ఒక్కో సారి జీవితంలో విచిత్రమైన పరిస్థితులు తలెత్తుతాయి.
ఆకలి వేస్తున్నది. తినడానికి ఆహారం చేతికి అందేటంత దూరంలోనే ఉంది. తినకూడదని ఎవ్వరూ అడ్డుపెట్టే వారూ లేరు. కానీ, తినలేకపోతున్నాను. కడుపులో ఆకలి ఎదురుచూస్తున్నది. చిన్నప్పటి నుంచి ఆకలి బాధ అంటే అంతగా ఎప్పుడూ తెలియని నాకు ఈ పరిస్థితి వింతగానూ, కాస్తంత చిరాగ్గాను ఉంది.
అది లండన్ లోని క్వీన్స్ హాస్పిటల్. హఠాత్తుగా వచ్చిన కడుపునొప్పి. అంతే, ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో అప్పటికప్పుడు అక్కడి సర్జన్లు ఆపరేషన్ చేశారు. 2025 జూలై చివర్లో ఆస్పత్రిలో చేరిన నేను ఆగస్టు 28న గానీ డిశ్చార్జ్ కాలేదు. సరిగా నెల రోజుల పాటు అక్కడే ఉండిపోయాను.
ఆ రోజు నాకు బాగా గుర్తుంది. రాత్రి ఒంటి గంట దాటింది. బాగా ఆకలి వేస్తున్నది. నిద్రని ఆకలి జయించింది. ఆస్పత్రి లో చేరిన మొదట్లో ఆకలి అంతగా వేయక పోయినా. తర్వాత నిదానంగా పరిస్థితి సర్దుకుంటున్నది.
నా రెండు చేతులను ఫ్రీగా కదిలించే పరిస్థితి లేదు. కుడివైపున ఆపరేషన్ వల్ల తిరగలేను. ఎడమ వైపున చేతికి సూదులు గుచ్చి బాటిల్ తో ఏదో ద్రావకం ఎక్కిస్తున్నారు. నేను చేతిని కదిలిస్తే ద్రావకం పోసిన సీసా, దాన్ని బిగించిన స్టాండ్ కది పడిపొవచ్చు. ఒక వేళ అలా జరిగితే కొత్త ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే బుద్ధిమంతుడిలా ఎటూ కదలకుండా పడుకున్నాను.
కానీ కడుపులో ఆకలి తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. నేను పడుకున్న బెడ్ కి ఎడమ వేపున ఒక చిన్న టేబుల్ వేశారు. దాని మీద వాటర్ జగ్, గ్లాస్, తినడానికి ఆహారపదార్ధాలు పెడుతుంటారు. అవి చేతికి అందేటంత దూరంలోనే ఉన్నాయి. కానీ చేయి కదిలించే పరిస్థితి మాత్రం లేదు.
లండన్ లోని ప్రతిష్టాత్మక ఆస్పత్రి అది. చాలా పెద్ద ఆవరణలో కట్టారు. అనేక భవంతులు తీర్చిదిద్దినట్లున్నాయి. పేషెంట్స్ కి ఆహ్లాదం కలిగించే ఉద్యాన వనం కూడా ఉంది. వైద్య పరంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పేషెంట్ కోలుకునే వరకు ఎంతో క్రమశిక్షణతో మరెంతో శ్రద్ధతో చూసుకునే స్టాఫ్ ఉండనే ఉంది. వైద్యుల పర్యవేక్షణ సరే సరి.
నేను యు.కె వెళ్ళడం ఇది ఐదవ సారి. మా అబ్బాయి వాళ్లు చాలా కాలం క్రిందటే యుకె లో స్థిరపడ్డారు. ఈ మధ్యనే మా అమ్మాయి వాళ్లు కూడా అక్కడికి వెళ్ళారు. రెండు కుటుంబాలు అక్కడే ఉండటంతో ఎంతో హుషారుగా మేము (శ్రీమతి పేరు శ్రీదేవి) లండన్ వెళ్ళాము.
సరదాగా సాగాల్సిన ఈ ట్రిప్ ప్రారంభం లోనే నా తీవ్ర అనారోగ్యం వల్ల మా కుటుంబసభ్యులు అందరిలో ఆందోళన కలిగించింది. కంటికి రెప్పలా చూసుకునే కొడుకు - కోడలు, అమ్మాయి -అల్లుడు. నేను కోలుకోవాలని నిత్యం షిర్డీ సాయిబాబాను ప్రార్థించే భార్య. 'తాత ఎలా ఉన్నాడు? ' అంటూ రోజూ తెలిసీ తెలియని వయసులో ప్రశ్నించే మనవళ్లు.
దేవుడు కరుణించాడు. వైద్యులు చక్కటి వైద్యం అందించారు. గ్రహణం విడిచింది. ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గడంతో ఐదారు రోజుల్లో బయటపడవలసిన నేను నెలరోజుల పాటు అక్కడే - క్వీన్స్ ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు జరిగింది ఈ విచిత్ర సంఘటన.
చిన్నప్పటి నుంచి ఆకలి బాధ పెద్దగా తెలియని జీవితం నాది. కానీ, ఇప్పుడు ఆ బాధ ఏమిటో తెలిసి వచ్చింది. ఎక్కువ తినలేకపోతున్నాను. ఇది నిజం. కానీ మూడు నాలుగు గంటల కొకసారి కొద్దిగా తినకపోతే నీరసం వస్తుండేది. కళ్లు బైర్లు కమ్మేవి. స్పృహ తప్పితే మళ్ళీ డాక్టర్లు హడావుడి చేస్తారన్నది నా భయం. అందుకే ప్రక్కనే ఆ చిన్న టేబుల్ మీదనే ఉన్న అరటి పండో, యాపిల్ పండో.. లేదా బ్రెడ్ ముక్కో తిని ఆకలి తీర్చుకోవాలన్నది నా ప్రయత్నం. టేబుల్ ఉన్న వైపు చూశాను. కదిలించ లేని చేతి వంక ఓ సారి చూసుకున్నాను.
ఎంత చిత్రం. అన్నీ ఉన్నా, తినడానికి పదార్ధాలు చాలా దగ్గరగానే ఉన్నా వాటిని అందుకోలేని పరిస్థితి. తినలేని స్థితి. అంత బాధలోనూ నవ్వు వచ్చింది. నీరసం వచ్చేలా ఉంది. నవ్వు మటుమాయమైంది.
నా బెడ్ ప్రక్కనే ఒక స్విచ్ ఉంది. అది ప్రెస్ చేస్తే చాలు స్టాప్ (నర్సులు లేదా అటెండర్స్) ఎలెర్ట్ అయి బెడ్ దగ్గరకు వస్తారు. కానీ దురదృష్టం. నా బెడ్ ప్రక్కన ఉండాల్సిన స్విచ్ క్రింద పడిపోయింది. నేను దానిని ఇక అందుకోవడం సాధ్యం కాదు.
అది ఒక లాబీ. అందులో నాలుగు మంచాలు ఉన్నాయి. ప్రతి రెండు బెడ్స్ మధ్యన ఫ్లెక్స్ బుల్ గా కర్టెన్స్ వ్రేలాడదీశారు. అవి గాలికి అటూ ఇటూ ఊగుతున్నాయి. అలా అవి కాస్తంత ప్రక్కకు జరిగినప్పుడల్లా ఎవరైనా అటుగా వస్తున్నారేమో అని ఎదురు చూడసాగాను. ప్చ్.. ఎవ్వరూ రావడం లేదు. అలా రెండు మూడు గంటల పాటు నిరీక్షణ. అప్పుడు వినిపించింది. ఓ నర్స్ గొంతు.
ఎవరో ప్రక్క బెడ్ మీది పేషెంట్ ఎమర్జెన్సీ స్విచ్ నొక్కడంతో నర్సు వచ్చినట్లుంది. ఈ అవకాశాన్ని నేను వదులుకోదల్చుకోలేదు. గట్టిగా అరిచే ఓపిక లేకపోయినా గట్టి ప్రయత్నమే చేశాను. ఫలించింది. ఏమి కావాలని అడిగింది. నా పరిస్థితికి జాలి పడింది. వెంటనే అరటి పండు, గ్లాస్ వాటర్ అందించింది. నా కళ్లు కృతజ్ఞతాపూర్వకంగా చూశాయి. ఆమె చిరునవ్వు నవ్వింది.ఆకలి తీరింది. మరో గంటన్నర గడిచిన తర్వాత అదే నర్సు నా బెడ్ వద్దకు వచ్చి బిపీ , షుగర్ టెస్ట్ చేసింది. 'షుగర్ లెవల్స్ కాస్తంత పెరిగాయండి'- అని అంది.
'కొద్ది సేపటి క్రిందటే అరటి పండు మీరే ఇచ్చారు కదా..' అన్నాను నవ్వుతూ. ఆ మాటలకు తానూ నవ్వింది. ఆమె లో ఓ అమ్మ ప్రేమ కనిపించింది.
ఆకలి అంటే ఏమిటో తెలిసింది. ఆహారం దగ్గరగా ఉన్నా తినలేని పరిస్థితి ఎలా తలెత్తుతాయో అర్థమైంది.
`హే భగవాన్.. ఈ లోకంలో ఎవ్వరూ ఆకలితో అలమటించకూడదు. అందరినీ చల్లగా చూడు తండ్రీ..' అంటూ మనసులోనే ప్రార్థన చేశాను.
