30, జులై 2024, మంగళవారం

18వ భాగం : తొలి వేషం

నేను నాన్న వైపే చూస్తున్నాను. నాన్న మాత్రం అద్దంలో తన ముఖం చూసుకుంటూనే ఉన్నారు. ఒక నిముషం కాదు, రెండు నిమిషాలు కాదు. ఐదారు నిమిషాలు శ్రద్ధగా అద్దం ముందు కూర్చోవడం వారానికి ఒక సారి జరిగే తంతే. అసలు మామూలుగా నాన్న జుట్టు దువ్వు కోవడానికి కూడా అద్దం ఎక్కువగా పట్టుకోరు. పట్టుకున్నా కేవలం అర నిమిషం లోపే. కానీ గడ్డం గీసుకునేటప్పుడు మాత్రం శ్రద్ధగా కూర్చుంటారు. పిల్లవాడినైన నాకు నాన్న గడ్డానికి సబ్బు పట్టించడం, ఆపైన పొలం దున్నతున్నట్లు ఓ పద్ధతిలో రేజర్ ని నడిపిస్తూ గడ్డం గీసుకోవడం భలేగా ఉండేది. ఈ దృశ్యాన్ని అదే పనిగా చూడటం ఓ గమ్మత్తుగా అనిపించేది. నాకు బాగా నచ్చేది ఏమిటంటే గడ్డానికి సబ్బు పట్టించడం. గుండ్రటి సబ్బు డబ్బాని గూట్లో నుంచి తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న అద్దం, రేజర్ తీసుకున్నారంటే చాలు నేను నాన్న ప్రక్కనో లేదా చాటుగా ఏ స్తంభం వెనకో నక్కో కళ్లార్పకుండా గడ్డం గీసుకోవడం అనే ఘట్టాన్ని ఆసక్తిగా చూసేవాడ్ని. అసలు గడ్డం గీసుకోవడం ఓ ఆర్ట్ అని చాలా గట్టిగా నమ్మేవాడ్ని. అంతే కాదు, గడ్డం గీసుకోవడం ఓ సాహస కృత్యం కూడానూ. ఒక్కోసారి గడ్డం గీసుకుంటుంటే నాన్న గడ్డానికి పట్టించుకున్న తెల్లటి సబ్బు నురగలో ఎర్రటి చారలు కనిపించేవి. అప్పట్లో అర్థం కాకపోయినా నాన్న చేతిలోని రేజర్ గాడే గడ్డం తెగెలా చేస్తున్న విలన్ అని తెలిసిపోయింది. సబ్బు తీసుకుని దానిపై కొద్దిగా నీళ్లు చల్లి బ్రష్ తో సబ్బు బిళ్ల మీద రుద్దడంతో సబ్బు ఆ బ్రష్ కి బాగా అంటుకోవడం, ఆ నురగను గడ్డానికి పట్టించుకోవడం. ఇదంతా చూస్తుంటే నాన్న మేకప్ చేసుకుంటున్నాడనే అనిపించేది. మేకప్ చక్కగా వేసుకుంటున్నప్పుడు మరి ఆయనెందుకు స్టేజీ ఎక్కడం లేదన్న డౌటూ వచ్చింది. నాటకం కోసం నేను తొలి వేషం కట్టడానికీ, నాన్న గడ్డం గీసుకోవడానికి సంబంధం ఉన్నదంటే మీరు నమ్మరు. కానీ ఇది నిజం. నాన్న గడ్డం – నాటకం : అది 1970 వ సంవత్సరం. అడవిరావులపాడులోని పెంకుటింట్లో నాన్న ఇలా గడ్డం గీసుకోవడం చూస్తున్నప్పుడే నాకు ఓ బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది. నేను వేయబోయే వేషానికి మేకప్ ఎలా చేసుకోవాలా అన్న సందేహం తీరింది అప్పుడే. మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అప్పటి వరకు నాన్న గడ్డం గీసుకోవడాన్ని అదే పనిగా చూస్తున్న నేను ఉన్నట్టుండి గెంతుకుంటూ హూషారుగా బయటకు వెళ్ళి ప్రెండ్స్ ని పోగేశాను. నా ఆలోచన చెప్పాను. `భలేగా ఉందిరా’ అనేశారు వాళ్లు. దీంతో ఆ పల్లెటూరులో డ్రామా ట్రూప్ సిద్ధమైందన్న మాట. నా తొలి నాటకం పేరు `జోకర్’. ఆ వేషం మాత్రం నాదే, ఫ్రెండ్స్ కి వేరే పాత్రలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మేరానామ్ జోకర్ : `మేరానామ్ జోకర్’ సినిమా గుంటూరులో చూసి ఆ వెంటనే అడవిరావులపాడు వచ్చేశాను . ఆ సినిమాలో జోకర్ వేషం నాకెంతో నచ్చింది. అందుకే మా నాటకంలో జోకర్ పాత్ర ప్రవేశించింది. మా చిట్టి నాటికలో జోకర్ గాడు స్టేజీ ఎక్కి చిటికీ మాటికీ `మేరానామ్ జోకర్.. మేరా నామ్ జోకర్ ‘ అంటుంటాడు. మిగతా పాత్రలు చుట్టూ చేరి తప్పట్లు కొడుతుంటాయి. అంతే డ్రామా. అంతకంటే ఎక్కువ సీన్లు లేవు. మా పల్లెటూర్లో ఈ నాటిక ప్రదర్శన కోసమే ఈ హడావుడి అంతానూ. `మేరానామ్ జోకర్’ సినిమా మరో రకంగా కూడా నాకు బాగా గుర్తుండిపోయింది. ఒక సినిమాకి ఒక ఇంటర్వెల్ ఉండటమే నాకు అప్పటి దాకా తెలుసు. ఈ సినిమా మొదటి సారి రిలీజ్ అయినప్పుడు నేనూ అన్నయ్యా వెళ్ళాం. చిత్రం ఏమిటంటే ఈ సినిమాకు రెండు సార్లు ఇంటర్వెల్స్ ఇచ్చారు. నిడివి ఎక్కువ కావడంతోనో మరే కారణమో తెలియదు కానీ ఫస్ట్ రిలీజ్ లో సినిమా బాగా ఆడలేదు. కానీ పదేళ్ల తర్వాత నిడివి తగ్గించి, ఒకే ఇంటర్వెల్ తో రిలీజ్ చేస్తే బాగా ఆడింది. మా ఊర్లో అంటే, నందిగామలో భారత్ టాకీస్, విజయా టాకీస్ అని రెండు థియేటర్లు ఉండేవి. ఇప్పుడైతే విజయటాకీస్ ఉంది, కానీ భారత్ టాకీస్ లేదు. ఈ భారత్ టాకీస్ ఉన్న ప్రాంతంలో రెసిడెన్సియల్ కాంప్లెక్స్ వెలిసింది. కానీ ఇప్పటికీ ఆ సెంటర్ ని భారత్ టాకీస్ సెంటర్ అనే పిలుస్తారు. లక్ష్మీ ప్రసన్నా, మయూరి పేరిట మరో రెండు సినిమా థియేటర్లు ఇప్పుడున్నాయి. నేను హైస్కూల్ లో చదువుతున్నప్పుడు భారత్ టాకీస్, విజయా టాకీస్ ల్లో సినిమాలు సింగిల్ ప్రొజెక్టర్లు తోనే నడిచేవి. ప్రతి సినిమాకీ నాలుగు రీల్ బాక్స్ లు వచ్చేవి. సింగిల్ ప్రొజెక్టర్ కనుక ఒక బాక్స్ లోని రీల్ అయిపోగానే రెండవది తీసి ప్రొజెక్టర్ లో బిగించాలి. దీనికి కనీసం ఓ ఐదారు నిమిషాలు పడుతుంది. సినిమా సగంలో వచ్చే `విశ్రాంతి’ కాకుండా , ఈ సింగిల్ ప్రొజెక్టర్ వల్ల మరో రెండు సార్లు అదనంగా బ్రేక్ లు వచ్చేవి. `మేరానామ్ జోకర్’ సినిమా గుంటూరులో చూసినప్పుడు రెండుసార్లు విశ్రాంతి కార్డ్ పడటం అప్పట్లో వింతగా చెప్పుకునే వారు. సరే, ఈ సంగతి ఎలా ఉన్నా, మేరా నామ్ జోకర్ సినిమాలో జోకర్ పాత్ర నాకెంతో నచ్చింది. ఆ పాత్ర ఎవరు వేశారో, ఆ కథ ఏమిటో సినిమా చూసినా నాకు అర్థం కాలేదు. కాకపోతే జోకర్ పాత్ర వేసిన వాడు సినిమాలో తెగ బాధపడుతుంటాడు. ఎంతగా అంటే భాష తెలియకపోయినా చూస్తున్న మన కళ్లు చెమ్మగిల్లేటంత. జోకర్ గాడేమో గడ్డానికి తెల్లటి రంగు పులుముకుని ముక్కుమీద ఎర్రటి రంగు అద్దుకుని తలపైన కుచ్చు టోపీ పెట్టుకుని సర్కస్ లో పాట పాడటం, ప్రేక్షకులను నవ్విస్తూ తాను మాత్రం ఏడవడం ఇవన్నీ నాకు బాగా నచ్చేశాయి. `నవ్వడం – ఏడ్వటం ఈ రెండూ చేయడం వస్తే నేనూ నటుడ్ని అయిపోతాను కదా. ఇప్పటికే ఈ రెండు బాగానే వచ్చేశాయి. నాన్న అరిస్తే ఏడుస్తాను. అమ్మ నవ్విస్తే నవ్వుతున్నాను కదా. నటుడికి కావాల్సిన అర్హతలు వచ్చేశాయ్. కాబట్టి నేనూ ఓ నటుడ్నే. నేనూ సినిమాల్లో నటించేయవచ్చు. స్టేజీ ఎక్కి నాటకాలు ఆడేయనూ వచ్చు’ - ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సినిమా చూసి ఇంటికి వచ్చిన దగ్గర నుంచీ ఈ జోకర్ గాడి గురించే నా ఆలోచన. నిద్రలో కూడా కలలోకి వచ్చేసే వాడు. కలలోని జోకర్ అదేమిటో అచ్చు నాలాగే ఉండే వాడు. జోకర్ పాత్ర పోషించాల్సిందేనని గట్టిగా అనేసుకున్నాను. ఇలా నేనేమో ఆలోచనలతో ఉండగానే సమ్మర్ సెలవలు వచ్చేశాయి. ఎప్పటి లాగానే గుంటూరులో ఎర్రబస్సు ఎక్కి నందిగామ వచ్చేసి ఆక్కడి నుంచి గూడు కట్టిన ఎడ్ల బండిఎక్కేసి మా ఊరు చేరే వాళ్లం. ఇదిగే ఇక్కడే నాన్న గడ్డం గీసుకుంటుంటే నాకు వచ్చిన ఫ్లాష్ లాంటి ఆలోచన జోకర్ పాత్ర మేకప్ సమస్యను తీర్చేసింది. జోకర్ వేషం వేయాలంటే తెల్లటి రంగు కావాలి, కానీ ఎక్కడ దొరుకుతుందన్న సమస్యకి పరిష్కారం దొరికింది. నాన్న గడ్డం గీసేసుకుని గడ్డం సామాన్లు గూటిలో పెట్టేసి ఆయన అటు స్నానానికి వెళ్లగానే నేను ఇటు గుండ్రటి సబ్బు పెట్టెను, నబ్బు గడ్డానికి పట్టించుకోవడానికి వాడే బ్రష్ ని అందిపుచ్చుకుని ఇంటి వెనుక ఉన్న వేపచెట్టు దగ్గరకు పరిగెత్తాను. సబ్బు అప్పటికే తడిసి ఉండటంతో బ్రష్ ని సబ్బు మీద రుద్దగానే తెల్లటి నురగ వచ్చేసింది. దాన్ని నా చిట్టి గడ్డానికి పట్టించుకున్నాను. అరే! అప్పుడు గుర్తుకు వచ్చింది, అద్దం తీసుకురావడం మరచిపోయానే అని. అలాగే ఇంట్లోకి పరిగెత్తి అద్దం తీసుకుని ముఖం చూసుకుని ఆశ్చర్యపోయాను. జోకర్ గాడిలానే కనిపించాను. కాకపోతే ముక్కుమీద ఎర్రటి రంగు లేదు, తలమీద టోపీ లేదు. అంతే. ఆలోచించడం మొదలు పెడితే ఎప్పుడో ఒకప్పుడు పరిష్కార మార్గం తడుతుంది. అదే నిజమైంది. ఎర్ర రంగు దొరికింది. అక్క బొట్టు పెట్టుకోవడం కోసం వాడే తిలకం, అమ్మ వాడే కుంకుమ నా మేకప్ అవసరాన్ని తీర్చేసింది. కళ్ల క్రింద నలుపు కోసం కాటుక డబ్బా లాగేసుకున్నాను. ఇలా మేకప్ సెట్ అమరింది. బస్సాటలో బహు పాత్రలు : ఇంటి ముందు వసారాలో ఓ మూలగా పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ తో నేను బల్ల మీదనే బోలెడు ఆటలు ఆడుకునే వాళ్లం. అందులో నాకిష్టమైనది `బస్సాట’. బల్లకి ఒక వైపున డ్రైవర్ కూర్చుంటాడు. వాడికి అటూ ఇటూ ఇంకెవరు కూర్చోకూడదు. అది రూల్. ఎర్ర బస్సెక్కినప్పుడల్లా చూసేవాడ్నిగా డ్రైవర్ సీట్ ని. వాడికో ప్రత్యేకత ఉంటుంది. వాడి ముందు ఓ చక్రం ఉంటుంది. దాన్ని అటూ ఇటూ తిప్పుతుంటాడు. మధ్యమధ్యలో ప్రక్కనే సన్నటి పుల్ల ఉంటే దాన్ని నొక్కుతాడు. అలా నొక్కగానే బస్సు హారన్ మోత మారుమ్రోగేది. రాత్రి పూటైతే మరో స్విచ్ నొక్కుతాడు. బస్సులో లైట్లు వెలుగుతాయి. అలాగే బస్సు ముందు పెద్ద లైట్లూ వెలుగుతాయి. డ్రైవర్ ని చూస్తుంటే పట్నంలో ఓసారి మెజీషియన్ చేసిన గమ్మత్తులు గుర్తుకు వచ్చేవి. డ్రైవర్ వెనుక ఓ వరసలో ప్రయాణీకులు కూర్చుంటారన్న మాట. ఈ ఆటలో నేను కాసేపు డ్రైవర్ మరి కాసేపు కండెక్టర్ . కండెక్టర్ పాత్ర కూడా చాలా గొప్పదే. ఏ బస్సు అయినా కండెక్టర్ చెప్పినట్లే వింటుందని బలంగా నమ్మేశాను. నేను ఎర్ర బస్సు ఎక్కినప్పుడు కండెక్టర్ నీ డ్రైవర్ ని అదే పనిగా చూసేవాడ్ని. కండెక్టర్ `రైట్’అంటేనే బస్సు కదిలేది. అసలు కండెక్టర్ ఓ `బాస్’ లా అనిపించేవాడు. వాడి మాటే శాసనం. బస్సు వేగంగా పోతున్నప్పుడు డ్రైవర్ ఉన్నట్లుండి బ్రేక్ వేసి ఆపేస్తుంటాడు. రోడ్డు మీద గేదెలు, మేకలు వచ్చినప్పుడు ఇలా ఆపేస్తుంటారన్న మాట. ఇంకో సారి ఎడ్ల బండ్లు అడ్డం వస్తుంటాయి. అలాంటప్పుడు డ్రైవర్ గారికి కోపం వచ్చేది. సైడ్ ఇవ్వమని అరిచేవాడు. అప్పుడు అనిపించింది, `ఎడ్ల బండి కంటే ఎర్ర బస్సు గొప్ప‘ అని. అప్పటి నుంచి బస్సాట పట్ల మక్కువ పెరిగింది. మా ఊర్లో పెద్ద బల్ల ఉన్నదని చెప్పాను కదా. అది చూడగానే బస్సాట ఆట ఆడాలనిపించేది. పిల్లల్ని పోగేసి గంటల కొద్దీ ఆడుకునేవాళ్లం. మధ్యలో గేదెలు అడ్డం వచ్చినట్లు, ఒక ప్రయాణీకుడు టికెట్ తీసుకోకపోతే అరచినట్లు, `ఖాళీ లేదు’ అంటూ, ఎక్కేవారిని క్రిందకి తోసేస్తున్నట్లు, నోట్లు చిల్లర లెక్క పెట్టుకున్నట్లు, మధ్యలో బస్సు ఆపించి చిద్విలాసంగా టీ తాగుతున్నట్లు ...ఇలా ఎన్నో సన్నివేశాలు ఈ బస్సాటలో చోటు చేసుకునేవి. అసలు బస్సాటతోనే నాలో ఒక నటుడు ఉన్నాడన్న సంగతి తెలిసింది. ఆటల్లోనే బస్సు కండెక్టర్ తో పాటుగా, ట్రాఫిక్ పోలీస్, పోస్ట్ మాన్, డాక్టర్ , టీచర్, పేపర్ బాయ్, ఎడ్ల బండి నడిపే జీతగాడు- వంటి పాత్రలు పోషించిన అనుభవం చాలా చిన్నప్పుడే వచ్చేసింది. కానీ నా నటనకు గుర్తుంపుకు రాలేదు. ఇదేగా నా బాధ. ఊర్లో ఓ నాటకం వేస్తే గుర్తింపు వస్తుందన్నది నా ప్లాన్ అన్న మాట. అంతే కాదు,`మేరానామ్ జోకర్ ‘ సినిమాలో జోకర్ గాడిలా గొప్ప హీరోని అయిపోవడమే నా లక్ష్యం. ఇంకెందుకు ఆలస్యం. నాటక ప్రదర్శన సన్నాహాలు మొదలయ్యాయి. సరిగా అప్పుడే, మా ఫ్రెండ్స్ లో కొందరు సందేహాలు లేవనెత్తారు. `ఒరేయ్ , నాటకం వేయాలంటే ఓ స్టేజ్ ఉండాలి గదరా?’ `ఉంది కదా మా పెద్ద బల్ల’ `స్టేజీకి ముందు తెర ఉండాలి?’ `ఓస్, అంతే కదా, ఓ తాడు కట్టి దుప్పటి దింపేస్తే పోలా’ `లైట్లు కావాలి?’ `పగటి పూట ఆడితే లైట్లు అక్కర్లేదు రా’ `మైక్ కావాలి’ `గట్టిగా అరచి చెబుతాను. ఉన్నది ఒక్కటే డైలాగ్ కదా, అదీ నాదే. అరిచి చెబుతాన్లే’ `ప్రేక్షకులు కావాలి?’ `ఊర్లోకి వెళ్ళి పోరగాళ్లకి చెప్పి పోగేద్దాం’ `మరి ముఖానికి రంగో...?’ `అవును ఇది కావాలి. అందుకేగా జోకర్ గాడికి మాత్రమే మేకప్. మిగతా పాత్రలకు నో మేకప్.’ అలా పకడ్బందీగా ప్లాన్ చేశానన్న మాట. నాటకం ఆడించడం డైరెక్టర్ పని అని ఆ తర్వాత తెలిసింది. కానీ ఇవన్నీ తెలియకుండానే పన్నెండేళ్ల వయసులోనే నాలోకి ఓ డెరెక్టర్ ప్రవేశించాడన్న సంగతి గుర్తించ లేదు. మొత్తానికి సబ్బు నురగ గడ్డానికి పట్టించి, ఇంట్లోనే ఉన్న కుంకుమ, తిలకం, కాటుక వంటివి ముఖానికి పూసేసుకుని జోకర్ ని అయిపోయాను. ఇదే నా తొలి వేషం. పల్లెటూరిలో జోకర్ వేషం వేయడానికి నేను చేసిన ప్రయత్నం ఆ తర్వాత నాటకరంగం వైపు నన్ను ఆకర్షింపజేసేలా చేసింది. పురస్కారాలు, ప్రశంసలు అందుకునేలా చేసింది. కాలేజీ ఓ నాటక ప్రయోగ శాల : నందిగామ కెవీఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు నాలోని `డైరెక్టర్’ ఒక కొత్త ప్రయోగం చేయించాడు. ఆ ప్రయోగం గురించీ, ఆ నాటిక గురించి ఇప్పటికీ ఆనాటి నా స్నేహుతులు గుర్తుచేస్తుంటారు. విష్ణు గాడైతే మరీను. మా నాటికకు వాడేమో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాడు. ఆదివిష్ణు నాటిక తీసుకుని మా కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో ప్రదర్శించాలనుకున్నాము. పాత్రధారుల ఎంపిక చేసే పనిలో పడ్డాము. సరే నేను ఒక పాత్ర తీసుకుని దర్శకత్వం బాధ్యత కూడా తీసేసుకున్నాను. మిగతా పాత్రల మాటేమిటి..? మా కాలేజీలో కో ఎడ్యుకేషన్. బీఎస్సీ ఫస్ట్ బ్యాచ్ మాది. కాకాని వెంకటరత్నం పేరిట ఉన్న- కేవీఆర్ కాలేజీ అంతకు ముందు పేరు ఎన్టీఆర్ కాలేజీ. నిజమే అండి. విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ పేరిటనే కాలేజీ ఉండేది. నేను ఇంటర్ లో చేరినప్పుడు మొదటి సంవత్సరం ఎన్టీఆర్ కాలేజీగానే ఉంది. రెండో సంవత్సరంలోకి రాగానే పేరు మారిపోయింది. కాలేజీ పేరు ఇలా ఎందుకు మారిందన్న విషయంలో ఆ రోజుల్లో ఎవేవో చెప్పుకునే వారు. అవేవీ నేను బుర్రకెక్కించుకోలేదు. సరే, ఇంటర్ అయి డిగ్రీలో అదే కాలేజీలో చేరాను. విజయవాడలో లయోలా కాలేజీలో చదవాలని నాకుండేది. కానీ మా ఇంట్లో వాళ్లేమో , ఊర్లోనే డిగ్రీ కాలేజీ వచ్చేస్తే పట్నం వెళ్లడం ఎందుకని నా ప్రాపోజల్ ని అటకెక్కించారు. మా అన్నయ్య డిగ్రీ చదివిందేమో గుంటూరు హిందూ కాలేజీలో. అందుకే నేనూ డిగ్రీ గుంటూరులోనో లేకుంటే విజయవాడలోనో ఇంగ్లీష్ మీడియమ్ లో చదవాలని అనుకున్నాను. కానీ అప్పటికే అంటే, నేను ఎనిమిదో తరగతికి వచ్చే సరికే గుంటూరు నుంచి నందిగామకి మకాం మార్చేశాము. పైగా నందిగామ కాలేజీలోనే బీఎస్సీ (సైన్స్ డిగ్రీ- తెలుగు మీడియం) కోర్స్ పెట్టేశారాయె. దీంతో నా లాగానే చాలా మంది పట్నం వెళ్ళి చదువుకునే అవసరం లేకుండా పోయింది. ఉన్న ఊర్లోనే సైన్స్ డిగ్రీ క్లాస్ లు పెట్టడం ఆర్థికంగా కూడా ఇంట్లో వాళ్లకి కలసి వచ్చింది. ఏదైతేనేం, నందిగామలోనే బీఎస్సీ లో చేరిపోయాను. కాలేజీలో వార్షికోత్సవాలు ఘనంగానే జరిగేవి. కదలి వచ్చిన విశ్వనాథుల వారు : ముఖ్య అతిథులుగా పెద్దపెద్ద వారిని పిలిచేవారు. ఓసారేమో విశ్వనాథ సత్యనారాయణ గారిని పిలవడం నాకు గుర్తుంది. ఆయన ఎవరో, ఆయన ఎంతటి గొప్ప వారో నాకు అప్పట్లో తెలియదు. అప్పటికే ఆయన వయసులోనూ పెద్దవారయ్యారు. సన్నగా, పొడువుగా సాంప్రదాయ దుస్తులతో ఓ సాధారణ వ్యక్తిగా ఆయన స్టేజీ ఎక్కగానే కుర్రకారు అరుపులు, ఈలలు. కేకలు. ఆయనకు కోపం వచ్చిందేమో ఎక్కువ సేపు మాట్లాడ లేదు. మాట్లాడిన కాసేపు ఆయన మాటల్లో పదును, చురుకుతనం. చురకలు- నాకెంతో నచ్చాయి. సూటిగా విషయంలోకి రాకుండా, ఓ గమ్మత్తైన శైలిలో చెప్పిన తర్వాతనే అసలు పాయింట్ కి రావడం గమనించాను. చాలా కాలం తర్వాత వారెంతటి మహానుభావులో అర్థంమైంది. ఆయన రచనలు చదువుతున్నప్పుడు `ఆహా, ఓహో’ అనకుండా ఉండలేకపోయాను. నేను విశాఖలో కొన్నాళ్లు ఉన్నప్పుడు సివిల్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలుగు సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది. ఆ క్రమంలోనే ఎక్కువ కాలం లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివే వాడ్ని. అలాంటప్పుడే విశ్వనాథ వారి రచనలు చదివి ఆశ్చర్యపోయాను. అంత మంచి మనిషి మా కాలేజీకి వస్తే ఆయన విలువను గుర్తించలేకపోయానే అన్న దిగులు ఇప్పటికీ నా మనసుని కలచివేస్తున్నది. నిజమే, జీవితంలో ఒక్కోసారి ఆణిముత్యాల్లాంటి మనుషులు తారసపడుతుంటారు. కానీ మనమే గుర్తుంచలేక పోతుంటాము. అలా నా జీవితంలో కూడా విశ్వనాధ వంటి వారిని దగ్గరగా చూసినా, వారితో మాట్లాడినా వారి గురించి సరిగా అర్థం చేసుకోలేకపోయిన సంఘటనలు ఉన్నాయి. నేను ఆంధ్రప్రభ విజయవాడ ఎడిషన్ లో పనిచేస్తున్నప్పుడు మా ఆఫీస్ కి ఒకాయన వస్తుండే వారు. ఓ సారి మా న్యూస్ ఎడిటర్ గారు వారిని నాకు పరిచయం చేస్తూ, `వీరు విశ్వనాథ సత్యనారాయణ గారి అబ్బాయి పావన శాస్త్రి గారోయ్’ అన్నారు. ఆ ఒక్క మాటతో పావన శాస్త్రిగారి పట్ల నాకు అమితమైన గౌరవం పెరిగిపోయింది. మా కాలేజీ రోజుల్లో విశ్వనాథుల వారు వచ్చినా పట్టించుకోలేక పోయినందుకు మరో సారి సిగ్గుపడుతూ వారి కుమారుడిని ఎంతో ప్రేమతో అభిమానంతో నిండుగా చూడగలిగాను. లెక్చరర్ కూ ఓ పాత్ర : సరే, కాలేజీ రోజుల్లో నాటిక వేద్దామనుకున్నాం కదా, విజయవాడ నుంచి నాలుగైదు నాటిక పుస్తకాలు తెప్పించాము. వాటిలో ఆదివిష్ణు వ్రాసిన నాటికని (`అద్దె ఇల్లు’ అని గుర్తు) ఎంపిక చేసుకున్నాము. ఇక, పాత్రల ఎంపిక జరగాలి. మా క్లాస్ లో అమ్మాయిలు, అబ్బాయిలు చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్లం. కల్మషం లేని స్నేహం అది. నాటిక వేయాలనుకుంటున్నామని తెలిసి అమ్మాయిల్లో ఇద్దరు (పేర్లు వ్రాయడం లేదు) నాటికలో పాత్రలు పోషించడానికి ముందుకు వచ్చారు. వారి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆ రోజుల్లో కాలేజీ వార్షికోత్సవ స్టేజీ ఎక్కడమంటేనే చాలా ధైర్యం కావాలి. కుర్రకారు రెచ్చిపోతుంటారు. అలాంటప్పుడు అమ్మాయిలు నాటికలో పాత్రలు పోషించడమా!! కాలేజీలో ఈ వార్త గుప్పుమంది. చివరకు లెక్చరర్స్ కూడా మా దగ్గరకు వచ్చి అడగడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో లెక్చరర్స్ లో కొంత మంది మాతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. సీనియర్ లెక్చరర్స్ మా పట్ల ఎంతో అభిమానంతో ఉండేవాళ్లు. మేము నాటిక రిహార్సల్స్ వేస్తుంటే కొంత మంది లెక్చరర్స్ వచ్చి మాకు అండగా ఉండే వాళ్లు. కాలేజీలో ఒక కొత్త ప్రయోగానికి తెర లేచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లెక్చరర్స్ కూడా భావించి సపోర్ట్ గా నిలిచారు. ఇంకో గమ్మత్తు జరిగింది. ఈ నాటిక చివర్లో పోలీస్ పాత్ర ఎంటరై ఒకటి రెండు డైలాగ్ లు చెప్పాలి. ఇక్కడ మరో ప్రయోగం చేశాము. ఈ రెండు డైలాగ్ లను ఒక లెక్చరర్ చేత (పేరు వ్రాయడం లేదు) చెప్పించాలనుకున్నాము. మా విష్ణు తన వద్ద ఉన్న టేప్ రికార్డర్ తీసుకు వచ్చాడు. ఆ రెండు డైలాగ్ లు మాష్టారి చేత చెప్పించాము. ఇక ప్రదర్శన సమయంలో ఆ మాష్టారు ముందు వరసలో కూర్చుని నాటకం చూస్తున్నారు. చివరి ఘట్టం వచ్చేసింది. పోలీస్ ఎంటరై ఆ రెండు డైలాగ్ లు చెప్పాలి. ఆ మాష్టారేమో ముందు వరసలోనే అందరితో పాటు కూర్చుని చూస్తున్నారు. అంతలో వారి వాయిస్ గంభీరంగా లౌడ్ స్పీకర్స్ లో మారు మ్రోగింది. నాటక సన్నివేశానికి తగ్గట్టుగా డైలాగ్ లు వినబడ్డాయి. పోలీస్ పాత్ర చెప్పిన ఈ డైలాగ్ లు అచ్చు మాష్టారివే. కానీ మాష్టారేమో ముందు వరసలోనే ఉన్నారాయె. అందరికీ ఆశ్చర్యం. టేప్ రికార్డర్ సాయంతో ఈ గమ్మత్తు చేశామని పాపం వారికి తెలియదు కదా. ఇదో ప్రయోగం. సక్సెస్ అయింది. పైగా లెక్చరర్ గారినే నాటికలో ఇన్వాల్ చేయడం ఓ సంచలనం అయింది. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ప్రేక్షకుల్లో ని కుర్రకారు ఆగడాలు చేయకుండా బుద్ధిగా నాటిక చూశారన్న మాట. ఇలా నాటక రంగం వైపు ఆకర్షితుడినైన నేను ఆ తర్వాత ఉద్యోగంలో స్థిరపడ్డాక ఆంధ్రప్రభలో ఉగాది వేడుకలప్పుడు మరో సారి నాలోని నటుడు , దర్శకుడు మేల్కొన్నాడు ఆంధ్రప్రభ - ఏక పాత్రలు : ఆ రోజుల్లో (90 దశకం) ఆంధ్రప్రభ – ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ లో పనిచేయడం అంటే చాలా గొప్పగా ఫీలయ్యే వాళ్లం. ఇప్పుడు ఆ గ్రూప్ లేదనుకోండి. అదో పెద్ద కథ. తర్వాత చెబుతాను. అప్పట్లో ఉగాది వేడుకలు ఆంధ్రప్రభ ఆవరణలో చాలా బాగా జరిగేవి. ఇప్పటికీ ఉగాది రాగానే ఆ నాటి ఆంధ్రప్రభ మిత్రులందరికీ ఆ వేడుకలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఆంధ్రప్రభ- ఉగాది వేడుకల గురించి ఎంతైనా వ్రాయవచ్చు. తర్వాత చూద్దాం.
ఏకపాత్రలు, నాటికల్లో నేను నటించాను. ఏకపాత్రల్లో అయితే వరుసుగా మూడు సార్లు ఉత్తమ ఏకపాత్ర పోషించిన నటుడిగా గుర్తుంపు పొందాను. అలా రావడానికి ప్రధాన కారణం నేను ఎంచుకున్న పాత్రలు అలాంటివి. మొదటి సారేమో షిర్డీ సాయిబాబా పాత్ర పోషించాను. నేను వేసిన ఏకపాత్రలకు రచన కూడా నాదే. దర్శకత్వం కూడా నేనే. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేవాడ్ని. ఈ విషయంలో మా ఆవిడ (శ్రీదేవి) సపోర్ట్ చేస్తుండేది. ఆమె ఎం.ఏ తెలుగు కావడం , నాటక రచన పట్ల ఆమెకీ ఆసక్తి ఉండటంతో నా పని సులువైంది.
షిర్డీ సాయిబాబాగా స్టేజీ మీద కనిపించగానే ప్రేక్షకులు రెప్పవాల్చ కుండా చూస్తుండి పోయారు. ఏకపాత్రల సెక్షన్ లో మొదటి బహుమతి ఈ `షిర్డీ సాయిబాబా’ గారు అందుకున్నారు. మరుసటి ఏడాది `రామకృష్ణ పరమహంస’ – ఏకపాత్ర. మరోసారి అంతే స్పందన. రామకృష్ణ పరమహంస గురించి పెద్దగా తెలియని వాళ్లు సైతం ఈ ఏకపాత్ర తర్వాత నా దగ్గరకు వచ్చి , వారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిజానికి నాకూ పెద్దగా తెలియదు. కాకపోతే ఏకపాత్రకి స్క్రిప్ట్ తయారు చేయడం కోసం పుస్తకాలు చదివాను. పాయింట్స్ నోట్ చేసుకున్నాను. దీంతో రామకృష్ణ పరమహంస పట్ల ఆసక్తి పెరిగింది. భక్తి భావన పాత్ర పోషణలో కలిసిపోయింది. ఆ కాసేపు నేనే రామకృష్ణ పరమహంసని అన్న భావన కలిగింది. నిజంగానే ఇదో అద్భుతం. పాత్ర వేరు నటుడు వేరు కాకూడదు. రెండూ మిళితమైపోవాలి. ఈ విషయం అప్పుడే నాకు బాగా అర్థమైంది. మరో సారి ఉత్తమ ఏక పాత్రగా `రామకృష్ణ పరమహంస’ నిలిచారు. మరో చిత్రం జరిగింది. ఎన్టీఆర్ గారి ప్రధమ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ స్మారక కల్చరల్ ట్రస్ట్ వారు 1998లో విజయవాడలో ఏకపాత్రల పోటీలు పెట్టారు. హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగినట్లు గుర్తు. ఈ పోటీల్లో నేను ఆంధ్రప్రభ యాజమాన్యం వారి పర్మిషన్ తీసుకుని పాల్గొన్నాను. రామకృష్ణ పరమహంస పాత్రనే ఎంచుకున్నాను. నాకు రెండో బహుమతి వచ్చింది. బహుమతి ప్రదానోత్సవ సభలో ఒక వక్త చెప్పిన మాటలు నా కిప్పటికీ గుర్తున్నాయి. `ఎన్టీఆర్ ఎన్నో పాత్రలు పోషించారు. కానీ రామకృష్ణ పరమహంస పాత్ర వేయలేదు. బహుశా వారే ఈ అబ్బాయి చేత రామకృష్ణ వేషం కట్టించి తన మనసు తీర్చుకున్నారేమో’ - అని ఆ వక్త అనడం నాకు దక్కిన అతి గొప్ప ప్రశంసగా భావించాను. ఆ తర్వాత ఏడాది రాఘవేంద్ర స్వామి ఏకపాత్ర పోషించి ఇంకో సారి ఆంధ్రప్రభ వేడుకల్లో బహుమతి అందుకున్నాను.
`గిరీశం’, `చంటోడు’ వంటి ఏకపాత్రలు కూడా వేశాను. అలా ఏకపాత్రల రచన, పాత్ర పోషణలో చక్కటి ప్రవేశం కలిగింది. అంతే కాకుండా ఉగాది వేడుకల్లో నాటికల్లో కూడా పాల్గొన్నాను. అసలు ఉగాది అన్నది ఇప్పటికీ నాకో ప్రత్యేక పండుగే. దాదాపుగా ఏ కంపెనీలో పనిచేస్తున్నా ఉగాదికి ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడమో, పాల్గొనడమో జరిగిపోతున్నది నా జీవితంలో. చివరకు రిటైర్ అయ్యాక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్మూనిటీలో ఉగాది వేడుకలు నిర్వహించడం ఇప్పటికీ ఓ ఆనవాయితీ. ఈ విశేషాలను మరో సారి వివరంగా చెబుతాను. రూపకానికి `రూపం’ : నాటికం, రూపకం ఈ రెంటికీ దగ్గర సంబంధం ఉంటుంది. నాటక రచన పట్ల ప్రవేశం ఉన్న వారు రూపకం వ్రాస్తే దానికి మరింత శోభ చేకూరుతుంది. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో మంత్రివాది మహేశ్వర్ గారు నాలోని రచనా పటిమను గుర్తించి నాచేత నాటికలు, రూపకాలు వ్రాయించారు. అందులో `నరుడే ఓనరుడైతే..’ అన్న నాటిక ప్రశంసలు అందుకుంది. అలాగే హైదరాబాద్ లో విజయ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో `అదిగో హరివిల్లు’ వ్రాస్తే దానికి జాతీయ ప్రతిభా పురస్కారం దక్కింది. ఇంగ్లండ్ లో.. : ఆ మధ్య ఇంగ్లండ్ టూర్ కి వెళ్ళినప్పుడు సుప్రసిద్ధ నాటక రచయిత షేక్స్ ఫియర్ పుట్టిన చోటు (Stratford ) చూడటం జరిగింది. అక్కడే ఓపెన్ థియేటర్ లో యువ కళాకారులు రోమియో జూలియట్ పాత్రలు పోషిస్తూ ఓ సీన్ ని పండిస్తున్నారు.
కాసేపు అక్కడ కూర్చుని వారి నటనకు ముగ్ధుడనయ్యాను. సీన్ కాగానే వెంటనే కూర్చున్న చోటు నుంచి లేచి వారి వద్దకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని రోమియో జూలియట్ పాత్రలు పోషించిన వారిద్దరినీ అభినందించాను. వాళ్లు కూడా సంతోషించారు. నటులకు ఇలాంటి ప్రశంసలే వెలకట్టలేని పతకాలు. `జీవితమే ఓ నాటకం’ అన్నాడు ఓ మహాశయుడు. `ఇంతేరా ఈ జీవితం. తిరిగే రంగుల రాట్నము’ అన్నాడో ఓ సినీ కవి. `పుట్టుకకీ గిట్టుకకీ మధ్య జరిగే మాహా నాటకంలో మనమంతా పాత్రధారులమనీ సూత్రధారి మరొకరు ఉన్నారని’ తేల్చి చెప్పాడు మరో కవి. మధ్యలో వచ్చే అనుబంధాలు, ఆత్మీయతలు అంతా బోటకం అని తేల్చి పారేశారు ఇంకో కవి. జీవితమే ఓ మహా నాటకమే అయినా అందులో నాటకం ఆడటం, నాటక రచన చేయడం, అందులో ప్రశంసలు అందుకోవడం ఓ అదృష్టం. జీవితాన్ని సరిగా అర్థం చేసుకోవాలన్నా, జీవన మహర్నాటక రంగంలోని పాత్రల తీరుతెన్ను పసిగట్టాలన్నా నాటక రంగ ప్రవేశం ఎంతో కొంత ఉపయోగపడుతుంది. నాటకంలో నటించాలి, జీవితంలో నటించ కూడదన్న సత్యం తెలుసుకోవాలి. ఈ భాగంలో నా నాటక రంగ ప్రస్తానంలోని ఆసక్తికరమైన అంశాలను గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేశాను. అయితే ఇది అసంపూర్ణం. చెబితే సానా ఉంది, వింటే ఎంతో ఉంది.

22, జులై 2024, సోమవారం

17వ భాగం : ఏరువాక సాగారో :

తెల్లవారుఝాముమంచి నిద్రలో ఉన్నాను. నేనప్పటికి ఇంకా చిన్న పిల్లాడినే. మహా ఉంటే ఎనిమిదేళ్లు ఉంటాయేమో. అమ్మ నన్ను లేపడానికి దాదాపుగా అరుస్తున్నట్లే కేకలు పెడుతోంది. గాజుల చేతితో నా వీపునీ, బుజాలను తట్టి లేపుతోంది. నాకిష్టమైన వాటిలో అమ్మ చేతి గాజుల సవ్వడి ఒకటి. ఆ సవ్వడి వినబడుతూనే ఉంది. కానీ వెంటనే లేవకుండానే, మంచానికి మరో వైపుకి తిరిగినా అమ్మ ఊరుకోలేదు. తట్టి లేపుతునే ఉంది. `లేరా, తెల్లారొస్తోంది. లేచి త్వరగా తయారవ్వు. పొలం దున్నడానికి వెళ్లాలి గదరా’ ఈ మాటలతో నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. ఛటక్కున మంచం దిగేశాను. హాడావుడిగా దొడ్లోకి పరిగెత్తి ఇంటికి ఈశాన్య మూలన ఉన్న బావి దగ్గరకు పరిగెత్తాను. అప్పటికే చిన జీతగాడు బక్కెటుతో నీళ్లు తోడి సిద్ధంగా ఉంచాడు. ప్రక్కన ఒక చెంబు కూడా ఉంది. బావి ప్రక్కనే ఒక రాయి మీద ఎర్ర పళ్ల పొడి ప్యాకెట్లు , ప్రక్కనే ఒకే సైజులో చింపిన తాటాకు ముక్కలు కూడా పెట్టడం ఓ అలవాటు. తాటాకు బద్దలతో నాలుక శుభ్రం చేసుకునే వాళ్లం. ఆ రోజుల్లో పళ్ల పొడి వాడటమే గొప్ప. పట్నం నుంచి వచ్చామని మా బామ్మ ఎర్ర పళ్లపొడి పొట్లాలు తెప్పించింది. తెల్ల పళ్లపొడి కూడా అమ్మేవారు. ఎర్ర పొడి కంటే తెల్ల పళ్లపొడి నాకు బాగా ఇష్టం. అప్పట్లో పల్లెల్లోకి టూత్ పేస్టులు, బ్రష్ లు, టంగ్ క్లీనర్స్ వంటివి వాడకం లేవు. చాలా కాలం తర్వాత బినాకా టూత్ పేస్టు మార్కెట్ లోకి వచ్చింది. బినాకా వాడైతే టూత్ పేస్ట్ తో పాటుగా చిన్నచిన్న బొమ్మలు ఇచ్చేవాడు. వాటి కోసం అదే కావాలని మారాము చేసేవాళ్లం. ఇంకా పెద్దయ్యాక రేడియోలో బినాకా గీతమాల అనే కార్యక్రమం వినే వాడ్ని. నేను వెంటనే ఎర్ర పళ్లపొడి చేతిలో వేసుకుని చూపుడు వేలితో పళ్లు తోముకుని పుక్కిలిస్తుంటే, అమ్మ – `ఒరేయ్ అంత హడావుడి ఎందుకురా, నీవు రెడీ కాకుండా అరక కట్టేసి పొలానికి వెళ్లర్లేరా’ – అంది. వేప పుల్ల – చేత చెంబు : ఆ రోజుల్లో పళ్లు తోముకోవడానికి ఊర్లో వాళ్లు వేప పుల్లలు ఎక్కువగా వాడే వారు. అవేమో నోట్లో పెట్టుకుని కాస్త నమలగానే నోరంతా చేదు. ఆ చేదుకి నాకేమో నోట్లో లాలాజలం ఊరి వాంతులు వచ్చేటంత పని అయ్యేది. బక్కెట్లో నీళ్లతో ఎంతగా పుక్కిలించినా ఆ చేదు ఒక పట్టాన పోయేది కాదు. ఇదంతా 1960ల దశకంలో మా ఊరు అడవిరావుల పాడులో జరిగిన సంఘటన. మా ఊర్లో అన్ని కులాల వారు పొద్దున్నే పందోము పుళ్లలతోనే దంతధావనం చేసుకునే వారు. పుల్ల నోట్లో పెట్టుకునే వీధుల్లో తిరుగుతూ కొన్ని పనులు కూడా చేస్తుండే వారు. వాటిలో పొద్దున్నే అర్జెంట్ గా వెళ్ళాల్సిన `రెండో’ పని కూడా ఉండేది. ఆ రోజుల్లో టాయిలెట్స్ ఉండేవి కావు. బహిర్భూమికి వెళ్ళి విసర్జన తంతు ముగించుకోవాల్సిందే. చేతిలో తీసుకువెళ్ళే చెంబు నీళ్లు చాలకపోతే వాగులో నీరు వాడుకోవాల్సిందే. అయితే ఈ పని పూర్తి చేసుకోవడం కోసం ఊర్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఉండేవి. మరుగు ఎక్కువగా ఉండే ప్రదేశాలను స్త్రీలు ఉపయోగించుకునే వారు . మరుగు అంటే తుమ్మ చెట్లో, గుబురుగా పెరిగిన ఇతర చెట్లు ఉన్న ప్రాంతాలన్న మాట. ఊరికి వాగు చాలా ముఖ్యం. ఇది మా ఊరి ప్రజల జీవన విధానంలో అంతర్భాగం. వాగు పొంగితే ప్రక్కనే ఉన్న నందిగామతో సంబంధాలు తెగిపోతుండేవి. నందిగామ వెళ్లకుండా రావులపాడు ప్రజలకు పూటగడవదు. నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పనిముట్లు ఒకటేమిటీ అన్నీ నందిగామకు వెళ్ళి కొనుక్కోవల్సిందే. మెట్ట సాగు : వ్యవసాయం – ఇది ఊరి జీవనానికి ప్రధాన ఆధారం. ఇక్కడ మెట్ట పొలాలే అధికం. వర్షాధార పంటలనే ఎక్కువగా పండిస్తుంటారు. వ్యవసాయం చుట్టూనే ఊరి బతుకులు ముడిపడి ఉండేవి. మాది కూడా రైతు కుటుంబమే. నాకు గుర్తున్నప్పటికి 40 నుంచి 50 ఎకరాల పొలం ఉండేది . అయితే ఇదంతా ఒక చోటనే ఉండేది కాదు. ఊరికి మూడు వైపులా ఉండేవి. అందులో రాయలవారి చేను అని పిలుచుకునే పొలం బాగా పండేదని మా నాన్నగారు తరచూ చెబుతుండే వారు. అందుకే ఆ పొలం పేరు చెప్పగానే దాన్ని ఎలాగైనా చూడాలని అనుకుంటూ ఉండేవాణ్ణి. కాకపోతే చిన్న పిల్లాడ్ని కదా. నన్ను పొలం దగ్గరకు ఎవరు తీసుకువెళతారు? ఇంట్లో బామ్మ, అమ్మ నాన్న, పెద్ద జీతగాడు దగ్గర నుంచి చినజీతగాడి దాకా నన్నో పసికందుగా చూస్తుంటారాయె. అందుకు తగ్గట్టుగానే నేనేమో బక్కగా ఉండేవాడ్ని. పైగా నాలుగు రోజులు బాగుంటే ఐదో రోజు జలుబు వస్తుండేది. నాది మొదటి నుంచి అంతంత మాత్రపు ఆరోగ్యమే. ఇప్పటికీ అంతేలేండి. ఎండలో పట్టుమని పదినిమిషాలు నిలబడలేను. చదువులు పూర్తయ్యాక ఫ్యాన్ క్రింద ఉద్యోగాలే చేయాలని గట్టిగా అనుకున్నాను. దేవతలు నా మొర విన్నట్లున్నారు. నేను చేసిన ఉద్యోగాలన్నీ అలాంటివే. ఈ విషయంలో ఫ్యాన్ నుంచి ఏసీకి ఎదిగాననుకోండి. జర్నలిస్ట్ ఉద్యోగాలంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బయట తిరుగుతూ వార్తలు సేకరిస్తూ వాటిని ఎడిటోరియల్ డిపార్ట్ మెంట్ కి పంపేవి కాగా మరొకటి - ఇలా వచ్చే వార్తల ప్రాధాన్యతను అర్థం చేసుకుంటూ వాటిని ఎడిట్ చేసి పేపర్లో వేసేలా చేయడం అన్న మాట. ఎడిటోరియల్ డెస్క్ లో పనిచేసే ఉద్యోగులు బయట తిరగాల్సిన అవసరం ఎప్పుడో గాని ఉండదు. సబ్ ఎడిటర్ దగ్గర నుంచి ఎడిటర్ దాకా ఉండే ఎడిటోరియల్ డిపార్ట్ మెంట్ చాలా కీలకమైనది. నిర్ణయాధికారమంతా ఈ డిపార్ట్ మెంట్ దే. అలాంటి డిపార్ట్ మెంట్ లో శ్రద్ధగా పనిచేయడం ఆఫీస్ లో నాకెంతో ఎంతో గౌరవం తెచ్చిపెట్టింది. గిత్తల సొగసు చూడతరమా : ఎండల్లో తిరగలేని నేను పొలానికి ఆ రోజున మొదటి సారి బయలుదేరానన్న మాట. స్నానం చేసేయగానే అమ్మ కొత్త బట్టలు తొడిగింది. నుదుట కుంకుమ బొట్టు పెట్టింది. అసలు ఆ రోజున నేనూ నాతో పాటుగా నాన్న, అన్నయ్య కూడా పొలానికి వెళ్ళాలని ఓ పదిరోజుల నుంచీ అనుకుంటున్నదే. అందుకే ఈ హడావుడి. ఆ రోజు ఏరువాక పౌర్ణమి. (foot note చూ.16 ) . ఆ రోజు వ్యవసాయ కుటుంబాల వారికి పెద్ద పండుగ. ఆ ఏటికి సాగు ప్రారంభించే శుభముహూర్తం ఇదే. పొలం దగ్గరకు వెళ్లి భూమి పూజ చేసి, తొలి సాలు దున్నాలి. అందుకే ఈ హడావుడంతా. ఆ కాసేపు నేనో బుజ్జి రైతునన్నమాట ఇవన్నీ అమ్మ నాకు ముందే చెప్పింది. సరే, మా బామ్మ హడావుడి అంతా ఇంతా కాదు. వారం రోజుల ముందే నందిగామకు మనిషిని పంపించి గిత్తలకు అలంకార వస్తువులు తెప్పించింది. వాటి కొమ్ములకు రంగులు వేయించింది. దీంతో అవి మెరిసిపోయాయి. అక్కడితో ఆగలేదు. మెడలో మువ్వలు, గంటలున్న బెల్టులు కట్టించింది. వీపుకేమో అద్దాల చమకీలు అమర్చి రంగురంగు కుచ్చులు ఉన్న నడుం బెల్టులు బిగింపం జేసింది. అవి కట్టి వాటి నడుము సోకు చూసి జీతగాడు మురిసిపోయాడు. ఏరువాక పౌర్ణమికి ముందు రోజు సాయంత్రమే గిత్తలను బావి దగ్గరకు తీసుకు వెళ్ళి స్నానాలు చేయించింది. కొబ్బరి పీచుతో వాటి ఒళ్లు తోమించింది. అప్పుడు చూడాలి మా సందడి. అసలే కోడె గిత్తలాయె - చల్లనీరు తగలగానే తప్పించుకోవడానికి అటూ ఇటూ పరుగులు పెట్టేవి. జీతగాళ్లేమో వాటిని అదిలించి మళ్ళీ నూతి దగ్గరకు తీసుకురావడం, అవేమో గారాలు పోవడం. ఇదంతా భలే సరదాగా ఉంది. మేము వాటి దగ్గరకు పోబోతుంటే , `అబ్బాయి గారూ మీరు దూరం జరగండి. ఈ బూడిద కళ్లది మహా పొగరబోతుది, మిమ్మల్ని కుమ్మేయగలదు’ – అంటూ హెచ్చరించడం. అందుకు తగ్గట్టుగానే మేమూ భయపడి దూరం జరిగి, అంతలోనే మళ్ళీ సరదా పడి వాటి దగ్గరకు పోవడం- ఇదంతా చాలా గమ్మత్తుగా జరిగిపోయింది. ఈ హడావుడంతా అయ్యే సరికి చీకటి పడింది. చిన్న జీతగాడు కిరోసిన్ దీపపు బుడ్లను, లాంతరు గాజు గుబ్బను పాత గుడ్డతో తుడిచాడు. ఇలా తుడవడాని కోసం గుడ్డలో కాస్తంత ముగ్గు పొడి వేసి తుడిచాడు. అలా తుడవగానే అప్పటి వరకు నల్లగా మసక బారిన గాజు బుడ్లు, గుబ్బలు తళతళలాడాయి, అచ్చు మా ఇంటి గిత్తల్లా. కాస్తంత చీకటి పడగానే అమ్మ మమ్మల్ని భోజనాలకు రమ్మన్నది. భోజనాలు చేస్తున్నంత సేపూ కొష్టం వైపునే నా చూపులు. అలంకరించిన గిత్తలు కదులుతుంటే వాటి మెడలో కట్టిన గంటలు మ్రోగుతున్నాయి. మువ్వల చప్పుడు ఈ గంటల మోతలో మిళితమై చక్కటి సంగీతంలా వినిపించింది. భోజనాలు కానిచ్చాక కాసేపు - రేపు పొలం దగ్గర చేసే పూజలు, పొలం దున్నడం వంటి కబుర్లు అమ్మ చెబుతుండగానే నాకేమో నిద్ర పట్టేసింది. అదిగో అలా పడుకున్న నాకు మళ్ళీ అమ్మ తట్టిలేపడంతోనే మెలుకువ వచ్చిందన్న మాట. ఇంకా తెల్లవారలేదు. అయితే తూర్పున ఆకాశంలో అప్పటి వరకు ఉన్న చీకటి తగ్గి ఎరువు రంగు చోటుచేసుకోవడం మొదలైంది. ఆ వింత చూస్తుండగానే ఎద్దులకు అరక కట్టే పని జీతగాడు పూర్తి చేశాడు. అప్పుడు చూడాలి ఆ ఎద్దుల ఠీవి. వాటి మోపురాలకు కూడా ఏవేవో రంగుల కుచ్చులు చుట్టారు. అసలే అందంగా ఉండే కోడె గిత్తలు ఈ అలంకరణలతో మరింత అందంగా కనిపించాయి. పెళ్ళి కొడుకుల్లా సింగారించుకున్నాయి. ఒక దాని పేరు బూడిద కళ్లది అయితే రెండో దాని పేరు కాటుక కళ్లది. ఒక దాని సింగారం మరొకటి చూసుకుంటూ మురిసిపోయినట్లు ఆ కళ్లు చెబుతున్నాయి. అంతలో అమ్మ, అక్క చెరో పళ్లెం పట్టుకుని వచ్చారు. పళ్లాల్లో పూలు, పసుపు, కుంకుమ వంటి పూజా సామాగ్రి ఉన్నాయి. జీతగాడు గిత్తలను పట్టుకుంటే అమ్మేమో జాగ్రత్తగా వాటికి నుదిటి మీద కుంకుమ బొట్లు పెట్టి వాటిమీద పూలు జల్లింది. అమ్మా అక్కా ఇంట్లోనే ఉండిపోయారు. ఇక మేము పొలానికి బయలుదేరాము. కోడెలకు కట్టిన గంటల చప్పుడు శావ్యంగా వినపిస్తుంటే మా అరక ఊరు దాటి డొంక దారిబట్టి పొలానికి చేరే సరికి పూర్తిగా తెల్లారింది. పొలం దగ్గర నాన్న గారు గిత్తలకు, అరకకు, వాటికి అమర్చిన పరికరాలకు పూజలు చేశారు. మా చేత చేయించారు. ఆ తర్వాత పొలంలోని ఒక రాయి దగ్గరకి వెళ్ళి దాని మీద పసుపు కుంకుమ జల్లి కొబ్బరి కాయలు కొట్టారు. నాకూ ఒక కొబ్బరికాయ ఇచ్చారు, కానీ నా బలం చాలలేదు. దీంతో నాన్నగారే నా చేతిలోని కాయ లాక్కుని కొట్టేశారు. నేను నాన్న వైపు కోపంగా చూశాను. కానీ ఆయన నా బక్క కోపాన్ని ఏమాత్రం పట్టించుకుండా అరక సాయంతో నాగలి సాలు దున్నడం మొదలెట్టారు. అరకకు నాగలి బిగించినట్లే పొలం దున్నే మరికొన్ని పరికరాలు కూడా అమరుస్తారు. వాటిలో గొర్రు (విత్తనాలు భూమి​లో నాటడానికి వాడే పరికరం), మేడి (అరక దున్నడానికి వాడే హ్యాండిల్ లాంటిది), కర్రు (ఇనుముతో చేసిన పరికరం, భూమి దున్నడానికి సాయపడే పరికరం) వంటివి ఉండేవి. చదును చేసేందుకు మరో రకం పరికరం ఉండేది. ట్రాక్టర్లు రంగప్రవేశం అరక, ఎద్దుల సాయం లేకుండానే పొలం పనులు చకచకా జరిగిపోతున్నాయి. దీంతో ఎద్దులను వేరే పనులకు వాడుతున్నారు. నందిగామలో ఇప్పటికీ తెల్లవారుఝామున ఇసుక బండ్లు వస్తుంటాయి. వాటిని లాగేది ఎడ్లే. కాసేపు నాన్నగారు పొలం దున్నాక మా చేత నాగలి పట్టుకోనిచ్చారు. అన్న, నేను చెరో వైపున ఉంటే నాన్నగారు మా చేత జాగ్రత్తగా పొలం దున్నించారు. ఇలా పిల్లల చేత దున్నిస్తే భూమాత సంతోషించి ఆ కుటుంబానికి ఇబ్బడి ముబ్బడిగా పంటనిస్తుందట. నా జీవితంలో ఏరువాక నాడు పొలానికి వెళ్ళి దున్నడం ఇదొక్క సారే జరిగింది. ఆ తర్వాత , మరెందుకో తెలియదు కానీ ఏరువాక పండక్కి పొలానికి వెళ్లనే లేదు. చాలు.. ఒక్క మధుర సంఘటన చాలు, జీవితకాలం గుర్తుంచుకోవడానికి. అలా నా మనసులో ఈ ఏరువాక ముచ్చట చెరగని ముద్రవేసింది. ఇప్పుడు నాగళ్లు కట్టుకుని అరకతోలుకుంటూ పొలానికి వెళ్ళి ఏరువాక దుక్కి దున్నే వాళ్లు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఏరువాక అనగానే నాకైతే ఇప్పటికీ `రోజులు మారాయి’ (1955) సినిమాలోని పాట గుర్తుకు వస్తూనే ఉంటుంది. కొసరాజు గారు వ్రాసిన ఈ పాటంటే నాకెంతో ఇష్టం. ఆ నాటి పల్లె వాతావరణం, మరీ ముఖ్యంగా ఏరువాక పండుగ విశిష్టత చెబుతూనే మరో ప్రక్కన పొలాలు అమ్ముకుని టౌన్ లో మేడలు కట్టేవారిపై చురకలు వేసిన పాట ఇది. `కల్లాకపటం కానని వాడ లోకం పోకడ తెలియని వాడ ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా....’ ఈ పాటలో `చద్ది అన్నం’, `ముల్లగర్ర’ (ఒక కర్రకు చిన్న ఇనుప ముల్లు బిగించి ఉంటుంది, గిత్తలను అదిలించడానికి వాడే కర్ర), `కోటేరు’ (కాడి మీద నాగలిని సరిగా సెట్ చేయడం), `ఎలపడ- దాపడ’ (అరకకు ఎడమ కుడి వైపున ఉన్న ఎడ్లను అలా పిలుస్తారు) వంటి పదాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. మా ఊరి పొలాల గురించీ పొలం బతుకుల గురించి ఈ సందర్భంగా కొన్ని విశేషాలు చెబుతాను. మా ఊరు అడవిరావులపాడు ఒక అగ్రహారం. ఒకప్పుడు చిట్టడవి. అందులో కూడా తుమ్మ చెట్లు విస్తారంగా పెరిగే ప్రాంతం. మా పూర్వీకులకు ఈనాం క్రింద సుమారు 11వందల ఎకరాల పొలంతో కూడిన ఈ ప్రాంతం లభించింది. ప్రస్తుతం (2024) నాటికి ఇందులో 120 ఎకరాలు మాత్రమే అగ్రహారీకుల సాగుబడిలో ఉంది. మిగతా పొలం అంతా అన్యక్రాంతమైంది. ఇక్కడి పొలాలు మొదటి నుంచీ మెట్ట పొలాలే. అంటే వర్షాధార భూమూలే. వర్షం ఎక్కువ పడినా, తక్కువ పడినా ఆ ఏడు పంట నష్టాన్ని రైతు చవిచూడాల్సిందే. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీరు విడుదలైనప్పటికీ కొసభూములు కావడంతో అధిక శాతం పొలాలు మాగాణిగా మారలేకపోయాయి. ఒకటో అరో మారినా అదికాస్తా మూన్నాళ్ల ముచ్చటే అయింది. అప్పట్లో ఎన్నో వ్యయప్రాసలకోర్చి పొలాల వద్దకు తవ్వించిన కాల్వలు, వేయించిన గట్లు నిరుపయోగమయ్యాయి. అప్పట్లో పెట్టిన ఖర్చు బూడిదపాలైంది. కొస భూములు సంపూర్ణంగా మాగాణీ క్షేత్రాలు మారతాయన్న కోరిక తీరలేదు. ఒక్క మా ఊర్లోనే కాదు, నందిగామ మండలం అంతా మెట్ల భూములే ఎక్కువ. కందులు, జొన్నలు, పెసలు వంటివి బాగా పండేవి. ఆ రోజుల్లో మా ఇంటి ముందు మూడు రకాల పాతర్లు ఉండేవి. కందుల పాతర, జొన్నల పాతర మరొకటి పెసర కోసం. చాలా మంది ఆ రోజుల్లో అన్నం అంటే జొన్న అన్నమే తినే వారు. వరి అన్నం తినేవారు సంఖ్య చాలా తక్కువ. బియ్యం మాత్రం బయట నుంచి కొనుక్కోవాల్సిందే. `మన పొలంలో పండే జొన్నలు ఇంట్లో సంవృద్ధిగా ఉండగా బియ్యపు అన్నం ఎందుకురా’- మా బామ్మ అంటుండేది. మేమేమో పట్నంలో ఉండే వాళ్లం కదా. ఏడాదికొకసారి పల్లెబాట తొక్కే వాళ్లం. అందుకే మాకోసం నందిగామ మార్కెట్ నుంచి సన్న బియ్యం తెప్పించేది. జొన్న అన్నం తయారు చేయడం కూడా చాలా కష్టం కావడంతో వరన్నం పట్ల క్రమంగా చాలా మంది ఆకర్షితులయ్యారని నాకనిపించేది. ఎందుకంటే జొన్నలు దంచాలి, పై పొట్టు లేకుండా వడపోయాలి, బాగా ఉడికేదాకా వండాలి. ఇవి బియ్యంలా తొందరగా ఉడకవు. పట్నం నుంచి వచ్చిన మా కోసం బామ్మ ఒకటి రెండు సార్లు జొన్నన్నం వండించేది. అప్పుడే చూశాను జొన్నలను నానబెట్టడాలు, రోట్లో పోసి దంచడాలు, పై పొట్టు వడబోయడాలు, కట్టెల పొయ్యిపైన వండటాలు. జొన్నన్నం తియ్యగా ఉంటుంది. వరన్నం లాగా స్మూత్ గా తినలేము. ఆవకాయ ఎంత కలిపినా ఆ ఘాటు తెలియదు. కానీ తింటుంటే భలేగా ఉండేది. ఆ టైప్ జొన్నన్నం మళ్ళీ ఇంతవరకు తినలేదు. రోజులు మారాయి అని కొసరాజు గారు అన్నట్లుగానే ఊర్లో జొన్నన్నం తినే వాళ్లు ఇప్పుడు తగ్గిపోయింది. జొన్నలు తినే రోజుల్లో మనుషులు పుష్టిగా ఉండేవారు. ఒక్కడే వంద కిలోల బస్తా లేపి బండిలో ఎత్తి పడేసేవాడు. సోలెడు జొన్నలు దంచి వండితే ఒక్కడే తినేవారు. కందులు ఊర్లోనే పండటంతో కంది పప్పు రోజూ ఉండాల్సిందే. ` జొన్నన్నంలో చారెడంత కద్ది పప్పు కలుపుకుని , చిప్ప గరిటెతో అంత ఆవకాయ వేసి, చారెడు నెయ్యి పోయించుకుని కలుపుకు తింటంటే ఇక అనారోగ్యాలు రమ్మనమన్నా రావురా’ - అనేది బామ్మ. అందుకే ఆమె సెంచరీ దాటేసి ఓ ఎడెనిమిది సంవత్సరాలు లాగించేసింది. బామ్మ అంటే మాకెంతో ఇష్టం. ఆమెను మేము `పాపచ్చీ’ అని ముద్దుగా పిలుచుకునే వాళ్లం. పాపచ్చీ అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు. కానీ అదే పేరు మా బంధువుల్లో కూడా పాపులర్ అయింది. చివరి వరకు ఆమె చూపు తగ్గలేదు. దూరంగా ఎవరు వెళుతున్నా కనిపెట్టేసేది. అంతే దూరాన ఎవరు మాట్లాడుకుంటున్నా వినగలిగేది. బీపీలు, షుగర్లు వంటి మాటలే ఆమె జీవితంలో బహుశా ఎప్పుడూ విని ఉండదు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చి - `నాగభూషణం ఉన్నాడా ? అనో, `నాగరాజు ఉన్నాడా?’ అనో అంటే ఆమెకు కోపం వచ్చేసేది. `నాగభూషణం ఏమిటీ నువ్వేమన్నా బొడ్డుకోసి పేరు పెట్టావా ఏంటీ, నాగభూషణ రావు అనలేవూ, అది మా మరిది గారి పేరు’ అని కసురుకునేది. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో బావగారు, మరిది గారు పట్ల అంత గౌరవం ఉండేవి. ఇక నాగరాజు అని పిలిస్తే ఆమెకు చిర్రెత్తుకొచ్చేది. కానీ ఆ పేరు మా అమ్మ ముద్దుగా పెట్టుకోవడంతో పైకి గట్టిగా ఏమీ అనలేక `కాలం మారిపోయింది’ అని గొణుక్కునేది. ఆ రోజుల్లో ఇంట్లో పంట గింజలు సంవృద్ధిగా ఉంటే చాలు, డబ్బులు ఎక్కువగా తీయాల్సి వచ్చేది కాదు. పాతర్ల నిండా ధాన్యం ఉండగా డబ్బులు (నోట్లు) అసలు తీసేది కాదు మా బామ్మ. జీతగాళ్లకు జీతాలు ఇవ్వాలన్నా, కోమటి కొట్లో నుంచి సరుకులు తీసుకురావాలన్నా, కూలీ ఇవ్వాలన్నా అన్నింటికీ ధాన్యం కొలిచి ఇవ్వడమే. ఈ కొలవడం కోసం ఇంట్లోనే కొన్ని కొలత పాత్రలు ఉండేవి. వాటిలో గిద్దె, సోల, తవ్వ, మానెడు వంటివి ఉండేవి. గిద్దెడు జొన్నలు ఇస్తే బోలెడంత మిఠాయి ఇచ్చే వాళ్లు. అందుకే చిన్నప్పుడు చాలా ఏళ్ల వరకు పల్లెలో మాత్రం నేను వంద రూపాయల నోటు చూడలేదు.
నా బోటి పిల్లల అవసరాలన్నీ ఐదు పైసలు, పది పైసలు పావలాలతోనే తీరేవి. అలాంటిది మొన్నీ మధ్య ఇంటి ఖాళీ స్థలంలో పెరిగిన కలుపు మొక్కలు కొట్టమని అడిగితే రెండువేలు ఇమ్మన్నారు. అసలు ఐదు వందల నోటు వచ్చాక వంద రూపాయల నోటుకి ఎక్కడా విలువ లేకుండా పోయింది. ప్రతి చిన్న పనికి కనీసం ఐదు వేళ్లు (ఐదు వందల నోటు అన్నట్లు) చూపిస్తున్నారు. నాణేల్లో అర్థరూపాయి అంటే చాలా విలువనైదని నాకు ఆరోజుల్లో అర్థమైంది. అలాంటప్పుడు రూపాయి అంటే మాటలా. మా నాన్నగారి జేబులో పది రూపాయల నోట్లు ఉండేవి. కానీ వాటిని ముట్టుకోవాలంటేనే భయం. గుంటూరు బ్రాడీపేటలో మేము ఉన్నప్పుడు ఇంటి అద్దె ముప్పయి రూపాయలు. నాన్నగారి జీతం ఏ రెండొందలో ఉండేది. అది కూడా ఓ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ కి ఇస్తున్న జీతం అన్నమాట. నాన్నగారు రిటైర్ అయ్యే నాటి జీతం 450 రూపాయలు ఉన్నట్లు గుర్తు. సరే, నేను మొదటి సారి అందుకున్న జీతం 650 రూపాయలు. పెళ్లయిన తర్వాత విజయవాడ సత్యనారాయణ పురం – బాలమురళీకృష్ణ గారి వీధిలో అద్దె ఇంటికి నేను ఇచ్చింది నెలకు 330 రూపాయలు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా పల్లెటూర్లో డబ్బులు తీయకుండానే జీవితాలు సాగిపోయేవి అని చెప్పడానికే. పిల్లలకు పెళ్ళిళ్లు చేయాలన్నా కట్న కానుకల క్రింద డబ్బులు ఇవ్వాలన్నా ఆ రోజుల్లో – ఎకరం పొలం ఇస్తాము, ఏటా పంట చేతికి రాగానే ఓ పది బస్తాల జొన్నలు, ఓ బస్తా కందులు ఇస్తామని మగపెళ్ళి వారితో ఒప్పందం కుదుర్చుకోవడం నాకు గుర్తుంది. సంబందం కుదరగానే ఒప్పందం ప్రకారం పొలం వ్రాసి ఇచ్చేవారు. మగ పెళ్ళి వారు ఎడ్ల బండ్లు కట్టుకుని ఓ ఐదు రోజుల ముందే తరలివచ్చేవారు. ఎక్కడా నోట్లు తీయకుండానే ప్రశాంతంగా పండుగలు, పెళ్ళిళ్లూ జరుపుకోవడానికి వీలున్న రోజులవి. అప్పట్లో కృష్ణాజిల్లా అంతటా ఒకే రకమైన పొలాలు ఉండేవి కావు. తూర్పు – పడమర అన్నంత తేడా ఉండేది. ఇప్పుడు జిల్లాను రెండుగా విభజించి ఒకటి కృష్ణాజిల్లా, రెండవది ఎన్టీఆర్ జిల్లా అని పిలుస్తున్నారు. విజయవాడ ఇవతల ఉన్న కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో వ్యవసాయ భూములన్నీ మెట్టసాగు క్రిందకే వస్తాయి. అటు తూర్పువైపున ఉన్న కృష్ణా జిల్లా ప్రాంతంలో (ఉదాహరణకు కంకిపాడు, కానూరు, పామర్రు, మంచిలీపట్నం, గుడివాడ ) భూములు సారవంతమైనవి. మాగాణీ పొలాలు ఎక్కువ. పొలాల అమ్మకాల రేట్లలో కూడా తేడాలున్నాయి. మెట్ల పొలం పది ఎకరాలు ఉన్నా, మాగాణి పొలం ఎకరం ఉన్నా ఒకటే అన్నంత తేడా ఉంది. ఈ రేట్లలో అంతరం ఉన్నట్లుగానే ఈ ప్రాంత పల్లెలకీ, అటు వైపు పల్లెలకీ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సంస్కృతుల్లో తేడాలున్నాయి. ఇళ్ల నిర్మాణాలు, పరిసరాలు, ఊర్లో రోడ్లు, పండగలు జరుపుకునే తీరు, సరదాలు, ముచ్చట్లు, వినోదాలు...ఇలా అన్నింటిలో తేడాలు కనిపిస్తుంటాయి. ఈ కారణంగానే మా వైపు ప్రాంతంలోని వారికి పెళ్ళి సంబంధాలు చూసేటప్పుడు అవతలి వాళ్లతో తూగగలమా లేదా అని ఆలోచించేవారు . భౌగోళికంగా ఉన్న తేడాలు సమాజపు తీరుతెన్నులపై ఇంతగా ప్రభావితం చూపుతాయా అని ఆలోచిస్తుండే వాడ్ని . మా ఊర్లో ఇంటి పెద్ద, పొలం అమ్మకానికి పెట్టాడంటే ఏదో పెద్ద అవసరం వచ్చినట్లే అర్థం. పిల్లల చదువులు, వ్యవసాయంలో వచ్చే నష్టాలు, పెళ్ళిల్లు, అనారోగ్యం ఖర్చులు...ఇలా ఎన్నింటినో ఎదుర్కుంటూ ముందుకు సాగడానికి మధ్యతరగతి రైతుకు కనిపించే ఏకైక మార్గం పొలం బేరం పెట్టటమే. ఇతగాడికి అవసరం గుర్తించి కొనేవాడు చెట్టెక్కి కూర్చుంటాడు. చివరకు గతిలేక ఏదో ఒక బేరానికి పొలం అమ్మేసేవారు. ఈ ప్రాంతంలో ఒక ఏడాది పంట బాగా పండితే ఆ తర్వాత రెండు మూడేళ్లు పంట అంతంత మాత్రంగా ఉండేది. `దండగమారి వ్యవసాయం’ అని అందుకే అనేవారు. అకాల వర్షాలు, వరదలు కాకుంటే కరువు కాటకాలు – ఇవన్నీ పల్లెకు వీడని శాపాలు. బాగా పండినప్పుడు ధాన్యం అమ్మి డబ్బు రూపంలో బ్యాంకుల్లో దాచుకోవడం ఆ రోజుల్లో చాలా తక్కువ మందికే సాధ్యమయ్యేది. పల్లెల్లో బ్యాంక్ సౌకర్యాలు అంతంత మాత్రమే. భారీగా వరదలు వచ్చినప్పుడు పాతర్ల లోని ధాన్యం కూడా పాడయ్యేది. చూస్తుండగానే కళ్లముందు పరిస్థితి తలక్రిందులయ్యేది. ముందు చూపుతో డబ్బులు దాచుకునే రైతులను వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. ఇప్పటిదాకా చెప్పుకున్న కారణాల వల్ల అగ్రహారికుల పొలాలు తగ్గిపోయాయి. ఊర్లో మిగతా వారి ప్రాభవం పెరిగిపోయింది. చదువుకున్న వారు నెమ్మదిగా పట్నం వాసానికి అలవాటు పడి అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అక్కడే మేడలు మిద్దెలు కట్టడం మొదలెట్టారు. ఈ కారణంగా కూడా పల్లెలోని పొలం అమ్ముకుని వెళ్ళిపోయేవారు. మా నాన్నగారు మాత్రం అటు ఉద్యోగం చేస్తూనే ఇటు వ్యవసాయం కూడా కొనసాగించారు. అయితే ఈ `రెండు కళ్ల సిద్ధాంతం’ వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. వ్యవసాయ పనులు సరిగా చూసుకోలేక పోయే వారు . ఆ సమయంలో మా బామ్మే పెద్ద దిక్క అయింది. మా బుల్లెమ్మ అత్త (కస్తల సీతారావమ్మ) కూడా బామ్మతోనే ఉంటూ సపోర్ట్ చేస్తుండేది. అలా బుల్లెమ్మ అత్త కుటుంబానికీ మా కుటుంబానికీ విడదీయరాని అనుబందం ఏర్పడింది. ఆ ఇంటి పిల్ల ఈ ఇంట కోడలు (వదిన) అయింది. ఇదంతా 50 ఏళ్ల కిందటి ముచ్చట. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మా నాన్నగారి దగ్గర మూడు మార్గాలు ఉండేవి. వాటిలో ఒకటి స్థిరమైన ఉద్యోగం. రెండవది వ్యవసాయ దిగుబడి. మూడవది కోడె గిత్తలను, పాడి ఆవులను అమ్మడం. ఉద్యోగం ఉండటంతో కనీస అవసరాలకు లోటు ఉండేది కాదు. పంట బాగా పండినప్పుడో లేకపోతే కోడె దూడలు ఎదిగి గిత్తలుగా మారగానే వాటిని అమ్మడం వల్లనో చేతిలో డబ్బులు ఆడేవి. అలాంటప్పుడు అమ్మకి నగలు చేయించే వారు నాన్నగారు. ఆర్థికంగా బలపడటానికి మూడు మార్గాలు ఎంచుకున్నా ఒక్కోసారి ఆయనకు ఇబ్బందులు తలెత్తేవి. రోగాల బారిన పడి పై ఇద్దరు పిల్లలు మరణించడం ఓ పెద్ద విషాదం. మిగిలిన పిల్లల ఆరోగ్య సమస్యలు, చదువులు వంటి చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఈదుకుంటూ వస్తున్నా అప్పుడప్పుడూ అప్పుల భారం పెరిగిపోయేది. అలాంటప్పుడు ఒకటి రెండు ఎకరాలు అమ్మేయాల్సి వచ్చేది. మా ఊర్లో మాకున్న పొలాలకు చక్కటి పేర్లు ఉండేవి. నాకు గుర్తున్నంత వరకు ఒక వైపున ఉన్న పొలం పేరు `రాయల వారి చేను’ (ఏరు వాక పండుగ నాడు పొలం దున్నింది ఈ పొలం లోనే) , మరో వైపున `చెరుకు చేను’, రోడ్డు ప్రక్కన `తుమ్మల చేను’, ఇంకో దిశగా `పార్వతమ్మ చేను’ ఇలా అన్నమాట. ఊరు మారలేదు.. : నా చిన్నప్పుడు చిరుధాన్యాల పంటలే ప్రధానంగా ఉండేవి. ఇవి నిత్యజీవితంలో చాలా అవసరమైనవి కావడంతో డబ్బుకు బదులుగా ధాన్యం చలామణిలో ఉండేది. కాలం మారింది. ఊరూ మారింది. ఈ పంటల స్థానంలో కమర్షియల్ క్రాప్స్ పట్ల రైతులు మొగ్గు చూపడం మొదలెట్టారు. ఊర్లో ఉన్నట్లుండి పొగాకు బేరన్ వెలిసింది. ఇది వాగుకు దగ్గర్లోనే ఉండేది. అక్కడ పొగాకును తీగల మీద వ్రేలాడదీసి ఆరబెట్టే వారు. అక్కడకు వెళ్ళగానే అదో రకం వాసన కమ్మేసేది. పొగాకు వైసిన రైతు చూస్తుండగానే ఆర్థికంగా ఎదగడం చూసిన మిగతా రైతులు ఆ పంట వైపు మొగ్గడం మొదలెట్టారు. జొన్న, కంది, పెసలు వంటి సాంప్రదాయ పంటల పట్ల ఆసక్తి తగ్గిపోవడం మొదలైంది. ఈ సమయంలోనే మరో వాణిజ్య పంట మిరప మా పల్లెను డామినేట్ చేయడం మొదలెట్టింది.
ఇది కూడా లాభసాటి పంట కావడంతో ఎటు చూసినా మిరప తోటలే. ఇప్పటికి కూడా మీరు మా ఊరు పొలాలవైపు వెళితే మిరప పంట ఎంతగా రైతును ఆడిస్తుందో అర్థమవుతోంది. మరో వాణిజ్య పంట – పత్తి. ఇవి కాక సుబాబులు పండిస్తే లాభాలు గడించవచ్చని సుబాబుల్ తోటల పెంపకం పట్ల కొందరు ఆసక్తి చూపారు. మా నాన్నగారు ఓ సారి మామిడి తోట వేశారు. అయితే మొక్కలు ఏపుగా పెరగలేదు. రాబడి రాలేదు. వాణిజ్య పంటల వల్ల మెట్ట పొలాల్లో సాంప్రదాయ పంటలు తగ్గిపోయాయి. బహుశా ఈ పోకడే అన్ని చోట్లకు పాకబట్టే ఇప్పుడు (2024) కిలో కంది పప్పు ధర రెండు వందల పై చిలుకు అయింది. అలాగే జొన్నలు, పెసలు రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ఒక దశలో వీటినేనా మానికలతో కొలిచి పోసిందని ఆ నాటి సంఘటనలు తలుచుకున్నప్పుడల్లా నేటి పోకడ చూసి మనసు చివుక్కుమంటోంది. పొలాల మధ్యలో ప్రతి రైతు కూరగాయల సాగు చేసేవాడు. అది కాకుండా ప్రతి ఇంటి ఆవరణలో గుమ్మడి సొర పాదులు, టమోటా, బెండ, వంగ వంటి ముక్కలు నాటేవారు. ఆ రోజుల్లో కూరగాయలు ఒకరింటి నుంచి మరొ ఇంటికి ఉచితంగానే వస్తుండేవి. మజ్జిగ కూడా అంతే. ప్రతి దానికీ పైసలు తీయాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ రోజులు మారాయి. ఎవరిలో మార్పు వస్తే పరిస్థితి చక్కబడుతుందో తెలియని అయోమయపు పరిస్థితి దాపురించింది. వాణిజ్య పంటలు వేస్తున్నా చేతిలో డబ్బు ఆడుతున్నా నాకు తెలిసి 50 ఏళ్లలో ఊరు పెద్దగా మారలేదు. ఊర్లోకి అడుగు పెట్టగానే ఏదో విలితి కనబడుతోంది. అది ఏమిటో.. దాచుకునే వారు కొందరు. దాపరికం లేని వారు మరి కొందరు. హెచ్చులు పోయే ఖర్చులు చేసే వారు కొందరు. దానధర్మాలు చేసే వారు ఇంకొందరు. ఇలా అనేక రకాల కుటుంబాలు ఒక్క మా పల్లెలోనే కనబడేవి. మొత్తానికి అగ్రహారం పొలాలు కరిగిపోతున్నాయి. `పల్లె పెత్తనం’ చేతులు మారుతోంది. ఇప్పుడు నాబోటి వాడు వెళితే , `మీరెవరు బాబు?’ అని అడిగే రోజులు వచ్చేశాయి. కాలం మారింది. పరిస్థితులు మారాయి. అయినా ఆ ఊరి పట్ల నా అభిమానం చెదరలేదు. ఆ జ్ఞాపకాలు నా మదిని వీడి పోలేదు. ఊర్లో శివాలయం, రామాలయం వాటితో నా అనుబంధం, చిన్న నాటి పల్లె వాసనలు మరో సారి.. ---- ఫుట్ నోట్ --- చూ. 16: ఏరువాక పండుగ : ప్రతి ఏట దుక్కి దున్నడం ప్రారంభించేది ఈ పండుగ రోజునే. ఏరువాక పౌర్ణమి అని అంటారు. జేష్ట శుద్ధ పౌర్ణమి రోజున వస్తుంది ఈ పండుగ. అప్పటికే తొలకరి జల్లులు పడటంతో పొలం దున్నడానికి అనుకూల వాతావరణం ప్రకృతి మాత ప్రసాదించ బోతున్నదని భావించి ఆ రోజున రైతులు అరక కట్టి పొలం దున్నడానికి బయలుదేరతారు. ఆ రోజున వ్యవసాయ పనిముట్లను శుభ్రంగా కడిగి వాటికి పసుపు, కుంకుమ పూసి ప్రత్యేక పూజలు చేస్తారు. పొలంలో నామమాత్రంగా దుక్కి దున్నుతారు. ఆ తర్వాత పూర్తి అనుకూలత వచ్చాకనే పూర్తి స్థాయిలో విత్తులు నాటతారు. పూర్వం అనేక సినిమాల్లో ఏరువాక విశిష్టత చూపించే వారు. పల్లెల్లో ఏరువాక సందర్భంగా పాటలు కూడా పాడుకునే వారు. అరకలు నాగళ్లు వంటివి కనుమరుగవుతున్న సందర్భంలో ఏరు వాక జరుపుకనే తీరులో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాటి పల్లె ముచ్చట్లు ఇక్కడితో పూర్తి కాలేదు. ఇంకా ఉన్నాయి. నాలోని నాటక రచయితను మేల్కొలిపింది కూడా ఈ పల్లెటూరే. ఆ వివరాలు మరో సారి చెబుతాను. (మళ్ళీ కలుద్దాం)

15, జులై 2024, సోమవారం

16వ భాగం : పలికింది ఆకాశవాణి

ఆ ఇంటికి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. అయితే వెళ్లాలంటే ముందు రిక్షా ఎక్కాలి, ఆ తర్వాత బస్సెక్కాలి. మూడు గంటల ప్రయాణం అయ్యాక కాస్త దూరం నడవాలి. అప్పుడు కానీ ఆ ఇల్లు కనబడదు. ఎండా కాలం సెలవుల్లో మంగళగిరి నుంచి నందిగామ లోని పాత బస్టాండ్ వద్ద ఉన్న చిన్నమ్మమ్మ గారింటికి రావాలంటే ఇవన్నీ తప్పువు మరి. నా వయసు అప్పుడు - ఎనిమిదేళ్లో తొమ్మిదేళ్లో ఉంటాయి. ఇప్పటికీ ఆ ఇల్లు నాకెంతో ప్రత్యేకం. ఎంతగా అంటే - అక్కడ నేను చూసిన ఒక వస్తువు జీవితంలో నాకు ఒక గుర్తింపుని – అది కూడా `జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారం’ అందుకునే స్థాయికి ప్రేరణగా నిలిచింది. ఇంతకీ ఏమిటా వస్తువు? అది నా జీవితంలో ఎలా ప్రభావం చూపిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఇంట్లో కొంచెం ఎత్తులో ఒక చెక్క బిగించారు. అదేమో కరెంట్ ప్లగ్, స్విచ్ లకు దగ్గర్లోనే ఉండేది. నాబోటి చిన్న పిల్లలకు అందనంత ఎత్తులో ఉంచారు. ఆ చెక్కపై ఒక పెట్టె ఉండేది. మా చిన తాతో, వారి పిల్లలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఆ పెట్టె దగ్గరకు వచ్చి, అందులో ఒక మీట నొక్కుతారు. ఆశ్చర్యం, ఆ పెట్టెలో లైట్లు వెలిగేవి. ఆ పెట్టెలో ఒక చోట సన్నటి, పొడవాటి గీతలాంటి చోటు ఉంది. పెట్టె మీట నొక్కనంత వరకు అది ఉన్నట్లే తెలియదు. కానీ మీట నొక్కగానే అందులో నుంచి ఆకుపచ్చ కాంతి వచ్చేది. మధ్యలో ఒక స్కేల్ లాంటి చోట ఎవేవో అంకెలు ఉండేవి. ఎర్రటి పుల్లలాంటిది దాంట్లో బిగించారు. చక్రం లాంటి బటన్ ని తిప్పుతూ ఆ ఎర్రటి పుల్లను ఎడమవైపుకీ అలాగే కుడి వైపుకీ తిప్పేయవచ్చు. అలా తిప్పుతున్నప్పుడు ఒక చోటకు రాగానే పెట్టెలోంచి మాటలు వచ్చేవి. అలాంటప్పుడే మొదటి సారి విన్నాను ఈ మాట- `ఆకాశవాణి, విజయవాడ కేంద్రం, నిలయంలో సమయం ఆరు గంటలు’ పెట్టెలో నుంచి మాటలే మాటలు. పాటలే పాటలు. నాకేమో బోలెడు ఆశ్చర్యం. ఎవరు మాట్లాడుతున్నారు ఆ పెట్టలోంచి? నా చిట్టి బుర్రకు తట్టలేదు. గోడకి, పెట్టకి మధ్య కాస్తంత గ్యాప్ ఉంది. అందుకే నేను గోడకు ఆనుకుని మెడ పైకెత్తి ఆ సందులోకి చూశాను. పెట్టె లోపల ఏవో గోళీలున్నట్లు అనిపించింది. అవి మిళమిళా మెరుస్తున్నట్లున్నాయి. అంటే, మెరిసే గోళీలే మాటలు చెబుతున్నాయా..? ఏమో.. ఇలా ఆలోచిస్తుండగానే పెట్టెలో నుంచి పాట మొదలైంది. మరోసారి గోడకీ పెట్టెకీ మధ్య ఉన్న సందులో నుంచి నిక్కినిక్కి చూశాను. అబ్బే లాభం లేదు. నేననుకున్నట్లు ఎవ్వరూ లేరు అందులో. పెట్టెలో నుంచి `ఆకాశవాణి విజయవాడ కేంద్రం’ అన్న మాటలు మాత్రం పదేపదే వినడంతో ఈ పెట్టెకు అదే పేరు పెట్టుకున్నాను. అలా `ఆకాశవాణి పెట్టె’గా నేను పిలుస్తుంటే చినతాతగారు నవ్వేసి, ఓరేయ్ దీన్ని అలాగా పిలవకూడదురా, `రేడియో’ అనాలి- అని చెప్పారు. అప్పటి నుంచి మాట్లాడే పెట్టె పట్ల ఆసక్తి పెరిగిపోయింది. ఈ పరికరం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. రేడియో అన్నది ఒక పరికరమనీ, దాంట్లో నుంచి వివిధ స్టేషన్లు ఉంటాయనీ, అవి వివిధ కార్యక్రమాలు ప్రసారం చేస్తుంటాయని తెలిసింది. నేను హైస్కూల్ లో చదువుతున్నప్పుడైతే రేడియో సిలోన్ పేరు వినడమే కాదు, మా ఇంట్లోని రేడియో పెట్టెలో సిలోన్ నుంచి వచ్చే కార్యక్రమాలను వినేవాళ్లం. మీనాక్షి పొన్నుదొరై అనే ఎనౌన్సర్ భలేగా తెలుగు మాట్లాడేసేది. అలాగే రేడియో మాస్కో పేరిట రష్యా నుంచి కూడా తెలుగు ప్రసారాలు వచ్చేవి. ప్రేరణ ఇచ్చిన మిత్రుడు: నేను ఆంధ్రప్రభలో చేరిన తర్వాత అసలు ప్రపంచం లో వందలాది రేడియో కేంద్రాలున్నాయని తెలిసింది. నా జర్నలిస్ట్ మిత్రుడు కృష్ణం రాజు రకరకాల దేశాల్లోని రేడియో స్టేషన్ల గురించి మా ప్రభలోనే వ్యాసాలు వ్రాసేవాడు. అతని తెలివితేటలు చూసి నాకెంతో ఆశ్చర్యమేసేది. అతనప్పుడు ఉండేది పూరింట్లో అయినా బోలెడు పుస్తకాలు ఉండేవి. వాటిల్లో కొన్ని రేడియో స్టేషన్లు ఆ కార్యక్రమాల వివరాలకు సంబంధించినవి కూడా ఉండేవి. పుస్తకాలు వానకు తడవకుండా జాగ్రత్తలు తీసుకునే వాడు. పుస్తకాల సేకరణ నిజానికీ నాకూ అలవాటే. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు కొనుక్కున్న పుస్తకాల్లో కొన్ని ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. నేను `తరంగా’ రేడియో స్టేషన్ లో పనిచేస్తున్నప్పుడు నా ఆసక్తిని కనిబెట్టి సంస్థ సిఈఓ రావు గారు ప్రతి నెలా పుస్తకాలు కొనడానికి కొంత బడ్జెట్ శాంక్షన్ చేసేవారు. ఆ సంస్థ కొన్ని కారణాల వల్ల మూసివేసేటప్పుడు వందలాది పుస్తకాలు నాకే అప్పగించారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు నా దగ్గర ఓ 500 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో సినిమా విశేషాలు, తెలుగు భాష సంస్కృతి వంటి అంశాలే కాదు, ఇతర భాషా వైభవాన్ని చాటి చెప్పే పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటిలో ఎక్కువ పుస్తకాలను నందిగామలో భద్రపరిచాను. అప్పుడప్పుడు నాకనిపిస్తుంటుంది, ఈ 67 ఏళ్ల వయసులో ఈ పుస్తకాల బరువు ఇక మోయలేమోనని. పైగా ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిందాయె, పుస్తకాలు కూడా పీడిఎఫ్ రూపంలో మొబైల్ ఫోన్ లో కూడా చూసే వీలుంది. పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గకపోయినా, ఇప్పుడు చాలా మంది ఫిజికల్ గా పుస్తకం చేతపట్టుకుని చదవడం తగ్గిందనే చెప్పాలి. అయితే మంచి రేడియో కార్యక్రమాలు లేదా టివీ కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని నా కెరీర్ లో చాలా సార్లు తెలిసొచ్చింది. రేడియోకి ఒక ప్రసంగం తయారు చేయాలన్నా, పత్రికకు ప్రత్యేక వ్యాసం వ్రాయాలన్నా, టివీలో మాట్లాడాలన్నా ఇలా మీడియా రూపం ఏదైనా సరే, ఆ కార్యక్రమం రక్తికట్టించాలంటే రిఫరెన్స్ కోసం బుక్స్ తిరగేయాల్సిందే. ఈ లక్షణం ఇందాక చెప్పానే కృష్ణం రాజు అని, అతగాడిలో ఎక్కువ. ఈ మంచి లక్షణాన్ని ఇంకా పెంచుకోవాలని అతగాడ్ని చూసినప్పుడు అనుకున్నాను. అతనే ప్రపంచంలోని అనేక రేడియో స్టేషన్ల గురించి చాలా వివరంగా చెబుతూ నాలో రేడియో పట్ల ఆసక్తిని బాగా పెంచేశాడు. కోరిక తీరెనులే.. : సరే, చిన్నమ్మమ్మ గారింట్లో తొలి సారిగా చూసిన రేడియో అనుభవం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. ఎంతగా అంటే, పనిచేస్తే ఇలాంటి రేడియో స్టేషన్లో పనిచేయాలి అన్నంతగా. నేనూ రేడియోలోకి దూరేసి `ఆకాశవాణి విజయవాడ కేంద్రం’ అని అనాలనీ, నాకు నచ్చిన పాటలు వినేయాలని అనుకున్నాను. బలమైన కోరికను భగవంతుడు తీర్చాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోని స్టూడియోలో మైక్ ముందు కూర్చుని ఎదురుగా ఉన్న క్లాక్ చూస్తూ న్యూస్ చదవడం ప్రారంభిస్తూ – `ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది - తుర్లపాటి నాగభూషణ రావు’ అనగలిగాను.
విజయవాడలో రేడియో స్టేషన్ ని మొదటి సారిగా చూసినప్పుడు ఒక రకమైన భావోద్వేగం కలిగింది. అది ఎలాంటిదంటే నందిగామలో తొలిసారి చూసిన రేడియో పెట్టెలోకి దూరేసినంత అన్న మాట. సంకల్పం బలంగా ఉంటే భగవంతుడు కూడా సత్సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. నా కెరీర్ లో ఇది అనేక సార్లు నిజమైంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రాంతీయ వార్తా విభాగంలో కొంత కాలం క్యూజువల్ న్యూస్ రీడర్ గా పనిచేయడం. ఆకాశవాణితో బలమైన అనుబంధం ఏర్పడటానికి దోహదపడింది. ఈ అవకాశాలు రావడం నేను ఆంధ్రప్రభలో పనిచేయడమే. విజయవాడ ఆంధ్రప్రభలో ఉద్యోగం చేస్తూ ఓసారి `నడుస్తున్న చరిత్ర’ అన్న కార్యక్రమం కోసం రేడియో స్టేషన్ కి వెళ్ళాను. ఆ వారంలో వచ్చిన ప్రధాన వార్తలపై విశ్లేషణా కార్యక్రమం అది. సహజంగా ఈ కార్యక్రమం పత్రికల్లో పనిచేసే సీనియర్ జర్నలిస్టులకు అప్పగించే వారు. నేను అంత సీనియర్ ని కాకపోయినా నాకు అనుకోకుండా అవకాశం వచ్చింది. ఓ పది నిమిషాలనుకుంటా అంతకు సరిపడా , స్కిప్ట్ తయారు చేసుకోవాలి. మన గొంతు బాగున్నదనీ, చక్కగా చదవగలరనీ రేడియో వాళ్లు అనుకుంటే మనం చదివేయవచ్చన్న మాట. అలా నేను మొదటి సారిగా రేడియో స్టేషన్ లోని రికార్డింగ్ స్టూడియోలో రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుని నా ముందు ఉన్న మైక్ లో నా స్క్రిప్ట్ చదివాను. బాగుందని రికార్డ్ చేసిన ఆయన అన్నాడు. అప్పటి నుంచి అడపదడపా అవకాశాలు వచ్చాయి. అలా మొదలైన ఆకాశవాణి ప్రస్తానంలో నేను వ్రాసిన `అదిగో హరివిల్లు’ అన్న రూపకానికి `జాతీయ ప్రతిభా పురస్కారం’ రావడం మరో మధురానుభూతి. హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమైంది. రూపకాలు, నాటికల ప్రస్తావన గురించి మరో సారి చెబుతాను. కొత్తా రేడియో అండీ.. : చిన్నమ్మమ్మ గారింట్లో రేడియో పెట్టె చూసినప్పటి నుంచీ మన ఇంట్లో అలాంటి పెట్టె ఎందుకు లేదన్న సందేహం వచ్చింది. అన్నయ్యకు చెప్పడం, వాడేమో అమ్మకు చెప్పడం, అమ్మేమో నాన్న చెవిలో వేయడంతో కొంత కాలం తర్వాత ఇంట్లోకి రేడియో పెట్టె వచ్చేసింది. అయితే అప్పటికే మేము మంగళగిరి నుంచి గుంటూరు అద్దె ఇంటికి మకాం మార్చేశాము. కొత్త రేడియో పెట్టె ఇంటికి తీసుకువస్తున్నారన్న విషయం తెలిసినప్పటి నుంచి నా చూపులన్నీ గేటు వైపునే. వీధి చివర్లో ఏ రిక్షా కనిపించినా అది మనింటికేనేమో అనిపించేది. అంత ఆతృత. చివరకు ఆ క్షణం రానే వచ్చింది.
రేడియో పెట్టెను ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకు వచ్చారు. ఏమాట కామాటే చెప్పుకోవాలి. నేను చిన్నమ్మమ్మ గారింట్లో చూసిన పెట్టెకంటే ఇది చాలా నాజూగ్గా ఉంది. ఫిలిప్స్ కంపెనీ వారి రేడియో అది. చాలా ముద్దుగా ఉండే ఆ రేడియో పెట్టె అంటే రోజురోజుకీ ప్రేమ పెరిగిపోయింది. దాన్ని తాకుతుంటేనే ఒక రకమైన వైబ్రేషన్. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నావి ఇవే కబుర్లు. కొంత మంది ఫ్రెండ్స్ అయితే ఇంటి కొచ్చి చూసెళ్లారు. ఆ పెట్టెతో పాటు కాపర్ నెట్ లా ఉన్న ఒక పొడవాటి రిబ్బన్ ఇచ్చారు. దాన్నేమో ఇంట్లో ఒక మూల నుంచి మరో మూలకు పైన కట్టేస్తే సిగ్నల్ బాగా క్యాచ్ చేసి ఈ నాజూకు పెట్టె ముద్దు ముద్దుగా మాట్లాడుతుందట. దీన్నే ఏరియల్ అంటారట. అది కట్టకపోతే సిగ్నల్ ముల్లు తిప్పినా `ఘర్..గుర్..థ్రూర్..’ వంటి విచిత్ర శబ్దాలు చేస్తుందే తప్ప, మనం కోరుకున్నట్లు ఉదయం భక్తి గీతాలు పాడదు, రాత్రి పూట హరికథలు వినిపించదు. ఆ రోజుల్లో రేడియో పెట్టె వాడతుంటే లైసెన్స్ ఉండాలి. ఏడాదికి ఒక సారి లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడం కోసం మా అన్నయ్యే నేనో పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళే వాళ్లం. మరి ఇప్పుడు ఆ పద్దతి ఉన్నదో లేదో నాకు తెలియదు. అయినా ఇప్పుడు రేడియో పెట్టెను ఇంట్లో ఉంచుకున్న వారెదరూ...? పరికరం మారవచ్చేమో కానీ రేడియా పట్ల ఆదరణ మాత్రం ఇప్పటికీ చెక్కుచెదర లేదు. ఆదివారాల్లో నాటకాలు వినడం కాలేజీ రోజుల్లో బాగా అలవాటైంది. ఆ రోజుల్లో నేను విన్న `గణపతి’, `సక్కుబాయి’ వంటి నాటకాలు నాకిప్పటికీ గుర్తే. ఇవి కాక హాస్య నాటికలు చాలానే విన్నాను. నండూరి సుబ్బారావు, పుచ్చాపూర్ణానందం వంటి నటులు మాట్లాడుతుంటేనే మనకు నవ్వువస్తుంది. పుచ్ఛాపూర్ణానందం గారు సినిమాల్లో కూడా నటించారు. మా పెళ్ళి చూడటానికి అతిథిగా ఆయన కూడా వచ్చారు. స్టీల్ మరచెంబు పెళ్ళి కానుకగా ఇచ్చినట్లు గుర్తు. మావగారు మన్నవ గిరిధర రావుగారికి వీరు ఆత్మీయ మిత్రులు. హాస్య నాటికలు రేడియోలో వింటూ ఇంటిల్లిపాది నవ్వుకునే వాళ్లం. అలాంటిది, నేను కూడా రెండు మూడు హాస్య నాటికలు రేడియో వాళ్లకు వ్రాస్తానని మాత్రం అప్పట్లో అనుకోలేదు. చిన్నప్పుడు తొలిసారిగా రేడియోలో నాటకం విన్నప్పుడు మాత్రం బోలెడు ఆశ్చర్యమేసింది. పాత్రధారులంతా ఆ చిన్నపెట్టెలో ఎలా దూరి మాట్లాడుతున్నారన్న సందేహాల్లాంటివి రాలేదు కానీ, అసలు వీళ్లంతా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నది మాత్రం అర్థం కాలేదు. విష్ణు `మాయ’ : నందిగామ కాలేజీలో చదువుతున్నప్పుడు రేడియో పట్ల ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే , ఓ సారి మా ఫ్రెండ్ విష్ణుతో అన్నాను, `ఓరేయ్, మనమే ఓ రేడియో స్టేషన్ పెడితే ఎలా ఉంటుంది?’ ఈ ప్రశ్న వాడి బుర్రని తొలిచేసింది. అసలే వాడికి టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. చదువుతున్నది బైపీసీ అయినా ఓ ఇంజనీర్ బుర్ర వాడిది. నేనేం అతిగా చెప్పడం లేదు. నిజమే, వాడు కాలేజీలో చదువుతున్నప్పుడే రకరకాల ఎలక్ట్రానికి వస్తువులు తాయరు చేసేవాడు. మరి అలాంటి వాడి చెవిన పడిన నా మాట వృధా పోతుందా ఏమిటి. పైగా `తథాస్తు దేవతలు పైన ఉంటార్రా’ - అని మా బామ్మ అంటుండేది కదా. అప్పటికే విష్ణు విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఏదో కొత్త వస్తువు తీసుకువచ్చేవాడు. గ్రామ్ ఫోన్ రికార్డులు వాడు తెస్తేనే వాటిని పట్టుకుని చూసి తన్మయం చెందాను. వాటిని చేతికి తీసుకున్నది అప్పుడే. అయితే, అప్పటికే సినిమాల్లో గ్రామ్ ఫోన్ రికార్డులు ప్లే చేయడం వంటి సీన్లు చూశాను. ఇలాంటివన్నీ గొప్పింటి వాళ్ల దగ్గర ఉంటాయని అనుకున్నాను. అలా సినిమాల్లో చూసిన గ్రామ్ పోన్ రికార్డులు నా చేతిలోకి వచ్చి వాలడం నాకెంతో సంతోషమేసింది. రికార్డ్ మధ్యలో - పాట ఏ సినిమాలోనిదీ, ఎవరు పాడారు, సంగీతం ఎవరు వంటి వివరాలతో పాటు ఏ కంపెనీ వాళ్లు ఈ రికార్డ్ ను తయారు చేసేవారు ఇలాంటి వివరాలు ముద్రించే వారు. అవి చదువుతుంటే ఎప్పటికైనా నా వాయిస్ కూడా ఇలా రికార్డ్ ల్లోకి ఎక్కుతుందేమో అని ఆశపెట్టుకున్నాను. హెచ్ ఎం వీ రికార్డలు మీద ఉన్న కుక్క బొమ్మ మగదా, ఆడదా? అని అప్పట్లో తెలివైన ఫ్రెండ్స్ ప్రశ్నించే వారు. ఆ తరువాత తెలిసింది. హెచ్ ఎం వి అంటే హిజ్ మాస్టర్స్ వాయిస్ అని. ఇక డౌటేముంది. అలా, వాడు తెచ్చిన రికార్డుల్లో కొన్ని చిన్నవి అయితే, మరి కొన్ని పెద్దవి. అంతలో మా అమ్మ ఇంట్లో నుంచి వచ్చి ఈ రికార్డులు చూసి `ఏమిట్రా ఇవి, గిన్నెల మీద మూతలు పెట్టుకునే పేట్లులా ఉన్నాయి’ అన్నది. అప్పుడు నాకూ అలానే అనిపించింది. నిజమే, వాటిలో కొన్నేమో పెద్ద అన్న గిన్నె మీద పెట్టే ప్లేటుల్లా ఉండేవి. మరి కొన్నేమో పాల గిన్నెల మీద పెట్టే మూతల్లా చిన్న సైజులో ఉన్నాయి. వాటి మధ్యలో చిల్లు మాత్రం తప్పకుండా ఉండేది. `ఒరే అబ్బాయ్ ఈ ప్లెట్లకు మధ్యలో ఈ చిల్లు ఎందుకురా..?’ మధ్యలో బామ్మ దూరి అడిగింది. బామ్మ మాటలు పట్టించుకోనట్లే వాడు సమాధానం చెప్పకుండా జంప్...నిజంగానే `జంప్’ చేసే వెళ్లాడు. వాడింటికీ మా ఇంటికి మధ్య గోడే అడ్డం. వాడిల్లేమో మెయిన్ బజారులో ఉంటే, మాదేమో పక్క సందులో ఉండేది. మా ఇంటి వెనుక భాగం ప్రహరీ గోడ వాడింటి వెనక భాగం ప్రహరీ గోడ ఒకటే. గోడకి అటూ ఇటూ ఇటుక రాళ్లో, నాప రాళ్లో పేరిస్తే చాలు క్షణాల్లో జంప్ చేసి వాడింట్లోకి వెళ్ళవచ్చు. కాలేజీకి వెళ్ళాలన్నా మా ఇంటి నుంచి బయటకు వచ్చి, మెయిన్ బజారులోకి వచ్చి మళ్ళీ వాడింటి మీదగా వెళ్ళాల్సిందే. ఎందుకీ శ్రమ, చిన్న జంప్ ఉండగా మా చెంత. విష్ణు గాడు అలా జంప్ చేసేసి రాకెట్ స్పీడ్ లో గ్రామ్ ఫోన్ ప్లెయర్ పట్టుకొచ్చాడు. నాకు ఇంతకు ముందే చెప్పడంతో నేను ఆశ్చర్యపోలేదు. బామ్మ ఈ పెట్టని కూడా ఆశ్చర్యంతో చూసింది. ఇదేమో చిన్నసైజు చెక్కపెట్టెలా ఉంది. పట్టుకు వెళ్లడానికి హాండిల్ కూడా బిగించి ఉంది. దీన్ని వాడు విజయవాడ వెళ్ళి కొనుక్కురాలేదు. వడ్రంగి మేస్తీకి చెప్పి తయారు చేయించాడు. అలా అని ఇదేమీ బొమ్మ వస్తువు కాదు. నిజంగానే పనిచేసేదేనని ఎంతో గర్వంగా చెప్పాడు వాడు. గ్రామ్ ఫోన్ ప్లెయిర్ అప్పటికే వాడు తెచ్చిన రికార్డ్ ల్లో ఒక దాన్ని దాని మధ్య పరిచాడు. రికార్డ్ మధ్యలో ఉన్న చిల్లులో ప్లెయర్ బుడిప సరిగా అమరి అది తిరగడానికి వీలు కల్పించింది. ప్లెయర్ బటన్ నొక్కి రికార్డ్ మీద ముల్లు పెట్టగానే సౌండ్ రావడం మొదలైంది. ఆ రోజుల్లో ఇలాంటి రికార్డులు వాడు చాలానే సేకరించాడు. రేడియో స్టేషన్ : మనం రేడియో గురించి కదా మాట్లాడుకుంటున్నదీ, మధ్యలో ఈ రికార్డుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఊరికే రాలేదులేండి. ఆ రోజుల్లోనే ఓ సారి ఘంటసాల మాష్టారి భగవద్గీత రికార్డ్ తీసుకువచ్చాడు విష్ణు. అలాంటి సమయంలోనే నేనేమో నా మనసులోని మాట చెప్పేశాను కదా. `రేడియో స్టేషన్ ఎందుకు పెట్టకుడదరా’ అని.. కొద్ది రోజులయ్యాక చాలా సంతోషంగా చెప్పాడు `మనం కూడా రేడియో స్టేషన్ పెట్టెయవచ్చురా’ అని. నాకు బోలెడు ఆశ్చర్యంతో పాటుగా ఏనుగు ఎక్కినంత సంబరం కూడా వచ్చేసింది. అప్పటికే వాడింటికీ మా ఇంటికీ మధ్య ఓ ఫోన్ లైన్ (పర్సనల్) ఏర్పాటు చేశాడు విష్ణు. ఎలక్ట్రానిక్స్ పుస్తకాలు తెగ తిరగేసే వాడు. దీంతో సంపాదించుకున్న నాలెడ్జ్ తో ఫోన్ పరికరం తయారు చేశాడు. హ్యాండిల్ ని కూడా చెక్కతో తయారు చేయించాడు. ఇవన్నీ వాళ్లింట్లో పెద్దలకు ఇష్టం లేకపోయినా భరించారు. పాపం. మరి, ఫోన్ వైర్లు ఉండాలి కదా. వాడింటికీ మా ఇంటికీ మధ్యన సన్నటి తీగలు బిగించాడు. అవేమో వాడింటి పెరట్లో బట్టలు ఆరేసుకునే దండెం తీగలను సపోర్ట్ చేసుకుని ఫోన్ లైన్లను చుట్టేశాడు. వాళ్లమ్మగారేమే ఇవేంటీ మధ్యలో అడ్డంగా ఉన్నాయంటూ తెంపేసేవారు. ఆవిడ అటు వెళ్లగానే మేమిద్దరం మళ్ళీ వాటిని చుట్టే వాళ్లం. వాడింట్లో ఒక రూమ్ లో కూర్చుని రింగ్ ఇవ్వగానే ఇక్కడ మా ఇంట్లో వసారాలో ఒక ప్రక్కన ఉన్న గదిలో అమర్చిన ఫోన్ రిసీవర్ నుంచి శబ్దం వచ్చేది. నేను హ్యాండిల్ ఎత్తి చెవిలో పెట్టుకోగానే వాడి మాటలు వినిపించేవి. నా మాటలూ వాడు చక్కగా వినగలిగే వాడు. సక్సెస్. చివరకు కాలేజీ లెక్చరర్లు కూడా విష్ణుని `ఇంటర్ కమ్ ఫోన్ తయారు చేశావటగా’ అని అడిగే వారు. అలా వాడిల్లు మా ఇల్లు టెక్నికల్ గా కలిసిపోయాయి. వాడింట్లో ఉన్న అన్ని సౌకర్యాలు మా ఇంట్లోకి వచ్చేశాయి. రేడియో స్టేషన్ పెట్టడానికి కావాలసిన ముడి సరుకంతా అమరిపోయిందనే నేను భావించాను. అందుకే వాడ్ని `రేడియో స్టేషన్ నందిగామలో పెట్టవచ్చా’- అని అడిగింది. వాడేమే వైర్ లెస్ సెట్ ఎలా తయారు చేయాలన్న విషయంపై బాగా చదివేసి, బొమ్మలూ గట్రా కాగితాలపై గీసేసుకుని పనిలో పడ్డాడు. అతి తక్కువ ఖర్చుతో కిలో మీటర్ పరిథిలో పనేచేసేలా రేడియో ట్రాన్సిమీటర్ (ఈ పదమే వాడు వాడినట్లు గుర్తు) తయారు చేశాడు. అప్పట్లో రేడియోలో వివిధ భారతి కార్యక్రమాలు చాలా పాపులరయ్యాయి. వివిధ భారతి ప్రసారాలు అయ్యాక ఇంచు మించు అదే ట్రాన్స్ మీటర్ల మీద మా ప్రసారాలు ఉండేలా ప్లాన్ చేశాడు. నేనేమో ఎనౌన్సర్ అన్న మాట. వసారాలోని మూల గదే స్టూడియో అన్న మాట. మా అన్నా, వదినా పిల్లలు అంతా ఏదో వింత చూస్తున్నట్లు ఫీలయ్యారు. మా ఇంటి గది నుంచి ఎనౌన్స్ ర్ గా నేను మాట్లాడగానే నా మాటలకు తగ్గట్టుగా వాడేమే వాడి ఇంట్లోని గది నుంచి పాటలు వినిపించే వాడు. ఇదో అద్భుత మైన ప్రయోగం. ప్రయోగం అని ఎందుకు అన్నానంటే , నిజంగా రేడియో స్టేషన్లు నడపకూడదు. ఆ విషయం మాకు తెలియదు. అలా నడపాలంటే లైసెన్స్ గట్రా ఉండి తీరాలి. నందిగామలో కొంత మంది మా ప్రసారాలు విన్నారని చెప్పారు కూడా. ఈ వార్త పెద్ద సంచలనమైంది. ఈ సందర్భంగా నేను ఈ మధ్యనే చూసిన AE WATAN MERE WATAN అన్న హిందీ సినిమా గురించి నాలుగు మాటలు. అచ్చు మేము ఎలాంటి ప్రయోగాలు చేశామో ఈ సినిమాలో కూడా అలాంటి తంతే కనిపించింది. సినిమా కథ స్వాతంత్ర్య పోరాటం నాటిది. ఉషా మెహతా అనే యువతి సాహసోపేతంగా తన మిత్రులతో కలిసి కాంగ్రెస్ రేడియో స్టేషన్ ను స్థాపిస్తుంది. రహస్యంగా ప్రసారమయ్యే కార్యక్రమాలు స్వాతంత్ర్య పోరాట యోధులను చైతన్య పరిచేవిగా ఉండేవి. రామ్ మనోహర్ లోహియా కూడా తన ప్రసంగాలను ఈ కాంగ్రెస్ రేడియో నుంచి వినిపించారు. ఇదే భారత దేశపు తొలి ప్రైవేట్ రేడియో స్టేషన్. అయితే ఈ రేడియో స్టేషన్ ప్రసారాలను బ్రిటీష్ అధికారులు నిలిపివేయించారు. మా ప్రైవేట్ గా రేడియో స్టేషన్ ని ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమన్న సంగతి మాకు ఉర్లో పెద్దలు చెప్పారు. ఏదో ప్రయోగం అని విష్ణు సర్దిచెప్పాడు. `వద్దు ఆపేయండీ, లేకపోతే ఇబ్బందులు తప్పవని’ హెచ్చరించడంతో వాడు ఆపేశాడు, తప్పు- ఒప్పు అన్న సంగతి ప్రక్కన బెడితే వాడి సృజనా శక్తి, రేడియో కార్యక్రమాల నిర్వహణ పట్ల నా ఆసక్తి ఊర్లో చర్చగా మారింది. ఆ తర్వాత వాడు హోమియో డాక్టర్ అయ్యాడు.
నేనేమో జర్నలిస్ట్ ని అయ్యాను. దారులు వేరయ్యాయి. అయినా ఇప్పటికీ మా మధ్య స్నేహం అలాగే ఉంది. అంతే అమాయకంగా ఇప్పటికీ మాట్లాడుకుంటాము. ఒకప్పుడు కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేసిన రేడియోలు ఆ తర్వాత కాలంలో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కూడా వచ్చేశాయి. ప్రభుత్వం తీసుకున్న సరళీకృత నిర్ణయాల వల్ల ప్రసార మాధ్యమాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేశాయి. ఇంకా వస్తునే ఉన్నాయి. ఆ తర్వాత ఇంటర్నెట్ శకం మొదలైంది. దీంతో సోషల్ మీడియా రూపుదాల్చి వేగ వంతమైన ప్రసార మాధ్యమంగా నిలిచింది. సోషల్ మీడియాలో ఎవ్వరైనా ఆడియో స్టేషన్ పెట్టుకోవచ్చు. పాడ్ కాస్ట్ లు చేసి ప్రజలకు అందించనూ వచ్చు. ఇలాంటి ఆన్ లైన్ ఆడియో స్టేషన్లు కూడా ఇప్పుడు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని పెద్దపెద్ద స్టూడియోలతో అనేకానేక సొంత కార్యక్రమాలను ప్రసారం చేస్తూ శ్రోతలను అనునిత్యం ఆకట్టుకుంటున్నాయి. `తరంగా’ పేరిట కొంత మంది ఎన్నారైలు ఏర్పాటు చేసిన ఆడియో స్టేషన్ (దీన్ని రేడియో స్టేషన్ అనవచ్చు)కి నేను కొంత కాలం ప్రొగ్రామ్ డైరెక్టర్ (ఇండియా)గా పనిచేశాను. వినూత్నమైన వందలాది కార్యక్రమాల రూపకల్పన చేసే భాగ్యం అలా దక్కింది. వందేళ్ల భారతీయ సినిమా వైభవానికి గుర్తుగా మేము నాన్ స్టాప్ గా వంద గంటల పాటు వంద కార్యక్రమాలను ఇటు భారత్ నుంచి అటు అమెరికా నుంచి ప్రసారం చేసి సంచలనం సృష్టించాము. ఇందుకు గాను ఈ మెగా ఈవెంట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కించుకుంది. తపన చల్లారలేదు. ఆ తర్వాత ఫేస్ బుక్ ఆధారంగా ఆడియో స్టేషన్ (ఛానెల్ 5 రేడియో స్టేషన్) ఏర్పాటు చేశాను. ఎన్నో మంచి కార్యక్రమాలను ఈ స్టేషన్ నుంచి ప్రసారం చేయగలిగాను. ఇదంతా ఎందుకు చెబ్తున్నానంటే ఒకప్పటి తప్పు నేడు ఒప్పు అయింది. ఒకప్పుడు కష్టమైనది అనుకున్నది ఇప్పుడెంతో సులువైనదిగా మారింది. సాంకేతిక పరంగా వచ్చిన పెనుమార్పులు నా బోటి రేడియో ప్రియుల కోరికను ఇలా తీర్చేస్తున్నాయి. యాప్ ల ద్వారా ప్రపంచంలోని రేడియో స్టేషన్లన్నంటినీ వినగలిగే అవకాశం వచ్చేసిది. ఒకప్పుడు రేడియో సెట్ వేరు, ఫోన్ సెట్ వేరు, టివీ సెట్ వేరు.. అలాంటిది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల రాకతో ఇవన్నీ ఒకదానిలోనే దూరిపోయాయి. నా రేడియో కథలో ఇన్ని మలుపులు రాబోతున్నాయని ఆనాడు నేను అస్సలు ఊహించలేదు. ఇక ముందు మరెన్ని మార్పులు రాబోతున్నాయో. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో రేడియో కార్యక్రమాలు నిర్వహించే రోజు వస్తుందేమో, ఏమో.. (మళ్ళీ కలుద్దాం)

7, జులై 2024, ఆదివారం

15వ భాగం : `జై ఆంధ్రా బ్యాచ్’

`జై ఆంధ్రా’ ఉద్యమం జోరుగా సాగుతున్న కాలం లోనే టెన్త్ క్లాస్ చదువుతూ పరీక్షలు వ్రాసిన వాళ్లలో నేనూ ఒకడ్ని. మమ్మల్ని `జై ఆంధ్రా బ్యాచ్’ అంటుండే వాళ్లు. ఈ ఉద్యమం వల్ల చాలా మంది చదువులు పాడైపోయాయి. నాబోటి వాళ్లు అదృష్టవశాత్తు గండం గట్టెక్కినట్లు పాసయ్యాము. ఎంతో మంది విద్యార్థులు ఉద్యమం ఫలితంగా మరణించారు. పోలీస్ కాల్పులు, లాఠీ చార్జ్ లు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, రాజకీయ వ్యూహాల్లో చిక్కుకోవడాలు.. ఇలా ఎన్నో కారణాలతో ఆ నాటి యువత ప్రధానంగా విద్యార్థులు నలిగిపోయారు… నష్టపోయారు. 1972, 73 సంత్సరాలు నాకు ఎంతో గడ్డు కాలం. ఎందుకంటే మూడు రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే అమ్మ ఆరోగ్యం క్షీణించింది. తెలుగు మీడియంలో అంతంత మాత్రం చదువులు, జై ఆంధ్రా ఉద్యమ ప్రభావం. అందుకే ఈ మూడు అంశాలతో లింకైన విషయాలను ఈ భాగంలో చెబుతాను. ముందుగా, నేను టెన్త్ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నప్పటి సంఘటన గుర్తు చేసుకుంటున్నాను. టెన్షన్ : ఒకటే టెన్షన్. పరీక్ష ఫలితాలు ముద్రించిన పేపర్ చేతిలో ఉన్నా చూడలేనంత టెన్షన్. చేతులు వణుకుతున్నాయి. చమటలు పట్టేస్తున్నాయి. నా అవస్థ చూసి మా అక్క నా చేతిలోని పేపర్ లాక్కుంది. నిజానికి అది కూడా నాతో పాటే టెన్త్ వ్రాసింది. ఒకటి రెండు సార్లు గట్టిగా పునాది ఉండాలని చదివిన క్లాస్ లో మళ్ళీ చదివింది లేండి. అందుకే కలిసి ఒకే సారి టెన్త్ వ్రాశాము. నేను ఏడవ తరగతి పాసై ఎనిమిదవ తరగతిలోకి వచ్చాకనే ఏడవ తరగతికి కామన్ పరీక్ష అంటూ రూలొచ్చింది. సెవన్త్ పాసైతే చాలు ఎనిమిది, తొమ్మిదవ తరగతుల్లో తప్పడం అనేదే ఉండదు. మళ్ళీ పదవ తరగతిలోనే పబ్లిక్ ఎగ్జామ్ అన్న రూల్ ని బ్రహ్మానంద రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెట్టారు. గుంటూరులో ఏడవ తరగతి చదివేసి, పాసై ఎనిమిదవ తరగతి నుంతి టెన్త్ వరకు నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాను. రేకుల షెడ్ లాంటి గదుల్లో టెన్త్ కి నాలుగు సెక్షన్లు నడిపేవారు. వాటిలో రెండేమే (ఏ సెక్షన్, బి సెక్షన్) కాంపోజిట్ మాథ్స్ ఎంచుకున్న విద్యార్థుల కోసం. మిగతా రెండు జనరల్ మేథమెటిక్స్ ఎంచుకున్న విద్యార్థుల కోసం. మా అక్కమే జనరల్ మాథ్స్. నేనేమో కాంపోజిట్ మాథ్స్. `బెల్ట్ మాష్టారు’ భాగంలో చెప్పినట్లుగా భూపతి రావు మాష్టారు సెగ మాకు తగిలిందే కానీ అక్కకి తగల్లేదు. ఆ టెన్షన్ నుంచి అది తప్పించుకుంది. నేను టెన్త్ పబ్లిక్ పరీక్ష ఎలా వ్రాశానో, అందునా మాథ్స్ రెండు పేపర్లు ఎలా వ్రాశానో ఇంతకు ముందే చెప్పాను కదా. లెక్కల్లో , హిందీలో పాసవుతానా లేదా అన్నదే పెద్ద కొశ్చిన్ మార్క్ . ఇదిగో ఇప్పుడేమో రిజల్ట్స్ వచ్చేశాయే మరి. అక్క నా చేతిలో ఉన్న పేపర్ లాక్కుని మా నెంబర్లు చూడాలనుకుంది , కానీ పాపం అదీ కంగారు పడుతూనే ఉంది. ఫలితాలు చూసుకునేటప్పుడు మేము నందిగామలో లేము. విశాఖపట్నంలో ఉన్నాము. ఏదో సరదాగా సమ్మర్ టూర్ కి వెళ్లలేదు. అమ్మ – అనారోగ్యం: మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు. మేము తొమ్మిది, పది తరగతులు చదువుతున్నప్పుడు అమ్మ ఎక్కువగా మంచానికి అంటి పెట్టుకునే ఉండేది. పెంకుటిల్లు. గాలి వెలుతురు బాగానే ఉండేవి. హాలు మధ్యలో మంచం మీద పడుకుని ఉండేది అమ్మ. మా నాన్న గారిది బదలీల ఉద్యోగం అని గతంలో చెప్పాను కదా. ఆయన గారు నందిగామలోనే రిటైర్ అవ్వాలన్న తపనతో ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. దీనికంటే ముందు గుంటూరులో పనిచేస్తున్నప్పుడే అమ్మ ఆరోగ్యం మొదటి సారిగా దెబ్బతింది. ఓ రోజు ఉన్నట్లుండి రక్త విరేచనాలు అయ్యాయి. క్రమంగా రోగం ముదిరింది. ఒక దశలో బక్కెట్ల కొద్దీ బ్లడ్ పోయేది. ఇదంతా చూసి మేముకంగారు పడే వాళ్ళం. అమ్మ రోజురోజుకీ నీరసించి పోతునది. వైద్యం మొదలైంది. మందుల ప్రభావంతో కాస్త నయమైంది. ఈ లోగా నందిగామ వచ్చేశాము. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడలేదు. ఊర్లో అప్పటికే స్థిరపడిన ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పాండు రంగారావు గారికి చూపించి మందులు వాడుతున్నారు. అయినా నాలుగు రోజులు బాగుంటే మూడు రోజులు మంచానికే అంటిపెట్టుకునేది. ఆమెను పరామర్శించడానికి రోజూ ఎవరో ఒకరు వస్తుండే వారు. ఊర్లో మాకు బంధువులు ఎక్కువే. ఇంట్లో వంటావార్పు అయిపోయాక భోజనాలు గట్రా చేసేశాక తీరుబడిగా అమ్మలక్కలు మా ఇంటికి చేరేవారు. తలా ఒక మాట అనే వారు. ఈ మాటల తీరు ఎలా ఉండేవంటే, ధైర్యం చెప్పినట్లు కానే కాదు, భయపెడుతున్నట్లే ఉండేవి. ఒకావిడ ఇంట్లోకి వస్తూనే ఏడుపు లంఘించుకుంది. ఆమె వయస్సు 70కు పై మాటే. వితంతువు. ఆ రోజుల్లో వితంతువులు తెల్లటి చీర కట్టుకునే వారు. గుండుతో కనిపించేవారు. నుదిటిన విభూదీ గంధం వంటివి పెట్టుకునే వారే కాని కుంకుమ పెట్టుకోరు. చేతికి కడియం లాంటి బంగారు గాజు ఉండేది. అంతే కానీ ముత్తయిదువుల మాదిరిగా రంగురంగుల మట్టి గాజులు వేసుకునే వారు కారు. ఆ తర్వాత కన్యాశుల్కం వంటి సినిమాలు చూసి, ఇదో దురాచారమన్న మాట అని అనుకునేవాడ్ని. కానీ మొగుడు చనిపోగానే కుంకుమ, గాజులు తీసేయడం నాకెందుకో అప్పట్లో చాలా బాధ అనిపించేది. మా ఇంట్లోకి వస్తూనే పెద్ద పెట్టున ఏడుస్తూ... `ఒసే, రాజ్యం (మా అమ్మని అలా పిలిచేవారన్న మాట) ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావే’ అప్పటికే అమ్మని ఓదార్చ డానికి వచ్చిన మరో పెద్దావిడ - `అవునే బుల్లెమ్మో (పేర్ల పలికేటప్పుడు దీర్ఘం తీయడం అలవాటు) వారం క్రిందటే కదా నేను చూడటానికి వచ్చింది. ఇంతలోనే బాగా చిక్కిపోయిందే పిచ్చి తల్లీ..’ `అందుకే సెప్తుంటా, పట్నం తీసుకెళ్ళి చూపిస్తే బాగుండ్ను అని’ `నిజమే కానీ మనం తూగొద్దూ’ (మన ఆర్థికంగా తూగుతామా లేదా అన్నది కుడా వాళ్లే డిసైడ్ చేస్తారన్న మాట) `అదీ నిజమే, బోలుడు ఖర్చు. పట్నంలో వైద్యమంటే మాటలా..’ `ఇదిగో బుల్లెమ్మో నీకిది తెలుసా, సూరమ్మ లేదూ, అదేనే మా దూరపు చుట్టం, ఆవిడ, చిక్కి శల్యమై మొన్నీమధ్యనే పోయింది’ `అవునా, దుక్కలా ఉండేది కదా, ఆ మహాతల్లి నాకెందుకు తెలియదు, గిన్నెడు అన్నం తనొక్కితే తినేదిగా, ఆ..అయినా ఏం లాభంలే, ఏ చేతబడో చేసుంటారు. అది మామూలు రోగం అయిండదులే, మాయదారి రోగాలకు మందులేముంటాయి చెప్పు. ఇంతకీ ఆవిడ పోయి ఎన్నాళ్లయిందేం, నాకు కార్డు ముక్క రాలేదేమిటే చెప్మా..’ ఇలాంటి కబుర్లు వింటూ మంచం మీద అమ్మ ఇంకా దిగులు పడేది. చేతబడి, దెయ్యాలు పట్టడం వంటి మాటలతో హడలెక్కించే వాళ్లు. రక్ష రేకు కట్టించుకో మనే వాళ్లు ఒకరు, విభూది పెట్టి వెళ్ళే వారు మరొకరు. రోగం కంటే ఇలాంటి కబుర్ల వల్ల పేషెంట్ మానసిక స్థితి మరింత దిగజారుతుందని నాకు తెలిసినా చెప్పే ధైర్యం లేదు. ఇంకా, వీళ్లంతా ఎలాంటి వాళ్లంటే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆ మనిషి పోయినట్లే భావించి, ముందస్తు ఏర్పాట్ల గురించి ఆలోచించే వారు. ఇంటి దగ్గరకి శవాన్ని తీసుకు వచ్చే లోపే ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న ప్లానింగ్ లో ఉండే వారు. `ఇదేమిటమ్మా ?’ అని అడిగే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు, ఒక వేళ ఎవరైనా అడిగితే, `చూడు బాబూ, ఇంటికి శవం చేరాక ఎక్కువ సేపు ఉంచుకోం కదా, అప్పటికప్పుడు అన్నీ సమకూర్చుకోవడం ఎంత కష్టం’ అంటూ ఇదంతా తమ అనుభసారం, నీకేం తెలియదు పిల్ల కాకి అన్నట్లు చూసే వారు. ఇంతటి దారుణ మనస్తత్వం పేరుకు పోయేది ఆ రోజుల్లో. తొలి శుభకార్యం: ఇంట్లో ఇలాంటి మాటలతో అమ్మ ఆరోగ్యం మరీ పాడైంది. ఇంట్లో ఒక్క శుభకార్యమన్నా చేయకుండానే పోతానేమో అన్న భయం ఆమెను ఆవహించింది. నాన్నకు చెప్పింది. ఇద్దరూ కలిసి ఆలోచించారు. ఫలితంగా అన్నయ్య ఉపనయనం. ఇదే మా ఇంట్లో జరిగిన తొలి శుభకార్యం కావడంతో కాస్తంత అట్టహాసంగానే జరిగింది. అమ్మని ఇంతగా భయపెట్టిన అనారోగ్యం విశాఖలో జరిగిన ఆపరేషన్ తో తొలిగిపోయింది. ఆ తర్వాత దాదాపు 13 సంవత్సరాల దాకా అమ్మ హాయిగా ఉంది. పిల్లల పెళ్ళిళ్లు చూసింది. మనవరాళ్లను, మనవళ్లను చూసింది. మా పెళ్ళయ్యాక శ్రీదేవి గర్భవతి అని తెలుసుకుని ఎంతో ఆనందించిన తర్వాత మరో మారు అనారోగ్య సమస్యతో విజయవాడ ఆస్పత్రిలో చేరి కన్ను మూసింది. ఆ తర్వాత మనవడు పుట్టాడు. అమ్మ పేరు కలిసి ఉండేలా వాడికి రాజేష్ అని పేరు పెట్టుకున్నాము. అమ్మ (వాడికి బామ్మ) దయతో వాడు ఆనందకరమైన జీవితం గడుపుతున్నాడు. సరే విశాఖలో కెజీహెచ్ ఆస్పత్రిలో అమ్మకి శస్త్ర చికిత్స జరిగింది. అంతకు ముందు, నందిగామ డాక్టర్లు కూడా అమ్మని పెద్ద ఆస్పత్రిలో చేర్చమని చెప్పారు. దీంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ముందుగా అమ్మను చేర్చాము. అయితే అక్కడి పరిస్థితులు బాగోలేక పోవడంతో చిన్న మామయ్య (డాక్టర్ కె. సత్యనారాయణ రావు) సూచన మేరకు అమ్మను ఆ రోజుల్లో కారు మాట్లాడుకుని విశాఖపట్నం చేర్చాము. అమ్మతో పాటు నాన్నగారు అక్క నేను బయలుదేరాము. రైల్లో అమ్మ చేతి ముద్దలు: విశాఖపట్నం వెళ్లడం అది రెండోసారి అంతకు ముందు మామయ్య పెళ్ళికి రైల్లో విశాఖ వెళ్ళాము. అప్పుడైతే బలే సరదాగా ప్రయాణం సాగింది. బంధువులమంతా రైలెక్కి వెళ్లడం, అమ్మ, పిన్ని మా అందరికీ గోంగూర పచ్చడి కలిపిన అన్నం, కందిపొడి ఆవకాయ కలిపిన అన్నం ముద్దలుగా చేసి చేతికి అందించారు. రైలు అటూ ఇటూ ఊగుతుంటే దానికి తగ్గట్టుగా మేమూ ఊగుతూ ఇలా చేతిలో పెట్టిన ముద్దలు తినడం బలే తమాషాగా ఉండేది. అలా ఆ ప్రయాణంలో పిల్లల చేతిలో అన్నం ముద్దలు పెట్టిన అమ్మ ఇప్పుడు ఈ ప్రయాణంలో నీరసంగా పడుకుని ఉంది. అమ్మ చేతి వంక చూస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు. వెనక సీట్లో బలహీనంగా నీరసంగా మూలుగుతూ పడుకుని ఉంది. అమ్మకు అసలు ఏమైందీ? విశాఖ తీసుకెళితే నయం అవుతుందా? ఇలాంటి ఆలోచనలతో ప్రయణం సాగుతుంటూ తెల్లారాక కారు ఊరు చేరింది. ఆలస్యం చేయకుండా చిన్న మామయ్య అమ్మని కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్చారు. ఇది బ్రిటీష్ కాలం నాటి బిల్డింగ్ లో ఉంది. పెద్ద భవంతి. మా ఊర్లో లాగా చిన్నా చితక ఆస్పత్రి కాదని తెలిసింది. లోపలకు వెళుతుంటేనే ఆశ్చర్యంగా ఉండేది. తెల్లటి దుస్తులు ధరించిన నర్సులు, అంతే తెల్లటి కోటు, మెడలో స్టెతొస్కోప్ వేసుకున్న డాక్టర్లు హడావుడిగా తిరగడం చూస్తుంటే ఏదో సినిమా చూసినట్లు ఫీలయ్యాను. అమ్మకి ఆపరేషన్ చేశారు. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయట. అవి మాకూ చూపించారు. ఈ రాళ్లేమిటీ, అమ్మ కడుపులో ఉండటమేమిటీ.. ! అంతా ఆశ్చర్యమే. బియ్యం ఏరుతూ అప్పుడప్పుడు అమ్మ చేటలోని మట్టి గడ్డలను నోట్లు వేసుకోవడం నాకు తెలుసు. అలా లోపలకు పోయిన గడ్డలే ఈ స్టోన్స్ అని నేను గట్టిగా నమ్మేశాను. వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. అలా చిన్న మామయ్య ఇంట్లో ఉన్నప్పుడే టెన్త్ పరీక్ష ఫలితాలు తెలిశాయన్న మాట. మా నెంబర్లు ఉన్నాయో లేవో చూడటానికి అక్క కూడా కంగారు పడుతుంటే చిన్న మామయ్యే పేపర్ లాక్కుని మా ఇద్దరి నెంబర్లు చూశాడు. మొదట ఫస్ట్ క్లాస్లో ...ఊహూ లేవు. తర్వాత సెకండ్ క్లాస్ లో ... ఊహూహూ లేవు. ఏమిటో మా మామయ్యకు మా మీద అంత నమ్మకం అని నేను మనసులో అనుకుంటుండగా మామయ్య మా వైపు తిరిగి, `ఒరేయ్, మీకు ఏ స్వీట్ అంటే ఇష్టంరా...చెప్పండి’ అన్నాడు. ఇద్దరూ పాసయ్యార్రా అని ముక్తాయింపు ఇచ్చాడు. థర్డ్ క్లాస్ లో అన్న మాట. నాకేతే ఏనుగు ఎక్కినంత సంబరం వేసింది. అదే మా ఊర్లో ఉండి ఉంటే రయ్యిన వీధుల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ కి గర్వంగా చెప్పేసే వాడ్ని. కానీ ఇది మనూరు కాదు కదా. `ఏ స్వీట్ కావాల్రా’ అని మామయ్య అనగానే నాకు హల్వా గుర్తుకు వచ్చింది. నా చిన్నప్పుడు స్వీట్ బండి వాడు రావడం, నేనేమో పది పైసలకి హల్వా చేతిలో పెట్టించుకోవడం 10వ భాగం (గోరింట పూసింది)లో చెప్పాను కదా. నా ఫేవరేట్ స్వీట్ హల్వా. ఆ తర్వాత బూందీ మిఠాయి. ఇది కూడా బాగుంటుంది. ఎప్పుడైనా తిరనాళ్లూ, పండుగలప్పుడు గుడికి వెళితే బయట మిఠాయి దుకాణాలు బోలెడు కనిపించేవి. ఇప్పట్లా స్టాల్స్ లా పెట్టి అమ్మకపోయినా ఓ నులక మంచం వేసి దాని మీద పళ్లాల్లో మైసూర్ పాక్ ముక్కలు, హల్వా, బూందీ , కట్టె మిఠాయి, లడ్డూలు, గవ్వలు, జిలేబీ చుట్టలు - ఇలాంటి వన్నీ అమ్మేవారు. సరే, నేను హల్వా అనగానే మా మామయ్య నవ్వేశాడు. నాకు కోవా బిళ్లలు కాకుండా మరో రకమైన కోవా తీసుకు వచ్చాడు. అసలు కోవాలో ఇన్ని రకాలుంటాయని నాకు తెలియదు. తింటే బలేగా ఉంది. తిన్నానే కానీ దాని పేరు తెలియదు. కలాకండ్ అన్న పేరు నా పెళ్లయిన తర్వాతనే మా ఆవిడ ఇంట్లో వారు చెబితే తెలుసుకున్నాను. ఏమిటీ వీడు మరీ ఇంత అమాయకుడా ! అని ఆశ్చర్యపోతున్నారా... అందుకే ఆ రోజే అత్తారింట్లోనే మనసులోనే గట్టిగా శపథం లాంటిది చేసుకున్నాను. ఎంత బొంబాయి వెళ్ళి ఎమ్మెస్సీ చేసినా ఏం లాభం, కలాకండ్ గురించీ, పేణీల గురించి తెలయనప్పుడు. లాభం లేదు, నేను మారాలి. నిజంగా మోడ్రన్ గా మారాలి. అనుకున్నాను. కానీ, ఇప్పటికీ నేను మారలేదు. నా చిన్నప్పటి తినుబండారాలు , ఆ నాడు నేను చూసిన సినిమాలు , నాటకాలు ఇవే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కాలం మారుతున్నదని తెలుసు. మారుతున్న మనుషుల పోకడలను నేను విమర్శించను. సమాజం నిశ్చలంగా ఉండదు, ఉండకూడదు కూడా. కాకపోతే జరిగినంత కాలం ఆ పాత జ్ఞాపకాల చుట్టూ తిరగాడుతుంటాను. ఇదే నా పోకడ. పరువు తీసిన సీడ్ లెస్ కిస్మిస్ : పెళ్ళి చూపులు అయ్యాక రెండో సారో, మూడో సారో సరదాగా (ఆ మాత్రం సరదా ఉంటుంది కదా) మామగారి (మన్నవ గిరిధర రావు) ఇంటికి వెళ్ళినప్పుడు బావమరిది గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ కి తీసుకు వెళ్ళి అక్కడికి దగ్గర్లోని పండ్ల దుకాణంలో సీడె లెస్ కిస్మిస్ తీసుకున్నాడు. ఇవెందుకు అంటే వీటిలో సీడ్ ఉండదు బావగారు అన్నాడు. నిజానికి నేనెప్పుడూ సీడ్ లెస్ తినలేదు. అయితే ఆ మాట చెప్పకుండా, `సీడ్ ఉంటే మాత్రం ఏం, ఉమ్మెస్తే పోలా..’ అన్నాను నేనేదో తెలివిగల వాడిలా. ఫక్కున నవ్వేశాడు. ఇప్పటికీ అత్తగారింట్లో నా మీద వేసే జోకుల్లో ఇదొకటి. ఏం చేస్తాం, అలా అడ్డంగా దొరికిపోయను. సరే, మామయ్య స్వీట్స్ తెచ్చాడు. మా నోరు తీపి చేశాడు. అసలు పాస్ అవడమే గొప్ప అనుకుంటే ఇలా స్వీట్ ఇవ్వడం నాకెంతో ఆనందం కలిగించింది. ఇప్పట్లో లాగా రిజల్స్ నిమిషాల్లో చూడలేము. పేపర్లలోనే ఫలితాలు చూడాలి. చీమల బారులాంటి నెంబర్లు పేజీలకు పేజీలు నిండి ఉండేవి. పరీక్షల ఫలితాల విడుదల అనగానే విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఆంధ్రప్రభతో పాటుగా మరికొన్ని పత్రికలు సాయంత్రానికల్లా స్పెషల్ ఎడిషన్స్ తీసుకు వచ్చేవి. పత్రిక ఫ్రింట్ అయ్యే కేంద్రాల్లో అయితే ఆ రాత్రికల్లా అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. దూరంగా ఉన్న ఊర్ల వాళ్లకు మర్నాడు ఉదయం ఫలితాలను ఈ పేపర్లు మోసుకెళ్లేవి. 1973లో నా టెన్త్ పరీక్ష ఫలితాలు విశాఖపట్నంలో చూసుకోవాల్సి వచ్చింది. అది కూడా మర్నాడు ఉదయం మామయ్య వాళ్లింటికి వచ్చిన ఇంగ్లీష్ పేపర్ లో అన్న మాట. జై ఆంధ్రా – జైజై ఆంధ్రా : మా టెన్త్ బ్యాచ్ ఆషామాషీదేమీ కాదు. 1972-73 బ్యాచ్ ఇది. మేము చదువుకున్నది విజయవాడకు చేరువలోనే ఉన్న నందిగామలో. సరిగా ఆ సమయంలో విజయవాడ కేంద్రంగా జై ఆంధ్రా ఉద్యమం ఊపెక్కింది. అటు రాజకీయ పార్టీలు, ఇటు విద్యార్థి సంఘాలకు చేతినిండా పని. ఆవేశాలు, కావేశాలు మిన్నంటేవి. అలాంటి సమయంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి వచ్చింది. మార్చిలో జరగాల్సిన పరీక్షలు నాలుగు నెలల తర్వాత జరిగాయి. ఫలితాలు అంతే లేటుగా వచ్చాయి. అందుకే మాది `జై ఆంధ్రా బ్యాచ్’ అని చెప్పుకునే వారు. జై ఆంధ్రా అని వినగానే మా నోటి నుంచి జైజై అంధ్రా అని వచ్చేసేది. ఈ నినాదంలోనే ఒక ఊపు, ఒక రిథమ్ ఉండేవి. మెయిన్ బజారుకి ప్రక్క వీధిలోనే మా ఇల్లు ఉండేది. పెద్దపెద్ద నాయకులు ఎప్పుడు వచ్చినా మీటింగ్ వివరాలు ముందుగా తెలియజేయడం కోసం రిక్షాలకు లోడ్ స్పీకర్స్ పెట్టి మైకుల్లో చెప్పేవారు. ఉద్యమకారులు ఉత్సాహంగా `జై ఆంధ్రా, జైజై ఆంధ్రా’ అంటూ నినాదాలు చేస్తుండేవారు. దీంతో ఇంట్లో పిల్లలందరికీ మా ప్రేమేయం లేకుండానే నోట్లో నుంచి జై ఆంధ్రా నినాదాలు బయటకు వచ్చేసేవి. తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకుని టెన్త్ లోకి అడుగుపెట్టగానే ఊర్లోని పరిస్థితి ఇది. నిజానికి ఒక విద్యార్థికి టెన్త్ లో వచ్చే మార్కులు చాలా కీలకం. మంచి మార్కులు వస్తే పై చదువులు చదకుండానే ఉద్యోగం తెచ్చుకునే వీలుంది. సరే ఉద్యోగం సంగతి అలా ఉంచుదాం. అసలు టెన్త్ సర్ఠిఫికేట్ జీవితాంతం చాలా కీలకమే కదా. పై చదువులప్పుడు, ఉద్యోగాల్లో చేరేటప్పుడు ..ఇలా ప్రతిసారీ టెన్త్ సర్టిఫికేట్ కాపీ జత చేయమనేవారు. బర్త్ సర్టిఫికేట్ గా కూడా దీన్నే ఆమోదించడంతో ఈ సర్టిఫికేట్ విలువ అమూల్యమైనదని మాకు బాగా అర్థమైంది. ఇప్పటికీ టెన్త్ సర్ఠిపికేట్ ని మాత్రం పదిలంగా ఉంచాను. ఐదు దశాబ్దాలకు పైబడిన జీవితంతో సర్టిఫికేట్ వయసు పైబడిన వ్యక్తి లాగానే ముడతలు పడి, అక్కడక్కడా బాగా నలిగిపోయి, మసకబారి బీరువాలో ఓ మూలగా వొదిగి పడుకుని ఉంది. మార్కులేమన్నా గొప్పగా వచ్చాయా అంటే అదీ లేదాయె. అందుకే నా మటుకు నేను ఎవరన్నా టెన్త్ సర్టిఫికేట్ చూపించండి అని అన్నప్పుడులల్లా మనసులో ముల్లు గుచ్చుకుంటున్నట్లు ఉంటుంది. లెక్కలు, హిందీలో తక్కువ మార్కులే వచ్చినా మిగతా వాటిలో బాగానే వచ్చాయి. అంటే 50 పైమాటే. అయినా ఎందుకో ఇప్పటికీ సిగ్గు పడుతుంటాను. ఈ సర్టిఫికేట్ గుర్తుకు రాగానే, ఆ వెంటనే ఈ జై ఆంధ్రా ఉద్యమం (ఫుట్ నోట్ :చూ. 15) గుర్తుకు వస్తుంటుంది. మా ఊర్లో గాంధీ సెంటర్ అన్ని రకాల మీటింగ్ లకు ప్రధాన కేంద్రం. సాయంత్ర మయ్యే సరికి ఏదో ఒక మీటింగ్ ఉండేది. లౌడ్ స్పీకర్లలో నాయకుల ప్రసంగాలు మా ఇంటిదాకా వినబడుతుండేవి. ప్రసంగాలు మొదలు కాగానే ఏదో మిషతో అక్కడికి చేరేవాళ్లం . రాజకీయాల పట్ల అవగాహన లేకపోయినా నాయకులు మాట్లాడే తీరు, వారి హావభావాలు నిశితంగా గమనించే వాడ్ని. ఇదే ఆ తర్వాత మిమిక్రీ విద్యలో ప్రవేశం కలగడానికి దోహదపడింది. మా బంధువు, జనసంఘ్ నాయకుడు అయిన కొమరగిరి కృష్ణమోహన రావు గారి స్పీచ్ నన్ను ఆకట్టుకునేది. ఆయనలా ఇంట్లో మాట్లాడేవాడిని. `ఒక్క సారి ఆలోచించండి. ఆంధ్రుల పరిస్థితి ఎలా ఉన్నదో. ఒక్క సారి గుండెల మీద చెయ్యి వేసుకుని మరీ ఆలోచించండి...’ ఇలా సాగుతుండేది కొమరిగిరి గారి ప్రసంగం. ఆ రోజుల్లోనే వసంత నాగేశ్వర రావు వంటి యువ నాయకులు పేరు తెచ్చుకున్నారు. కాకాని వెంకటరత్నం గారు కీలక పాత్రనే పోషించారు. ఎప్పుడు ర్యాలీలు జరుగుతాయో, ఎప్పుడు నిరాహార దీక్షలు మొదలవుతాయో, ఎప్పుడు ఏ టెన్షన్ వస్తుందో తెలియదు. ఉన్నట్లుండి పోలీసులు రంగంలోకి దిగేవారు. కాల్పులు జరిపిన సంఘటనలూ ఉన్నాయి. సరే, ఉద్యమం దారి ఉద్యమానిది, మన దారి మనది. పరీక్షలు పోస్ట్ పోన్మెంట్ కావడంతో పుస్తకాలు మూలకెళ్లాయి. సినిమాలు షికార్లు ఎక్కువయ్యాయి. ఇంట్లో అడిగినా `పరీక్షలు ఇప్పుడు కాదుగా’ అనేసేవాళ్లం. అయితే నాతోటి వారిలో కొంత మంది ఈ ఉద్యమ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాంటి వాళ్లను `పుస్తకాల పురుగుల్లా ‘ అంటూ ఎగతాళి చేసేవాళ్లం. అలా అని మా బ్యాచ్ పూర్తిగా చదువుని నెగ్లెట్ చేసిందని కాదులేండి. చదువు కోసం కొంత సమయం కేటాయించేవాళ్ళం. మా జట్టు వాళ్లం రాత్రి ఏడు గంటల నుంచి మా ఇంట్లోనే కలిసి చదువుకునే వాళ్లం. రాత్రి తొమ్మిది గంటలకు ఓ సారి టీ త్రాగడానికని బయటకు వెళ్ళే వాళ్లం. మళ్ళీ మేం తిరిగి వచ్చే సరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉండేది. అంటే అంతా నిద్రపోయే వరకు తిరిగి ఇంటికి చేరేవాళ్లం కామన్న మాట. అయినా సరే, ఆ కాస్త చదువే అక్కరకు వచ్చింది. మొత్తానికి జై ఆంధ్రా బ్యాచ్ అయినా టెన్త్ పాసవగలిగాను. అమ్మయ్యా గండం గట్టెక్కింది. ఇక పై చదువులకు ఏ కాలేజీలో చేరాలన్న చర్చ ఇంట్లో మొదలైంది. సరే ఆ ముచ్చట్లు మరో సారి చెబుతాను. జై ఆంధ్రా – సినిమావోళ్ళు : జై ఆంధ్రా ఉద్యమం తెలుగు సినిమా వాళ్లపైనా పడింది. ఈ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఈ విషయం పెద్దగా నాకు తెలియలేదు కానీ ఆ తర్వాత ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు అక్కడి లైబ్రరీలో పాత పేపర్లు తిరగేస్తుంటే హీరో కృష్ణ, గుమ్మడి, చలం వంటి వారు ఇచ్చిన పత్రికా ప్రకటనలను చూశాను. హీరో కృష్ణ నిజంగానే డేరింగ్ ప్రకటనే చేశారని చెప్పుకునే వారు. కృష్ణ సినిమాలపై వారి రాజకీయ భావజాలం గట్టి ముద్దే వసిందని అనే వారు. ఈ మధ్యనే ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటే ఆ సమయంలో హీరో కృష్ణ రాజకీయ అవగాహన అబ్బురపరిచింది. నేను చదివింది ఇది..
కృష్ణలోని రాజకీయ చైతన్యం ఆనాడు ఆయన్ను ప్రత్యేక ఆంధ్రా ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ప్రారంభమైన ఈ ఉద్యమం భారత చరిత్రలోనూ అపూర్వమైనదంటూ ఆప్రకటనలో ప్రస్తావించారు. `ఆంధ్ర ప్రజానీకమంతా ఒక్కతాటిమీద నించి ఒకే మాట మీద నిలబడ్డారు. ఇది ప్రజా వెల్లువ. ఈ వెల్లువను ఆపేశక్తి ఎవ్వరికీ లేదంటూ’ ప్రకటించారు కృష్ణ. అంతే కాదు,ఆయన దీక్ష కూడా చేపట్టారు.
ఆనాటి ప్రముఖ హీరోయిన్ అంజలి దేవి కూడా స్పందించారు. ఆమె పత్రికలో ప్రకటన ఇస్తూ - `ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమకారులపై సాగిస్తున్న హింసాకాండను నిరసించారు. ఉద్యమంలో అసువులు బాసిన అమవీరులకు అశ్రుతర్పణతో అంజలి ఘటిస్తున్నానంటూ ప్రకటన ఇచ్చారు.
సినిమాల్లో గయ్యాళి పాత్రలే ఎక్కువగా చేసిన ఛాయాదేవి కూడా ఈ ఉద్యమం చూసి చలించిపోయారు. ఆమె పత్రికలో ఒక ప్రకటన ఇస్తూ – `ఆంధ్ర రాష్ట్రం యావత్తు ఒక రణరంగంగా మారిపోయింది. ఎందరో సోదరులు సిఆర్పీ , మిలటరీ వారి తుపాకులకు బలైపోతున్నారు. మహాలక్ష్మీల్లాంటి సోదరీమణుల మాంగల్యాలు తెగిపోతున్నాయి. ఎందరో తల్లులు తమ బిడ్డలను పోగుట్టుకున్నారు, వారి కుటంబాలకు నా సానుభూతి’ అని అంటూ ఆ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి విజ్ఞప్తి చేస్తూ - ఆంధ్రుల కోర్కె వెంటనే నెరవేర్చి , మారణహోమాన్ని ఆపుచేయాలని కోరారు.
ఇక హీరో చలం, శారద ఉమ్మడి ప్రకటన చేస్తూ - ఉమ్మడి కుటుంబంలా సహజీవనం కష్టమని తేలిపోయాక అభిప్రాయ బేధాలతో కలిసి ఉండే దానికంటే ఆత్మతృప్తితో విడిగా ఉండటమే మంచిదని అన్నారు. అమరులైన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.
ప్రముఖ హీరోయిన్ జమున కూడా స్పందించారు. గుంటూరులోని ఆమె సొంత థియేటర్ అలంకార్ ప్రదర్శనలను ఆపేశారు. పోలీస్ కాల్పుల ఘటనలతో చలించిన జమున తన థియేటర్ లోని షోలను కొంత కాలం నిలిపివేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. .
అలాగే, ఎస్వీ రంగారావు ఆ నాటి రాష్ట్రపతి వి.వి.గిరి గారికి పత్రికలో ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రుల కోర్కెను మన్నించి మారణహోమాన్ని నిలవరింపచేయాలని కోరారు. కలిసి ఉండాలని కోరేవారు, అభిప్రాయ బేధాలు తారా స్థాయికి చేరినప్పుడు విడిపోవడమే మంచిదని కొందరూ సినీరంగ ప్రముఖులు బాహాటంగానో లేక వారి వారి సినిమాల్లోనూ తేటతెల్లం చేశారు. 1970 ప్రాంతంలో వచ్చిన `తల్లా-పెళ్ళామా’ అన్న సినిమాలోని `తెలుగు జాతి మనది, నిండుగ తెలుగు జాతి మనది’ అన్న పాట కూడా ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి మనోభావాలను అద్దం పట్టిందని అనే వారు. కాలం మారుతుందీ , చేసిన గాయాలు మాన్పుతుంది అని ఓ సినీ కవి అన్నట్లుగా ఈ ఉద్యమం సమసిపోయింది. జై ఆంధ్రా ఉద్యమం నాపై ఎంతో కొంత ప్రభావం చూపినట్లే మా అబ్బాయి (రాజేష్) హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సెగ వాడికి తగలింది. బస్సులు తగలబెట్టడం, ర్యాలీలు, అశాంతి, దీక్షలు ఇలాంటి పరిస్థితుల్లో రోజూ కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. చివరకు తెలంగాణ రాష్ట్ర అవతరణతో ఈ ఉద్యమం ముగిసింది. తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మీడియా వాళ్లు `రెండు తెలుగు రాష్ట్రాల్లో ..‘ అన్న పదం ఇప్పుడు తరచూ వాడుతున్నారు. ఫుట్ నోట్ – చూ. 15 జై ఆంధ్రా ఉద్యమం: ఈ ఉద్యమం 1972, 73 సంవత్సరాల్లో ఆంధ్రా ప్రాంతంలో జరిగింది. చివర్లో సిక్స్ పాయింట్ ఫార్ములాతో సమసిపోయింది. రాష్ట్ర హైకోర్ట్, సుప్రీం కోర్టు, తెలంగాణలోని ముల్కీ రూల్స్ ని `సమర్దించడం’తో రగిలిపోయిన ఆంధ్రా నేతలు జై ఆంధ్రా ఉద్యమానికి తెరదీశారు. 1973 సెప్టెంబర్ లో ఆరు సూత్రాల హామీ పత్రం విడుదల అయింది. ప్రధాన మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ అప్పట్లో ఆంధ్రా ప్రాంత అభివృద్ధికి హామీ ఇచ్చారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగడం, ఆ తర్వాత విశాలాంద్ర ఉద్యమం తలెత్తడం, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించడం జరిగిన తర్వాత తెలంగాణలో ముల్కీ ఉద్యమం తలెత్తి ఆంద్రుల్లో అశాంతి రగులు కోవడంతో జై ఆంధ్రా ఉద్యమానికి బీజం పడింది. ఆవేశాలు తారా స్థాయికి చేరాయి. అణచివేతకు పోలీసులు కాల్పులు జరిపారు. నవంబర్ 21న మూడు వేరువేరు ప్రాంతాల్లో 13 మంది చనిపోయారు. విజయవాడలో డిసెంబర్ నెలలో పోలీసుల కాల్పుల్లో 23 మంది చనిపోయారు. ఇలా చనిపోయిన వారిలో కొంత మంది అమాయకులే. ఏదో పని మీద ఇంటి నుంచి వెళ్ళి కాల్పుల్లో చనిపోయిన వారూ ఉన్నారు. అలాంటి సంఘటనలు అప్పుడే కాదు, ఇప్పుడు తలుచుకున్నా కళ్లు చెమ్మగిల్లుతుంటాయి. అంతే కాదు, ఈ ఉద్యమం కారణంగా వేలాది మంది గాయపడ్డారు. వికలాంగులైన వారూ ఉన్నారు. లక్షలాది మంది యువత భవిష్యత్తు గాడితప్పింది. కొత్త నాయకులు పుట్టుకొచ్చారు. వారిలో కొందరు రాజకీయంగా తారాస్థాయికి ఎదిగారు. మహా నాయకులయ్యారు. కొందరు ఆ తర్వాతి కాలంలో రాజకీయంగా చితికిపోయారు. మొత్తానికి మా చదువుల మీద ప్రభావం చూపిన జై ఆంధ్రా ఉద్యమాన్ని ఎన్నటికీ మరిచిపోలేను. (మళ్ళీ కలుద్దాం)