8, మార్చి 2014, శనివారం

శివున్ని ఏ పూలతో పూజిస్తే ఏ ప్రాప్తి లభ్యమవుతుంది?


శివున్ని ఏ పూలతో పూజిస్తే ఏ ప్రాప్తి లభ్యమవుతుంది? 
ఉమ్మెత పూలతో పూజిస్తే పుత్రప్రాప్తి , 
జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి,
తుమ్మి పూలతో పూజిస్తే మోక్ష ప్రాప్తి,
నందివర్థనం తో పూజిస్తే సౌందర్య ప్రాప్తి,
నువ్వుపూలతో పూజిస్తే యవ్వన ప్రాప్తి,
గన్నేరు పూలతోపూజిస్తే శత్రునాశనం,
శిరీష పుష్పాలతో సంతోషం మీ సొంతమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
పూజిస్తే సంతోషం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయ.


శివలింగానికి అభిషేకం ఎందుకు ? 

శివ లింగానికి అభిషేకం ఎందుకు చేయాలి ? శాస్త్రాలు చెబుతున్నది ఏమంటే...లోక సంరక్షణార్థం హాలాహలాన్ని(విషం) మింగిన ఆ స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా చేసే ప్రక్రియ అభిషేకం. పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరినీరు అనే పంచామృతాలతో స్వామిని అభిషేకిస్తే స్వామి చల్లబడతాడు, సంతోషిస్తాడట. అందుకే ఈ అభిషేకాలు.

ఏది శైవం మరేది కాదు..

శివమూర్తిని పూజించి, అర్చించే విధానాన్నే శైవమని అంటారు. ఈ శైవం ఎనిమిది రకాలు.
ఆ 8 రకాల శైవం వివరాలు ఇవి...అనాది శైవం, ఆది శైవం, పూర్వ శైవం, విశ్ర శైవం, శుద్ధ 
శైవం, మార్గ శైవం, సామాన్య శైవం, వీర శైవం. ఈ ఎనిమిదింటిలో ప్రముఖమైంది వీర శైవం. తాము చేసే పూజా విధానంలో ఎటువంటి లోపం జరిగినా, ఎలాంటి ఆటంకం కలిగినా ప్రాణాలను గడ్డిపోచతో సమానంగా వదిలివేయడం వీర శైవంలోని ప్రధాన లక్షణంగా చెబుతుంటారు. అయితే కాలంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగానే వీరశైవ ఆరాధాకుల్లో కూడా ఇప్పుడు అంతటి పట్టింపులు ఉన్నట్టు కనబడటంలేదు. 

శివపురాణం:

అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.
శివ పురాణములో 26,000 శ్లోకాలు (మరొక లెక్కన) ఉన్నాయి. శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు

శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున (అంటే శివరాత్రి రోజునే) దీక్షను తీసుకుంటారు. ఇక భారత దేశంలో 12 చోట్ల ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిశాయి. లింగం జ్యోతిరూపంలో వెలిసిన క్షేత్రాలివి.
రామనాథ ఆలయం, రామేశ్వరం, తమిళనాడు
మల్లికార్జునేశ్వర ఆలయం, కృష్ణా నది తీరంలో, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
భీమశంకరం, డాకిని, పూణ దగ్గర, మహారాష్ట్ర
త్ర్యంబకేశ్వరాలయం, గోదావరి నదీ తీరంలో, నాసిక్ దగ్గర, మహారాష్ట్ర
గుస్మేశ్వర ఆలయం, ఔరంగాబాద్ దగ్గర, మహారాష్ట్ర
ఓంకారేశ్వరాలయం, నర్మదా నదీతీరంలో, అమలేశ్వర్, మధ్యప్రదేశ్
సోమనాథ్ ఆలయం, సోమనాథ్, గుజరాత్
నాగనాథ ఆలయం, దారుకావన, ద్వారక దగ్గర, గుజరాత్
మహాకాళేశ్వర ఆలయము, శిప్రా నదీ తీరంలో, ఉజ్జయిని
కేదరేశ్వరాలయం, కేదారనాథ్, ఉత్తరాచల్
కాశి విశ్వనాథుని ఆలయం, వారాణసి, ఉత్తరప్రదేశ్
వైద్యనాధుని ఆలయం, జైసిద్ దగ్గర, బీహార్


శివరాత్రి జాగారం

శివరాత్రి జాగారం చేస్తే కలిగే లాభం ఏంటిట? దీనికి శివపురాణం ఏమని చెబుతుందంటే... పర్వదినం, పుణ్యదినం అయిన శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే సమస్యలు నివారింపబడతాయి. కోరికలు సఫలమౌతాయి. పెళ్ళి కానివారికి పెళ్ళి అవుతుంది. తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. సద్గతులు లభిస్తాయట. (కేవలం మెలుకువగా ఉండటంకాదండోయ్. శివధ్యానంలో తనువూ, మనసూ ఆ పరమేశ్వరునికి సమర్పించాలి. అదే నిజమైన జాగారం)


(వీటిపై మీ అభిప్రాయాలను కోరుతున్నాను)
                                                                 - నాగభూషణ రావు తుర్లపాటి - 988 529 2208

రామాలయం పునర్నిర్మాణం

చిన్న ఊరు. ఆ ఊరికి తగ్గట్టుగానే ఓ చిన్ని ఆలయం. అది రాములవారు కొలువైన ఆలయం. ఆంజనేయులవారు అభయం ఇస్తున్న ఆలయం. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలన్న సంకల్పం ఊరి పెద్దలకు కలిగింది. గుడి ఆనుకుని ఒక వైపు ఊరి ప్రధాన రోడ్డు ఉంది. దీంతో అటువైపు విస్తరించే అవకాశం లేదు. దానికి వ్యతిరేక దిశలో ఉన్న ఖాళీ స్థలంలో కొంతభాగాన్ని ఊరి రైతు మల్లయ్య ఆలయం కోసం  ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో ఈఏడాది శ్రీరామనవమి అయిన తర్వాత పునర్నిర్మాణ పనులు చేపడతారు. పనులన్నీ పూర్తయ్యాక ఈ ఫోటోలో మీరు చూస్తున్న రామాలయం కనిపించదు. కొత్త అందాలతో సాక్షాత్కరిస్తుంది.
రామాలయం విస్తరణకు స్థలం ఇచ్చిన రైతుతో తుర్లపాటి నాగ్

    మా ఊరి నడిబొడ్డున ఉన్న ఈ రామాలయానికి వెనుక వైపున మైయిన్ రోడ్డుపైనే ఉత్తర ముఖద్వారంతో మా ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎప్పుడూ సెంచరీ కొట్టేసింది. పడిపోవడానికి సిద్ధంగా ఉంది. మేము చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అడవిరావులపాడు వెళ్ళినప్పుడు మండుటెండలో ఆడుకోవడానికి ఈ రామాలయం మాకో వేదికగా ఉండేది. అక్కడి బండలమీద పచ్చీస్, మేక-పులి ఆటలు ఆడుకోవడానికి గళ్లు గీసి ఉండేవి. ఊర్లోని వాళ్లు అక్కడచేరి ఆటలు ఆడుకునేవారు. ఒక రకంగా చెప్పాలంటే మండువేసవిలో చల్లనినీడ ఇస్తుండేది ఈ రామాలయం. చల్లని పాలనకు సంకేతంగా నిల్చిన రామాలయం ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఆ శ్రీరాముడు మా ఊరుని చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాను.
                                                                                         - తుర్లపాటి నాగభూషణరావు - 988 529 2208

తుర్లపాటి ప్రసాద్ గృహప్రవేశ వేడుక

తుర్లపాటి ప్రసాద్ తో నాగ్ (గృహప్రవేశ వేడుకలో)
మార్చి 7వ తేదీన (2014) మా తుర్లపాటి వంశస్థుడైన తుర్లపాటి ప్రసాద్ నూతన గృహప్రవేశ వేడుక హైదరాబాద్ లోని షేక్ పేట్ దర్గా సమీపంలోని ఓ.యుకాలనీలో (వెస్ట్రన్ ప్లాజా- బి.104) వైభవంగా జరిగింది. మర్నాడు 8వ తేదీన రుద్రాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు నేనూ, నా కుటుంబసభ్యులు వెళ్లాం. తుర్లపాటి శ్యామమోహన్ రావు కుమారుడైన ప్రసాద్ చాలా చురుకైన కుర్రాడు. అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి.
ప్రసాద్ తల్లిదండ్రులు

  ప్రసాద్  ప్రస్తుతం అమెరికాలోని San Antonio, Texas లో ఉంటున్నారు. ఇతను టాటా కన్ సల్టెన్సీ సర్వీసెస్ లో అమెరికా బిజినెస్ యూనిట్ లో గ్లోబల్ క్లైంట్ డెరెక్టర్ గా పనిచేస్తున్నారు.

  గృహప్రవేశ వేడుక సందర్భంగా బంధుమిత్రులను కలుసుకునే అవకాశం నాకు కలిగింది. ఈ శుభసందర్భంలో తుర్లపాటి ప్రసాద్ కుటుంబసభ్యులకు - తుర్లపాటి -అడవిరావులపాడు (పల్లెగాలి) హార్ధిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.
(ఈ వేడుకలో పాల్గొన్నవారు ఇతరులు మరింత సమాచారం అందిస్తే సంతోషిస్తాను)
- మీ తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208

   

4, మార్చి 2014, మంగళవారం

పారిశ్రామిక వాడగా అడవిరావులపాడు ఎదగబోతున్నదా ?


నందిగామ నుంచి అడవిరావులపాడు వెళ్తూ..
ఈ ప్రశ్న ఇప్పటికిప్పుడు ఆశ్చర్యాన్నీ, సందేహాలను కలిగించవచ్చు. చాలా ముందస్తు ఆలోచన అని కొట్టిపారేయవచ్చు.  కానీ, కాలచక్రాన్ని గిర్రున ఓ పదిపదిహేను సంవత్సరాలకు ఫార్వార్డ్ చేస్తే,  నేనిప్పుడు ఈ బ్లాగ్ లో రాస్తున్న మాటలు యధార్థమయ్యాయని మీరే అంగీకరిస్తారు. ఇలా నేను రాయడానికి చిలకజోస్యమో, లేదా కోయదొర జోస్యం మీదనో ఆధారపడలేదు. నా లాజిక్స్ నాకున్నాయి. అవి నిజం అవుతాయన్న నమ్మకమూ నాకుంది.
1. అడవిరావులపాడు కృష్ణాజిల్లా నందిగామ మండలంలో ఉంది. ఇది, నందిగామ పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది .
2. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో రియల్టర్ల దృష్టి ఇప్పుడు సీమాంధ్రలోని ఇతరప్రాంతాలతోపాటు, నందిగామ మండలంలోని గ్రామాలమీద కూడా పడింది.
3. నందిగామ నుంచి అడవిరావులపాడు గ్రామానికి వెళ్ళే దారిని చీల్చుకుంటూ  విజయవాడ- హైదరాబాద్ బైపాస్ రోడ్డు వెళుతుంటుంది.
4. ఈ బైపాస్ రోడ్డు దాటాకనే , అడవిరావులపాడు గ్రామంవైపునే పక్కా రోడ్డుకుఆనుకునే ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేసింది.
5. అది దాటాక మరికొంత దూరం (రావులపాడు వైపుకే) వెళితే ఎడమ చేతివైపున ఒక డొంకదారి వస్తుంది. ఆ దారివెంట లోపలికి వెళితే అక్కడ దాదాపు 30 ఎకరాల్లో ఓ ప్యాక్టరీని నిర్మించడానికి ప్రాంతీయపార్టీకి చెందిన రాజకీయ నాయకులొకరు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
6. అదే నిజమైతే, ఆ ప్రాంతం చుట్టుపక్కల కూడా మరిన్ని ప్యాక్టరీలు, `రియల్' ప్రాజెక్టులు వచ్చే అవకాశం లేకపోలేదు.
రోడ్డు పక్కన మెట్టపొలంలో మెరప పంట

7. రోడ్ కనెక్టివిటీ బాగుండటం, పక్కనే వాగు ప్రవహించడంవల్ల నీటి ఎద్దడిఉండదు.
8. మెట్టపొలాలు కావడం వల్ల తక్కువధరలోనే పారిశ్రామికవేత్తలూ, రియల్టర్లు స్థలాలను సేకరించవచ్చు. ఇప్పటికే ఈ కారణంగా పొలాల రేట్లు రెండు రెట్లు పెరిగాయని అంటున్నారు.
9. విజయవాడకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగామ ప్రాంతం (రావులపాడు సహా) అభివృద్ధిచెందే ప్రాంతంగా మారబోతుందనడానికి ఇంతకన్నా ఆధారాలు మరేం కావాలి. సీమాంధ్రలోని ప్రతిగ్రామం అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పుడే హైదరాబాద్ కోల్పోయామన్న బాధ నుంచి విముక్తి దొరుకుతుంది.
                                                                              - తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208




19, ఫిబ్రవరి 2014, బుధవారం

మురి`పాల' అమ్మ

   ఈ రోజు మాఘమాసం బహుళ (కృష్ణ) పంచమి (ఫిబ్రవరి 20, 2014). కాలచక్రాన్ని వెనక్కి తిప్పితే... అది 1986వ సంవత్సరం, ఫిబ్రవరి 28వ తేదీ అంటే ఆరోజు కూడా ఇదే మాసం, ఇదే తిథి. సరిగా ఆరోజున  అత్యంత ప్రేమమూర్తి  మా అమ్మ
తుర్లపాటి స్వరాజ్యలక్ష్మి
గారు (తుర్లపాటి  స్వరాజ్యలక్ష్మి) లింగైక్యమైన రోజు.  స్వర్గీయ తుర్లపాటి వెంకట మల్లికార్జున వరప్రసాదరావుగారి ధర్మపత్ని. 

  ఈ పుణ్య దంపతులకు ఐదుగురు సంతానం. కర్మానుగత విశేషములచే సంతాన ఫలాల్లోని మొదటి ఇద్దరు (పురుషోత్తమరావు, అన్నపూర్ణ) చిన్నవయసులోనే కన్నుమూశారు. మిగిలిన సంతానం ముగ్గురు. వారిలో పెద్దవారు తుర్లపాటి కోటేశ్వరరావుగారు. వీరే మా అన్నయ్య. ఆ తర్వాత వరలక్ష్మి. ఈమె నాకు అక్కయ్య.  చివరివాడిని నేను (నాగభూషణ రావు). 
  ఈరోజు మా అమ్మగారి పుణ్యతిథిని పురస్కరించుకుని మా కుటుంబం యావత్తు ఆ పుణ్యమూర్తికి నివాళి ఘటిస్తున్నాము. 
పుణ్య దంపతులు 

   అమ్మ ఎవరికైనా ముద్దే. అమ్మప్రేమను తలుచుకుంటే చాలు మనసు పరవళ్లు తొక్కుతుంది. నిష్కళంక ప్రేమ ఆమెది. ఎన్నో,ఎన్నెన్నో మధురమైన సంఘటనలు కళ్లముందు కదలాడుతున్నాయి. అయినప్పటికీ ఒకే ఒక్క సంఘటన ఈ సందర్భంగా నేను గుర్తుచేసుకుంటున్నాను.
  పుట్టుక నుంచీ నేను చాలా బలహీనుడినేనట. నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మగారు కాళ్లుజాపి ఆ కాళ్లపై నన్ను పడుకోబెట్టి స్నానం చేయిస్తుంటే రెండు కాళ్ల సందులోనుంచి జారి పడిపోయేవాడినని మా బామ్మ (అన్నపూర్ణమ్మ) మా మేనత్త (బుల్లెమ్మ - అసలు పేరు - సీతారావమ్మ కస్తల) అంటుండేవారని పెద్దయ్యాక నాకు తెలిసింది. అంత బలహీనమైన పిల్లాడు అసలు బతికి బట్టకడతాడా? అని బంధుమిత్రులు అనుకునేవారట.
   అంత అర్భకంగా ఉండటంతో  పాలే నాకు ప్రధాన ఆహారమైంది. పెరిగి పెద్దవుతున్నా పాలను ఎంతో మురిపంగా నాకు ఇచ్చేవారు. నాకు పదిపన్నెండేళ్లు వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు గుర్తే. ఏదైనా ఫంక్షన్ కు గానీ, ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు కాఫీ ఇస్తుంటే మా అమ్మ గట్టిగా చెప్పేది. `మా రాజా (నన్ను మా అమ్మేకాదు, బంధువర్గమంతా నాగరాజు, రాజా అని పిలుస్తుంటారు ఇప్పటికీనూ) కాఫీ తాగడు, పాలే ఇవ్వండి' అనేది.
 దీంతో ఎవరింటికి వెళ్ళినా నాకు మాత్రం గ్లాసుడు పాలే ఇచ్చేవారు. ఇప్పటికీ (నాకు 58 ఏళ్లు వచ్చినా) మా సొంత ఊరైన అడవిరావులపాడు లేదా నందిగామ వెళితే కాఫీ నాకు ఇవ్వరు. వేడివేడి పాలే ఇస్తుంటారు. ఈ మధ్యనే నేను అడవిరావులపాడు వెళితే అక్కడ మా పొలం చూసుకునే వెంకటేశ్వర్లు కుటుంబం కూడా   `చిన్నబ్బాయిగారు పాలే తాగుతారు ' అంటూ  నాకు పాలే ఇచ్చారు.  ఒక్కోసారి కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. నాకంటే చిన్నవాళ్లు, మరీలేతవాళ్లే కాఫీ కప్పులు తీసుకుని తాగేస్తుంటే, నాకు పాలగ్లాస్ ఇవ్వడమేమిటీ !! కానీ వారి అవ్యాజమైన ప్రేమను కాదనులేను. అందుకే అలా ఎవరైనా ఎప్పుడైనా పాలగ్లాసు నాచేతికి అందిస్తుంటే వారి రూపంలో మా అమ్మే కళ్లముందు కనబడుతుంటుంది. అందుకే మా అమ్మ మురి`పాల' అమ్మ .


  (మా అమ్మగారితో పరిచయం ఉన్నవారు, బంధుమిత్రులు- తమకు తెలిసిన విశేషాలను ఈ సందర్భంగా పంచుకోండి. మీ అభిప్రాయాలను ఈ పోస్ట్ కింద కామెంట్స్ రూపంలోగానీ, లేదా మెయిల్ ద్వారా nrturlapati@gmail.com కి గానీ లేదంటే ఫోన్ చేసిగాని చెప్పండి)
                                                                                             - తుర్లపాటి నాగభూషణ రావు (నాగరాజు)
                                                                                                  ఫోన్ నెంబర్   988 529 2208   

5, ఫిబ్రవరి 2014, బుధవారం

మూడు తరాలు

మూడు తరాలు :  

ఈ ఫోటోలో ఉన్నది తుర్లపాటి వంశంలోని తూర్పుముఠాకు చెందినవారిలో 9వ తరానికి చెందిన తుర్లపాటి మల్లికార్జున వరప్రసాదరావుగారు ( మా నాన్నగారు. వీరినే టీవీఎంవీ ప్రసాదరావుగారనీ, మల్లేశం గారినీ, ఊర్లోవాళ్లు - మల్లేశం దొరగారని పిలిచేవారు) మధ్యన ఉన్నది నేను  (తుర్లపాటి నాగభూషణ రావు - జర్నలిస్టు. పన్నెండేళ్లప్పుడు తీసిన చిత్రం) చివర్న రాజేష్ కృష్ణ సాయి తుర్లపాటి (సాప్ట్ వేర్ ఇంజనీర్ - యుకె)
  (విడివిడిగా ఉన్న ఫోటోలను కలిపి అందంగా తీర్చిదిద్దిన మా తరంగా మిత్రుడు 

శ్రీమంత్ కు ధన్యవాదాలు



మీ - నాగభూషణ రావు తుర్లపాటి - 988 529 2208

చూశాను..సేకరించాను..చెప్పబోతున్నాను



ఈ మధ్య మా కుటుంబం అడవిరావులపాడు, నందిగామ వెళ్లడం తటస్థించింది. అక్కడ బోలెడు సమాచారం సేకరించాను. ఆ పక్కనే ఉన్న నందిగామలో కూడా కొన్ని విశేషాలు సేకరించాను. వస్తూవస్తూ జగ్గయ్యపేట దగ్గర్లోని ముక్త్యాల వద్ద ఉన్న కోటిలింగాల క్షేత్రాన్ని దర్శించాము.  ఆ వివరాలను  ఈ బ్లాగ్  ద్వారా ఒకటొకటిగా  మీకు అందిస్తాను.

  - మీ తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208

(ప్రస్తుతానికి నేను అనుకుంటున్న అంశాలు ఇవి. ఇవే క్రమంలో బ్లాగ్ లో రావని గమనించగలరు - మీ నాగ్)
1. పారిశ్రామిక వాడగా అడవిరావులపాడు ఎదగబోతున్నదా ?

2. గ్రామ నడిబొడ్డున ఉన్న రామాలయం పునఃనిర్మితమవుతుందా ? (అడవిరావులపాడు)

3. కమ్మటి కృష్ణా జలాలు (అడవిరావులపాడు)

4. ఇక ఈ ఇల్లు కనబడదా ? (అడవిరావులపాడు)

5. నందిగామలో దేవతల బావి !! 

6. కళకళలాడే మెయిన్ బజార్  (నందిగామ)

7. రామాలయం - నిత్యకల్యాణ వేదిక (నందిగామ)

8. ఈ నంది సాక్షిగా  (నందిగామ)

9. బావి చెప్పిన కథలు (అడవి రావులపాడు)

10 సెంచరీకి చేరువైన గ్రామస్థులు (అడవి రావులపాడు)

11. కస్తల శారదాంబ (శారదక్కయ్య)  - పూర్ణంబూరెలు  (నందిగామ - అడవిరావులపాడు)

12. ఈ వాగు సాక్షిగా   (అడవి రావులపాడు)

13 రోలు ఆత్మకథ  (అడవి రావులపాడు)

14 మహాశివారధాకలు (మల్లేశంగారు)

15. ఏటి ఒడ్డు (నందిగామ)

16. నేను చదివిన స్కూల్  (నందిగామ)

17. మా కాలేజీ- కేవీఆర్  (నందిగామ)

18. భారత్ టాకీస్ - ఎడ్లబండ్లు

(ఇవి కాక ముక్యాల దగ్గర కోటి లింగాల విశేషాలు కూడా చెప్పుకుందాము)

28, జనవరి 2014, మంగళవారం

నాకు తెలిసిన నందిగామ

నందిగామ శివాలయం గోపురం
కృష్ణాజిల్లా  అడవిరావులపాడుకు అతి సమీపంలోనే నందిగామ గ్రామం ఉంది. నిజానికి  అదిప్పుడు గ్రామంకాదు. పంచాయితీ పరిధి దాటేసి మున్సిపాలిటీకూడా అయ్యింది. చుట్టుపక్కల ఓ పాతిక గ్రామాలకు ఇది వాణిజ్యకేంద్రం. మెయిన్ రోడ్డు తెల్లవారుఝామునుంచే సందడిగా ఉంటుంది. ఆ వీధి వందలాది దుకాణాలతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రమైక జీవనం, కలసికట్టుదనం అక్కడ చూడవచ్చు.
   నందిగామ, దాని చుట్టుపక్కల గ్రామల పిల్లలు పాఠశాల విద్య ముగించుకుని కాలేజీల్లో చేరాలంటే ఒకప్పుడు విజయవాడదాకా వెళ్ళాల్సి వచ్చేది. ఆ సమయంలో అంటే 60వ దశకంలో  నందిగామ శ్రేయోభిలాషులంతా ఒక్కటిగా నిలిచి నందిగామ ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటుచేసి పెద్ద చదువుల కోసం కళాశాలకు బీజం వేశారు.  వారి కృషి ఫలితంగానే 1968 జులై 12వ తేదీన ఎన్టీఆర్ కాలేజీ ఏర్పాటైంది. ఆ కాలేజీ పేరును కొన్ని అనివార్య పరిస్థితుల్లో కాకాని వెంకటరత్నం కాలేజీగా మార్చాల్సివచ్చింది. (ఆ వివరాలు ప్రస్తుతం అప్రస్తుతం). నాటి నుంచీ నేటి వరకు ఆ కళాశాల విద్యార్థులకు సరస్వతీమాత ఒడిలా మారిపోయింది. అనేక రంగాల్లో కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నవారెందరో ఇక్కడే ఈ కళాశాలలోనే చదువుకున్నవారే.
నందిగామ కేవీఆర్ కాలేజీ 1978 బీయెస్సీ బ్యాచ్ 

   మా అన్నగారు తుర్లపాటి కోటేశ్వరరావుగారు ఇదే కాలేజీలో లెక్చరర్ స్థాయినుంచి ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగి, వేలాది మంది విద్యార్థులకు విద్యాదానం చేశారు.   (కాలేజీ జ్ఞాపకాల గురించి మరోసారి చెబుతాను)
   నందిగామ అన్న పేరు ఎలా వచ్చిందంటే అక్కడి శివాలయంలో పెద్ద నంది ఉండటం మూలానే అని చెబుతుంటారు. శివాలయాన్ని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, షుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టించారట. ఈ దేవాలయము (పంచలింగక్షేత్రము)గా ప్రసిద్ధిచెందిన మహా శివక్షేత్రము.
   ఈ దేవాలయానికి మా నాన్నగారు (తుర్లపాటి వెంకట మల్లికార్జున వరప్రసాదరావు- టివిఎంవీ ప్రసాదరావుగారు) ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా పనిచేశారు. 
తుర్లపాటి వెంకట మల్లికార్జున
 వరప్రసాదరావుగారు

  తుర్లపాటి వంశస్థులైన పెద్దలు చాలామంది ఈ శివాలయంలో జరిగే ధార్మిక కార్యక్రమాలకు ఇతోధికంగా తోడ్పాటును అందించారు. అందిస్తూనే ఉన్నారు.  
  నందిగామ మునేరు తీరప్రాంతంలో ఉంది. బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఏటినిండా బోలెడు నీళ్లుంటాయి. ఎండాకాలంలో మాత్రం ఏరు ఎండిపోయి దీనంగా కనబడుతుంటుంది. మా చిన్నప్పుడు మిత్రులు విజయబాబు, గిరీశం (వీళ్లిద్దరూ బంధువులు కూడా)మరికొంత మందితో కలసి ఇంట్లో చెప్పకుండా ఏటిఒడ్డుకు వెళ్ళి ఈత కొట్టేవాళ్లం. అలాంటి సమయంలో ఓసారి నేను మునిగిపోయాను. శ్వాస ఆడటంలేదు. ఎవరో రక్షించారు. ఎవరన్నది గుర్తుకురావడంలేదు. అప్పటి నుంచి ఈ ఈతలూ, నీళ్లు మన ఒంటికి పడవని 
                       
                                                       - తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208
                                                           (తరంగా రేడియో ప్రొగ్రామ్ డైరెక్టర్, జర్నలిస్ట్)

13, జనవరి 2014, సోమవారం

సంక్రాంతి శుభాకాంక్షలు

అంగనలందరుం కలసి వాకిలి ముందు కలాపి చల్ల్లి ఆ

ముంగిట ముగ్గులుంచి ముదమొప్పగ పూలను గొబ్బి నుంచ శ్రీ

రంగని కీర్తనావళుల రమ్యముగా హరిదాసు పాడ ఉ 

ప్పొంగిన సంకురాత్రి యిడు భోగము భాగ్యము మీకుటుంబముం

- ఈ శుభాకాంక్షలు పంపిన వారు


శ్రీ తుర్లపాటి విజయ్ శంకర్

హైదరాబాద్