27, మే 2024, సోమవారం

9వ భాగం : ఈ పడవకెంత దిగులో..

ఆ రాత్రి టైమ్ తెలియడం లేదు. చేతికి వాచీ కూడా లేదు. కొత్త చోటు కావడంతో నిద్ర రావడం లేదు. సముద్రపు గాలి ఈడ్చి తంతున్నట్లుంది. అలల ఘోషకి చెవులు చిల్లులు పడతాయేమో అనిపిస్తోంది. అసలు, నేనెందుకు ఇక్కడి వచ్చాను? చీకటి పడక ముందే వెళ్లకుండా ఎందుకిక్కడే ఉండిపోయాను? గాలి బాగా వీస్తుండటంతో చమట పట్టక పోయినా శరీరమంతా ఏదో ఉప్పులో నానబెట్టినట్లు అయిపోయింది. పైగా చేపల వాసన గుప్పుమంటోంది. ఇది గతంలో నాకెప్పుడూ అలవాటైన వాసన కాదు. ఇంటి పై కప్పు వైపు చూశాను. తాటాకుల పాక అది. పాకకు ఒక్కటే ద్వారం. తలుపులు, గడియలు లేవు. ఏదో పాత చీర అడ్డు తెరగా కట్టినట్లున్నారు. అది కాస్తా ఈదురు గాలికి పైకి క్రిందకీ ఎగిరెగిరి పడుతోంది. అలా తెర లేచినప్పుడల్లా ఆకాశం నాకు కనబడుతూనే ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. శుక్లపక్ష ఏకాదశి చంద్రుడు లేత మేఘాల నడుమ ఆడుకుంటూ పరిగెత్తుతున్నాడు. పరిగెత్తే ఆలోచనలు నిద్రని రానివ్వడంలేదు. తప్పు చేశానా ? ఇలా ఒంటరిగా వచ్చి తప్పు చేశానా?? అప్పటి వరకు జరిగిందంతా సినిమా రీల్ వెనక్కి తిప్పినట్లు కళ్ల ముందు కనబడుతోంది.
అదో మత్స్య కారుల పల్లె. విశాఖకి చేరువలోనే ఉన్నదది. గంగపుత్రుల వ్యధలకు ప్రత్యక్ష సాక్షి. అది 80వ దశకం తొలినాళ్ళు. బోటనీలో పిజీ పూర్తి చేసుకుని బొంబాయి నుంచి నందిగామ వచ్చేశాను. రీసెర్చ్ చేయాలన్నది నా తపన. అలా అని బొంబాయి మళ్ళీ వెళ్లాలనిపించలేదు. అందుకే ఆంధ్రా యూనివర్శిటీలో ప్రయత్నాలు మొదలెట్టాను. ఆ సమయంలోనే ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కి రమ్మనమని పిలుపు వచ్చింది. దారం దొరికింది. అదే చాలని విశాఖ వెళ్ళాను. అలా కొంత కాలం అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఈ సంఘటన జరిగింది. మత్స్యకారుల పల్లెలో గంగపుత్రులతో మాట్లాడుతుంటే టైమ్ తెలియలేదు. వారి కష్టాలు చూసి నా మనసు కరిగిపోయింది. విశాఖ తీరం వెంబడ ఇలాంటి పల్లెలు చాలానే ఉన్నాయి. వాటి పేర్లు కూడా చిత్రంగానే అనిపించాయి. వాటిలో ఒక పల్లెకి నేనూ నా మిత్రుడితో కలిసి రావడం ఓ అలవాటుగా మారింది. ఎందుకంటే.. రీసెర్చ్ పని కూడా ఆ పల్లెలతో ముడిపడి ఉంది కనుక.
సైన్స్ పరంగా రీసెర్చ్ చేయడానికని వెళ్ళినవాడిని గంగపుత్రుల వ్యథలకు చలించిపోయాను. రెండు సార్లు నాతోపాటు వచ్చిన మిత్రుడి దగ్గర ఓ కెమేరా ఉండేది. అది గొప్పదేమీ కాదు. క్లిక్ థర్డ్ కెమేరానే. నా దగ్గర అది కూడా లేదు. అతణ్ణి బతిమాలి నా వెంట తీసుకువచ్చి మత్స్య కారుల జీవన స్థితిగతులను కెమేరాలో బంధించే ప్రయత్నం చేశాను. మూడో సారి మిత్రుడు రాలేదు. నేనే ఒంటరిగానే ఆ పల్లెకి చేరుకున్నాను. చూస్తుండగానే సూర్యుడు అస్తమించాడు. అప్పటికే రెండు సార్లు అదే పల్లెకు రావడం వల్ల అక్కడి వాళ్లు నాతో ప్రేమగానే మాట్లాడటం మొదలెట్టారు. వారి కష్టసుఖాలు చెప్పారు. రోజూ బోలెడన్ని చేపలు పడుతున్నా మీ బతుకులు ఎందుకిలా ఉన్నాయన్న ప్రశ్నకు వారేదో చెప్పారు. వారి యాస నాకు సరిగా అర్థమయ్యేది కాదు. అయినా శ్రద్ధగా విన్నాను. వారి బాధలు అర్థం చేసుకోవడానికి కొద్ది రోజులు పట్టింది. వారి జీవన చిత్రం ఛిద్రమవ్వడంలో జూవాలజీ , బోటనీ `విలన్' పాత్రలు పోషిస్తున్నాయన్నది అర్థమైంది. దీంతో మా ప్రాజెక్ట్ అసలు ఉద్దేశం కూడా అర్థమైంది. మత్స్యకారుల జీవన స్థితిగతులు దుర్భరంగా మారడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ కనుక్కోవడమే మా లక్ష్యం. చిల్లులు పడిన పడవల నుంచి శాంపిల్స్ సేకరించి పడవలు జల్లెడగా మారడానికి కారణాలు ఏమిటీ? అలా జరగకుండా ఆపడం ఎలా? అన్నది మేము చేయాల్సిన పని. కానీ నేను ఈ శాంపిల్స్ కలెక్షన్ , వాటిని మైక్రోస్కోప్ క్రింద ఉంచి స్టడీ చేయడాలు వంటి వాటి కన్నా ఆ పల్లె వాసుల కష్టాలు, వాడి ఆచారాలు తెలుసుకోవడం వైపు ఎక్కువగా మొగ్గు చూపాను. అందుకే సాయంత్రం వేళల్లో తీరిక చేసుకుని సముద్ర తీరం చేరుకుని మత్స్యకారులను కలుసుకునే వాడ్ని. ఇప్పుడూ అదే జరిగింది. మూడోసారి ఒంటరిగా మత్స్యకారుల పల్లెకు చేరిన నేను చీకటి పడటం గమనించలేదు. వారితో మాటలు ఆగలేదు. నాకు ఆకలేస్తోంది. అది వారు గ్రహించినట్లున్నారు. పచ్చి ఉల్లిపాయ, మిరపకాయ, అన్నం కలిపిన మజ్జిగ వంటివి ఇచ్చారు. చేపల పులుసు వంటివి ఉన్నాయని వారు చెప్పలేదు. ఎందుకంటే వారికి అప్పటికే తెలుసు. నేను శాఖాహారినని. పైగా బ్రహ్మాణ కుటుంబం నుంచి వచ్చానని తెలిసి వారు నా పట్ల మరింత మర్యాద పూర్వకంగా ఉండేవారు. ఆకలి దంచికొట్టడంతో మజ్జిగ అన్నం తిన్నాను. ఆకలికి - మతం, కులం లేవన్న సంగతి అర్థమైంది. ఉల్లిపాయ నంజుకోలేదు. పచ్చి మిరపకాయ కొరకలేదు. కానీ ఉప్పు కలిపిన మజ్జిగ అన్నం తిన్నాను. నిజానికి `తిన్నాను' అనే దానికంటే `తాగాను' అన్న పదం కరెక్ట్. అలా నేను అన్నం తాగున్నంత సేపూ పల్లె పిల్లల్లో కొంత మంది నా చుట్టూ చేరి ఆశ్చర్యంగా చూస్తున్నారు. కోట లోని రాకుమారుడెవరో తప్పి పోయి పేటలోకి వచ్చాడన్నట్లు. వాళ్లలో ఒకడైతే రెండు పెద్ద చేపలను సన్నటి తాడుకి దండగా గుచ్చి ఆ చేపల దండను అదేదో పూల హారంలా మెడలో వేసుకుని మురిసిపోతున్నాడు. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే `నీ మెడలో వేయనా' అన్నట్లు మీదకు వంగాడు. చేపల వాసన ముక్కు దగ్గరకు రావడంతో వాంతి వచ్చినట్లయింది. ఇంతలో ఓ పెద్దాయన పిల్లాడ్ని మందలించి బయటకు తోలాడు. నేను ఊపిరి పీల్చుకున్నాను. పల్లెలోని మగవాళ్ళలో చాలా మంది గోచీలు పెట్టుకున్నారు. అక్కడ ఉన్న మొగవాళ్లలో ప్యాంట్ షర్ట్ వేసుకున్నది నేనొక్కడినే. నాకు చాలా మొహమాటంగా ఉంది. `నేను పోతానండి' అంటూ అప్పటికే నాలుగైదు సార్లు లేచాను. కానీ ప్రతి సారీ వారి ప్రేమకు బంధీనయ్యాను. అప్పుడే అర్థమైంది. కులం, మతం, పేద గొప్ప వీటన్నింటి కంటే మానవత్వం , ప్రేమ చాలా గొప్పవన్న సంగతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమగా పిలిస్తే ఎటువంటి భేద భావం చూపకుండా భోజనం చేయడం అలవాటైంది. దీన్నే సమానత్వం, సమాధరణ అంటారని అప్పుడు ఆ పల్లెలోని ఆ పూరి గుడిసెలో వారితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు నాకు తెలియదు. కర్ణ సినిమా కోసం సినారె వ్రాసిన ఈ పాట గుర్తుకొచ్చింది. గాలికి కులమేదీ? ఏదీ, నేలకు కులమేది? నీటికి మరుగేది? ఏదీ, కాంతికి నెలవేది? మళ్ళీ నిద్ర రాని ఆ రాత్రి దగ్గరకు వెళదాము... `నిద్ర రావడం లేదా అయ్యోరు?' అడిగాడు నా అవస్థ చూసిన పల్లె పెద్ద తనదైన యాసలో. `లేదు, రావడం లేదు' `అంతే అయ్యోరు. రాదు లేండి. మిద్దెల్లో హాయిగా పడుకునే మా రాజులు మీరు. మా పట్ల ప్రేమతో వచ్చారు కానీ అసలు ఈ పల్లెకు మీరు రావలసిన అవసరం ఏముంటుంది చెప్పండి' `అవును. ఉండదు' ముక్తసరిగా సమాధానమిస్తూనే, `అది సరే మీ జీవితాలు ఎందుకిలా తయారయ్యాయి?' అసలు పాయింట్ కి వచ్చాను. `ఏం చెప్పమంటారు సామి. అప్పులు చేసి వేలకు వేలు పోసి పడవ కొంటామా. ఈ నాటు పడవలేమో కొన్న ఐదేళ్లకే జల్లెడలా మారిపోతున్నాయండి. చేసిన అప్పులు తీర్చే లోపే ఈ పడవ చిల్లులు పడి జల్లెడగా మారిపోతున్నదాయె. మరమ్మతులకు చేసిన అసలు తీర్చలేక, వడ్డీలు కట్టలేక కొత్తవి కొనలేక మా బతుకులు ఇలా అయిపోతున్నాయి బాబు' యాసలో చెప్పుకుపోతున్నాడు. నాకు కొన్ని పదాలు అర్థం కాకపోయినా అతని గుండె చప్పుడు అర్థమైంది. పల్లె పెద్ద కళ్లు తుడుచుకోవడం ఆ మసక వెలుతురులో నా చూపు నుంచి తప్పించుకోలేక పోయింది. నా మనసు చివుక్కుమంది. అంతలో ఆ పెద్దాయన తమాయించుకుని `సర్లే బాబు, మీరు పడుకోండి. ఇంత వరకు ఎవ్వరూ మీలా మా ఇళ్లకు వచ్చి పడుకోలేదు బాబు' అంటూ అదే గుడిసెలో మరో పక్కన వొరిగి పడుకున్నాడు. నేను ఆలోచనలో పడ్డాను. నిజమే మిద్దెల్లో పడుకునే వారికి ఈ పూరి గుడెసలో అందునా సముద్ర తీరం పక్కనే ఇలా పడుకోవడం కష్టమే. నా విషయంలోనే ఇలా ఎందుకు జరిగింది? చీకటి పడకముందే వెళ్ళిపోవచ్చు కదా. కానీ వారితో సాగిన ముచ్చట్లు నా కాలు ముందుకు కదపనీయలేదు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. ఏవేవో శబ్దాలు వినిపిస్తుంటే నిద్రకాస్తా జారిపోయింది. కళ్లు తెరిచి చూశాను. కాసేపటికి గాని నేను మత్స్యకారుల పల్లెలో ఉన్నానన్న సంగతి అర్థం కాలేదు. లేచి గుడిసె బయటకు వచ్చాను. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. చంద్రుడు పడమటి వైపు బాగా వొరిగిపోయాడు. తూర్పున ఆకాశంలో నలుపు విరిగిపోతున్నది. ఇంకా తెల్లవార లేదు. కానీ ఏమిటీ వీళ్ల హడావుడి.. అప్పటికే గంగపుత్రులు తమ పడవలను సముద్రం వైపుకు తరలిస్తున్నారు. ఆశగా, ఉత్సాహంగా కడలి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. మంచి మంచి చేపలు, పెద్ద పెద్ద చేపలు తమ వేటకు చిక్కాలనీ, బతుకులు పండాలని గంగమ్మను వేడుకుంటూ ఏవో పాటలు లాంటివి పాడుతూ సాగుతున్నారు. నాకెందుకో ఈ పాట గుర్తుకు వచ్చింది.. ఆడుతు పాడుతు పని చేస్తుంటే, అలుపు సులుపేమున్నది. ఇద్దరమొకటై చేయి కలిపితే, ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది... కలిసి పనిచేస్తే కలిగే సంతృప్తినీ, ఆనందాన్ని కవి ఎంత చక్కగా వివరించారో కదా.. ఒలియో ఒలీ.. మత్స్యకారుల పాటలు వింటుంటే మా పల్లెటూరిలో పొలం పనులు చేయడానికి ముఖ్యంగా ధాన్యం తూర్పారబట్టేటప్పుడు పాడుకునే పాటలు గుర్తుకు వచ్చాయి. ఒలియో ఒలి పొలియో పొలి రావేలుగలవాడా రారా పొలి గాడ.. పొలం పనులు చేసేటప్పుడు స్త్రీలు చాలా చక్కటి పాటలు పాడేవారు. వారి పాటల్లో గంగమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ వంటి గ్రామదేవతలే కాకుండా సీతమ్మోరి కథ, చిన్ని కిష్టయ్య లీలలు.. వంటివి చోటుచేసుకునేవి. ఆ తర్వాత కాలం ఎంతోమారిపోయింది. ఎంతగా అంటే, ఇప్పుడు అలాంటి పాటలు వినబడటం లేదు. పాటల స్వరూపం మారింది. చాలా చోట్ల వారి బతుకుల్లో ఆచార వ్యవహారాల పరంగా నేపథ్యం మారింది. ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాక ఎవరికి వారు సెల్ లో పాటలు పెట్టుకుని ఇయర్ ఫోన్లతో వినేస్తున్నారు. పొలాల్లో వ్యవసాయ కార్మికులు పాడుకునే ఈ పాటలు వినడం వల్లనే ఆ తర్వాత గ్రామ దేవతల గురించి తెలుసుకోవాలన్న తపన కలగడం, అది రకరకాల వ్యాసాలు వ్రాయడానికి దారి తీయడం జరిగి ఉంటుందని నాకిప్పుడు అనిపిస్తోంది. తుమ్మల చేను: అప్పట్లో నేను మా నాన్న మాట కదనలేక అప్పుడప్పుడు పొలంకి వెళుతుండే వాడ్ని. అయితే మనం ఎండ కన్నెరుగని సుకుమారులం కదా. ఒక వేళ పొలం వెళ్ళినా గట్టుమీద ఒ చెట్టు చూసుకుని నీడ పట్టున కూర్చునే వాడ్ని. గట్టు మీద విశాలమైన నీడ ఇచ్చే చెట్లు పెద్దగా ఉండేవి కావు. మా పొలంలో గట్టు మీద తుమ్మ చెట్లు ఉండేది. అందుకేనేమో దాన్ని `తుమ్మల చేను' అనే వారు. పొలాలకు పేర్లు కూడా ఇలాగే చిత్రంగా ఉండేవి. చెరువు గట్టు చేను (చెరువు గట్టుకు పక్కన ఉండే చేను అన్న మాట), తోట చేను (తోటకి దగ్గరగా ఉన్న చేను), అలాగే కొండ చేను, దిబ్బ చేను..ఇలా పొలాలకు పేర్లు వచ్చేవి. దోస వరుగు:
`ఒరేయ్, తోట చేన్లో దోసకాయలు విరగ కాచాయటగా, రేపు బండిలో వేసుకు రారా' - అనేది బామ్మ. జీతగాడు మర్నాడు బండెడు దోసకాయలు కోసి తీసుకొచ్చేవాడు. వాటిలో కొన్ని ఇంట్లో ఉంచుకుని మిగతావి, ఊర్లోని బంధువులకు, తెలిసిన వారికి పంచి పెట్టేది మా బామ్మ. ఎండా కాలం కూరగాయలు దొరికేవి కావు. అమ్మకానికి కూడా వచ్చేవి కావు. అలాంటప్పుడు దోస వరుగు, వంగ వరుగు బాగా అక్కరికి వచ్చేవి. మా ఇంట్లో దూలాలకు గుత్తులు గుత్తులుగా దోస వరుగు వేలాడుతుండేవి. దోసకాయలు బాగా పండినప్పుడు వాటిలో చాలా వాటిని నేర్పుగా లింక్ లు ఉన్న చక్రాలుగా తరిగి వాటిని దూలాలకు, దండేలకు (దండెం అంటే బట్టలు ఆరేసుకోవడానికి, ఇతర అవసరాల కోసం వ్రేలాడ దీసే కర్ర అన్న మాట) ఈ వరుగులను వ్రేలాడ దీసేవారు. అలా వ్రేలాడ దీయడంతో అవి గాలికి బాగా ఎండి పెళపెళలాడుతుండేవి. తాజా కూరగాయలు దొరక్కపోతే వెంటనే ఈ దోస వరుగు దండలు తెచ్చి వాటితో కూర చేసేవారు. అలాగే వంగ వరుగులు కూడా రెడీగా ఉండేవి. ఇప్పటికీ కొన్ని చోట్ల దోస వరుగులు, వంగ వరుగులు దొరుకుతాయనుకుంటా. వాటిని ఇష్టంగా తినేవారు ఇప్పటికీ ఉన్నారు. చొప్ప గూడు : సరే, పొలంలో నీడ పట్టున కూర్చోవడానికి గట్టు మీద చెట్లు లేకపోతే అప్పుడు పనివాళ్లు చాలా నేర్పుగా గూడు కట్టేవారు. జొన్న చొప్ప కట్టలను నేర్పుగా పేర్చి కట్టే గూడు భలే గమ్మత్తుగా ఉండేది. అది శంఖాకారంలో ఉండేది. ఆ గూట్లో క్రింద గడ్డి పరిచి మెత్త తయారు చేసేవారు. ఇంటి నుంచి తెచ్చిన దుప్పటి పరుచుకుని హాయిగా కూర్చోవచ్చన్న మాట. ఇదేదో బాగుందనుకునేవాడ్ని. పాపం పిల్లలు ఇబ్బంది పడతారని మా నాన్నగారే జీతగాడికి చెప్పి ఇలాంటి ఏర్పాట్లు చేయించారని ఆ తర్వాత తెలిసింది. నాన్న పట్ల గౌరవం పెరిగింది. తొలి వ్యాసం: మళ్ళీ గంగపుత్రుల దగ్గరకు వెళదాం. పూర్తిగా తెల్లవారింది. నాకు ఆతిథ్యమిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపి నడవడం మొదలుపెట్టాను. సముద్రపు వొడ్డున అక్కడక్కడా మరమ్మతులకు నోచుకోని పడవలు కనిపించాయి. అవి నా వైపు దీనంగా చూస్తున్నట్లు అనిపించింది. అప్పుడు నా చేతులు ఆ నాటు పడవలను ప్రేమగా నిమిరాయి. చిల్లులు పడవలవైపు నా చూపులు నిలిచాయి. అదే సమయంలో నా మదిలో ఒక వ్యాసానికి బీజం పడింది. ఈ "పడవల" దిగులు తీరాలి. గంగ పుత్రుల కళ్లలో సంతోషం వెలగాలి. వారి ఇళ్లలో నిత్య దీపావళి కాంతులు నిండాలి. ఇలా అనుకుంటూ రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ కి చేరుకున్నాను. `రాత్రంతా ఏమైపోయా'వంటూ నా ఫ్రెండ్స్ అడిగారు. సమాధానం చెప్పకుండా నోట్ పుస్తకంలో ఏదేదో వ్రాసుకోవడం మొదలెట్టాను. ఈనాడు పత్రిక. ఇది 80వ దశకం తొలినాళ్లకే పాపులర్ అయింది. అందుకే నేను వ్రాసిన తొలి వ్యాసాన్ని వారికి పంపించాను. ఆ తర్వాత కొంత కాలానికి నేను నందిగామ చేరినప్పుడు పోస్ట్ మాన్ నాకు ఒక కార్డు ముక్క ఇచ్చాడు. ఆ రోజుల్లో నందిగామలో మా ఫ్రెండ్స్ తో కలిసి ఉదయం 11 గంటల ప్రాంతంలో గాంధీ సెంటర్ లోని టీ స్టాల్ లో ఫ్రెండ్స్ తో కలిసి టీ తాగడం అలవాటుగా మారింది. ఒక రోజు అలా టీ తాగుతుంటే ఫోస్ట్ మాన్ వచ్చి అక్కడే కార్డు ముక్క చేతిలో పెట్టాడు. చదవగానే ఆనందం తాండవమాడింది. నేను వ్రాసిన వ్యాసాన్ని ఈనాడు వాళ్లు స్వీకరిస్తున్నట్లు అందులో ఉంది. ఆదివారం సంచికలో ప్రచురిస్తామని కూడా రాశారు. మా ఫ్రెండ్స్ నన్ను ఓ `యండమూరి'లా చూశారు. ఫలితంగా ఆ రోజు టీ డబ్బులు నా చేతనే ఇప్పించారనుకోండి. అప్పటి నుంచి ప్రతి ఆదివారం ఉదయాన్నే సెంటర్ కి వెళ్ళి ఈనాడు పేపర్ కొనడం, వ్యాసం రాలేదని దిగాలు పడటం.. అలా కొన్ని వారాలు గడిచాక, ఓ ఆదివారం ప్రత్యేక సంచికలో నా వ్యాసం ప్రచురితమైంది. ఆ రోజుల్లో ఆదివారం సంచిక బుక్ సైజ్ లో వచ్చేది కాదు. బ్లాక్ అండ్ వైట్ లోనే బ్రాడ్ షీట్స్ లో వచ్చేది. నా వ్యాసం మొదటి పేజీలో మొదలై తరువాయిగా లోపలి పేజీలు కూడా ఆక్రమించింది. నేను నా ఫ్రెండ్ చేత తీయించిన ఫోటోలు కూడా వారు ప్రచురించడం వాడికీ బోలెడు సంతోషమేసింది. ఆ రోజు రాత్రి నేను పెద్ద రచయితనై పోయినట్లు కలలు వచ్చాయి. గొప్ప రచయితనైతే కాలేదు కానీ ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్న జర్నలిస్ట్ గా మారడానికి ఈ వ్యాసం దోహద పడిందనే చెప్పాలి. పడవ కష్టం - శాస్త్రీయ కోణం : నాటు పడవలు నాలుగైదేళ్లకే జల్లెడగా మారడానికీ జంతు-వృక్ష శాస్త్రాలకు లింక్ ఉన్నదని చెప్పాను కదా. పూర్తి వివరాలు చెప్పాలంటే అదో పెద్ద కథే అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే.. నాటు పడవలు చెక్కతో తయారవుతాయి కదా. ఆ చెక్క పడవలే సముద్ర జలాల్లో రోజూ తేలియాడుతుంటాయి. అలా సముద్ర జలాల్లోనే ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటిని మొలస్కలనే గవ్వల్లాంటి జీవులు పడవలను ఆశ్రయిస్తాయి. సముద్ర జలాల్లో నానినాని మెత్తబడిన పడవల క్రింద భాగం ఈ జీవులు గుంపు గుంపులుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కాలక్రమేణ చెక్క మరింత మెత్తబడి చివరకు చిల్లులు పడే పరిస్థితికి చేరుకుంటుంది. చివరకు పడవ క్రింది భాగం జల్లెడగా మారిపోతుంది. ఇలా పడవ మెత్తబడటానికి ఈ తరహా జంతువులకు తోడు వృక్షశాస్త్రానికే చెందిన ఫంగస్ (శిలీంద్రం) ఈ పడవలను ఆశ్రయించి దాన్ని మెత్తబరుస్తుంటాయన్న సత్యం పరిశోధనల్లో తేలింది. ఫలితంగా నాటు పడవ కొన్న ఐదారేళ్లకే పడవ క్రింద భాగం జల్లెడగా మారడంతో జాలర్ల బతుకులు ఛిద్రమవడం మొదలవుతుంది. ఇలా శాస్త్రీయ , సమాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడిన అంశం కావడంతో ఈనాడు వాళ్లు నా వ్యాసానికి పెద్ద పీట వేశారనీ, అంతే కానీ నేనేదో గొప్పగా రాయడం వల్ల కాదన్న సంగతి ఆ తర్వాత తెలిసింది. ఏదైతేనేం లేండి, మొత్తానికి నా వ్యాసం కొంతలో కొంత చైతన్యం కలిగించింది. గంగపుత్రుల పరిస్థితులు తర్వాత కాలంలో మారాయి. శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా (ఉడ్ ప్రిసెర్వేటర్స్ వంటివి రావడం వల్ల) ఇబ్బందులను ఎదుర్కునే శక్తి గంగపుత్రులకు వచ్చింది. మహా వారధి నిర్మాణంలో ఉడతలాగా నేనూ సాయం చేశానన్న తృప్తి మిగిలింది. మరో ప్రక్క జర్నలిజం పట్ల ఆసక్తి పెరిగింది. ప్రాజెక్ట్ వర్క్ మధ్యలోనే ఆపేసి ఈనాడు సంస్థలో చేరాను. అక్కడి నుంచి జర్నలిస్ట్ గా నా ప్రయాణం ఆంధ్రప్రభకు చేరింది. ఆంధ్రప్రభలో నా ప్రయాణం ఓ పెద్ద కథ.

20, మే 2024, సోమవారం

8వ భాగం: ప్రాణ రక్షకుడు

లేత కుర్రాడొకడు ఏటిలో ఈత కొడుతున్నాడు. నిజానికి అతగాడికి ఈత కొట్టడం పూర్తిగా రాలేదు. తోటి స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఏటి దగ్గరకు వెళ్ళాడు. వచ్చీ రానీ ఈతతో `సాహసం చేయరా డింబకా' అనుకున్నాడు. ఏటిలో నీరు బాగా ఉంది. కుర్రాడు హుషారుగా ఏటి నీటిలోకి దిగాడు. నీటి ప్రవాహం లేని చోటు, అంటే నిలకడగా నీరు ఉండే చోటునే ఈత కోసం ఎంచుకున్నారు. ప్రవాహంలో కొట్టుకు పోకూడదన్నది వీరి ఆలోచన. ఫ్రెండ్స్ తో పాటు ఏట్లో అంతా కేరింతలు కొడుతున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ, ఈ కుర్రాడికి తెలియదు, మరి కాసేపట్లోనే మునిగిపోబోతున్నానని. అప్పటి వరకు ఈత కొడుతున్నప్పటికీ నీటి క్రింద నేల తాకుతూనే ఉంది. నేలను కాలితో బలంగా తన్ని నీటి పైకి వచ్చేస్తున్నాడు. మళ్ళీ మునుగుతున్నాడు. అంతలో మళ్ళీ నేలను తన్ని పైకి వస్తున్నాడు. ఇదంతా ఆటగా ఉంది. పైకి వచ్చినప్పుడల్లా `చూశావా, నాకు ఈత వచ్చేసిందిరో' అన్నట్లు ఫోజులు కొడుతున్నాడు. కానీ.. అంతలో కాళ్లకు నీటి క్రింద నేల తగలడం లేదు. నేల తాకే ప్రాంతం నుంచి పక్కకు వచ్చేసినట్లున్నాడు. అక్కడేదో గుంట ఉన్నట్లుంది. లోతు పెరిగిపోయింది. ఈ కుర్రాడు వచ్చీరానీ ఈతతో ఇబ్బంది పడుతున్నాడు. లోతైన గుంట నీటిలో మునిగిపోతున్నాడు. చేతులు నీటిపైకి ఎత్తి `రక్షించండ్రా' అన్నట్లు సైగలు చేస్తున్నాడు. నీటిలో కాళ్లు తప తపా లాడిస్తున్నాడు. ఎక్కడైనా పట్టు చిక్కుతుందేమోనని ప్రయత్నిస్తున్నాడు. పైకి తేలలేక పోతున్నాడు. నీళ్లు మింగేస్తున్నాడు. ఇక అంతా అయిపోయిందనే అనుకున్నాడు.
కానీ విధి విచిత్రమైనది. ఈ లేత కుర్రాడి చేత భవిష్యత్తులో ఎన్నో పనులు చేయించాలన్నది ఆ దేవ దేవుని సంకల్పం. దేవుడు నేరుగా వచ్చి రక్షించే కాలం కాదు కదా ఇది. మానవ రూపంలో వచ్చి కాపాడుతుంటాడు. అక్షరాలా అదే జరిగింది, ఇక్కడ. సరిగా, అప్పుడు ఓ చేయి బలంగా ఈ బలహీనమైన కుర్రాడి చేతిని ఒడుపుగా పట్టుకుంది. బలంగా వొడ్డుకి లాక్కెళ్ళింది. జల గండం నుంచి బయట పడ్డ ఆ లేత కుర్రాడిని నేనే. ఆ బలమైన చేయి నా స్నేహితుడిది. అతను బంధువు కూడా. పేరు: కస్తల విజయబాబు. ఈ సంఘటన జరిగింది 70వ దశకం తొలి నాళ్లలో. ఇదే `చేయి' ఆ తర్వాత చాలా ఏళ్లకి అంటే 2020లో కరోనా వచ్చినప్పుడు, ఈ కుర్రాడే వృద్ధుడయ్యాక, షష్టిపూర్తి చేసుకుని ఆనందంగా జీవితం గడుపుతున్నప్పుడు మరో గండం ఎదురైనప్పుడు.. సరిగా అప్పుడు కూడా ఆదుకుంది. అందుకే ఈ చేయి నా జీవితంలో ప్రత్యేకమైనది. పేరుకు విజయుడే అయినా నాకు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ మాట అతను అంగీకరించడు. అది నాకు తెలుసు. నా తృప్తి కోసం రాశాను. 2020లో నేనూ నా శ్రీమతి (శ్రీదేవి) నందిగామలో ఓ అద్దె ఇంట్లో ఉండే వాళ్లం. ఓ రోజున పొద్దున వాకింగ్ చేస్తున్నప్పుడు సన్నటి గుండె నొప్పి. ఆ మర్నాటికి నొప్పి తీవ్రమైంది. స్నేహితుడు గోపు సుబ్రహ్మణ్యం సాయంతో విజయవాడ హాస్పటల్ చేరాను. నాలుగు చోట్ల బ్లాక్ అయిందంటూ ఓపెన్ హార్ట్ సర్జెరీ చేయాలన్నారు. ఆ సమయంలో నా భార్యా, కుమార్తె, కుమారుడితో పాటు నిరంతరాయంగా విజయబాబు కూడా మాట్లాడుతూ మంచి హాస్పటిల్, మంచి సర్జెన్ కుదర్చడంతో పాటుగా ఆస్పత్రి సిబ్బందితో స్వయంగా మాట్లాడుతూ నన్ను క్షేమంగా గండం నుంచి బయటపడేయడంలో తన పాత్ర పోషించాడు. సందర్భం వచ్చినప్పుడు ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఐసీయులో ఉంటూ నాలో నేను ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నంలో పాత పాటలను అంత్యాక్షరిగా పాడుకోవడం, యుట్యూబ్ ఛానెల్ కి పేరు ప్రతిష్టలు తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలు వంటి సంఘటనలను చెబుతాను. మొత్తానికి ఆ రోజు మున్నేరులో (దీన్నే మునేరు అని కూడా పిలుస్తుంటారు) జల గండం నుంచి బయటపడ్డాను. ఇంత జరిగినా మేము ఏమీ జరగనట్టే ఇంటికి చేరాము. ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. ఇప్పటికీ ఈ విషయం తెలియదనే అనుకుంటున్నాను. చెలములు: ఎండా కాలం ఏటిలో నీళ్లు లేనప్పుడు కాసిని నీళ్లైనా దొరుకుతాయోమోనని చెలములు తవ్వతుంటారు. `చెలము' అంటే నీటి ఎద్దడి వచ్చినప్పుడు, నీటి ప్రవాహం పక్కన ఉండే ఇసుక తెన్నులో ఊటల కోసం గుంటలు తవ్వడం. అలా తవ్వుతున్నప్పుడు నీటి ఊటలు ఒక్కోసారి బయటపడతాయి. ఒక్కోసారి పడవు. మా ఊరి ఏటి వొడ్డున ఇలాంటి చెలముల కోసం తీసిన గుంతలు అక్కడక్కడా కనబడుతుంటాయి. ఈ చెలముల్లోని నీటిని కడవల్లో నింపుకుని తీసుకువెళుతుంటారు. ఆ గోతులను మళ్ళీ ఇసుకతో పూడ్చరు. ఆ తర్వాత వర్షాకాలంలో ఏటికి నీరు బాగా వచ్చినప్పుడు ఈ చెలమలు పైకి కనబడవు. ఇందాక నేను జల గండాన్ని ఎదుర్కోవడానికి తీసిన గుంట కూడా ఇలాంటిదే. వరద ఫోటోలు: 70వ దశకంలోని ఓ ఏడాది బాగా వర్షాలు పడ్డాయి. నదులు, ఏరులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నందిగామకు ఆనుకునే మున్నేరు ఉంది. వానా కాలం మున్నేరు ప్రవాహం జోరుగానే ఉంటుంది. ఓ సారి జోరు వానలతో ఏరు పోటెత్తింది. నందిగామ - విజయవాడ రహదారిపైన అంబారు పేటకు దగ్గరైతే వరద నీరు రోడ్డుని కోసేసింది. ఈ వార్త తెలిసి మా గ్యాంగ్ చూడటానికని సైకిళ్ల మీద బయలుదేరాము. ఇంట్లో వాళ్లకు చెబితే మామూలుగానే భయంతో వద్దని అంటారని తెలుసు కనుక, మేమూ మామూలుగానే చెప్పకుండా హైవే మీదకు వెళ్ళాము. వరద నీటితో రోడ్డు చాలా చోట్ల కోసుకుపోయింది. మా ఫ్రెండ్స్ లో ఒకడికి (విష్ణుకి) క్లిక్ థర్డ్ కెమేరా (చూ. 12) ఉండేది. వాడు దాన్ని సైకిల్ హ్యాండిల్ కి తగిలించి తీసుకొచ్చాడు. ఒకటి రెండు ఫోటోలు తీశాడు. వరద ఫోటోలు అలా తీయడం వాడికే కాదు మాకు కూడా ఎదో గొప్ప పని చేశామన్న ఫీలింగ్ వచ్చేసింది. రోడ్డుకి ఒక పక్కన కారొకటి వరద నీటిలో కొట్టుకుపోతున్నది. ఒక ట్రాక్టర్ - రోడ్డు మీదనే నీటి మధ్యలో ఇరుక్కుపోయింది. రక్షించమంటూ ట్రాక్టర్ లో ప్రయాణం చేస్తున్న వారు భయంతో అరుస్తున్నారు. నిస్సహాయంగా చూడటం తప్ప నేనూ నా స్నేహితులు ఏమీ చేయలేకపోయాము. చాలా సేపటి తర్వాత రెస్క్యూ టీమ్స్ వచ్చి వారిని రక్షించాయి. కానీ కారు, అందులో ప్రయాణిస్తున్న వారు గల్లంతయ్యారని తర్వాత తెలిసింది. మాకు ఏడుపు ఆగలేదు. ఆ దృశ్యం గురించి ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత గుర్తు తెచ్చుకుని రాస్తున్నా నా కళ్లు చెమ్మగిల్లుతునే ఉన్నాయి. సరే, కాస్తంత మూడ్ మార్చుకుందామే..అప్పుడు మా ఫ్రెండ్ తీసిన ఫోటో చాలా కాలం నా దగ్గర భద్రంగా ఉండేది. ఇలాంటి సంఘటనలే ప్రేరణగా నిలిచి నన్ను ఓ జర్నలిస్ట్ గా తీర్చి దిద్దుతాయని అప్పట్లో అనుకోలేదు. వార్త ఎంత రాసినా, దానికి పోటో జోడిస్తేనే సమగ్రత వచ్చేదని మా న్యూస్ ఎడిటర్ ఒకాయన నేను ఆంధ్రప్రభలో ఎడిటోరియల్ డెస్క్ లో పనిచేస్తున్నప్పుడు అనేవారు. మరో విషయం చెప్పదలచుకున్నాను. నేను జర్నలిస్ట్ గా స్థిరపడటానికీ సముద్ర ఆటు పోటులకు సంబంధం ఉందన్నది. గంగ పుత్రుల పల్లెలు, వారి జీవన విధానం, నాటు పడవలు వంటివి నాలోని జర్నలిస్ట్ ను మేల్కొలిపాయంటే చదువుతున్న మీకు కాస్తంత ఆశ్చర్యం కలగవచ్చు. జర్నలిజానికీ వీటికీ పొంతన ఏమిటని ఆలోచనలో పడవచ్చు. అక్కడా క్లిక్ థర్డ్ కెమేరానే క్లిక్ క్లిక్ మంది. బావిలో కప్ప: నా చిన్నప్పుడు, మా ఊర్లో వరదల వల్ల పొంగిన వాగుని చూసి సముద్రమంటే ఇదేనేమో అనుకునేటంతటి అమాయకత్వం ఉండేది. చాలా పెద్దయ్యాక మద్రాసులో అపార జలరాశి చూసేదాకా తెలియదు `ఇదిరా అసలు సముద్రం' అని. పెరిగిన ఊరు (నందిగామ)లో ఏరు, పుట్టిన ఊరు (అడవి రావులపాడు)లో వాగు మాత్రమే తెలిసిన నా బోటి `బావిలో కప్ప'కు సముద్రం చూడగానే కళ్లు బైర్లు కమ్మాయి. అప్రయత్నంగా నోటి నుంచి `అమ్మో' అన్న ఆశ్చర్యకర శబ్దం వచ్చేసింది. చాలా చిన్నప్పుడు మా ఊర్లో వాగు పొంగడం చూసి కూడా ఇలాగే బోలెడు ఆశ్చర్యపోయాననుకోండి. ఆ తర్వాత అడపాదడపా సముద్రం నాకు కనిపిస్తూనే ఉంది. కాదు, కాదు సముద్రానికే నేను కనబడుతునే ఉన్నాను. ఇది కరెక్ట్. ఆ తర్వాత బొంబాయిలో మేముండే హాస్టల్ సముద్రానికి అతి చేరువులోనే ఉండేది. కనుక, తరచుగా బీచ్ కి వెళ్ళి కూర్చునే వాళ్లం. అలాగ సముద్రుడేదో మాకు ఫ్రెండ్ అయినట్లు ఫీలయ్యే వాళ్లం. వాగొచ్చె వరదొచ్చె: ఓసారి వేసవి సెలవులకు మా ఊరు వెళ్లడం వల్ల వాగు పొంగు గురించి తెలిసింది. వేసవే అయినా ఒక్కోసారి ఏప్రిల్, మే నెలల్లో కూడా తుపాన్లు వచ్చేవి. జోరు వానలతో వాగులు పొంగేవి. మా ఊరికి పక్కనే వాగు ప్రవహిస్తుంటుంది. మామూలు రోజుల్లో అయితే అక్కడో వాగు ఉన్నట్లు గుర్తించే లోపే వాగు దాటేస్తుంటాము. అదే వాగు పొంగితే మాత్రం సమీపంలోని పట్టణానికీ ఈ పల్లెటూరుకీ మధ్య సంబంధాలు కట్ అయిపోతాయి. అలా మేము అక్కడ ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు జరిగింది కూడా. వంతెనలు లేని రోజుల్లో వానాకాలంలో ఒక ఊరి నుంచి మరో ఊరు వెళ్లాలంటే చాలా కష్టమే. మరీ ముఖ్యంగా మధ్యలో వాగులూ, ఏర్లు, నదులు ఉంటే ఎక్కడి వాళ్లు అక్కడ గప్ చుప్. అలా వాగుకి వరదొచ్చినప్పుడు ఊర్లోని పిల్లలతోపాటు నేనూ చాలా దగ్గరి దాకా వెళ్ళి చూశాను. `అమ్మో' అంటూ ఆశ్చర్యపోయాను. ఎటు చూసినా నీళ్లే. ఊర్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని ఇళ్లు మునిగాయని చెప్పేవారు. ఏ అర్థరాత్రో నీటి ప్రవాహం ఉర్లోకి వచ్చి, ఊరంతా మునిగిపోతుందన్న భయం వ్యాపించేది. అసలే రకరకాల భయాలతో కాలం వెల్లబుచ్చుతున్న నాబోటి పిల్లలకు ఈ వరద భయం రాత్రిళ్లు నిద్ర పోనిచ్చేది కాదు. అలాంటప్పుడు మరో ఇబ్బంది కూడా ఎదురయ్యేది. వానలు, వరదలు రానంత వరకు ఆరుబయటనే మంచాలు వేసుకుని పడుకునే వాళ్లం. ఇప్పుడేమో వరదొచ్చిందాయె, పైగా ఏ రాత్రికో వరద నీరు ఇంటి దాకా వస్తే మంచాలతో సహా కొట్టుకుపోమూ..అదీ మా భయం. అందుకే ఇంట్లోనే గుడ్డి దీపాల వెలుగులోనే బిక్కుబిక్కు మంటూ పడుకునే వాళ్లం. తెల్లారిన తర్వాత `అమ్మయ్యా, బతికే ఉన్నాం' అనుకుంటూ ఊపిరి పీల్చుకునే వాళ్లం. తువ్వాయి తువ్వాయి : తుపాను వర్షంతో పల్లె వణకిపోతున్నది. ఎవ్వరూ బయటకు వెళ్లే వీలు లేదు. పశువుల కొష్టంలో ఆవులు, ఎద్దులు కూడా బిక్కుబిక్కు మంటూ చూస్తుండేవి. మాకు ఓ పదకొండు దాకా ఆవులు ఉండేవి. రెండు జతల ఎద్దులు, చిన్న చిన్న కోడె దూడలు కూడా ఉండేవి. వాటన్నింటినీ కొష్టం కట్టేసే వారు. కొష్టం పెద్దదే అయినా అన్నిపశువులు హాయిగా పడుకోవడానికి జాగా సరిపోయేది కాదు. అందుకే ఆరు బయట కూడా గుంజలు పాతి వాటిని కట్టేసే వారు. ఒక ఆవు ఆ మధ్యనే ఈనింది. దానికి బుల్లి దూడ పుట్టింది. అది ఎంత ముద్దుగా ఉండేదో. ఛంగు ఛంగున ఎగిరేది. నేనూ దానితో పాటు గెంతేవాడిని. నన్ను కవ్వించేది. చేతికి చిక్కేది కాదు. కానీ అంతలోనే నా దగ్గరకు వచ్చేది. ఇలా అది నాకు మంచి ఫ్రెండ్ అయింది. దీంతో ఆడుకోవడం నాకెంతో ఇష్టం. పగటి పూట ఆ దూడని కట్టేసిన చోటనే మంచం వాల్చుకుని పడుకునే వాడ్ని. ఎందుకో తెలియదుగానీ ఆ తువ్వాయికీ నేనంతే అంతే ఇష్టం. అది తన ప్రేమను చాటడానికి మంచం మీద పడుకుని ఉంటే నా కాలుని పదేపదే నాకుతుండేది. దీంతో నాకూ దాని మీద బోలెడు ప్రేమ కలిగేది. తుపాను హోరు. జోరు వాన. ఆ రోజున.. నా ఫ్రెండ్ తువ్వాయి కొష్టంలోనే ఉన్నా తడిసి ముద్దయి, చలికి వణకిపోతున్నది. అది జాలిగా నా వంకే చూస్తున్నట్లనిపించింది.
దాన్ని ఎలాగైనా సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నది నా ప్లాన్. సురక్షిత ప్రాంతం వంటి పదాలు అప్పట్లో నాకు తెలియకపోయినా దాన్ని గాలి వాన నుంచి కాపాడాలనుకున్నాను. ఇదే విషయం ముందుగా బామ్మకు చెప్పాను. బామ్మ నవ్వి ఊరుకుంది. అమ్మకు చెబితే జీతగాడికి చెప్పమంది. వాడికి చెబితే `కుదరదబ్బాయి గారూ' అంటూ సున్నితంగా నా ప్లాన్ కి బ్రేక్ కొట్టాడు. నాకు బాధేసింది. వీడికి నా ఫ్రెండ్ తువ్వాయి మీద ఏ మాత్రం జాలి లేదని డిసైడ్ అయిపోయాను. `వీడికి తువ్వాయి మీద ప్రేమ లేదు, వీడో విలన్ గాడు' - అనుకున్నాను. ఎలాగైనా నా ఫ్రెండ్ ని రక్షించాలి. అంతే.. పగలంతా ఎలాగో కొష్టంలో ఉన్నా రాత్రి పూటైనా దాన్ని మనతో పాటుగా ఇంట్లో నేను పడుకునే మంచం పక్కనే ఉంచుకోవాలన్నది నా లక్ష్యం. ఇదే జీవితాశయం అన్న లెవల్ లో ఆలోచించడం మొదలెట్టాను. ఎవరి మాట వినదలచుకోలేదు. సాయంత్రం ఏడు కాగానే ఆ మసక వెలుతురులో కొట్టంలోకి వెళ్ళాను. దాదాపుగా ఆవులు, కోడె దూడలు..అన్నీ గాలి వానకు తడిసిపోయాయి. పెంకులు కప్పిన కొష్టమే అయినా చుట్టూ గోడలు ఉండవు కనుక వానకు గాలి కూడా తోడైతే నేలంతా బురద బురద అయ్యేది. ఆ బురదలోనే పాపం ఆవులు, ఎద్దులు, మా తువ్వాయి వంటివి పడుకునేవి. నేను కొష్టంలోకి అడుగు పెట్టగానే నా ఫ్రెండ్ తువ్వాయి తన సన్నటి గొంతుతో `అంబా' అన్నాడు. అది నన్నే ఆర్తితో పిలుస్తుందన్న ఫీలింగ్ వచ్చి వొళ్లు పులకించింది. తువ్వాయిని కట్టేసిన తాడుని గుంజ వైపున విప్పి, దాన్ని నెమ్మదిగా ఇంటి ముందున్న మెట్లు ఎక్కించి ఇంట్లోని ఓ గదిలోకి తీసుకు వచ్చాను. అది కూడా నా పట్ల బోలెడు నమ్మకం పెట్టుకున్నట్లుంది. నేనేదో దాని రక్షకుడినన్నట్లు నా వెంట వచ్చేసింది. ఇంట్లోకి తీసుకు వెళ్ళి మంచం కోడుకి దాన్ని కట్టేశాను. `హమ్మయ్యా..' ఊపిరి పీల్చుకున్నాను. అప్పుడు కలిగిన సంతృప్తిని ఇప్పటికీ నేను మరచిపోలేను. ఏదో విజయం సాధించానన్న తృప్తి. ఆనందంతో పడుకున్నాను. కళ్లు మూతలు పడుతున్నాయి. మధ్యమధ్యలో తువ్వాయి నా కాలు నాకుతున్నట్లు తెలుస్తూనే ఉంది. అంతలో నిద్ర పట్టేసింది. తెల్లవారింది. లేచి చూస్తే తువ్వాయి నా మంచం దగ్గర లేదు. నేను కంగారుగా మంచం దిగి అటూ ఇటూ చూశాను. ఆ తర్వాత తెలిసింది, మనం ఇలా పడుకోగానే అలా జీతగాడు వచ్చేసి దాన్ని విడిపించి కొష్టం లోకి వదిలేశాడని. `వాడెందుకు అలా చేశాడు? తువ్వాయినీ నన్ను వేరు చేసిన వీడిని వదిలిపెట్ట కూడదు. పెద్దయ్యాక బోలెడు బలం వస్తుందిగా, అప్పుడు వాడ్ని చితక్కొడతాను' అనుకుంటూ బక్క చేతులకి బాగా బలం పట్టాలని దేవుడిన్ని కోరుకున్నాను. జీత గాడి మీద అమ్మకు ఫిర్యాదు లాంటిది చేస్తే అమ్మ ఆ ఫిర్యాదుని పట్టించుకోలేదు. కానీ నా తల నిమిరింది ప్రేమగా. దీంతో నాలో కోపం మటుమాయమైంది. అమ్మని ప్రేమతో చుట్టేశాను. సరిగా అప్పుడే కొట్టంలో తువ్వాయి కూడా వాళ్లమ్మ దగ్గర గారాలు పోతూ పాలు తాగుతూ కనిపించింది.
తల్లి ఆవు కూడా దూడని ప్రేమగా నాకుతూ కనిపించింది. ఆ దృశ్యం ఇప్పటికీ నేను మరచిపోలేదు. జీతగాడు ఎందుకు తువ్వాయిని వదిలేశాడన్నది అప్పుడు ఆ చిన్న వయసులో అర్థం కాలేదు. కానీ తువ్వాయిలు అమ్మ చాటునే ఉండాలి. అమ్మ లోకమే వాటికి సురక్షితమన్న సంగతి ఆ తర్వాత నాకు అర్థమైంది. ఛంగు ఛంగున గెంతులు వేయండి. ఓ జాజి వన్నె బుజ్జాయిల్లారా.. నోరు లేని తువ్వాయిల్లారా .... పాత సినిమాలోని ఈ పాట అంటే అందుకే నాకిష్టం. అసలు తువ్వాయి అన్న పదం నాకెంత ఇష్టమంటే మా అమ్మాయిని ఇప్పటికీ తువ్వాయి అని పిలిచేటంత. వరదలు - పెళ్ళిళ్ళు నదులు, ఏరులు, వాగులను దాటడానికి వంతెనలు చాలా చోట్ల లేని రోజులవి. ఒక ఊరికీ, మరో ఊరికీ మధ్య ఏరులూ నదులు లేదా వాగులూ వంకలు అడ్డం వస్తే వానా కాలంలో ప్రయాణం చాలా కష్టం. చాలా చోట్ల పడవలు తిప్పే వారు కాదు. ఒక వేళ పడవ సౌకర్యం ఉన్నా చాలా ప్రమాదకరంగా ప్రయాణం సాగేది. ఈ తరహా అడ్డంకుల వల్లనే ఆచార వ్యవహారాలు కూడా ఒక ఊరికీ దాని పక్కనే ఉన్న మరో ఊరికీ చాలా తేడాలు రావడానికి కారణమై ఉంటుందని అనుకునే వాడ్ని. చదువు కోసమో పెళ్ళి సంబంధాల కోసమో నదులు ఏరులు దాటడానికి పెద్ద వాళ్లు ఇష్టపడే వారు కారు. దీంతో ఊర్లో ఉన్న బడి తోనే చదువు ఆపేయాల్సి వచ్చేది. ఇక పెళ్ళి సంబంధాలు కూడా ఆ ప్రాంతానికే పరిమిత మయ్యేవి. ఈ కారణంగానే దగ్గరి సంబంధం చేసుకోవడమే మంచిదన్న సంప్రదాయం వచ్చిందని నాకు ఆ తర్వాత కాలంలో అనిపించేది. ఆ రోజుల్లో మేనరికాలు బాగా జరిగేవి. చాలా చోట్ల దగ్గరి బంధువులంతా ఒకే ఊర్లో ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలసి మెలసి ఉండటం వల్ల బావా మరదల్ల మధ్య అనురాగ బంధం ఏర్పడుతుండేది. ఇది ప్రేమ- పెళ్ళికి దారి తీస్తుండేదని చెప్పేవారు. తెలిసిన సంబందం అయితే ఆ జంట మన కళ్లెదుట ఉంటారన్న అభిప్రాయం ఆ రోజుల్లో బాగా ఉండేది. `దూరం' సంబంధం చేసుకుంటే వచ్చే కష్టాలు ఇన్నీ అన్నీ కావని అభిప్రాయ పడేవారు. దూరం అంటే వాగులు, ఏరులు, నదులు దాటి వెళ్ళేటంతటి దూరం అని చెప్పేవారు. ఏటవతల లేదా నది ఆవల సంబంధాలు వద్దనే వారు. వరదలొచ్చి రెండు ఊర్ల మధ్య సంబంధాలు తెగిపోతే కనీసం క్షేమ సమాచారం కూడా తెలిసేది కాదు. వరదలొచ్చినప్పుడు పోస్ట్ కూడా వారం పది రోజుల తర్వాతగానీ వచ్చేది కాదు. ఓసారి, పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయింది. పెళ్ళి కొడుకుదేమో గుంటూరు జిల్లా. పెళ్ళి కూతురేమో కృష్ణా జిల్లాలోని ఓ మారు మూల గ్రామం. ఇలాంటప్పుడు పెళ్ళి సవ్యంగా జరిగేదాకా, పెళ్ళి కూతురు కాపురానికి అత్తవారింటికి క్షేమంగా చేరే దాకా అమ్మాయి వైపు వారికి దిగులు పడటం నేను ప్రత్యక్షంగా చూశాను. పెళ్ళి సంబంధం కుదిరినప్పటి నుంచీ వరదలు రాకుండా చూడమని మొక్కుకునే వారు. పెళ్ళికని బండ్లు కట్టుకుని బయలు దేరిన వారు వరద నీటిలో గల్లంతయ్యారన్న వార్తలు ఆ రోజుల్లో తరచూ వినబడుతుండేవి. ఆనకట్టలు, వంతెనలు వచ్చాక క్రమక్రమంగా పరిస్థితి మారింది. దూరం సంబంధాలు ఇచ్చి పుచ్చుకోవడం మొదలైంది. చివరకిది ఖండాంతర సంబంధాలు చేసుకునే దాకా వెళ్ళిందనుకోండి. పందిట్లో పెళ్ళవుతున్నాది.. : నేను బాగా చిన్నప్పుడు చూసిన ఓ పెళ్ళి సందడి ఇప్పటికీ గుర్తుంది. మా పల్లెటూరులో మా నాన్నగారి ఆధ్వర్యంలో జరిగిన పెళ్ళి తంతు ఇది. దగ్గరి బంధువు తన కూతురు పెళ్ళికి సాయం చేయాలని కోరడంతో ఆ బరువు బాధ్యతలను నాన్న గారు తీసుకున్నారు. ఎండా కాలం పెళ్ళి అది. పల్లెలోని మా ఇంటి ముందు ఉన్న విశాల ఆవరణలో తాటాకులతో చలువ పందిరి వేయించారు. దీని కోసం ఓ బండెడు తాటాకులు తీసుకొచ్చారు. అవన్నీ ఇంటి ఆవరణలో ఓ మూల గుట్టగా పోశారు. వాటి మీద నీళ్లు జల్లారు. ఈ లోగా గుంజలు పాతారు. చూస్తుండగానే తాటాకు పందిరి తయారై పోతున్నది.
తాటాకుల నుంచి వచ్చిన అదో రకం వాసన పీలుస్తూ మేమంతా కొత్త అనుభూతికి లోనయ్యాం. తాటాకులతో బొమ్మలు చేయమని అమ్మ చుట్టూ గుమిగూడాము.
అమ్మేమో తాటాకులతో పెళ్ళి కొడుకు , పెళ్ళి కూతురు బొమ్మలు తయారు చేసి నాకొకటి, మా అక్కకొకటి ఇచ్చింది. ఈ పెళ్ళి జరిగే సమయానికి ఇంట్లో కరెంట్ వచ్చింది. కానీ ఇప్పట్లో లాగా ఇళ్లలో ట్యూబ్ లైట్స్ ఉండేవి కావు. మామూలు లైట్లే ఉండేవి. అవి కూడా ఒకటో రెండో ఉండేవి. రాత్రి పూట జీరో క్యాండిల్ బెడ్ లైట్ ఉండేది. `ఎక్కువ లైట్లు వెలిగిస్తే కరెంట్ బిల్లు పెరిగిపోతుంది, ఆపేయండిరా' అని మా బామ్మ అరుస్తుండేది. అలాంటప్పుడు ఉన్నట్లుండి తాటాకు పందిరికి పాతిన గుంజలకు ట్యూబ్ లైట్లు వెలిగాయి.
నాకైతే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. బోలెడు ఆశ్చర్యం. దాదాపుగా ప్రతి గుంజకీ ఒక ట్యూబ్ లైట్ బిగించారు. కొన్ని లైట్లకు ఎరుపు మరికొన్నింటికి పసుపు ఇంకొన్నిటికి ఆకు పచ్చ రంగుల్లోని పలచటి కాగితాలను చుట్టారు. దీంతో రకరకాల రంగుల్లో ట్యూబ్ లైట్లు వెలగ్గానే మా పిల్ల గ్యాంగ్ కేరింతలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. గుంజల మధ్య తిరుగుతూ రాత్రి పొద్దుపోయేదాకా ఆటలే ఆటలు. మర్నాడు పెళ్ళనగా ముందు రోజు రాత్రికే పందిరంతా మామిడి తోరణాలు కట్టేశారు. ఒక వైపున పెద్ద బల్ల వేశారు. దాని మీదనే పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు కూర్చుని పెళ్ళి చేసుకుంటారని తెలిసింది. `పెద్దయితే నీకు అలాగే పెళ్ళి చేస్తారులేరా' అంటూ నా ఫ్రెండ్ ఒకడు అన్నప్పుడు నాకు నేను హీరోగా ఫీలయ్యాను. అయితే అప్పుడు నా హీరోయిన్ ఎక్కడుందో తెలియదనుకోండి. ఇలాగే బల్లమీదనే పెళ్ళి చేసుకోవాలని మాత్రం గట్టిగా అనుకున్నాను. కానీ అలా జరగలేదు. గుంటూరు కృష్ణనగర్ బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో జరిగింది మా పెళ్ళి. మా ఊరి పెళ్ళి తంతు దగ్గరకే మళ్ళీ వెళదాం.. తీరని దుఃఖం : పెళ్ళి అవగానే అప్పగింతలన్నారు. పెళ్ళి కూతురు అత్తారింటికి వెళ్ళిపోతుందట. దీన్నే అప్పగింతలు అంటారని చెప్పారు. ఉన్నట్టుండి ఏడుపులు వినబడుతున్నాయి. మగవాళ్లు ఆడవారిని ఓదారుస్తున్నారు. ఇదంతా చూసి నాకూ దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీరు కారుతోంది. కానీ ఇంతకు మించిన దుఃఖం ఆ తర్వాత రెండో రోజున వచ్చింది. కళ్ల ముందు ఘోరం జరిగిపోయింది. ఉన్నట్టుండి పందిరి కోసం వేసిన తాటాకులు లాగేస్తున్నారు.. పందిరి పీకేస్తున్నారు. గుంజలు గుంజేస్తున్నారు. అప్పటి దాకా నన్ను మురిపించిన నా ప్రియమైన ట్యూబ్ లైట్లును నిర్దాక్షన్యంగా ఊడదీయడంతో నా ముఖంలో వెలుగు మాయమైంది. చూస్తుండగానే తాటాకులు, గుంజలు తాళ్ళు అన్నీ ఎడ్ల బండి ఎక్కేశాయి. అప్పటి దాకా కళకళ లాడిన ఆవరణ బోసిపోయింది. అప్పుడొచ్చింది, బోలెడు దుఃఖం. అమ్మ ఒక వైపు, బామ్మ మరో వైపు చేరి ఒకరేమో తల, మరొకరేమో వెన్ను నిమిరారు. మబ్బు చాటున సూరీడు : `మబ్బులు పట్టాయి. ఎప్పుడైనా వర్షం పడుతుందిరా, తడిసేవి ఏవైనా ఉంటే లోపల పెట్టేయ్..' అంటూ మా బామ్మ జీతగాడితో చెప్పడం చాలా సార్లే విన్నాను. మా బామ్మ తరచూ బయటకి వచ్చి సూర్యుడున్నాడా లేడా అని చూస్తుండేది. ఆమెకి ఇదో అలవాటనుకున్నాను. కానీ, సూర్య బింబం కనబడకపోతే ఆమె అన్నం తినదు. మిట్ట మధ్యాహ్నమైనా మబ్బుల్లో దాగిన సూర్యుడు కనబడక బామ్మ చిటికీ మాటికీ బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తుంటే మాకు బామ్మ మీద బోలెడు జాలి కలిగేది. ఆకాశం వైపు వేలు చూపిస్తూ - ఇదిగో బామ్మా సూర్యుడు ఇక్కడున్నాడంటూ అబద్ధం చెబుతుంటే, `ఎక్కడరా నాకు కనబడడే..' అంటూ `ఆకలి బామ్మ' ఆతురతగా చూసేది. మొత్తానికి సూర్యు బింబం చూశాకనే ముద్ద ముట్టేది. `మనకు అన్నం, నీళ్లు ఆ సూర్యభగవానుడే అందిస్తున్నాడ్రా' అని బామ్మ అంటుంటే నాకు ఆశ్చర్యమేసేది. సూర్యుడు వచ్చి అన్నం వండటం లేదు కదా, అలాగే బావిలోని నీరు తోడి ఇవ్వడం లేదు కదా. మరెందుకు బామ్మ ఇలా అంటుందో తెలిసేది కాదు. ఆ తర్వాత అప్పటి తరం వారి మాటల్లో ఎంతో విజ్ఞానం దాగి ఉన్నదన్న విషయం అర్థమైంది. పాఁతరలు - పల్లె సిరులు : అడవి రావులపాడులో ఇంటి ముందు ఆవరణలో రెండు పాఁతరలు ఉండేవి. పాఁతర్లలోనే జొన్నలు, కందులు వంటివి నిలవ చేసేవారు. పంట బాగా పండినప్పుడు ఇంట్లో బస్తాల్లోనే కాకుండా ఏడాది పొడవునా నిల్వ ఉండేందుకు ఈ పాతర్లలో ధాన్యం పోసేవారు. ఇదంతా పెద్ద ప్రక్రియ. అసలు పాఁతరని నిర్మించడంలో ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్నదని ఇప్పుడనిపిస్తోంది. భూమిలో పది నుంచి పదిహేను అడుగుల మేరకు గొయ్యి తవ్వుతారు. ఆ గొయ్యి గుండ్రంగా ఉండేటట్లు చూసుకుంటారు. ఆ తర్వాత లోపల రెండు మూడు వరసల్లో వరి గడ్డి తాళ్లతో చుడతారు. ఆ తర్వాత పాఁతరలో ధాన్యం పోస్తారు. అలా పోసిన ధాన్యం చెడిపోదు. ఇదీ దాని స్పెషాలటీ. రెండు పాఁతర్లు మాకుండేవని చెప్పాను కదా. అందులో ఒకటి జొన్నల పాతర అయితే మరొకటి కందుల పాఁతరన్న మాట. మా ప్రాంతంలో వరి ధాన్యం ఎక్కువగా పండదు. దాదాపు అన్నీ మెట్ట పొలాలే. వాణిజ్య పంటలపై మోజు పెరగడానికి ముందంతా సాంప్రదాయ పంటల వైపే రైతులు మొగ్గు చూపే వారు. పాఁతర్లలో ధాన్యం నింపడం ఓ యజ్జ్ఞంలా సాగేది. ఎడ్ల బండి మీద నేరుగా పొలం నుంచి ఇంటికి ధాన్యం బస్తాలు చేరేవి. వాటిని పని వాళ్లు వొడుపుగా దింపి అంతే నేర్పుగా బస్తాల మూతులు విప్పి ఆ ధాన్యాన్ని పాఁతరలో పోసేవారు. పాఁతర లోపలకు ఒకరిద్దరు మనుషులు దిగి ధాన్యం ఒక పద్ధతి ప్రకారం పాతరలో నిండేలా చూసేవారు. పెసల పంట కూడా బాగానే పండేది. ఒక్కోసారి పెసలు కూడా పాఁతర లాంటిది ఏర్పాటు చేసేవారు. మొత్తానికి పాఁతర్లలోకి ధాన్యం ఎక్కించడం, అదంతా చూస్తుంటే నా బోటి పిల్లలకు భలే సరదాగా ఉండేది. నేను కూడా పాఁతర్లోకి దూకేసి వాళ్లకు సాయం చేయాలనుకునే వాడ్ని. కానీ నా ప్రయత్నాలు ఒక్కటి..ఒక్కటంటే ఒక్క సారి ఫలించలేదు. పాఁతర దగ్గరకు వెళ్లకురా, జారి పడతావు..అంటూ బామ్మ హెచ్చరించేది. మొత్తానికి పాఁతర్లలోకి ధాన్యం నింపడమూ, మళ్ళీ పాఁతర తవ్వి ధాన్యం తీయడం ఇంటి ముందు ఓ పండుగ వాతావరణాన్ని సృష్టించేది. అయ్యగారింట పాఁతర తీస్తున్నారన్న వార్త తెలియగానే పొలంలో పనిచేసే వారి దగ్గర నుంచి ఇంత కాలంగా పద్దు రాసుకుంటూ సరుకులు ఇచ్చిన చిల్లర కొట్టు వారి వరకు అంతా ఇంటి ముందు గుమిగూడేవారు. ఆ రోజుల్లో డబ్బులు (నోట్లు) ఇవ్వడం కంటే ఇలా వస్తు రూపంలోనే బాకీలు, జీతాలు ఇచ్చేస్తుండేవారు. పాఁతర్లు ఏ ఇంట ఉంటాయే ఆ ఇంట ధన లక్ష్మి ఆనంద నాట్యం చేస్తుందనీ, పాఁతరలే పల్లె సిరులని మా అమ్మ అంటుండేది. పాఁతర తీస్తున్నప్పుడు వర్షం పడితే ధాన్యం తడిసిపోతుంది. అందుకే వానా కాలం ఆ పని చేయరు. ఎండా కాలమైనా మబ్బులు గిబ్బులు పట్టని రోజు ఎంచుకునే వారు. అయినా ఒక్కోసారి అకాల వర్షాలు పడుతుండేవి. అలాంటప్పుడు పాఁతర తీసి ఉంటే అందరి కళ్లలో ఆందోళన కనిపించేది. అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినా ధాన్యం తడవకుండా ఉండేందుకు పెద్ద పెద్ద పట్టాలు కప్పేవారు. ఆ హడావుడి అంతా ఇంతా కాదు. వాన తగ్గాక మళ్ళీ పాఁతరలోకి దిగేవారు. అందుకే వాన చుక్క రాలుతుండగానే మా బామ్మ జీతగాడిని హెచ్చరిస్తుండేది. అలా ఓసారి చుక్కలు చుక్కలుగా పడటం మొదలైన వాన ఏకబిగిన వారం రోజుల పాటు కురిసింది. దీన్ని ముసురు అంటారని బామ్మ చెప్పింది. తడిసిన బతుకులు: ముసురు పడితే మేము బయటకు వెళ్ళి ఆడుకోవడం చాలా కష్టం. బయటంతా బురద బురద. పెంకిటిల్లు కావడంతో అక్కడక్కడా పై కప్పు మీదున్న పెంకులు కదలడంతో వాన నీరు ఇంట్లో పడుతుండేది. తడిసి పోతే ఎందుకూ పనికి రావనే వాటిని జాగ్రత్త చేయడం వంటి పనులు చకచకా జరిగిపోవాలి. పొయ్యి క్రింద మంట కోసం పెట్టే ఎండిన పుల్లలు తడిస్తే ఆ రోజు స్నానాలకీ వంటకి ఇబ్బంది మరి. రాత్రి పడుకోవడానికి మంచాలు వాల్చడమూ ఇబ్బందే. వాన కురవకుండా ఉండే చోటని మాకు మంచాలు వేసినా ఏ అర్థరాత్రో వాన నీటి చుక్కలు ముఖం మీద పడి లేచే వాళ్లం. ఇలాంటి ఇబ్బందులు ఆ రోజుల్లో దాదాపు ప్రతి పల్లెలో ఉండేవి. వానలు - వరదలు గురించి చెబుతున్న నాకు ఇంకా ఎన్నో విషయాలు గుర్తుకు వస్తున్నాయి. మరి కొన్ని తర్వాత మీతో పంచుకుంటాను. వానలు వరదలతో మేము పడ్డ కష్టాలు నిజానికి కష్టాలే కావని నిత్యం నీటి మీద `తడిసిన బతుకులు' వెళ్లదీస్తున్న వారి (మత్స్య కారుల) కష్టాలతో పోల్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ ఆలోచనే ఒక ప్రముఖ దిన పత్రికలో ఆ తర్వాతకాలంలో వ్యాసం రాయడానికి దారి తీసింది. ------ ఫుట్ నోట్ .... చూ. 12 : క్లిక్ థర్డ్ కెమేరా: డిజిటల్ విధానంలో ఫోటోలు తీయడం తెలిసిన ఈ రోజు పిల్లలకు ఒకప్పుడు క్లిక్ థర్డ్ కెమేరాలు ఉండేవంటే నమ్మక పోవచ్చు.
1960- 70 దశకంలో ఈ కెమేరాదే హవా. నా క్లోజ్ ఫ్రెండ్ (విష్ణు) వద్ద ఆ రోజుల్లోనే ఇలాంటి కెమేరా ఉండేది. వాడికెందుకో ఫోటోలు తీయడమంటే బాగా ఇష్టం. ఈ కెమేరాలో రీల్ ఎక్కించడం ఓ ఆర్ట్ అనే వాడు. ఎక్కువ ఫిల్మ్ లు వేస్ట్ కాకుండా నేర్పుగా ఫిల్మ్ ని కెమేరాలో బంధించి మూత వేసేయాలి. ఫిల్మ్ కి సూర్యరశ్మి సోకితే ఇక అది ఎక్స్ పోజ్ అయిపోతుంది. డబ్బులు వేస్టే. కెమేరా గురించి చాలా విషయాలే అప్పట్లో చెప్పాడు. కానీ టెక్నాలజీ పట్ల ఏ మాత్రం ఆసక్తి లేని నా కు వాడి మాటలు అర్థం అయ్యేవి కావు. నా ఆలోచనలు వేరే రకంగా ఉండేవి. ఈ కెమేరాతో నాకు నచ్చిన ఫోటోలు తీయమనేవాడ్ని. పాపం వాడు తీసేవాడు. నందిగామ ఏరు పొంగినప్పుడు నా కోసం ఫోటోలు తీసింది వాడే. నీటి చుట్టూ తిరిగిన నా ఆలోచనలను నెమ్మదిగా నాటు పడవల వైపు మళ్ళిస్తాను. కదిలిస్తే పడవలు కూడా కథలు చెబుతాయి. (మళ్ళీ కలుద్దాం)

13, మే 2024, సోమవారం

7వ భాగం: భయం నీడలో..

భయం- నా చిన్నప్పుడు నిత్యం వెంటాడేది. భయం- రాత్రిళ్లు సరిగా నిద్రపోనిచ్చేది కాదు. భయం- రాత్రి వేళ ఆకాశం వైపు చూడనిచ్చేది కాదు. భయం - ఒంటరిగా నడవ నిచ్చేది కాదు. భయం, వయస్సుతో సంబంధం లేని ఫీలింగ్. మన మనసు వీక్ గా ఉంటే మన నీడే మనల్ని భయపెడుతుంటుంది. `ఏ తోడూ లేని నాడు నీ నీడే నీకు తోడు అని ఓ సినీ రచయిత అన్నాడు. కానీ, అలా తోడుగా వెన్నంటి వచ్చే నీడే ఒక్కోసారి మనల్ని భయపెట్టేస్తుంటుంది. ఏదో తెలియని శక్తి మనల్ని వెంబడిస్తున్నదన్న భావన. అలాంటప్పుడు వొళ్లంతా జలదరించడం మామూలే కదా. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు ఉండదేమో... నా జీవితంలో భయం చుట్టూ తిరిగిన సంఘటనలను గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మఱ్ఱి చెట్టు క్రింద శవం: పల్లె భయపడుతోంది. వారం రోజుల నుంచి రాత్రియిందంటే చాలు గజగజా వణికి పోతున్నది. దీనికి బలమైన కారణమే ఉంది. మఱ్ఱి చెట్టు క్రింద రాత్రి పూట పడుకున్న వ్యక్తి పొద్దుటికల్లా శవమై పడి ఉన్నాడు. ఈ చెట్టు ఊర్లోని దక్షిణ దిక్కున శ్మశానానికి వెళ్లే దారిలో ఉంది. ఈ మఱ్ఱి చెట్టు చుట్టూ భయంకరమైన కథలు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ శవం కథ అలాంటిదే.
ఇదంతా 60వ దశకంలోని మాట. మా ఊర్లో (అడవిరావులపాడులో) ఓ కుర్ర గ్యాంగ్ ఉండేది. ఈ గ్యాంగ్ కి పనేమీలేదు. పగలంతా ఈ మఱ్ఱి చెట్టు క్రిందనో, లేకుంటే దానికి పక్కనే ఉన్న వేప చెట్టు క్రిందనో కూర్చుని అష్టాచెమ్మా, పేకాట వంటి ఆటలు ఆడుకునే వారు. వారిలో ఒకరిద్దరికీ మందుకొట్టే అలవాటు కూడా ఉందని చెబుతుండేవారు. ఈ గ్యాంగ్ లోని ఓ కుర్రాడే మఱ్ఱి చెట్టు క్రింద శవమై కనిపించాడు. పట్టుమని పాతిక కొంపలు లేని ఊరుని ఈ సంఘటన కుదిపేసింది. ఎక్కడ ఇద్దరు తారసపడినా ఈ శవం కబుర్లే. సరిగా అలాంటప్పుడే మేము గుంటూరు నుంచి సెలవలు కదా అని ఈ ఊరు వచ్చాము. ఇరుక్కుపోయాము. ఆ రోజుల్లో పల్లెల్ని అనేక భయాలు చుట్టుముడుతుండేవి. ఆ భయాల్లో ప్రధానమైనది దెయ్యం భయం. తలచుకుంటేనే వెన్నులో వణకు పుడుతుంది. పట్టుమని పాతికేళ్లు లేని కుర్రాడు రాత్రి ఆ చెట్టు క్రింద పడుకోవడమేమిటీ, తెల్లారేసరికి శవమై పోవడం ఏమిటీ. ఇదే చర్చ. అందర్నీ కలచి వేసింది. ఏ రోగం లేదు, ఏ రొష్టు లేదు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాదు. కానీ పంతం , పందెం ఇతగాడి ప్రాణం తీసిందని ఊరి జనం అనుకుంటున్న మాట. రాత్రంతా మఱ్ఱి చెట్టు క్రింద పడుకుని వస్తాననీ పందెం కాశాడట ఈ అర్భకుడు. అలాగే పడుకున్నాడు. కానీ తిరిగి లేవలేదు. ఊపిరాడక చనిపోయాడనీ, దెయ్యం అతని పీక నులిమి చంపేసిందని చెప్పుకునేవారు. పల్లెలో భయాలు ఒక రకంగా ఉండేవి కావు. ఎండా కాలం వచ్చిందంటే ఆరు బయటనే పడుకునేవారు. అప్పట్లో చాలా పల్లెల్లో కరెంట్ లేదు. ఒక వేళ ఉన్నా ఇళ్లకి కరెంట్ పెట్టించుకున్న వారి సంఖ్య వేళ్లమీద లెక్కించ వచ్చు. వీధిలో లైట్లు కూడా సరిగా ఉండేవి కావు. ఏదో ప్రధాన వీధిలో ఒకటో రెండు వీధి లైట్లు వెలిగి ఆరుతుండేవి. పంచాయితీ రేడియో మాత్రం వినబడుతుండేది. అదే పెద్ద కాలక్షేపం. కానీ ఎంత సేపు, రాత్రి పూట `ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం' అనగానే పంచాయితీ రేడియో మూగబోయేది. ఆఫీస్ లైట్ ఆరిపోయేది. ఇక తర్వాత అంతా అంధకారమే.
నిశ్శబ్దం ఆవరించేది. అప్పుడప్పుడు వీధి కుక్కలు అరుస్తుండేవి. ఆ అరుపులు పగటి పూట అరుపుల్లా ఉండేవి కావు. ఏదో భయానక దృశ్యం చూశాక వణుకుతో అరిచినట్లు ఉండేవి. ఆ అరుపులకు కొట్టంలో కట్టేసిన ఆవులు కూడా భయంతో అదో రకంగా కాస్తంత శబ్దం చేసేవి. కీచురాళ్ల ధ్వనులు కూడా చాలా స్పష్టంగా వినిపించేవి. బయట మంచాలేసుకుని పడుకునే వారికి వెంటనే నిద్రపడితే సరి. లేకుంటే ఈ భయానక వాతావరణం వారికి ముచ్చెమటలు పట్టించేవి. మరీ నాబోటి పిల్లలకు.. ఆ రోజుల్లో అంటే 60వ దశకంనాటి రోజుల్లో చాలా మంది ఇళ్లలో నులక మంచాలు ఉండేవి.
వాటిని ఎక్కడి కావాలంటే అక్కడికి తేలిగ్గా మోసుకుని వెళ్లే వీలుండేది. ఎండాకాలం ఆ నులక మంచం మీద నీళ్లు జల్లితే మంచం చల్లబడేది. దీంతో అవి `ఏసీ మంచం'లా ఉండేవి. అప్పట్లో ఏసీ, నాన్ ఏసీ అన్న పదాలే నాకు తెలియవనుకోండి. వేసవి సెలవలప్పుడు మా ఊరు వెళితే సాయంత్రం చల్లబడగానే జీతగాడు బుంగలతో (చూ. 10) నీళ్లు తోడి ఇంటి ఆవరణలో నీళ్లు జల్లే వాడు. అప్పటి దాకా వేడెక్కిన మట్టి నేల ఈ బుంగల నీటితో చల్లబడేది. అప్పుడొచ్చే మట్టి వాసన పీలుస్తుంటే అదో రకం ఆనందమేసేది. జీతగాడు అలా నీళ్లు జల్లడం మేము ఆ తిడిసీ తడవని మట్టిలో పిచ్చిపిచ్చిగా ఎగరడం, వాడేమో కసురుకోవడం, మేమేమో అలగడం ప్రతి సాయంత్రం రిపీట్ అయ్యే సీన్. ఇళ్లలో కరెంట్ లేదు కనుక రాత్రి భోజనాలు చాలా త్వరగా అయిపోయేవి. సాయంత్రం ఆరున్నర, ఏడింటి కల్లా గుడ్డి దీపాల కాంతిలోనే భోజనాలు కానిచ్చి బయట వేసిన మంచాలెక్కి పడుకునే వాళ్లం. అప్పుడు మొదలయ్యేది అసలైన ఎంటర్టైన్మెంట్. ఆ తర్వాత భయంతో వణికే కథలు. నిద్ర వచ్చే వరకు జీతగాడో, పక్కింటి పిల్లలో వచ్చి కథలు, పాటలు పాడేవారు. మా పక్కింట్లో దాక్షాయణి అనే పది పన్నెండేళ్ల అమ్మాయి, పెద్ద నాపసానిలా కబుర్లు చెబుతుండేది. మధ్యమధ్యలో పాటలు పాడుతుండేది. అలా విన్న ఒక పాట... `శివుని మెడలో నాగరాజా, చిన్ని పార్వతి పిలిచెను దేవా దేవి పలుకు ఆలకించరా, శివ నాగరాజా, తల్లి పలుకు విన్నవించరా..' - అంటూ పాడేది. నాకు నాగరాజు అని ముద్దు పేరు ఉండేది. మా అమ్మ నన్ను కడుపుతో ఉన్నప్పుడు ఆమెకి కలలో పాములు కనిపిస్తుండేవట. దీంతో అబ్బాయి పుడితే నాగరాజు అని పిలుచుకుంటామని మొక్కుకుందట. అలాగే చేసింది. అప్పటి నుంచి నాగరాజు అనే చాలా మంది నన్ను పిలుస్తుంటారు. ఇప్పటికీ అంతే. మా ఊర్లోని బంధువులు, మిత్రులు నన్ను నాగరాజు అనే పిలుస్తుంటారు. దాక్షాయణి ఈ పాట పాడుతుంటే నన్ను ఎగతాళి చేయడానికే నా పేరు కలిపేస్తూ పాడుతున్నదని అనుకునేవాడ్ని. నిజానికి ఈ పాట నాగుల చవితి పండుగ నాడు పాడుకునేదని ఆ తర్వాత తెలిసిందనుకోండి. రాత్రి పూట పాటలే కాదు ఊర్లోని వింత వింత కబుర్లు కూడా దొర్లుతుండేవి. అలాంటప్పుడే మమ్మల్ని భయపెట్టడానికా అన్నట్లు దెయ్యం కబుర్లు చెప్పేవాళ్లు. నేనైతే తెగ భయపడేవాడ్ని. మఱ్ఱి చెట్టు, దెయ్యాల దిబ్బ, శ్మశానం, ఊరి ఉమ్మడి బావిలో శవం..వంటి పదాలు విన్నప్పుడల్లా వణకుపుట్టేది. అన్నం సయించేది కాదు. మా బామ్మ మాత్రం ధైర్యం చెప్పేది. `ఇవన్నీ నమ్మవద్దురా. ఉత్తిత్తి కబుర్లే సుమీ' అని అంటుండేది. మా అమ్మ మాత్రం ఆ రెండు చెట్లున్న వైపు వెళ్లకండి అంటూ హుకుం జారీ చేసేది. బామ్మకున్నంత ధైర్యం ఉండేది కాదు అమ్మకి. ఫలానా వారింటికి వెళ్లకండి, ఫలానా వీధిలో ఆడుకోకండి..అంటూ ఆంక్షలు పెట్టేది. ఊర్లో మంత్ర తంత్రాలు తెలిసిన ఒకాయన ఉండేవాడు. ఆయన ఇంటి ఛాయలకు కూడా అమ్మ వెళ్ళనిచ్చేది కాదు. చాతబడి అన్న మాట అప్పుడే విన్నాను. వెంట్రుకలు, గోళ్లు ఎక్కడబడితే అక్కడ పడేస్తే వాటిని ఏరుకెళ్ళి చేతబడి చేస్తారట. అప్పుడేమో మనకు బోలెడు కష్టాలొస్తాయట. ఇలా ఊర్లోని మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్లు. నేను నమ్మే వాణ్ణి. మా బామ్మ కూడా అప్పుడప్పుడు భయపడుతుండేది. ఆమె భయం తనకేదో అవుతుందని కాదట, మాకు ఏమైనా జరుగుతుందేమో అనేనట. అందుకే అప్పుడుప్పుడు కసురుకునేది. ఎందుకు కసురుకునేదో ఆ చిన్న వయసులో మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత యండమూరి `దయ' వల్ల చాతబడి, కాష్మోరా వంటి క్షుద్ర విద్యలున్నాయని తెలుసుకుని వాటి గురించి చదువుతూ భయపడేవాళ్లం. చదవడం ఎందుకూ భయపడటం ఎందుకూ అని ఎవరైనా అన్నా, ఆ రకం కథలు మమ్మల్ని అటువైపు లాక్కునేవి. మఱ్ఱి చెట్టు - శవం పుకార్లలోని లాజిక్ ఆ తర్వాత చాలా కాలానికి గాని తెలియలేదు. ఆకాశంలో శవ యాత్ర: అర్థరాత్రి వేళ ఆకాశంలో ఓ నలుగురు వ్యక్తులు నులక మంచం మీద శవాన్ని పడుకోబెట్టి మోసుకుపోతుంటారు. ఆ వింత దృశ్యం ఆకాశంలో కదులుతుంటుంది. ఎవరైనా చూశారో రక్తం కక్కుకుని చస్తారు.
ఈ తరహా పుకారొకటి నా చిన్నప్పుడు బాగా వ్యాపించింది. పల్లెటూర్లలో ఎండాకాలం వచ్చిందంటే ఆరుబయట మంచాలు వేసుకుని హాయిగా పడుకునే వారికి ఈ పుకారు వెన్నులో వణుకు పుట్టించేది. మేమప్పుడు పిల్లలం కదా, రాత్రి పూట బయట పడుకోవాలంటే హడలు. అలా అని ఇంట్లో పడుకోలేము. ఎందుకంటే ఆ రోజుల్లో పల్లెల్లోని చాలా ఇళ్లలో కనీసం కరెంట్ ఉండేది కాదు. లోపల ఇంకా చీకటి. ఒక్కోసారి గాలి స్తంభించేది. అలాంటప్పుడు మా బామ్మమో చేతిలో విసిన కర్రతో మాకు విసురుతుండేది. అది కాసేపే. ఆమె చెయ్యి నొప్పి పుట్టడం చేతనో, లేదా నిద్రలోకి జారుకోవడం వల్లనో విసిన కర్ర ఊగడం ఆగిపోయేది. ఆ రోజుల్లో మాకైతే ఫ్యాన్లు ఉంటాయన్న సంగతి తెలియదు. భయం చుట్టూ తిరిగే పుకార్లు ఒక ఊరు నుంచి మరొ ఊరికి పాకిపోతుండేవి. ఇంచుమించు ఒకే మోస్తరు కథలు వినబడుతుండేవి. ఈ విషయంలో పట్టణాలు, పల్లెలు అన్న తేడా ఉండేది కాదు. అలాంటిదే రాత్రి వేళ ఆకాశంలో శవ యాత్ర భయం. ఆ రోజుల్లో ఇప్పటిలా అపార్ట్ మెంట్ కల్చర్ లేదు. ఎటాచ్డ్ బాత్ రూమ్స్ చాలా మంది ఇళ్లలో ఉండేవి కావు. ఇళ్లు కూడా పెద్దవిగా ఉండేవి. ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ. ఈ ఆవరణలో ఒక మూల స్నానాల గది ఉండేది. 60వ దశకంలో చాలా ఇళ్ళలో టాయిలెట్ సౌకర్యం ఇంటి ఆవరణలోనే ఉండేది కాదు. మరీ పల్లెల్లో అయితే ఊరి చివర్లో కొన్ని ప్రత్యేక ప్రాంతాలను టాయిలెట్ కోసం ఉపయోగించేవారు. వీటిని బహిర్భూమి అని పిలిచేవారని నాకు గుర్తు. ఆడవారికీ, మగవారికీ వేరువేరుగా ఈ టాయిలెట్ ప్రాంతాలు ఉండేవి. మా ఊర్లో వాగు పక్కన ఈ అవసరాలు తీర్చుకునేవారు. వాగు కూడా అప్పుడప్పుడు పొంగుతుండేది. తుపాన్లు వచ్చినప్పుడు వరదొచ్చి వాగు పొంగి ఊర్లోకి నీళ్లు వచ్చేస్తుండేవి. అలాంటప్పుడు ఊరికీ సమీపాన ఉన్న పట్టణానికీ సంబంధాలు తెగిపోయేవి. మా సెలవలు అయిపోవస్తున్నా, వాగు పొంగడం వల్ల వెంటనే వెళ్లలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద ఇళ్లలో రాత్రి పూట మూత్ర విసర్జనకు పోవాలంటే ఏదో ఒక మూలకు పోవాలి. అసలే భయాలు. అందునా రాత్రి వేళ. నిద్ర మధ్యలో లేచి ఆ పని పూర్తి చేసుకోవాలంటే అదో పెద్ద సాహసకృత్యమే. దినదిన గండమే. పోనీ పక్కన పడుకున్న వారిని లేపుదామా అంటే ఒక పట్టాన లేవరాయె. మనకి తొందరాయె. ఇలాంటి నరకయాతన సంఘటనలు అప్పట్లో చాలా ఇళ్లలో జరుగుతూనే ఉండేవి. నిద్ర మధ్యలో లేచినప్పుడు ఆకాశం వైపు చూడాలంటే భయం. కానీ చూడకుండా ఉండలేము. పైకి చూస్తే ఏదో మేఘాలు కదులుతున్నట్లు అనిపించేవి. చిత్ర విచిత్ర ఆకారాల్లో మేఘాలు కదులుతుండేవి. వాటిలో కొన్ని స్థిరంగా ఉంటే, మరి కొన్ని చకచకా పరిగెడుతుండేవి. అలాంటి మేఘాల్లో ఒక్కోసారి పుకార్లలో చెప్పినట్లే ఒక శవం, దాన్ని నలుగురు మోస్తున్నట్లు కూడా కనిపిస్తుండేవి. నాకు అలా కనిపించలేదు కానీ, కొంతమందికైతే ఆకాశంలో శవయాత్ర కనిపించిందట. రక్తం కక్కుకుని చస్తామన్న భయం వారిని చాలా కాలం వెంటాడేది. ఇలాంటి సంఘటనలను తెల్లారాక కథలు కథలు గా చెప్పేవారు. ఫలానా ఊర్లోని వారు ఆకాశంలో ఇలాంటి వింత చూశారనీ, వారిలో చాలా మంది వింత వింత జబ్బులతో మరణించారనీ కూడా చెప్పుకునే వారు. ఇవన్నీ వింటూ నాబోటి బక్క ప్రాణులు భయంతో వణికిపోవడాలు ఆ రోజుల్లో మామూలే. ఓ స్త్రీ రేపు రా.. మరో పుకారు కూడా ఆరోజుల్లో బాగానే భయపెట్టేది. రాత్రి వేళ , మరీ ముఖ్యంగా అమావాస్య రోజున అర్థరాత్రి వేళలో జుట్టంతా విరబోసుకున్న ఓ స్త్రీ వీధుల్లో తిరుగుతుండేదట. ఎవరింట్లోనైనా దీపాలు వెలుగుతుంటేనో లేదా మాటలో వినబడుతుంటేనో ఆ ఇంట్లోకి వింత ఆకారం దూరి చంపేస్తుందట. అది కచ్చితంగా ఆడ దెయ్యమేనని చెప్పేవారు. ఈ భయంతోనే రాత్రి కాగానే పల్లె మౌనం దాల్చేది. ఎవరికి వారు తలుపులు బిడాయించుకుని పడుకునే వారు. నిద్రపట్టకపోయినా పడుకున్నట్లు నటించేవారు. అలాంటి వాళ్లు తెల్లారాక రకరకాల కథలు చెప్పేవాళ్లు. అర్థరాత్రి వేళ గజ్జెల శబ్దం వినిపించిందనీ, ఆ శబ్దం తన ఇంటి దాకా వచ్చిందని, ఎవరో తలుపు తట్టినట్లు అనిపించిందనీ చెప్పేవారు. ఈ దెయ్యం స్త్రీ మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇంటి తలుపు మీదనో లేదా గోడమీదనో `ఓ స్త్రీ రేపు రా..' అని వ్రాయాలని చెప్పేవారు.
దెయ్యం స్త్రీ ఒక వేళ తమ ఇంటికి వచ్చినా ఆ వాక్యం చదువుకుని వెనక్కి తిరిగి వెళ్ళి పోయేదట. ఇదో మూఢ నమ్మకం అని తర్వాత తెలిసింది. ఒక వేళ ఆ దెయ్యం స్త్రీ కి చదువు రాకపోతే ఆ వాక్యం ఎలా చదువుతుందని ఓ ఫ్రెండ్ అడ్డంగా వాదించేవాడు. నాకూ అలాంటి ఆలోచనే వచ్చినా, పైకి చెప్పేవాడ్ని కాదు. అప్పట్లో భయపడటమొక్కటే తెలుసు. ఆ తర్వాత వెన్ను ముదిరాక, భయం తగ్గింది. అంతే కాదు, భయపడటానికి విరుగుడు భయపెట్టడమే అని తెలుసుకున్నాను. ఆ క్రమంలోనే దెయ్యం కథలు, నవలలు చదవడం, సినిమాలు చూడటం నేర్చుకున్నాను. దెయ్యం సినిమా వచ్చిందంటే చాలు చూడాలనుకునే వాడ్ని. భయం పోవాలంటే బాగా భయపెట్టే సినిమాలు చూడాలన్నది నా సిద్ధాంతం. అయితే అదంత తేలిక కాదు. భయంతో వణికిపోతూనే దెయ్యం సినిమాలు చూసేవాడ్ని. ఆ తర్వాత ఇతరుల్ని భయపెట్టడానికి కథలు అల్లేవాడ్ని. పీజీ చేశాక కొన్నాళ్లు వైజాగ్ లో ఉన్నాను. అప్పుడు మా చిన్న మామయ్య గారి పిల్లల్ని, వాళ్ళ ప్రెండ్స్ ని అప్పుడప్పుడు ఇలాంటి దెయ్యం కథలు చెప్పి భయపెట్టేవాడ్ని. కథ చెప్పేటప్పుడు నాటకీయత ఎక్కువగా జోడించడం వల్ల పిల్లలు భయపడేవాళ్లు. ఈ లక్షణం ఇప్పటికీ ఉంది. భయపెట్టడం ఓ సరదా. అలా అని నాకు భయం అంటే తెలియదనుకోకండి. నేను భయస్తుడిని. గోడ మీద బల్లిని చూస్తే భయం. చీకటి అంటే భయం. కానీ భయానికి దెయ్యం కథలు వినేవారు దొరికితే మాత్రం నేనేదో గొప్ప ధైర్యస్థుడిలా ఫోజు పెడుతుంటాను. ఇది సీక్రెట్. అయ్యో మీకిప్పుడు చెప్పేశానే. ఆమె ఎవరు ? సినిమా వాళ్లు బహు చమత్కారులు. సీన్ కి తగ్గట్టుగా ప్రాపర్టీస్ భలేగా సిద్దం చేస్తుంటారు. భయపెట్టే సినిమా తీసేటప్పుడు వాళ్లంతా ఒకే మూసలో తీస్తుంటారు. ఉదాహరణకు దెయ్యం సినిమాలే తీసుకోండి. అప్పటికీ ఇప్పటికీ ఒకే తరహాలో భయపెట్టాలని చూస్తుంటారు. చాలా కాలం వరకు దెయ్యం అంటే ఆడ దెయ్యాన్నే చూపించే వారు. ఇది పక్కా నో డౌట్. దెయ్యం అంటే తెల్ల చీర కట్టుకుని, జుట్టు విరబూసుకుని కనిపించాల్సిందే. ఇది కూడా పక్కా. రాత్రి వేళ దెయ్యం ఊరికే తిరిగితే మజా ఏముంటుందనుకుంటారేమో ఈ సినిమా వాళ్లు. అందుకే, ఓ పాట పెడతారు. ఆ పాట మొత్తం ఒకే సారి రాదు. కథను సాగదీస్తూ మధ్యమధ్యలో ఈ పాట ముక్కలు ముక్కలుగా వస్తుంటుంది. చివరకు ఎప్పుడో క్లైమాక్స్ కి ముందు ఎండ్ అవుతుంటుంది. ఆమె ఎవరు? అంతస్థులు, జగమే మాయ వంటి సినిమాలు నన్ను బాగా భయపెట్టాయి. ఆ రోజుల్లో ఆడవాళ్లు ఎక్కువగా చీరలే కట్టుకునే వాళ్లు. చీరల్లో ఎన్నో రంగులుండేవి. కానీ దెయ్యానికి మాత్రం ఎందుకో తెలియదు కానీ, తెల్ల చీర అంటే బాగా ఇష్టమనుకుంటా. అందుకే ఏ దెయ్యం సినిమా చూసినా సదరు దెయ్యం గారు తెల్ల చీర కట్టుకోవాల్సిందే, జుట్టు విరబూసుకోవాల్సిందే. ఒక్కో సారి వెలిగే కొవ్వొత్తిని చేతిలో పట్టుకుని దెయ్యం తిరుగుతుంటుంది. కాగడాలు, నిప్పు కట్టెలు పట్టుకుని తిరిగే దెయ్యాలను నా చిన్నప్పుడు మా ఊర్లో `కొరివి దెయ్యాల'ని పిలిచే వాళ్లు. కొరివి దెయ్యాలు శ్మశానాల్లో తిరుగుతుంటాయట. వాటిని చూస్తే కాటి కాపర్లంతటి `ధీరులే' భయపడేవారట. ఇలాంటి కబుర్లు ఆ రోజుల్లో వినబడుతుండేవి. సినిమాల్లో తొలి తరం దెయ్యాలు తెల్లచీర కట్టుకున్నా ఆ తర్వాత డైరెక్టర్లు కొంత మార్పు తీసుకొచ్చారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల హవా జరుగుతున్న రోజుల్లో చీకట్లో స్పష్టంగా కనబడాలంటే తెలుపు రంగు చీరైతే ఎక్కువగా భయపెట్ట వచ్చని దర్శకులు భావించి ఉంటారు. అంతే కాదు, చేతిలో కొవ్వొత్తి వెలుగు మిణుకుమిణుకు మని వెలుగుతుంటే భయం అన్నది కెమేరాకి ఎక్కువ పట్టేస్తుందని అనుకునేవారేమో. కలర్ సినిమాలు వచ్చాక దెయ్యాల రూపురేఖలు మారిపోయాయి. పైగా సమాజంలో చీరల కట్టుకునే ఆడవారి శాతం బాగా తగ్గిపోతున్నప్పుడు దెయ్యాలు ఇంకా చీరలే కట్టుకోవడం నాకెందుకో ఇప్పటికీ నచ్చదు. దెయ్యాల సినిమాల దర్శకుల సంగతి ప్రస్తావించాను కనుక, విజయ నిర్మల గురించి చెప్పుకోవాలి. విజయ నిర్మల దేవుడే గెలిచాడు అన్న సినిమాకి డైరెక్ట్ చేసింది. ఇందులో ఆమె అప్పటి వరకు దెయ్యాన్ని చూపే తంతుకు భిన్నంగా దెయ్యాన్ని చూపించింది. ఈ సినిమాలో దెయ్యం ఒక జ్యోతిలా కనబడుతుందే తప్ప, మానవ శరీరంలా కనబడదు. నాకు గుర్తున్నంత వరకు ఇలాగే ఉంటుందీ ఈ సినిమాలో. ఈ సినిమా ఇప్పుడు చూద్దామంటే అందుబాటులో లేదు. ఇది చదువుతున్న వారు ఎవరైనా ఈ సినిమా తాలూకు లింక్ పంపితే చూసి మరో సారి భయపడటానికి ప్రయత్నిస్తాను. జగమే మాయ : నేను కాలేజీ చదువులతో బిజీగా ఉన్న రోజుల్లో (ఉత్తినే బిజీ అనేశా. నిజానికి వారానికి ఓ సినిమా చూసిన జాలీ రోజులవి) జగమే మాయ అన్న సినిమా ఓ టూరింగ్ టాకిస్ లో చూశాను. ఈ టాకిస్ ని మా ఊరికి చివర్లో ఏర్పాటు చేశారు. నేషనల్ హైవేకి ఓ పక్కగా ఉండేది. జగమే మాయ సినిమా రెండో ఆటకి చూద్దామని మా ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు. సరే నేనూ బయలుదేరాను. రెండో ఆట (సెకండ్ షో) రాత్రి పది గంటలకు మొదలయ్యేది. ఇప్పట్లో లాగా టైమ్ అంటే టైమ్ కి షోలు మొదలు కావు. జనం తక్కువగా ఉంటే - `మరో అరగంట చూద్దాం, ఇంకో నాలుగు పాటలు గొట్టం మైక్ లో వినిపించ్రా' అని మేనేజర్ అంటుండేవాడు. సినిమా హాల్ పైన మైక్ గొట్టం తగిలించేవారు. గ్రామ్ ఫోన్ రికార్డ్ లతో పాటలు వినిపించేవారు. హాల్లో జన సాంధ్రతను మేనేజర్ పరికించి ఓ అరగంట అటో ఇటో షో టైమ్ ని జరుపుతుండే వాడు. జగమే మాయ దెయ్యం సినిమా అని నాకు తెలియదు. ఫ్రెండ్ ఛలో అంటే నేనూ ఛలో అనేశాను. ఆ సినిమాలో ఇప్పటికీ ఓ సీన్ నాకు బాగా గుర్తు. రాత్రి పూట కారు రయ్యిన పోతున్నది. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కి అనుమానం వచ్చింది. ఎవరో వెనక సీట్లో ఉన్నారనిపించింది. అప్పటి వరకు ఖాళీగా ఉన్న వెనుక సీట్లో ఎవరో కదులుతున్న శబ్దం. కారు పక్కకు తీసి ఆపాడు. వెనక్కి చూశాడు. అంతే... (భయంకరమైన మ్యూజిక్) ఆ భయంకర ఆకారం చూసి నాకు గుండె ఆగినంత పనైంది. అలాంటి సినిమా చూడటం ఒక ఎత్తైతే చూశాక చిమ్మ చీకట్లో నడుచుకుంటూ ఇళ్లకు చేరడం మరో ఎత్తు. పేరుకు నేషనల్ హైవేనే కానీ, అప్పుడప్పుడు వెళుతుండే బస్సు, లారీల హెడ్ లైట్ వెలుతురు తప్ప ఏ రకమైన వెలుతురు లేదు. ఎవరో వెనక ఫాలో అవుతున్నారన్న భయం నన్ను ఆవహించింది. దీంతో పరుగో పరుగు. ఎలాగో ఇంటికి చేరాను. విషయం తెలుసుకున్న ఇంట్లో పెద్దోళ్లు పాపం ఏమీ అనలేక నా క్షేమం కోసం ఆంజనీయ దండకం చదివారు. పాతాళ భైరవి : భయం చుట్టూ ఆలోచనలు సాగుతున్నాయి కనుక పాతాళ భైరవి గురించి చెప్పకపోతే అసంతృప్తిగా ఉంటుంది. 1950ల్లో వచ్చిన విజయా వారి పాతాళ భైరవి సినిమాని సెకండ్ రిలీజో ఆ తర్వాత రిలీజో అయినప్పుడు, గుంటూరులో చూశాను. అప్పట్లో హిట్ అయిన సినిమాలను అడపదడపా రిలీజ్ చేస్తుండేవారు. మంచి సినిమాలు ఎన్ని సార్లు రిలీజ్ చేసినా జనం టిక్కెట్ల కోసం కొట్టుకునే వాళ్లు. ఇప్పటిలా యుట్యూబ్ లోనో టివీల్లోనో పాత సినిమాలు ఇంట్లో కూర్చునే హాయిగా చూసే అవకాశం అప్పట్లో లేదు కనుక సినిమా చూడాలంటే హాల్ కి వెళ్ళాల్సిందే. టికెట్ కొనుక్కోవాల్సిందే. ఆ రోజుల్లో టికెట్ ని ముందుగానే రిజర్వేషన్ చేసుకునే అవకాశం సిటీస్ లో ఉందేమో గానీ చాలా చోట్ల లేదనే గుర్తు. టికెట్ బుకింగ్ కౌంటర్ల దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఉండేవి. చిత్రమేమంటే బుకింగ్ తెరిచే దాకా బుద్దిగానే క్యూలో నిలబడ్డవారు కాస్తా, బుకింగ్ తెరిచినట్లు లైట్ వెలగ్గానే ఇక చూసుకోండి, హడావుడి మొదలవుతుంది. అది చివరకు తోపులాటకు దారి తీస్తుండేది. ఒకరి మీద మరొకరు ఎక్కేసేవారు. నేల టికెట్, బెంచీ టికెట్ దగ్గర ఈ తోపులాటలు ఎక్కువగా జరుగుతుండేవి. పైగా హీరోల పట్ల ఉండే వీరాభిమానం ప్రేక్షకుల చేత వీర విన్యాసాలు చేయిస్తుండేది. కుర్చీ, రిజర్వ్ కౌంటర్లు కాస్తంత మెరుగ్గా ఉండేవి. ఇక్కడ క్యూలైన్ తక్కువగా ఉండేవి. పైగా వచ్చేవారంతా క్లాస్ పీపుల్ కాబట్టి హుందాగా ఉండేవారు. అయినా చేంతాడంత క్యూ ఉండటంతో అందరికీ టికెట్ దొరకుతాయన్న గ్యారెంటీ లేకపోవడంతో క్యూ డిగ్నిటీ గాడి తప్పేది. నేల, బెంచీ టికెట్ ధరలు నా చిన్నప్పుడు పావలా, 40 పైసలు ఉండేవి. రిజర్వ్ టికెట్ ధరలు రూపాయి వరకు ఉండేవి. నేల టికెట్ల అమ్మకానికి ఓ రూలంటూ ఉండేది కాదు. లోపల కిటకిటలాడుతున్నా, ప్రేక్షకులు ఇరుకిరుగ్గా కూర్చున్నా ఇంకా టికెట్లు ఇస్తుండేవారు. `నేల ఈనిందంటే ఇదేరా' అని మా ఫ్రెండ్ కామెంట్ చేస్తుండేవాడు. నేల , బెంచీ క్లాస్ ల వరకు తప్పని సరిగా మొగవారికీ, ఆడవారికి మధ్య చెక్కలతో చేసిన అడ్డు గోడలుండేవి.
సరే ఆనాటి సినిమా హాళ్ల గురించి మరిన్ని విషయాలు తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి పాతాళ భైరవి సినిమా సంఘటన దగ్గరకు వెళదాం. గుంటూరులో పాతాళభైరవి సినిమా చూసి చాలా భయపడ్డాను. నాకు ఊహ తెలిసిన తర్వాత నన్ను బాగా భయపెట్టిన తొలి సినిమా ఇదే. దెయ్యం సినిమాలైనా, మంత్ర తంత్రాలున్న సినిమాలైనా సీన్ చూస్తుండటం కంటే ఆ టైమ్ లో వచ్చే మ్యూజిక్ నన్ను బాగా భయపెట్టేసేది. పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడు ఎస్వీ రంగారావు సీన్లోకి వచ్చినప్పుడల్లా గుండె దడదడ లాడేది. అలాంటి సీన్లు వచ్చినప్పుడల్లా కళ్లు మూసేసుకుని, చెవులను రెండు చేతులతో కప్పేసుకుని సీట్ లో ఓ మూలగా కూర్చోవడం అలవాటైంది. అలా పాతాళభైరవి చూస్తుంటే ఇంటర్వెల్ తర్వాత అనుకుంటా, మధ్యలో కరెంట్ పోయింది. సినిమా ఆగిపోయింది. అప్పట్లో కరెంట్ ఆగిపోతే కొన్ని థియేటర్లకు జనరేటర్ సౌకర్యం ఉండేది కాదు. మళ్లీ కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పట్లో చాలా థియేటర్లలో సినిమాలు సింగిల్ ప్రొజెక్టర్ తో నడిచేవి. దీంతో ఇంటర్వెల్ కి ముందు ఒక సారి, అలాగే ఇంటర్వెల్ తరువాత మరో సారి కూడా షో ఆగిపోతుండేది. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దామని ఓ సారి మా ఫ్రెండ్ గాడిని వెంటేసుకుని ప్రొజెక్టర్ రూమ్ కి వెళ్ళాము. అక్కడుండే ఆపరేటర్ అడిగితే , మొదట్లో విసుక్కున్నా ఆ తర్వాత అసలు విషయం చెప్పాడు. సినిమా మొత్తం నాలుగు చక్రాల్లో చుట్టిన రీలు చుట్టలతో థియేటర్ కి చేరేవి. సింగిల్ ప్రొజెక్టర్ ఉన్నప్పుడు ఒక రీల్ చుట్ట అయిపోగానే దాన్ని తీసి మరొక రీల్ ప్రొజెక్టర్ లో అతి నేర్పుగా అమర్చాలి. ఈ పని పూర్తి కావడానికి ఓ ఐదారు నిమిషాలు పడుతుంది. డబుల్ ప్రొజెక్టర్ ఉంటే ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక దాంట్లో రీల్ అయిపోగానే రెండోది అందుకుంటుందన్నమాట. అందుకన్న మాట సింగిల్ ప్రొజెక్టర్ ఉన్నప్పుడు ఇంటర్వెల్ ముందొకసారి,ఇంటర్వెల్ తర్వాత మరోసారి అదనపు బ్రేక్ లు ఇవ్వాల్సి వచ్చేది. అలా సింగిల్ ప్రొజెక్టర్ ని దగ్గరగా చూడగలిగాను.
చాలా పెద్దయ్యాక యుకె వెళ్ళినప్పుడు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓ సినిమా హాల్ లో (చూ. 11) బాహుబలి -2 సినిమా చూశాను. థియోటర్ వాళ్లు అలనాటి ప్రొజెక్టర్ ని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. దాన్ని ఎగ్జిబిట్ గా పెట్టారు. అక్కడో ఫోటో దిగినప్పుడు నా చిన్నప్పుడు చూసిన సింగిల్ ప్రొజెక్టర్ , ఆ నాటి సంఘటనలు గుర్తుకొచ్చాయి. సరే, పాతాళభైరవి సినిమా ఇంటర్వెల్ తర్వాత కరెంట్ లేకపోవడంతో బొమ్మ ఆగిపోయింది. కరెంట్ చాలా సేపటి వరకు రాలేదు. హాళ్లో జనం ఈలలు, కేకలు వేసినా ఏం లాభం లేకపోయింది. ఉక్కబోతతో జనం బయటకు వచ్చేస్తున్నారు. ఓ గంట గడిచింది. అప్పుడొచ్చింది కరెంట్. అప్పటికే సెకండ్ షో చూడటం కోసం జనం వచ్చేస్తున్నారు. సినిమా రెండోసారో మూడో సారో రిలీజ్ అయింది కనుక మొదటి షోకి కూడా జనం పలచగానే ఉన్నారు. దీంతో సెకండ్ షోకి వచ్చిన జనాలకు కూడా టికెట్లు ఇచ్చేసి మొదటి నుంచీ ఆట చూపిస్తామని చెప్పారు. ఆ రోజుల్లో కొన్ని హాళ్లకు జనరేటర్ ఉండేది. కొన్నింటికి ఉండేది కాదు. ఒక వేళ జనరేటర్ ఉన్నా తరచుగా పనిచేయడం మొండికేస్తుండేది. నా పాతాళ భైరవి సినిమాకు ఏదో అలాంటి ఇబ్బందే వచ్చినట్లుంది. కరెంట్ వచ్చేసింది కనుక సెకండ్ షో వాళ్లనూ లోపలకి తోలేయడంతో వారి మధ్య కూర్చుని నేను మళ్ళీ మొదటి నుంచి ఆట చూశాను. టైటిల్స్ పడ్డాయి. రాజకుమార్తె తోట రాముడి ప్రేమలో పడింది. ఆ తర్వాత మాంత్రికుడు తెర మీదకు వచ్చేశాడు. మ్యూజిక్ భయపెట్టేస్తుందనే అనుకున్నా. కానీ ఈ సారి అలవాటైపోయింది. భయపడలేదు. చాలా రిలాక్సెడ్ గా చూశాను. అప్పుడనిపించింది, భయం అన్నది విషయం తెలియనంత వరకే ఉంటుంది. లాజిక్ తెలిస్తే భయం గాయబ్. ఈ సూత్రం జీవితమంతా గుర్తు పెట్టుకోవాలని అనుకున్నాను. దెయ్యాలను పిలిచే బోర్డ్ Ouija: ఒంట్లో భయం తగ్గి హేతువు కనుక్కునే రోజుల్లోనే దెయ్యాలను పిలిచే బోర్డ్ గురించి తెలిసింది. మనకు బాగా కావలసిన వాళ్లు చనిపోతే వాళ్ల ఆత్మలు మన చుట్టూనే అంటే మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయట. మన మంచి కోరే ఆత్మలను పిలిచినా అవి మనల్ని ఏమీ చేయవనీ అలా పిలవడానికి ఓ సింపుల్ టెక్నిక్ ఉందని ఓ ప్రెండ్ చెప్పాడు. వాడి కబుర్లు చాలా ఆసక్తిగా విన్న నేను మరో ఫ్రెండ్ సాయం తీసుకుని దెయ్యాలను పిలిచి వాటితో మాట్లాడే బోర్డ్ ఒకటి తయారు చేశాము. ఆ బోర్డుని Ouija అంటారనీ, దాని చుట్టూ బోలెడు పరిశోధనలు జరిగాయని అప్పట్లో నాకు తెలియదు. ఈ బోర్డుని బయట నుంచి కొనుక్కోవచ్చు. లేదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అసలు ఈ బోర్డు ఎందుకని వాడ్ని అడిగాను. అప్పుడు వాడు చాలా తెలివైన వాడిగా ఫోజు పెట్టి చాలా సంగతులు చెప్పేశాడు.
`ఒరేయ్, దెయ్యాలు మాట్లాడవురా, అలాగే అవి సినిమాల్లో చూపించినట్లు గా కనబడవు. అసలు వాటికి శరీరం ఉండదు. శరీరమే లేకపోతే తెల్లటి చీర కట్టుకోవడం, చేతిలో కొవ్వొత్తి పట్టుకోవడం ఎలా సాధ్యమవుతుందిరా. ఆలోచించు. సినిమా వాళ్లు చూపించేదంటా ట్రాష్. నిజం ఏమిటంటే దెయ్యాలున్నాయి. కాకపోతే అవి సినిమా దెయ్యాలు కావు. దెయ్యాల్లో మంచివీ ఉంటాయి, చెడ్డవీ ఉంటాయి. మనం మంచి దెయ్యాలను పిలిస్తే మనకేమీ కాదు. నేను అలా మంచి దెయ్యాలతో మాట్లాడాను తెలుసా..' ఇలా వాడు చెప్పుకుపోతుంటే నాకు బోలెడు ఆశ్చర్యం వేసేది. వాడప్పుడు మహా ధైర్యస్థుడిలా కనబడేవాడు. పాతాళభైరవి మాంత్రికుడి కంటే మహా మంచి వాడిగా కనబడేవాడు. ఇంకా వాడిలా చెప్పాడు... `ఒరే, నీకు దెయ్యాలతో మాట్లాడాలని ఉంటే చెప్పు. చాలా ఈజీరా. ఈ మధ్య కాలంలో మన ఇంట్లోనే చనిపోయిన వాళ్లను తలచుకుంటూ పిలిస్తే వాళ్లు వస్తారు, మనతో మాట్లాడతారు, మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తారు. పైగా మన భవిష్యత్తు చెబుతారు...' అంటూ చెప్పాడు వాడు. ఇదేదో బాగుంది అనుకున్నాను. వాడితో కలిసి దెయ్యాలను ఆవాహన చేసే బోర్డు తయారు చేశాము. ఆ బోర్డు తయారు చేయడం చాలా సింపుల్. ఒక అట్ట తీసుకున్నాము. దాని మీద ఓ తెల్ల కాగితం అంటించాము. ఆ కాగితం మీద వృత్తాకారంలో ఇంగ్లీష్ లో లెటర్స్ అంటే A to Z పెన్నుతో రాశాము. మధ్యలో ఓ చిన్న వృత్తం చుట్టాము. దానికి ఒక వైపు YES అని మరో వైపు NO అని రాశాము. ఈ రెండు వృత్తాలకు మధ్యన నెంబర్స్ సున్నా నుంచి పది వరకు అంకెలు వేశాము. ఆ బోర్డు మీదనే ఒక చోట తూర్పు, పడమర అంటూ దిక్కుల పేర్లు రాశాము. చివర్లో ఆ బోర్డు క్రిందనే `గుడ్ బై' అంటూ రాశాము. అలా తయారైన బోర్డ్ ని ఇంట్లోకి తీసుకొచ్చాము. ఇంట్లో వాళ్లు ఏమిటిదని ఆశ్చర్యంగా అడగడం, మేము చాలా గొప్ప వాళ్లమన్నట్లు బిల్డప్ ఇచ్చి దాని గురించి చెప్పడం , వాళ్లు కసురుకోవడం చకచకా జరిగిపోయాయి. అయినా మా ప్రయత్నం మానుకోలేదు. ఎవ్వరూ చూడకుండా వాడూ నేనూ ఇంట్లోనే ఓ మూలగా కుర్చీలు వేసుకుని కూర్చుని మధ్యలో చిన్న బల్ల మీద ఈ బోర్డు పెట్టుకుని దెయ్యాలను పిలిచే ఆట ప్రారంభించాము. విక్స్ డబ్బా మూత తీసుకున్నాము. దానిపై మా చూపుడు వేళ్లు సుతారంగా ఆనించి మంచి దెయ్యాలను ఆవహన చేయడం మొదలెట్టాము. చిత్రం.. నేను ఊహించలేదు. అనుకోకుండా నా ప్రేమేయం లేకుండానే విక్స్ మూత కదలడం మొదలుపెట్టింది. ఫ్రెండ్ గాడేమో వెంటనే - ఎవరు నీవు? అని అడిగాడు. నేనేమో ఉత్కంఠతో `బామ్మవా..?' అన్నాను. చిత్రంగా మూత కదులుతూ `ఎస్' అన్న అక్షరాలు రాసిన వైపు కదిలింది. సక్సెస్ అన్నాడు ఫ్రెండ్ గాడు. ఇంట్లో వాళ్లకు తెలిసాక కొంత మంది మా పార్టీలో చేరారు. ఇక బామ్మ అనబడే ఆ దెయ్యాన్ని ప్రశ్నలు వేయడం, సమాధానాల కోసం విక్స్ మూత కదలుతుండటం ఇదంతా బోలెడు ఆశ్చర్యాన్ని కలిగించింది. భయం గుట్టు విప్పే సైన్స్ చీకటి- భయం అయితే వెలుతురన్నది- సైన్స్. హేతువు తెలిస్తే భయం పారిపోతుంది. ఇప్పటి దాకా భయపెట్టిన సంఘటనల వెనుక వాస్తవ కోణాలు వెలుగు చూడగానే పెద్ద రిలీఫ్ వచ్చినట్లయింది. మ్యాజిక్ షోలో టెక్నిక్ తెలియనంత వరకే ఆశ్చర్యం. తెలిస్తే ఓస్, ఇంతేనా..దీనికేనా అంతగా ఆశ్చర్యపోయింది అని అనుకుంటాము. దెయ్యాలను పిలిచే బోర్డ్ విషయంలోనూ అంతే. లాజిక్ ఆలోచిస్తే, చనిపోయిన మా బామ్మకు ఇంగ్లీష్ రాదు. అలాంటప్పుడు మేము అడిగే ప్రశ్నలకు సమాధానాల కోసం వాడిన మూతను ఎస్ -నో అన్న పదాల వైపు ఎలా కదిలించింది| తర్వాత కాలంలో జాగ్రత్తగా ఆలోచిస్తే మూత మీద వేసిన చేతి వేళ్లు వారికి తెలియకుండానే వారి ఆలోచనలకు తగ్గట్టుగా సమాధానాల వైపు వారే కదిలిస్తుంటారని అర్థమైంది. ఇది మైండ్ చేసే డ్రామా. ఏ దెయ్యమో సమాధానాలు చెప్పడం లేదు. మనలోని ఆలోచనలే ఆ పని చేయిస్తున్నాయి. అసంకల్పితంగా మనమే మూతను కదిలిస్తున్నామని తెలిసింది. అయితే ఈ వివరణతో సంతృప్తి చెందని వారు నేటికీ ఈ బోర్డు ని విశ్వసిస్తున్నారు. ఇంకొంత మంది దీన్నో కాలక్షేపం ఆటగా భావిస్తున్నారు. మొదట్లో ప్రస్తావించిన మఱ్ఱి చెట్టు క్రింద శవం సంఘటన , ఆకాశంలో శవయాత్ర, ఓ స్త్ర్తీ రేపు రా సంఘటనలు - వీటన్నింటిలో లాజిక్ ఉంటుంది. అది తెలిస్తే భయం పోతుంది. బోటనీ సబ్జెక్ట్ వీరోచితంగా చదువుతున్న రోజుల్లో ఒక విషయం అర్థమైంది. పెద్ద పెద్ద చెట్ల క్రింద రాత్రి పూట పడుకుంటే ఊపిరి అందదు. నిద్ర పట్టినా ఎవరో గొంతు నులిపేస్తున్నారన్న భయం ఆవహిస్తుంది. ఒక్కో సారి ప్రాణం పోవచ్చు. ఇదేదో ఆ చెట్టు మీద ఉన్న దెయ్యం చేయడంలేదు. ఆ చెట్టుకున్న సహజ లక్షణమే ఆ పని చేస్తున్నది. ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. చెట్టు జీవక్రియలు - లాజిక్ ప్రతి చెట్టు మనలాగానే శ్వాస పీల్చుస్తుంటాయి. అంటే అచ్చు మనలాగానే ఆక్సిజన్ పీల్చుకుంటూ కార్బన్ డై ఆక్సైడ్ వదిలిపెడుతుంటాయి. అలాగే పగటి పూట సూర్యరశ్మి సాయంతో మొక్కలు, చెట్లు వాతావరణంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ని తీసుకుంటూ శక్తిని సంపాదించుకుంటాయి. దీన్ని ఫోటోసింథసిస్ అంటారు. రాత్రి కాగానే సూర్యరశ్మి ఉండదు కనుక ఈ ప్రక్రియ ఆగిపోతుంది. అప్పుడు మిగిలే జీవ లక్షణమల్లా శ్వాసక్రియ మాత్రమే. ఈ కారణంగా పగటి పూట కంటే రాత్రి పూట చెట్ల దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కనుక అక్కడ పడుకున్న వారు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గాలి మరీ ఆగిపోయినప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. మఱ్ఱిచెట్టు క్రింద లేదా పెద్ద చెట్ల క్రింద రాత్రి పూట పడుకుంటే, ఆ సమయంలో సరిగా గాలి వీచకపోతే శ్వాస ఆగియే ప్రమాదం ఉండవచ్చు. ఈ కారణంగానే భయాలు వ్యాపించాయి. నిజం తెలిస్తే దెయ్యం భయం ఇట్టే మాయమవుతుంది. అలాగే, అర్థరాత్రి ఆకాశంలో శవం కనబడటం వెనుక కూడా లాజిక్ ఉంది. మేఘాలు రకరకాల ఆకారాల్లో కనిపిస్తుంటాయి. వాటిని తదేకంగా చూస్తున్నప్పుడు మన ఆలోచనలకు తగ్గట్టుగా అవి కనబడవచ్చు. ఎవరికో ఆకాశంలో మంచం, దాని మీద శవం, నలుగురు మోసుకెళుతున్నట్లు ఆకారాలు కనబడి ఉండవచ్చు. అలాంటి వాడు చేసిన ప్రచారంతో ఇదో పెద్ద సంచలనం సృష్టించి ఉండవచ్చు. ఓ స్త్రీ రేపు రా సంఘటన అంతా బూటకం. జనంలోని భయాన్ని క్యాష్ చేసుకునే వారు వేసే ఎత్తుగడల ప్రభావం ఇదంతా. భయం చీకటి లాంటిదైతే జ్ఞానం వెలుతురు వంటిది. జ్ఞానం పెంచుకుంటే మూఢ నమ్మకాలు తొలిగిపోతాయి. ఈ రకంగా ఆలోచించే అవకాశం సైన్స్ సబ్జెక్ట్ నాకు అందించింది. భయపడుతూ జీవిస్తుంటే ఎప్పటికీ ఏదో నీడలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. అదే ధైర్యంగా ముందుకు సాగిపోతుంటే భయం పారిపోతుంది. జీవన యాత్రలో భయం ఒక చీకటి అధ్యాయం. -- ఫుట్ నోట్.... చూ. 10 : బుంగ: బావి లోంచి నీళ్లు తోడుకునే ఒక రకం పాత్ర. బకెట్ లా కాకుండా బిందె లా ఉంటుంది. బుంగ మెడకి తాడుని ఉరి తాడులాగా బిగించి దాన్ని బావిలోకి వదులుతారు. అప్పట్లో చాలా మంది ఇళ్లలో బావులకు చుట్టూ చెప్టాలు (నిలబడి నీళ్లు తోడుకునే ప్రదేశం), గిలకలు (దీని సాయంతో సునాయాసంగా నీళ్లు తోడుకోవచ్చు) ఉండేవి కావు. చప్టాలు లేని బావుల పైన బాగా ఎండిన ఓ తాటి కాండం వేసేవారు. ఒక కాలు బయట, మరో కాలు ఈ తాటి మొద్దు మీద వేసి కాళ్ల పంగజాపి రెండు చేతులతో బుంగని దింపి చకచకా నీళ్లు తోడేవారు. ఇదో ఆర్ట్. ------ ఫుట్ నోట్ ---- చూ. 11 : వందేళ్లనాటి సినిమా హాల్ : నేను 2017లో ఇంగ్లండ్ వెళ్ళినప్పుడు అక్కడ వందేళ్లనాటి సినిమా హాల్ ని చూడటం తటస్థించింది. ఆ వివరాలు ఇప్పుడు చెబుతాను. భారతీయ సినిమా చరిత్రను తిరగ రాసిన బాహుబలి-2 సినిమాని UKలోని చారిత్రాత్మక సినిమాహాల్లో (105 ఏళ్ళనాటి) చూడటం నాకు కలిగిన ఓ చక్కటి అనుభవం. Elland లోని Rex Cinema థియేటర్ ని 1912లో నిర్మించారు. అప్పటికి అంటే 1912 నాటికి భారతీయ సినిమా ఇంకా పురుడుపోసుకోలేదు. 2012లో శతాబ్ది ఉత్సవాలను జరుపుకున్న Rex cinema థియేటర్ అనేక మరమ్మతులకు నోచుకున్నా బయటిరూపురేఖల్ని ఏమాత్రం మార్చకుండా అలాగే ఉంచడం విశేషం. 1937లో తెలుగు సినిమా (భక్త ప్రహ్లాద తో) అవతరించగా 1913లో ఇండియన్ మూకీ సినిమా రూపుదాల్చింది.
ఇక ఈ హాల్ ప్రాంగణంలో 1930నాటి ప్రొజెక్టర్ని ఎగ్జిబిట్ చేశారు. హాల్ లోపల తెర (స్టేజ్) క్రింద Conn 651 Organ (మ్యూజికల్ ఇన్ స్ట్రమెంట్) ఉంచారు. ప్రతినెలా మూడవ ఆదివారం స్టేజ్ ప్రదర్శనలు (ప్రధానంగా నృత్య, సంగీత రూపకాల్లాంటివి) నిర్వహిస్తుంటారని తెలిసింది. పూర్వం మూకీలు నడుస్తున్నప్పుడు కొంతమంది గాత్రధారులు, వాయిద్యకారులు తెర దిగువున నిలబడి ప్రదర్శితమవుతున్న మూకీ చిత్రకధకు తగ్గట్టు డైలాగులు, నేపధ్య సంగీతాన్ని వినిపించేవారట. Conn 651 Organ - పెద్ద మ్యూజికల్ ఇన్ స్ట్రమెంట్ ని తెర క్రింద చూడగానే ఏదో బుక్ లో చదివిన ఈ విషయాలు గుర్తుకొచ్చాయి. 105 సంవత్సరాల చరితగలిగిన Rex థియేటర్ లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డిస్ప్లేలో ఉంచిన పేపర్ కటింగ్స్, ఫోటోలు చూస్తుంటే పాతకట్టడాలకు వీరిస్తున్న గౌరవం, వాటిని కాపాడుకోవాలన్న తపన కళ్ళకుగట్టినట్లు కనిపించింది. హాట్సప్. తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకే తలమానికంగా నిలిచిన బాహు బలి-2 ఈ శతాబ్ది థియేటర్ లో చూడగలగడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఇంటర్వెల్ లో అలనాటి ప్రొజెక్టర్ చూసినప్పుడు నా చిన్నతనంలో ఓ హాల్ లో చూసిన ప్రొజెక్టర్ గుర్తుకు వచ్చింది. (మళ్ళీ కలుద్దాం)

12, మే 2024, ఆదివారం

6వ భాగం : అడ్డతొక్కుడు

చిన్నప్పుడు సైకిల్ తొక్కడం ఓ పెద్ద సాహసం. సైకిల్ మీద వెళ్ళే వాళ్లంతా నా దృష్టిలో పెద్ద హీరోలు. సర్కస్ లో కూడా ఇలాంటి హీరోలు కనబడేవారు. ఓ సారి జెమినీవారి సర్కస్ కి వెళ్ళాను. సైకిల్ మీద ఎన్ని సాహసాలు చేసేవారో. సైకిల్ నడపడమే గొప్ప అని నేను అనుకుంటుంటే, ఒకే సైకిల్ మీద ఒకరిమీద మరొకరు ఎక్కుతూ సైకిల్ తో విన్యాసాలు చేయడం చూసిన నేను బోలెడు ఆశ్చర్యపోయేవాడ్ని. ఎప్పటికైనా జీవితంలో సైకిల్ నేర్చుకోవాలని అలాంటప్పుడే శపథం లాంటిది చేశాను. ఇదే జీవితాశయం అన్నట్లు ఉండేది తపన. ఇలాంటి తపనే చాలా పెద్దయ్యాక కారు నేర్చుకోవాలనుకున్నప్పుడు కలిగింది. మధ్యలో ఎడ్లబండి కూడా కాసేపు నడిపానులేండి. సైకిల్ అడ్డతొక్కుడు అనే సాహస కార్యం గురించి ఇప్పుడు చెబుతాను. చిన్నప్పుడు బక్క కోపం, ఆ పైన మొండితనం. కానీ, కొత్త విద్యలు నేర్చుకోవాలన్న తపన గట్టిగా ఉండేది. సైకిల్ నేర్చుకోవాలన్న కోరిక బలపడింది. ఓ రోజున మంగళగిరిలోని మెయిన్ రోడ్ గుడి గోపురానికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళాను. కాస్త దూరం పోగానే, కుడి పక్కన సైకిళ్ళను అద్దెకు ఇచ్చే షాపు కనబడగానే అక్కడ ఆగాను. బ్లూకలర్ నిక్కరు, బొమ్మల హాఫ్ హ్యాండ్స్ షర్ట్ తో పాటు నోట్లో వేలు కూడా వేసుకుని చాలా అమాయకంగా షాపు దగ్గర నిలుచుంటే, షాపులో పనిచేస్తున్న కుర్రాళ్లు నావైపు అదోలా చూస్తున్నారు. ఆ షాపు ముందు ఓ పది దాకా సైకిళ్లు బారుతీరి ఉన్నాయి. పక్కనే గాలి కొట్టే పంపు, పంచర్ పడితే చూడటానికి ఓ అల్యూమినియమ్ బకెట్ లో నీళ్లు కూడా ఉన్నాయి. ఓ పన్నెండేళ్ల కుర్రాడు చకచకా పనిచేసుకుంటూ పోతున్నాడు. సైకిల్ ట్యూబ్ లోకి గాలి నింపి ట్యూబ్ ని ఎంతో నేర్పుగా వంచుతూ, బక్కెట్ నీళ్లలో ముంచుతూ పంచర్ ఎక్కడ పడిందోనని చూస్తున్నాడు. అనుమానం వచ్చిన చోట చేతి వేలుని ట్యూబ్ కి గట్టిగా ఆనిచ్చి చెక్ చేస్తున్నాడు. వాడి శ్రమ ఫలించింది. ట్యూబ్ లో ఒక చోట నుంచి గాలి నీటి బుడగల్లా పైకి వస్తున్నాయి. ట్యూబ్ ని బయటకు తీసి పంచర్ పడిన ప్రాంతాన్ని ఓ పెన్సిల్ మార్క్ తో సున్నా చుట్టి మరో పనివాడికి ఇచ్చాడు. వాడేమో పంచర్ పడిన చోటని బాగా రుద్దీ నీటి తడి ఆరిపోయాక ఆ ప్రాంతంలో పసుపు రంగున్న ఒక ట్యూబ్ లో నుంచి మందులాంటిది తీసి ట్యూబ్ పై పూసి పంచర్ పడిన చోట ఓ నల్లటి రబ్బరు ముక్కని అంటించాడు. ఆ తర్వాత కుర్ర పనివాడేమో ట్యూబ్ ని నేర్పుగా సైకిల్ టైర్ లోకి దూర్చి గాలి కొట్టాడు. నోట్లో వేలేసుకుని ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుంటే ఇంతలో సైకిల్ మీద వచ్చిన వ్యక్తి ఒకడు అద్దె సైకిల్ అప్పగించాడు. షాపు వాడు టైమ్ చూసుకుని అద్దె డబ్బులు వసూలు చేశాడు. షాపు యజమాని డబ్బులు తీసుకోవడం, వాటిని గల్లాపెట్టెలో వేసుకోవడం చూస్తూ - `ఆహా, ఎప్పటికైనా నేనూ వీడంత వాడ్ని కావాలి. ఇలాగే బోలెడు సైకిళ్లు కొనేసి అద్దెకు ఇస్తూ డబ్బులు సంపాదించాలి' - అనుకున్నాను. అంతే కాదు సైకిల్ కి పంచర్ వేయడం కూడా నేర్చుకోవాలి. మధ్యలో పంచర్ పడితే సైకిల్ తోసుకురావడం కష్టం కదా, అందుకే మనమే ఆ విద్య కూడా నేర్చుకుంటే పోలా అని అనుకునేవాడ్ని. ఇది ఆ తర్వాత నిజమే అయింది. హైస్కూల్ లో చదువుతున్నప్పుడు లేదా ఇంటర్ చదవుతున్నప్పుడు నందిగామ- అడవి రావుల పాడు మధ్య గతుకుల మట్టి రోడ్డుపై సైకిల్ మీద తిరిగేవాళ్లం. సైకిల్ కి ఈ పంచర్ కిట్ పెట్టుకునే వాళ్లం. ఏ ముల్లో గుచ్చుకుని టైర్ కి గాలి పోతే మనమే నేర్పుగా పంచర్ వేసుకునే స్థాయికి ఎదిగామన్నమాట. చాలా గొప్పగా ఫీలయ్యేవాడ్ని. మనకు అవసరమైన పని సులువుగా జరిగేలా చూసుకునే లక్షణం అలా అలవడిందన్నమాట. సరే, అద్దె సైకిల్ షాప్ దగ్గర నుంచి చాలా దూరం వచ్చినట్లున్నాము. మళ్ళీ అక్కడికే వెళదాం పదండి.. `ఏయ్, అబ్బాయి, నీకేం కావాలి' - అడిగాడు షాప్ వాడు. నోట్లో వేలు తీసి - సైకిల్ కావాలి - అనేసి మళ్ళీ నోట్లో వేలు వేసుకున్నాను. ఏది కావాలో తీసుకో అన్నాడు. అక్కడున్నవన్నీ పెద్ద ఎత్తుగా గుఱ్ఱాల్లా ఉన్నాయి. సైకిళ్లు తయారు చేసేవారిపై నాకు బోలెడు కోపం వచ్చేసింది. పిల్లల అవసరాలు వీళ్లు పట్టించుకోరా , హాయ్..అంటూ విసుక్కున్నాడు. ఎత్తైన సైకిల్ ఎలా ఎక్కాలో వాటిని ఎక్కి సైకిల్ తొక్కడం ఎలాగో అర్థంకాలేదు. అయితే సైకిల్ సీటుపైకి ఎక్కకుండానే అడ్డ తొక్కుడుతో సైకిల్ రయ్యిన పోనీయవచ్చని స్నేహితులు అప్పటికే చెప్పి ఉండటంతో ధైర్యం చేసి ఒక సైకిల్ తీసుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు వచ్చాను. తర్వాత తెలిసిన విషయం ఏమంటే. పిల్లల కోసం పొట్టి సైకిళ్లు అమ్ముతున్నారని. పెద్ద సిటీ నుంచి వచ్చిన ఓ ఫ్రెండ్ అయితే `ఆడపిల్లల - అంటే లంగాలు వేసుకునే అమ్మాయిలు ఈజీగా సైకిల్ నడపడానికి ప్రత్యేక సైకిళ్లు (ముందున్న రాడ్ వొంపుగా ఉండే సైకిళ్లు) సిటీల్లో అమ్ముతున్నారు తెలుసా' అని చెప్పాడు. మళ్ళీ బోలెడు ఆశ్చర్యం. మా ఇంట్లో అప్పట్లో సైకిల్ లేదు. పెద్దలంతా నడిచే వెళ్ళేవారు. అలాంటప్పుడు నాకోసం చిన్న సైకిల్ కొనమని చెబితే ఇంకేమైనా ఉందా..అందుకే ఇలాంటి కోరికని మనసులోనే కట్టేశాను. ఈ సంఘటనలన్నీ దాదాపు 1960ల్లో మంగళగిరిలో జరిగినవి. అప్పట్లో మంగళగిరి చాలా చిన్న ఊరే. మెయిన్ రోడ్డు మీద కూడా సైకిళ్లు, రిక్షాలు తప్పా మోటారు వాహనాలు తిరగడం చాలా అరుదు. మంగళగిరిలో గూడు రిక్షాలు ఎక్కువగా తిరిగేవి. సీటు రిక్షాలు ఆ తర్వాత కాలంలో గుంటూరులో చూశాను. మెయిన్ రోడ్డుకి ఒక వైపున పానకాల స్వామి కొండ ఉంటుంది. స్వామి గుడికి వెళ్ళడానికి మెట్లదారి ఉంటుంది. ఈ రోడ్ల మీదనే సైకిల్ టైర్ ని దొర్లించుకుంటూ రయ్యిన వెళ్లే ఆట కూడా ఆడేవాడ్ని. అంతేకాదు, సైకిల్ రిమ్ ని తోసుకుంటూ పోయే ఆటన్నమాట. రిమ్ గాడిలో ఓ కర్ర ముక్క ఆనించి రిమ్ ని బలంగా తోసి ఆ పైన ఈ కర్ర సాయంతో దాని వేగం పెంచాలి. అయితే రిమ్ అంచు సరిగా లేకపోతే కర్ర ముక్క చక్రంలో ఇరుక్కుని ప్రమాదాలు జరుగుతుండేవి. అయినా ఇలాంటి ఆటలు ఆగవు. ఇవన్నీ నేర్చేసుకున్నానన్న ధీమాతోనే అడ్డతొక్కుడు దగ్గరకు వచ్చామన్న మాట.
పానకం తాగే స్వామి: పానకాల స్వామి గుడికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. స్వామి వారి విగ్రహం నోరు తిరుచుకుని ఉంటుంది. ఆ నోట్లోకి పానకం పోస్తుంటారు. చిత్రమేమంటే ఎంత పానకం లోపలకు పోస్తే స్వామి వారు దాంట్లో సగం తాను త్రాగి మిగతాది భక్తుల కోసం అన్నట్లు బయటకు కక్కుతారని చెప్పేవారు. అలా కక్కుతున్నప్పుడు `గుళక్..గుళక్' అంటూ శబ్దం వస్తుందని పూజారులు చెప్పేవారు. నా చిన్నప్పుడు అలాంటి శబ్దం విన్నట్లు గుర్తు. అంత మహిమగల స్వామి. మరో చిత్రం చెప్పనా, రోజూ స్వామి వారి సన్నిధిలో పానంకం తయారుచేస్తూ స్వామికి సమర్పిస్తున్నా అక్కడ నేలపై ఒక్క చీమ కూడా కనబడకపోవడం నిజంగా ఆశ్చర్యమే.
ఏనుగు ఆకారంలో కొండ: ఇంకో చిత్రం చెప్పేస్తున్నా, శ్రద్ధగా వినుకోండి. పానకాల స్వామి గుడికి పైన కొండ శిఖరంమీద గండాల స్వామి గుడి ఉంది. ఈ కొండ పడుకున్న ఏనుగు ఆకారంలో ఉండటం విశేషం. ఇది అగ్నిపర్వతమనీ, శాంతిపజేయడానికే పానకం పోస్తుంటారని అంటారు. గండాల స్వామి గుడికి వెళ్ళాలంటే మెట్ల దారి లేదు. పశువులు, గొర్రెల కాపర్ల నడక దారి లాంటిదొకటి ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే అక్కడకు వెళుతుంటారు. మేము ఓ నలుగురు పిల్లలం ఓ రోజు గండాల స్వామి గుడికి వెళ్ళాల్సిందేనని ప్లాన్ చేశాము. పెద్దోళ్లకు చెప్పకుండా పానకాల స్వామి గుడిదాకా మెట్లదారిన వెళ్ళి అక్కడి నుంచి భయం భయంగా కొండ ఎక్కి గండాల స్వామి గుడికి చేరాము. అక్కడ ఓ దీపం వెలుగుతూ కనిపించింది. ఈ దీపం దర్శనం చేసుకుంటే జీవితంలో ఎన్ని గండాలు వచ్చినా అవన్నీ ఇట్టే తొలిగిపోతాయట. చాలా చిన్నప్పుడే నేను చేసిన అతి పెద్ద సాహసం ఇది. కొండ శిఖరాన ఉన్న ఈ ఆలయానికి వెళ్లడానికి ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో నాకు తెలియదు. తెలిసిన వారు చెబితే సంతోషిస్తాను. జీవితంలో అనేక గండాలను దాటుకుంటూ ఈ రోజున ఆనాటి విశేషాలు మీతో పంచుకుంటున్నానంటే బహుశా ఆ స్వామి వారి దయేనేమో. పాత జ్ఞాపకాలు తలుచుకుంటున్నప్పుడు మనసు అటూ ఇటూ పరిగెడుతుంటుంది. ఏమీ అనుకోకండేం. సరే, మళ్ళీ అడ్డతొక్కుడు దగ్గరకు వస్తాను. మంగళగిరి మెయిన్ రోడ్డులో కొండవైపున పెద్ద రథం వెనుక బారుగా ఉండే పెంకుటిళ్లలోని ఒక ఇంట్లో ఉండేవారం. అద్దెకు తీసుకున్న సైకిల్ ని నెమ్మదిగా తోసుకుంటూ ఇంటికి దగ్గరకు తెచ్చాను. విషయం తెలిసి పెద్దోళ్లు కసురుకుని, ఇంత పెద్ద సైకిల్ తొక్కితే కాళ్ళు విరుగుతాయంటూ భయపెట్టేసి, ఆ సైకిల్ ని రయ్యిన తీసుకెళ్ళి షాప్ వాడికి ఇచ్చేసి వచ్చారు. మనం హర్టయ్యాం. అవమా ఏంటి? సైకిల్ నేర్చుకోవడంలోని మొదటి ప్రయత్నం అలా బెడిసికొట్టింది. అయినా ఆశ చావలేదు. తోటి పిల్లలు సైకిల్ ని అడ్డతొక్కుడుతో నేర్చేసుకుంటున్నారు. మనం నేర్చుకోకపోతే ఎలా..? అందుకే ఒక వ్యూహం పన్నాను. పెద్దోళ్ళకి చెబితేనే కదా సమస్యలన్నీ, అసలు చెప్పకుండా నేర్చుకుంటే పోలా. ఈ ఆలోచన కార్యరూపం దాల్చింది. వేరే షాప్ కి వెళ్ళి అద్దె సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళకుండానే సందుల్లో నేర్చుకోవడం మొదలెట్టాను. అసలే, అడ్డతొక్కుడు. బాలెన్స్ కుదరడం లేదు. రోడ్డు వాలుగా ఉండటంతోనూ, గతుకులు ఎక్కువ కావడంతోనూ బొక్కబోర్లా పడ్డాను. అంతే.. కొద్ది రోజులు మోకాలికి కట్టు. గాయం తగ్గడానికి చాలా రోజులే పట్టింది. అయినా అడ్డతొక్కుడుతో సైకిల్ మీద రయ్యిన పోతున్నట్లు కలలు వస్తుండేవి. సైకిల్ తొక్కడమన్న కల చివరకు నెరవేరింది. ఒకానొక శుభముహూర్తాన బాలెన్స్ కుదిరింది. అడ్డతొక్కుడుతో సైకిల్ నడపడం వచ్చేసింది. అయినా అడపాదడపా క్రింద పడటం మామూలే. ఇంట్లో వాళ్ళ అరుపులు మామూలే. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకనిపిస్తున్నది, ఏ పని అయినా మొదట్లో కష్టంగానే ఉంటుంది. కానీ పట్టుదలతో ముందుకు సాగితే అదే పని సులువుగా మారుతుంది. రెండు జీవన సూత్రాలు : శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఒక చక్కటి సందేశాత్మక పాట ఉంది. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. ఈ పాటలో ఒక చోట... కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు. చెప్పడమే నా ధర్మం వినకబోతే నీ కర్మం. మన పని మనం చేసుకుంటూ పోవాలి. దాని ఫలితం ఆ భగవంతుడే అందజేస్తాడు. అంతే కాదు, ఆ పనిలో ఎదురయ్యే కష్టాల నుంచి పరమాత్మే బయటపడేస్తాడన్నఅనంత అర్థాన్ని ఈ రెండు లైన్లలో నిక్షిప్తం చేశారు సి. నారాయణ రెడ్డి గారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి చేసిన గీతోపదేశంలో కూడా ఇదే సూత్రం కనబడుతుంది. కర్మలయందే నీకు అధికారం కలదు. లేదు కర్మ ఫలమునందు. అట్లని కర్మలు చేయడం మానరాదు - అని భగవద్గీత చెబుతున్న జీవన సూత్రం. నాకు ప్రేరణగా నిలిచిన రెండు సూత్రాల్లో ఒకటి: పని - వేగం - ఫలితం రెండవ సూత్రం: పని- విజయం ఆనందం ఏ పని చేపట్టినా ఆ పనిని వేగంగా చేయగలగాలి. చక్కటి ఫలితం రాబట్టగలగాలి. అలాగే, ప్రతి పనిలోనూ పూర్తి విజయం దక్కకపోవచ్చు. కొన్ని సార్లు అపజయం ఎదురుకావచ్చు. అలాగని పనులు మానేసి మూలన కూర్చుకోడదు కదా. ఇక పని వల్ల వచ్చే విజయం మనకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా నూతనోత్సాహాన్ని నింపుతుంది. ఈ ఉత్సాహం మన ఆరోగ్యంపైన కూడా ప్రభావితం చూపిస్తుంది. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. అలా అని నిరంతరం కష్టాల కడలిలాగానూ ఉండదు. ఎప్పటికప్పుడు ఆనందాలను వెతుక్కుంటూ ముందుకు సాగడమ మనం చేయగలిగినది. చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం చేయాలి, పెళ్ళి చేసుకోవాలి. దాదాపుగా అందరి ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అనుకున్నవన్నీ జరగడానికి కొందరికి నల్లేరు మీద నడక కావచ్చు. (నల్లేరు - చూ. 8 ) మరి కొంత మందికి గతుకుల బాటలో పయనం. నిరుద్యోగ పర్వం : ఓ నలభై ఏభయ్యేళ్ల క్రిందట ఆడపిల్ల ఎదిగితే పెళ్ళి చేసి పంపితే చాలు అనుకునేవారు. అలాగే మొగపిల్లాడు ఎదిగితే వాడి కాళ్ల మీద వాడు నిలబడితే చాలని సాధారణ, మధ్యతరగతి ఇళ్లలో ఆ రోజుల్లో వినబడే మాట. ఇప్పటి చదువులకీ ఆనాటి చదువులకు ఎంత తేడా ఉన్నదో అంతే తేడా ఉద్యోగ అవకాశాల్లోనూ ఉంది. చదువు పూర్తికాగానే ఉద్యోగం రావడం అంటే పెళ్లీడుకొచ్చిన పిల్లకు వెంటనే వరుడు వెతుక్కుంటూ వచ్చి ఎగరేసుకువెళ్లడం లాంటిదని అనే వారు. అందరికీ ఆ పరిస్థితి ఉంటుందా.. ఉండదనుకోండి. నేను డిగ్రీ చదివింది తెలుగు మీడియంలోనే. అది కూడా సైన్స్ సబ్జెక్ట్. 1975 ప్రాంతంలో తెలుగులో సైన్స్ సబ్జెక్ట్ రిఫరెన్స్ బుక్స్ చాలా తక్కువగా ఉండేవి. మరీ ముఖ్యంగా బిట్ పేపర్ కి సంబంధించిన సమాచారం ఉన్న తెలుగు పుస్తకాలు చాలా అరుదు. దీంతో బిట్స్ కూడా టెక్స్ట్ బుక్ తిరగేస్తూ మనమే కుస్తీ పట్టి తయారు చేసుకోవాల్సి వచ్చేది. అసలు తెలుగు మీడియంలో బీఎస్సీ చదివి పొరపాటు చేశానేమో అని ఎమ్మెస్సీ చదువుతున్నప్పుడే అనుకునేవాడ్ని. తెలుగు మీడియం సరే, అందునా అటు పల్లె ఇటు పట్టణం గాని ఊర్లోని కాలేజీలో అదీ కూడా అప్పుడే బీఎస్సీ కోర్స్ ప్రవేశపెట్టినప్పుడే ఫస్ట్ బ్యాచ్ లో చేరడం అదనపు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కానీ ఏం చేస్తాం. ఇంట్లో పరిస్థితులు, ఖర్చులు, ఇతర భయాలు గడప దాటనీయకుండా చేశాయి. ఇలాంటి కుటుంబాలు మా ఊర్లో చాలానే ఉన్నాయి. ఈ పరిస్థితిని నాతోటి వాళ్లు చాలామందే ఎదుర్కున్నారు. నా విషయంలో అదే జరిగింది. నందిగామ కేవీఆర్ కాలేజీలో బీఎస్సీ పెట్టిన ఏడాదే ఆ ఊర్లోనే పెద్దలకు ఊరట కలిగింది. సైన్స్ డిగ్రీ మన పిల్లలు ఇక్కడే ఉండి పూర్తి చేయవచ్చన్న ఆనందం అది. నాతో బాటుగా మా ఊరి వాళ్లు, చుట్టు పక్కల ఊర్ల వాళ్లు చాలామందే సైన్స్ లో డిగ్రీ కోర్సులో చేరారు. అలా సొంత ఊర్లోనే బీఎస్సీ చేయడం మాకూ ఆనందంగానే ఉండేది. ఇంటి భోజనం, నడక దూరంలోనే కాలేజీ. హుషారుగా జోరుజోరుగా సాగిపోయింది చదువు. బాగా చదువుకుంటున్న ఏడెనిమిది పిల్లల్లో నేనూ ఒకనిగా గుర్తింపు పొందాను. బావిలోని కప్పలకు బయట ప్రపంచం తెలియదు కదా. అలాగే పోటీ ప్రపంచం ఎలా ఉంటుందో అప్పట్లో నాకు తెలియలేదు..చూడలేదు. నందిగామలో కాలేజీ రావడంతోనే ఆ ఊర్లో చదువుకున్న వారి శాతం ఏటికేడు బాగా పెరిగింది. చుట్టు పక్కల పల్లెల నుంచి కూడా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కాలేజీలో చేరేవారు. ఇదో విప్లవం. ఈ కారణంగా నందిగామ వాతావరణం మారిపోయింది. ఊర్లోని వ్యాపారస్తులు కూడా అప్పటి వరకు తమ పిల్లలను కేవలం వ్యాపారానికే పరిమితం చేసిన వారు కూడా తమ పిల్లలకు డిగ్రీ వరకు చదువు చెప్పించడానికి మొగ్గు చూపారు. క్రమక్రమంగా విద్యావంతులు ఎక్కువ మంది ఉన్న ఊరిగా నందిగామ పేరుతెచ్చుకుంది. డిగ్రీ చదువు అయ్యాక ఎమ్మెస్సీ - ఇది ఇంగ్లీషు మీడియంలో అందునా బొంబాయి వంటి చోట్ల చదవాల్సి వచ్చినప్పుడు తెలిసింది, ఇంగ్లీష్ భాషను గట్టిగా వంటబట్టించురుని ఉంటే, ఎమ్మెస్సీ చదువు ఎంతో ఈజీగా సాగి ఉండేది కదా అని. టెన్త్ వరకు హిందీ కూడా ఉండేది కదా, పోనీ హిందీ అన్నా బుఱ్ఱకెక్కిందా అంటే అదీ లేదు. హీందీ అంటే ఎగతాళి. హై, హూ అంతేగా అని జోక్ లేసుకునేవాళ్లం. బొంబాయి చేరాక హిందీ మరాఠీ భాష మాట్లాడేవారి మధ్య నా పరిస్థితి అరకత్తెరలో పోక చెక్కే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, జీవితం మనం చెప్పినట్లో మనం ఆశించినట్లో సాగదు. దాని ప్రయాణ మ్యాప్ ని భగవంతుడు ఎప్పుడో నిర్దేశించాడు. మనం పడుతున్న కష్టాలే రేపటి సుఖ జీవనానికీ సోపానాలు అవుతాయని మనకు తెలియకపోవచ్చు. కష్టాల్లోనే సుఖాలు వెతుక్కునే మనస్తత్వం అలవాటు చేసుకోవాలని బొంబాయిలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాను. మరో విషయం కూడా అర్థమైంది. పెద్దపెద్ద టార్గెట్స్ పెట్టుకుని ప్రయాణం సాగిస్తే కనీసం చిన్నచిన్న విజయాలైనా మనం అందుకోగలుగుతాము. అదేదో సినిమాలో వెంకేటష్ అన్నట్లు, `ఐఏఎస్, ఐపీఎస్...' అంటూ వెంకటేష్ చెబుతుంటే, ప్రకాష్ రాజు సీరియస్ గా చూడటంతో అతగాడేమో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఫీలవడం... ఇదంతా, పైకి కామెడీ సీన్ లా అనిపించినా , అందులో సత్యం దాగుంది. జీవితాన్ని ఎంజాయ్ చేసే తత్వం స్పష్టంగా కనబడుతుంది. ఆ రోజుల్లో ఇలాంటి కుర్రాళ్లు చాలా మందే కనబడేవారు. లక్ష్యం పెద్దదిగా పెట్టుకో, నీ శక్తి మేరకు కృషి చేయి, ఆ పెద్ద లక్ష్యం నెరవేరకపోయినా ఆ కృషి కారణంగా చిన్నచిన్న విజయాలు, ఆనందాలు నీ సొంతం కావచ్చు. ఈ సూత్రం నిరుద్యోగ పర్వంలోనే కాదు, జీవన యానంలో చివరి వరకు మనకు అక్కరకు వచ్చేదే. నేనూ వెంకటేష్ లాంటి వాడినే. భారీ లక్ష్యాలు పెట్టుకున్నాను. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా. 67ఏళ్ల వయసులో కూడా పెద్ద పెద్ద లక్ష్యాలకు సంకల్పం చెప్పుకుని పని ప్రారంభించడం , ఆ లక్ష్యాలను చేరలేకపోయినా చిన్న విజయాలు దరి చేరడం. వాటితో ఆనందంగా ఉండటం ఓ అలవాటుగా మారింది. పని - విజయం - ఆనందం అన్న సూత్రం చివరకు మనిషిని సంతృప్తి దశకు తీసుకువెళుతుంది. అలాగే జీవన యానం సాఫల్య వంతం అయినదా, కాలేదా అన్నది కూడా మనకు కలిగిన ఆనందం స్థాయిని బట్టి ఉంటుంది. ఈ సమాజం నిన్ను గుర్తించకపోవచ్చు. నిన్ను హీరోగా భావించకపోవచ్చు. కానీ పని - విజయం - ఆనందం అన్న సూత్రాన్ని నమ్ముకున్న వారిలో కలిగే అనుభూతి చెక్కుచెదరనిది. ఆకలి రాజ్యం: సరే, పని కావాలి కదా ముందు. పని అంటే అప్పట్లో మధ్యతరగతి వారి దృష్టిలో ఉద్యోగమే. ముఖ్యంగా నాటి బ్రాహ్మణ కుటుంబాల నేపథ్యంలో నేను ఈ మాటలు రాస్తున్నాను. మిగతా సామాజిక వర్గాల పరిస్థితికీ సాధారణ బ్రాహ్మణ సామాజిక వర్గ పరిస్థితికి చాలా విషయాల్లో తేడాలు ఉండివి. పిల్లవాడు ఎదిగాడంటే విద్యాబుద్ధులు అయ్యాయంటే ఇక మిగిలినవి రెండు. ఒకటి ఉద్యోగం. రెండవది పెళ్ళి. నిరుద్యోగ సమస్య ఎక్కువగానే ఉన్న రోజులవి. ఈ నిరుద్యోగ అంశం మీదనే అప్పట్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో ఆకలి రాజ్యం ఒకటి. కమల్ హాసన్ , శ్రీదేవి నటించిన సినిమా. శ్రీశ్రీ కవిత్వం, ఆకలి కేకలు, బతకడం అంటే ఉద్యోగమే కాదని, ఏ పనైనా చేసి బతకవచ్చని సందేశమిచ్చిన చిత్రం. పెద్ద పెద్ద లక్ష్యాలు తీరనప్పుడు నిరాశపడి ఆవేదన చెంది శూన్యం ప్రయాణించడం కంటే ఏదో ఒక ఉపాధి చేజిక్కించుకుని సమాజంలో గౌరవంగా బతకడం వంటి అంశాలు బుర్రలోకి ఎక్కిన రోజులవి. పైగా కుర్రాడిని కావడంతో శ్రీశ్రీ కవిత్వ ప్రభావం, నా పైత్య ప్రభావం వొళ్లంతా పాకింది. అలా అని సాంప్రదాయ కుటుంబం కాబట్టి భగవద్గీత సారం తెలుసుకునే ప్రయత్నం కూడా మరోపక్క సాగింది. ఏదో ఒక పక్కకు వొరిగిపోయి అలాగే సాగిపోయే నైజం నాకు లేదు. బహుశా ఇదే నా వైరుద్య జీవితం, అవి అందించిన సత్ఫలితాలకు బీజం వేసిందేమో. నా యీ జీవన యాత్ర పూర్తిగా చదివితే ఈ విషయం మీకు అర్థమవుతుంది. సూటిపోటి మాటలు: నిరుద్యోగ పర్వంలో నేను ఎదుర్కున్న మరో ఇబ్బంది సూటిపోటి మాటలు. చాలా కాజువల్ గా అడిగినప్పటికీ, `ఏరా, ఇంకా నీకు ఉద్యోగం రాలేదా, గట్టిగా ట్రై చేయలిరా...' అన్న మాటలు సూదుల్లా గుచ్చుకునేవి. చిత్రమేమంటే ఇలా మాట్లాడే వారు సహాయం చేయరు. మాట సాయం చేయరు. అలాంటప్పుడు మనసు గాడి తప్పుతున్నప్పుడు నన్ను అక్కున చేర్చుకున్న పుస్తకం భగవద్గీత. పుస్తకమే కాదు, ఘంటసాల మాష్టారి భగవద్గీత కేసెట్లు. (చూ- 8) ఆనాటి తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని పాటలు కూడా చెదరని మనసుకు ఊరట కలిగించేవి. ఘంటసాల పాడిన ఓ పాట ప్రస్తావిస్తాను. `కల కానిదీ, విలువైనదీ' - అన్న పాటలో `అగాధమౌ జలనిధి లోన ఆణి ముత్య మున్నటులే, శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తాను నీ దరికి రాదు, శోధించి సాధించాలి , అదియే ధీర గుణము...కల కానిదీ..విలువైనదీ.. - ఇలాంటి పాటలు వింటున్నప్పుడు నిరాశ నిస్పృహలుపోయి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతుంటాము. నా జీవితంలో అప్పటికీ, ఇప్పటికీ పాటల ప్రాధాన్యత చాలానే ఉంది. అలా అని నేను గాయకుడిని కాను. కానీ మంచి పాటలను బుర్రకెక్కించుకునే వాడ్ని. అనేక సందర్భాల్లో కష్టాలు ఎదురైనప్పుడు ఈ పాటలు ఊరట కలిగించాయి. ఈ ధోరణి వల్లనే ఏమో, ఆరు పదుల వయస్సు దాటాక మంచి పాట - మనసులోని మాట అన్న శీర్షికన ఒక కార్యక్రమం రూపకల్పన చేయడం సాధ్యపడింది. నా లెక్క ఇంతే: ఆ రోజల్లో బ్యాంక్ ఉద్యోగాలు బాగానే పడుతుండేవి. కాకపోతే మనం లెక్కల్లో పూర్. ఇప్పటికీ అంతే. వేలల్లో లక్షల్లో ఎవరైనా మాట్లాడుతుంటే నాకు చమటలు పట్టేస్తాయి. రైల్వే ఉద్యోగాలు గుమాస్తా ఉద్యోగాలు వంటివి కూడా పేపర్లో వాంటెడ్ కాలమ్స్ లో కనబడేవి. మిడిమిడి చదువులతో పోటీ పరీక్షలు గట్టెక్కె పరిస్థితి లేదు. పైగా మా ఊర్లో ఆ రోజుల్లో కోచింగ్ సెంటర్స్ లేవు. పోటీ పరీక్షలు ఎలా రాయాలి, వాటికోసం ఎలా ప్రీపేర్ అవ్వాలన్న విషయాల్లో గైడ్ చేసే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. మన ఒంటికి సరిపడే ఉద్యోగాల వేట ప్రారంభించాను. తొలి ఇంటర్వ్యూ: ఆ రోజుల్లో మెడికల్ రిప్రజెంటేటీవ్స్ పోస్టులు పడేవి. ఇవి కూడా మనకు సరిపడేవి కావనుకోండి. కాకపోతే మా ప్రెండ్ అప్లై చేస్తూ నా చేత కూడాచేయించాడు. ఇంటర్వ్యూకి రమ్మనమని కబురొచ్చింది. విజయవాడ మమతా హోటల్ లో ఇంటర్వ్యూ. సరై బాగానే ఉంది కదా అని విజయవాడ వెళ్ళాము. వారడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు చెబుతాను. అవి చాలు ఫలితం ఎలా ఉందో వివరంగా చెప్పకుండా.. **** `మీరు ఏం చదువుకున్నారు?' `ఎమ్మెస్సీ' `ఈ జాబ్ కి ఎందుకు అప్లై చేశారు?' `మా ఫ్రెండ్ చేస్తూ నాచేత చేయించాడు' `మేమడిగిన ప్రశ్నకు మీ సమాధానం ఇదేనా, ఇంకేమైనా చెబుతారా?' `లేదు, ఇదే నా సమాధానం' `సరే, మీకు వేటిలో ఆసక్తి ఉంది?' `నాకా.. పిల్లలకు పాఠాలు చెప్పడమంటే ఇష్టమండి. ఇంకా.. మిమిక్రీ చేయడమంటే ఇష్టమండి' ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్లు ఉలిక్కి పడ్డారు. `మరండీ, ఏఎన్నార్, ఎన్టీఆర్, సీఎస్సార్ గొంతులు దింపేస్తానండి' `మీరు ఆప్లై చేసిన ఉద్యోగానికీ మీరు చెబుతున్న మాటలకీ ఏమిటీ సంబంధం?' `ఏమో, నాకు తెలియదు. ఆఁ.. మీరు జాబ్ ఇస్తే, ఇలా సరదాగా మిమిక్రీ చేసి నవ్విస్తూ సేల్స్ పెంచుతానండి' `అబ్బో అలాగా.. చూడండి, సమాధానాలు ఆలోచించి చెప్పండి' `అలాగే' `ఇంకా ఏం ఇష్టం' `నాటకాలు ఆడటం. డైరెక్షన్ చేయడం' వింటున్న వాళ్లు మరో సారి ఉలిక్కి పడ్డారు. సర్దుకున్నాక.. `ఓహో..అలాగా, బాగుంది' `బాగుందీ- అంటే నాకు మీరు ఉద్యోగం ఇచ్చినట్లేనా..' `ఆ.. అది తర్వాత చెబుతాము. మీరు వెళ్లండి' ***** ఆ తర్వాత అర్థమైంది. మనం అన్ని ఉద్యోగాలకు పనికిరాము. మనం చేయగలిగిన ఉద్యోగాల లిస్ట్ ముందు తయారు చేసుకుని వాటికే అప్లై చేయాలనుకున్నాను. వాటిలో ఒకటి పాఠాలు చెప్పడం, రెండవది చదివిన సైన్స్ సబ్జెక్ట్ లోనే పరిశోధనా రంగానికి పరిమితమయ్యే ఉద్యోగాలు వెతుక్కోవడం. మరి ఈ కుర్రాడు నిరుద్యోగ పర్వం నుండి ఎలా బయటపడ్డాడు. ఎలాంటి ఉద్యోగంలో స్థిర పడ్డాడు? అందులో ఎలా తన కెరీర్ ని మలుచుకున్నాడో..? చూద్దాం ఏం జరగబోతున్నదో... కాలం ఎటు తీసుకెళ్లబోతున్నదో..?? ---- ఫుట్ నోట్స -- చూ. 8 : నల్లేరు మీద నడక : ఇది పల్లెటూర్లలో వాడుకలో ఉన్న నానుడి. నల్లేరు అన్నది ఒక రకం తీగ మొక్క. ఈ మొక్క కాండం చతురస్రాకార స్తంభంలాగా ఉంటుంది.
ఈ నల్లేరు తీగలను తెంపి వాటిని రహదారి మీద గుంటలు, గోతులున్న చోట్ల పోస్తుంటారు. వర్షాకాలంలో గుంటల్లో ఎడ్ల బండి చక్రాలు ఇరుక్కుపోకుండా క్షేమంగా గుంటలు, గోతులు దాటించడానికి ఈ నల్లేరు తీగల కుప్ప సాయపడుతుంటుంది. నల్లేరు తీగల వల్ల చక్రం జారకుండా పట్టుకోల్పోకుండా ఉంటుంది. నల్లేరు వేసిన రోడ్డు మీద బండి నడక సునాయాసంగా ఉంటుంది. ఎడ్లు కూడా అలసిపోవు. ఏ పని అయినా సులువుగా కేక్ వాక్ గా జరిగిపోతుంటే ఈ నానుడి వాడుతుంటారు. పత్రికల్లో కూడా హెడ్డింగ్స్ లో `నల్లేరు మీద నడక' అన్న ప్రయోగం తరచూ కనబడుతుంటుంది. అయితే నా మీడియా మిత్రుడొకడు ఓసారి హెడ్ లైన్ లో నల్లేరు మీద నడక అన్న ప్రయోగం తప్పుగా ఉపయోగించాడు. నిజానికి మేటర్ లో `అతి కష్టపడుతున్నాడన్న' అర్థం ఉంటే హెడ్డింగ్ లో నల్లేరు మీద నడక అని పెట్టడం వ్యతిరేక అర్థం వచ్చేసింది. సరే, పత్రికల్లో ఇలాంటి తప్పులు చాలానే దొర్లుతుంటాయి. సందర్భం వ్చచినప్పుడు అలాంటివి మరి కొన్ని ప్రస్తావిస్తాను. ----- ఫుట్ నోట్ - 9 ------ (చూ.9) క్యాసెట్స్ : మొమోరీ స్టోరేజీ పరిణామ క్రమం గురించి చెప్పుకునేటప్పుడు క్యాసెట్ల స్వర్ణ యుగం గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. నేను యువకునిగా ఉన్నప్పుడు ఈ క్యాసెట్ల హవా ఉండేది. క్యాసెట్ లోని టేప్ మీద ధ్వని ముద్రణ జరిగేది. 70వ దశకం రోజుల్లో అనేక సినిమా క్యాసెట్లు విరివిగా దొరికేవి.
విజయవాడ లెనిన్ సెంటర్ కి వెళ్ళి దానవీర శూర కర్ణ, యమగోల వంటి సూపర్ హిట్ సినిమాల డైలాగ్ ల క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్మడయ్యేవి. అదే లెనిన్ సెంటర్ కి ఈ మధ్య (2024) వెళితే క్యాసెట్లు మచ్చుకి కూడా లేవు.
కొంత కాలం సీడీల యుగం నడిచినా అవీ కనుమరుగవుతున్నాయి. ఇప్పుడంతా పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ ల యుగం నడుస్తోంది అక్కడ.
మెమెరీ స్టోరేజీ పరిణామ క్రమంలో ఇప్పుడు `క్లౌడ్' పెద్ద పీట వేసుకుని కూర్చుంది. ప్రతి చోటా క్లౌడ్ లో పెట్టామన్న మాట వినబడుతోంది. మొదట్లో చాలా ఆశ్చర్యం వేసింది. మేఘాల్లో సమాచారం నిక్షిప్తం చేయడమేమిటీ! సినిమాల్లో నారదుడు తన వద్ద బోలెడంత సమాచారం దాచుకుని (భద్రపరుచుకుని) మేఘాల్లో సంచరిస్తూ కావలసిన వారికి , కావలసిన సమయానికి చేరుస్తుంటాడు. ఈ రకంగా ఆలోచిస్తుంటే, రేపో మాపో క్లౌడ్ కి నారదుడే ఆధ్యుడన్న కొత్త వాదన మనోళ్లు లేవనెత్తుతారనే అనిపిస్తోంది. క్యాసెట్లు రావడానికి ముందు సినిమా పాటలు, మాటలు వినాలంటే గ్రామ్ ఫోన్ రికార్డ్ కొనేవాళ్లం. ఘంటసాల భగవద్గీత గ్రామ్ ఫోన్ రికార్డ్ మీద ప్లేచేసి వినడం చాలా మంది ఇళ్లలో చూశాను. చిన్నప్పుడు రేడియో పెట్టెలోంచి మాటలు వస్తుంటేనే ఆశ్చర్యపోయిన నేను పళ్లెం లాంటి గ్రామ్ ఫోన్ రికార్డ్ నుంచి పాటలు, మాటలు వినబడటం మరింత ఆశ్చర్యమేసేది. మరి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తర్వాత చెబుతాను. (మళ్ళీ కలుద్దాం)