31, డిసెంబర్ 2013, మంగళవారం

మా ఊరు చెబుతున్న శుభాకాంక్షలు

ఈ బ్లాగ్ ను ఆదరిస్తున్న బంధుమిత్రులందరికీ మా ఊరి తరఫున 2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు. (ఫోటోలో కనిపిస్తున్నది మా ఊరి శివాలయం)

28, డిసెంబర్ 2013, శనివారం

కళ్లలోన కళ్లు పెట్టి చూడవెందుకు ...

 
 మా ఊరు (అడవి రావులపాడు గ్రామం) చాలా చిన్నఊరు. అందులో సొంతంగావ్యవసాయం చేసుకునే కుంటుంబాలు చాలా తక్కువ. అలాంటి ఊర్లో మాకు (మా నాన్నగారు మల్లేశం గారికి) పెద్ద వ్యవసాయమే ఉండేది. క్రమక్రమంగా ఎకరాలు కరిగిపోతున్నా, నాకు ఊహతెలిసిన తర్వాత కూడా గౌరవనీయ స్థానంలోనే వ్యవసాయం సాగుతుండేది. పొలం దున్నే ఎద్దులు, కోడెలు కాకుండా గోవుల సంపదకూడా గణనీయంగా ఉండేది. ఎండాకాలం మేము (మా అన్నయ్య కోటేశ్వరరావు, మా అక్కయ్య వరలక్ష్మితో సహా) గుంటూరు నుంచి మా ఊరు వచ్చి (ముఖ్యంగా ఎండాకాలం) దాదాపుగా రెండు నెలలు ఉండేవాళ్లం. అప్పుడు మాకు పల్లెటూరు కబుర్లు బోలెడు తెలిసేవి. ఇంతకీ ఇక్కడ ఇచ్చిన టైటిల్ (కళ్లలోన కళ్లు పెట్టి చూడవెందుకూ ) కథ చెప్పాలి కదా, వినండి మరి.
   మా ఊర్లో ఉన్న రోజుల్లో నాకు ఆవు దూడలతో మంచి నేస్తం కుదిరేది. అవి నా వెంటే తిరుగుతుండేవి. వాటి ఆలనా-పాలనతో నాకు పొద్దే తెలిసేది కాదు. ఒక ఏడాది ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. అప్పుడు నా వయసు 12 ఏళ్లు ఉంటాయేమో. మేము సెలవలన్నీ గడిపేశాక, తిరిగి నందిగామకు (అక్కడి వరకు ఎడ్లబండిమీద వెళ్ళాలి) ఆ తర్వాత గుంటూరుకు వెళ్ళాలి. అలా బండిమీద మేము నందిగామ వెళుతుంటే, ఈ రెండు ఊర్ల మధ్య (అడవి రావులపాడు - నందిగామ) మధ్య పాపరావు చెరువుకట్ట అని ఒకటుండేది. అలాగే దానికంటే ముందే (రావులపాడు నుంచి వెళుతున్నప్పుడు) చిన్ననరసయ్య బావి వచ్చేది. అలా మేము బండిమీద వెళుతున్నామా, ఒక ఆవుదూడ మా బండి వెంటే వస్తున్నది. ఎంతదాకా వచ్చిందంటే రెండు కిలోమీటర్ల దాకా వచ్చేసింది. అది గమనించిన మా జీతగాడు (పేరు కోటయ్య అనుకుంటా) ఇలా అన్నాడు `చిన్నబ్బాయిగారు మీరోసారి బండి దిగి దాన్ని వెనక్కి తోలండి' . ఆ మాట విని నేను కిందకు దిగి ఆ ఆవుదూడను నిమిరాను. అది చాలా సంతోషించింది. కళ్లలోన కళ్లుబెట్టి చూసింది. `ఎందుకు నన్ను విడిచి వెళ్లిపోతున్నావ్ ' అన్నట్టుగా చూసింది. దాన్ని బుజ్జగించి వెనక్కి పంపడం నాకు చేతకాలేదు. మా చిన్న జీతగాడు (వెంకటేశ్వర్లు) పరుగుపరుగున వచ్చి దాన్ని తోలుకుపోయాడు. నాకెంతో బాధేసింది. ఆ తర్వాత అది ఎంత ఎదిగినా, నన్ను చూసి ఇట్టే గుర్తుపట్టేది.
  ఊర్లో చేతబడుల భయం గురించి తర్వాత చెబుతాను. మరి మీ ఊర్లోని విశేషాలు కూడా ఈ పేజీలో పంచుకోండి. - మీ తుర్లపాటి నాగభూషణ రావు (నాగరాజు)- 988 529 2208
   

10, డిసెంబర్ 2013, మంగళవారం

మహామనిషి మల్లేశం



ఈరోజు మా నాన్నగారు తుర్లపాటి వెంకటమల్లికార్జున వరప్రసాదరావు - (టీవీఎంవీ ప్రసాదరరావు - మల్లేశంగారు) ఆబ్దికం. ఆంగ్లసంత్సరం ప్రకారం ఆయన లింగైక్యమైన రోజు డిసెంబర్ 5 (2000 సంవత్సరంలో). అయితే నవమినాడు లింగైక్యమయ్యారుకనుక ఆబ్దికం ఈరోజు. ఆజానుబాహులు, స్ఫురధ్రూపి, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎలాంటి సమస్యలనైనా ఎదురొడ్డి పోరాడగలిగిన ధీశాలి అయిన మా పిత్రుదేవులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి ఫోటోతోపాటుగా మాత్రుమూర్తి స్వరాజ్యలక్ష్మి (ఫిబ్రవరి 28, 1986లో లింగైక్యం చెందారు) తో వారు దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేస్తున్నాను. మా నాన్నగారు శివైక్యం చెందిన తర్వాత (నందిగామలో) పార్థివ శరీరాన్ని స్వస్థలమైన అడవిరావులపాడుకు తీసుకువెళ్ళాము. అక్కడే అంత్యక్రియలు పూర్తిచేశాము. అక్కడి లింగైక్య స్థలిని ఈ మధ్యనే నేను అడవిరావులపాడు వెళ్ళినప్పుడు దర్శించుకుని శ్రద్ధాంజలి ఘటించాను.

సేవాతత్పరుడు

  అడవిరావులపాడు గ్రామాభివృద్ధికి మల్లేశం గారు ఇతోధికంగా సేవలందించారు. ఆయన దేవాదాయధర్మాదాయ శాఖలో నాలుగు దశాబ్దాలపాటు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా పనిచేసినప్పటికీ, నిత్యం శివపూజలు చేస్తున్నప్పటికీ వారి మనసులో అన్యమతాల పట్ల ద్వేషభావం ఉండేది కాదు. అందుకే గ్రామంలో చర్చిల నిర్మాణం సమయంలో వీరు విరాళం ఇచ్చారు. ఆయన లింగైక్యం చెంది దశాబ్దం దాటినా అనేక మంది గుండెల్లో ఆయన ఇప్పటికీ నిలిచే ఉన్నారు.

నిరుద్యోగలపాలిట `దేవుడు'

  దేవాలయాల్లో కానుకలను హుండీలోనే వేయాలనీ, అప్పుడే అవి దేవాలయ అభివృద్ధికి దోహదకారి అవుతాయని అంటుండేవారు. హారతి పళ్లెంలో వేస్తే అవి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే చెందుతాయనీ   చెప్పేవారు.  అనేక దేవాలయాల్లో పేదరికంతో బాధపడుతున్న అర్చక కుటుంబాలవారికి ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే ఇతర కులాలవారికి కూడా తనకు చేతనైన పరిథిలో ఉద్యోగాలు ఇప్పించేవారు. 
పుణ్యదంపతులు


మాట కటువు, మనసు వెన్న

  ఎవరైనా వచ్చి, నా పరిస్థితి బాగోలేదు, సాయం చేయమని అడిగితే చాలు, తన జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చేవారు. వ్యక్తి స్వార్థం, కుటుంబ స్వార్థం కంటే, సమాజహితమే గొప్పదని చెబుతుండేవారు. మాట కటువుగా ఉన్నా, మనసు వెన్నపూస. కొంతమంది ఆయన మాటతీరుతో ఆయనది పాషాణ హృదయమనీ, ఆయనలో ప్రేమానురాగాలు లేవని అనుకునేవారు. కానీ అది నిజం కాదు. ప్రేమను వ్యక్తీకరించినమాత్రానే వారిలో ప్రేమ పొంగుతుందని అనుకోవడం భ్రమ. ఆ భ్రమ ముసుగులు తొలిగించి చూస్తే, హృదయంలోపల నిండుగా ఉన్న ప్రేమ సాక్షాత్కరిస్తుంది. 

ధర్మమూర్తి 

  న్యాయం, ధర్మం ఆయనకు ఆరో ప్రాణం. అధర్మంగా ఎవరు మాట్లాడినా వారికి కోపం చిర్రెత్తుకొచ్చేది. అసలే ముక్కుసూటి మనిషి, ఆపైన నిజాయితీపరులు...అందుకే ఆయనవద్దకు వచ్చి అక్రమాల గురించి మాట్లాడటానికి ఎవ్వరూ సాహసించేవారు కారు. ఓసారి ఫోటో చూడండి. ఆ ముక్కుసూటి తనం మీకే తెలుస్తుంది. 
   (మా నాన్నగారి గురించిన మరికొన్ని విశేషాలు మరోసారి చెబుతాను)
                                                                               - తుర్లపాటి నాగభూషణరావు (988 529 2208)


3, డిసెంబర్ 2013, మంగళవారం

దూడలకు డిసిప్లీన్ నేర్పిన అన్నయ్య


ఇప్పుడంటే పెద్దవాళ్లమైపోయాం , కానీ అప్పట్లో
 చిన్నవాళ్లమే, ఆటపాటలకు ఈ ఇల్లే వేదిక
  అడవిరావులపాడులో మా పాత ఇంటి గురించి చెప్పుకుంటున్నాము కదా. దాదాపు 200 సంవత్సరాల కిందట కట్టిన ఇల్లు అది. సమ్మర్ వస్తే చాలు మా కుటుంబమంతా ఛలో రావులపాడు అంటూ గుంటూరు నుంచో, మంగళగిరి నుంచో అంతకు ముందు విజయవాడ నుంచో వెళ్లేవాళ్లం. వేసవి సెలవుల్లో ఆ పల్లెటూరులో బోలెడన్ని ఆటలు ఆడుకునేవాళ్లం. ఇప్పుడు మీరు చూస్తున్న ఇంటి వెనుక అప్పట్లో ఓ పెద్ద వేపచెట్టు ఉండేది. వేసవి వడగాలులు వీస్తున్నా నేచురల్ ఎయిర్ కండిషనర్ లాగా ఈ వేపచెట్టు పనిచేసేది. ఆ చెట్టుకింద చాలా చల్లగా ఉండేది. అందుకే మా సమ్మర్ ఆటలకు వేపచెట్టే ఓ వేదిక.
  అలా ఓరోజు వేపచెట్టు కింద ఆడుకుంటుంటే మా అన్నయ్యకు సడన్ గా `ఆపరేషన్ డిసిప్లీన్' ఆలోచన వచ్చింది.  ఆలోచన రావడం తరువాయి, నాకు చెప్పాడు.  `ప్రాజెక్ట్ డిసిప్లీన్' ఏమంటే, ఆవుదూడలకూ, కోడె దూడలకు డిసిప్లీన్ నేర్పడం.
   ఆలోచన బేషుగ్గా ఉంది. ఇంతకీ ఆవుదూడలకు డిసిప్లీన్ ఎందుకు నేర్పాలి? అవి ఏం తప్పుచేశాయి? అని మీరు అడగవచ్చు.  అడగాలి కూడా.  అంతకు ముందు సెలవులకు వచ్చినప్పుడు కూడా మేము గమనిస్తూనే ఉన్నాము.  కాడిగట్టే ఎద్దులు, పెద్ద ఆవులు చాలా బుద్ధిమంతుల్లాగా (బుద్దిమంతురాళ్లాగా) వేసిన చొప్పను (గడ్డిని) కాళ్లతో తొక్కకుండా నీట్ గా తింటుంటే, ఈ కుర్ర దూడలు, బుజ్జి దూడలు, పోకిరీ దూడలు తమకు వేసిన గడ్డిని తిన్నంత తినడమూ, కాళ్లతో తొక్కేయడమూ, తినడానికి వేసిన గడ్డిమీదనే పడుకుని దొర్లడం చేస్తున్నాయి.
  ఔరా !!  ఎంత సాహసమూ, ఈ బుడంకాయ దూడలకు ఎంతటి కండకావరమూ. ఈ దిక్కారములను సైతుమా - అంటూ వాటికి కచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకున్నాము. కానీ ఎలా అన్నది తేలలేదు. ఇప్పుడు అన్నయ్య సడన్ గా `ఆపరేషన్ డిసిప్లీన్' గురించి చెప్పగానే `ఎస్, ఇదే కరెక్ట్,  రౌడీ దూడలకు బుద్ధి చెప్పాల్సిందే  ' అని అనుకున్నాము.
  ఇంతకీ `ఆపరేషన్ డిసిప్లీన్'ను అమలు చేయడం ఎలా ? అన్నది ఇప్పుడు మా ముందున్న ప్రశ్న.  ఎద్దులు కట్టేసిన ప్రాంతానికి వెళ్లాము. నిశితంగా గమనించాము. పెద్దఆవులు (ఎర్రావు, బోడావు, కోపిష్టి ఆవు, శాంత ఆవు...) కట్టేసిన  ప్రాంతాన్నీ గమనించాము. అప్పుడు మాకు అర్థమైందీ ఓ విషయం. అదేమంటే,  సదరు ఎద్దులు, పెద్దావులు బుద్ధిమంతుల్లా మేత మేస్తున్నాయంటే, వాటి ముందు దుంగలు ఉన్నాయి. గోడకు కొద్ది ఎడంగా ఈ దుంగలు పరచడంవల్ల గోడకీ, దుంగకీ మధ్య ఉన్న ఖాళీ ప్రాంతంలో జీతగాళ్లు చొప్పవేసిపోతున్నారు. గడ్డి (చొప్ప) గాడిలోనే ఉంటుందే తప్ప చెల్లాచెదురు కాదు. దీంతో `పెద్దవి ' తమకోసం వేసిన `ఆహారాన్ని' చిందరవందర చేయకుండా బుద్ధిగా తినగలుగుతున్నాయి. అదే `చిన్నదూడలకు ' ఆ సౌకర్యం కల్పించలేదు. ఎందుకు కల్పించలేదు ? అంటే, జీతగాళ్లు వివక్ష చూపుతున్నారన్నమాట. పెద్దవాటిని పట్టించుకుని చిన్నవాటిని (అంటే మాలాంటి వాటిని) పట్టించుకోవడంలేదన్నమాట.
నాకు డిసిప్లీన్ నేర్పుతారా, సరే కానివ్వండి...

  నిజమే, వివక్ష చాలానే ఉంది. పొలం దున్నే ఎద్దులు (కోడెలు) - వీటికి అగ్రతాంబూలం. అప్పట్లో మా ఇంట్లో  పొలం పనులు  చేసే కోడెలు రెండు ఉన్నాయి. వాటికి మా అన్నయ్యే పేర్లు పెట్టాడు. వాటిలో ఒక దాని పేరు కాటుక కళ్ల కోడె, రెండోది బూడద కళ్ల కోడె. వీటిలో ఒకటి శాంతమూర్తి, మరొకటిది మహా కోపిష్టిది. కొబ్బరి చెక్క, వేరుశనగ చెక్క , తౌడు ఇలాంటి స్పెషల్ ఐటెమ్స్ అన్నీ వాటికే ఎక్కువ పెట్టేవారు. ఎదో అరకొరగా మిగతా వాటికి విదిలిచ్చేవారు.  అలాగే ఎద్దులకు, పెద్దావులకు దుంగలు పరచి చొప్ప వేసినట్టుగానే పిల్లపశువులకు కూడా వేయాలని అడిగాము.  జీతగాళ్లను నిలదీశాం. అలా కుదరదని చెప్పాము. వారు ఓ నవ్వునవ్వి ఊరుకున్నారు. దాంతో మాకు కోపం నషాలానికి అంటింది. ఈ వివక్షను అంతం చేయాలి. ఇదే మా ఆలోచన. అందుకే మేమో సొంత నిర్ణయం తీసుకున్నాము. అదే ఆపరేషన్ డిసిప్లీన్ అమలు చేయడం.
  జీతగాళ్లు లేని సమయం చూసుకుని నేనూ మా అన్నయ్య (కోటేశ్వరరావు) కొష్ఠంలోకి వెళ్ళి ఒక దుంగను సెలెక్ట్ చేశాము.  ఆ దుంగను మోసుకెళ్ళి దూడలను కట్టేసేచోట గోడవారగా వేయాలి. అప్పుడు బుజ్జిదూడలు కూడా డిసిప్లీన్ నేర్చేసుకుని బుద్ధిగా తింటాయి. దీనివల్ల మరో ప్రయోజనం ఏమంటే, గడ్డి వేస్టు కాదు. అంటే మా ఆపరేషన్ డిసిప్లీన్ వల్ల చొప్ప ఆదా అవుతుందన్నమాట.
  ఇకనేం, దుంగను ఒక వైపు నేనూ, మరోవైపు మా అన్నయ్య పట్టుకున్నాము. నేను అప్పట్లో చాలా అర్భకంగా ఉండేవాణ్ణి. చేతులకు అసలు బలం ఉండేది కాదు. సదరు దుంగ బరువెంతో తెలియని అమాయకస్థితిలో ఇద్దరమూ ఎత్తేశాము. అంతే నా వైపున్న దుంగను వదిలేశాను. ఇంకేముందీ, మరుక్షణంలో ఏడుపు. కుడికాలి పాదం పైభాగంలో గాయం. రక్తం కారుతోంది. మా అన్నయ్య కంగారుపడ్డాడు. ఆ తర్వాత కథ మామూలే. మొత్తానికి దూడలకు డిసిప్లీన్ నేర్పాలన్న మా అన్నయ్య ఆపరేషన్ సక్సెస్ కాలేదు.

  (సూచన : ఇలాంటి అనుభవాలు ఎమైనా ఉంటే మరి మీరు కూడా పంచుకోండి. పల్లెవాసన కేవలం రావులపాడుకోసమే పెట్టింది కాదు. అలాగే కేవలం మా కుటుంబం కోసమో, తుర్లపాటి వారికోసమో పెట్టింది అంతకన్నా కాదు. పల్లెవాసన తెలిసిన ప్రతి వ్యక్తి స్పందించడానికి ఏర్పాటు చేసిన వేదిక ఇది. ఇక మీదే ఆలస్యం. మీ రచనలను nrturlapati@gmail.com కి పంపించండి. - మీ నాగభూషణ రావు తుర్లపాటి)










2, డిసెంబర్ 2013, సోమవారం

ఈ పాడుబడ్డ ఇంట్లో ఏమున్నాయి?

అడవిరావులపాడులో లక్షలాది మందిని పలకరించిన ఇల్లు
ఇప్పుడు మీరు చూస్తున్న ఈఇల్లు పూర్తిగా శిథిలావస్తకు చేరుకుంది. గోడలు పడిపోతున్నాయి. మొన్నీమధ్య హెలెన్ తుపాను వచ్చినప్పుడు ఇంటి వెనక గోడ కూడా పడిపోయింది. అయినా ఈ పాడుబడ్డ ఇంట్లో ఏమున్నాయన్న ఆతృత చాలామందిలో కనిపిస్తోంది. మొన్నీమధ్య నేను రావులపాడు వెళ్ళినప్పుడు అక్కడి మిత్రులు ఓ సూటి ప్రశ్న వేశారు. ఇక ఈ ఇల్లు నిలబడదు, కొత్తది ఎప్పుడు కట్టుకుంటారని. ఇల్లు చూశాక నాకూ అదే అనిపించింది. మేము చిన్నతనంలో ఆడుతూ, గెంతుతూ బోలెడన్ని కబుర్లు చెప్పుకున్న ఈ ఇల్లు అదృశ్యంకావడానికి ఇక ఆట్టే రోజులు పట్టదని. ఆ ఇంటి గోడలను ఆత్మీయంగా సృజించాను. అక్కడి తలుపులను తడిమాను. అవి నాతో ఏవో కబుర్లు చెబుతున్నట్టే అనిపించింది. మా అన్నయ్య (కోటేశ్వరరావు) మా అక్కయ్య (వరలక్ష్మి) మా బంధువుల పిల్లలు శ్రీను, రాము, వెంకటేశ్వరరావులతో మేము ఆడుకున్న ఆటలు గుర్తుకువచ్చాయి. కరెంట్ లేని రోజుల్లో చీకటి పడకముందే మా అమ్మ పిల్లలకు వేడివేడి అన్నం (ఒక్కోసారి జొన్నన్నం - దీని గురించి మరోసారి వివరంగా చెబుతానే) వడ్డించేది. అదే సమయంలో మా చిన్న జీతగాడు (ఇప్పుడు మా పొలం చూస్తున్న వెంకటేశ్వర్లు అప్పట్లో చిన్న జీతగాడుగా ఉండేవాడు) మసిపట్టిన దీపం గాజుబుడ్లను పాతగుడ్డతో తుడుస్తుంటే, మరో పక్క కొష్ఠం (పశువులు ఉండే పాక)లో ఆవులు అంబాఅంబా అని అరుస్తుంటే, ఇంకోవైపు తెగబలిసిన ఆంబోతు `నేనొస్తున్నానం'టూ ఆవులకు సిగ్నల్ ఇస్తుంటే, ఆంబోతు రంకెలకు మా లేత గుండెలు అదిరిపోతుంటే అన్నం కానిచ్చేసి, చేతులు తుడుచుకున్న వేళ మా బామ్మ (అన్నపూర్ణమ్మ) ఇంటి బయట ఆవరణలో పిల్లలకు పక్కలు వేయమని చినజీతగాడికి పురమాయించేది. (అలా వేసిన పక్కలమీద నడుం వాల్చిన తర్వాత పక్కింటివాళ్లు, ఆ పక్కింటివాళ్లు మా మంచాలకు చుట్టూ చేరి బోలెడు పాటలు, కథలు చెప్పేవారు. వీటి గురించి కూడా మరోసారి చెబుతాను) 
ఇప్పటికీ నాలో జీవం ఉన్నదని ఠీవీగా నిలబడిన ఇంటి ముందు దీర్ఘాలోచనలో నేనూ మా అన్నయ్య 

   పేడతో బాగా అలికిన ఇల్లు అది. సిమెంట్ లేకపోయినా ఆ ఇంటిగోడలు చాలా గట్టిగానే ఉండేవి. ఒకప్పుడు అది మండువా ఇల్లేనట. కానీ ఆర్థిక అవసరాల నిమిత్తం అమ్మేయడం వల్ల ఇల్లు ఇలా సగానికి చీలిపోయింది. దీంతోనే ఆయుష్షు మూడిందని అనుకునేవారట. కానీ ఇల్లు చీలినా, గోడలు కూలినా, దర్వాజాలు పక్కకు వొరుగుతున్నా,, దూలాలు జారుతున్నా ఆ ఇల్లు ఎన్నో కథలు చెబుతునే ఉంటుంది. (ఆ వివరాలు మరోసారి చెప్పుకుందాం) 

 
  

26, నవంబర్ 2013, మంగళవారం

జ్ఞాపకాలు



అడవి రావులపాడుతో నా జ్ఞాపకాలు ఎన్నో పెనవేసుకుని ఉన్నాయి. మా బామ్మ (అన్నపూర్ణమ్మగారు) ఆ పల్లెటూర్లోనే ఎక్కవ కాలం ఉండేవారు. మా మేనత్త (సీతారావమ్మ) తన తల్లితో అప్పుడప్పుడూ మా ఊర్లో ఉండేవారు. మా బామ్మ అంటే నాకూ , మా అన్నయ్య (కోటేశ్వరరావు) మా అక్కయ్య (వరలక్ష్మి)లకు చాలా ఇష్టం. మా బామ్మకూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేది. మా నాన్నగారు (టివీఎంవీ ప్రసాదరావు ఉరఫ్ మల్లేశం గారు ) దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా పనిచేస్తుండేవారు. ట్రాన్స్ ఫర్స్ ఎక్కువగా ఉండే జాబ్ అది. అంచేత మా కుటుంబం ఏ ఊర్లో ఉన్నా మా బామ్మ మాత్రం పొలాలూ గట్రా చూసుకుంటూ అడవి రావులపాడులోనే ఉండేది. ఆమె వాకిట్లో కూర్చుంటేచాలు వచ్చేపోయేవాళ్లనీ - ఎవర్రా ఆ పోయేదీ ?- అంటూ అడిగేది. `నేను చినరత్తయ్యను', `నేను వెంకయ్యను ' అని వారు సమాధానం చెప్పాల్సిందే. ఆ తర్వాత వారితో చాలా ఆప్యాయంగా మాట్లాడేది మా బామ్మ. ఎండాకాలం సెలవులు వస్తే చాలు, మా అన్నయ్య, అక్కయ్య, నేనూ ఎంతో సరదాగా మా ఊరు వెళ్లేవారము. గుంటూరులో మేము ఉన్నప్పుడు అక్కడి నుంచి విజయవాడ వచ్చి, అక్కడ బస్సుమారి జగ్గయ్యపేట బస్సు ఎక్కి నందిగామ వచ్చేవారము. మేము వస్తున్నామని తెలియగానే మా కోసం గూడుకట్టిన ఎడ్లబండిని మా బామ్మ పంపించేది. ఆ ప్రయాణం ఎప్పుడు తలచుకున్నా ఆనందమే కలుగుతుంది. అడవిరావులపాడు పక్క నుంచే ఒక వాగు పారుతుంటుంది. ఆ వాగుకూ ఓ కథ ఉందట. 
(మరోసారి మిగతా విషయాలు చెబుతాను. మరి మీరు కూడా ఈ ఊరితో మీ సంబంధాలు గుర్తుచేసుకోండి) - మీ తుర్లపాటి నాగభూషణ రావు (నాగరాజు) 900 152 855, 988 529 2208

25, నవంబర్ 2013, సోమవారం

కథ తెలుసా ? అయితే చెప్పండి

అడవిరావులపాడు శివాలయంలోని శిలాఫలకం

అడవిరావులపాడు శివాలయంలో ఉన్న శిలాఫలకం
కథకావచ్చూ, చరిత్ర కావచ్చు ఎక్కడో ఒక చోట ప్రారంభమవుతుంది. అదే తొలి అడుగు. మరి అడవిరావులపాడు గ్రామాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పం చెప్పుకున్న ఆ పెద్దాయన (మూల పురుషుడు) ఎవరు ? ఏ పరిస్థితుల్లో ఆయన సొంతంగా ఊరునే నిర్మించుకోవాలని అనుకున్నారు ? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలు సేకరించే పనిలో పడ్డాను. మరి మీకు తెలిసిన సంగతలు, ఆ గ్రామంతో మీకున్న అనుబంధాన్ని ఈ పేజీలో ఉంచండి. అందరికీ ఉపయోగపడుతుంది. వివరాలను నాకు ఫోన్ చేసి కూడా చెప్పవచ్చు . నా ఫోన్ నెంబర్ 988 529 2208, 9000 152 855 (ఇండియా- ఆంధ్రప్రదేశ్). దేశంలోని వివిధప్రాంతాల్లోనూ, అలాగే విదేశాల్లో ఉన్నమన ఊరి తుర్లపాటి వారంతా సహకరించాల్సిందిగా విన్నపం.

ప్రతి ఊరికీ చరిత్ర ఉంటుంది. అలాగే కృష్ణాజిల్లా నందిగామ మండలం అడవి రావులపాడుకీ చరిత్ర ఉంది. ఆ చరిత్రను ముందుతరాల వారికీ అందించాలన్న తపనే ఇది. ఈ గ్రామంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గ్రూప్ ద్వారా మీ అభిప్రాయాలను పంచుకోండి. కలసి ఉంటే కలదు సుఖం, అందుకే ఈ పేజీ మీకంకితం

                                                                                               - మీ తుర్లపాటి నాగభూషణ రావు (9000 152 855, 988 529 2208)