27, అక్టోబర్ 2024, ఆదివారం

31వ భాగం : చందమామ రావే..:



 `ఖడ్గ వర్మా, ఇంకా ఈ చెట్టు దగ్గరే ఉండటం క్షేమకరం కాదు. పైగా చెట్టుపైన ఏదో పెద్ద కొండ చిలువ ఉన్నట్లు నా బుద్ధికి తోస్తున్నది. పద క్షేమంగా మరో చోటకు వెళదాం

  `జీవదత్తా, మనం భయపడాల్సిన అవసరం లేదు. పైగా నా చేతిలో ఖడ్గం ఉన్నంత వరకూ ఏ అడవి జంతువూ మనల్ని ఏమీ చేయలేదు. ఆ కొండ చిలువ అంతు చూడకుండా నేను కదలను



 `బుద్ధికి పదును పెట్టాల్సిన చోట ఖడ్గం తీయడమెందుకు మిత్రమా, సరే నీ ముచ్చటను నేనెందుకు కాదంటాను. పదా ఆ చెట్టు ఎక్కి దాని పని పడదాం

 చెట్టుకు వేల్రాడుతున్న పెద్ద తాడుని ఆధారంగా చేసుకుని ఇద్దరూ పైకి పాకుతున్నారు. 

అంతలో..

`ఒరే .. చాల్లేరా మండుటెండలో ఏమిటా ఆటలు, లోపలకు రండర్రా ‘ ఇంట్లో నుంచి పిలుపు. 

`అబ్బా ఉండమ్మా, ఎండా కాలం సెలవల్లో కూడా ఆడుకోనీయవా..’ అంటూ మా గిరీష్ లాజిక్ వెతుక్కుని మరీ సమాధానం చెప్పాడు. గిరీష్ - నందిగామలో నాకున్న మంచి మిత్రుల్లో ఒకడు. పైగా బంధువు కూడాను. ఇద్దరం కలసి హైస్కూల్ చదువులు, కాలేజీ చదువులు పూర్తి చేశాము . ఆ తర్వాత చెరో దారి. వాడేమో బ్యాంక్ ఉద్యోగి అయ్యాడు. నేనేమో జర్నలిస్ట్ గా స్థిరపడ్డాను. రిటైర్ అయ్యాక గిరీష్ మచిలీపట్నంలో విశ్రాంత జీవనం గడుపుతున్నాడు. హైస్కూల్ లో చదువుతున్నప్పుడు సెలవలు వస్తే చాలు నేను వాడింట్లోనే పగలంతా మకాం పెట్టేవాడ్ని. వాడింటి పెరట్లో ఓ పెద్ద బాదం చెట్టు ఉండేది. ఇదిగో ఆ చెట్టుకే మేమిద్దరం ఓ తాడు కట్టి ఎగబాకింది. బాదం చెట్టు కొమ్మలు అంత బలమైనవి కావు. పెళుసుగానే ఉంటాయి. అదే గిరీష్ వాళ్ల అమ్మ అసలు భయం. చిటికీ మాటికీ వీళ్ళిద్దరూ తాడుమీద ఎగబాకి చెట్టు కొమ్మ మీదకు చేరడం అక్కడే ఏవేవో కబుర్లు చెప్పుకోవడం ఆమెకు నచ్చేది కాదు. కొమ్మ విరిగి క్రింద పడితే కాళ్లూ చేతులూ విరుగుతాయని భయపడుతుండేది. అయినా ఈ ఒక్క విషయంలో వాడు అమ్మ మాట వినడు. 

అలా మేమిద్దరం చెట్టు ఎగబ్రాకుతున్న సమయంలో వాడేమో జీవదత్తుడు, నేనేమో ఖడ్గ వర్మ పాత్రలు పోషిస్తున్నామన్న మాట. అలా అని వాడే ఎప్పుడు జీవదత్తుడిగా ఉండిపోడు. పాత్రధారులు అటూ ఇటూ మారిపోతుంటారు. ఒక రోజు ఆటలో వాడు జీవదత్తుడైతే  మర్నాడు కొనసాగింపు ఆటలో ఖడ్గవర్మ అయ్యే వాడు. ఇంతకీ ఈ జీవదత్తుడు, ఖడ్గ వర్మ మమ్మల్ని ఆవహించడానికి ప్రధాన కారణం  `చందమామలో ఆ రోజుల్లో సీరియల్ గా వస్తున్న `రాతిరథం .



ఆ రోజుల్లో చందమామ కథలు మా బోటి పిల్లలపై ఎక్కువగానే ప్రభావం చూపేవి. ప్రతి కథకు వేసే బొమ్మలైతే నాకు బాగా ఇష్టం. రాతిరథంలో ఖడ్గవర్మ, జీవదత్తుడు పాత్రలతో పాటుగా మరికొన్ని కూడా మేము పోషించే వాళ్లం. వాటిలో కొన్ని (పద్మసేన మహారాజు, మంత్రి సోమదేవుడు, విఘ్నేశ్వర పూజారి) ఇప్పటికీ గుర్తున్నాయి.  

నందిగామలో ఈ ఆటలన్నీ 1960 దశకం చివర్లోనో, 70 దశకం తొలినాళ్లలోనో ఆడినవి. ఆ నాటి ఆటల్లోని క్రియేటివిటీ గురించి ఇప్పుడు ఎవరితోనైనా చెబితే ఆశ్చర్యపోతుంటారు. బాదం చెట్టు క్రిందనే అనేక ఆటలు ఆడేవాళ్లం. దాని ప్రక్కనే ప్రహరీ గోడకు ఆనుకునే  నాపరాళ్లను, కాసిన ఇటికలనుబంక మట్టితీసుకుని ఓ ఇంటి లాంటి నిర్మాణం కూడా చేశాము. దీనికి `ఖడ్గ-జీవదత్తుల ఆశ్రమం అని పేరు పెట్టాము. ప్రతి నెలా వస్తున్న చందమామ సీరియల్  `రాతిరథం రచనలో ఉన్నట్లుగానే ప్రాపర్టీస్ తయారుచేయడానికి తెగ ఉత్సాహపడే వాళ్లం. 



ఈ విషయం తెలుసుకున్న మా మిత్రుల్లో కొంత మంది మా ఇద్దరినీ `ఖడ్గ జీవదత్తులనే పిలిచేవారు. అంతే కాదు, మేము ఆడుతున్న సమయంలో వచ్చి చూసేవారు. కానీ అలా వారు రావడం మా ఇద్దరికీ నచ్చేది కాదు.మా ఆటకి అంతరాయం కలిగిచే గిరీష్ కి  కోపం వచ్చేది. ఆ సమయంలో వాడు ఖడ్గవర్మ పాత్ర అయితే అరిచేసేవాడు. అదే జీవదత్తుడు పాత్రలో ఉంటే శాంతంగా, లాజికల్ గా వాళ్లకు ఏదో చెప్పి పంపించేవాడు. ఈ భిన్న పోకడల్లోని మేజిక్ ఏమిటో తెలియక పాపం ఫ్రెండ్స్ వాడిని సరిగా అర్థం చేసుకోలేక సతమతమయ్యేవారు. 

చందమామ బుక్ లోని డైలాగ్ లే కాకుండా మేము అదనంగా కొత్తవి చేర్చి `రాతిరథం -`పెరటి డ్రామా ఆడేవాళ్లం.  ఇంటి పెరట్లో ఆడాము కనుక అది `పెరటి డ్రామా అయింది. అలా ఆ రోజుల్లోనే కొత్త పదాలు సృష్టించేవాళ్లం. పేరడీలు చేసేవాళ్లం. `పదాలు ఎవ్వరూ సృష్టించకపోతే ఎలా  అంటూ మాయాబజార్ సినిమాలో ఎస్వీఆర్ అనడం మాకో స్ఫూర్తి. ఇకనేం కొత్తకొత్త పదాలు సృష్టిస్తూ, మా ఫ్రెండ్స్ ని తికమక పెట్టేసే వాళ్లం. అప్పట్లో, అంత్యప్రాసతో కొన్ని సినిమాల్లో రావుగోపాల రావు వంటి వాళ్లు తమాషాగా మాట్లాడటం చూశాక మేమూ అంత్యప్రాసలో మాట్లాడటానికి ప్రయత్నించే వాళ్లం. ఈ విషయంలో ఈ గిరీష్,విజయ్, నేను ఓ జట్టు. ఇందులో మిగతా ఫ్రెండ్స్ కలసి రాలేదు. మరికొన్ని సార్లేమో తెలుగు భాషనే తిరగేసి మాట్లాడేసుకునే వాళ్లం.  

 

ఔరా పింగళి :

 

కొత్త పదాలు సృష్టించడానికి మాకు పింగళి గారు ఆదర్శమనే చెప్పాలి.  ముఖ్యంగా `మాయాబజార్`జగదేకవీరుని కథ వంటి సినిమాలు చూసినప్పుడు  `ఔరా పింగళిఅనుకునే వారం. పింగళి నాగేద్రరావు వారి పూర్తి పేరని ఆ తర్వాత తెలిసింది.  నాకైతే `చందమామ మీద వారు వ్రాసిన బోలెడు పాటలు భలేగా నచ్చేవి. 



వారు వ్రాసిన మాటలు సినిమా హాల్లో టపాకాయల్లా పేలిపోయేవి. వాటిని గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు వాడే వాళ్లం.  ఉదాహరణకు  `వేసుకో వీరతాడు`సాహసం సేయరా డింభకా, `అలమలం`నరుడా ఏమి నీ కోరిక`ఘాటు ప్రేమ`యుగయుగాలుగా, జగజగాలుగా`డింగరీ.

 చందమామ లోని రాతిరథం గురించీ, మా డ్రామా గురించి చెబుతూ కాస్తంత ప్రక్కకు జారిపోయాను కదా, మళ్ళీ అక్కడకే వెళదాం.. 

  చందమామ కథలో లేని కొన్ని డైలాగ్ లు గిరీష్ సృష్టించేవాడు. అలాగే కొన్ని సీన్లు కూడానూ. మొత్తానికి టివీలు లేని రోజుల్లోనే సెట్ ప్రాపర్టీస్ తో సీరియల్ రన్ చేసేవాళ్లమని మా పిల్లలకు , మనవళ్లకు చెబుతుంటే  `అవునా..నిజమా.. మీరు గ్రేట్ ..’ అంటూ ప్రశంసిస్తుంటే మా ఛాతీలు పొంగిపోతుంటాయి. 

ఇదంతా చందమామ బుక్స్ చదవడం వల్లనే. కాకపోతే చాలా మంది చదువుతారు. మేము ఆ కథల్లో లీనమై పాత్రల్లోకి దూరేవాళ్లం. సరదాసరదాగా ఆడుకునే వాళ్లం. అలా చందమామ బుక్స్ మాలో క్రియేటివిటీని పెంచింది. అదే  కాలేజీ చదువులప్పుడు మా చేత నాటకాలు ఆడించింది. డైరెక్షన్ చేయించింది . 

 

చందమామకు కష్టాలు:

  చందమామ కథల గురించి చెబుతున్న నేను ఇప్పుడేమో నిజం చందమామ గురించిన కథలు, విశేషాలు చెబుతానే..

నిండు జాబిల్లిని చూస్తే నాకెంతో ఆనందం వేసేది. అలాంటి నేను చిన్నప్పుడు జాబిల్లికి కష్టం వచ్చిందని చెబితే కలవరపడే వాడ్ని. చందమామకు కష్టమా!! అంటూ ఆశ్చర్యపోతున్నారా

 మా బామ్మ చెబుతుండేది, `ఒరే, కష్టాలు దేవుళ్లకి కూడా వస్తుంటాయి తెలుసా...’ అలా చెబ్తూ తన మాటలకు సపోర్ట్ గా బోలెడు కథలు చెప్పేది. శివుడేమో ఓ సారి శనికి భయపడి చెట్టు తొఱ్ఱలో దాక్కున్నాడట. ఇంకో కథలో ఇదే శివుడు ఓ రాక్షసుడు (భస్మాసురుడు)కి వరం ఇస్తాడు. కానీ కథ అడ్డం తిరిగి ఆ రాక్షసుడేమో శివుని తలమీదనే చేయి పెట్టి మహాదేవుడ్నే భస్మం చేద్దామనుకుంటాడు. దీంతో శివదేవుడు పరుగుపెట్టి విష్ణువు ని ఆశ్రయిస్తాడు. విష్ణువేమో మోహినీ అవతారం ఎత్తి రాక్షసుడిచేత నాట్యం చేయిస్తూ వాడి చేతిని వాడి తలమీదనే చేయి పెట్టుకునేలా చేసి అతగాడ్ని బూడిదగా మార్చేస్తుందట. ఈ కథ వింటుంటే, విష్ణువు తెలివితేటలు చూసి తెగ ఆశ్చర్యపోతుండే వాడ్ని. ఇలాంటి కథలతో పాటుగా చందమామ కథలు కూడా చెబుతుండేది మా బామ్మ. చందమామ బింబంలో జాగ్రత్తగా చూస్తే ఓ చెట్టు, ఆ చెట్టు క్రింద ఓ ముసలావిడ కూర్చుని రాట్నం వుడుకుతుంటుంది తెలుసా అనో, ఇంకో సారేమో ఆ ముసలావిడ పేదరాశి పెద్దమ్మ అనీ, అట్లు పోస్తుంటుందని చెప్పేది. ఇలాముసలావిడ గురించి రెండు విధాలుగా చెప్పడంతో నేను తికమక పడేవాడ్ని. చంద్రుడికో నూలుపోగు అన్న సామెత బహుశా ఈ కథ నుంచే వచ్చిందేమో. బామ్మ రెండు కథల్లో చెప్పిన ఆ ముసలావిడ మాత్రం నాకు కనిపించలేదు.   బహుశ బామ్మలాంటి పెద్దవారికే కనబడుతుందేమో, నా బోటి చిన్నవాళ్ల కళ్లకు కనిపించదేమో అని సరిపెట్టుకున్నాను. ఇంకో సారి, `చందమామకు ఈ రోజు గండం. పాపం పిచ్చి తండ్రి తల్లడిల్లిపోతాడు, ఎలా బయటపడతాడో ఏమిటో..’ అంటూ కళ్లు వొత్తుకుంది. ఆకాశంలో హాయిగా తిరిగే చందమామకు కష్టం ముంచుకు వస్తున్నదని నేనూ నమ్మేశాను. దీంతో నా కళ్లంబటి కూడా నీళ్లు వచ్చేశాయి. దీంతో బామ్మ ఇంకా హూషారుగా కథ కొనసాగిస్తూ - `రాహువు గాడనే రాక్షసుడు చంద్రుణ్ణి మింగడానికి వస్తున్నాడ్రా, పాపం చంద్రుడు  కరిగిపోతాడు అంటుంటే, 

మా అన్నయ్య పెద్దవాడు కదా, సైన్స్ బుక్స్ చదుతున్న వాడాయె, అడ్డు తుగులుతూ,`భయపడకురా, చంద్రుడికి కష్టమొచ్చినా కచ్చితంగా బయటపడతాడు. ఇదంతా మామూలే అన్నాడు. బామ్మమే వాడివైపు అదోలా చూసింది. వాడేమో  అంతకంటే వివరాలు నాకు చెప్పలేదు. ఈ చిన్న బుర్రకు అర్థం కాదని అనుకున్నాడేమో..ఏమో..

నేను బోలెడు పెద్దయ్యాక చంద్రుడికి అప్పుడప్పుడు వచ్చే కష్టమే గ్రహణమని అంటారని తెలిసింది. మా బామ్మ పడిన ఆదుర్దా తలుచుకుని ఇప్పటికీ నవ్వుకుంటాను.

ఇలాంటప్పుడే సాక్షి సినిమాలోని ఓ పాట గుర్తుకు వస్తుంటుంది. 

`పరిగెత్తి వస్తోంది రాహువు,

అయ్యో తరిగిపోతున్నాది ఆయువు

 

ఇలాంటి విషయాలు మా మనవళ్లకు చెబితే, `తాతా, ఇలాంటి, ఇన్నోసెంట్స్ ఉండేవాళ్లా ఆ రోజుల్లో..’ అంటూ డౌట్ వ్యక్తం చేశాడు. మేము బీఎస్సీలో చదివిన డైనోసార్ల గురించి వాడి తరం వాళ్లు నాలుగో ఏట నుంచే క్షుణ్నంగా తెలుసుకోవడం మొదలుపెడుతున్నారు. అసలు ఉయ్యాల ఊగే చంటి పిల్లాడు వేసుకునే టీ షర్ట్ మీద కూడా డైనోసార్ల బొమ్మలే కనబడుతుంటే మరి నేర్చుకోరా ఏమిటీమా చిన్నప్పుడు ఆవు, ఏనుగు, చిలక, కోతి వంటి బొమ్మలతో ఆడుకునే వాళ్లం. అందుకే అవంటే మాకు ఇప్పటికీ బోలెడు ఇష్టం. వీళ్లేమో డైనోసార్లు బొమ్మలతో ఆడుకుంటున్నారు. అవే వాళ్ల ఇష్టమైన బొమ్మలైపోయాయి. మా అబ్బాయి చిన్నప్పుడు ఏనుగు రబ్బరు బొమ్మతో ఎక్కువగా ఆడుకునే వాడు. దానికి వాడు `రాజా అని పేరు పెట్టాడు. ఆ బొమ్మే వాడి లోకం. 

 

చంద్ర గ్రహణం :  

 

ఎంత సైన్స్ చదువుకున్నా,  ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చంద్ర గ్రహణం వచ్చినప్పుడల్లా ఆ కాసేపు నాకు దిగులే. ఎంతైనా కళ్లముందు ప్రకాశిస్తున్న వాడు కాస్తా కళావిహీనమైతే దిగులే కదా. సంపూర్ణ సూర్యగ్రహణమైతే మరీనూ. ఉన్నట్లుండి సూర్యుడు మాయవడం చూసి నా చిన్న నాటి రోజుల్లోనే కాదు, ఇప్పటికీ ఆందోళన పడే వారు ఉన్నారు. ఈ ఆందోళనే అనేక భయాలను, ఆచారాలను తీసుకొచ్చింది.



 గ్రహణాల విషయంలో మూఢనమ్మకాలు మాత్రం పూర్తి గా తొలిగిపోలేదు. సైన్స్ ఏమి చెప్పినా కొన్ని ఆచారాలను సమాజం నుంచి  పూర్తిగా తొలిగించలేము. ఈ భయాలను సొమ్ము చేసుకునే వాళ్లు తయారయ్యారు. గ్రహణం ఎప్పుడు వచ్చినా టివీల్లో జ్యోతిషశాస్త్రవేత్తలమంటూ ఓ బ్యాచ్ దిగుతోంది. వారితో గంటల తరబడి చర్చలు. ఆధునిక సమాజం అని చెప్పుకుంటున్న మనలోనే ఎన్నో చీలికలు, పేలికలు.  

 నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఈ గ్రహణాల గురించి భయపడనక్కర్లేదనీ, అవి గ్రహాల భ్రమణంలో వచ్చే సుందర దృశ్యాలని ఇంట్లో వాళ్లకు చెబితే నన్ను అదోలా చూసేవాళ్లు. ప్రాక్టికల్ గా వివరిద్దామని ఇంట్లో పిల్లల్లో ఒకరిని సూర్యునిగా, మరొకరిని చంద్రుడిగాఇంకొకరిని భూమిగా నిలబెట్టేవాడ్ని. భూమి తన చుట్టూ తిరుగుతుంటే ఉపగ్రహమైన చంద్రుడేమో భూమి చుట్టూ తన ఫేస్ మాత్రమే చూపిస్తూ తిరుగుతుంటాడని చెప్తూ, పౌర్ణమి నాడు చంద్ర గ్రహణం ఎలా వస్తుందో వివరించే వాడ్ని. కానీ, ఈ సైన్స్ గట్రా ఇంట్లో వాళ్ల బ్రెయిన్లకు ఎక్కేవి కాదు. గ్రహణం రోజున ప్రారంభ స్నానం, విడుపు స్నానం చేయించేవారు. ఈ రెంటి మధ్యలో పచ్చి మంచినీళ్లు కూడా త్రాగనిచ్చే వారు కారు. గ్రహణం మనం పుట్టిన నక్షత్రంలో వస్తే ఇక చూడండీ, బోలెడు ఆంక్షలు. జపం చేయమంటారు. గ్రహణం చూడకూడదనే వారు. ఒక వేళ మనం ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తే, పొరపాటున ఏదైనా ఇబ్బంది తలెత్తితే, చూశావా గ్రహణం చూడటం వల్లనే ఇలా జరిగిందంటూ స్టేట్మెంట్లు ఇచ్చేవారు. నా బోటి యువ శాస్త్ర వేత్తలను (పదం మరీ ఓవర్ గా ఉంటే మీరు మార్చుకోవచ్చు) ఎదగనీయకుండా చేసే వారు.  ఒకటి మాత్రం నిజం, చదువుకునే రోజుల్లోనే `విశ్వదర్శనం వంటి సైన్స్ పుస్తకాలు కొని చదవడం మూలాన గ్రహణాల గురించి లెక్చర్స్ ఇస్తుండేవాడ్ని.

 

చంద్రుడిపై కాలు మోపిన క్షణం:

 

అది 1969 జూలై 16  చంద్రుడి మీద మానవుడు కాలు మోపిన రోజు అది.   అపోలో -11 అనే రాకెట్ నుంచి విడివడిన లూనార్ మాడ్యూలర్ చంద్రుడి ఉపరితలం తాకి అందులో నుంచి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, లూనార్ మాడ్యూల్ పైలెట్ గా ఉన్న బజ్ ఆల్డ్రిన్ చంద్రుడి మీద కాలు మోపిన రోజు. ఈ ప్రాజెక్ట్ లోనే ఉన్న మూడవ వ్యక్తి  మైకిల్ కొలిన్స్ లూనార్ ఆర్బిటర్ లో ఉన్నాడని చెప్పేవారు. 



ప్రపంచ మీడియా ఈ వార్తను బాగా హైలెట్ చేసింది. అప్పుడు నేను హైస్కూల్ విద్యార్థినే. కానీ నాకు బాగా గుర్తు ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు తాటికాయంత అక్షరాలతో హెడ్డింగ్ లు పెట్టి చాలా గొప్పగా ఈ అద్భుత ఘట్టం గురించి వ్రాశారు. కొన్ని హెడ్డింగ్ లు నాకెంతో నచ్చాయి. ఆంధ్రప్రభలో చేరిన తర్వాత దీని గురించి ప్రస్తావిస్తే పురాణపండ రంగనాథ్ గారు  ఓ అద్భుత హెడింగ్ పెట్టారని చెప్పారు. ఆ హెడ్డింగ్ ఏమిటో నాకు ఇప్పుడు ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. ఎవరైనా గుర్తు చేస్తే సంతోషిస్తాను. 

ఈ మధ్యనే గూగుల్ లో సెర్చ్ చేస్తుంటే కొన్నిఇంగ్లీష్ పేపర్లలోని హెడ్ లైన్స్ కనిపించాయి వాటిని ఇక్కడ ఇస్తున్నాను.  

Man Walks on The Moon (డైలీ మిర్రర్ పత్రికలో)

LAND ON THE MOON – Dream of ages comes true (THE HINDU)

MEN WALK ON THE MOON (NEWYARKTIMES)

తెలుగు పేపర్లు నాకు గుర్తునంత వరకు ఆ సమయంలో ఉన్నవాటిలో పాపులర్ అయిన పత్రికలు- ఆంధ్రప్రత్రిక, ఆంధ్రప్రభ. ఇదంతా మీకోసం వ్రాస్తుంటే నాకు ఓ చక్కటి పాటలోని ఒక వాక్యం హెడ్ లైన్ గా పెడితే బాగుంటుంది కదా అనిపిస్తున్నది. అది -

`అందని జాబిలి , అందెను నేడు 

సినిమాల్లో చాలానే చంద మామ పాటలు ఉన్నాయని చెప్పాను కదా. వాటిలో ఇప్పటికీ నాకు బాగా గుర్తిండి పోయిన పాత పాటల్లో కొన్ని..

`రావోయి చందమామ (పాతాళ భైరవి) ఈ పాట ఎప్పుడు వచ్చినా మొదట్లో చాలా సంతోషమేసినా సైన్స్ బాగా వంటబట్టాక మాత్రం నవ్వుకునే వాడ్ని.  ఎందుకంటారా, నిజంగా చందమామ వచ్చేస్తే, ఇంకేమైనా ఉందాభూమికి పెద్ద గండమే. భూమి గతి తప్పుతుంది. అల్లకల్లోలం. ప్రళయమే మరి. ఇక `వింత గాధ చెప్పేది ఎవరటఅయితే ప్రేమికులు మాత్రం ఎక్కడో దూరాన ఉన్న చందమామ రావాలని, అతగాడితో కబుర్లు చెప్పాలని నేటికీ అనుకుంటూనే ఉన్నారు. 

 ఆలాంటి పాట మరొకటి..

`ఒక సారి ఆగుమా, 

ఓ చందమామ, నా చందమామ..

(అమ్మో.. ఆగితే ఇంకేమైనా ఉందా, ప్రేయసీ ప్రియులారా ఇలాంటి పాటలు పాడకండి, చందమామ  ఎవరో అదే పనిగా నన్ను పిలుస్తున్నాడని అనుకుంటూ నిజంగా భూమి వైపు ప్రయాణం కట్టేస్తే..)

ఇక్కడో చిన్న విషయం చెప్పాలి. తెలుగు రైమ్స్ లో  సైన్స్ పరంమైన రీజనింగ్, లాజిక్ లు ఉండటం లేదని, పైగా వాయిలెన్స్ ఉంటుందని మా అమ్మాయి వాదనకు దిగింది. అందుకే తన కొడుక్కి తెలుగు రైమ్స్ నేర్పించనని అంది. మొదట్లో నేను అడ్డంగా వాదించినా ఆ తర్వాత దాని వాదనలోనే పస ఉందని అనిపించింది. అదే ఇంగ్లీష్ రైమ్స్ తయారు చేసే వారు, రచయితల్లో మార్పు వస్తున్నది. గతంలోని రైమ్స్ ని తిరగరాస్తున్నారు. కోకోమిలన్ వంటి సంస్థలు ఈ వాస్తవకతకు పెద్దపీట వేస్తున్నట్లు అనిపిస్తోంది. 

చిట్టి చిలకమ్మా

అమ్మ కొట్టిందా (ఈ రైమ్ లో కొట్టడం వాయిలెన్స్ కి సింబల్ )

పడమటింటి కాపురంబు చేయన్నది.

మొగుడి చేత మొట్టి కాయలు తింటనన్నది. (డొమెస్టిక్ వాయిలెన్స్)

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. సరే, మనం చందమామ గురించి కదా చెప్పుకుంటున్నది...

ఆమె మోము చంద్రబింబం:

 

చాలా పాటల్లో చంద్రుడు చాలా అందగాడనీ, కోవా బిళ్లలా నునుపుగా ఉంటాడని వ్రాశారు. కానీ సైన్స్ పుస్తకాలు చదివాక మరో సారి నవ్వుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే జాబిల్లి దూరం నుంచి చూస్తేనే నునుపుగా, అందంగా ఉంటాడు. కానీ దగ్గరకు వెళితే అన్నీ గుంటలే. పర్వతాలు, లోయలు, ధూళి.  చంద్రుడి మీద మానవుడు కాలుపెట్టాక చంద్రుడి అసలు అందం బయటపడింది. దీంతో కొంత మంది కార్టునిస్ట్ లు వేసిన వ్యంగ్య కార్టూన్లలో ఒకటి మా అమ్మాయి చందమామలా ఉంటుందండి అంటూ పెళ్ళి చూపులప్పుడు పిల్ల తండ్ర అంటే నిజమే అని పెళ్ళి కొడుకు మురిసిపోతుంటాడు. తీరా కర్టెన్ వెనక నుంచి పెళ్ళి కూతురు ముందుకు వస్తే, ఏమందీ... పిల్ల ముఖం నిండా మొటిమల మచ్చలు, గుంటలు. 

 సరే, అసలు చందమామ సంగతేమో కానీ చందమామ పుస్తకం మాత్రం చిన్నప్పుడు మా మీద చాలానే ప్రభావం చూపిందని చెప్పాను కదా



ఆకాశంలోని చందమామ కంటే ఈ చందమామే మాకు ముద్దు. చందమామ కథలు చదివి చాలా మంది, కథలు వ్రాయాలనుకున్నారు. అలాంటి వారిలో కొందరు నిజంగానే కథలు వ్రాసేశారు. వాటిలో కొన్ని చందమామ మేగజైన్ లోనే అచ్చవడం నేను ఎరుగుదును. చందమామతో పాటుగా  బుజ్జాయి, బాలమిత్ర వంటి పిల్లల కథల పుస్తకాలు మంచి ఆదరణ పొందాయి. చివరగా మరో విషయం  `చందమామ మేగజైన్ప్రేమికులు ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. వారంతా సోషల్ మీడియాలో ఒక గ్రూప్  ఏర్పాటు చేసుకుని ఆనాటి కథలను షేర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చందమామ పాత పుస్తకాలను డిజిటలైజ్ చేశారు కూడా. 

చందమామ చుట్టూ తిరిగిన అనేక సంఘటనలు మీతో పంచుకున్నాను కదా.

(మళ్ళీ కలుద్దాం)

21, అక్టోబర్ 2024, సోమవారం

30వ భాగం : చిటపటలు

 

`మతాబులు తీసుకురండర్రా  అమ్మ పిలుపు.  

నేను అక్కా పరుగున వెళ్ళి ఒక చేటలో ఉన్న మతాబులు అంతే పరుగున తీసుకువచ్చి అమ్మకు ఇచ్చాము. 

ఒక వారం ముందే  మేము పిల్లలం నాన్నతో పాటుగా దీపావళి సామన్లు అమ్మే షాపుకు వెళ్ళాము. నేనేమో అప్పుడు చాలా చిన్న పిల్లాడ్ని కదా.  కాకరపువ్వొత్తి  కాలుస్తుంటే కూడా అమ్మ పదేపదే `జాగ్రత్తరా’ అంటుండేది. `ఒరే, రాజుమతాబులు, కాకరపువ్వొత్తులను కూడా జాగ్రత్తగానే కాల్చాల్రా. రవ్వలు వంటి మీద పడకుండా చూసుకోవాలేం  ఎంతో శాంతంగా చెబుతుండేది. ఆమె అలా అంటున్నప్పుడు మాకేం కోపం వచ్చేది కాదు. `అలాగే అమ్మాంటూ అమ్మ బుగ్గమీద ముద్దు ఇచ్చేసి టపాసులు కాల్చే పనిలో పడేవాళ్లం .టపాసులు కాల్చడానికి ముందు అమ్మ లక్ష్మీదేవి పటం దగ్గర్లో మమ్మల్ని కూర్చోబెట్టి తానేమో మంత్రాలు చదివేది. లక్ష్మీదేవి పటం ప్రక్కనే ఈ టపాసులున్న చేటలు, మరో ప్రక్కనేమో అమ్మ తాజాగా చేసిన రవ్వు లడ్డూల్లాంటివి ఉండేవి. ఇంకో ప్రక్కనేమో ప్రమిదల్లో దీపాలు వెలుగుతుండేవి. పూజయ్యాక అమ్మా , అక్కా ప్రమిదలను జాగ్రత్తగా పట్టుకుని ఇంటి బయట బారుగా పెట్టేవారు. అసలు ఆ దృశ్యం ఎంత బాగుండేదో. ప్రతి ఇంటి ముందు  వెలుగుతున్న దీపాలు బారులు తీరి ఉండేవి. ఆ దీపాల కాంతిలో అమావాస్య రోజునే పౌర్ణమి వచ్చిందా! అన్నట్లు ఉండేది. కాస్త పెద్దయ్యాక తెలిసిందేమిటంటే, దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థమట. మరి ఈ టపాయకాయలు హడావుడంతా ఏమిటీ? అదంతా తరువాత వచ్చి చేరిందట. ఏమో కానీ, నాకైతే దీపాల వరుస కంటే టపాసులు కాల్చడం మీద, అమ్మ చేసిన మిఠాయిల మీదనే  ధ్యాసంతానూ.. 

 అసలు మా ఇంట్లో నాన్నగారు తప్ప ధైర్యశాలి మరొకరు లేరని నాకప్పట్లో బాగా తెలిసింది. ఎందుకంటే, నాన్నగారు లక్ష్మీ అవుట్లు, తారా జువ్వలు నదురు బెదురు లేకుండా కాల్చేసేవారు. అవుట్ల అయితే వొత్తికి నిప్పు అంటించగానే ఆమడ దూరం పరిగెత్తుకుంటా వెనక్కి రావడమన్నది చాలా మంది చేసేదే. కానీ మా  నాన్న ధైర్య శాలి కదా. ఆయినేమో అగ్గిపుల్ల గీసి అవుట్ పైన ఉండే వత్తిని వెలిగించి, అది చుర్రున కాలుతుంటే అక్కడే ఉండి చూస్తూ ఇక క్షణంలోనో, అరక్షణంలోనో పేలుతుందనగా కేవలంనాలుగడుగులు వెనక్కి వేసేవారు. అలాంటప్పుడే సినిమా హీరోలా అనిపించే వారు. హీరో కృష్ణ ఇలాగే  ఫైట్ సీన్లలో డూప్ లేకుండా నటించేవారని ఆ తర్వాత మా ఫ్రెండొకడు చెబితే ఆశ్చర్యపోయాను. అందుకే డాషింగ్  అండ్ డేరింగ్ హీరో అనేవాళ్లట  ఆయన్ని.  సరే మా నాన్న లోని హీరోయిజం , డేరింగ్ గురించి నాకైతే బోలుడు ఆశ్చర్యం కలిగించినా మా అమ్మ మాత్రం తెగ భయపడుతుండేది.  అలా ఆమె భయపడటానికి బలమైన కారణం లేకపోలేదు.

 

నాన్నకు తృటిలో తప్పిన ప్రమాదం:

 

నాన్నగారు  మంగళగిరి లో పనిచేస్తున్నప్పుడు  లక్ష్మీ నరసింహస్వామి వార్ల కల్యాణ మహోత్సవాలప్పుడు పెద్ద రథం కదిలేది. నాన్నగారు  గుడులమీద ఈవో కావడంతో బదలీలపై మంగళగిరి చేరారు. అప్పుడే అమ్మలో భయం కూడా ప్రవేశించింది. ఇక్కడ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే స్వామి వారి కల్యాణమహోత్సవాలు మొదలయ్యాయి. రథం లాగడానికి అప్పట్లో పెద్దపెద్ద మోపులు వాడేవారు. ఆ మోపులు ఇరు వైపులా భక్తులు లాగుతుంటే రథం కదులుతుండేది. ఒక్కోసారి భక్తుల ఉత్సాహం ఎక్కువైనప్పుడు దాని పెరిగేది. అప్పుడే ప్రమాదాలు చోటుచేసుకునేవి. వేగం తగ్గించడానికి ఓ చిట్కా ఉండేది. అదేమంటే, చప్టాలను (చెక్కతో చేసిన ఓ పరికరం) రథం వేగంగా వెళుతున్నప్పుడు చక్రాల క్రింద ఓ పద్ధతిలో పెడుతుంటే అవేమో బ్రేకుల్లా పనిచేసి రథం వేగం తగ్గేది. నాన్నకు ధైర్యం ఎక్కువని చెప్పాను కదా.పైగా ఆయన ఈవో ఆయే. రథ చక్రాల ముందే ఈయన ఆర్డర్లు ఇస్తూ నడిచేవారు. ఎవ్వరూ అడ్డుచెప్పే వారే లేరు.  ఓ సారి ఏమైందంటే.. అలా నడుస్తుంటే నాన్న గారి పంచె రథచక్రం క్రిందకి వెళ్ళడంతో  లాగడానికి ప్రయత్నిసుండగా అదుపుతప్పి క్రింద పడ్డారు. రథచక్రం ఆయన పక్కగా వెళ్లిపోయిందట.. గండం గడిచింది. ఈ విషయం ప్యూన్ వచ్చి అమ్మకు చెప్పడంతో అప్పటి నుంచి రథయాత్ర అనగానే అమ్మకు బోలెడు భయం ఆవహించేది.  

 

కట్టె మిఠాయి:

 

 తిరునాళ్లంటే మాటలా. అందునా మంగళగిరి తిరునాళ్లంటే ఆ ఊరి చుట్టుప్రక్కల ఒకటే సందడి. కల్యాణోత్సవం అయ్యాక జరిగే రథోత్సవం నాడు ఆ సందడి చూసితీరాల్సిందే.  అలాంటి సందడి నుంచి పుట్టినదే  ఈ పాట.. 

`మంగళగిరి తిరనాళ్లకు పోతే ,

జనం వత్తిడికి సతమతమవుతూ...

తిరునాళ్లంటే మైకుల్లో బోలెడు పాటలు, పద్యాలు...ఇంకా చాలా కాలక్షేపాలు. వీధుల్లో మిఠాయి పరిచిన మంచాలు... అవునండి, మంచాల మీదనే తాటి చాప పరిచి రకరకాల మిఠాయిలు అమ్మే వాళ్లు. నాకైతే కట్టె మిఠాయి ఇష్టం. `మంచం మీద అమ్మే మిఠాయి వద్దులేరా, ఈగలు ముసురుతున్నాయి, బండి రాగానే కొంటాను కదా  అని అమ్మ అంటే నేను మారాము చేసేవాడ్ని. దీంతో ఇష్టం లేకపోయినా ఓ పది పైసలు పెట్టి కట్టె మిఠాయి కొని నా చేతుల్లో పెట్టేది.

 

చెక్కభజనలు:

 

తిరునాళ్లప్పుడు రథం దగ్గరే ఉన్న పెద్ద మైదానంలో  ఒక రోజు కోలాటం, మరో రోజు చెక్కభజనలు ఇలాంటి జానపద కళారూపాలను కళాకారులు ప్రదర్శించే వారు. ఇవన్నీ మా ఇంటికి ముందున్న మైదానంలోనే జరగడంతో నాకు ఇప్పటికీ బాగానే గుర్తున్నాయి. చెక్కభజన నన్నెంతో ఆకర్షించింది. ఇంట్లో ఉన్న రెండు చెక్కలు తీసుకుని నేనూ వారిని అనుసరించే వాడిని. చెక్కభజన కళాకారులు ఒక వలయంలా నిలబడి చేతుల్లో చెక్కలు పట్టుకుని భలే నేర్పుగా భజన చేసేవారు. ఒక్కో సారి చక్కటి కథను కూడా భజన రూపంలో పాడుతూ, దానికి తగ్గట్టుగా చెక్కలు వాయిస్తూ వలయాకారంగా తిరుగుతుండే వారు. తిరునాళ్ల హడావుడి అయ్యాక నేనూ మా ఫ్రెండ్స్ తో జోడుకట్టి చెక్కభజన ఓ ఆటలా ఆడుకునే వాడిని. ఎందుకో తెలియదు కానీ చెక్కభజన ఇప్పటికీ చూస్తుంటే నాకెంతో ఆనందం కలుగుతుంది. కానీ గతంలో మాదిరిగా ఇలాంటి కళారూపాలకు ఇప్పుడు ఆదరణ తగ్గిపోయింది.

అలాగే  తిరునాళ్లప్పుడు హరికథలు, బుర్రకథలు, నాటక ప్రదర్శకనలు ఉండేవి. ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో నిర్వహించడమన్నది  నాన్నగారి డ్యూటీల్లో ఒకటి. ఈవో కావడంతో  కళాకారుల బృంద నాయకులు ముందుగానే మా ఇంటికి వచ్చి నాన్నతో మాట్లాడి ప్రోగ్రామ్ సెట్ చేసుకుని వెళ్లేవారు. నాకు ఓ విషయం ఇప్పటికీ గుర్తుంది. హరికథ కళారుల్లో కొంత మంది ఒక రోజు ముందే మా ఇంటికి వచ్చే వారు. మా ఇంట్లోనే బస. హరికథ చెప్పడానికిబయలుదేరే ముందు వారి ఆహార్యం, అలాగే కాళ్లకు కట్టుకునే గజ్జలు వంటివి చూసి నాకూ హరికథ చెప్పాలని అనిపించేది. హరికథైతేచెప్పలేదు, కానీ హరికథ చెప్పే వారి వెనక కూర్చుని శృతి పెట్టె నొక్కేవాణ్ణి. అయితే అదేదో ఆట వస్తువనుకునే వాణ్ణే కాని ఇది శృతి పెట్టె అని నాకు తెలియదు. ఓ సారి కోటా సచ్చిదానంద శాస్త్రి గారి హరికథ పెట్టారు. అప్పుడు కూడా నేను కాసేపు శృతి పెట్టె పట్టుకుని నొక్కాను. కాసేపే అని ఎందుకు అంటున్నానంటే నేను చాలా బలహీనంగా ఉండే వాడ్ని. ఓ ఐదు నిమిషాలు అవగానే చేతులు నొప్పుట్టి ఆపేసేవాణ్ణి. దీంతో హరికథ చెప్పే వారికి కోపం వచ్చేది. దీంతో నా స్థానంలో మరొకరిని నియమించే వారు. అప్పుడు నాకు బోలెడు కోపం వచ్చేది.

 

నేను హర్ట్:

 

ఇలాంటి కోపమే దీపావళికి ఒకరి ఇంటికివెళ్ళినప్పుడు చాలా బాగా వచ్చేసింది. అయితేఇక్కడ నా బక్కతనం, బలహీనతలు కారణాలు కావు. మేము   వెళ్ళిన ఇంట్లోని వారి మనస్తత్వాలు, వారి చిటపటలూను. మనస్తత్వ శాస్త్రం గురించి నాకప్పుడు తెలియదనుకోండి. కాకపోతే కోపం బాగా వచ్చేసేది. హర్ట్ అయ్యేవాడ్ని. నేనే కాదు మా అక్క కూడా. 

  అప్పుడు నేను నాలుగో తరగతో, ఐదో తరగతో చదువుతున్నాను. ఇందాక చెప్పిన తిరనాళ్ల తరువాత నాకు బాగా ఇష్టమైన పండుగ దీపావళి అదేదో మన ఇంట్లోనే జరుపుకుంటే నాకు బోలెడు సంతోషం. కానీ దగ్గరి బంధువులు పిలవడంతో గుంటూరు నుంచి ప్రయాణం కట్టి మా బంధువులున్న ఊరు చేరాము. పండుగల తలంట్లు, నరకాసుర వధ , టపాకాయలు కాల్చడం, భోజనాలు ..ఇలా అన్నింటిలోనూ ఏదో వెలితి కనిపించింది. చాలా పెద్దాయక అదేమిటని ఆలోచిస్తే అర్థమైంది. అదే .. స్వేచ్ఛ. 

 నిజమే, స్వేచ్ఛ లేని చోట పండగ సంతోషం ఉండదు. కొన్ని ఇళ్లు అంతే. ఆ ఇంట్లోకి అడుగుపెట్టడానికి ముందే చెప్పులు విప్పేసినట్లుగానే మనం స్వేచ్ఛనూ వదిలేయాల్సిందే. ఆ ఇంట్లో లోపలకు వెళ్ళగానే మనమూ వారిలా మారిపోవాల్సిందే. లేకపోతే `నరక యాతన తప్పదు. అలాంటి  ఒకటి రెండు సంఘటనలు ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. దీనికంటే ముందు హిందీ గురించి కాసేపు...

 

 హిందీ  దీపావళి

 

  హిందీ పరీక్ష అంటే నా మటుకు నాకు పెద్ద చిరాకు. ముఖం చిటపటలాడుతూనే ఉంటుంది. కానీ ఏం చేస్తాం. టెన్త్ వరకు హిందీ భాష నేర్చుకోవాల్సిందే. నేను చదువుకుంటున్నప్పుడు విద్యా విధానం ఇలాగే ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. 70వ దశకం తొలినాళ్లలో  నేను హైస్కూల్ లో చదువు వెలగబెడుతున్నాను. ప్రతి పరీక్షకు మూడు లాంగ్వేజ్ పేపర్స్ ఉండేవి. అందులో రెండు నాకు నచ్చనివే. అందులో ఒకటి ఇంగ్లీష్ అయితే, మరొకటి హిందీ. అలా అని తెలుగులో మనమేమీ పండితులం కాదనుకోండి. హిందీలో దీపావళి వ్యాసం బట్టీ కొట్టాను. అది కూడా ఎందుకంటే,   దీపావళి పండుగ అంటే ఇష్టం కాబట్టి. `దీవాళీ ప్రముఖ చోహార్ హై...’ అంటూ బట్టీ కొట్టి నేను పరీక్షకు వెళితే, వాడేమో ఆవు(గాయ్్యాసం రాయమన్నాడు.  ఏం చేయాలో అర్థం కాలేదు. దీవాళీ అని ఉన్న చోటల్లా గాయ్ అని పెట్టి వ్సాసం రాసిపారేశాను. అదేమిటో నేను హిందీలో పాసయ్యాను. `పాపం, దిద్దే వాడిని నువ్వు ఫూల్ ని చేశావురా.. అని మా ఫ్రెండ్ గాడు ఏదో అపరాధం చేశావురా అన్నట్లు మాట్లాడేవాడుఅదేమో గానీ, దీవాళీ వ్యాసం వల్ల నేను హిందీ గట్టెక్కాను. అది కూడా టెన్త్ పబ్లిక్ పరీక్షలో. అందుకే ఇప్పటికీ దీపావళి రోజు ఈ సంఘటన గుర్తుకువస్తుంది. నా పేపర్ దిద్దిన హిందీ పండిట్ గారికి థాంక్స్ చెప్పుకోవడం ఆనవాయితీ అయింది. పేపర్లు దిద్దే వాళ్ల కష్టాలు వారివి. టక టకా, చెక చెకా దిద్ది పారేయాలి. మొదటి లైన్ చూసి, చివరి లైన్ చూసి ఐదు మార్కుల వ్యాసానికి ఓ మూడో నాలుగో మార్కులు వేస్తుంటారనీ, నేను పెద్దయ్యాక తెలుసుకున్న నిజం. పేపర్ దిద్దే వాళ్లకు ఏదో మనసు బాగోలేకపోతే ఇలాంటివి చోటుచేసుకుంటాయి. అయితే ఇంటావడి మీద కోపం ఒక్కోసారి పేపర్ వ్రాసినవాడిమీద కూడా పడుతుంటుందని కూడా తెలిసింది.అప్పుడు మాత్రం మనకు దక్కేది సున్నానే.  సరే, నేను ఆంధ్రప్రభలో పనిచేస్తున్న రోజుల్లో  నాకంటే  వయసులో పెద్దయిన ఓ సబ్ ఎడిటర్  వ్రాసిన వార్త కంపోజింగ్ వెళ్ళింది. అక్కడి నుంచి ఫ్రూప్ రీడర్ సెక్షన్ కి వచ్చింది. అది చదివిన ఫ్రూప్ రీడర్ మొదట్లో ఆశ్చర్యపోయి, ఆ తర్వాత చిటపటలాడి ఈ విషయం  న్యూస్ ఎడిటర్ కి చెప్పేశాడు. న్యూస్ ఎడిటర్ మహాశయుడు  వెంటనే సదరు సబ్ ఎడిటర్ గారిని పిలిచి `ఏంటదీ!! అంటూ ఆశ్చర్యాంగా అడిగారు. ఆయన గారి చేతిలోని ఫ్రూప్ ఫ్రింట్ కాగితం ముక్క (దీన్ని గ్యాలీ అని కూడా అంటారు)  తీసుకుని చదివి ... సారీ అన్నారు ఆ సబ్ ఎడిటర్. ఇంతకీ ఆ వార్తరెండవ పేరాలో ఆయన గారు ఇలా వ్రాశారు. 

• సిమెంట్ బస్తాలు  30
• ఇసుక  నాలుగు బండ్లు.
• ఇటుకలు  ఐదు బండ్లు.
• నాపరాతి బండలు, మేస్తీ ఖర్చులు...
ఇలా ఏవేవో వ్రాశారు. 

ఆయన చాలా మేథావి. ఏ అంశం మీద వార్త అయినా చిటికలో వ్రాసిపారేస్తారు. అయితే ఈ వార్త రాయడానికి ముందు ప్యాడ్ లో నుంచి ఓ కాగితం చించి దాని మీద తాను కట్టుకుంటున్న ఇంటి నిర్మాణం అవసరాలు వ్రాసుకున్నారు. ఇంతలో వార్త వ్రాయాల్సి వచ్చింది. చకచకా వ్రాసేసి, ఆ కాగితాల బొత్తినిపిన్ చేసేటప్పుడు ఇదిగో ఈ కాగితం కూడా జత చేశారు. కంపోజింగ్ వాళ్లు అలాగే కంపోజ్ చేసేసి, ప్రూఫ్ రీడింగ్ సెక్షన్ కు పంపారు. `ఇంకా నయం అలాగే పేపర్లో రాలేదు... జాగ్రత్తగా ఉండండి  అంటూ న్యూస్ ఎడిటర్ గారు కోపాన్ని అణుచుకుని  పైకి శాంతం పులుముకుని నవ్వుతూనే చెప్పారు.

 

ఆపండి..కాల్చకండి:

 

  సరే, దీపావళికి ఓ ఇంటికి వెళ్ళామనీ, స్వేచ్ఛలేని దీపావళి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాను కదా..ఆ ఇంటికే వెళదాం పదండి..

మతాబు వెలిగించడానికి రెడీ అవుతుంటే  ఆ ఇంటావడ పరుగు పరుగున వచ్చేసి `ఆపండి ..’ అంటూ అరచినంత పని చేసింది.ఏమైందో అని అంతా హడలి పోయారు. ఆవిడ గారి కంఠం కంచు కంటే ఘనం, మాటమో బండరాయి కంటే కఠినం. ఇంట్లోనే కాదు, ఊర్లోనే ఆమె మాటకు తిరుగులేదటతనకు కావాల్సింది రాబట్టుకునే దాకా మాటలతో యుద్ధం చేస్తూనే ఉంటుంది.  

`ఆపండి.. ‘ ంటూ వస్తూనే , `ఆ మతాబులు ఇక్కడ కాల్చకండి. పొగ ఇంట్లో పడుతుంది. పైగా పూలు ఇంటి బండల మీద పడితే బండలు పాడవుతాయి తెలుసా. బయటకు వెళ్ళి కాల్చుకోండి - 

మా అమ్మ జోక్యం చేసుకుంటూ, `ఏదోలే తెలియదులే వదినా,  ఒరేయ్ బయటకు వెళ్ళి కాల్చుకోండి’ - అంటూ మేమే తప్పు చేస్తున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. దీంతో..

నేనూ అక్కా హర్ట్. 

పాము బిళ్లలు కాల్చడమంటే నాకెంతో సరదా. అందుకనే  రెండు డబ్బీల పాము బిళ్లలుతెచ్చుకున్నాను. కానీ, ఆ పాము బిళ్లలనువారింట కాల్చుకునే అవకాశం రాలేదు. మళ్ళీ ఆవిడగారే పరిగెత్తుంకుంటూ వచ్చే  అడ్డు తగిలింది. రోడ్డు చివర బండల మీద పెట్టి కాల్చుకోమంది. `మన ఇంట్లో దీపావళి అయితే వీధి చివరకు వెళ్ళి కాల్చుకోవాలా.. అంటూ మా అక్క గొణిగింది.

`ఏమిటీ..ఏమిటో అంటున్నావ్ పిల్లా...అంటూ తీవ్రమైన చూపు చూసింది.  వెంటనే మళ్ళీ అమ్మే ఆమెను శాంతింప చేస్తూ, మాకు వార్నింగ్ ఇచ్చింది. 

నేనూ మా అక్కా హర్ట్.

కనీసం కాకర పువ్వొత్తిని అయినా ఇంట్లో కాలుద్దామని పెట్టె తెచ్చుకుంటే, మళ్ళ్ అదే కంఠం. ఇంటి ముందు అరుగు మీద కూర్చుని కాల్చాలన్న రూల్ వచ్చి పడింది. దీంతో 

నేనూ మా అక్కా హర్ట్. 

`మతాబులకు ఓ పొడవైన కర్ర పుల్ల గుచ్చి ఇంటి లోపల మనం నిలుచుని ఇంటి పైకి కర్ర పుల్ల పొడుచుకు వచ్చేలా ఉండే మతాబు చేత్తో పట్టుకుంటేఇంట్లో ఉండి కాల్చినట్లేనని మా అక్క గొణుగుడికి కుండబద్దలు కొట్టినట్లు సమాధనం చెప్పింది ఆ  `బండరాయి.  ఈ పండుగ అయ్యాక మేము గుంటూరు వెళ్ళిన తర్వాత మా అక్క ఆవిడ గారికి బండరాయి అనే పేరు ఖాయం చేసింది. 

సరే,  మేము పిల్లలం కదా. ఇల్లు ఎలా ఉంచుకోవాలో , అందుకు అనుసరించాల్సిన రూల్స్ ఏమిటో మాకేం తెలుసు చెప్పండి. కదిలేతే తప్పు, మెదిలితే తప్పు. పడక కుర్చీలో కూర్చోగానే మరో అరుపు.. `ఇది తాతయ్య కూర్చునే కుర్చీ మీరు కూర్చోకూడదు

హర్ట్ మీద హర్ట్. కోపం మీద పైకోపం. 

సోపా లో కూర్చుని కాకరపువ్వొత్తుల ప్యాకెట్ తెరుస్తుంటే మళ్ళీ అదే సీను. కాకర పువ్వొత్తి కడ్డీ సోపాకి గుచ్చుకుని అది కాస్తా పాడవుతుందట, పైగా ఆ ఊర్లో దాన్ని రిపేర్ చేసే వాళ్ళు లేరు తెలుసా అంటూ తన స్టేట్ మెంట్ కి బలమైన రీజనింగ్ జోడించి మరీ అరుస్తుంది ..

నేనూ మా అక్కా హర్ట్. 

ఇలా ఓ పది సార్లు హర్ట్ మీద హర్ట్ అవుతూ, ఆవిడగారి మాటలే అవుట్లులా పేలుతుంటే, ఆవిడ చూపులే  చిటపటలు సృష్టిస్తుంటే ఇంక దీపావళి టపాసులెందుకు?? ఇలాంటి వాళ్లు దీపావళికి రారమ్మంటూ పిలవడాలెందుకో మా చిట్టి బుర్రలకు అర్థం కాలేదు.  అయితే, తిరుగు ప్రయాణంలో మా అక్క ఇదే  అడిగితే, అమ్మ శాంతంగా, `అందరి ఇళ్లు ఒకలా ఉండవురా.. మనమే సర్దుకు పోవాలి  అని అంటూ సహనం గురించి క్లాస్ పీకింది. ఇలా  బోలెడన్ని హర్టులను మూట గట్టుకుని  మేము గుంటూరు చేరాము. 

కానీ మా ఇంట్లో అలా కాదు. ముందే చెప్పాను కదా, స్వేచ్ఛగా దీపావళి చేసుకునే వాళ్లం. కానీ నాన్న పండగకు ముందే ఆంక్షలు పెట్టే వారు. అయితే ఇవన్నీ  ఆ ఇంటావిడ లాగా ఉండవు లేండి. ఇవి మా మేలు కోరేవిగానే ఉండేవి . అంటే దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే ఆంక్షలే ఇవన్నీనూ.  వాటిలో కొన్ని ..

టపాసులు బజారు నుంచి తీసుకు రాగానే వాటిని పోయ్యికి దగ్గర్లో ఉంచకూడదు. 
కర్మం చాలకపోతే కాకర పువ్వొత్తి కూడా పేలుతుంది. జాగ్రత్త.
తేలిక పాటి టపాసులే కదా అని మరీ మొహం దగ్గరగా ఉంచుకుని కాల్చకూడదు.  
చిచ్చు బుడ్డి వెలగలేదని ముఖం దానికి దగ్గరగా పెట్టి చూడకూడదు. 
తాడు, కాకరపువ్వొత్తి వంటివి కాల్చేటప్పుడు  గిరగిరా తిప్పేటప్పుడు  ప్రక్కవాళ్లను చూసుకోవాలి. 
చెప్పులు లేని కాళ్లతో టపాసులు కాల్చడానికి వెళ్ళకూడదు. 
తారాజువ్వలు పిల్లలు కాల్చడం మంచిది కాదు. పెద్ద వాళ్లు కూడా నేర్పుగా కాల్చాలి. 
అతి ముఖ్యమైనది  పిల్లా పెద్దా టపాసులు కాల్చడానికి సిద్ధమయ్యే ముందే ఇంట్లో ఓ చోటేమో బక్కెట్లో ఇసుక, మరో చోటేమో నీళ్ల బకెట్ పెట్టుకోవాలి. అగ్ని ప్రమాదం జరిగితే మంటలను వెంటనే ఆర్పడానికి.
కాలిన గాయాలకు ప్రాధమిక చికిత్సకు పనికొచ్చే మందుల పెట్టె సిద్ధం చేసుకోవాలి. 

ఇలాంటివి మరికొన్ని చెప్పేవారు. ఇలా చెబుతుంటే మాత్రం నేనూ మా అక్కా హర్ట్ అయ్యే వాళ్లం కాదు. మన మంచికే కదా అనుకుని వాటన్నింటినీ పాటించేవాళ్లం. 

చాలా పెద్దయ్యాక ఇవన్నీ ఆలోచిస్తుంటే, రూల్స్ , షరతులు పిల్లలను బాగా హర్ట్ చేసేవిగా ఉండకూడదని నాకనిపించింది. పిల్లలేమిటిలేండి, పెద్దలూ ఒక్కో సారి `బండరాయి లాంటి వాళ్లు మాటలకు హర్ట్ అవుతూనే ఉంటారు. ఇలాంటి ఇళ్లకు వెళ్లకపోవడమే మంచిది. మరీ ముఖ్యంగా ఆనందంగా పండుగలు చేసుకునేటప్పుడు. ఈ ఆనందం ఆవిరైతే ఇక పండుగ సరదా ఏముంటుంది చెప్పండి? `ఈ రోజుల్లోనూ బండరాయి లాంటి వాళ్లు ఉంటార్రా అంటూ ఈ మధ్యనే  ఫ్రెండ్ నాతో అన్నాడు. నిజమే అనిపించింది.

మా పల్లెటూరు (అడవిరావులపాడు)లో బాగా చిన్నప్పుడు దీపావళి చాలా సాదాసీదాగా జరిగేది.  ఎండు గడ్డి తీసుకుని వాటిని జడలుగా అల్లేవాళ్లు. వాటికి ఓ అంచున ఆముదంలో తడిపిన గుడ్డ పీలికలను చుట్టే వారు. ఆ తర్వాత మంటలో పెట్టగానే  ఆ గడ్డి తాడుకు మంట అంటుకునేది. అది కాలుతుంటే దాన్ని గిరగిరా తిప్పేవాళ్లు. ఇప్పుడు అలాంటి దృశ్యాలు కరువయ్యాయి. మా నందిగామలో  తారాజువ్వలను రెండు ముఠాల వాళ్లు నేలబారుగా విసురుకునే వారు. ఇదో యుద్ధంలా సాగేది.  మెయిన్ బజారుకు దగ్గర్లోనే మా ఇల్లు ఉండటంతో వాటిలో కొన్ని మా ఇంట్లోకి కూడా వచ్చేవి. ఒక్కోసారి ముఠాల్లోని అటూ ఇటూ కొంత మంది గాయాల పాలయ్యేవారు. పోలీసులు అదుపు చేయాలని చూసినా ఈ యుద్ధం ఆగేది కాదు. అప్పుడప్పుడు ఇళ్లు తగలబడేవి. గడ్డి వాములు మంటల్లో బూడిదయ్యేవి. అందుకే దీపావళి వస్తుందంటే చాలు ఊర్లోని పెద్దలు ఇలాంటి సంఘటనలను గుర్తుచేసుకుని జాగ్రత్తలు పాటించాలని చెప్పేవారు. 

 

నరకాసుర వధ:

 

దీపావళికి ముందు రోజు వచ్చే  నరక చతుర్ధి , దీనికి సంబంధించిన కథ ఆట్టే నాకు చిన్నప్పుడు తెలియదు. ఏదో నారకాసురుణ్ణి కాకరపువ్వొత్తితో కాల్చమనే వారు. నాన్నలైతే బయటకు వెళ్ళి అవుట్లు గట్రా పేల్చేసి ఇంట్లోకి వస్తూనే  `హహ్హాహ్హా.. నరకాసురుడు చచ్చాడు’ - అంటూ నవ్వేసేవారు. మేమూ నరకాసురుణ్ణి అవుట్లతో చంపేస్తామంటే, `మీరు పిల్లల్రా, కాకర పువ్వొత్తులు చాల్లే అనే వారు. మా బామ్మ అయితే మరీనూ, `అవి కూడా ఎందుకురా పిల్లnకు,  చేతులు కాల్చుకుంటారు, ఓ అగ్గి పుల్ల చాలదా ఏమిటీ వాడ్ని (నరకాసురుణ్ణి) చంపడానికీ..’ అంటూ రాగం తీసేది. అప్పుడు నాకనిపించేది, నరకాసురుడు ఎవడో గానీ చివరకు అగ్గి పుల్లకు కూడా చచ్చేటంత బలహీనుడేమోనని.  బోలెండు పెద్దయ్యాక, కాస్తో కుస్తో సిగరెట్లు అలవాటైనప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ లో  `ఒరేయ్ నేను సిగరెట్ కాల్చేసి నరకాసురుణ్ణి చంపుతాన్రోయ్ అంటూ చమత్కరించేవాణ్ణి. 

`ఓ తల్లి తన కొడుకుని చంపితే దీపావళి పండుగ చేసుకోవడమా? అంటూ తర్కంగా మాట్లాడే వాడిని. దీంతో మా ఫ్రెండ్ గాళ్లేమో నా చుట్టూ మూగి ఏమిట్రా ఆ కథ చెప్పు అంటూ అడిగేవారు. అప్పుడు నేనేమో నాటకీయంగా చెప్పేవాడిని. సత్యభామే కదా నరకాసురుణ్ణి చివరకు తన బాణంతో చంపేసింది. ఆమె ఎవరనుకుంటున్నారుపూర్వం వరాహావతారంలో విష్ణువు ఓ అసురుడి నుంచి భూమిని రక్షిస్తాడు. అప్పుడు భూమాత మనసుపడి విష్ణువుని వరిస్తుంది. ఆ భూమాతే ద్వాపర యుగంలో సత్యభామగా అవతరించి, విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని పెళ్లాడుతుంది.  విష్ణువు- భూమాతలకు పుట్టిన వాడే నరకుడు. వాడిలోని చెడు లక్షణాల వల్ల అసురుడయ్యాడు. లోకకంఠకుడు అయ్యాడు. సత్యభామకు పూర్వజ్ఞానం లేకపోవడంతో యుద్ధం చేసి తన కుమారుడే అయిన నరకుడిని సంహరిస్తుంది. `ఇదంతా లోకకల్యాణం కోసమే దేవి’ ంటూ శ్రీకృష్ణుడేమో బాధపడుతున్న సత్యభామను ఓదారుస్తాడు. లోకకంఠకుని పీడ విరగడవడంతో లోకం ఆనంద దీపావళి జరుపుకుంటుంది. అని నేను ఎంతో కష్టపడి చెబితే, ఓ ఫ్రెండు గాడు, ఇదంతా నాకూ తెలుసులేరా.. దీపావళి సినిమా చూసే కదా నువ్వు చెప్పింది‘ ంటూ తేల్చి పారేశాడు. ఏమిటో, కొంత మంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోరూ.. మనలోని టాలెంట్ సబ్జెక్ట్ మీద కాదు, అది ఎంత ఇంటరెస్టింగ్ గా చెప్పామనే దానిలోనే. అర్థం చేసుకోరూ... 

కానీ ఈ టాలెంట్ ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తించింది. అందుకే నాటికలు, రూపకాలు వ్రాయగలిగాను. 

(మళ్ళీ కలుద్దాం)