15, ఫిబ్రవరి 2017, బుధవారం

ఆస్తులు కాజేసేవాళ్ల లక్షణాలు



సంపద పెంచుకోవడం కోసమే అవినీతికి పాల్పడుతుంటారని జయ -శశిళ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్ వ్యాఖ్యానించారు. తప్పుచేశామన్న భావన లేకపోవడమే అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం, ఇరుగు పొరుగువారి ఆస్తులు కాజేయడం ఎక్కువైపోయింది. దోషిగా తేలగానే ఎక్కడలేని అనారోగ్యాలు ముంచుకొస్తాయి. ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చినట్లు పడిపోతారు. దోపిడీ మనస్తత్వంఉన్న వారి లక్షణాలన్నీ ఒకేమోస్తరుగా ఉంటున్నాయని నేరపరిశోధకలు చెబుతున్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ధర్మదాతగానో, మేధావిగానో, గౌరవనీయ వ్యక్తిగానో చెలామణి కావాలని చూస్తుంటారు.
`మంచి' అన్న పెయింట్ పూసుకుని తనకేమీకాదని అనుకుంటారు. ఈ కవచాలన్నీ కరిగిపోతే చివరకు `నాకేం తెలియదు, ఎదో అలా జరిగిపోయింది. ఇంకా ఒత్తిడి తెస్తే, మరణమే శరణ్యం' వంటి మాటలు వల్లిస్తుంటారు. వీళ్లకి న్యాయస్థానాలంటే భయం ఉండదు. న్యాయమూర్తులనే బుట్టలో వేసుకోవాలని చూస్తుంటారు. సామదానబేధదండోపాయాలను అనుసరిస్తుంటారు. మైక్ ల ముందు ధర్మోపన్యాసాలు చేస్తుంటారు. పదవుల కోసం వెంపర్లాడుతుంటారు. రాజకీయాల్లో చేరాలని ఉవ్విళ్లూరుతుంటారు. తన గురించీ, తన కుటుంబసభ్యుల గురించి గొప్పలు చెబుతుంటారు. తాను తలచుకుంటే అథఃపాతాళానికి తొక్కేయగలమంటూ బెదరిస్తుంటారు. అంతలో తాము బుద్ధదేవునికి ప్రతిరూపాలమన్నట్టు ఫోజులిస్తుంటారు. క్షణమొకరకంగా ఊసరవెల్లిలా రంగులుమారుస్తూ చేసిన తప్పులు బయటపడకుండా పూర్తిగా సమాధి చేయాలని చూస్తుంటారు. ఈ లక్షణాలున్న వారితో తస్మాత్ జాగ్రత్త.

14, ఫిబ్రవరి 2017, మంగళవారం

అమ్మకు ప్రేమతో...

మాఘమాసం బహుళ (కృష్ణ) పంచమి (ఫిబ్రవరి 15, 2016). కాలచక్రాన్ని వెనక్కి తిప్పితే... అది 1986వ సంవత్సరం, ఫిబ్రవరి 28వ తేదీ అంటే ఆరోజు కూడా మాఘమాసం, బహుళ (కృష్ణ పంచమి తిథి)  సరిగా ఆరోజున  అత్యంత ప్రేమమూర్తి  మా అమ్మగారు తుర్లపాటి స్వరాజ్యలక్ష్మి
  లింగైక్యమైన రోజు.  
స్వర్గీయ తుర్లపాటి వెంకట మల్లికార్జున వరప్రసాదరావుగారి ధర్మపత్ని.
  ఈ పుణ్య దంపతులకు ఐదుగురు సంతానం. కర్మానుగత విశేషములచే సంతాన ఫలాల్లోని మొదటి ఇద్దరు (పురుషోత్తమరావు, అన్నపూర్ణ) లేత వయసులోనే కన్నుమూశారు. మిగిలిన సంతానం ముగ్గురు. వారిలో పెద్దవారు తుర్లపాటి కోటేశ్వరరావుగారు. వీరే మా అన్నయ్యగారు. ఆ తర్వాత వరలక్ష్మి. ఈమె నాకు అక్కయ్య.  చివరివాడిని నేను (నాగభూషణ రావు). అమ్మానాన్నల దివ్యఆశీస్సులతో ఈ ముడు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. 
   మా అమ్మగారి పుణ్యతిథిని పురస్కరించుకుని  కుటుంబ సభ్యులమైన మేము ఆ పుణ్యమూర్తికి నివాళి ఘటిస్తున్నాము.


పుణ్య దంపతులు


   అమ్మ ఎవరికైనా అమ్మే.  అమ్మప్రేమకు సరిసాటి మరేదీలేదు. మాత్రుమూర్తి ప్రేమను తలుచుకుంటే చాలు మనసు పరవళ్లు తొక్కుతుంది. నిష్కళంక ప్రేమ ఆమెది. ఎన్నో,ఎన్నెన్నో మధురమైన సంఘటనలు కళ్లముందు కదలాడుతున్నాయి. అయినప్పటికీ ఒకే ఒక్క సంఘటన (నాకు సంబంధించినది) ఈ సందర్భంగా నేను గుర్తుచేసుకుంటున్నాను.
  పుట్టుక నుంచీ నేను చాలా బలహీనుడినేనట. నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మగారు కాళ్లుజాపి ఆ కాళ్లపై నన్ను పడుకోబెట్టి స్నానం చేయిస్తుంటే రెండు కాళ్ల సందులోనుంచి జారి పడిపోయేవాడినట.  మా బామ్మ (అన్నపూర్ణమ్మ) మా మేనత్త (బుల్లెమ్మ - అసలు పేరు - సీతారావమ్మ కస్తల) ఈ విషయం చెబుతుండేవారు. అంత బలహీనమైన పిల్లాడు అసలు బతికి బట్టకడతాడా? అని బంధుమిత్రులు అనుకునేవారట. మొదటి మూడు నెలలు దినదిన గండమేనట.
   అంత అర్భకంగా ఉండటంతో  పాలే నాకు ప్రధాన ఆహారమైంది. పెరిగి పెద్దవుతున్నా రోజూ పొద్దున్నే పాలగ్లాస్ ఎంతో మురిపంగా నాకు ఇచ్చేవారు. నాకు పదిపన్నెండేళ్లు వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు గుర్తే. ఏదైనా ఫంక్షన్ కు గానీ, ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు కాఫీ ఇస్తుంటే మా అమ్మ గట్టిగా చెప్పేది. `మా రాజా (నన్ను మా అమ్మేకాదు, బంధువర్గమంతా నాగరాజు, రాజా అని పిలుస్తుంటారు ఇప్పటికీనూ) కాఫీ తాగడు, పాలే ఇవ్వండి' అనేది.

 దీంతో ఎవరింటికి వెళ్ళినా నాకు మాత్రం గ్లాసుడు పాలే ఇచ్చేవారు. ఇప్పటికీ (నాకు 60లోకి ప్రవేశించినా) మా సొంత ఊరైన అడవిరావులపాడు లేదా నందిగామ వెళితే బంధువులు కాఫీ నాకు ఇవ్వరు. వేడివేడి పాలే ఇస్తుంటారు. ఈ మధ్యనే నేను అడవిరావులపాడు వెళితే అక్కడ మా పొలం చూసుకునే వెంకటేశ్వర్లు కుటుంబం కూడా   `చిన్నబ్బాయిగారు పాలే తాగుతారు ' అంటూ  నాకు పాలగ్లాస్  ఇచ్చారు.  ఒక్కోసారి కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. నాకంటే చిన్నవాళ్లు, మరీలేతవాళ్లే కాఫీ కప్పులు తీసుకుని తాగేస్తుంటే, నాకు పాలగ్లాస్ ఇవ్వడమేమిటీ !! కానీ వారి అవ్యాజమైన ప్రేమను కాదనులేను. అందుకే అలా ఎవరైనా ఎప్పుడైనా పాలగ్లాసు నాచేతికి అందిస్తుంటే వారి రూపంలో మా అమ్మే కళ్లముందు కనబడుతుంటుంది. అందుకే మా అమ్మ మురి`పాల' అమ్మ .

  ఐదుగురు సంతానంలో ముగ్గురమే మిగిలాం. అమ్మ అంటూఉండేది, ఈ ముగ్గురు నలుసులను దేవుడు మిగిల్చాడని. ఇప్పుడు ఆ ముగ్గురం  ఆరుపదులు దాటిన వయసులో ఆనందంగా ఉంటున్నాము. 
  మా నాన్నగారు పైకి ఎంతో గంభీరంగా ఉండేవారు. కానీ కుటుంబసభ్యులకు ఎప్పుడు ఏదీ కావాలో అది సమకూర్చేవారు. నాకు తెలిసినంతవరకూ డబ్బుకు ఏనాడూ ఇబ్బంది పడలేదు. నీతినిజాయితీ, ధర్మప్రవర్తన వారినుంచి నాకు సంక్రమించిన ఆస్తులుగా నేను భావిస్తుంటాను. ఈ పుణ్యతిథినాడు పుణ్య దంపతులను మనసారా స్మరించుకుంటూ...

  (మా అమ్మగారితో పరిచయం ఉన్నవారు, బంధుమిత్రులు- తమకు తెలిసిన విశేషాలను ఈ సందర్భంగా పంచుకోండి. మీ అభిప్రాయాలను ఈ పోస్ట్ కింద కామెంట్స్ రూపంలోగానీ, లేదా మెయిల్ ద్వారా nrturlapati@gmail.com కి గానీ లేదంటే ఫోన్ చేసిగాని చెప్పండి)
                                                                                             - తుర్లపాటి నాగభూషణ రావు (నాగరాజు)
                                                                                                  ఫోన్ నెంబర్   988 529 2208  
                                                                                                    హైదరాబాద్ (తెలంగాణ)