8, మార్చి 2014, శనివారం

శివున్ని ఏ పూలతో పూజిస్తే ఏ ప్రాప్తి లభ్యమవుతుంది?


శివున్ని ఏ పూలతో పూజిస్తే ఏ ప్రాప్తి లభ్యమవుతుంది? 
ఉమ్మెత పూలతో పూజిస్తే పుత్రప్రాప్తి , 
జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి,
తుమ్మి పూలతో పూజిస్తే మోక్ష ప్రాప్తి,
నందివర్థనం తో పూజిస్తే సౌందర్య ప్రాప్తి,
నువ్వుపూలతో పూజిస్తే యవ్వన ప్రాప్తి,
గన్నేరు పూలతోపూజిస్తే శత్రునాశనం,
శిరీష పుష్పాలతో సంతోషం మీ సొంతమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
పూజిస్తే సంతోషం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయ.


శివలింగానికి అభిషేకం ఎందుకు ? 

శివ లింగానికి అభిషేకం ఎందుకు చేయాలి ? శాస్త్రాలు చెబుతున్నది ఏమంటే...లోక సంరక్షణార్థం హాలాహలాన్ని(విషం) మింగిన ఆ స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా చేసే ప్రక్రియ అభిషేకం. పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరినీరు అనే పంచామృతాలతో స్వామిని అభిషేకిస్తే స్వామి చల్లబడతాడు, సంతోషిస్తాడట. అందుకే ఈ అభిషేకాలు.

ఏది శైవం మరేది కాదు..

శివమూర్తిని పూజించి, అర్చించే విధానాన్నే శైవమని అంటారు. ఈ శైవం ఎనిమిది రకాలు.
ఆ 8 రకాల శైవం వివరాలు ఇవి...అనాది శైవం, ఆది శైవం, పూర్వ శైవం, విశ్ర శైవం, శుద్ధ 
శైవం, మార్గ శైవం, సామాన్య శైవం, వీర శైవం. ఈ ఎనిమిదింటిలో ప్రముఖమైంది వీర శైవం. తాము చేసే పూజా విధానంలో ఎటువంటి లోపం జరిగినా, ఎలాంటి ఆటంకం కలిగినా ప్రాణాలను గడ్డిపోచతో సమానంగా వదిలివేయడం వీర శైవంలోని ప్రధాన లక్షణంగా చెబుతుంటారు. అయితే కాలంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగానే వీరశైవ ఆరాధాకుల్లో కూడా ఇప్పుడు అంతటి పట్టింపులు ఉన్నట్టు కనబడటంలేదు. 

శివపురాణం:

అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.
శివ పురాణములో 26,000 శ్లోకాలు (మరొక లెక్కన) ఉన్నాయి. శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు

శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున (అంటే శివరాత్రి రోజునే) దీక్షను తీసుకుంటారు. ఇక భారత దేశంలో 12 చోట్ల ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిశాయి. లింగం జ్యోతిరూపంలో వెలిసిన క్షేత్రాలివి.
రామనాథ ఆలయం, రామేశ్వరం, తమిళనాడు
మల్లికార్జునేశ్వర ఆలయం, కృష్ణా నది తీరంలో, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
భీమశంకరం, డాకిని, పూణ దగ్గర, మహారాష్ట్ర
త్ర్యంబకేశ్వరాలయం, గోదావరి నదీ తీరంలో, నాసిక్ దగ్గర, మహారాష్ట్ర
గుస్మేశ్వర ఆలయం, ఔరంగాబాద్ దగ్గర, మహారాష్ట్ర
ఓంకారేశ్వరాలయం, నర్మదా నదీతీరంలో, అమలేశ్వర్, మధ్యప్రదేశ్
సోమనాథ్ ఆలయం, సోమనాథ్, గుజరాత్
నాగనాథ ఆలయం, దారుకావన, ద్వారక దగ్గర, గుజరాత్
మహాకాళేశ్వర ఆలయము, శిప్రా నదీ తీరంలో, ఉజ్జయిని
కేదరేశ్వరాలయం, కేదారనాథ్, ఉత్తరాచల్
కాశి విశ్వనాథుని ఆలయం, వారాణసి, ఉత్తరప్రదేశ్
వైద్యనాధుని ఆలయం, జైసిద్ దగ్గర, బీహార్


శివరాత్రి జాగారం

శివరాత్రి జాగారం చేస్తే కలిగే లాభం ఏంటిట? దీనికి శివపురాణం ఏమని చెబుతుందంటే... పర్వదినం, పుణ్యదినం అయిన శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే సమస్యలు నివారింపబడతాయి. కోరికలు సఫలమౌతాయి. పెళ్ళి కానివారికి పెళ్ళి అవుతుంది. తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. సద్గతులు లభిస్తాయట. (కేవలం మెలుకువగా ఉండటంకాదండోయ్. శివధ్యానంలో తనువూ, మనసూ ఆ పరమేశ్వరునికి సమర్పించాలి. అదే నిజమైన జాగారం)


(వీటిపై మీ అభిప్రాయాలను కోరుతున్నాను)
                                                                 - నాగభూషణ రావు తుర్లపాటి - 988 529 2208

రామాలయం పునర్నిర్మాణం

చిన్న ఊరు. ఆ ఊరికి తగ్గట్టుగానే ఓ చిన్ని ఆలయం. అది రాములవారు కొలువైన ఆలయం. ఆంజనేయులవారు అభయం ఇస్తున్న ఆలయం. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలన్న సంకల్పం ఊరి పెద్దలకు కలిగింది. గుడి ఆనుకుని ఒక వైపు ఊరి ప్రధాన రోడ్డు ఉంది. దీంతో అటువైపు విస్తరించే అవకాశం లేదు. దానికి వ్యతిరేక దిశలో ఉన్న ఖాళీ స్థలంలో కొంతభాగాన్ని ఊరి రైతు మల్లయ్య ఆలయం కోసం  ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో ఈఏడాది శ్రీరామనవమి అయిన తర్వాత పునర్నిర్మాణ పనులు చేపడతారు. పనులన్నీ పూర్తయ్యాక ఈ ఫోటోలో మీరు చూస్తున్న రామాలయం కనిపించదు. కొత్త అందాలతో సాక్షాత్కరిస్తుంది.
రామాలయం విస్తరణకు స్థలం ఇచ్చిన రైతుతో తుర్లపాటి నాగ్

    మా ఊరి నడిబొడ్డున ఉన్న ఈ రామాలయానికి వెనుక వైపున మైయిన్ రోడ్డుపైనే ఉత్తర ముఖద్వారంతో మా ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎప్పుడూ సెంచరీ కొట్టేసింది. పడిపోవడానికి సిద్ధంగా ఉంది. మేము చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అడవిరావులపాడు వెళ్ళినప్పుడు మండుటెండలో ఆడుకోవడానికి ఈ రామాలయం మాకో వేదికగా ఉండేది. అక్కడి బండలమీద పచ్చీస్, మేక-పులి ఆటలు ఆడుకోవడానికి గళ్లు గీసి ఉండేవి. ఊర్లోని వాళ్లు అక్కడచేరి ఆటలు ఆడుకునేవారు. ఒక రకంగా చెప్పాలంటే మండువేసవిలో చల్లనినీడ ఇస్తుండేది ఈ రామాలయం. చల్లని పాలనకు సంకేతంగా నిల్చిన రామాలయం ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఆ శ్రీరాముడు మా ఊరుని చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాను.
                                                                                         - తుర్లపాటి నాగభూషణరావు - 988 529 2208

తుర్లపాటి ప్రసాద్ గృహప్రవేశ వేడుక

తుర్లపాటి ప్రసాద్ తో నాగ్ (గృహప్రవేశ వేడుకలో)
మార్చి 7వ తేదీన (2014) మా తుర్లపాటి వంశస్థుడైన తుర్లపాటి ప్రసాద్ నూతన గృహప్రవేశ వేడుక హైదరాబాద్ లోని షేక్ పేట్ దర్గా సమీపంలోని ఓ.యుకాలనీలో (వెస్ట్రన్ ప్లాజా- బి.104) వైభవంగా జరిగింది. మర్నాడు 8వ తేదీన రుద్రాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు నేనూ, నా కుటుంబసభ్యులు వెళ్లాం. తుర్లపాటి శ్యామమోహన్ రావు కుమారుడైన ప్రసాద్ చాలా చురుకైన కుర్రాడు. అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి.
ప్రసాద్ తల్లిదండ్రులు

  ప్రసాద్  ప్రస్తుతం అమెరికాలోని San Antonio, Texas లో ఉంటున్నారు. ఇతను టాటా కన్ సల్టెన్సీ సర్వీసెస్ లో అమెరికా బిజినెస్ యూనిట్ లో గ్లోబల్ క్లైంట్ డెరెక్టర్ గా పనిచేస్తున్నారు.

  గృహప్రవేశ వేడుక సందర్భంగా బంధుమిత్రులను కలుసుకునే అవకాశం నాకు కలిగింది. ఈ శుభసందర్భంలో తుర్లపాటి ప్రసాద్ కుటుంబసభ్యులకు - తుర్లపాటి -అడవిరావులపాడు (పల్లెగాలి) హార్ధిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.
(ఈ వేడుకలో పాల్గొన్నవారు ఇతరులు మరింత సమాచారం అందిస్తే సంతోషిస్తాను)
- మీ తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208

   

4, మార్చి 2014, మంగళవారం

పారిశ్రామిక వాడగా అడవిరావులపాడు ఎదగబోతున్నదా ?


నందిగామ నుంచి అడవిరావులపాడు వెళ్తూ..
ఈ ప్రశ్న ఇప్పటికిప్పుడు ఆశ్చర్యాన్నీ, సందేహాలను కలిగించవచ్చు. చాలా ముందస్తు ఆలోచన అని కొట్టిపారేయవచ్చు.  కానీ, కాలచక్రాన్ని గిర్రున ఓ పదిపదిహేను సంవత్సరాలకు ఫార్వార్డ్ చేస్తే,  నేనిప్పుడు ఈ బ్లాగ్ లో రాస్తున్న మాటలు యధార్థమయ్యాయని మీరే అంగీకరిస్తారు. ఇలా నేను రాయడానికి చిలకజోస్యమో, లేదా కోయదొర జోస్యం మీదనో ఆధారపడలేదు. నా లాజిక్స్ నాకున్నాయి. అవి నిజం అవుతాయన్న నమ్మకమూ నాకుంది.
1. అడవిరావులపాడు కృష్ణాజిల్లా నందిగామ మండలంలో ఉంది. ఇది, నందిగామ పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది .
2. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో రియల్టర్ల దృష్టి ఇప్పుడు సీమాంధ్రలోని ఇతరప్రాంతాలతోపాటు, నందిగామ మండలంలోని గ్రామాలమీద కూడా పడింది.
3. నందిగామ నుంచి అడవిరావులపాడు గ్రామానికి వెళ్ళే దారిని చీల్చుకుంటూ  విజయవాడ- హైదరాబాద్ బైపాస్ రోడ్డు వెళుతుంటుంది.
4. ఈ బైపాస్ రోడ్డు దాటాకనే , అడవిరావులపాడు గ్రామంవైపునే పక్కా రోడ్డుకుఆనుకునే ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేసింది.
5. అది దాటాక మరికొంత దూరం (రావులపాడు వైపుకే) వెళితే ఎడమ చేతివైపున ఒక డొంకదారి వస్తుంది. ఆ దారివెంట లోపలికి వెళితే అక్కడ దాదాపు 30 ఎకరాల్లో ఓ ప్యాక్టరీని నిర్మించడానికి ప్రాంతీయపార్టీకి చెందిన రాజకీయ నాయకులొకరు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
6. అదే నిజమైతే, ఆ ప్రాంతం చుట్టుపక్కల కూడా మరిన్ని ప్యాక్టరీలు, `రియల్' ప్రాజెక్టులు వచ్చే అవకాశం లేకపోలేదు.
రోడ్డు పక్కన మెట్టపొలంలో మెరప పంట

7. రోడ్ కనెక్టివిటీ బాగుండటం, పక్కనే వాగు ప్రవహించడంవల్ల నీటి ఎద్దడిఉండదు.
8. మెట్టపొలాలు కావడం వల్ల తక్కువధరలోనే పారిశ్రామికవేత్తలూ, రియల్టర్లు స్థలాలను సేకరించవచ్చు. ఇప్పటికే ఈ కారణంగా పొలాల రేట్లు రెండు రెట్లు పెరిగాయని అంటున్నారు.
9. విజయవాడకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగామ ప్రాంతం (రావులపాడు సహా) అభివృద్ధిచెందే ప్రాంతంగా మారబోతుందనడానికి ఇంతకన్నా ఆధారాలు మరేం కావాలి. సీమాంధ్రలోని ప్రతిగ్రామం అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పుడే హైదరాబాద్ కోల్పోయామన్న బాధ నుంచి విముక్తి దొరుకుతుంది.
                                                                              - తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208