25, నవంబర్ 2024, సోమవారం

35వ భాగం : రంగుల వలయం

 

  జీవితం ఒక రకంగా చూస్తే చాలా స్వల్పంగా అనిపిస్తుంది. మరో రకంగా చూస్తే ఓ సాగరంలాగా విశాలంగా ఉంటూనే ఎంతో లోతైనదిగా కనబడుతుంటుంది. జీవితంలో గెలుపు ఓటమిలు ఈ సమాజంలో మనిషి యొక్క స్థాయిని నిర్దేశిస్తుంటాయి. కేవలం తెలివితేటలు మాత్రమే ఎల్లవేళలా అక్కరకు రావు. అలాగే అదృష్టం కూడా. మనమెక్కిన జీవన నౌక సాఫీగా సాగుతున్నంత కాలం జీవితం యొక్క విలువ తెలియదు. అలాంటి వ్యక్తులకు `జీవన పోరాటం అన్న పదాన్ని సరిగా అర్థం చేసుకోలేరు. నా జీవితంలో ఆటుపోట్లు ఎక్కువగానే ఉన్నాయి. అనుకోని సమస్యల వలయాలు చుట్టుముట్టేవి. మనకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల వల్ల కష్టాలు కడగల్లు తప్పలేదు. అడుగడుగునా జీవనపోరాటంతోనే కాలం దొర్లిపోయింది`నాఅనుకున్న వాళ్లే అన్యాయాలు చేయడం నన్ను ఎంతో బాధించింది. ఒక దశలో స్నేహితులు, బంధువులు దూరం అయ్యారన్న భావన కలిగేది. అసలు ఈ సమాజంలో నేను ఒంటరినేమో... భగవంతుడు నాకు ప్రసాదించిన ఈ జన్మకు సార్థకత ఏమిటిచాలా మందిలా నేను ఎందుకని జీవనయాత్రను సాఫీగా సాగించలేకపోతున్నాను. ఎక్కడుంది లోపం...దీనికి పరిష్కారం ఏమిటి 

 

పీడకల  వాస్తవం:

 

నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో అప్పుడప్పుడు ఓ కల వస్తుండేది. అది వచ్చినప్పుడల్లా ముచ్చెమటలు పట్టేవి. హఠాత్తుగా ఉలికిపాటుతో నిద్రమెలుకువ వచ్చేది. ఆ కలలో దయ్యాలు రాలేదు. భూతాలు అంతకన్నా భయపెట్టలేదు. మరి ఆ కల ఏమిటి??

అది ఒక నిర్జన ప్రాంతం. దగ్గర్లోనే ఎత్తైన కొండ ఉంది. అది పైకి ఎక్కాలి. తప్పదు. మెట్ల దారిలోనే పైకి ఎక్కాలి. ఏదో తెలియని మొండి ధైర్యం. ఎవ్వరూ తోడు రావడం లేదు. వస్తామన్న వారు కనుచూపు మేరలో లేరు. నా అనుకున్న వాళ్ల ఆనవాలు లేనేలేదు. మరి ఈ ఒంటరి ప్రయాణం చేయలగలనా..? ఏమో..

మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను.



 ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. చాలా తొందరగా ఎక్కేయాలట. అలా అని ఎవరు ఆదేశించారో కలలో స్పష్టత లేదు. ఆదేశాన్ని పాటించాలి.  వడివడిగా మెట్లు ఎక్కుతున్నాను. మెట్లు ఎక్కుతుండగానే ఆకాశం కారు మేఘాలతో నల్లబడింది. ఉన్నట్టుంది ఉరుములు, మెరుపులు, జోరు వాన... ఒక్కసారిగా భయం ఆవహించింది. కొండ పైకి చేరగలనాఅసలు నాకు అండగా నిలిచేవాళ్లు ఏరీకనుచూపు మేరలో కనిపించరేం!! ఎడతెగని ఆలోచనలు. అంతలో కాలు జారింది. వర్షానికి మెట్లు బాగా జారుడుగా మారినట్లున్నాయి. దీంతో కాలు పట్టుతప్పింది. ఉన్నట్లుండి నాలుగు మెట్లు క్రిందకు జారిపోయాను. ఓపిక తెచ్చుకుని లేచి ఎక్కసాగాను. కానీ ఓ పదిమెట్లు ఎక్కేసరికి మళ్లీ క్రిందకు .. ఈ సారి పెద్ద ఆఘాతంలో పడిపోయినట్లున్నాను. అంతే చమటలు పట్టేశాయి. భయంతో ఉలికి పడి లేచాను. మంచం అంచులో ఉన్న నేను ఏ క్షణంలోనైనా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదంతా కల అని తెలుసుకుని శరీరం, మనసు సర్దుకోవడానికి ఓ పావుగంట పట్టింది. 

 

కలల లోకంలో.. :

 

అసలు, కలలు ఎందుకు వస్తాయో ఆ రోజుల్లో తెలియలేదు. ఆ తర్వాత కొన్ని పుస్తకాలు చదివినప్పుడు కలలు ఎందుకు వస్తాయో అర్థమైంది. పైన చెప్పిన ఈ కల రావడానికి ప్రధాన కారణం  అభద్రతా భావం. ఇది ఏ రూపంలోనైనా రావచ్చు. మనం చేస్తున్న ఉద్యోగం, మన సంసారం, ఆర్థిక సమస్యలు,మన చుట్టూ ఉన్న వ్యక్తుల విచిత్రపోకడలు...ఇలా అనేక కారణాల వల్ల మెట్ల మీద నుంచి జారిపడిపోతున్నట్లుగానో, మేడమీద నుంచి జారి పడిపోతున్నట్లుగానో కలలు వస్తాయట. ఒక్కోసారి మనం ఎక్కాల్సిన మెట్లు మధ్యలోనే కనబడకుండా పోతాయి. పైకి ఎక్కలేము, అలాగాని క్రిందకూ దిగలేము. ఇదో విచిత్ర పరిస్థితి. కలలో ఇలాంటి దృశ్యాలు ఎవరో మహా రచయిత స్క్రిప్ట్ రాసినట్లుగా బలంగా కనిపిస్తాయి. కొన్నిటికి లాజిక్ ఉంటుంది. మరికొన్నిటిని మ్యాజిక్కే అనుకోవాలి. కలలో వచ్చే కథను సిద్దం చేసి, నేర్పుగా దృశ్య రూపంలోకి మలచిన ఆ మహా దర్శకుడు ఎవరు ?అతగాడు మరెవరో కాదు మన మెదడే.  టివీ5లో పనిచేస్తున్నప్పుడు `కలల లోకంలో..’ అన్న టాపిక్ మీద ఓ ప్రత్యేక కార్యక్రమం రూపొందించాను. 



దీని కోసం స్టడీ చేస్తున్నప్పుడు ఇలాంటివే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలిగాను.  

 

ఏదీ భద్రత ?

 

అభద్రతా భావం తొలగాలంటే ఏం చేయాలిజీవనపోరాటంలో గెలవాలి. పట్టుదల ఉండి, అందుకు తగ్గట్టుగా నూతన మార్గాలను అన్వేషించుకుని ముందుకు సాగాలి. జీవితం చాలా చిత్రమైనది. కొందరికి వడ్డించిన విస్తరి.  మరికొందరికి దినదిన గండం. ఉద్యోగ వేటలోనే అనేక అవస్థలు పడ్డ నేను చివరకు జర్నలిస్ట్ గా స్థిరపడ్డాను. నిజం చెప్పాలంటే `స్థిర పడ్డానుఅన్న మాట తప్పేమో. ఎందుకంటే, జర్నలిజం అన్నది నిత్య సవాళ్లతో కూడిన వృత్తి. జర్నలిస్టు అంటే అసలు ఉద్యోగం కాదు. కేవలం జీతం రాళ్ల కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటే నిజమైన జర్నలిస్ట్ కాలేడు. నేను ఈనాడు లో పనిచేస్తున్నప్పుడే సవాళ్లు ఎదుర్కున్నాను.  `ఎమ్మెస్సీ చేసిన వాళ్లు జర్నలిజం లోకి ఎందుకు వస్తారయ్యా, పేపర్ ని భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నారా..’ అంటూ పై అధికారిఒకరు గర్జించారు. నిజానికి నాతో పాటు చేరిన వారిలో చాలా మందికి ఆ వృత్తి కొత్త. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇదేదో గౌరవప్రదమైన వృత్తి అని ప్రవేశించిన వారే ఎక్కువ. నాలుగు ఆర్టికల్స్ వ్రాసేసి అచ్చులో చూసుకుని గొప్ప జర్నలిస్ట్ అయిపోయామనుకునే అమాయకపు బ్యాచ్. నేర్పుగా నేర్పాల్సిన చోట ఈటెలు, బాణాలు విసిరే మనస్తత్వం ఉన్న పై అధికారులు దాదాపు అన్ని సంస్థల్లోనూ ఉంటారు. ఇలాంటి వారి వల్ల మన మనసు అనేక సార్లు గాయపడవచ్చు. రిజిగ్నేషన్ లెటర్ జేబులో ఉంచుకుని తిరిగిన రోజులూ ఉన్నాయి. ఇలాంటి వారి వల్ల కన్నకలలు చెదిరిపోతున్నాయన్న భావన కలిగేది. కలలో చూసినట్లు జారుడు మెట్ల మీద నుంచి జారిపడిపోతున్నట్లు అనిపించేది. అయితే, ఓటమిని ఒప్పుకోకూడదు. ఏ జర్నలిజంలో పనికి రావని అన్నారో, అదే జర్నలిజంలో ఎదగాలి..ఎంతగా అంటే, కలలో కనిపించిన ఆ కొండ శిఖరం ఎక్కి విజయ కేతనం ఎగురవేయగలిగేటంతగా. ఎస్..ఆత్మబలం పెంచుకోవాలి. తెలివి తేటలు ఉన్నాయి. రాణించాలన్న పట్టుదల వీక్ గా ఉంది. లక్ష్యాన్ని చేరేదాకా విశ్రమించకూడదు. ఈ సంకల్ప బలమే నన్ను ఈ రోజున  జర్నలిస్ట్ గా నిలబెట్టింది. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు ప్రశంసలు వచ్చేలా చేసింది. 


దారి చూపిన `గీత’:

 

జీవితంలో మనం నడిచే దారి మూసుకుపోతున్న భావన కలగగానే మరో దారి వెతుక్కోవాలి. ఇందుకోసం నలుమూలలా వెతకాలి. 

నీరు లేని ఎడారిలోనైనా కన్నీరు తాగి బతుకుతూ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ సమాజ స్వరూపం చాలా చిత్రమైనది. నేను ఈనాడు జాబ్ నుంచి తప్పుకుని మరో దారి చూసుకున్నప్పుడు మా బంధువుల్లో ఒకరు  వీడెక్కడా నిలకడగా జాబ్ చేయలేడు  అంటూ నాకు వినిపించేలాగానే కామెంట్ చేశాడు. ఇలాంటి సూటిపోటి మాటల గారడీ మనమీద పనిచేస్తుంటుంది. ఒక రకమైన భ్రాంతిలోకి వెళ్ళిపోతాము. నిజంగానే మనం ఏ ఉద్యోగానికీ సరిపోమా, జీవితంలో ఎదగలేమా? అన్న నిరాశ, నిస్పృహలుఅలుముకుంటాయి. అలాంటప్పుడే నాకు ఎవ్వరు తోడుగా నిలవకపోయినా `భగవద్గీతనిలించింది. నేను ఉన్నాను. నేను అందిస్తున్న శ్లోకాలు చదువు, నీ సమస్యకు పరిష్కారం తప్పక లభిస్తుందని గీతా చార్యులు చెప్పినట్లు నాకు అనిపించేది. ఇప్పటికీ అంతే.. ఏదైనా జఠిలమైన సమస్య తలెత్తితే, భగవద్గీత చదువుతుంటే ఉన్నట్లుండి ఆకాశంలోని మెరుపు మెరిసినట్లు, ఆ వెలుగులో కొత్త దారికనబడినట్లు అనిపించేది.  ఒక శక్తి మనల్ని నడిపిస్తున్నది. ఆ శక్తినే దేవుడని అంటాము. లేదా సైన్స్ చెబుతున్న శక్తి కావచ్చు. ఏమైనా అనుకోండి,  మన జీవితాలను శాసించేది ఆ శక్తే. అంతే కానీ ఈ సమాజం కాదు, నీవు భయపడుతున్నట్లు ఈ శత్రు మూకలు అంతకన్నా కావు. మంచి ప్రక్కన చెడు ఉంటుంది. రెంటినీ సృష్టించేది, నడిపించేది ఆ శక్తే.  

శక్తి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. అప్పుడు అది నీకు చక్కటి మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఈ నమ్మకం నాకు బలాన్ని ఇచ్చింది. జీవనపోరాటంలో వెనక్కి తగ్గకూడదు. అలా తగ్గామో నిన్ను విమర్శించేవారూ, ఎగతాళి చేసేవారూ విరుచుకుపడతారు. నీకు నీవే గురువు. నీవే శిష్యుడివి.  నీవే దేవుడివి..నీవే భక్తుడివి. ఈ తరహా ద్విపాత్రాభినయనంసాధన చేయాలి. అప్పుడే స్వాంతన చిక్కుతుంది. మనసు తేలిక పడగానే పరిష్కారమార్గం కళ్ల ముందు కనబడుతుంది. `ఈనాడు వదలగానే నాకు `ఆంధ్రప్రభద్వారాలు తెరుచుకున్నాయి. అక్కడ ప్రయాణంసాఫీగా సాగుతున్నప్పుడు ఓ దశలో అభద్రతా భావం పొడచూపసాగింది. ఆంధ్రప్రభ ఎన్నాళ్లు ఉంటుందన్న సందేహం వచ్చింది. ఒక మార్గంలో అందునా సులువైన మార్గంలో ప్రయాణం సాగుతున్నప్పుడు ఇతర దారులు మనకు కనబడవు. ఒక వేళ కనిపించినా పట్టించుకోము. ఇక్కడా అదే జరిగింది. ఈలోగా వయసు పైబడుతున్నది. సంసార బాధ్యతలు పెరగసాగాయి. బాచిలర్ గా ఉన్నప్పుడిలాఇప్పుడు కొత్త దారులను తేలిగ్గా తొక్కలేను. ఆచి తూచి అడుగు వేయాలి. 


సమ్మె సైరన్ 

 

ఒక సారి విజయవాడ ఆంధ్రప్రభ సిబ్బంది సమ్మెకు దిగింది. ఆ సమ్మె సుదీర్ఘ కాలం నడిచింది. ప్రారంభంలో ఉన్న పట్టుదల సడలిపోసాగింది. చాలా మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడే స్థితి వచ్చింది. ఆ సమయంలో అభద్రతా భావం మరీ ఎక్కువైంది. దాదాపు రెండు నెలల సమ్మె తర్వాత పరిస్థితి చక్కబడింది. జీవితాలు మళ్ళీ గాడిలో పడ్డాయి. ఆంధ్రప్రభలోని నా కెరీర్ లో కష్టాల కంటే ఆనందాలే ఎక్కువ. అందుకే ఇప్పటికీ ఈ సంస్థ అంటే నాకు బోలెడు ఇష్టం. ఇక్కడే అందర్నీ కులుపుకుపోయే తత్వం అలవడింది. ఉగాది వేడుకల పుణ్యమా అని అందరం కలిసిపోయే వాళ్లం. మా మధ్య స్నేహం ఇప్పటికీ అలాగేఉండటానికి ఈ సాంస్కృతిక బంధమే ప్రధాన కారణం. 

ఆంధ్రప్రభ యాజమాన్యం ఉన్నట్లుండి మారింది. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లయింది. అప్పటి వరకు ఆశ్రయం ఇచ్చిన చెట్టు కూలిపోగానే ఎక్కడి పక్షులు అక్కడ ఎగిరిపోయాయి. ఎవరి అదృష్టం వారు చూసుకుంటూ కొత్త దారులు వెతుకున్నారు. నేను కొత్త యాజమన్యం క్రింద కొంత కాలం పనిచేశాక  ఒక వెబ్ సైట్ కి మారాను.

 

మారిన `రంగు’:

 

ప్రింట్ మీడియా నుంచి వెబ్ మీడియాకు రావడంతో  రంగుల వలయంలో మరో రంగు ప్రత్యేకతను సంతరించుకున్నట్లు అనిపించింది. తెలుగువన్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ యాజమాన్యం వారు నన్ను న్యూస్ ఎడిటర్ గా తీసుకున్నారు. అక్కడ ఉన్నప్పుడే రికార్డ్ చేసిన తెలుగు వార్తలను ప్రతి రోజూ వెబ్ లో ఉంచేవాళ్లం. ఇదో ఛాలెంజ్. వార్తలు చదవడం కోసం కాజువల్ న్యూస్ రీడర్లను తీసుకున్నాము. వార్తలు ఈజీగా చదవడానికి ప్రాంప్టర్లు లేవు. అందుకని ఏ-4 సైజు పేపర్ మీద పెద్ద సైజులో వార్తను ముద్రించి ఆ పేపర్లను న్యూస్ రీడర్ ఎదురుగా నిలబడి చేతుల్లో ఆ వార్త ఉన్న షీట్ ని పట్టుకుని నిలబడే వాళ్లం. అలా ఒక్కో వార్త చదివిస్తూ రీడీంగ్ పార్ట్ పూర్తి చేసేవాళ్లం. ముఖ్యమైన వార్తలకు సంబంధించిన బైట్స్, క్లిప్పింగ్స్ వంటివి యాడ్ చేస్తూ ఎడిటింగ్ చేయించి మొత్తం బులిటెన్ ను వెబ్ లో పెట్టేవాళ్లం. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. మధ్యమధ్యలో ఇంటర్వ్యూలు, ప్రసంగాలు పోస్ట్ చేసేవాళ్ళం. అలా వెబ్ లో పనిచేస్తున్నప్పుడే టివీ ఛానెల్ లో పనికి సంబంధించిన ప్రాక్టీస్ వచ్చేసిందన్న మాట. తర్వాత నడచి దారిని అలా సిద్ధం చేసుకోగలిగాను. 

 

టీవీతో ప్రయోగాలు:

 

టివీ మీడియాలో చేరాను. టివీ5 యాజమాన్యం చక్కటి స్వేచ్ఛ ఇచ్చింది. ప్రయోగాత్మక కార్యక్రమాలను అందించగలిగాను. ఈ మధ్యలోనే రేడియో రూపకానికి జాతీయ ప్రతిభా పురస్కారం వచ్చింది. 





రేడియోలోని వార్తా విభాగంలో పనిచేయడం, రూపకాలు, నాటికలు వ్రాయడం  ఇదంతా మరో రంగుల వలయం. 

 టివీ 5లో పనిచేస్తున్నప్పుడు రెండు చక్కటి అవకాశాలొచ్చాయి. నేను వ్రాసిన `నిప్పు రవ్వడాక్యుమెంటరీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారిబంగారు నంది అవార్డు దక్కింది. 2009లో టివీ-5  డైలీమిర్రర్ కార్యక్రమం కోసం రోజూ ఓ అరగంట కార్యక్రమాలను రూపొందించాల్సి వచ్చేది. పగలు ఏ పదకొండు గంటలకో ఆఫీస్ కు వెళ్ళేవాడిని. మధ్యాహ్నం వేళకు టాపిక్ డిసైడ్ చేసుకుని స్క్రిప్ట్ పని మొదలుపెట్టేవాడ్ని.  డైలీ మిర్రర్ కు అప్పటికే మంచి పేరు వచ్చింది. దీంతో బాధ్యత మరింత పెరిగింది. సమకాలీన అంశాలు, ప్రత్యేక విజ్ఞాన అంశాలతో ముడిపెడుతూ డైలీమిర్రర్ కార్యక్రమాల రూపకల్పన సాగుతుండేది. డైలీమిర్రర్ కోసం తయారు చేసిన ఎపిసోడ్  నిప్పురవ్వ. నిజానికి ఇది వ్రాస్తున్నప్పుడు దీనికి నంది అవార్డు వస్తుందని మేమెవరమూ ఊహించ లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంట్రీలు పంపమన్నప్పుడు నేను ఈ ఎపిసోడ్ పంపమని సజెస్ట్ చేశాను. నిప్పురవ్వ డాక్యుమెంటరీ 2009 జులై 22వ తేదీన రాత్రి 8 గంటలకు  టెలికాస్ట్ చేశాము. బంగారు నందికి ఈ డాక్యుమెంటరీ ఎంపిక కావడానికి అందులోని సామాజిక, ఆరోగ్య, ఆర్థిక అంశాలతో ముడిపడిన సబ్జెక్ట్ప్రధాన కారణంగా నిలిచింది.

 

నిప్పు రవ్వ  సారాంశం:

 

సింగరేణి ఓపెన్ కాస్ట్ బాధితుల కన్నీళ్ల నుంచి పుట్టినదే నిప్పురవ్వ. ఒకరిది వ్యాపారం, మరొకరిది జీవనం. ఒకరివి లాభాలు, మరొకరివి కన్నీళ్లు, కష్టాలు. ఓపెన్ కాస్ట్ మైన్స్ రాకముందు ఆ ఊర్లు కళకళలాడుతుండేవి. మరి ఇప్పుడో అవి పేరుకే పల్లెలు, జీవకళ లేదు. ఊర్లను స్వాధీనం చేసుకుని బ్లాస్టింగ్ మొదలుపెట్టిన నాటి నుంచి అక్కడి పల్లె వాసుల గుండెలు బద్దలవుతున్నాయి. దీంతో జీవం లేని ఊర్లు కనబడుతున్నాయి. అక్కడ తిరగాడుతున్నది మనుషులే అయినా వారి కళ్లలో ఆనందం ఆవిరైంది. వారి కన్నీటి వ్యధల రూపొందించిన ప్రత్యేక కార్యక్రమే నిప్పు రవ్వ. ఉత్తమ సామాజిక సంబంధిత చిత్రంగా నిప్పురవ్వను 2009 సంవత్సరానికి గాను బంగారు నంది అవార్డుకు సెలెక్ట్ చేశారు.



 ఆ వార్త రాగానే టివీ5 న్యూస్ డెస్క్ ఆనందంతో పొంగిపోయింది. ఈ ఆనంద ఘడియలను నా అభిప్రాయాలుగా టివీ5 న్యూస్ బులిటెన్ లో నేను పంచుకోగలిగాను. అప్పుడెప్పుడో జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించడానికి ముందు మత్యకారుల పడవల మీద వ్యాసం వ్రాయడం, అది ఈనాడులో అచ్చవడం (చూ. ఈ పడవకెంత దిగులో..) ఆనందంతో రూట్ మార్చుకుని జర్నలిజం వైపు అడుగులు వేయడం వంటి సంఘటనలు ఈ నంది అవార్డు ప్రకటన రోజున గుర్తుకొచ్చాయి. నిప్పురవ్వ డాక్యుమెంటరీ తయారుచేయడమన్నది సమిష్టి కృషి. రచయితగా నేను వ్రాస్తే, విజువల్ ఎడిటింగ్ అంబటి కిరణ్ చేశాడు. ఈ వర్క్ తో సంబధంలేకపోయినా చురుకైన కుర్రాడు చల్లగుల్ల హర్ష దగ్గర కూర్చుని ఎడిటింగ్ విషయంలో సలహాలు, సూచనలు చేశాడు. హర్ష ఇప్పుడు టివీ5  హెచ్ ఆర్  జనరల్ మేనేజర్ గా ఎదిగారు. ఆయనను నా జీవనరాగాలు -1 పుస్తకావిష్కరణ సభకు రండని ఆహ్వానిస్తే, వారు ఎంతో ఆత్మీయంగా వచ్చారు. ఈ స్నేహబంధానికి `నిప్పురవ్వ ఎలా సహకరించిందో చెప్పారు. 

నిప్పురవ్వ కార్యక్రమానికి నిర్వాహణ బాధ్యతలను అప్పటి అవుట్ పుట్ ఎడిటర్ ముసునూరి సోమయాజులు గారు తీసుకున్నారు. వీరు కూడా ఇప్పటికీ నాకెంతో ఆత్మీయులు.  

 

మరణ మృదంగం:

 

టివీ5లో పనిచేస్తున్న రోజుల్లోనే బాలికలతో మరణ మృదంగం అన్న పేరిట నిర్వహించిన కార్యక్రమానికి యునిసెఫ్ అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఈ అవార్డుని అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదగా స్వీకరించాను.



 సామాజిక స్పృహతో కార్యక్రమాలను మలిస్తే వాటికి తప్పకుండా ఆదరణ , ప్రశంసలు దక్కుతాయని మరో సారి రుజువైంది. సర్కస్ కంపెనీల వాళ్లు వేరే దేశాల (నేపాల్ వంటి చోట్ల) నుంచి మైనారిటీ వీడని పిల్లలను తీసుకు రావడం, వారి జీవితాలతో ఆడుకోవడం వంటి దుశ్చర్యలను ఖండిస్తూ చేసిన కార్యక్రమం ఇది. 

`జీవితమే రంగుల వలయం. 

దానికి ఆరంభం సూర్యుని ఉదయం ‘  అని దాసరి ఓ సినిపాటలో అన్నట్లుగా ఏ రంగు ఎలా వస్తుందో, అది ఎంత కాలం ఉంటుందో, ఆ రంగే మరో రంగుగా ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు.

 

ఆనంద `తరంగం’ :

 

టివీ 5 నుంచి తరంగా రేడియో స్టేషన్ (ప్రైవేట్) వారు ఉన్నతి పదవి (ప్రొగ్రామ్ డైరెక్టర్) గా నన్ను తీసుకున్నారు. మంచి కార్యక్రమాలు చేయడానికి మరింత అవకాశం చిక్కినట్లు ఫీలయ్యాను. రంగుల వలయంలో మరో రంగు ప్రవేశించింది. ఈ రంగు ప్రకాశవంతంగా వెలుగులు చిమ్మింది. అప్పటికే 60 వడికి చేరువు అవుతున్నాను.తరంగా రేడియోలో పనిచేస్తున్నప్పుడే అనేక మంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. గుర్తుకొచ్చినవి ప్రస్తావిస్తున్నాను. రావి కొండలరావు గారితో అనేక ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాను. వారిని ఇంటర్వ్యూ కూడా చేశాను. అలాగే జయసుధ, మురళీమోహన్, జీవిత రాజశేఖర్, అనంత్ శ్రీరామ్, సి. నారాయణ రెడ్డి, మాదవపెద్ది సురేష్ వంటి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. 







రేడియో తరంగా పేరిట భారతీయ సినిమాకు మేము అందించిన మెగా ఈవెంట్ కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. చాలా సంతోషమేసింది. ఎక్కడ ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థ నుంచి ప్రశంసా పత్రాలు అందుకోవడం వెనుక నాలోని పట్టుదల, కృషి, సంకల్పబలం కారణమని నేను అనుకుంటూ ఉంటాను. ఇక రిటైర్ అయ్యాక ఏం చేస్తాములే అనుకుంటున్న వేళలో కూడా నాకు భగవంతుడు అనేక అవకాశాలు కల్పించాడు. ఇప్పటికీ కల్పిస్తూనే ఉన్నాడు.

 హార్ట్ ఆఫరేషన్ అయ్యాక 60 పదులు దాటిన వయసులో నా సొంత ఛానెల్ లో అనేక విశేష కార్యక్రమాలు అందజేశాను. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ వారు  ఎక్స్ లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు భాషా వికాసానికి సోషల్ మీడియా ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశంపై ఆంధ్రా విశ్వకళాపరిషత్ లో ప్రసంగించాను. తెలుగు భాషాభివృద్ధికి ఓ జర్నలిస్ట్ గా సేవలందించాను. ఈ విశేషాలు మరో సారి చెబుతాను. 


తిరిగే రంగుల చక్రం

 

కష్టాలు పడ్డాను, అవమానాలు ఎదుర్కున్నాను. బాధలు చవిచూశాను. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో జర్నలిస్ట్ గానే చేతనైన పనులు చేస్తూనే ఉన్నాను. జీవనపోరాటాల నుంచి జీవన సాఫల్యత వైపు నడిచిన నాయీ సుదీర్ఘ ప్రయాణం ఏ కొద్ది మందికైనా ఆదర్శంగా నిలిస్తే చాలు. భగవంతుడు ప్రసాదించిన ఈ కాలమనే రంగుల చక్రంలో ఇంకా ఎన్ని రంగులు మిగిలి ఉన్నాయో ఎవరికి తెలుసు. చూద్దాం..

(మళ్ళీ కలుద్దాం)

18, నవంబర్ 2024, సోమవారం

34వ భాగం : ఆకాశం నీ హద్దురా..


     గది మూలన చెక్క గుర్రం ఉంది. అది చాలా పాతదిలా ఉంది. దానికి వేసిన రంగులు చాలా చోట్ల వెలిసిపోయి ఏదో రోగం వచ్చిన ముసలి గుర్రంలా కనిపిస్తున్నది. ఆ గుర్రం బొమ్మను చూడగానే నాకెందుకో జాలి కలిగింది. ఇంట్లో మా బామ్మా అంతే, ముడతలు పడిన శరీరం.. కంటి చూపు ఆనదు. బాగా వంగిపోయిన నడుము.. కర్ర సాయం లేనిదే నడవలేదు. పాపం, ఈ గుర్రం కూడా ముసలిదైపోయినట్లుంది. దీని ఆలనాపాలనా చూడాలి.  

  నాకప్పుడు ఎనిమిదేళ్లు. మా అమ్మమో, నన్ను అక్కనీ ఎవరింటికో తీసుకు వెళ్ళింది. వారిల్లు చాలా విశాలంగా ఉంది. మధ్యలో పెద్ద హాలు. చుట్టూ ఐదారు గదులు. హాలు మధ్యలో ఉయ్యాల బల్ల ఉంది. `హాయ్..’ సంతోషంగాఎగురుకుంటూ ఆ ఉయ్యాల బల్ల ఎక్కేసి ఊగడం ప్రారంభించాము. ఉయ్యాల బల్ల కొంచం ఎత్తులోనే ఉండటంతో దాని మీద కూర్చుంటే కాళ్లు నేలకు ఆనడం లేదు. మా అక్కకి ఆ ఇబ్బంది లేదు. మరి అక్క నాకంటే పొడుగు కదా. తన కాళ్లను నేలకు ఆనించి తోస్తూభలే తమాషాగా ఉయ్యాల ఊపు ఎక్కువ అయ్యేలా చేస్తుండేది. ఎర్ర బస్సు డ్రైవర్ లాగానే అక్క ఊయ్యాల డ్రైవర్ అయిపోతుందనుకున్నాను. పక్షికి రెక్కలొచ్చి ఎగురుతున్నట్లు, అంతలో క్రిందకు వాలుతున్నట్లుగానే ఉయ్యాల బల్ల పైకీ క్రిందకీ వస్తోంది. పైకి ఎగురుతున్నప్పుడు గుండె బరువెక్కినట్లు అనిపిస్తుంటే, క్రిందకు వస్తున్నప్పుడు తేలిక అవుతున్నట్లు అనిపించ సాగింది. ఆ తర్వాత చాలా పెద్దయ్యాక విమానం టేకాఫ్, ల్యాండింగ్ అప్పుడు ఇలాంటి భావనే కలిగింది. కానీ అప్పుడేమో విమానం అంటే పేపర్ విమానమే నాకు తెలుసు. భవిష్యత్తులో విమానం ఎక్కుతానని నేను అస్సలు అనుకోలేదు. కానీ పక్షిలా ఎగరాలని మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తుండేది. ఎగిరే శక్తి పక్షికి ఎలా వచ్చిందా !! అని తెగ ఆశ్చర్యపోతుండే వాడ్ని.  

సరే,  ఉయ్యాల బల్ల ఎక్కి,  ఓ నాలుగు ఊపులు ఊగగానే ఇంటావిడ వచ్చి, `బల్లకు కట్టిన గొలుసు బాగాలేదు. గట్టిగా ఊగకండర్రా’ అంటూ హెచ్చరించింది. అప్పటి వరకు పెద్దపెద్ద ఊపులు ఊగుతున్న మాకు భయం వేసింది. ఉయ్యాల బల్ల ఊపులు ఎంత పెద్దవంటే, అటు ఇంటి కప్పు తాకుందా అన్నంతగా పైకి వెళ్ళి, అంతలో దూకుడుగా నేలకు దిగుతోంది. క్షణంలో మళ్ళీ అటూ అంతే ఎత్తుకి వెళుతున్నది. ఎత్తునుంచి పడితే..అమ్మో ఏమైనా ఉందామొదట్లో ఆ భయం రాలేదు, కానీ ఇంటావడ వచ్చి గొలుసులు బాగాలేవని చెప్పేసరికి పడిపోతామేమో అన్న భయం పుట్టిచమటలు పట్టేశాయి. నెమ్మదిగా ఉయ్యాల బల్ల వేగం తగ్గగానే అక్క తనకు తెలిసిన విద్యతో  కాళ్లు నేలకు తాకిస్తూ బ్రేక్ లు వేస్తున్నట్లుగానే  బల్ల వేగాన్ని అదుపు చేసింది. ఉయ్యాల బల్ల ఆగగానే, నేను క్షేమంగా దిగేసి ఊపిరి పీల్చుకున్నాను.  అచ్చు  ఇలాంటి భావనే విమానాలు నిజంగా ఎక్కినప్పుడు కలిగింది. రైలు, బస్సు వంటివేమో నేలమీదనే పోతుంటాయి కదా, కాబట్టి అవి ప్రమాదకరం కావనీ, అదే ఆకాశంలో తిరిగే విమానం ఆ రెంటికంటే ప్రమాదకరమని మొదట్లో అనుకున్నాను. చాలా పెద్దయ్యాక తెలిసిందేమిటంటే, టెక్నాలజీ పరంగా చూస్తే, రైలు బస్సు ప్రయాణాల కంటే విమానయానం సురక్షితమైనదే. కాకపోతే గాలిలో ఎగరుతుండటంతో మనలో భయం పోవడం లేదు. ఇప్పుడు ప్రపంచమంతటా ప్రతి గంటకూ పది వేలకు పైగానే విమానాలుఎగురుతున్నాయి, క్షేమంగా దిగుతున్నాయి. విమాన ప్రమాదాల్లో 80 శాతం మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అంటే టెక్నికల్ లోపాల వల్ల జరిగే ప్రమాదాలు తక్కువనే కదా. కనుక అన్ని ప్రమాదాలను పాపం, విమానానికే కట్టబెట్టడం ఏం సబబు చెప్పండి. సరే, ఈ లెక్కలు గట్రా అప్పట్లో నాకు తెలియదు కదా. మళ్ళీ ఉయ్యాల బల్ల దగ్గరకే వెళదాం. పదండి.. 

ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఇంటావిడకు మేము ఉయ్యాల ఊగడం ఇష్టం లేదట. బల్ల పాడైపోతుందట. ఈ విషయం తెలియగానే నా ముఖం కందగడ్డలా మారింది. కోపం రాగానే నా బొటనవేలు నోట్లోకి వెళ్ళింది. చాలా ఏళ్లు వచ్చేదాకా నేను నోట్లో వేలు వేసుకునే వాడ్ని. పాలపళ్లు రాలి, కొత్త పళ్లు వచ్చేటప్పుడు కూడా ఈ అలవాటు మానలేదు. దీంతో ముందు వరసలోని పై పళ్లలో రెండు పైకి లేచాయి. నోట్లో పళ్లు వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో ఇప్పుడున్నంత అవగాహన అప్పట్లో తల్లిదండ్రులకు ఉన్నట్లు లేదేమో. ఒక వేళ వాళ్లు చెప్పినా నేను వినలేదేమో..ఏమో..నాకు గుర్తులేదు. సర్లేండి. నెమ్మదిగా బల్ల దిగాము. అక్కేమే అమ్మ ఒడిలో కూర్చుని పెద్దోళ్ల మాటలు వింటున్నది. నేనేమో అబ్బాయిని కదా. ఎనిమిదేళ్లు వచ్చేశాయి.. పెద్దపిల్లాడ్ని అయ్యాను అన్న ఫీలింగ్ వచ్చేసింది. అందుకే ఇళ్లంతా చూడటానికి బయలుదేరాను. ఒక్కో గది చూస్తూ దక్షిణం దిక్కున ఉన్న గది తలుపులు తెరిచాను. అలా తెరుస్తున్నప్పుడు తలుపులు  `కిర్రు...కిర్రు..’ మంటూ శబ్దం చేశాయి. ఇందాక ఉయ్యాల బల్లమీద నుంచి పడతామనుకున్నప్పుడు వచ్చిన భయం కంటే ఈ శబ్దం మరీ భయపెట్టింది. మగ పిల్లలు భయపడకూడదని అప్పటికే కొన్ని సినిమాలు చూసి తెలుసుకున్నాను లేండి. పైగా మగ పిల్లలు అప్పుడప్పుడు సాహసాలు చేయాలట. అది రూల్ అని మా ఫ్రెండ్ గాడు చెప్పాడు.సాహసాలు అంటే పెద్దవేమీ కావులేండి. గెంతడాలు, దూకడాలు, పరిగెత్తడాలు, కుస్తీ పట్టుకోవడాలు అన్న మాట. అందుకే ధైర్యంగా గదిలోకి వెళ్ళాను. ఆ గదిలో వెళుతురు కూడా తక్కువగానే ఉంది. వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. పనికిరాని వస్తువులన్నీ ఈ గదిలోనే పడేసినట్లున్నారు. అప్పుడు చూశాను. ఓ మూలగా కొయ్య గుర్రాన్ని. బాగా వెలిసిపోయింది. అది నా వైపు దీనంగా చూస్తున్నట్లు అనిపించింది. పాపం, దీన్ని రక్షించాలనుకుని ప్రేమగా  దాన్ని నిమిరాను. అంతే  `కిర్రు..కిర్రు మంటూ శబ్దం. చెక్క గుర్రం నుంచి ఈ వింత శబ్దం వస్తున్నదేమో అనిభయపడ్డాను. కానీ, నా వెనుక వైపు నుంచి వచ్చినట్లు అర్థమై వెనక్కి చూశానుఅప్పటికే తలుపు తోసుకుని ఇంటావిడ గదిలోకి వచ్చేసింది. ఈ సారి ఏమంటుందో అని నాకు మరింత భయం వేసింది. కానీ..

`ఏరా, ఈ గుర్రం నచ్చిందా... కావాలా.. అంటూ ఆఫర్ ఇచ్చింది. కావాలన్నట్లుగా తల ఊచి నోట్లో వేలు వేసుకున్నాను. `సర్లే అమ్మకు చెబుతాను, రేపు జీతగాడ్ని పంపిస్తే గుర్రం ఇస్తాన్లేరా’ -అనేసరికి ఆమె పట్ల ఉన్న మునుపటి భయం , కోపం పూర్తిగా పోయి, చెక్క గుర్రం వరంగా ఇచ్చే దేవతగా కనిపించింది. బోలెడు సంతోషం వేసింది. 

అప్పటి నుంచీ చెక్క గుర్రం గురించి ఆలోచనలు. ఇంట్లోకి తీసుకు వస్తే దాన్ని ఎక్కడ పెట్టాలి, దానికి ఏ పేరు పెట్టాలి, దానితో ఎలాంటి ఆటలు ఆడాలి..ఇలా సాగుతున్నాయి ఎడతెరప లేని ఆలోచనలు. ఎప్పుడు పట్టిందో తెలియదు కానీ, నిద్ర పట్టేసింది. మర్నాడు నిజంగానే చెక్క గుర్రం ఇచ్చేసింది ఆ దేవత. దానికేమో నేను `కీలు గుర్రం అని పేరు పెట్టాను. ఎందుకంటే,అప్పటికే ఆ సినిమా నేను చూసాను. కీలుగుర్రం సినిమాలో నాకు బాగా గుర్తున్నవి రెండు  

1. ఇద్దరు ఆడ రాక్షసులు రాత్రి వేళ ఏనుగులను చంపి తినడం. 

2. ఎవరో తెలియదు కానీ భలే చిత్రంగా కీలు గుర్రాన్ని తయారు చేస్తారు. అది ఎక్కి ఓ కుర్రాడు ఆకాశ వీధుల్లో ఎగురుతుంటాడు. అమ్మాయినికూడా ఎక్కించుకుని పాట కూడా పాడుతుంటాడు. 

 ఇంట్లో ఈ చెక్క గుర్రం రాగానే  అమ్మని అడిగాను, `దీని మీద ఎక్కి ఎగురొచ్చా అని. అమ్మేమో `ఎగరడమా, అది కుదరదురాఅంటూ తేల్చి చెప్పేసింది. అయినా ఊరుకోలేదు.నా కీలుగుర్రం కూడా ఎగరాలి. పెద్దయ్యాక సినిమాలోని కుర్రాడు లాగానే ఓ అమ్మాయిని ఎక్కించుకుని పాట పాడాలి. ఈ ఆలోచనలు ఎక్కువ కావడంతో ఒకరిద్దరు ఫ్రెండ్స్ దగ్గర చెప్పాను. `లోపల ఏదో యంత్రాలు పెట్టాల్రా..నేను మా మామయ్యని అడుగుతాన్లే. మామయ్య గాడేమో సైన్స్ చదువుతున్నాడుగా, మార్చేస్తాడులే, దీన్ని కీలు గ్రురంలాగా’ అంటూ ఉత్సాహ పరిచాడు. వారం గడిచినా ఆ మామయ్య గాడు రాలేదు. ఇంతలో ఫ్రెండ్ గాడేమో వేరే ఊరు చెక్కేశాడు.  ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. చెక్క గుర్రం కీలుగుర్రం కాలేదు. అది ఇంట్లో అలాగే పడి ఉంది, జాలిగా నా వైపు చూస్తూ.

కానీ, ఆకాశంలో ఎగరాలన్న కోరిక రోజురోజుకీ ఎక్కువ అవుతున్నదిఅది,1964లో అనుకుంటా ఎండాకాలం సెలవులకు మేము గుంటూరు నుంచి  అడవిరావులపాడు వచ్చాము. అప్పటికే నేను కాగితాలతో విమానం, రాకెట్, పడవ,గూడు పడవ, కత్తి పడవ, నాలుగు గిన్నెల గుత్తి, సీరా బుడ్డి, కమలం పువ్వు,  వంటి బొమ్మలు తయారుచేసే విద్య నేర్చేసుకున్నాను. అంతే కాదు, బంక మట్టి , ఎండు పుల్లలతో విమానం, గూడు బండి బొమ్మలు చేయడం కూడా వచ్చేసింది. అయితే ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. నా విమానం, గూడు బండి బొమ్మలకు చక్రాలు సరిగా కుదరడం లేదు. బంక మట్టితో ఉండలు చేసి చక్రంగా గుండ్రంగా మార్చి బిగించినా కుదరడం లేదు. బొమ్మకు దారం కట్టి లాగగానే మట్టి చక్రాలు విరిగిపోయేవి. దీనికి మార్గం ఏమిటా అని ఆలోచిస్తుంటే ఓ చక్కటి ఉపాయం తట్టింది. మా ఊర్లో ప్రక్క వీధిలోనే ఆర్ఎంపీ డాక్టర్ ఒకాయన ఉండే వాడు. ఓ సారి ఆయన ఇంజెక్షన్ చేశాక మందు బాటిల్ నీ దాని రబ్బరు మూతనీ చెత్త బుట్టలో పడేసేవాడు. నాకు అది గుర్తుకు వచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెత్తలో పడేసిన రబ్బరు మూతలను ఏరుకు వచ్చాను. అమ్మనడిగి సూది తీసుకుని రబ్బర్ మూత మధ్యలో చిల్లు పెట్టాను. చిన్న అగ్గి పుల్లకు అటూ ఇటూ  రబ్బర్ మూతలు గుచ్చాను. రబ్బరు మూతలను నేర్పుగా విమానం బొమ్మకు బిగించి దారంతో లాగడం మొదలు పెట్టాను. మట్టి చక్రాల్లా ఇవి విరగలేదు. పైగా లూజ్ అయినకొద్ది రబ్బరు చక్రాలు తిరగడం మొదలెట్టాయి. గొప్ప విజయం సాధించినట్లు ఫీలయ్యాను.  

ఇలా ఏవేవో ప్రయోగాలు చేస్తూ, వాటి గురుంచిపల్లెటూరి ఫ్రెండ్స్ కి చూపిస్తుంటే వాళ్లేమో బోలెడు ఆశ్చర్యపోయేవారు. ఇలా ఓ రోజు పేపర్ విమానాలు ఎగురవేస్తున్నప్పుడే ఓ వింత జరిగింది. 

ఆకాశంలో ఉన్నట్లుండి పెద్ద శబ్దం వచ్చింది. ఉలిక్కి పడి, పైకి చూశాము. క్షణాల్లో ఆకాశంలో విమానం ప్రత్యక్షమైంది. అంతలో వేగంగా మా ఊరు దాటి వెళ్ళిపోయింది. కానీ అది వదిలిన పొగ చాలా సేపు కనిపించింది. అప్పటికే ఎర్ర బస్సులు, లారీలు కూడా ఇలాగే పొగ వదిలిపెడుతుండేవి కదా, అందుకే విమానం పొగ చూసి మేమేమీ ఆశ్చర్యపోలేదు. మా ఆశ్చర్యమల్లా పేపర్ విమానం ఏ మాంత్రికుని మాయాజాలంతో పెద్ద విమానంగా మారిపోయిందనే. నిఝంగా అలాగే అనుకున్నాము. అప్పట్లో విమానాలు దిగే చోటుని విమానాశ్రయం అంటారని కూడా తెలియదు. టెన్త్ అయ్యాక ఓ సారి విశాఖపట్నం వెళ్ళినప్పుడు చాలా క్రిందగా, ఇళ్ల మీదగావెళుతుండే విమానాలు చూశాను. ఆకాశంలో చూసిన ఈ అద్భుత దృశ్యం నా మదిలో బలంగా నాటుకుపోయింది. చాలా సార్లు విమానం ఎక్కి నేనూ ఆకాశయానం చేసినట్లు కలలు వచ్చేవి. ఒక్కోసారి మరింత చిత్రంగా.. నా చేతులను బలంగా ఊపగానే ఏదో శక్తి ఆవహించినట్లు అనిపించింది. ఆ వెంటనే చేతులు పక్షి రెక్కలుగా మారిపోయాయి.



 గెంతడం మొదలు పెట్టాను. మునుపటి కంటే ఎక్కువ ఎత్తుకు గెంతగలగుతున్నాను. మొదట్లో భూమికి ఒక అడుగు ఎత్తు లేవగలిగాను. ఇంకా ప్రయత్నిస్తుంటే నెమ్మదిగా ఇంటి చూరు దాకా ఎగర గలిగాను. ఆశ్చర్యం.. గదిలో గాలిలో చెక్కర్లు కొట్టగలుగుతున్నానుఉయ్యాల బల్ల పైకి లేచినట్లుగా , పక్షి ఎగురుతున్నట్లుగా నేనూ పైకి, పైపైకి లేవగలుగుతున్నాను. ఎగిరే నేను దిగాలంటే ఎలాగా అని ఆలోచిస్తుంటే , అంతలో ఆ టెక్నిక్ కూడా తెలిసింది. చేతులు ముడవగానే క్రిందకు దిగగలుగుతున్నాను. మళ్ళీ చేతులు జాపగానే పైకి ఎగరగలుగుతునాను. ఆ టెక్నిక్ పట్టేశాను. ఇక కీలు గుర్రం అక్కర్లేదు. విమానమూ అక్కర్లేదు. ఏ ఊరైనా ఎగురుతూ వెళ్ళవచ్చు...హ్హాహ్హాహ్హా..  

ఇలా అనుకుంటుండగా కల చెదిరింది.. మెలుకువ వచ్చేది. ఓహ్..కలేనా, నిజమైతే ఎంత బాగుండేది అనుకున్నాను

 నా చిన్నప్పటి కల ఇప్పుడు సాంకేతిక సహకారంతో నిజం అయింది.  భ్యూమ్యాకర్షణ శక్తిని బలహీన పరిస్తే మనిషి పై పైకి గెంతుతాడు. స్వేచ్ఛగా ఎగరగలుగుతాడు. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ మధ్యనే కొన్ని చోట్ల పిల్లలూ పెద్దలకు గేమ్ లా ఓ గదిలో ఎగిరే అవకాశం కల్పిస్తున్నారు. 

 



నా మనవడు విరాజ్, వాడి నాన్న రాజేష్ ఆ మధ్య ఇంగ్లండ్ లోని `I FLY సెంటర్ కి వెళ్ళి అక్కడి విశాలమైన గదిలో రెక్కలు తొడిగిన పక్షిలా ఎగరగలిగారు.



 ఆ దృశ్యం చూడగానే నాకు నా చిన్నప్పటి కల గుర్తుకు వచ్చింది. మనవడితో చెబితే, వాడు ఆ చిన్న వయసులోనే (ఆరేళ్లు) `ఇదంతా జీరో గ్రావిటీ వల్ల సాధ్యమవుతుంది తాతా అంటూ ఫిజిక్స్ సూత్రాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడో బీఎస్సీలో చదివిన సూక్ష్మమైన ఫిజిక్స్ సూత్రాలను మా మనవడి తరం వాళ్లు ఆరేళ్లలోనే తెలుసుకోగలుగుతున్నారు. భూమ్యాకర్షణ శక్తి క్రమంగా తగ్గుతుంటే మనం ఎగరడం సులువవుతుంది. జీరో గ్రావిటీ అయితే అంతరక్షంలో తేలియాడుతూ వెళ్లవచ్చు, ఈ సూత్రంతోనే అస్ట్రోనాట్స్ అంతరక్ష ప్రయాణం చేయగలుగుతున్నారని కొంచం పెద్దయ్యాక తెలిసింది. అప్పుడనిపించింది  ప్రతి అద్భుతం వెనుక సైన్స్ సూత్రం ఒకటి ఉంటుంది. అది తెలియనంత వరకే మాయలు, మంత్రాలు, మహిమలు మనం నమ్ముతుంటాము. హేతువు తెలిస్తే చాలా భయాలుసందేహాలుతొలిగిపోతాయి. ఈ కాలం పిల్లలు ఇలాంటి లాజిక్స్ ని ఇట్టే పట్టేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోవడానికి వారికిప్పుడు అనేక పుస్తకాలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ లేని రోజుల్లో , అంటే నా చిన్నప్పుడు ప్రతిదీ ఆశ్చర్యమే, అద్భుతమే. ఈ రకంగా చూస్తే మేము ఓ అద్భుత ప్రపంచంలో బతికామన్న సంతృప్తి కలుగుతోంది. 

ఆకాశంలో పక్షిలా ఎగరలేకపోయినప్పటికీ నా జీవితంలో పెద్ద పెద్ద విమానాలు ఎక్కుతాననీ, సముద్రాలు, ఖండాలు దాటుతానని అనుకోలేదు. 



ఓ బలమైన కోరిక తీరినట్లు మొదటి సారి విదేశీ యాత్ర చేసినప్పుడు అనిపించింది. ముఖంలో ఆనందం తాండవమాడింది. అయితే అంతకు ముందు రెండు సార్లు చిన్నచిన్న విమానాలు ఎక్కాను. అందులో ఒకటైతే పైలెట్ ట్రైనీ విమానం . ఇందులో కేవలం ఐదుగురు మాత్రమే కూర్చోగలరు. అలాంటి విమానం ఎక్కి గగన విహారం చేస్తూ హైదరాబాద్ అందాలు చూడగలిగాను.  కొన్ని సంఘటనలు చాలా చిత్రంగా జరుగుతుంటాయి. పైలెట్ ట్రైనింగ్  కోసం ఉపయోగించే విమానం ఎక్కిన సంఘటన కూడా అలాంటిదే

ప్రైవేట్ విమానం ఎక్కడం హైటెక్ సిటీని విహంగ వీక్షణం చేయడం నాలాటి మధ్యతరగతి వారికి కుదిరే పనేనా? చెప్పండి. నిజానికి ఇది కలలో కూడా రాదు. తరంగా రేడియో స్టేషన్ లో ప్రొగ్రామ్ డైరెక్టర్ పనిచేస్తున్నపుడు అనుకోకుండా అవకాశం వచ్చింది. హైదరాబాద్ శివారులోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ వారి ఆహ్వానం మేరకు అక్కడకు మా తరంగా టీమ్ వెళ్ళింది.



 అతి చిన్న విమానంలో మేము ఐదుగురం కూర్చోగానే పైలెట్ విమానాన్నినడిపాడు. రన్ వే మీద నుంచి టేకాఫ్ అయింది. చిన్న విమానం హైదరాబాద్ ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టింది. ఈ అకాడమీ ప్రాంగణంలోనే ఓ యుద్ధ విమానం ఉంది. ఆ విమానం దగ్గర మేము ఫొటో దిగాము. టీమ్ లీడర్ గా నేను, నాతోపాటుగా ఆర్.జె నిహార, వివేకానంద్ తో పాటుగా మరో ఇద్దరితో తరంగా టీమ్ గా తయారై అక్కడకు వెళ్ళాము. `ఆకాశమే నీ హద్దురా..’ అన్న పేరిట పైలెట్ గా శిక్షణ పొందుతున్న వారి అనుభవాలను రికార్డ్ చేసిప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం చేశాము. ఇదో వింత అనుభవం. 

విమానం ఎక్కడం ఇది రెండో సారి. అంతకు ముందు చెన్నై నుంచి నేనూ మా ఆవిడ, అమ్మాయి హైదరాబాద్ కి ప్లైట్ లో వచ్చాము. అయితే ఆ సందర్భంలో మనసులో తెగ ఆందోళన. విమానం ఎక్కినందుకు కాదు, మా ఆవిడకు తగిలిన దెబ్బ గురించి. తిరుమలలో ఆమె కాలికి ఫ్రాక్చర్ అయింది. చెన్నై విజయా ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. కొన్నాళ్లు మా అక్కా వాళ్ళింట్లో ఉన్న తరువాత మేనల్లుడు ప్లైట్ టికెట్ బుక్ చేశాడు. నెమ్మదిగా ఆమెను హైదరాబాద్ తరలించాము. ఈ గందరగోళ పరిసథితిలో తొలిసారిగా విమానం ఎక్కామన్నఅనుభూతి మనసు పొరల్లో చేరనేలేదు. 

మా అబ్బాయి ఫ్యామిలీ ఇంగ్లండ్ లో సెటిల్ కావడంతో 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కే అవకాశం వచ్చింది. అప్పుడు మాత్రం నా చిన్ననాటి విమానం ముచ్చట్లు గుర్తుకు వచ్చాయి. నా యీ తొలి విదేశీ యాత్ర లోఅత్యంత ఆనందం కలిగించిన విషయం నేను తాతను కావడం, తను బామ్మ కావడం.  మాకు మనవడు పుట్టాడు. ఇంతకు ముందు ప్రస్తావించిన మనవడు వీడే (విరాజ్). మా తుర్లపాటి వంశంలో 21వ తరం వాడు. వీడికో తమ్ముడు (విహాన్) 2022లో పుట్టాడు. ఈ ఇద్దరు మనవళ్ల మధ్యలో మరో మనవడు (కూతురు కొడుకు) 2021లో పుట్టాడు. వాడి పేరేమో అద్వైత్. 




ముగ్గురు మనవళ్లతో బామ్మ తాతలుగా మేము ఆడుకుంటూ చిన్నప్పటి అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటున్నాము.  

ఇప్పటికి (2025 నాటికి) విమానం ఎక్కి రయ్యిరయ్యిన యుకె ఐదు సార్లు వెళ్ళాము. ఈ ఐదు పర్యటనల్లో చాలా విశేషాలు మదిలో నిక్షిప్తమయ్యాయి. అలాగే 2025 లో వెళ్ళినప్పుడు అనారోగ్య సమస్యల తో కారుమేఘాలు కమ్ముకున్నాయి. 

    ప్రస్తుతానికి కొన్ని ఆనందకరమైన సంఘటనలు గుర్తుచేసుకుంటున్నాను. విశ్వ విఖ్యాత నాటక రచయిత William Shakespeare పుట్టిన ఊరు చూడటం, అలాగే  లండన్ లోని Madame Tussauds మ్యూజియంలో క్వీన్ ఎలిజబెత్ మైనపు బొమ్మ ప్రక్కన నిలబడి ఫొటోలు దిగడం,రెండు యూనివర్శిటీలు (oxford, Cambridge), పిల్లలు పాడుకునే రైమ్ లో వచ్చే లండన్ బ్రిడ్జ్ చూడటం, సరదాగా హాట్ క్రాస్ బన్స్ తినడం, నాటక ప్రదర్శనలు వీక్షించడం.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంగ్లండ్ లో నాటక ప్రదర్శనలను విశేషంగా ఆదరించడం నాకెంతో నచ్చింది. Harrogate వెళ్ళినప్పుడు అక్కడి థియేటర్ లో `The Emperor’s New Cloths’ నాటకాన్ని చూశాను. హాల్ ఫుల్ అయింది. ప్రదర్శన తీరు, దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకున్నాయి. 

మరో చోట (పేరు గుర్తుకు రావడం లేదు) రెండవ ప్రపంచ యుద్ధం నాటి విమానాలు చూశాను. ఈ మధ్య టివీలో `విమానం పేరిట ఓ సినిమా చూశాను. విమానం ఎక్కాలని ఆ పిల్లాడి కల, పట్టుదల చూస్తుంటే నాకు చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చాయి. కాకపోతే పిల్లాడు విమానం ఎక్కుతాడు, అదే విమానంలో తుది శ్వాస విడుస్తాడు. ఈ దృశ్యం మాత్రం నన్ను కలచివేసింది. 

మొత్తానికి ఇప్పటికీ విమానం ఎక్కడం, ఆకాశయానం చేయడం, పక్షిలా ఎగరాలనుకోవడం...ఇవన్నీ చాలా మందికి తీరని కోరికలే. నా జీవన యాత్రలో కలలు సాకారం కావడమన్నది ఓ అదృష్టం.