18, డిసెంబర్ 2015, శుక్రవారం

మహామనిషి తుర్లపాటి మల్లేశం

 (15వ వర్థంతి సందర్భంగా నివాళి)

ఈరోజు మా నాన్నగారు తుర్లపాటి వెంకటమల్లికార్జున వరప్రసాదరావు - (టీవీఎంవీ ప్రసాదరావు - మల్లేశం)గారి ఆబ్దికం. విక్రమనామ సంవత్సరం మార్గశిరమాసం శుక్లపక్షం నవమిరోజున వారు లింగైక్యం చెందారు. అంటే ఆంగ్లసంవత్సరాల ప్రకారం  లింగైక్యమైన రోజు 2000 సంవత్సరం  డిసెంబర్ 5.
 15వ వర్థంతి సందర్బంగా మా కుటుంబసభ్యులమందరం  శ్రద్ధాంజలి ఘటించాము.


  ఆజానుబాహులు, స్ఫురధ్రూపి, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎలాంటి సమస్యలనైనా ఎదురొడ్డి పోరాడగలిగిన ధీశాలి అయిన మా పిత్రుదేవులకు ప్రణమిల్లుతున్నాము.  మా అమ్మగారు  స్వరాజ్యలక్ష్మి (ఫిబ్రవరి 28, 1986లో లింగైక్యం చెందారు) తో వారు దిగిన ఫోటోను కూడా ఇక్కడ ఉంచుతున్నాము. మా నాన్నగారు శివైక్యం చెందిన తర్వాత (నందిగామలో) పార్థివ శరీరాన్ని స్వస్థలమైన అడవిరావులపాడుకు తీసుకువెళ్ళాము. అక్కడే అంత్యక్రియలు పూర్తిచేశాము.


సేవాతత్పరులు


  కృష్ణాజిల్లా నందిగామ మండలంలోని  అడవిరావులపాడు గ్రామాభివృద్ధికి మల్లేశం గారు ఇతోధికంగా సేవలందించారు. ఆయన దేవాదాయధర్మాదాయ శాఖలో నాలుగు దశాబ్దాలపాటు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా పనిచేసినప్పటికీ, నిత్యం శివపూజలు చేస్తున్నప్పటికీ వారి మనసులో అన్యమతాల పట్ల ద్వేషభావం ఉండేది కాదు. అందుకే గ్రామంలో చర్చ్  నిర్మాణం సమయంలో  విరాళం అందజేశారు. ఆయన లింగైక్యం చెంది 15ఏళ్లు అవుతున్నా అనేక మంది గుండెల్లో ఆయన  నిలిచే ఉన్నారు.


నిరుద్యోగలపాలిట `దేవుడు'


  దేవాలయాల్లో కానుకలను హుండీలోనే వేయాలనీ, అప్పుడే అవి దేవాలయ అభివృద్ధికి దోహదకారి అవుతాయని అంటుండేవారు. హారతి పళ్లెంలో వేస్తే అవి కేవలం ఒక వ్యక్తికి (పూజారికి) మాత్రమే చెందుతాయనీ   చెప్పేవారు.  అనేక దేవాలయాల్లో పేదరికంతో బాధపడుతున్న అర్చక కుటుంబాలవారికి ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే ఇతర కులాలవారికి కూడా తనకు చేతనైన పరిథిలో ఉద్యోగాలు ఇప్పించేవారు. మా నాన్నగారు నాకు తెలిసినంతవరకు బెజవాడ కనకదుర్గమ్మ, గుంటూరు వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, మంగళగిరి పానకాలస్వామివారి ఆలయం, వేదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం వంటి చోట్ల ఈఓగా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత ముక్త్యాల  సంస్థానంలో మేనేజర్ గా కొన్నాళ్లు పనిచేశారు.


మాట కటువు, మనసు వెన్న


  ఎవరైనా వచ్చి, `నా పరిస్థితి బాగోలేదు, సాయం చేయండయ్యా' అని అడిగితే చాలు, తన జేబులో ఎంత ఉంటే అంత ఇవ్వడం నేను కళ్లారా చూశాను. వ్యక్తి స్వార్థం, కుటుంబ స్వార్థం కంటే, సమాజహితమే గొప్పదని చెబుతుండేవారు. మాట కటువుగా ఉన్నా, మనసు వెన్నపూస. కొంతమంది ఆయన మాటతీరుతో ఆయనది పాషాణ హృదయమనీ, ఆయనలో ప్రేమానురాగాలు లేవని అనుకునేవారు. కానీ అది నిజం కాదు. ప్రేమను వ్యక్తీకరించినమాత్రానే వారిలో ప్రేమ పొంగుతుందని అనుకోవడం భ్రమ. ఆ భ్రమ ముసుగులు తొలిగించి చూస్తే, హృదయంలోపల నిండుగా ఉన్న ప్రేమ సాక్షాత్కరిస్తుంది. అలాంటి ప్రేమను వారి నుండి నేను ఆస్వాదించగలిగాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కుటుంబంలో ఎన్ని ఒడుదుడుకులు తలెత్తినా, మంచినీళ్ల ప్రాయంలా డబ్బులు ఖర్చవుతున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా మనోధైర్యాన్ని మాత్రం ఏనాడు విడువలేదు.

ధర్మమూర్తి 

  న్యాయం, ధర్మం ఆయనకు ఆరో ప్రాణం. అధర్మంగా ఎవరు మాట్లాడినా వారికి కోపం చిర్రెత్తుకొచ్చేది. అసలే ముక్కుసూటి మనిషి, ఆపైన నిజాయితీపరులు...అందుకే ఆయనవద్దకు వచ్చి అక్రమాల గురించి మాట్లాడటానికి ఎవ్వరూ సాహసించేవారు కారు. ఓసారి ఫోటో చూడండి. ఆ ముక్కుసూటి తనం మీకే తెలుస్తుంది. మా ఇంట్లో అన్నయ్య, అక్కయ్య, నేను మా నాన్నగారి దగ్గర ఎక్కువగా మాట్లాడేవారామేకాదు. పెద్దయ్యాక కూడా ఏదైనా విషయం వారి చెవిన వెయ్యాలంటే ఒకటికి నాలుగుసార్లు రిహార్సల్స్ వేసుకునేవారం. మా అమ్మగారే చాలా సందర్భాల్లో వారధిగా నిలిచేవారు.
 
                                                                               - తుర్లపాటి నాగభూషణరావు (988 529 2208)
                                                                                  సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్

3, ఏప్రిల్ 2015, శుక్రవారం

పారిశ్రామిక వాడగా నందిగామ ప్రాంతం

 కిందటి ఏడాది అంటే 2014 మార్చి నాలుగవ తేదీన ఇదే బ్లాగ్ లో నేనో పోస్ట్ పెట్టాను. ఆ వ్యాసం సారాంశం ఏమంటే, నందిగామ, అడవి రావులపాడు ప్రాంతం త్వరలోనే పారిశ్రామిక వాడగా మారిపోయే అవకాశాలున్నాయన్నదే.
పారిశ్రామిక సముదాయాలు (క్లస్టర్లు) ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టు కనబడుతోంది. నందిగామ ప్రాంతంలో ఫార్మాస్యూటికల్ హబ్ రాబోతున్నట్టు చెప్పారు. చాలా సంతోషం. నందిగామ- అడవిరావులపాడు ప్రాంతం పారిశ్రామిక వాడ కావడానికి ఇప్పుడు ఒక చక్కని అవకాశం వచ్చినట్టే. 2014లో నేను ఒక వ్యాసం రాస్తూ, నందిగామ - అడవి రావులపాడు మార్గం పారిశ్రామిక వాడగా మారే అవకాశాలున్నాయని http://turlapati-adaviravulapadu.blogspot.in/ లో రాశాను. నేను వ్యాసంలో రాసిన అభివృద్ధి సూచనలు మరింత స్పష్టంగా కనబడుతున్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధిని కోరుకునేవారంతా హర్షించతగ్గ శుభపరిణామం ఇది.
  అప్పట్లో నేను రాసిన వ్యాసాన్ని యధాతథంగా ఇక్కడ పెడుతున్నాను.


                                   పారిశ్రామిక వాడగా అడవిరావులపాడు
ఈ ప్రశ్న ఇప్పటికిప్పుడు ఆశ్చర్యాన్నీ, సందేహాలను కలిగించవచ్చు. చాలా ముందస్తు ఆలోచన అని కొట్టిపారేయవచ్చు.  కానీ, కాలచక్రాన్ని గిర్రున ఓ పదిపదిహేను సంవత్సరాలకు ఫార్వార్డ్ చేస్తే,  నేనిప్పుడు ఈ బ్లాగ్ లో రాస్తున్న మాటలు యధార్థమయ్యాయని మీరే అంగీకరిస్తారు. ఇలా నేను రాయడానికి చిలకజోస్యమో, లేదా కోయదొర జోస్యం మీదనో ఆధారపడలేదు. నా లాజిక్స్ నాకున్నాయి. అవి నిజం అవుతాయన్న నమ్మకమూ నాకుంది.

1. అడవిరావులపాడు కృష్ణాజిల్లా నందిగామ మండలంలో ఉంది. ఇది, నందిగామ పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది .
2. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో రియల్టర్ల దృష్టి ఇప్పుడు సీమాంధ్రలోని ఇతరప్రాంతాలతోపాటు, నందిగామ మండలంలోని గ్రామాలమీద కూడా పడింది.
3. నందిగామ నుంచి అడవిరావులపాడు గ్రామానికి వెళ్ళే దారిని చీల్చుకుంటూ  విజయవాడ- హైదరాబాద్ బైపాస్ రోడ్డు వెళుతుంటుంది.
4. ఈ బైపాస్ రోడ్డు దాటాకనే , అడవిరావులపాడు గ్రామంవైపునే పక్కా రోడ్డుకుఆనుకునే ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేసింది.
5. అది దాటాక మరికొంత దూరం (రావులపాడు వైపుకే) వెళితే ఎడమ చేతివైపున ఒక డొంకదారి వస్తుంది. ఆ దారివెంట లోపలికి వెళితే అక్కడ దాదాపు 30 ఎకరాల్లో ఓ ప్యాక్టరీని నిర్మించడానికి ప్రాంతీయపార్టీకి చెందిన రాజకీయ నాయకులొకరు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
6. అదే నిజమైతే, ఆ ప్రాంతం చుట్టుపక్కల కూడా మరిన్ని ప్యాక్టరీలు, `రియల్' ప్రాజెక్టులు వచ్చే అవకాశం లేకపోలేదు.

7. రోడ్ కనెక్టివిటీ బాగుండటం, పక్కనే వాగు ప్రవహించడంవల్ల నీటి ఎద్దడిఉండదు.
8. మెట్టపొలాలు కావడం వల్ల తక్కువధరలోనే పారిశ్రామికవేత్తలూ, రియల్టర్లు స్థలాలను సేకరించవచ్చు. ఇప్పటికే ఈ కారణంగా పొలాల రేట్లు రెండు రెట్లు పెరిగాయని అంటున్నారు.
9. విజయవాడకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగామ ప్రాంతం (రావులపాడు సహా) అభివృద్ధిచెందే ప్రాంతంగా మారబోతుందనడానికి ఇంతకన్నా ఆధారాలు మరేం కావాలి. సీమాంధ్రలోని ప్రతిగ్రామం అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పుడే హైదరాబాద్ కోల్పోయామన్న బాధ నుంచి విముక్తి దొరుకుతుంది.
                                                                              - తుర్లపాటి నాగభూషణ రావు - 988 529 2208