18, ఏప్రిల్ 2025, శుక్రవారం

ఆలోచనా పరులు - కార్యశూరులు : ఈ రెంటి మధ్య తేడా?

 


వ్యక్తిత్వ వికాసం  ఓ పాఠం : 

హాయ్ ఫ్రెండ్స్ , ఈరోజు నేను సమాజంలో థింకర్స్ కీ డూయర్స్ కి మధ్య ఉన్న తేడా గురించి చెబుతున్నాను.

  ఈపాటికే మీలో చాలా మంది ఈ రెండు వర్గాల వారినీ చూసే ఉంటారు. లేదా ఈ రెంటిలో మీరు కూడా ఏదో ఒక వర్గానికి చెందిన వారై ఉండవచ్చు. 

 ఏ పని చేయాలన్నా ఆలోచన ముఖ్యం. సమస్య నుంచి బయటపడాలన్నా నలుగురి మెప్పు పొందాలన్నా ముందు మన ఆలోచన సరైనదిగా ఉండాలి. అయితే ఆలోచన అన్నది - ప్రారంభ సూచిక మాత్రమే. అది ఒక ఇన్సిపిరేషన్ టూల్ లాంటిది. ఆలోచనలను మధించడం వల్ల ఒక కార్యాచరణకు  ప్రణాళిక సిద్ధమవుతుంది. దీంతో పనికి బీజం పడుతుంది. అంతే అక్కడితో ఆలోచన కు సంబంధించిన అంకం ముగుస్తుంది. 

 మరి అక్కడితో ఆగిపోతే ఏమవుతుంది? మనం కేవలం థింకర్స్ గానే మిగిలిపోతాము. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు కర్మ లేదా పని అన్నది అప్పుడు ప్రారంభం కాదు కదా. పని ప్రారంభం కానప్పుడు ఆ దేవుడైనా నిన్ను కాపాడలేడు కదా. 


కర్తవ్యం నీ వంతు: 


శ్రీకృష్ణ పాండవీయం అనే సినిమాలో ఓ చక్కటి పాట గుర్తుకు మీకు కూడా గుర్తుకు వచ్చే ఉంటుంది. 

  “మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా” - ఈ పాటలో ఓ చోట... “కర్తవ్యం నీ వంతు. కాపాడుట నా వంతు. చెప్పడమే నా ధర్మం వినకబోతే నీ కర్మం .

 భగవద్గీత సారాన్ని కవి చక్కగా రెండు లైన్లలో చెప్పేశాడు . 

 ఇప్పుడు నేను ఓ కథ చెబుతాను. 


అన్నదమ్ముల కథ : 


ఒక ఊర్లో  ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో పెద్ద వాడు సోమయ్య, చిన్న వాడు శంకరయ్య. వాళ్ల నాన్న పోతూపోతూ ఇద్దరికీ సమానమైన స్థలాలు ఇచ్చాడు. అందులో హాయిగా ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉండమని చివరి మాటగా చెప్పాడు. సరే, పెద్ద వాడు సోమయ్య బుర్ర అమోఘం. ఆలోచించడంలో దిట్ట. ఈ విషయంలో ఊర్లో గొప్ప పేరే గడించాడు. తన ఆలోచనలను రచ్చబండ మీద గంటల కొద్దీ చెప్పినా గుమి గూడిన జనం జారుకునే వారు కాదు. “ఇంకా చెప్పండి..” అంటూ సంతోషంగా తలలు ఊపేవారు. 

 ఇక రెండో వాడు శంకరయ్య. ఇతగాడికి తన అన్నలా మాట్లాడే శక్తి అబ్బలేదు. మాటలతో అందర్నీ ఆకర్షించే శక్తి లేకపోవడంతో ఊర్లో వాళ్లు ఇతగాడిని పెద్దగా పట్టించుకునేవారు కారు. అయితే శంకరయ్యలో ఓ గుణం ఉంది. అదేమంటే, తన స్థాయికి తగ్గట్టుగా, స్తోమతకు తగ్గట్టుగా చక్కటి ఆలోచనలు చేసి, వాటిని కార్యాచరణలో పెట్టేవాడు. శంకరయ్య భార్య పార్వతమ్మ కూడా భర్తకు సహకరించేది. ఉన్నదాంతో వీరి కుటుంబం సంతోషంగా ఉండేది. సరే, తండ్రి ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుందామని భర్తకు చెప్పడంతో స్తోమతకు తగ్గట్టుగా తనకు లభించిన స్థలంలో శంకరయ్య చక్కటి పూరి గుడిసె వేసుకున్నాడు. “పొత్తు కుదిరితే పూరి పాకైన చాలు “ అన్న సినిమా పాటలో లాగా పార్వతమ్మ నిత్యం గౌరమ్మ తల్లిని పూజిస్తూ సంతోషంగా ఉంది. 

ఇక అన్న సోమయ్య సంగతి చూద్దాం.సోమయ్య మంచి ఆలోచనాపరుడని ఊర్లో పేరుంది కదా. దీంతో ఇతగాడు తనకు అందిన స్థలంలో ఊరంతా మెచ్చుకునేలా ఇల్లు కట్టుకుంటాడని జనం అనుకున్నారు. అనుకోవడమేమిటీ, ఆ మాట సోమయ్యే రచ్చబండ దగ్గర పదేపదే చెప్పేవాడు. 

 “నా స్థలంలో పెద్ద భవంతి లేపుతాను. రాజ్ మహల్ లా ఉంటుందనుకో...” ఇలా బోలెడు కబుర్లు చెప్పాడు. ఇతగాడి వాక్ చాతుర్యానికీ, ఆలోచనా విధానికి జనం మెచ్చుకున్నారు. 

కానీ, ఏళ్లు గడుస్తున్నా సోమయ్య ఇల్లు కట్టలేదు. శంకుస్థాపన మాత్రం చేసి ఊరుకున్నాడు. ప్లాన్ కాగితాలు మాత్రం ఇంట్లో దొంతరుగా అటక కూడా ఎక్కేసింది. 


ధింకర్ : సగం దూరం నడిచిన బాటసారి: 


  ఈ కథలో లాగానే కొంత మంది తమ స్థాయికి మించి ఆలోచనలు చేసి, అవి తీరక చివరకు నిరాశ చెందుతుంటారు.  అందుకే ఆలోచన చేసేటప్పుడే కార్యాచరణలో వచ్చే ఇబ్బందులను కూడా ఊహించి ప్లాన్ తయారు చేయాలి. 



  థింకర్స్ పరిధి ఊహాశక్తికి సంబంధించినది. ఆ తర్వాత పని యొక్క  పరిధి ప్రారంభమవుతుంది. 

  ఆలోచనతో ఆగిపోయేవారు కలల ప్రపంచంలో కాలం వెల్లబుచ్చుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది...?

   థింకర్ అన్న వాడు ఎలాంటి వాడంటే...సగం దూరం మాత్రమే ప్రయాణం సాగించిన వాడు. ఇంకా సగం ప్రయాణం (పని) మిగిలే ఉంది.  అదే డూయర్ సగంలో ఆగిపోడు- సరైన ఆలోచనే చేయగానే దాన్ని విశ్లేషించుకుంటాడు.    

తన ఆలోచనలను అమలు పరుస్తాడు. అందుకు శ్రమిస్తాడు. రేపు అన్న మాట రాకుండా ఏ రోజు పని ఆరోజు పూర్తి చేస్తాడు. కష్టం విలువ రాబడతాడు. దీంతో అనుకున్న సమయానికి పని యొక్క ఫలితాన్ని చక్కగా అందుకుంటాడు.

ఇక్కడ భగవద్గీత లోని మరో అంశం గుర్తుచేసుకోవాలి. కర్మలు లేదా పనులు చేసినంత మాత్రాన సానుకూల ఫలితం వస్తుందని అనుకోకూడదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అంటాడు... “కర్మల అందే నీకు అధికారము కలదు, లేదు కర్మ ఫలములందు “ అని. 

ఈ టాపిక్ గురించి నేను కొంత మంది వ్యక్తులు వారి ఆలోచనలు, పనుల విషయం గురించి చెబుతాను. 


జెఆర్ డి టాటా : 


 ముందుగా J.R.D. Tata గారిని తీసుకుందాం. ఆయన అతి గొప్ప ఆలోచనా పరులు. అంతే స్థాయిలో పనులు చక్కబెట్టగలిగిన ధీరుడు. భారతదేశపు విమానరంగంలో ఆధ్యుడు, పితామహుడు. 


కిరణ్ మజుందార్ షా: 


సరే మరో మహనీయుడు Kiran Mazumdar-Shaw వీరు భారత బయోటెక్నాలజీ రంగంలో ఆద్యులు. అంతర్జాతీయ బయో ఫార్మసిటికల్ రంగంలో పేరు గడించిన వ్యక్తి. తన ఆలోచనలను కార్యరూపంలో పెట్టడంలో దిట్ట. 


రతన్ టాటా :


ఇక రతన్ టాటా గురించి మనలో చాలా మందికి తెలుసు కదా. దిగువ మధ్యతరగతి కుటుంబాల వారి వాహన కష్టాలు చూసి నానో కారుని తీసుకువచ్చిన మహానుభావుడు. 

ఇక ప్రపంచ స్థాయిలో అనేక మంది తమ పనులతో పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతానికి రెండు మూడు పేర్లు ప్రస్తావిస్తాను. 


ఎలన్ మస్క్ : 


   ఎలన్ మస్క్.  ఈయన పారిశ్రామిక వేత్త. ఈయన పేరు చెప్పగానే “స్పేస్ ఎక్స్” గుర్తుకు వచ్చే ఉంటుంది. 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ మరో వ్యోమగామిని సురక్షితంగా భూమికి దింపే రెస్క్యూ ఆపరేషన్ లో ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ సాయపడింది.  మస్క్, ఎలక్ట్రానికి కార్లు, సోలార్ సిటీ ...ఇలా వినూత్న ఆలోచనలతో దూరదృష్టితో మస్క్ సాగిపోతున్నాడు.  


మలాలా : 


Malala Yousafzai (మాలాలా యూసఫ్ జాయ్) ప్రతి ఆడ బిడ్డకు విద్యనభ్యసించే హక్కు కోసం పోరాటం చేసి నొబెల్ శాంతి బహుమతి అందుకున్న ధీర మహిళ. ఆమె పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో పుట్టారు. తాలిబాన్లు ఈ లోయను స్వాధీనం చేసుకుని బాలికల పాఠశాలను తగులబెట్టారు. ప్రతి ఆడబిడ్డకూ విద్యను అభ్యసించే హక్కు కోసం ఆమె అప్పటి నుంచి పోరాటం సలిపారు. ఆమెకు యావత్ ప్రపంచం అండగా నిలిచింది. ఉగ్రవాదుల అరాచకాలపై  తీవ్ర స్థాయిలో గళమెత్తి పోరాటం చేసిన ధీర వనిత. 


బిల్ గేట్ : 



 ఈ క్రమంలో మైక్రో సాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్  పేరుని  కూడా ప్రస్తావించాలి. 

ఆయన కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపకులే కాదు, దానశీలి, ప్రపంచ దేశాల వారంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన వ్యక్తి. అంతే కాదు, మారుమూల ప్రాంతాల వారు కూడా విద్య నేర్చుకునే సదుపాయాల కోసం పాటుపడుతున్న వ్యక్తి. 

 వీరందరూ  ఈ స్థాయికి ఎదగడానికి ప్రధానమైనది వారి ఆలోచనా విధానమే. అయితే కేవలం ఆలోచనతో ఆగిపోకుండా కార్యోన్ముఖులై అఖండ విజయాలను అందకున్నారు. 

 చక్కటి ఆలోచన - సరైన పనితీరు ఉంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సమాజం హర్షించే స్థాయికి ఎదుగుతారు. ఈ సానుకూల దృక్పథం ఆలవాటు మనమంతా అలవాటు చేసుకుందాం. 


-తుర్లపాటి నాగభూషణ రావు

(ఈ వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్,  మోటివేషనల్ స్పీకర్)

సెల్ నెంబర్ : 9885292208

కాకుల రొదలో కోకిల పాట

 


తుర్లపాటి ఆలోచన సుగంధం 

(తెలివితేటలు మసకబారితే ఏం చేయాలి?)

  హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్ 

“కాకుల రొదలో కోకిల పాట”.  ఈ టాపిక్ ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. ఈ సమాజం చిత్రమైనది. కాలం ఎంత మారుతున్నా, దశాబ్దాలు , శతాబ్దాలు దొర్లుతున్నా మనిషి నైజం మారడం లేదు.  ఆ వివరాలు చెప్పే ముందు..

  “మతి తప్పిన కాకుల రొద  “ గురించి మాట్లాడుకుందాం. 

 ఒక అడవిలో చాలా కాలంగా పెద్ద వృక్షం మీద ఒక కాకుల మంద నివసిస్తున్నది. అదే అడవిలో చాలా చక్కగా పాడే కోకిలలు కూడా ఉన్నాయి. అందులో ఒక కోకిల పాడటంలో చాలా ప్రావీణ్యం సంపాదించింది. అయితే అనుకోకుండా అది కాకుల మంద ఉన్న చోటుకు వెళ్ళాల్సి వచ్చింది. అసలే కాకులు, ఆ పైన వాటి మతి చెడింది. ఇక వాటి రొద చెప్పనలవి కాకుండా ఉంది.  అంతలో వసంత ఋతువు వచ్చింది. కొత్త ఆకులతో చెట్లు కళకళలాడిపోతున్నాయి. ఆ చిగుళ్లు తిన్న కోకిల చక్కగా పాడుతోంది. అయితే కాకులు ఆ పాటను చెవికెక్కించుకోవడం లేదు. పైగా కోకిలను ఎగతాళి చేస్తూ ఎడిపించసాగాయి. మతి తప్పిన కాకుల రొదలో మౌనమే మెరుగు అనుకున్నది కోకిల. 

  Among the Fools a wise one always be wrong  అని అంటారు కదా. కోకిల పరిస్థితి అదే అయింది. సొసైటీలో ఇలాంటి కాకుల మందలు మనకు తారసపడుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి మందలకు భయపడి కోకిలలా మౌనంగా ఉండటమా లేక ఎదిరించడమా?? ఆలోచించండి.  పాడటం మనేయకూడదు.  ఇదే సరైన నిర్ణయం. ఆ మంద నుంచి వీలైనంత త్వరగా తప్పుకుని తన తెలివికి మరింత మెరుగు పెట్టాలి. ఈ కష్టకాలం ఎక్కువ కాలం ఉండదన్న స్పృహతో తన పని తాను చేసుకుంటూ పోవాలి. 

చరిత్ర చెప్పిన సత్యాలు 

మానవ ఆవిష్కరణ ల చరిత్ర తిరగేస్తే ఈ సత్యమే కనబడుతుంది. 

ఈ మధ్య నేను సోషల్ మీడియాలో ఒక ఫొటో చూశాను. ఆ చిత్రంలోని విషయం గురించి కాస్తంత వివరంగా చెబుతాను. అది తప్పు చేసిన వారిని కఠినంగా ఉరి శిక్ష  విధించే స్థలం. ఉరి శిక్ష అమలు చేయడం కోసం “ఎలక్ట్రిక్ బల్బు తల” గాడిని ఉరి తీయడానికి “కొవ్వొత్తి తలల ముఠా”  లాక్కుని వెళుతుంటుంది. ఇది కేవలం చిత్రమే అయినా చరిత్రలో జరిగిన ఎన్నో విషాద సంఘటనలకు ప్రతీకగా నిలిచింది.  ఎలక్ట్రిక్ బల్బు తల వాడంటే ఎలక్ట్రిక్ బల్బు ని ఆవిష్కరించిన వాడన్న మాట.  ఇక కొవ్వొత్తి తలల వాళ్ళంతా కొత్తని స్వాగతించక పాత పద్ధతినే పట్టుకుని వ్రేలాడే వారు. వీరంతా మతి తప్పిన కాకుల్లా ప్రవర్తిస్తూ సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణ చేసిన వ్యక్తిపైనే నేరారోపణ చేశారు. 

  ఎలక్ట్రిక్ బల్బు తయారుచేసినప్పుడు అప్పటి వరకు వెలుగు కోసం కొవ్వొత్తులు వాడే వారికి తెగ కోపం వచ్చింది.  అంతే స్థాయిలో భయం కూడా కమ్మేసింది. వారిలో చాలా మంది తిరుగుబాటు చేశారు. ఈ శాస్త్రీయ ఆవిష్కరణ వల్ల మానవ జాతికి ముప్పు తప్పదంటూ ఘాటుగా వ్యతిరేకించారు. ఎలక్ట్రిక్ బల్బు తాయారు చేయడానికి ప్రయత్నించే వారిపై అభియోగాలు మోపారనీ, వారిని శిక్షించేదాకా వదిలిపెట్ట కూడదని అర్థం వచ్చేలా ఈ చిత్రం ఉంది.  


వేలసార్లు విఫలమైనా..


  థామస్ ఎడిసన్ కి గానీ, హంప్రీ డేవ్, జోసెఫ్ విల్సన్ వంటి వారికి గానీ బహుశా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. అలా అని వారు తమ ప్రయోగాలు నిలిపివేసి ఉంటే   ఈరోజున విద్యుత్ బల్బుల వినియోగం ఇంతగా పెరిగేదేనా? ఆలోచించండి. ఎవరు ఎంతగా ఈసడించుకున్నా ఎడిసన్ తన ప్రయోగాలు మానలేదు. తాను అనుకున్న లక్ష్యానికి చేరే లోపు ఎడిసన్ కొన్ని వేల సార్లు విఫలమయ్యారు.  ప్రతి వైఫల్యాన్ని మెట్టుగా మలుచుకుని విజయ శిఖరం చేరుకున్నాడు. విఫలమైనప్పుడల్లా సమాజం నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాడు. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినా తన శక్తి మీద, విజ్ఞానం మీద నమ్మకం ఉంచి ఎడిసన్ చివరకు విజయం సాధించాడు. అప్పటి వరకు ఎగతాళి చేసిన వారే , ఎడిసన్ ఆవిష్కరణలను స్వాగతించారు. 

   

సూటిపోటి మాటలు

మనం ఉండే సమాజపు పోకడ గురించి క్షుణ్నంగా తెలుసుకుంటే ఎంచుకున్న బాటలో మన నడక సజావుగా సాగుతుంది. అలా కాని పక్షంలో మతి తప్పిన కాకుల రొదలోనే మన ప్రయాణం సాగించాల్సి వస్తుంది. రాత్రికి రాత్రి సమాజాన్ని మార్చలేము. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న సమాజం క్షేమం కోసమే ఒక పని లేదా ఆవిష్కరణ సాగించినా దాన్ని వెంటనే సమాజం హర్షించదు. పైగా సూటి పోటి మాటలతో మనల్ని వెనక్కి తోస్తుంటుంది. పిచ్చి వాడని ముద్రవేస్తుంది. 

 కాకుల గోల చేస్తున్నా పట్టించుకోకుండా తన పనిని చక్కబెట్టుకోవడం చాలా కష్టమైన విషయం. కాకిగోల చేసే వారంతా ఒకటై  “మా వాదనే కరెక్టు, నీ పోకడే తప్పు “ అని తీర్మానించేసుకుని మనల్ని తప్పుబడుతుంటారు.  ఇలా గోల చేసే వారిలో మన స్నేహితులు ఉండవచ్చు. అలాగే మన బంధువులూ ఉండవచ్చు. వీళ్లు మారరు. మనల్ని మారనీయరు. చేతులకీ కాళ్లకు మాటలతో సంకెళ్లు వేస్తుంటారు. ఇలాంటి వాళ్ల ఆలోచనలు తప్పని తెలిసినా మనం వారి నుంచి దూరంగా పారిపోలేము. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఒక భాగం. తప్పు వారిదే అయినా ఒప్పుకోరు. అడ్డంగా వాదిస్తుంటారు. ఇలాంటి కాకులు ఏకమై మనల్ని శిక్షించాలనుకుంటారు. కట్టుబాట్లతో వేధింపులకు గురిచేస్తారు. 

వేధింపులు - చాంధస భావాలు: 

 అత్తగారి వేధింపులతో కోడలికి ఉన్న పాజిటీవ్ ఆలోచనలు అధఃపాతాళానికి వెళ్ళిపోతుండటం అక్కడక్కడా మనం చూస్తూనే ఉన్నాం.

అమ్మానాన్నల చాంధస భావాల వల్ల పిల్లల ఎదుగుదల కుంటుపడవచ్చు. అలాగే స్నేహితుల నెగెటీవ్ థాట్స్ వల్ల మనలోని పాజిటివీ థింకింగ్  మసకబారిపోవచ్చు. 

 అందుకే అంటారు, నీ చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులను బట్టి నీ పోకడలను అర్థం చేసుకోవచ్చు. నీలోని మంచి ఆలోచనలు మసకబారే దాకా ఈ నెగెటీవ్ గ్రూప్ ఊరుకోదు. అనేక ఒత్తిళ్లకు గురిచేస్తుంటుంది. 

 కానీ ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ నిలబడి , అవమానాలు ఎన్ని ఎదురైనా ప్రయత్నం మానకుండా చివరకు విజయ శిఖరానికి చేరుకున్న వారు ఎందరో ఉన్నారు. వారినే మనం ఆదర్శంగా తీసుకోవాలి.

సుశృతుడు: 

ఇక్కడ నేను  భారతీయ వైద్యరంగం నిపుణుడైన సుశృతుడు గురించి ఆయన ఆవిష్కరణల గురించి గుర్తుచేస్తాను. ఆరవ శతాబ్దానికి చెందిన సుశృతుడు వైద్య రంగంలో విశిష్ట సేవలందించారు. మన దేశంలో ఆ రోజుల్లోనే ప్లాస్టిక్ సర్జరీ చేసిన మేధావి. ఒక సారి సైనికుడొకడు ముఖానికి అయిన గాయాలతో సుశృతుడి ఆశ్రమం దగ్గరకు వస్తే అతనికి శస్త్ర చికిత్స చేశాడాయన. ముక్కు చితికిపోతే నుదుటి మీద ఉన్న చర్మం తీసి ముక్కుకి అతికించాడు. దీన్నే మనం ఈనాడు “రినో ప్లాస్టీ “ అంటున్నాము. ఒక చోట ఉన్న చర్మం తో మరో చోటకు గ్రాఫ్టింగ్ చేసే ప్రక్రియను ఆనాడే చేసి చూపించిన అద్భుత సర్జన్ సుశృతుడు. ఆ రోజుల్లో ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు వికటించినప్పుడల్లా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయినా వెనుకడుగు వేయకుండా విమర్శించిన సమాజమే హర్షించే స్థాయికి ఎదిగాడు.

కోపర్నికస్: 

 ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేసిన కోపర్నికస్ అనే శాస్త్రవేత్త  “హీలియో సెంట్రిక్ మోడల్ “ని ప్రతిపాదించినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. అప్పటి వరకు భూమి చుట్టూనే సూర్యుడు తిరుగుతుంటాడన్న పాత వాదనను విడిచిపెట్టి కోపర్నికస్ వాదనను అంగీకరించడానికి చాలారోజులే పట్టింది. మరో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో విషయంలోనూ అదే జరిగింది. 

 అంతాదాకా ఎందుకు అహింసావాదంతోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని మహాత్మా గాంధి అన్నప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. హింసకు హింసే సమాధానం అని రెచ్చగొట్టారు. కానీ చివరకు మన దేశానికి శాంతి, అహింసలే స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చాయి . 

 ఈ సందర్భంగా చాణిక్యుని గురించి ప్రస్తావిస్తాను. 

రాజుని మార్చిన చాణక్యుడు:

చాణక్యుడు  మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తి చంద్రగుప్తుని కి సలహాదారునిగా ఉండేవారు. ఆయన మహా మేధావి. రాజసభలో చుట్టూ చేరిన వందిమాగధులు చక్రవర్తిని అదేపనిగా పొగుడుతుండటంతో అహంకార మత్తు తలకెక్కిన చంద్రగుప్తుడు రాజసభలో ఒక ప్రకటన చేశారు. అదేమంటే, ఈ భూమి మీద తానే తెలివిగల రాజుననీ తనకు సాటి మరెవరూ లేరని ప్రకటించారు. అది తెలుసుకున్న చాణక్యుడు రాజుకు బుద్ధి చెప్పాలని వ్యూహం పన్నాడు. రాజు వెళుతున్న దారిలో అడ్డుగా పెద్ద బండరాయి ఉంచాడు. రాజు ఆ బాటలో వెళుతూ రాయిని చూసి ఆగిపోయాడు. “ఆ రాయిని తొలగించండి “ అంటూ భటులను ఆజ్ఞాపించాడు. అప్పుడు అక్కడకు చేరిన చాణక్యుడు  రాజుతో...”రాజా భటులకు చెప్పడం ఎందుకు, మీరు చక్రవర్తి కదా..ఆ రాయినే మీరు ఆజ్ఞాపించండి. భయపడి అదే తొలిగిపోతుంది” - అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి “అదెలా సాధ్యం , రాయి ఎక్కడైనా కదలమంటే కదులుతుందా ?!“ అని ప్రశ్నించాడు. అప్పుడు చాణక్యుడు ఇలా  అన్నాడు... “రాజా , రాయి లాగానే మీ ఆలోచనలకు తగ్గట్లుగా తమరు ఇచ్చే ఆజ్ఞలు పాటించే పరిథి ఈ లోకంలో చాలా స్వల్పం. రాజన్న వాడు మూర్ఖంగా ఆలోచించకూడదు. తమకున్న పరిథి తెలుసుకుని మెలగాలి” అని వివరించాడు. రాజుకు జ్ఞానోదయం అయింది. తనలోని ఛాందస భావాలకు స్వస్తి చెప్పాడు. ఫలితంగా మెరుగైన ఆలోచనలు, ఆవిష్కరణలతో రాజ్యం విరాజిల్లింది.


ఏప్రిల్ ఫూల్స్ : 


 “ఏప్రిల్ ఫూల్ “ అంటూ ఏప్రిల్ ఫస్ట్ నాడు - పొరపాటుబడిన వారిని ఫూల్స్ జాబితాలో చేర్చేసి ఆట పట్టించడం మనం చూస్తూనే ఉన్నాము. చరిత్ర తిరగేస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. జనవరి ఫస్ట్ ని నూతన సంవత్సర ఆరంభంగా భావించే పద్ధతి రాకముందు పురాతన రోమ్ లోనూ, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఏప్రిల్ 1వ తేదీని నూతన సంవత్సరాదిగా భావించేవారు. అయితే జనవరి 1న న్యూయిర్ డేగా చేసుకునే గ్రెగోరియన్ పద్ధతి వచ్చి జనంలో బాగా నాటుకుపోయినప్పటికీ అక్కడక్కడా కొంత మంది పాత పద్ధతిలోనే అంటే ఏప్రిల్ 1నాడే న్యూయర్ డే జరుపుకునే వారు. అలా జరుపుకునే వారిని “ఏప్రిల్ ఫూల్స్ “ అంటూ ఆటపట్టించడం అప్పుడే మొదలైంది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. 

  జనమంతా ఎటు ఉంటే మనమూ అటే ఉండాలా..లేక ఎవరేమనుకున్నా మన దారి మనదే అన్నట్లు ఉండాలా ?అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తలెత్తే సమస్య. దీనికి సరైన సమాధానం ఏమిటంటే, మన ఆలోచన సమాజానికి మేలు జరిగేదని పూర్తిగా విశ్వసించే పక్షంలో మిగతా వారి పోకడలను చూసి మనం భయపడకూడదు. మన విశ్వాసాన్ని , నమ్మకాన్ని చేతులారా నాశనం చేయకూడదు. 

 కొన్ని కుటుంబాలను నేను చూశాను. వారు ఎవ్వరినీ ఫాలో అవరు. ఆధ్యాత్మిక సంప్రదాయాల విషయం లో కానీయ్యండి, లేదా ఆచారాల పట్టింపు విషయంలో కానీ వారు ఇతరులను ఫాలో అవ్వరు. తమకు ఎది మంచిదని భావిస్తే దాన్నే ఆచరిస్తుంటారు. సొసైటీ పరంగా వీరు ఆడ్ గా బిహేవ్ చేస్తున్నట్లు లెక్క. కానీ వారి ఆలోచనలు సరైన కోణంలో ఉంటే మిగతా వారిని పట్టించుకోనక్కర్లేదు. “నీదారి నీదే సాగిపోరా..” అంటూ పోతుండాల్సిందే. కాకుల మందలో కోకిలలాగా ...తెల్ల గొఱ్ఱెల మందలో నల్ల గొఱ్ఱె లాగా ధైర్యంగా సాగిపోవాలి. సమాజం ఇవ్వాళ కాకపోతే రేపు నిన్ను గుర్తిస్తుంది. అంతిమ విజయం నీ సొంతం అవుతుంది. 

 - తుర్లపాటి నాగభూషణ రావు

(వ్యాస రచయిత మోటివేషనల్ స్పీకర్ మరియు సీనియర్ జర్నలిస్ట్) 

ఫోన్ నెంబర్ : 9885292208 

(WhatsApp)



పిల్లల అల్లరి - సృజనాత్మకత



ఆలోచనా సుగంధం 

రచన : తుర్లపాటి నాగభూషణ రావు 

———————

హాయ్   ఫ్రెండ్స్ ఈ రోజు నేను   “పిల్లల్లో అల్లరి - సృజనాత్మక తరంగాలు “ అన్న అంశం మీద కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పిల్లల ఆలనా పాలనా చూస్తున్న వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ప్రస్తావిస్తున్నాను. 

   ఆ మధ్య నేను మా స్నేహితుని అబ్బాయి వాళ్లింటికి వెళ్ళాను. దంపతులిద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉండటంతో పెళ్ళైన ఐదారేళ్ల లోనే లంకంత ఇల్లు కొనేశాడు.  అంకుల్ మీరు తప్పకుండా గృహప్రవేశానికి రావాలంటూ బలవంతపెట్టాడు. ఫంక్షన్ కి వెళ్ళడం కుదుర లేదు. ఆ తర్వాత వీలు చూసుకుని  నేనూ మా ఆవిడ ఆ అబ్బాయి వాళ్లింటికి  వెళ్ళాము. ఈ దంపతులకు ఓ చిన్న బాబు ఉన్నాడని తెలిసి వాడి కోసం ఓ రెండు బొమ్మలు, చాక్లెట్లు తీసుకువెళ్ళాము. సరే, మేము వెళ్ళేటప్పటికే దంపతులిద్దరూ పిల్లవాడ్ని అరుస్తున్నారు. వాడేమో బిక్కుబిక్కుమంటూ ఓ మూలన కూర్చున్నాడు. మమ్మల్ని చూడగానే దంపతులు అరవడం ఆపేసి, రాని నవ్వుని ముఖం మీద పులుముకుని - “రండి అంకుల్ ..రండి..”అంటూ ఆహ్వానించారు. కానీ, వారి కళ్ళలో కోపం తగ్గలేదు. పిల్లవాడేమో బెదిరిపోతున్నాడు. ఇల్లంతా తేరపారా చూశాను. హాల్లో ఆటవస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. గోడల మీద రకరకాల రంగుల్లో వంకర టింకర గీతలు, రకరకాల విచిత్ర ఆకారాల్లో బొమ్మలు గీసి ఉన్నాయి. అప్పుడర్థమైంది. పిల్లవాడు కొత్త ఇంటి గోడలను పాడుచేశాడనే తల్లిదండ్రులు ఒకటై వాడ్ని అరుస్తున్నారని. 

  మనలో చాలా మంది ఇలాంటి సంఘటనలను చూసే ఉంటాము. ఇక్కడ ఒక సున్నితమైన విషయం ఆలోచించాలి. తల్లిదండ్రులేమో గోడ పాడైపోతుందనో లేదా ఇళ్లంతా చిందరవందర అయిపోయిందనో కంగారు పడిపోతుంటారు. సోపాలో పిల్లవాడు కూర్చుని  ఆడుకుంటుంటే వాడి పై బోలెడు ఆంక్షలు పెడతారు. గోడలు పాడు చేస్తున్నాడని ఒక సారి, సోపా పాడైపోతుందని ఇంకో సారి, రకరకాల రంగు ద్రావకాలు నేలమీద పోసి ఫ్లోర్ పాడుచేస్తున్నాడని మరో సారి...ఇలా పిల్లలను అరిచే తల్లిదండ్రులను చూస్తూనే ఉంటాము. 



అల్లరి కాదు..



  నిజమే, ఇదంతా చూస్తుంటే పిల్లలు చేసే పనులు “అల్లరి చేష్టలు” గానే అనిపించవచ్చు. ఇక్కడ మనం ఓ విషయం గమనించాలి. అదేమంటే, ఇలా పిల్లలను అరుస్తూ పోతుంటే వారిలోని సృజనాత్మకతకు మనమే చేతులారా అడ్డుకట్ట వేసిన వారమవుతామన్న సంగతిని గమనించాల్సిందే. ఫూలిష్ గా కనిపించే పిల్ల చేష్టల్లో ఎంతో సృజనాత్మకత (క్రియేటివిటీ) ఉన్నదన్న సంగతి తరచి చూస్తేనే కాని అర్థం కాదు. అలా అని గోడలు, నేల పాడుచేసే పిల్లలను ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు. వారి ఆలోచనలకు తగ్గ వాతావరణం ఇంట్లో మనం కల్పిస్తున్నామా అన్నది ఆలోచించాలి. నాలుగైదు గదులున్న ఇంట్లో వారు స్వేచ్ఛగా తిరగడానికీ, వారనుకున్న ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి కనీసం..కనీసం ఒక్క గదన్నా ఇస్తున్నామా ? అని ఆలోచించాలి కదా. ఒక వేళ ఇచ్చినా అది కూడా మిగతా గదుల్లాగా అతి శుభ్రంగా ఉండాలనుకోవడం, ఇంటిని నీట్ గా ఉంచేలా పిల్లలు కూడా బిహేవ్ చేయాలనుకోవడం తల్లిదండ్రుల్లో చాలా మంది అనుకునేదే.  మీకో విషయం తెలుసా? దాదాపు 60 శాతం మంది పిల్లల్లో క్రియేటివిటీ తగ్గిపోతున్నదని ఓ సర్వే చెప్పిన వాస్తవం.

 సృజనాత్మకతకు ఉన్న  ప్రాధాన్యత తల్లిదండ్రులు గమనించాలి. ఇక్కడే చాలా మంది పప్పులో కాలేస్తున్నారు. మనం తప్పు చేస్తూ ఆ తర్వాత మా వాడు సరిగా ఎదగడం లేదంటూ వాపోవడం ఏ మాత్రం సబబు చెప్పండి ? 



అల్లరి నుంచి ఆవిష్కరణలు: 



 క్రియేటివిటీ నుంచే ఎన్నో ఆవిష్కరణలు వెలుగు చూశాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. అంతే కాదు, క్రియేటివిటీ వల్ల సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుంది. నైపుణ్యత పెరుగుతుంది. మరి వీటన్నింటినీ మొగ్గ దశలోనే త్రుంచి వేసే అధికారం ఈ పెద్దలకు ఎవరు ఇచ్చారు ? 

   మన దేశంలో ఎంతో మంది శాస్త్రవేత్తల ఆవిష్కరణల వెనుక ఉండే ఆలోచనల మూలాలు చిన్నతనంలో మొలకెత్తినవే. ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త ఆర్యభట్ట గురించి వినే ఉంటారు కదా. ఆయన తన చిన్నతనంలో సూర్య చంద్రాది ఖగోళ వింతల పట్ల ప్రభావితులై . బంక మట్టితో ఉండలు చేసి వాటినే  గ్రహాలుగా భావించి తోటి స్నేహితులతో ఆడుకునే వారట. క్రీస్తుశకం 476 నుంచి 550 వరకు జీవించి ఉన్న ఆర్యభట్ట గణిత మేధావిగా, ఖగోళ శాస్త్రవేత్తగా ఎదగడానికి బీజాలు  చిన్నతనంలో పడినవే.

  “ఫ్లిప్ కార్ట్ “ పేరిట పాపులరైన ఇ- కామర్స్ వేదిక వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదిగాడంటే ఆయన తల్లిదండ్రులు చిన్నతనం నుంచి ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. 

 పిల్లలు చేసే ప్రతి పనినీ అల్లరి క్రింద జమకట్ట కూడదు. వారిలోని ఆలోచనా తరంగాల పోకడను పసిగట్టాలి. అవి పాజిటీవ్ గా ఉంటే ప్రోత్సహించాలి. ఒక వేళ నెగిటీవ్ గా ఉంటే నేర్పుగా పిల్లల్లో మార్పు తీసుకురావడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. 


రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచన:


  మన దేశపు ప్రముఖ సాహితీ వేత్త రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ, `నీ ఆలోచనలకు తగ్గట్టుగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని  ఎప్పుడూ కలలు కనకండి. ఎందుకంటే వారు మీ ముందు తరం కాలానికి చెందిన వారు. ఈ విషయం గమనించండి' అని అనేవారట.   

  పిల్లల్లోని భావతరంగాలను అర్థం చేసుకుంటూ వారి ఎదుగదలకు సంబంధించి ప్రతి రోజూ కొంత టైమ్ కేటాయించాలి. అందుకు తగ్గ వాతావరణం ఇంట్లో కల్పించాలి. చక్కటి వాతావరణంలో విద్య నేర్పే స్కూల్స్ లో చేర్పించాలి. పిల్లల ఎదుట పాజిటీవ్ అంశాల గురించే ఎక్కువగా మాట్లాడుతుండాలి. వారి భవిష్య ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని అవసరమైనప్పుడు తల్లిదండ్రులు కూడా మారాలి. 


అబ్దుల్ కలాం :


 ఈ సందర్భంగా శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి  ఎపిజె అబ్దుల్ కలాం గారి మాటలు గుర్తుచేసుకుందాం..

`మానవాళి భవిష్య విజయాలకు నేటి పిల్లల్లోని సృజనాత్మకతే కీలకమైనది. ఈ విషయాన్ని గుర్తించి తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి'


అల్లరోడు : 


  “పిల్ల చేష్టలు”, “అల్లరి” - వంటి పదాలను ప్రయోగించేటప్పుడు కాస్తంత ఆలోచించండి. నిజంగా మీ పిల్లలు చేసేది అల్లరేనా? అవి పిల్లచేష్టలేనా?

 ఒక సారి మీ పిల్లవాడిని `అల్లరోడు' అని మీరే ముద్ర వేసేస్తే ఎలా చెప్పండి ! అప్పుడేమవుతుంది..భవిష్యత్తులో వాడు నిజంగానే అల్లరోడి గానే సమాజంలో గుర్తించబడతాడు. వాడిలోని పాజిటివ్ క్రియేటివిటీ క్షీణిస్తుంది. దీని వల్ల కేవలం మీ కుటుంబానికే కాదు, ఒక్కోసారి దేశానికి కూడా మీరు నష్టం కలిగించిన వారవుతారు. 

 పిల్లలు ఊహాలోకంలో విహరించడం తమ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రవర్తించడం తప్పు కాదు. ఈ విషయం పెద్దలు గ్రహించాలి. 

 ప్రముఖ శాస్త్రవేత్త ఐనిస్టీన్  ఇలా అనే వారు...`జ్ఞాన సంపాదన కంటే ఊహించడం, ఆలోచనా శక్తి పెంచుకోవడం గొప్ప “


 మీ పిల్లవాడు గోడల మీద గీతలు గీసినా, గోళీలతో ఆడినా, అట్ట పెట్టలను చింపి కొత్త ఆకారాలను సృష్టించాలనుకుంటున్నా ఇవన్నీ అల్లరి పనులు కావు , అవి ఆ పిల్లవాని “భవిష్య లోకానికి బాటలు” అని గ్రహించాలి. 


పిల్లవాడు - బురదలో కమలం :



  ఒక పిల్లవాడు కొలను దగ్గర ఆడుకుంటూ ఉండగా వాడికో ఆలోచన వచ్చింది. వెంటనే బురద బురదగా ఉన్న కొలనులోకి  దిగాడు. వొళ్లంతా బురద అంటింది.  వేసుకున్న దుస్తులు పాడైపోయాయి. అయినా అతని ఆలోచన బురద లో నుంచే పుట్టిన కమలం మీదనే ఉంది. నేర్పుగా కమలం చేతికందిపుచ్చుకుని ఇంటికి చేరాడు. పిల్లవాడు బురద పూసుకుని రావడంతో తల్లి మందలించింది. కానీ వాడు అదేమీ పట్టించుకోకుండా కమలం వువ్వును నీటితో కడిగి దాన్ని ఇంట్లోని పూజా మందిరంలో ఉన్న అమ్మవారి పటం దగ్గర ఉంచాడు. ఆ దృశ్యం చూసిన తల్లికి తాను చేసిన తప్పు అర్థమైంది. అప్పటి నుంచి పిల్లవాడిలోని సృజనాత్మకత పెరిగేలా చక్కటి వాతావరణం సృష్టించింది. చివరకు అతను ఓ ప్రముఖ బోటనిస్ట్ గా ఎదిగాడు. సమాజానికి పనికొచ్చే ప్రయోగాలు ఎన్నో చేయగలిగాడు.  

  పిల్లల పెంపకంలో పెద్దలు గమనించాల్సిన అతి ముఖ్యమైన వాటిలో పిల్లల సృజనాత్మకత కూడా ఒకటి.  పిల్ల కోసం అవసరమైతే మారడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. 

 - తుర్లపాటి నాగభూషణ రావు

(ఈ వ్యాస రచయిత మోటివేషనల్ స్పీకర్ మరియు సీనియర్ జర్నలిస్ట్) 

ఫోన్ నెంబర్: 9885292208





మెదడుకు పట్టిన బూజు దులపండి





(తుర్లపాటి ఆలోచన సుగంధం) 

   హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను “మెదడుకు పట్టిన బూజు దులపండి” అన్న  అంశంపై మాట్లాడతాను. 

  నేను ఇలా అనగానే -  “నోరుని శుభ్రం చేసుకోవడం విన్నాను, కాళ్లూ చేతులూ శుభ్రం చేసుకోవడం విన్నాను. ఆ మాట కొస్తే కడుపుని శుభ్రం చేసుకోవడమూ విన్నాను, కానీ ఇదేమిటీ మెదడును శుభ్రం చేసుకోమంటున్నారు !” అని మీరు అనుకోవచ్చు. 

 మన ఇంటిని అనేక సార్లు శుభ్రం చేసుకుంటూ ఉంటాము .  పండగలు వచ్చినా  అతిథులు వస్తున్నారని తెలిసినా మన ఇంటిని ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకుంటాము. బూజు కర్ర పట్టుకుని ఇంట్లోని బూజుని దులుపేస్తుంటాము. చేతి గుడ్డతో తలుపులు, కిటికీలు తుడుస్తాము .  మరి మన మెదడు సంగతి ఏమిటి? దాన్ని శుభ్రం చేసుకోవాలని మీకెప్పుడూ అనిపించ లేదా?? ఆలోచించండి. 

 నేనేమంటానంటే , మెదడుని కూడా శుభ్రం చేసుకోవాలని. ఇంటికి బూజు పట్టినట్లే మెదడుకి “బూజు “ పడుతుంటుంది. అలాగే వదిలేస్తే మెదడు పాతబడ్డ కొంపలా మారిపోతుంది. సోమరిపోతులా ఉండే వాడి మెదడు దెయ్యాల కొంపగా మారిపోతుందని మన పెద్దలు చెబుతుంటారు కదా. నిజానికి సోమరి పోతుల్లోనే కాదండోయ్, అతిగా  నెగెటీవ్ గా ఆలోచించే వారిలోనూ, ప్రతిదానికీ భయపడిపోయే వారి లోను ఇలా మరికొన్ని ప్రత్యేక లక్షణాలున్న వారి మెదళ్లు కూడా బూజు పట్టిన దెయ్యాల కొంపల్లా మారిపోతాయి. 




 మనం ఓ చక్కటి ఇల్లు కట్టుకుంటాము. ఆ ఇంటికి అందమైన పెయింట్లు వేయిస్తాము. ఇంట్లో సర్వాంగ సుందరంగా ఫర్నీచర్ అమరుస్తాము. ఆ ఇంటిని అమితంగా ప్రేమిస్తుంటాము. నిజం చెప్పాలంటే ఇంటిని ప్రేమించినంతగా మన శరీరాన్ని కూడా ప్రేమించడం లేదేమో... కొన్ని  అవయవాల గురించి అయితే పట్టించుకోము. ఓ సారి ఆలోచించండి... మీ కాలేయం ఎలా ఉన్నది ? మీ గుండె ఎలా కొట్టుకుంటున్నది ? మీ ఊపిరితిత్తుల పని తీరు ఏ విధంగా ఉంది ? మీ మెదడు పరిస్థితి ఏమిటి ? ఈ ప్రశ్నలు మీలో ఎంత మంది వేసుకుంటున్నారు. పైపై అందాల కోసం రకరకాల కాస్మొటిక్స్ వాడే మనం - లోపలి అవయవాల గురించి అంతగా పట్టించుకుంటున్నామా...??



నెగెటీవ్ ఆలోచనే పెద్ద బూజు: 



  సరే, మెదడుకి బూజు దులపడం ఎలా.. ? ఇది కూడా ఆలోచించాలి. మెదడుకు బూజు అంటే నిజంగా బూజు పట్టిందని కాదు.  నెగెటీవ్ ఆలోచలు చేస్తూ చివరకు అవే నిజమనీ, అవే శాశ్వతమని నూటికి నూరుశాతం నమ్మేసి , ఇతరులను నమ్మించడానికి ప్రయత్నించే వారి మెదళ్లు బూజు పట్టినట్లే లెక్క. “బూజు కర్ర”  తీసుకుని దులపడం మొదలుపెట్టకపోతే అతి త్వరలోనే వీరి జీవితం దుర్భరమవుతుంది. అతిగా ఆలోచించడం ఎంత ప్రమాదమూ, ఆలోచనలు మందగించడమూ అంతే ప్రమాదమని గ్రహించాలి. 

  అతిగా ఆలోచించడం గురించి ఓ సంఘటన చెబుతాను. మా ఊర్లో ఒక కుటుంబం ఉంది. 

 

భయ భ్రాంతుల నిలయం: 


ఇంటి పెద్ద ప్రతి చిన్న విషయానికీ భయపడుతుంటాడు. అతిగా ఆలోచిస్తుండటంతో లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా భావించుకుంటాడు. రోడ్డు మీద నడిచి వెళితే ప్రమాదం జరుగుతుందేమో అనుకుంటాడు. సైకిల్ మీద వెళ్ళాలన్నా, కారులో వెళ్ళాలన్నా భయం.  ఇక విమానం గురించి చెప్పేదేముంది. “తెనాలి” అనే సినిమాలో హీరో లాగా అన్న మాట. ఈ భయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంటి సభ్యుల విషయంలో అతి ప్రేమ చూపిస్తుంటాడు. ప్రేమతో ఎదుటి  వారి కాళ్లకు సంకెళ్ళు వేస్తుంటాడు.  తాను కదలడు, ఇతరులను ముందుకు కదలనివ్వడు. దీంతో చివరకు ఆ ఇల్లు  “భయ భ్రాంతుల నిలయం” గా మారిపోతుంది.



బూజు పట్టిన బంగళా : 



  మరొక ఇంట్లో  ఒకాయన ఏదీ ఆలోచిస్తున్నట్లు కనబడడు. హాల్ లో పడక కుర్చీలో కూర్చుని తనకు ఎదురుగా ఉన్న ట్యూబ్ లైట్ నో గోడకు తగిలించిన బొమ్మనో గంటల కొద్దీ చూస్తూ కాలం గడుపుతుంటాడు. ఒక సలహా ఇవ్వడు. ఒక వేళ ఇచ్చినా దాన్ని ఇంట్లోని వారు పాతచింతకాయ పచ్చడి అంటూ తీసిపారేస్తుంటారు. కొంత కాలం గడిచే సరికి ఆ ఇల్లు బూజు పట్టిన బంగళాలా తయారైంది. అందులో తిరుగుతున్నదీ మనుషులేనా అన్న అనుమానం కలుగుతోంది. 


యాక్టీవ్ మోడ్ : 


  ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆలోచనలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. బ్రెయిన్ ని యాక్టీవ్ మోడ్ లో ఉంచుకోవాలి. ఇంట్లోని ఒకని ఆలోచనలు నెగెటీవ్ గా సాగితే దాని ప్రభావం ఇతర ఇంటి సభ్యులమీదనే కాదు, క్రమంగా అది సమాజ స్థాయికి పాకుతుంది. ఈ సమస్యని వ్యక్తిగతమైనదిగా భావించకూడదు. సమాజ రుగ్మతగానే భావించాలి. 


90 శాతం సక్సెస్ రేట్ : 


 జీవితంలో జరిగే సంఘటనల్లో 90 శాతం నీ ఆలోచనల ఆధారంగా చేసే పనుల వల్లనే సంభవిస్తుంటాయి. నీ ఆలోచనలు సరిగా ఉంటే ప్రతి పని నుంచి 90 శాతం సక్సెస్ రేట్ సాధించుకోవచ్చు. ఆలోచనలు నెగెటీవ్ గా ఉంటే విజయావకాశం కేవలం పది శాతమే ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, మనం ఎటు పోతున్నాము. కీర్తి శిఖరాలను అధిరోహించిన ఎందరో మహానుభావుల ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనించండి. చార్లెస్ రోజెల్ స్విండాల్ అనే మత బోధకుడు తన రేడియో ప్రసంగాల ద్వారా చెడు లక్షణాలను ఎలా వదిలించుకోవాలో తరచుగా చెబుతుంటారు.  90 శాతం సక్సెస్ రేట్ సూత్రం ఆయన చెప్పిందే. 



ఒక రోజు ఆలోచించడం మానేస్తే.. : 


   ఈ ప్రపంచం ఎప్పుడూ మారుతుంటుంది. ఎన్నో నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. నదిలో పాత నీరు పోయి కొత్త నీరు వచ్చి చేరినట్లు ఎప్పటి కప్పుడు సమాజపు రూపురేఖలు మారిపోతుంటాయి.  మనం ఒక రోజు పాటు ఆలోచించడం మానేస్తే, మర్నాటి కల్లా చాలా దూరం వెనకబడిపోతాము. జీవితం ఓ పరుగు పందెం. కేవలం నడక మాత్రమే నేర్చుకున్న బాలుడు తనకు ఇది చాలని అనుకుంటే అతను ఏనాడూ పరుగెట్టలేడు, విజేత కాలేడు.  అసలు మనం ఎవరితో పోల్చుకుంటున్నాము? ఎవరిని అనుసరిస్తున్నాము?? ఎటు పోవాలనుకుంటున్నాము? ఈ అంశాలమీద క్లారిటీ లేకపోతే మెదడుకు పదును పెట్టకపోతే కచ్చితంగా అది దెయ్యాల కొంపగా మారిపోతుంది. చివరకు నీ భ్రమలూ, భ్రాంతులే ఎంతో విలువైన నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అందమైన నీ జీవన సౌధం కుప్పకూలిపోతుంది. చేతులారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వారమవుతాము. 


  సమస్యలు లేని జీవితం ఉండదు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందన్న స్పృహ ఉండాలి. సమస్య పరిష్కారం కొరకు సరైన కోణంలో ఆలోచించాలి. కార్యాచరణకు దిగాలి. ఇందాక చెప్పినట్లు 90శాతం విజయం సాధించడానికి ఈ సూత్రం పనికొస్తుంది. మిగిలిన పది శాతం మన చేతుల్లో లేనిది. కానీ మనలో కొంత మంది ఆ పది శాతం గురించే ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఫలితంగా తమ కళ్లెదుటే పరిష్కార మార్గం కనిపిస్తున్నా గుర్తించలేరు. అందుకే అతిగా ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. చాలా సమస్యలపై విజయం సాధించేది మనలోని ప్రశాంతతే అని గుర్తించాలి. ఇక్కడ ఓ కథ చెబుతాను.

   ఒక యువకుడు నదిలో పడవ మీద వెళుతున్నాడు. అంతలో వరద రావడంతో అతను నడుపుతున్న పడవ అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. అతని లో భయం ఆవహించింది. చూట్టూ చూశాడు. మిగతా పడవల పరిస్థితి కూడా అలాగే ఉంది.  ఒక వృద్ధుడు మాత్రం తన పడవని చాలా చాకచక్యంగా వొడ్డుకు చేరుస్తుండటం గమనించాడు. ఆ పడవ దగ్గరకు రాగానే యువకుడు అడిగాడు, “తాతా, నీ పడవని నీవు ఎలా వొడ్డుకు చేరుస్తున్నావు? ఆ కిటుకు చెప్పు”  - అంటూ అడిగాడు. అప్పుడు ఆ తాత నవ్వుతూ, `నాయనా, నేను ప్రత్యేకంగా ఏమీ ప్రయత్నించడం లేదు. నేను ప్రశాంతంగా పడవ నడుపుతూ నా పని నేను చేసుకు పోతున్నాను. అంతే ' అని సమాధానమిచ్చాడు. 

  మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఏదో జరిగిపోతుందన్న భయం తొలిగిపోతుంది. ఫలితంగా నీ పని మీద శ్రద్ధ పెరుగుతుంది. చివరకు విపత్తు నుంచి బయట పడగలుగుతాము. 

 మన ఆలోచనలు అపసవ్యంగా ఉంచుకుని భగవంతుని మీద భారం వేయడమూ, పరిష్కారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదు. జీవితాన్ని నందన వనంలా మలుచుకుంటామా లేక కీకారణ్యంలా మారుస్తామా అన్నది 90 శాతం మన చేతుల్లోనే ఉంది. ఓ సారి మీరూ ఆలోచించండి.


 - తుర్లపాటి నాగభూషణ రావు 


( వ్యాస రచయిత మోటివేషనల్ స్పీకర్ మరియు సీనియర్ జర్నలిస్ట్ . ఫోన్ : 9885292208 - వాట్సప్)