా కృషి చేస్తే ఎంతటి కఠినమైన పని అయినా సులువు అవుతుందన్న సత్యం తెలిసి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఆ తర్వాతి కాలంలో నాటకాలు గట్రా వేసినప్పుడు డైలాగ్ లు కచ్చితంగా చెప్పడానికి కావలసిన పట్టుదల ఇచ్చాయి. అలాగే ఏదైనా వ్యాసం రాయాలన్నా ముదస్తు కసరత్తు పకడ్బందీగా ఉండే తత్వం అలవాటైంది. అంతే కాదు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలన్న నిబ్బరం అలవడటానికి ఈ బెల్ట్ మాష్టార్లాంటి వాళ్లు ఉపయోగపడతారని ఆ తర్వాత అర్థమైంది. నా జర్నలిజం కెరీర్ లో కూడా ఇలాంటి వాళ్లు కనిపించారు. వారి వల్ల పునాదులు గట్టి పడ్డాయి కూడా. అవి తర్వాత చెబుతానులేండి.
మరో ఆశ్చర్యం :
మరే, లెక్కల వల్ల నాటకాలు వేయగలిగినట్లే, సోషల్ వల్ల నాలోని నాటక రచయిత మేల్కొన్నాడు. ఇది ఇంకో ఆశ్చర్యం. చదువుతున్నప్పుడు మీకు ఆశ్చర్యం కలగవచ్చు. నా జీవితంలో అలా జరగకపోతే నేనూ కూడా ఆశ్చర్యపోయే వాడిని మీలాగేనూ.
మరో వారంలో పరీక్షలు రాబోతున్నాయి. ఆటలు ఆపేసి పుస్తకాలు పట్టుకోమని ఇంట్లో వాళ్లు పోరాడుతున్న రోజులు. ఓ సారి మా ఇంటి వరండాకి కుడివైపున ఆనుకుని ఉన్న చిన్నగదిలో చాప పరుచుకుని ఒక వైపు గోడకి ఆనుకుని చదువుకుంటున్నాను. చదువుకి ఏ మాత్రం ఇబ్బంది కలగకూడదని తలుపు వేశాను. తొమ్మిదో తరగతి చదువుతున్నాను. సోషల్ టెక్స్ట్ బుక్ తీశాను. అందులో హిస్టరీ అంటే నాకు మిస్టరీగా కనిపించేది. అయినా చదవాలి. తప్పదు. ఈ అక్బరేమిటో, ఆ బాబర్ గాడేమిటో, చోళులంతా ఎవరో, పల్లవుల గోలేమిటో నాకు ఒక పట్టాన అర్థంకాక పుస్తకంలోని అక్షరాలతో కుస్తీ పడుతున్నాను. అంతలో తలుపు చప్పుడైంది. అటు చూశాను.
నా వయసువాడే, నా ఫ్రెండే వాడు. నెమ్మదిగా గదిలోకి వచ్చాడు. వాడి పేరు రాధాకృష్ణ.
వాడు మాట్లాడుతుంటే అదో గమ్మత్తుగా ఉంటుంది. ప్రతి మాటా సాగదీస్తుంటాడు. వాడి మాటలు చాలా అమాయకంగా ఉండేవి. చేష్టలు అంతే. ఎందుకో తెలియదు నేనంటే గురి. నా మాటే వాడికి శాసనం. నా చుట్టూనే తిరిగేవాడు. మా ఇంట్లో వాళ్లతో బాగా కలిసిపోయాడు.
`ఏం చదువుతున్నావు రా..'
`అదేరా సోషల్ .. చరిత్ర..'
`ఓరేయ్, నాకూ చెప్పరా. అర్థం కావడం లేదు'
`ఏం చెప్పమంటావు?'
`నువ్వు ఏది చదువుతావో అదే నాకు చెప్పరా' అన్నాడు వాడు.
నాకో లక్షణం ఉంది. నేను ఒంటరిగా చదువుకుంటున్నా, మనసులో చదువుకోను. పైకి చదువుతుంటాను. అది కూడా ఎదుటి వాడికి చెబుతున్నట్లు ఉంటుంది. అందుకే వింటుండే వాళ్లకి నాలో నేను మాట్లాడుకుంటున్నట్లు ఉండేది. ఈ లక్షణం వాడికి ఇష్టం అన్న మాట. నేను కాసేపు చదువుకుందాం అనుకున్నప్పుడల్లా వీడు రావడం మామూలే.
`ఇంట్లో అటక మీద గోళీలు ఉన్నాయి తీసుకు రారా..'
నా మాట వాడికి ఆజ్ఞ లాంటిదన్న మాట. అదేంటో జీవితంలో కొంత మందితో అనుబంధం అలా అతుక్కుపోతుంది, తుమ్మ జిగురులా.
గోళీల ఆటల్లో..
గోళీల ఆటల్లో కొండంత సత్యం అవగతం కాకున్నా, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికీ, జీవితంలో కొన్ని సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఈ ఆటలు పనికొచ్చాయి. అదెలోగో చెబుతాను.
నా మాట పూర్తి కాకముందే రాథాకృష్ణ ఇంట్లోకి దూరిపోయాడు. వాడికి బాగా తెలుసు గోళీల డబ్బా ఎక్కడ ఉందన్నది. పరీక్షలు వస్తున్నాయి కదా. గోళీలు, బచ్చాలు, బంతాటలు ఆడకుండా బుద్ధిగా చదువుకోవడానికని ఇంట్లో 144వ సెక్షన్ లాంటిదేదో అమలు పరిచేశారు. ఆంక్షలు పెట్టేశారు. ఈ ఆంక్షలు ఇలా ఉండేవి...
* ఇద్దరి కంటే ఫ్రెండ్స్ ఇంట్లోనూ, ఇంటి ఆవరణలోనూ గుమిగూడకూడదు.
* ఒకరిద్దరు ఫ్రెండ్స్ వచ్చినా వారితో చదువుకు సంబంధించిన కబుర్లు తప్ప సినిమా కబుర్లు చెప్పుకోకూడదు.
* డౌటనుమానాలు వచ్చాయంటూ పదే పదే ఫ్రెండ్స్ ఎవ్వరూ ఇంటికి రాకూడదు.
* అలాగే, డౌటొచ్చిందని చీటికీ మాటికీ బయటకు వెళ్లకూడదు.
* ఒక వేళ బయటకు వెళ్ళి మూడు గంటల తర్వాత వచ్చే పక్షంలో స్మెల్ డిటెక్టర్ తో పరీక్షించబడతారు. (ఈ స్మెల్ డిటెక్టర్ ఏమిటో, సినిమాకు వెళ్ళి వస్తే ఎలా ఈ డిటెక్టర్స్ పని చేస్తాయో చెబాతాన్లేండి)
* సినిమా పత్రికలు, సినిమా పోస్టర్స్, పాటల పుస్తకాలు వంటివి నిషేధించబడ్డవి.
* చదువు మధ్యలో టీ త్రాగొస్తామని చెప్పి బయటకు వెళితే అరగంటలో తిరిగి రావాలి.
* ఇంట్లో ఉన్న ట్రాన్సిస్టర్ రేడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకునే సమయాల్లో ఇవ్వబడదు.
ఇలాంటి ఆంక్షలు మరికొన్ని అమల్లో ఉండేవన్న మాట.
స్మెల్ డిటెక్టర్లు :
పరీక్షలొస్తున్నాయంటే చాలు ఇంట్లో స్మెల్ డిటెక్టర్స్ గా కొంత మంది పనిజేస్తుండేవారు. ఎలోగో వీలు చూసుకుని సినిమాకి చెక్కేసి ఇంటికి వస్తే ఈ స్మెల్ డిటెక్టర్లు పట్టేసేవి. కచ్చితంగా దొరికిపోతామని మాకూ తెలుసు. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ సినిమాలు కొత్తవి వస్తే ఎలా ఆగగలము. పైగా ఏ సినిమా అయినా టౌన్స్ లో లాగా 50 రోజులూ, వంద రోజులు మా ఊర్లో ఆడవాయె. మహా అయితే వారం పది రోజులు ఆడితే గొప్ప. రిలీజ్ అయిన నాలుగో రోజు నుంచే సినిమా బండి వాడు `నేడే ఆఖరాట.. తప్పకుండా చూడండి' అంటూ తెగ కంగారు పెట్టేసే వాడు. కానీ తర్వాత తెలిసిందేమిటంటే, నేడే ఆఖరాట అనగానే మనం తొందర పడనక్కర్లేదు. గ్యారంటీగా నేడే ఆఖరాట అంటూ మైకోడు చెప్పేదాకా ఆగొచ్చు. పైగా మా ఫ్రెండ్ మరో కిటుకు చెప్పాడు. కొత్త బొమ్మ విడుదల తేదీతో సహా గోడల మీద పోస్టర్స్ అంటిస్తారు కదా.. అలా ఈ ఆఖరాట వ్యవహారం పట్టేయవచ్చని అని అనేవాడు. వాడి బుర్ర నిండా ఇలాంటి ఆలోచనలు బోలెడు పుట్టుకొచ్చేవి. కొత్త బొమ్మ సినిమా పోస్టర్ గోడకి అంటించగానే దాన్ని నిశితంగా చూసి మాకు ఆ సినిమా కథ చెప్పేవాడు. నువ్వు చూశావురా..అని అడిగితే లేదురా, పోస్టర్ చూసి చెప్పేయగలను - అంటూ ఫోజులు కొట్టేవాడు. తొమ్మిదో క్లాసంటే ప్రాక్టికల్స్ గట్రా ఉండవు. స్పెషల్ క్లాసులు అంతగా ఉండవు. అదే ఇంటర్ కి వచ్చేసరికి ఇవన్నీ వచ్చేస్తాయి. సైన్స్ గ్రూప్ అంటేనే వారానికి రెండు మూడు ప్రాక్టికల్ క్లాస్ లు తప్పవు కదా. ఒక్కో క్లాస్ రెండు మూడు గంటలు ఉండేవి. సాధారణంగా లంచ్ తర్వాత ఈ ప్రాక్టికల్స్ క్లాస్ లు పెట్టేవారు. అవి అయ్యాక ఆ పూటకి ఇంటికే మరి. లంచ్ తర్వాత అంటే మాట్నీ షోలు మొదలయ్యే సమయం. ప్రాక్టికల్ క్లాస్ ఎగేసినా పెద్దగా గుర్తించరులే అనుకుంటే చాలు, మాట్నీకి చెక్కేయడమే మా పని. ఈ పని చక్కబెట్టడానికీ, నడిపించడానికీ ఓ గ్యాంగ్ ఉండేది. మరి గ్యాంగ్ అంటే లీడర్ ఉండాలి కదా. మా గ్యాంగ్ కి లీడర్ ఉండేవాడు. వాడు సైన్స్ గ్రూప్ కాదు. కానీ వాడు ఆప్టర్ నూన్ క్లాస్ లు ఈజీగా ఎగ్గొట్టేసి జట్టు కట్టి సినిమా హాలు వైపుకి నడిపించడంలో మొనగాడు. వాడి జేబుల్లో ఎప్పుడూ డబ్బులు గలగలలాడుతుండేవి. అలా ఎలా వచ్చేవో మాకు తెలియదు కానీ, వాడు అప్పుడప్పుడు తానే టికెట్ డబ్బులు ఇచ్చేస్తూ మాకు షోలు చూపిస్తుండే వాడు. కానీ కొన్ని షరతులు పెట్టేవాడు.
`ఒరేయ్, నేను టికెట్ డబ్బులు పెడతాను. నువ్వేమో ఇంటర్వెల్ లో ముంత క్రింద పప్పు, పప్పుండలు, గోళీ సోడా ఇంకా సినిమా పాటల పుస్తకం లాంటివి కొనాలేం..' అనే వాడు.
మన దగ్గర వాటికీ డబ్బులు ఉండేవి కావు. `లేవురా, నిజంరా..ఒట్టురా..' వంటి మాటలు ఓ పది పదిహేను సార్లు చెప్పాక వాడి మనసు కరుగుతుంది. నిజంగా ఇది `నిఝం' అని నమ్మేస్తాడు. అప్పుడు ఈ సాదర ఖర్చు కూడా వాడే భరిస్తాడు. అయితే అందరికీ కాదు. వాడికి బాగా విధేయుడిగా ఉన్న వాడికో, బాగా నమ్మిన వాడికో ఇచ్చేవాడు. ఎందుకో తెలియదు కానీ నా మాట తీరు సౌమ్యంగా ఉండటంతో మంచి వాడిననీ, అబద్ధాలు చెప్పనని నమ్మడం వల్లనో నాకు అలాంటి అవకాశాలు తరచుగా వచ్చేవి. అలా ప్రాక్టికల్స్ పేరిట సినిమాలు చూసి ఇంటికి చేరగానే షర్ట్ కి పట్టిన సిగరెట్ పొగ వాసన ఇంట్లో వాళ్లు పట్టేసేవారు. అలా అని మేమోదో సిగరెట్లకు అలవాటు పడ్డామని కాదనుకోండి. సినిమా హాళ్లలో పొగ త్రాగకూడదన్న కార్డులు స్క్రీన్ మీద పడుతున్నా, గోడల మీద వ్రాసి ఉన్నా వాటిని చూడగానే చాలా మందికి దమ్ముకొట్టాలని గుర్తుకు వచ్చేది. హాయిగా దమ్ము కొడుతూ, పొగని రింగులురింగులుగా వదులుతూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేవారు. ఆ రోజుల్లో మా ఊర్లో ఉన్న సినిమా హాళ్లన్నీ మామూలువే. అంటే ఏసీ సౌకర్యం లేనివన్న మాట. సినిమా ప్రారంభం కావడానికంటే ముందు హాల్లో సిగరెట్, చుట్ట, బీడీ పొగలతో మేఘాలు ఏర్పడేవి. అదంతా పెద్ద సీను.
సినిమా చూసి ఇంటికి రాగానే ఇంట్లో అక్కో, అన్నో లేదా ఇంలాంటి ఎవరో ఒకరు `స్మోక్ డిటెక్టర్స్' గా బాధ్యత తీసుకుని మా షర్టుకు పట్టిన సిగరెట్ వాసన పట్టేసి, మేము ప్రాక్టికల్స్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లామని పై వారికి (పెద్దోళ్లకి) రిపోర్ట్ ఇచ్చే వారు. దీంతో ఇకపై ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఏం చేయాలా అని పెద్దోళ్లు ఆలోచనలో పడేవాళ్లు. ఇలాంటి ఆలోచనల వల్లనే ఏటికేడు పరీక్షల సీజన్ లో మాపై విధించే షరతుల జాబితా పెరిగిపోతుండేది.
`ప్రాక్టికల్స్ - సినిమా' అనే ఈ సౌకర్యం టెన్త్ దాకా ఉండదు కదా. అందుకే డౌట్స్ ఉన్నాయంటూ ప్రెండ్స్ ఇంటికనో , టీచర్ ఇంటికనో చెప్పి బయటపడి మ్యాట్నీకి చెక్కేసే వాళ్ళం.
హక్కుల కోసం పోరాటం :
ఇంట్లో ఎగ్జామ్ సెక్షన్ అమల్లో ఉన్న రోజుల్లో ఇదిగో, రాధాగాడు గోళీలు తేవడానికి అందునా అటక మీద దాచిన గోళీల డబ్బాని దించడానికి ఇంట్లోకి వెళ్ళాడు.
పరీక్షలు వచ్చాయంటే చాలు గోళీలే కాదు, ఖాళీ సిగరెట్ ప్యాకెట్ ముక్కలు, కర్రా బిళ్లా వంటి ఆటల పరికరాలనే కాదు, పాటలు పాడే ట్రాన్సిస్టర్ రేడియో పెట్టెని కూడా మాకు అందుబాటులో ఉంచే వాళ్లు కారు. ఇదంతా మా హక్కులను హరించడంలా అనిపించేది. లాభం లేదు, పోరాటం చేయాలి.
`పోరాడితే పోయేదేమీ లేదు' అనో, `అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు' అనో ...ఇలాంటి స్లోగన్స్ చేస్తూ కమ్యూనిస్టు కుర్రాళ్లు అప్పుడప్పుడు వీధుల్లో తిరుగుతుండే వారు. ఇవి వింటుంటే నాకు కూడా ఆవేశం కమ్మేసేది. అయితే ఆవేశం కంటే ఆలోచన అనేదే బాగా పనిచేస్తుందనే ఇదిగో రాధా గాడిని గోళీల డబ్బా తెమ్మనమని చెప్పాను. పరీక్షలకు చదువుకోవాలి. ఈ విషయంలో రాజీ లేదు. అలా అని గోళీలతో కాసేపన్నా ఆడుకోవాలి. ఇక్కడా రాజీ ఉండకూడదు. కానీ ,ఎలా..కిమ్ కర్తవ్యం ?? ఇలా ఆలోచిస్తుంటేనే తట్టింది మెరపు లాంటి ఆలోచన. అందుకే గోళీల డబ్బా తెమ్మనమని రాదా గాడికి పురమాయించాను. చూద్దాం, నా వ్యూహం ఎలా ఫలిస్తుందో..
ఫలించిన వ్యూహం:
రాధా గాడు పిల్లిలా ఇంట్లోకి దూరాడు. మధ్యాహ్నం భోజనాలు కానిచ్చి నడుం వాల్చే సమయం. ఏ మాత్రం అలికిడి కాకుండా అటకెక్కి చిటికెలో గోళీల డబ్బాతో క్రిందకు దిగి, చప్పుడు కాకుండా నేను చదువుకుంటున్న గదికి వచ్చేశాడు. వాడి ముఖంలో విజయగర్వం తొణికిసలాడుతోంది. కాదా మరి, ఇదేమన్నా చిన్నాచితకా విజయమా ఏంటి. నేను వాడి భుజం తట్టాను. వాడేమో పొంగిపోయాడు.
నా ముఖం కూడా విజయగర్వంతో పొంగింది అనుకోండి. ఎందుకంటే ఏ గోళీలను చూస్తే పిల్లగాళ్ల చదువులు సాగవని ఇంట్లో వాళ్లు అనుకుంటూ వాటిని అటకెక్కించారో అవే గోళీలను నేర్పుగా నా వద్దకు రప్పించ గలిగానంటే నా వ్యూహ రచన చూసి నేనే పొంగి పోవాలి కదా. అందుకే నా కుడి చేయి అరచేతిని ఎడమ భుజం పైన తడుతూ `శహబాష్ రా' - అని నాకు నేనే పొగుడుకున్నాను. రాధా గాడు నా వైపు అదోలా చూశాడు.
కాసేపయ్యాక వాకిట ప్రక్కన ఉన్న గదిలో గోళీల చప్పుడు విని మా అక్క నెమ్మదిగా వచ్చి తలుపు తీసి చూసింది. అక్కడున్న దృశ్యం చూసి కంగుతిన్నది. తినదా మరి...
నిజానికి మేమప్పుడు గోళీలతో ఆడుకుంటూనే చదువు కుంటున్నామన్న మాట. ఈ రెండూ ఒకే సారి ఎలా సాధ్యమంటారా..
రెండవ పానిపట్టు యుద్ధం గురించి నేను సోషల్ బుక్ లోని పాఠం బిగ్గరగా చదువుతున్నాను. నాలుగైదు లైన్లు చదివాక అందులో ఉన్న సారాంశానికి తగ్గట్టుగా గోళీలతో సీన్ క్రియేట్ చేసేవాళ్లం.
ఏ యుద్ధమైనా రెండు వర్గాలుంటాయి. చరిత్రలోనైతే ఇద్దరు రాజుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి కదా. నా వద్ద ఉన్న గోళీలను రంగుల వారీగా విభజించడం రాధాగాడి పని. వాడా పని బాగానే పూర్తి చేశాడు. నీలం రంగు గోళీలను అక్బర్ సైన్యంగా ఒక వైపున ఉంచాము. అందులో నీలం రంగు పెద్ద గోళీ అక్బర్ అన్న మాట. రెండో వైపున హేమచంద్ర విక్రమాధిత్య. ఎరుపు రంగున్న గోళీలు, పసుపు రంగు గోళీలు ఇలా ఇంకా మిగిలి ఉన్న ఇతర రంగు గోళీలన్నీ హేమచంద్ర వైపు నిలబెట్టాము. ఇందులో కూడా బాగా పెద్దగా ఉన్న ఎరుపు రంగు గోళీనే హేమచంద్ర విక్రమాధిత్య అన్న మాట.
మా రాధా గాడు `ఒరేయ్, యుద్దం మొదలు పెట్టనా ... ' అంటూ అప్పటికే నాలుగైదు సార్లు అడిగాడు. `ఆగాగు, ఓ రెండు పేరాలు చదవనీ, అప్పుడన్న మాట యుద్ధం' అంటూ ఆపాను వాడిని.
సరే, పానిపట్టు యుద్ధంలో అక్బర్ చేతిలో హేమచంద్ర విక్రమాదిత్య మరణించాడని అని తెలియగానే `యుద్ధం మొదలెట్టు' అంటూ అరిచాను. ఆ అరుపుకే ఇంట్లో వాళ్లు లేచినట్లున్నారు. మెల్లగా ఒకరొకరు గది గుమ్మం దగ్గరకి చేరారు. రాధా గాడు ఎర్ర గోళీలను నీలం గోళీలతో కొడుతున్నాడు. నేనేమో నీలం గోళీలతో ఎర్ర గోళీలను చితక్కొడుతున్నాను. ఇద్దరం చెరో పక్షం చేరిపోయాము. ఆవేశాలు మిన్నంటాయి. యుద్దం జోరుగా సాగింది. కొన్ని గోళీలు నిజంగానే పగిలిపోయాయి.
అప్పుడు అడ్డం తగిలింది మా అక్క.
`చాల్లే ఆపండిరా మీ ఆటలు. నాన్న చూశారంటే అరుస్తారు'
`ఆటలు కావే అక్కా, చదువే' - అన్నాను నేను.
`అవునక్కా, చదువే' వంత పాడాడు రాధాగాడు.
ఇంతలో అమ్మా, బామ్మ కూడా అక్కడికి చేరి మేము సృష్టించిన యుద్ధ సన్నివేశాన్ని చెల్లా చెదురు చేశారు. అక్కేమో గోళీలన్నింటినీ నిర్దాక్షన్యంగా డబ్బాలోకి తోసేసి డబ్బాతో లోపలకు వెళ్ళిపోయింది.
`ఏమే, ఇంతకీ వీళ్లు చదువుకుంటున్నారా..ఆడుకుంటున్నారా..?'
బామ్మ అడిగిన ప్రశ్నకు అమ్మకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.
అసలు ఈ ప్రశ్నకు సమాధానం నాకు కూడా చాలా కాలానికి కూడా దొరకలేదు. ఆకతాయితనంతో చదువులో ఆటను చేర్చేశాను. కానీ ఇదో రకం ఎడ్యుకేషన్ అని ఇప్పుడిప్పుడు మా మనవళ్ల చదువులు , ఆ స్కూళ్ల వాతావరణం చూస్తుంటే నాకనిపిస్తోంది. ఆ రోజుల్లోనే నేనో గొప్ప విద్యా సంస్కరణవేత్తనన్న మాట. ఇది మరీ ఓవర్ గా ఉంటే ఇంకో పదం ఏదైనా అనుకోవచ్చు మీరు.
గోళీల ఆట - నాటక రచన:
ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదన్నట్లుగానే ఆట పాటల్లా చదువు సాగుతుంటే ఆ చదువు పట్ల ఆసక్తి కలుగడం ఖాయం. ఈ గోళీల చదువు వల్ల నాకు భవిష్యత్తులో అనేక లాభాలు కలిగాయి. అందులో ప్రధానంగా నాటక రచన బాగా సాగించగలగడం. తెలుసుకున్న విషయాన్ని డ్రమటైజేషన్ చేయడం ఓ కళ అని అప్పట్లో నాకు తెలియదు. విజయవాడ ఆకాశవాణి వారికి ఓర్పు-సహనం అన్న టాపిక్ మీద రూపకం వ్రాశాను. అందులో ఓ చోట మహాభారతంలోని సంఘటనను డ్రమటైజ్ చేశాను.
అశ్వత్థామ రాత్రి వేళ ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. ఆ విషయం తెలుసుకుని పాండవులు అశ్వత్థామను బంధించి విలపిస్తున్న ద్రౌపది ముందు నిలబెడతారు. అప్పుడు ద్రౌపది అన్న మాటలను ఈ నాటకీకరణలో హైలెట్ చేశాను.
ద్రౌపది అంటున్నది..
`అశ్వత్థామా, నీవు గురు పుత్రుడివి. పైగా బ్రాహ్మణుడివి. నాకు కుమారుడితో సమానం. అయినా ఏమాత్రం దయలేకుండా నా బిడ్డలను చంపేశావు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న పిల్లలను చంపడానికి నీకు చేతులెట్లా వచ్చాయి? నీలోని ఓర్పు, సహనం ఏమయ్యాయి? పుత్ర శోకంతో గుండెలు పగిలిపోతున్న నాలాగానే నీ తల్లి కూడా అర్జునుడికి బంధీవైన నిన్ను గురించి గుండెలు పగిలేలా విలపిస్తుంటుంది. కనుక నాకు కలిగినట్లుగా ఆ తల్లికి గర్భశోకం కలగకూడదు, అర్జునా, వీడిని విడిచి పెట్టండి” ఈ సీన్ తో రూపకం ముగుస్తుంది. విన్నవారు బాగుందని అన్నారు.
గోళీలను ఎప్పుడు చూసినా నాకెందుకో విశ్వదర్శనం కలిగినట్లు ఫీలయ్యే వాడిని. ఈ భూమి ఓ పెద్ద గోళీ. అంతకన్నా పెద్ద గోళీలు మరి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ సూర్యుడు అనే మండుతున్న గోళీ చుట్టూ తిరుగుతుంటాయి. విశ్వంలో ఇలాంటి గోళీలు కోకొల్లలు. నేనూ రాదా గాడు ఇంట్లోని ఓ గదిలో కూర్చుని గోళీలతో చదువుకుంటూ ఆడుకున్నట్లుగానే ఈ విశ్వం అనే గదిలో గోళీలతో ఆ భగవంతుడు (శక్తి స్వరూపుడు) ఆడుకుంటున్నాడు. ఇలా సాగేవి నా ఆలోచనలు.
శ్రీ షిర్డీ సాయిబాబా మహత్మ్యం చిత్రంలోని ఒక పాట గుర్తుకు వస్తున్నది. అందులో ఓ చోట..
`గోళీల ఆటల్లో
కొండంత సత్యం
చాటావు ఓ సాయి
మమ్ము సాకావు
మా సాయి'- అంటూ సాగుతుందీ ఆ పాట. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి విశ్వరూప దర్శనం చేయిస్తాడు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూసినప్పుడు నాకు మా గోళీల ఆటే గుర్తుకు వచ్చేది. గోళాల్లాంటి గ్రహాలు అనేకం తిరగాడటం విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలు కూడా గోళీల మాదిరిగానే ఉంటాయని యాస్ట్రానమీ చదువుతున్నప్పుడు నాకర్థమైంది. శ్రీ కృష్ణావతారం లాంటి సినిమాలు చూసినప్పుడు మేము ఆడిన గోళీల్లో ఇంత సత్యం (నాలెడ్జ్) ఉన్నదా అనిపించేది.
`గోళీ'కి నివాళి:
చాలా కాలం మంచి మిత్రుడిగా ఉన్న రాధాగాడు ఉన్నట్లుండి కనబడటం లేదు. ఆరా తీస్తే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది.
అప్పుడు నేను ఆంద్రప్రభలో ఉద్యోగం చేస్తున్నాను. చదువు అయ్యాక , ఉద్యోగాల వేట అయ్యాక ఆంధ్రప్రభలో స్థిర పడి పెళ్ళి చేసుకుని జీవితాన్ని నెట్టుకొస్తున్న నేను అడపాదడపా నందిగామ వెళ్ళే వాడిని. కొత్త మిత్రుల రాకతో చిన్ననాటి స్నేహితుల గురించి నిత్యం ఆలోచించే తీరక లేకుండా పోయింది. పైగా జర్నలిస్ట్ ఉద్యోగం, అది కూడా డెస్క్ ఉద్యోగం అంటే చిటికీ మాటికీ సెలవులు పెట్టడం కుదిరేపని కాదు. ఆఫీస్ లో మనకు అప్పగించిన బాధ్యతల నుంచి అంత తొందరగా తప్పించుకుని పోయేందుకు వీలు లేదు. ప్రతి నెలా కాకపోయినా ఆరు నెలలకొకసారి నందిగామ వెళుతుండే వాడ్ని. అలా ఒక సారి వెళ్ళినప్పుడు రాధాగాడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలిసింది. నా మనసు బాధతో మూలిగింది.
అంతకు ముందు ఓ సారి వినాయక చవితి పండుగకి ఊరెళ్ళినప్పుడు పొద్దున్నే పత్రి, పూలు కొనడానికని బజారుకు వెళితే వాడు.. రాథాగాడు పొడవాటి అగరబత్తీలు, కలవ పూలు వంటి పూజా సామాగ్రిని నేల మీదనే పరిచి అమ్ముతూ కనిపించాడు.
`ఇదేంట్రా?' అడిగాను.
వాడు అదోలా నవ్వాడు.
నాకు అర్థం కాలేదు.
ఆ తర్వాత మిత్రులు కొందరు చెప్పారు. వాడి పరిస్థితి బాగోలేదని. వాడికి పెళ్ళయింది. ఉద్యోగం లేదు. చదువు సరిగా అబ్బలేదు. నాతోపాటు చదివినా ఇంటర్ దాటలేకపోయాడు. సంసార రథం ఈడ్చలేకపోతున్నాడట.
ఆ తర్వాత ఇదిగో ఇలా వాడి మరణ వార్త తెలిసింది. అంతవరకు పళ్లెంలో గిరగిరా తిరగాడిన గోళీ ఆగిపోయినట్లు అనిపించింది. సర్కస్ లో బావిలో గిరగిరా తిరిగే మోటార్ సైకిల్ ఫీట్ చేసే వాడు ఉన్నట్లుండి పడిపోయినట్లు అనిపించింది. కళ్లు చెమ్మగిల్లాయి. ఈ అమాయకుడ్ని ఏ శక్తీ కాపాడలేకపోయిందేమిటా- అని ఇప్పటికీ బాధ పడుతుంటాను.
సర్లేండి, ఈ బరువైన సంఘటన నుంచి తేలికైన సంఘటనకి తీసుకువెళతాను. పదండి.
సరదా సరదా సిగరెట్ :
సిగరెట్ త్రాగడం ఓ ఫ్యాషన్. సిగరెట్ ప్యాకెట్ పట్టుకుని తిరగడం ఓ స్టైల్. 70వ దశకం రోజుల్లో బర్కిలీ సిగరెట్ కంపెనీ వారి వ్యాపార ప్రకటన నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ ప్రకటనలో ఎస్వీ రంగారావు ఎంతోహుందాగా కూర్చుని నల్ల కళ్లజోడు పెట్టుకుని నోట్లో తెల్లటి సిగరెట్ పెట్టుకుని ఉంటాడు. పెట్టె మీదనే ఎస్వీఆర్ చెప్పినట్లు ఓ కొటేషన్..
`బర్కిలీ త్రాగడం నాకు
మహదానందదాయకం.
దానిలో ఉండే పొగాకు
కమ్మని రుచి కలిగి...
సాఫీగా ధారాళమైన పొగ నిస్తుంది'
ఇలా సాగుతుంది ప్రకటన. పైనేమో - `చిత్ర రంగపు ఎన్నిక బర్క్ లీ' అని పెద్దక్షరాలతో రాసి ఉంటుంది. ఆ రోజుల్లో సినిమా అంటే ఎన్టీవోడు, ఏఎన్నారోడు, ఎస్వీ వోడు. అంతే. సిగరెట్ ప్యాకెట్ల మీద `కమ్మని రుచి', `ధారాళమైన పొగ' వంటి మాటలు ఉండేవే కానీ, `పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం', `క్యాన్సర్ కారకం' వంటి హెచ్చరికలు ఉన్నట్లు నాకేతై గుర్తులేదు. అలాంటి రోజుల్లో పిల్లాడు కుర్రాడిగా మారడం ఆలస్యం ఈ సిగరెట్ పొగ, వాసన ఆకట్టుకునేవి.
సిగరెట్ పెట్టెల రంగులు, హంగులు నా బోటి పిల్లలను ఆకర్షించేవి. ఆ రోజుల్లోనే పొగ రాయుళ్లు తాగి పడేసిన ఖాళీ సిగరెట్లు ప్యాకెట్లు ఏరుకోవడం మాకో పెద్ద హాబీ. ఈ సిగరెట్ పెట్టెలు ఎంత ఆకర్షనణీయంగా ఉండేవో. రకరకాల రంగుల్లో సిగరెట్ పెట్టెలు. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా ప్రెండ్స్ తో కలిసి ఖాళీ సిగరెట్ పెట్టెలు ఎక్కడైనా కనబడితే వాటిని భద్రంగా తెచ్చుకుని దాచుకునే వాడ్ని. ఆ తర్వాత తెలిసింది. ప్రతి ఖాళీ సిగరెట్ పెట్టె కి ఆటల్లో కొన్ని పాయింట్లు ఉంటాయి. బచ్చాల ఆటల్లో కూడా ఈ ప్యాకెట్ ముక్కలు ఉపయోగపడేవి. సిగరెట్ పెట్టెల ముక్కలు, వాటిలో ఉండే తళుకు పేపర్లు ఇవన్నీ బచ్చాల ఆటలో పెట్టి ఆడేవారు. అందుకోసం ఖాళీ సిగరెట్ పెట్టెలు సేకరించేవారు. అలా డిమాండ్ పెరిగేది.
నేను బచ్చాల ఆట ఎక్కువగా ఆడలేదు. కానీ నా దగ్గరున్న ఖాళీ సిగరెట్ పెట్టెలను బచ్చాల ఆట ఆడేవారు కొనుక్కుని నాకేమో వారి వద్ద ఉన్న గోళీలు ఇచ్చే వారన్న మాట. డబ్బులున్నప్పుడు కొన్ని గోళీలు షాపుకెళ్ళి కొనేవాడ్ని.
గోగు పుల్ల - సిగరెట్:
ఇలా ఖాళీ సిగరెట్ పెట్టెలతో మొదలైన హాబీ నిదానంగా సిగరెట్ వాసన, పొగ వైపు ఆకర్షితలవుతుంటారు. కుర్రాడిగా మారి ఉద్యోగమో సద్యోగమో వచ్చాక చేతిలో డబ్పులు ఆడతాయి కాబట్టి దర్జాగా సిగరెట్ ప్యాకెట్లు కొని ఎస్వీఆర్ లాగా ఫోజులెట్టి త్రాగేయవచ్చు. కొత్తగా కుర్రాడైనవారికి ఆ సౌకర్యం ఉండదు కదా. అందుకే అప్పుడప్పుడు సరదా పడి గోగు పుల్లలో, కంది పుల్లలో ఇలాంటివేవో కాల్చి పొగ వదులుతుండేవారు. కానీ వాటి వాసన ఎస్వీఆర్ చెప్పినట్లు కమ్మగా ఉండదు కదా. దీంతో `ఇది కాదురా, మనం కూడా సిగరెట్ ప్యాకెట్ కొని కాల్చాలిరా' అన్న ఆలోచనలు మొలిచేవి. డబ్బులు లేకపోయినా గ్యాంగ్ లీడర్ లాంటి వాడిని పట్టుకుంటే కొనిపెట్టి మనకు అలవాటయ్యాక తప్పుకుంటాడు. నేను ఆంధ్రప్రభలో పనిచేసినప్పుడు ఈ కమ్మటి వాసనకు బందీనయ్యాను. సిగరెట్ తో ఆలోచనలు పదును తేలతాయనీ, మంచి మంచి హెడ్డింగ్ లు పెట్టొచ్చని ఓ నమ్మకం గట్టిగా ఉండేది. మెదడులో ఆలోచనలను గిలక్కొడుతుందని ఎవరో చెబితే నమ్మేశాను. ఏది ఏమైనా సిగరెట్ త్రాగడం హానికరమే. అవగాహన లేక తప్పులు చేస్తుంటాము. అందుకే రాముడు - భీముడు సినిమాలో కొసరాజు గారు ఇలా వ్రాశారు..
సరదా సరదా సిగిరెట్టూ...
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
పట్టుబట్టి ఒక దమ్ము లాగితే...
స్వర్గానికె యిది తొలి మెట్టు
సరదా సరదా సిగిరెట్టూ...
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
హా.. కంపు గొట్టు యీ సిగరెట్టు...
దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కడుపు నిండునా కాలు నిండునా...
వదలి పెట్టవోయ్ నీ పట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు...
దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడూ
లంకా దహనం చేశాడూ
హా.. ఎవడో కోతలు కోశాడూ
ఈ పొగ తోటీ గుప్పు గుప్పున
మేఘాలు సృష్టించవచ్చూ...
మీసాలు కాల్చుకోవచ్చూ
సరదా సరదా సిగిరెట్టూ...
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
ఊపిరి తిత్తులు క్యాన్సరుకిదియే
కారణమన్నారు డాక్టర్లూ
కాదన్నారులే పెద్ద యాక్టర్లూ
పసరు బేరుకొని కఫము జేరుకొని
ఉసురు తీయు పొమ్మన్నారూ
దద్దమ్మలు అది విన్నారూ
హా.. కంపు గొట్టు యీ సిగరెట్టు...
దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
ప్రక్కనున్న వాళ్ళీ సువాసనకు
ముక్కులు ఎగరేస్తారు...
వా..నీవెరుగవు దీని హుషారు
అబ్బో..థియేటర్లలో
పొగ త్రాగడమే
నిషేధించినారందుకే...
కలెక్షన్లు లేవందుకే
సరదా సరదా సిగిరెట్టూ...
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు...
దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కవిత్వానికి సిగిరెట్టు...
కాఫీకే యిది తోబుట్టు.
పైత్యానికి యీ సిగిరెట్టు...
బడాయి కిందా జమకట్టూ
ఆనందానికి సిగిరెట్టు...
ఆలోచనలను గిలకొట్టు
వాహ్...పనిలేకుంటే సిగిరెట్టూ...
తిని కూర్చుంటే పొగపట్టూ
రవ్వలు రాల్చే రాకెట్టూ...
రంగు రంగులా ప్యాకెట్టూ
కొంపలు గాల్చే సిగిరెట్టూ...
దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ
సరదా సరదా సిగిరెట్టూ...
ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు...
దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
(ఈ పాట మొత్తం ఇవ్వడానికి కారణం, ఈ వ్యాసం చదివే వారిలో కొందరిలోనైనా చైతన్యం కలిగిస్తుందని, ఈ చెడు అలవాటుకు స్వస్తి పలుకుతారన్న ఆశ.)
నిజమే కదా. సిగరెట్ త్రాగకూడదని తెలిసొచ్చింది. ఓ సారి కాస్తంత గుండె నొప్పి అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే, `సిగరెట్ మానలేరా..' అంటూ సూటిగా అడిగాడు. `ఎందుకు మానలేను' అనేశాను. అంతే, గుడ్ బై టు సిగరెట్. ఆ తర్వాత సిగరెట్ పెట్టెల గురించి గానీ, వాటి అందచందాల గురించి కానీ, వాటితో చిన్నప్పుడు గోళీలు కొనుక్కునే వాడినని గానీ ఎప్పుడూ గుర్తుకు రాలేదు. ఇదిగో ఇది వ్రాయడం మొదలుపెట్టడంతో ఈ సంఘటనలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి అంతే.
(మళ్ళీ కలుద్దాం)
2, జూన్ 2024, ఆదివారం
10వ భాగం: గోరింట పూసింది
ఓ రోజున అక్క ఎంతో ఉత్సాహంతో అమ్మతో కబుర్లు చెబుతున్నది. వారి మాటల మధ్యలో అట్లు, పిండి వంటలు, గోరింటాకు , ఉయ్యాల వంటి పదాలు దొర్లుతున్నాయి. ఆ మాటలు వింటుంటే నాలో ఉత్సాహం పొంగింది. అమ్మాయిలు చాలా సరదాగా చేసుకునే పండుగేదో వచ్చేస్తున్నదని అర్థమైంది. నేనూ వారి పక్క చేరాను.
అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. ప్రేమగా తల నిమిరింది. మరోపక్క అక్క కూడా నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని నా చిట్టి అరచేతుల వైపు తదేక దృష్టితో చూస్తుంటే -
`అర్థమైంది లేవే, తమ్ముడికీ గోరింటాకు పెడతానులే' అంది అమ్మ.
`చూడమ్మా వీడి చేతులు ఎంత సుకుమారంగా ఉన్నాయో. లేత గులాబీ రేకుల్లా ఉన్నాయి కదూ..' అక్క మురిసిపోయింది.
అక్క ఇలా అంటుంటే, అమ్మ మధ్యలో కట్ చేస్తూ...
`చాల్లే సంబడం.. దిష్టి తగులుతుంది' అంటూ నా బుగ్గన ముద్దు పెట్టుకుంది.
అక్కేమో రుబ్బిన గోరింటాకున్న గిన్నె తీసుకు వచ్చి అమ్మకి ఇచ్చింది. అమ్మ నా అరచేతిలో పదిపైసలంత చుక్క దిద్దింది. పదిపైసలకు ఆ రోజుల్లో చాలా విలువ ఉండేది. పది పైసల చుట్టూ తిరిగిన ఓ సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను.
ఫ్యాన్ కింద ఉద్యోగం:
1960 దశకం చివర్లో... అప్పట్లో మేము గుంటూరులోని బ్రాడీపేటలో 8వ లైన్ లో అద్దెకు ఉండే వాళ్లం. నేనేమో ఆ పక్కనే దగ్గర్లో ఉన్న మాజేటి గురవయ్య హైస్కూల్ (ఎంజీహెచ్) ఆరో తరగతి చదువుతున్నాను. మా అక్కేమో బండ్లమూడి హనుమాయమ్మ హైస్కూల్ లో చదువుకునేది. మా అన్న హిందూ కాలేజీలో చదువుకుంటున్న రోజులవి.
చిన్నప్పుడు చాలా సుకుమారంగా ఉండే వాడిని. అలా అని ఇప్పుడు దృఢమైన శరీరంతో లేననుకోండి. ఇప్పటికి నా అరచేతులు లేత గులాబీ రేకుల్లానే ఉంటాయి. మా నాన్నగారు ఎవరితోనో అంటుండేవారు ,
మా రెండో వాడు వీడు. అమ్మాయిల్లా మహా సుకుమారుడులేండి. అంటూ నవ్వేసేవారు. ఆయన నవ్వడం చాలా అరుదు. కానీ నవ్వితే చాలా అందంగా ఉంటారు. ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా నాకు బోలెడు కోపం వచ్చేది. ఇంకో సారి నాన్న ఎవరితోనో మాట్లాడుతూ, వీడు ఎండల్లో పనిచేయలేడు. ఏ ఫ్యాను క్రింద ఉద్యోగమో కావాల్సిందే అన్నారు. ఇలాంటి `అవమానాలు' అప్పుడప్పుడు ఎదురవడానికి నా సుకుమార శరీరమే కదా. లాభం లేదు. బలం పుంజుకోవాల్సిందే. చేతులకు బోలెడు కండ పట్టాలి. ఒక్క కొట్టు కొడితే ఇంటి వెనుక వేప చెట్టు పడిపోవాలి. అంతే...ఇలా అనుకునేవాడ్ని. కానీ ఒకటి నిజం అయింది. నాన్నగారు అన్నట్టుగానే నా సర్వీస్ అంతా ఫ్యాన్ క్రిందనో, ఏసీ రూముల్లోనూ సాగిపోయింది. ఇప్పుడనిపిస్తోంది. నాన్న మాటలు దీవెనలేనని.
పంచ కట్టు:
నాన్నగారు దాదాపుగా ఆరడుగుల ఎత్తు ఉండేవారు. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన్ని పంచ కట్టులోనే చూశాను.
నడుస్తుంటే తెలుగుదనం ఉట్టి పడుతుండేది. అమ్మ కూడా అంతే. గుండ్రటి ముఖం. కళకళలాడుతూ ఉండేది.
నాన్న గారి పంచకట్టు నా మదిలో గట్టి ముద్రే వేసింది. ఎంత అంటే, ఇప్పటికీ ఉగాది వస్తే పంచ కట్టుకోవాలనిపించేటంత.
పంచ కట్టులో నేను చూసిన వారిలో నాన్న గారి తర్వాత అక్కినేని నాగేశ్వర రావు (వారు యునిసెఫ్ అవార్డ్ ని అందజేశారు), డాక్టర్ సి.నారాయణ రెడ్డి (వీరిని హైదరాబాద్ లో కలిసి ఇంటర్వ్యూ కూడా చేశాను) ఇంకా నందిగామ హైస్కూల్ లో తెలుగు మాష్టారు గరికపాటి వేంకటేశ్వర రావు గారు. మా మామగారు మన్నవ గిరిధర రావుగారు. వీరు కొంత కాలం ఎమ్మెల్సీగా కూడా చేశారు. వీరి గురించి మరో సందర్బంలో కొన్ని ముచ్చట్లు చెబుతాను. ఇంకా ఉన్నారేమో ఇప్పటి కిప్పుడు గుర్తుకు రావడం లేదులేండి. వీరంతా ప్రభావితం చేయబట్టే అప్పుడప్పుడు నాలోని `తెలుగోడు' పంచకట్టులో బయట పడుతుంటాడు. మోజు తీర్చుకుంటాడు. అదీ సంగతి. సరే, అమ్మ సంగతి చెబుతున్నాను కదా, అటు వెళదామా..
అమ్మ - కనక దుర్గమ్మ:
నాన్నగారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఈవోగా ఉన్న రోజుల్లో మాకు కొండ (ఇంద్రకీలాద్రి) పైనే ఉన్న క్వార్టర్స్ లో ఒక పోర్షన్ ఇచ్చారు. నాకు గుర్తున్నంత వరకు వరుసుగా మూడో నాలుగో పోర్షన్స్ ఉండేవి. ఈవోకి ఒకపోర్షన్, ప్రధాన పూజారికి మరొకటి, ముఖ్య గుమాస్తాకు ఇంకొటి ఇలా ప్రతి నిత్యం కొండపైకి ఎక్కి అలసి పోకుండా, అక్కడే ఉండి విధులు సక్రమంగా నిర్వహించడం కోసం ఇలాంటి ఏర్పాటు చేసి ఉంటారు. ఆ రోజుల్లో (60వ దశకం తొలినాళ్లలో) బెజవాడ దుర్గమ్మని చూడాలంటే మెట్లదారే. మా నాన్నగారు ఈవోగా ఉన్నప్పుడే ఘాట్ రోడ్ ప్రస్తావన వచ్చిందట.
అప్పుడు మేమున్న ఇల్లు ఇప్పుడు లేదేమో. కనక దుర్గమ్మ గుడి నుంచి మల్లికార్జున స్వామి గుడికి మెట్ల మీదగా క్రిందకి దిగుతూ మళ్ళీ పైకి ఎక్కే మెట్లు వచ్చినప్పుడు ఆ మధ్యన ఎడమ వైపున ఉండేవి ఈ పోర్షన్స్. ఆ రోజుల్లో నేనింకా స్కూల్లో జాయిన్ అవలేదు. ఐదేళ్లు దాటినా బలహీనంగా ఉండటం వల్లనో, లేదా రోజూ కొండ దిగి స్కూల్ కి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కలేననో స్కూల్ లో చేర్చ లేదు. దీంతో పూజారి పిల్లలతోనూ, బంట్రోతు పిల్లలతోనూ దోస్త్ కట్టి తెగ ఆడుకునే వాడ్ని. అలా ఆడుకునేటప్పుడే సిమెంట్ తో చేసిన ఏనుగులు బొమ్మల మీదకు ఎక్కేవాళ్లం. బృందావనంలో శ్రీకృష్ణుడు, గోపికల చుట్టూ గిరగిరా తిరిగే వాళ్లం. అంతలో పైకి మెట్లెక్కి అమ్మవారి గుడిలోకి వెళ్ళి దుర్గమ్మను చాలా దగ్గరగా ఇంకా చెప్పాలంటే అమ్మని చేతులతో తాకి మరీ తుర్రు మనేవాళ్లం. ఆ గుడి అంతా మాదే అన్నట్లు తిరిగే వాళ్లం.
అలా దుర్గమ్మని చూసిన కళ్లతో ఇంటికి వచ్చి అమ్మని చూడగానే అమ్మ కూడా ఆ దుర్గమ్మ తల్లిలా కనిపించేది. ఇద్దరిదీ గుండ్రటి ముఖం. పెద్ద కుంకుమ బొట్టు. ఇద్దరి మోములో చిరునవ్వుల దరహాసం. ఆ లేత వయసులో అమ్మే అక్కడా ఇక్కడా ఉంటుందని అనుకునే వాడ్ని. అలా ఇద్దరమ్మల దయని ఆ రోజుల్లోనే సంపాదించానన్న మాట. ఈ రోజున ఇలా వ్రాయగలుగుతున్నానంటే ఇద్దరమ్మల దయే.
నాన్నంటే భయం:
నాన్నగారు నా జీవితంలో ఎన్నో విషయంలో ప్రభావితం చేసినప్పటికీ వారంటే నాకు భయమే. ఆయన చెప్పింది వినడమే తప్ప మా సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు చెప్పింది చాలా తక్కువే.
మాకేం అవసరమొచ్చినా నాన్నకు చెప్పాలంటే భయం. అమ్మ దగ్గరకో, బామ్మ దగ్గరకో వెళ్ళి చెప్పే వాళ్లం. అప్పుడేమోఅమ్మో, బామ్మో నెమ్మదిగా వీలు చూసుకుని నాన్న దగ్గరకు వెళ్ళి విషయం ఆయన చెవిలో వేసేవారు. ఈ తంతు పక్కగదిలో గుమ్మం చాటున నిలబడి బోలెడు టెన్షన్ తో చూస్తుండే వాళ్లం.
అదేమీ చిత్రమో, నాన్న గారు అమ్మ చెప్పిన మాటలు వింటారు. కానీ వెంటనే నిర్ణయం చెప్పరు. ఆయనేమో గుళ్లమీద పెద్ద ఆఫీసరాయె, గుడి నౌకర్లు, పూజారులు, గుమాస్తాలు ఇంకా బోలెడు మంది ఇంటికి వచ్చి పోతుంటారు. వాళ్లతో మాటలు. వాటి మధ్యలో కీలక నిర్ణయాలు..అనేక ఆలోచనలు.
మా గురించి అమ్మ ఏదో చెబుతుండగానే మధ్యలో ఇలాంటి `పానకంలో పుడకలు' వస్తుండేవి. దీంతో అసలు విషయం నాన్న చెవులకు సోకిందా? లేదా? అన్నది పెద్ద కొశ్చిన్ మార్క్.
అమ్మకి చెప్పిన మా డిమాండ్ తీరుతుందా లేదా అన్నది పెద్ద సస్పెన్స్. తెల్లవారి లేచిన దగ్గర నుంచి బిజీ బిజీగా ఉండే నాన్నగారికి మా గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుందిలే అని అనుకునే వాళ్లం. కానీ చిత్రం. మా డిమాండ్ త్వరగానే తీరేది. అందుకే ఎప్పుడూ ఎక్కడా ఏ లోటూ రాలేదు.
జామ చెట్టు - రెండు కోతులు:
ఆ రోజుల్లో నాకు స్వీట్స్ తినడం బాగా ఇష్టం. అసలు స్వీట్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారులేండి. మేముండే ఇంటికి పక్కన నా ఫ్రెండ్ మహదేవన్ ఉండేవాడు. వాడి పేరు ఎలా వచ్చిందీ? వాడు ఏ ప్రాంతం వాడు? అన్న ఆలోచనలు నాకప్పట్లో రాలేదు. తెలుగు బాగా మాట్లాడే వారు ఇంట్లో. వాడూ నేను ఒకే స్కూల్ లో రెండేళ్లు చదువుకున్నాము. మా రెండు ఇళ్ల మధ్య ప్రహరీ గోడ ఉండేది. వాళ్లింటి వైపు బాగా పెరిగిన జామ చెట్టు మా ఇంటి ఆవరణవైపుకి వాలి ఉండేది. చెట్టు కొమ్మల సాయంతో గోడ ఎక్కి వాడిని పిలిచే వాడ్ని. నా పిలుపు కోసమే ఎదురు చూస్తున్నానన్నట్లుగా ఛంగున లోపలి నుంచి వచ్చేసి చెట్టు ఎక్కి గోడ మీదకు చేరేవాడు. అలా గోడమీదనే జామ కాయలు, పండ్లు తింటూ చాలా సేపు కబుర్లు చెప్పుకునే వాళ్లం. దోర కాయలు తినడానికి మాకు పోటీగా వచ్చేవి ఉడతలు . మొదట్లో మమ్మల్ని చూసి భయపడి నక్కి నక్కి వెళ్లేవి. కానీ రెండు మూడు రోజులు గడిచే సరికి వాటికీ మాకూ దోస్తీ కుదిరింది. మమ్మల్ని ఆనుకుని పోవడమే కాదు, ఒక్కోసారి మా చేతుల్లో ఉన్న దోరగా పండిన జామ పండ్లను లాక్కునేవి.
నిజం.
అలాగే చేసేవి.
అయినా మాకు కోపం వచ్చేది కాదు. దానికి బదులు ప్రేమ పుట్టేది. వాటిని ప్రేమగా చూసేవాళ్లం. అవీ మా కళ్లల్లో కళ్లు పెట్టి చూసేవి. మేము కాస్తంత బిజీగా ఉండి చెట్టు ఎక్కకపోతే పాపం ఉడతలు దిగులు పెట్టుకునేవని మా ఫ్రెండ్ వాళ్ల అమ్మ అంటుండేది. నిజానికి మేము బిజీగా ఉండటమంటే అర్థమేమంటే, పరీక్షలు దగ్గర పడుతున్నాయనే. రెండిళ్లలోని పెద్దోళ్లు - చాల్లే ఆటలు చదువుకోండంటూ కసురుకోవడం వల్ల వచ్చిన బిజీ అన్న మాట. అదేమిటోగానీ చదువుకోమన్నారంటే చాలు మా ఇద్దరికీ కోపం వచ్చేసేది. వాడు కూడా నాలాగానే సుకుమారుడే. పైగా నాకంటే తెల్లగా ఉండేవాడు. వీడిప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ వాడూ నేనూ జామ చెట్టు పక్కన గోడ మీద కూర్చుని చేసిన సమాలోచనలు, కబుర్లు ఇప్పటికీ ఓ మధుర జ్ఞాపకం. అలాంటప్పుడు మా అన్నో, అక్కో అటుగా వచ్చి `చెట్టు మీద రెండు కోతులు చేరాయమ్మా' అంటూ ఎగతాళిగా అమ్మకు ఫిర్యాదు చేసేవారు. అయినా అమ్మ ఏమీ అనేది కాదు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ల అమ్మ కూడానూ. అమ్మలంతే కదా మరి.
మిఠాయి బండి :
ఈ ఫ్రెండ్ గాడికీ నాకు మిఠాయిలంటే చాలా ఇష్టం. మా వీధిలోకి సాయంత్రం అయ్యేసరికి మిఠాయిలున్న తోపుడు బండి వచ్చేది. అంటే మొబైల్ స్వీట్స్ షాప్ అన్నమాట. ఆ బండికి ఓ గంట వ్రేలాడ దీసేవారు. దానికి తాడు కట్టి లాగుతుంటే గంట మ్రోగుతుండేది.
వీధి మొదట్లో బండి వాడు ఉంటే గంట శబ్దంతో ఈ మూలన ఉన్న మాకు తెలిసిపోయేది. ఫ్రెండ్ గాడి అమ్మానాన్న చాలా మంచి వారు. రోజూ మిఠాయిలు కొనుక్కోవడానికి వాడికో పది పైసలు ఇచ్చేటంత మంచి వారన్నమాట. ఆ పది పైసలు తీసుకుని వాడు ఠీవిగా బండి వాడి దగ్గరకు వెళ్ళి తనకు నచ్చిన మిఠాయిని కొనుక్కోవడం చూస్తుంటే నాకు ఏడుపొచ్చేది. అలా ఓసారి ఏడుస్తుంటే మా అక్క విషయం కనుక్కుని అమ్మకి చెప్పింది. అమ్మేమో నాన్న చెవిన వేశారు. అది జరిగి వారం గడిచినా నాచేతిలో పది పైసల నాణెం పడలేదు. నాకేమో టెన్షన్.
అరచేతిలో పది పైసలు:
ఇంతలో పుట్టిన రోజు దగ్గరకి వచ్చేస్తున్నది. ఆ రోజుల్లో పుట్టిన రోజంటే ఇప్పట్లోలాగా పిల్లల చేత కేక్ లు కట్ చేయించడాలూ, బెలూన్లు వ్రేలాడదీయడాలు, ఫంక్షన్ హాల్స్ బుక్ చేయడాలూ బోలెడంత మంది అతిథులు రావడాలూ, వారేమో బహుమతులు ఇవ్వడాలు వంటివి చాలా మంది ఇళ్లలో ఉండేవి కావు. ఆ టైమ్ కి డబ్బులుంటే కొత్త బట్టలు వచ్చేవి. ఒక్కోసారి చాక్ లెట్స్ తో సరిపుచ్చేవారు.. పుట్టిన రోజున పొద్దున్నేనేను లేవగానే అమ్మ కాసేపు హడావుడి చేసేది. తలంటి స్నానం చేయించేది. ఉంటే కొత్త బట్టలు, లేకుంటే ఇస్త్రీ పెట్టిన బట్టలు. మా ఇంట్లో ఇస్త్రీ అంటే చెంబు ఇస్త్రీనే. బయటకు వెళ్ళి పిల్లల బట్టలు ఇస్త్రీ చేయించడం అరుదైన విషయం. నాన్న గారి పంచె, చొక్కాల వంటివి మాత్రం ఇస్త్రీ పెట్టి వచ్చేవి. ఇత్తడి చెంబులో కణకణమండే బొగ్గులు వేసి చెంబు వేడెక్కగానే ఇస్త్రీ పెట్టడాన్ని ఆ రోజుల్లో చెంబిస్త్రీ అనేవారు. కొన్ని సినిమాల్లో కూడా ఈ చెంబిస్త్రీ మీద సీన్లు ఉండేవి.
తలంటి కాగానే అమ్మ వంటింట్లోకి వెళ్ళి పంచదార డబ్బానో, బెల్లం డబ్బానో మూత తెరిచి కాసంత తీసుకొచ్చి నోరు తీపి చేసేది. దేవుడికి దండం పెట్టుకోమనేది. పుట్టిన రోజు వేడుకలంటే పెద్ద ప్లాన్ గట్రా ఉండేవి కావు. మిఠాయి బండి వాడి దగ్గర మైసూర్ పాక్ బిళ్లలో, హల్వానో, లడ్డూలో తీసుకునేది మా అమ్మ. పుట్టిన రోజు పండుగ అలా సింపుల్ గా జరిగినా అదే మాకప్పుడు చాలా గొప్పన్న మాట. అలాంటిది, రోజూ మిఠాయి కొనడానికి పది పైసలు కావాలన్న నా డిమాండ్ తీరుతుందా?
ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. అప్పట్లో మిలియన్, డాలర్ అన్న పదాలు తెలియదనుకోండి.
సాయంత్రమైంది. రోజూ లాగానే మిఠాయి బండి వాడు గంట మ్రోగిస్తూ వీధిలోకి ఎంటరయ్యాడు. పక్కింటి మహాదేవన్ గాడు చేతిలో పది పైసలు పట్టుకుని అప్పటికే ఇంటి గేటు ముందు ఠీవీగా నిలుచున్నాడు. వాడెప్పుడూ అంతే, `చూశావా, నేను గ్రేట్ రా' అన్నట్లు చూసేవాడు. దీన్ని `ఇగో' అంటారట. నాకు తెలియదనుకోండి. కానీ వీడు మాత్రం అంతలో బాగా కలిసిపోయేవాడులేండి. అందుకే మా స్నేహం వయస్సు రెండు సంవత్సరాలే అయినా ఇప్పటికీ గుర్తిండిపోయాడు వాడు.
మరి నా సంగతేమిటి? మిఠాయి బండి వాడు దాదాపుగా ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాడు. కొన్ని అద్భుతాలు జరగడానికి క్షణం చాలు. అదే జరిగింది ఇక్కడ. అక్కయ్య ఇంటి లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నా చేయి పుచ్చుకుని వేగంగా మిఠాయి బండి వాడి దగ్గరకు తీసుకెళ్ళి నా చేతిలో పది పైసలు పెట్టింది. నాకు బోలెడు సంతోషమేసింది. వెంటనే మహాదేవన్ గాడికంటే ముందే హల్వా కొన్నాను. నాకు హల్వా అంటే ఇష్టం. ఇప్పటిలా కలాకండ్ వంటి స్వీట్స్ పేర్లు నాకప్పుడు తెలియవు. ఆనందంతో హల్వా తింటూ అక్క చేతిని పట్టుకని అటూ ఇటూ ఆనందంగా ఊగుతూ మధ్యలో మహదేవన్ గాడివైపు విజయగర్వంతో చూస్తూ ఇంట్లోకి వెళ్ళాను.
ఆ తర్వాత తెలిసింది. ప్రతి రోజూ పది పైసలు మిఠాయి కొనుక్కోవడానికి నాన్న శాంక్షన్ చేశారని.
ఈ నాన్నలంతే, బయటపడరుగానీ లోపల బోలెడు ప్రేమ దాచేసుకుంటారు. అదేదో బ్యాంక్ లో డబ్బుల్లా పైకి తీయరు. ఏమిటో..
అట్లతద్ది :
ఆరోజున అక్క నా చేతిలో పది పైసలు పెట్టడంతో అక్క మీద ప్రేమ బాగా పెరిగిపోయింది. అప్పటి నుంచి అక్క ఏది చెబితే అది చేయాల్సిందే. నో కొశ్చన్ అన్న మాట. ఇప్పుడేమో అట్లతద్ది (పుట్ నోట్ చూ. 13) వచ్చిందాయె, మరేమో నా లేత అరచేతుల్లో గోరింటాకు పెడదామని అమ్మకు అక్క చెప్పడం, అమ్మేమో `అలాగేలేవే' అనడం జరిగిపోయాయి కదా.
గోరింటాకు పెట్టించుకున్నప్పుడు చాలా చిరాకుగానే ఉంటుంది. దీనికి తోడు జాగ్రత్తలు పాటించాలంటూ షరతులు పెట్టేవారు. ఆ కాసేపు ఆడుకోవడానికి ఎక్కడికీ వెళ్లకూడదు. చెట్లు ఎక్కకూడదు. గోళీలు ఆడకూడదు. మంచాలు ఎక్కి ఆడుకోకూడదు, ఛటక్కున మంచి నీటి గ్లాసు తీసుకోకూడదు. ఎవ్వరినీ ముట్టుకోకూడదు. మన చేతులే అయినా ఒక చేతిని మరో చేతివైపు పోనీయ కూడదు.
అమ్మో ఎన్ని షరతులో. అందుకే కాస్త పెద్దయ్యాక ఈ షరతుల గోల భరించ లేక గోరింటాకు పెట్టుకోవడం మానేశాను.
ఆడపిల్లలకైతే అరచేతి అంతా డిజైన్ లో గోరింటాకు పెట్టేవారు. మధ్యలో పెద్ద చుక్క, చుట్టూ చిన్న చిన్న చుక్కలు ఉండేవి. మధ్యలో చుక్క సూర్యునికి సంకేతమైతే, చుట్టూ ఉన్న చిన్న చుక్కలు గ్రహాలకు సంకేతాలు. అరచేయి ఏమో ఆకాశానికి సింబల్ అన్న మాట. ఆడపిల్లకు దిష్టి (దృష్టి) సోకకుండా జీవితాంతం ఆనందంగా ఉండటానికీ, సూర్యచంద్రాది గ్రహాలు కాపు కాయడానికి ఇలా గోరింటాకు పెట్టుకుంటారని పెద్దయ్యాక ఎక్కడో చదివాను. ఈ వివరణతో గోరింటాకు పట్ల మక్కువ పెరిగింది.
చేతి వేళ్ల కొసలకు గోరింట టోపీలు తొడిగేవారు. ఇంకా రుబ్బిన ఆకు ఎక్కువగా ఉంటే కాళ్లకు పారాణిలా పెట్టేవారు. ఇప్పుడు మెహందీ కోన్స్ గట్రా వచ్చాయనుకోండి. నా చిన్నప్పుడు గోరింటాకు కోసుకు రావాల్సిందే. దాన్ని రుబ్బాల్సిందే. పూర్వం గోరింటాకు చెట్లు ప్రతి ఊర్లో చాలానే ఉండేవి. మా ఊర్లో ఇంటి పెరట్లోనే గోరింటాకు చెట్టు ఉండేది. అది పూలు పూస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్యనే గోరింటాకు చెట్టు పూలతో కళకళలాడుతుంటే ఫోటో తీసి మురిసిపోయాను. ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాను కూడా. అంత సరదా అన్నమాట. మగపిల్లలకు మాత్రం అరచేతిలో ఒక చుక్క పెట్టేసి పొమ్మనేవారు. బహుశా రుబ్బిన గోరింటాకు వాళ్లకే సరిపోదనుకుని నా బోటి మగపిల్లలకు ఒక చుక్కతో సరిపుచ్చేవారేమో, ఏమో ఆలోచించాల్సిందే ఈ పాయింట్.
ఇప్పటికీ మా ఆవిడ గోరింటాకు పెట్టుకుంటూ `మీకూ ఓ చుక్క పెట్టనా' అన్నట్లు అదోలా చూసినా నేను లొంగను. కానీ, అలాంటప్పుడే ఈ పాత సంఘటనలు గుర్తుకొస్తుంటాయి. అంతే కాదు, పాత సినిమాలోని పాట కూడా గుర్తుకొస్తుంటుంది.
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
ఇంచక్కా పండిన ఎర్రన్నిచుక్క
చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష
కన్నె పేరంటాలికి కలకాలం రక్ష
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామ అతనే దిగి వస్తాడు
గోరు ముద్దలు:
ఆడపిల్లలు ఇష్టపడే వాటిలో గోరింటాకు పెట్టుకోవడం ఒకటైతే రెండోది గోరుముద్దలు తినడం. చక్కటి ఊహలతో ఆశలతో ఆటపాటలతో ఆడపిల్లలు అట్లతద్ది, ఉండ్రాళ్ల తద్దె వంటి పండుగలను చాలా సంతోషంగా చేసుకునే వారు. అట్ల తద్ది (చూ. ఫుట్ నోట్) నాడు తెల్లవారుఝామునే అమ్మా, అక్క లేచేవారు. ముందు రోజు రాత్రి నుంచీ హడావుడి పడేవారు. తెల్లవారుఝామునే అమ్మ అట్లు వేసేది. వాటిని అక్కకు పెట్టేది. తానూ తినేది. ఈ హడావుడికి మనమూ లేచేవాళ్లం. నాకూ అట్లు పెట్టేవారు. అంతే కాదు, వేడివేడి అన్నం
లో గోంగూర పచ్చడి కలిపి ముద్దలు చేసి అక్కకీ, నాకూ అమ్మ తినిపించేది. ఇప్పటికీ ఆ గోరు ముద్దల రుచి మరిచిపోలేదు.
చింత చెట్టుకు ఊయ్యాల
మా ఊర్లో ఇంటికి దగ్గర్లోనే చింత చెట్టు చాలా పెద్దది ఉండేది. దాని కొమ్మలు బాగా విశాలంగా వ్యాపించాయి. చింత చిగురు కావాలన్నా, చింతకాయలు కావాలన్నా ఊర్లో జనం ఆ చెట్టు దగ్గరకే వెళ్ళే వారు. ఈ రోజుల్లా ప్రతిదీ కొనుక్కోనక్కర్లేదు. ఊర్లోని చెట్లన్నీ అందరికీ చెందినవనే భావన ఉండేది. ఇంటి పెరట్లో సొరకాయలు , పొట్ల కాయలు గుమ్మడి కాయలు కాచినా, మల్లె పూలు పూసినా అన్నీ ఇచ్చి పుచ్చుకునేవారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నది పల్లె వాసుల జీవనంలో అంతర్లీనంగా ఉండే ఆనంద సూత్రం.
అట్ల తద్ది అనగానే ఊర్లోని అమ్మాయిల కోసం చింత చెట్టుకు ఉయ్యాల కట్టించేవారు. లావుపాటి తాడు (మోకు) తెచ్చి జీతగాళ్లు చింత చెట్టు కొమ్మకు తాడు కొసలు బిగించి ఉయ్యాల సిద్దం చేసేవారు. ఉయ్యాల మీద కూర్చుని ఊగడానికి వీలుగా గట్టి కట్టెను బిగించేవారు. నాబోటి పిల్లల కోసం పెద్ద ఉయ్యాలకు దగ్గర్లోనే పిల్ల ఉయ్యాలు వెలిసేవి. వాటికైతే కూర్చోవడానికి తొట్టి కట్టేవారు.
ఉయ్యాల ఊగుతుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. రంగురంగుల దుస్తుల్లో ఆడపిల్లలు ఉయ్యాల ఊగడానికి రాగానే ఊర్లోని కుర్రకారుకి హుషారు పుట్టేది. ఛలోక్తులతో , పందాలు కాయడాలతో అట్లతద్దె రోజున రెండు మూడు గంటల పాటు సందడి ఉండేది. ఊర్లో ఉన్న పెళ్లికాని అమ్మాయిలు, కొత్తగా పెళ్లయినవారే కాదు, ముసలమ్మలు కూడా సరదాగా చింత చెట్టు దగ్గర ఊయ్యాల ఊగే వారు.
`చింత చెట్టు ఉయ్యాల ఊగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్రా' అంటూ బామ్మ హెచ్చరించేది. నిజమే, ఉయ్యాల చాలా ఎత్తుకి లేచేది. అంతలో లోయలోకి పడిపోతున్నట్లుగా క్రిందకు వచ్చేది. క్రిందకు దిగుతున్నప్పుడు గుండె క్రిందకు జారిపోయినట్లుండేది.
ఉయ్యాల ఊపడం కూడా ఆర్టే. ఉయ్యాల పై నుంచి క్రిందకు దిగగానే దాన్ని నేర్పుగా పట్టుకని వేగంగా తోయాలి. అలా కాకుండా ఊయ్యాల మీద కూర్చున్న వారే దాని వేగం, ఊపుని నియంత్రించడం మరో ఆర్ట్. ఒక్కోసారి ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలబడి ఉయ్యాల ఊగుతుంటే ఆశ్చర్యపోయేవాడ్ని. క్రిందకు వంగి పైకి లేవడం అనే కళతో ఉయ్యాలకి ఊపు పెరుగుతుండేది. ఈ విద్య అందరికీ అబ్బదు. ఉయ్యాల తాడు మెలిపడేటట్లు చేసి గుమ్మటంలా తిరగడం భలే బాగుండేది. ఒక్కోసారి కళ్లు తిరుగుతుంటాయి. ఇంకోసారి పడిపోవాల్సి వస్తుంది. అప్పుడు దెబ్బలు తగులుతాయి. ఉయ్యాల కట్టె వేగంగా వచ్చి తలకు తగలనూ వచ్చు. అలాంటి ప్రమాదాలు చాలానే జరిగాయని అమ్మ చెబుతుండేది.
జీవితమే ఊయల:
అసలు ఉయ్యాల మన జీవితానికి సంకేతం. జీవితమే ఓ ఊయల. నేను ఆంద్రప్రభలో పనిచేస్తున్నప్పుడు ఫొటోగ్రాఫర్ ఒక ఫోటో తీసుకు వచ్చాడు. పత్రిక ఆఫీస్ లో ఇలాంటి ఫొటో గ్రాఫర్లు ఒకరో ఇద్దరో ఉండేవాళ్లు. వీరితో పాటుగా బయట ఫొటో స్టూడియోలు నడుపుతున్న వారు కూడా అడపాదడపా ఫోటోలు పత్రికల వారికి అందజేస్తుండేవారు. పండగలు రాబోతున్నాయనగానే వీళ్లు ఆ వాతావరణానికి తగ్గ ఫోటోలు తీసి డెస్క్ కి ఇచ్చేవారు. నేను డెస్క్ దగ్గర పనిచేస్తుండటంతో నా వద్దకు అలాంటి ఫోటోలు వచ్చేవి. వాటిలో మంచి వాటిని ఎంచుకుని పండగ రోజు ప్రచురితమయ్యేలా చూసేవాడ్ని. అలాంటప్పుడు అట్లతద్ది పండుగకి ముందు ఒక పోటో వచ్చింది. పెద్ద చెట్టుకు ఊయాల కట్టి ఉంది. దాని క్రింద కట్టెపై ఇద్దరు యువతులు ఎదురెదురుగా నిలబడి ఊగుతున్నారు. దీనికి రైటప్ పెట్టాలి. అప్పుడే రీడర్ బాగా కనెక్ట్ అవుతాడు. ఆ పోటోకి నేను పెట్టిన రైటప్ - జీవితమే ఊయల.
జీవితాన్ని రంగుల రాట్నంతో పోల్చినట్లుగానే ఊయలతో కూడా పోల్చవచ్చన్నమాట. ఊయల క్రిందకీ పైకి ఊగుతుంటుంది. అలాగే జీవితంలోనూ అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఈ ఉగిసలాట చివరకు ఎక్కడో ఎప్పుడో ఆగిపోతుంది. జీవితం స్తంబించిపోతుంది. ఆనందం, ఆశయం, ఆవేదన, అంతం వంటి వాటికి సంకేతంలా ఉయ్యాల కనబడుతుంటుంది. అట్లతద్ది పరమార్థం కూడా అదేనేమో. జీవితంలో వచ్చే కష్టసుఖాలకు ఆడపిల్లలను ప్రిపీర్ చేయడం కోసమే ఇలాంటి పండుగలను పెట్టేరేమో మన పూర్వీకులు. ఏమో, ఆలోచించాల్సిందే కదా..
వయసులో ఉన్నప్పుడు ఎగిసి పడే ఉత్సాహం, మద్య వయసులో ఉండే నెమ్మది తనం, వయసుబడినప్పుడు కలిగే స్తబ్దత .. వీటన్నింటినీ ఉయ్యాల గుర్తుచేస్తుంటుంది. ఇంతటి భావం ఆ పోటో రైటప్ లో కనిపించిందేమో మర్నాడు ఒకరిద్దరు మిత్రులు మెచ్చుకున్నారు. ఇలాంటి చిన్న మెచ్చుకోళ్లు మనల్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంటాయి.
ఆంధ్రప్రభ విజయవాడ ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ఆనందాలు అనేకం. మధ్యమధ్యలో మనసు కలత చెందే సంఘటనలు కూడా జరిగాయి. ఎన్నో అనుభవాలను ఆంధ్రప్రభ మూటగట్టి ఇచ్చింది. విప్పి చూసినప్పుడల్లా బోలెడు కనబడతాయి
----- ఫుట్ నోట్: చూ. 13 --------
అట్ల తద్ది :
ఆశ్వయుజ బహుళ తదియనాడు ముఖ్యంగా పెళ్లికాని యువతులు చేసే పండుగే అట్ల తద్ది. ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. దీనికే మరో పేరే ఉయ్యాల పండుగ. ఇంకో పేరు కూడా ఉందండోయ్.. గోరింటాకు పండుగ.
అట్లతద్ది పేరిట వ్రతం చేస్తుంటారు. వివాహితులేమో సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తుంటే, కన్నెపిల్లలేమో అనుకూలమైన వాడు భర్తగా రావాలని కోరుకుంటూ చేసుకునే వ్రతం అన్నమాట.
"అట్లతద్దె ఆరట్లు
ముద్దపప్పు మూడట్లు" అంటూ కన్నె పిల్లలు పాడుకుంటూ వాయినాలిస్తుంటారు.
ఆ రోజంతా ఆడపిల్లలదే హవా.
అట్లు ఎందుకు పోస్తారని ఓ సారి అమ్మని అడిగితే ఏదో చెప్పింది. ఇప్పుడు సరిగా గుర్తుకు రావడం లేదు. మొత్తానికి ఈ అట్లకీ నవగ్రహాల్లో కుజ గ్రహానికి సంబంధం ఉన్నట్లు గుర్తు. కుజుడికి అట్లు అంటే బాగా ఇష్టమట. ఇందులో ఆడపిల్లల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయట.
పెద్దయ్యాక పత్రికల్లో పండుగలప్పుడు వ్యాసాలు రాయాల్సి వచ్చినప్పుడు మన పండుగల గురించి లోతుగా ఆలోచించాల్సి వచ్చేది. దీంతో ప్రతి పండుగ వెనుక ఉన్న లాజిక్, శాస్త్రీయ కోణం లీలగా అర్థమయ్యేది.
(మళ్ళీ కలుద్దాం)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)























