28, ఏప్రిల్ 2024, ఆదివారం

4వ భాగం : కొత్త పుస్తకం - కమ్మటి వాసన

వేసవి ఎండ, వడగాలి అంటే భయం లేని రోజులవి. సమ్మర్ వచ్చిందంటే చాలు బోలెడు సెలవలు. `చదువుకో'- అని అడిగేవారే ఉండరు. ఆట పాటలతో సెలవులు కరిగిపోతున్నాయన్న సంగతే మరచిపోయేవాడ్ని. ఇంతలో పిడుగుపాటు వార్తని ఇంట్లో వాళ్లు మోసుకొచ్చేవాళ్లు. `వచ్చే సోమవారం నుంచేనట వీడి స్కూల్ ప్రారంభమయ్యేది, ఒరేయ్ ఇక తిరుగుళ్లు తగ్గించు, రేపో ఎల్లుండో కొత్త టెక్ట్ పుస్తకాలు తెస్తాను' అనేవారు. ఇలాంటి మాటలు నాకసలు నచ్చేవి కావు. ఈ పెద్దోళ్లున్నారే వీళ్లెప్పుడు ఇంతే, `చదువుకో చదువుకో' అంటారా, బుద్ధిగా చదువుకుంటున్నామా, అంతలో `ఇక చాల్లే వెళ్ళి ఆడుకో' అనో, `వెళ్ళి పడుకోరా' అనో అనేవారు. ఏ మాట మీద సరిగా నిలబడరు. ఏమిటో నిలకడలేని మనుషులు. సరే, కొత్త పుస్తకాలు కొని తెస్తామన్న మాట మాత్రం నిలబెట్టుకున్నారనుకోండి. ఇంట్లోకి కొత్త పుస్తకాలు వచ్చి వాలాయి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇంట్లోకి కొత్త పుస్తకాలు వచ్చిన వేళా విశేషమేమోకానీ ఆటలు, అల్లరికి స్వస్తి చెప్పేసి బుద్ధిగా కొత్త పుస్తకాలు చేతిలోకి తీసుకోవాలనిపించేది. ఇంట్లో నాపైన అక్కా, అన్న ఉన్నప్పటికీ మా ఇంట్లో కొత్త పాఠ్య పుస్తకాలనే కొని తెచ్చే అలవాటు ఒకటుంది. కానీ, చాలా మంది ఇళ్లలో `పెద్దోడి పుస్తకాలున్నాయి కదా, చిన్నోడికి మళ్ళీ కొనడం ఎందుకు దండుగ' అంటూ పాత పుస్తకాలు మొహాన పడేస్తుంటారు. అంతేనా, అన్నలో అక్కలో వాడేసిన బొమ్మలు, కలర్ పెన్సిళ్లు, చివరకు వాడిన లంచ్ బాక్స్ కూడా చిన్నోడి “సంపద” అవుతాయి. పాతబడిన పుస్తకాలు, అందులో నుంచి వచ్చే అదోరకం చెమట, మురికి వాసనలు పీలుస్తూ చదువుకుంటూ సర్దుకుపోయే పిల్లలను చూసినప్పుడల్లా నాకు బోలెడు జాలేస్తుండేది. ఈ పరిస్థితి మా ఇంట లేనందుకు కాస్తంత గర్వంగానూ ఉండేది. ఎవరింటి ఆర్థిక పరిస్థితి వారిదన్న ఆలోచన వచ్చేది కాదు. దీంతో వాళ్ల నాన్నలు సినిమాల్లో విలన్ గాళ్ళలా కనిపించే వారు. ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వాతంత్ర్యం, స్వేచ్ఛ వంటి పెద్ద పెద్ద పదాలు అప్పట్లో తెలియకపోయినా ఎందుకో నాన్నల్లో `విలన్ నాన్నలు' ఉంటారన్న గట్టి ఫీలింగ్ వచ్చేసేది. సరే, కొత్త పుస్తకాలు ఇంటికి రెక్కలు కట్టుకుని వాలగానే బోలెడు సంతోషమేసేది. నూతనోత్సాహం కట్టలు తెంచుకునేది. ఒక్క రోజులో అన్ని పాఠ్య పుస్తకాలు చదేవేయాలన్నంత పట్టుదల వచ్చేసేది. అలాంటప్పుడే, నా అంతటి అదృష్టవంతుడు ఎవ్వరూ లేరని నాకు నేనే భుజం తట్టుకునే వాడ్ని. ఇలా భుజం తట్టుకునే అలవాటు ఆ తర్వాత కూడా పోలేదు. ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒక వార్తకు పెట్టిన హెడ్డింగ్ లేదా మ్యాటర్ నాకు నచ్చగానే కుడి చేతితో ఎడమ భుజాన్ని తట్టుకునే వాడ్ని. ఈ లక్షణాన్నే `స్వీయ ప్రోత్సాహం' అనవచ్చేమో. కొత్త పుస్తకాలు చేతికి అందగానే వాటిని ప్రేమగా నిమిరేవాడ్ని. ఆ రోజుల్లోనే పాఠ్యపుస్తకాల్లో ఎంతో అందమైన బొమ్మలు ప్రింట్ అయ్యేవి. వాటిలో కొన్ని రంగు రంగు బొమ్మలు. ఉదాహరణగా ఒక ముచ్చట... తెలుగు పుస్తకం తెరవగానే.. `చేత వెన్న ముద్ద - చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు - పట్టుదట్టి సందిట తాయత్తులు - సిరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణా నిన్ను - చేరి కొలుతు' అంటూ ఓ బుజ్జి కృష్ణుడి బొమ్మ వేసి ఆ పక్కనే ఈ పాట ఫ్రింట్ చేసేవారు. అసలు ఆ చిన్ని కృష్ణుడ్ని చూస్తేనే చిట్టి తమ్ముడు గజ్జల కాళ్లతో ఘళ్లు ఘళ్లున మా ఇంట పారాడుకుంటూ వచ్చేశాడా అన్నట్లు ఉండేది. పుస్తకంలోని ఆ చిన్ని కృష్ణుడ్ని ముద్దు పెట్టుకోవడానికి పుస్తకం ముఖానికి దగ్గరగా తీసుకువచ్చినప్పుడు.. సరిగా అప్పుడు వచ్చేది ఓ చక్కటి , కమ్మని వాసన. ఆ రంగుల పుస్తకంలో నుంచి. అనిర్వచనీయమైన ఆనందం. మనసు పరవశించే సువాసన. ఒక్క తెలుగు పుస్తకం నుంచే కాదు, ఏ కొత్త పుస్తకం తీసుకుని ముద్దాడుతున్నా కమ్మని వాసనలే. మొత్తం కొత్త పుస్తకాల బొత్తు ఓ పూల తోటలా ఉండేది. పుస్తకాలకు అట్టలెందుకు? పుస్తకాలు ఇంటికి చేరి చక్కటి వాసన పీలుస్తూ మైమరిచి పోతుంటే. మరో పిడుగు పాటు వంటి వార్త చెవుల సోకేది. `పుస్తకాలకు అట్టలేయాలి ఇటు ఇచ్చేయ్' అనేసి లాక్కునే వారు. పుస్తకాలు కొనేటప్పుడే ముందు జాగ్రత్త చర్య అన్నట్లుగా వాటికి బ్రౌన్ కలర్ షీట్స్ అట్టలేయడం కోసం తెచ్చేవారు. పుస్తకం అందునా కొత్త పుస్తకం కవర్ మీద రాసిన అక్షరాలు, బొమ్మ ఎంత బాగుండేవో. వాటని అందరికీ చూపించి సంబరపడదామనుకుంటే అన్ని పుస్తకాలకూ ఒకే రంగున్న బ్రౌన్ అట్టలేయడం చాలా అన్యాయం అనిపించేది. నాలో ఓ విప్లవ కారుడు శంఖం ఊదేవాడు. అది విప్లవం అనీ గానీ, ఆ విప్లవం చుట్టూ బోలెడు సాహిత్యం అల్లుకుని ఉన్నదనీ, నాకప్పట్లో తెలియదనుకోండి. నేను పేచీ పెట్టేవాడ్ని. కానీ బలహీన వర్గాలవారి మాట చెల్లుతుందా చెప్పండి. తెలుగు నుంచి లెక్కల పుస్తకం దాకా అన్నింటికీ బ్రౌన్ కలర్ అట్టలేసి `సమానత్వం' తీసుకొచ్చామన్నట్లు తెగ ఫీలయ్యేవారు.
వాటిపైన పేరు, క్లాస్ , సెక్షన్ వంటివి రాసుకోవడానికి వీలుగు ఉండే స్టిక్కర్స్ అంటించేవారు. ఈ స్టిక్కర్స్ మీద ఉండే చిన్న సైజు బొమ్మలే కాస్తంత ఊరట కలిగించేవి. కొత్త పుస్తకాలు, నోట్ పుస్తకాలను అతి జాగ్రత్తగా స్కూల్ కి తీసుకు వెళ్ళడానికి ఒక అల్యూమినియమ్ పెట్టె కొనేవారు. దానికి ఒక గొళ్లెం ఉండేది. ఒక్కోసారి ఆ గొళ్లెం పట్టక పుస్తకాల పెట్టె పట్టుకుని రోడ్డు మీద వస్తుంటే పుస్తకాల్లో కొన్నిజారి క్రింద పడిపోయేవి. వాటికి మట్టి అంటుకునేది. ఇంటికెళ్లాక పుస్తకాలు మాసి ఉండటం చూసి పెద్దోళ్ల క్లాస్ లు పీకడాలు, నాబోటి పిల్లలు అలగడాలు ఆ రోజుల్లో కామన్. కొత్త పుస్తకం వచ్చిన వేళావిశేషమా అన్నట్లు మండే ఎండలు తగ్గి , వాన జల్లులు పడేవి. దీంతో తడిసిన మట్టి హాయినిచ్చే వాసనలు వెదజల్లేది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు జీవితంలో ఎంతో విలువైనవి. ఇవే మనతో పాటు చివరిదాకా నిలిచే నిజమైన సంపదలు. కొత్త పుస్తకం ఇచ్చే ఉత్సాహం పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి పెంచుతుంటుందనీ, పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంటుందని మా నాన్నగారు ఎవరితోనో అనడం నాకు గుర్తుంది.
చదువు విలువ తెలిసిన మనిషి. పిల్లల మనస్తత్వ శాస్త్రం వంటి పుస్తకాలు చదివిన తండ్రి కాకపోవచ్చు. కానీ పిల్లల మనసెరిగిన తండ్రి. పుస్తకం పట్ల ఆసక్తి కలిగితే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం తర్వాత అనేక సార్లు అర్థమైందనుకోండి. అందుకే పుస్తకం చుట్టూ నా అనుభవాలు మరిన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. నడక నేర్పిన పుస్తకం: అది 70వ దశకం.. పుస్తకం హస్తభూషణం అనుకునే రోజులవి. హైస్కూల్, కాలేజీ చదువులు వెలగబెడుతున్న రోజుల్లో ఇలాగే అనుకునేవాళ్లం. ఇప్పుడంటే మొబైల్ సెల్ హస్తభూషణం అయిపోయింది. ఆ రోజుల్లో రైలెక్కినా, బస్సెక్కినా, చివరకు పార్క్ లో కూర్చున్నా చేతిలో ఓ పుస్తకం. వీలు చిక్కినప్పుడులల్లా చదవడం. లేదా చదువుతున్నట్లు నటించడం..అలా ఉండేవి సీన్లు. ఇప్పుడేమో సెల్ ఫోన్ లోనే పుస్తకాలు చదవే వీలు వచ్చేసిందాయె. ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచ విశేషాలన్నీ అరచేతిలోకి వచ్చి వాలుతున్నాయి. అప్పట్లో, చేతిలో ఒకటో రెండో పుస్తకాలు పట్టుకని కాలేజీ గ్రౌండ్ లో నడుస్తుంటే ఎవరికివాళ్లు తామేదో మేధావులమన్నట్లు ఫీలయ్యేవారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు పుస్తకాలు పట్టుకునే తీరులోనూ ఓ ప్రత్యేక స్టయిల్ ఉండేది. అమ్మాయిలు పుస్తకాల దొంతరను పూలగుత్తిలా గుండెలకు హద్దుకుని సుకుమారంగా నడిచే తీరు చూడ ముచ్చటేసేది. ఆ రోజుల్లో చాలా చోట్ల కాలేజీ అమ్మాయిలు లంగా ఓణీలే వేసుకునేవారు. దీంతో రంగు రంగుల సీతాకోక చిలకల్లా ఉండేవారు. మరి కుర్రోళ్లో.. వీళ్ల చేతుల్లో పుస్తకాలు, తామెప్పుడు జారి క్రింద పడిపోతామో వీడి నిర్లక్ష్యానికి అని భయపడుతున్నట్లు ఉండేవి, పుస్తకాలకు కనుక మాటలు వస్తే - `ఏమర్రా కుర్రాళ్లూ, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లండర్రా, మమ్మల్ని పట్టుకుని అలా చేతులు నిర్లక్ష్యంగా ఊపడమేమిటీ, మమ్మల్ని గాలిలోకి ఎగరేస్తూ ఒంటి చేత్తో పట్టుకుని విన్యాసాలు చేస్తూ ఆ ఫోజులేమిటర్రా' అని కసురుకునేవేమో. ఏమో.. క్లాస్ పుస్తకాలే కాకుండా జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, నవలలు వంటివి కావాలంటే లైబ్రరీకి వెళుతుండేవాళ్లం. కాలేజీ లైబ్రరీకి వెళ్లేమాట అటుంచితే, ఊర్లోని లైబ్రరీకి స్టూడెంట్స్ వెళ్లడం చాలా తక్కువనే చెప్పాలి. నేను అప్పుడప్పుడు ఊర్లోని లైబ్రరీకి వెళ్ళేవాడ్ని. అక్కడికీ అమ్మాయిలు వచ్చే వారు. ఎక్కువగా నవలల కోసం. లైబ్రరీల్లో వారపత్రికలు, మాసపత్రికలు కూడా అందుబాటిలో ఉంచేవాళ్లు. వీక్లీ వంటి మేగజైన్స్ పట్టుకుని వీధుల్లోకి వెళ్లడమంటే, ఎందుకో తెలియదు కానీ కాస్తంత సిగ్గుపడేవాళ్లం. ఆ రోజుల్లో వీక్లీల్లో వచ్చే సీరియల్స్ రచనలో కొత్త పుంతలు తొక్కడం మొదలైంది. యువతీ యువకులను ఆకర్షించే అనేకానేక ప్రయత్నాలు రచయితలు, రచయిత్రులు చేసేవారు. అలాంటి సీరియల్స్ కి మంచి క్రేజ్. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, ముప్పాళ్ల రంగనాయకమ్మ , మాదిరెడ్డి సులోచన వంటి రచయిత్రిలే కాకుండా యండమూరి వీరేంధ్రనాద్, ఎన్ ఆర్ నంది, మల్లాది వంటి సంచల రచయితలు పాపులర్ అయ్యారు. యండమూరి రచనా శైలి నాకు బాగా నచ్చేది. తులసి దళం సీరియల్ కోసం ఆంధ్రభూమి వార పత్రిక ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే వాళ్లం. అతి సామాన్యమైన విషయాన్ని పాఠకుడు టెన్షన్ పడేలా రాయడం వీరేంద్ర శైలి. ఉదాహరణ చెబుతాను. తులసి దళం లేదా కాష్మోరా సీరియలో సరిగా గుర్తుకు రావడంలేదు కానీ ఒక సన్నివేశంలో ఇంటి కప్పు నుంచి వేలాడుదీసిన కుండలో నీళ్లు పోసి, కుండకు కేవలం బొట్టు బొట్టు పడేలా సన్నటి చిల్లుపెడతారు. ఆ కుండ క్రింద ఉన్న వ్యక్తి తలపైన ఆ నీటి బొట్టు ఒకటొకటిగా పడుతూ ఉంటుంది. నీటి చుక్కలు పడుతున్నప్పుడు వచ్చే శబ్దాన్ని టప్.. టప్.. టప్ .. అంటూ రచయిత రాస్తే, ప్రింటింగ్ లో ఫాంట్ సైజ్ పెంచుతూ చివరి `టప్' వచ్చే సరికి మరీ పెద్ద ఫాంట్ పెట్టడం గమనించి ఆశ్చర్యపోయాను. ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి ప్రయోగాలు రచయితలు, ప్రింటర్స్ కలిసి చేసేవారని చెప్పడానికి. ఆ తర్వాతి కాలంలో ప్రింట్ మీడియాలోకి వెళ్ళాక ఇలాంటి బోలెడు జిమ్మిక్స్ ఎలా చేశారో, ఎందుకు చేసేవారో బాగా తెలిసిందిలేండి. నేను ఆంధ్రప్రభలో పనిచేస్తున్న రోజుల్లో కొన్ని ప్రత్యేక వార్తలు (బాక్స్ ఐటెమ్స్) రాసేటప్పుడు నాకు తెలియకుండానే యండమూరి శైలి వచ్చేసేది. బాక్స్ ఐటెమ్స్ బాగా రాసే వాళ్ళను ఎడిటోరియల్ డెస్క్ లో ముద్దుగా “బాక్సర్స్” అనేవారు. అలా నేనూ బాక్సర్ బిరుదాంకితుడనయ్యాను. ఆ రోజుల్లో కొన్ని సీరియల్స్ చదవొద్దని, అవి చదివితే చెడిపోతారని మా ఇంట్లో ఆంక్షలు పెట్టేవారు. కానీ మనం ఊరుకుంటామా. ఎలాగో అలాగ పత్రిక కాపీ సంపాదించి చాటుమాటుగా చదివి, ఆ విషయం మిత్రులతో గొప్పగా చెప్పేవాడ్ని. వార పత్రికల విషయంలోనే ఇంట్లో ఆంక్షలు ఉంటే ఇక డిటెక్టీవ్ నవలలు చదవనిస్తారా ఏంటీ ? అస్సలు కుదరదనే వారు. ఐతే మా స్నేహితుల్లో కొంత మంది డిటెక్టీవ్ నవలలు చదివి ఓ సినిమా కథ చెప్పినంత థ్రిలింగ్ గా చెప్పేవారు. డిటెక్టీవ్ భరత్ , డిటెక్టీవ్ యుగంధర్ వంటి పాత్రల పేర్లు ఇప్పటికీ గుర్తున్నాయి. డిటెక్టీవ్ పుస్తకాలు సైజ్ లో చాలా చిన్నవి. ఇది మాకెంతో సౌకర్యవంతంగా ఉండేది. పెద్ద పుస్తకాల మధ్యన ఈ డిటెక్టీవ్ నవలలు నేర్పుగా దాక్కునేవి. పుస్తకం మనిషి నడతను తీర్చిదిద్దుతుందని నూటికి నూరుపాళ్లు విశ్వసించే రోజులవి. ఇప్పుడు మళ్ళీ బొంబాయి చర్చ్ గేట్ దగ్గరకు మిమ్మల్ని తీసుకువెళతాను... బొంబాయిలో లైబ్రరీ అనగానే చర్చ్ గేట్ కి దగ్గర్లో ఉన్న అమెరికన్ లైబ్రరీ గురించి చెప్పుకోవాలి. ఇది మా హాస్టల్ కీ దగ్గరే. ఈ లైబ్రరీ చాలా అధునాతన సౌకర్యాలతో ఉండేది. నేను నందిగామలో చదువుకునే రోజుల్లో మా ఇంటికి దగ్గర్లోనే అప్పట్లో ఉండే లైబ్రరీ చూడటం తప్ప మరెక్కడా లైబ్రరీ చూడలేదు. నందిగామ లైబ్రరీ బ్లాక్ అండ్ వైట్ మూవీ అయితే అమెరికన్ లైబ్రరీ కలర్ సినిమాలా అనిపించేది. అయితే నందిగామకి అప్పుడప్పుడు విశాలాంధ్ర వారి మొబైల్ లైబ్రరీ వ్యాన్ వచ్చేది. కదిలే గ్రంథాలయం అన్న పేరు వినగానే బోలెడు ఆశ్చర్యం. ఆ వ్యాన్ మెయిన్ రోడ్డులో గాంధీ బొమ్మ సెంటర్ కి వచ్చి ఆగగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్లేవాడిని. ఆ వ్యాన్ లోకి మెట్లెక్కి వెళితే అందులో అనేక అరల్లో పొందికగా అమర్చిన పుస్తకాల దొంతర్లు కనిపించేవి. చాలా వాటిని కొనాలని అనిపించినా చేతిలో డబ్బులేవి? సోవియట్ యూనియన్ వారి పబ్లికేషన్స్ చవకగా దొరికేవి. వారి క్యాలెండర్ అయితే చాలా బాగుండేది.
అందమైన కొండలు లోయలు పూల చెట్లు … ఇలా ప్రకృతి పరవశిస్తున్నట్లు మంచి కలర్ చిత్రాలతో ఈ కేలండర్ ముద్రించేవారు. అందులోని కొన్ని దృశ్యాలను కత్తిరించి న్యూయిర్ గ్రీటింగ్స్ తయారు చేసి బంధుమిత్రులకు అందజేసేవాడ్ని. గ్రీటింగ్ కార్డ్స్ కొనే ఖర్చు లేదు. పైగా సొంతంగా తయారు చేశామన్న తృప్తి. ఇక విశాలాంధ్రవారి నరావతారం (మానవ జాతి పరిణామక్రమం), విశ్వరూపం (ఖగోళ రహస్యాల మీద), నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం ఇలాంటి పుస్తకాలు నెమ్మదిగా డబ్బులు పోగేసి మరోసారి వ్యాన్ వచ్చినప్పుడు కొనేవాడ్ని. ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు బోలెడు విషయాలు తెలిసేవి. వాటిని మిత్రులతో పంచుకుంటుంటే వారిలో కొందరు ఆశ్చర్యంగా చూసేవారు. సరే, అమెరికన్ లైబ్రరీలో సభ్యత్వం తీసుకుని చదివినా చదవకపోయినా కొన్ని పుస్తకాలు తెచ్చుకునేవాడ్ని. హాస్టల్ రూమ్ కి వచ్చే ఫ్రెండ్స్ చూసి మెచ్చుకునేవారు. అదో రకం గర్వంగా అనిపించేది. కొన్ని పుస్తకాలు చదవడం , నచ్చిన అంశాలు నోట్స్ రాసుకోవడం చేసేవాడ్ని. అలాగే మా కాలేజీ లైబ్రరీ నుంచి సైన్స్ బుక్స్ తెచ్చేవాడ్ని, బయాలజీకి సంబంధించినవి చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ తెలిసినదే అయినా ఎప్పటికప్పుడు ఏవో కొత్త గవక్షాలు తెరుచుకుని సరికొత్త దృశ్యాలు చూస్తున్నట్లు అనిపించేది. మనం చదివే కోణాన్ని బట్టి అర్థం చేసుకునే తీరు కూడా మారుతుందని తెలిసింది. జీవశాస్త్రం పుస్తకాలు అలా చదువుతున్నప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. జీవుల జీవిత చరిత్రలోనే ఎన్నో అద్భుతాలు దాగున్నాయన్నది. కొన్ని జీవజాతులు నా ముందు నిలిచి వింత వింత కథలు చెబుతున్నట్లు అనిపించేది. * మొక్కలు పూలు, కాయలు కాచేది ఎవరి కోసం ? * కొన్ని చెట్లకే ముళ్ళెందుకు? * మొక్కలు - మూగ మనసు బాసలు ? *మరణం లేని జీవులు ఉన్నాయా ? - ఇలాంటి అంశాలపై నోట్స్ రాసుకునేవాడ్ని. ఇవి ఆ రోజుల్లో చాలా తక్కువ మందికి తెలిసిన విషయాలు. పైగా తెలుగులో ఈ అంశాలపై రాలేదు. ఇప్పుడు వచ్చాయేమో నాకు తెలియదు. అందుకనే `జీవశాస్త్రంలో వింత వింతలు' అన్న శీర్షిక క్రింద కొంత నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టాను. బుక్ గా వేద్దామనే ఆలోచన. ఇది కూడా అమాకత్వమే. ఎందుకంటే , బుక్ పబ్లిష్ చేయడం ఎంత కష్టమో అన్న ఆలోచన కూడా చేయనంతటి అమాకత్వం. తర్వాతి కాలంలో ఆర్థక స్తోమత ఉన్నా, లేదా ఎవరైనా బుక్ పబ్లిష్ చేయడానికి (నవభారత్ వారితో అప్పట్లో పరిచయాలు ఉండేవి) ముందుకు వచ్చినా ఆ నోట్స్ అప్పటికే కాలమనే గాలికి ఎగిరిపోయింది. ఉద్యోగ వేట, ఆ తర్వాత కొత్త కొత్త దారుల్లో ప్రయాణాలు, అటు పైన చుదువుతో సంబంధం లేని ఉద్యోగం ఇలా ఇలా జీవితంలో అనేక ట్వీస్ట్ లు ఎదురవడంతో “జీవ శాస్త్రంలో వింత వింతలు” శీర్షిక నా ఆలోచన పుటల్లో ఎక్కడో అట్టడుగికి వెళ్ళిపోయింది. జీవితం చాలా చిత్రమైనది. ఏమో మంచి అవకాశం, సమయం వస్తే ఈ శీర్షిక క్రింద వ్యాసాలు రాయగలనేమో, పుస్తకంగా ప్రచురించనూ గలనేమో.. ఐతే అనుకోకుండా ఒక పని మాత్రం చేయగలిగాను. అదేమిటంటే, టివీ5 లో పనిచేస్తున్నప్పుడు “మరణం లేని జీవులు “ అన్న అంశంపై మాత్రం అరగంట ప్రత్యేక కార్యక్రమం ఇవ్వగలగడం. ఆలోచనలేమో పెద్దపెద్దవి. అడుగులేమో చిన్నచిన్నవి. మరి ఈ కుర్రాడు తర్వాత ఏమయ్యాడు ? ఏం సాధించాడు? మీతో ఇంకేం చెప్పబోతున్నాడు ? (మళ్లీ కలుద్దాం)

20, ఏప్రిల్ 2024, శనివారం

3వ భాగం: ఆనందం ఆవిరి


ఏడెనిమిదేళ్ల
పిల్లాడు మంగళగిరిలోని ఓ పెంకుటింటి ముందు అమ్మ కొంగు పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఎందుకో, ఆ లేత కళ్లు ఎర్రబడ్డాయి. చిట్టి గుండెలు బరువెక్కాయి. ఏదో తెలియని దిగులు ఒళ్లంతా ఆవహించింది. మంగళగిరి- ఇది 1960 దశకంలో ఇప్పుడున్నట్లు ఉండేది కాదు. పెంకుటిళ్లు, పూరి గుడిసెలు ఎక్కువగా కనిపించేవి. మంగళగిరి అనగానే కొండపైన పానకాల స్వామి , కొండ దిగువున నరసింహస్వామి గుర్తుకొస్తారు. ఈ రెండు స్వాముల ఆలయాలతో నాకు చిన్నప్పుడు చాలానే అనుబంధం ఉండేది. అందుకే నా జీవన యాత్ర గురించి చెప్పేటప్పుడు అప్పుడప్పుడు మంగళగిరి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మా నాన్నగారు (టివీఎంవీ ప్రసాదరావు) 60వ దశకం ఆరంభంలో ఈ రెండు దేవాలయాల ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా ఉండేవారు. ఆఫీసర్ హోదా కాబట్టి పెద్ద రథం వెనుక ఉన్న పెద్ద ఖాళీస్థలంలో బారుగా ఉండే పెంకుటిళ్లలో ఒకటి ఈయనకు అప్పగించారు. దీంతో మా కుటుంబం కొన్నె్ళ్శు అక్కడే ఆ ఇంట్లోనే ఉండేది. మంగళగిరిలోనే నేను ప్రాధమిక విద్య అభ్యసించాను. అడ్డతొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నది కూడా అక్కడే. సరే అలాంటి జ్ఞాపకాలు మరోసారి చెబుతాను. ప్రస్తుతానికి గుండె బరువెక్కి ఏడుస్తున్న పిల్లాడి దగ్గరకే వెళదాం, పదండి. అమ్మ తన చీర కొంగుతో పిల్లాడి కంట నీరు తుడుస్తున్నది. ఓదారుస్తున్నది. సరిగా అదే సమయంలో గూడు రిక్షా (మంగళగిరిలో గూడు రిక్షాలు ఫేమస్) వచ్చేసింది. ఇంట్లోనుంచి సామాన్లు గూడు రిక్షాలోకి ఎక్కిస్తున్నారు. "మళ్ళీ వస్తానే అక్కా" "వీలుగా ఉండే పెద్ద పండుగకి రావే" "అలాగే అక్కా, ఎక్కండర్రా రిక్షా" రిక్షా నెమ్మదిగా కదులుతోంది. లేత కళ్లు వర్షిస్తున్నాయి. ఏదో శూన్యం ఆవహించినట్లు అనిపించింది. వెళుతున్న రిక్షా విరిగిపోయి ప్రయాణం ఆగిపోతే ఎంత బాగుండ్ను. పిన్ని, పిల్లలు వెనక్కి వచ్చేస్తారుగా... మనసులో ఇలాంటి ఆలోచనలు. కానీ ఇవేవీ జరగలేదు. రిక్షా కనుమరుగైంది. ఓ వారం తర్వాత క్షేమ సమాచారం తెల్పుతూ లెటర్ వచ్చేది. మా పిన్ని (కమల పిన్ని) అంటే బాగా ఇష్టం. ముగ్గురు పిన్నుల్లో కమల పిన్నే తరచు మా ఇంటికి వస్తుండేది. అమ్మా, పిన్ని తెల్లవారుఝామునే లేచి బోలెడు కబుర్లు చెప్పుకునేవారు. అదేమిటో, వీళ్లిద్దరి మధ్య ఇన్నేసి కబుర్లు ఎలా పుట్టుకువస్తాయా అని నాకు బోలెడు ఆశ్చర్యమేసేది. ఇద్దరూ సంగీతం నేర్చుకున్నారు. దీంతో అప్పుడప్పుడు ఇంట్లోనే సంగీత కచేరీ పెట్టేసేవారు. సాధారణంగా అప్పచెల్లెళ్లు కలుసుకుంటే గంటల కొద్దీ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే అన్నాచెల్లెళ్లో, అక్కా తమ్ముళ్లో కలిస్తే అంతలా కబుర్లు దొర్లవు. ఈ రెంటి మధ్య తేడా ఎందుకుంటుందో అప్పట్లో తెలియదు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ తెలియదు. వేసవి సెలవుల్లో పిన్ని, పిల్లలు వచ్చి ఓ నెలరోజులుండి వెళుతుంటే ఆ లేత మనసు కలత చెందదా మరి. ఏడేళ్ల అబ్బాయి తర్వాతి కాలంలో డిగ్రీ పూర్తి చేసుకుని ఎమ్మెస్సీ కోసం బొంబాయి చేరి చదువుకుంటున్నప్పుడు దాదాపుగా ఇలాంటి సంఘటనలనే ఎదుర్కున్నాడు. కాకపోతే వాతావరణం వేరు, పరిస్థితులు వేరు. 
  వీడ్కోలు విలాపం: బొంబాయి (ప్రస్తుత ముంబయి)లో 1978 నుంచి రెండేళ్ల చదువు కోసం ఉన్నప్పుడు ఈ “వీడ్కోలు విలాప” సన్నివేశాలు తరచూ కలవర పరిచేవి. ఆ రోజుల్లో బొంబాయిలోని సెంట్రల్ స్టేషన్ ని విక్టోరియా టెర్మినస్ (వి.టి. ) అనేవారు (చూ. 6) ప్రయాణం ఉన్నప్పుడే కాకుండా అడపాదడపా ఈ స్టేషన్ కి వెళ్ళి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం ఓ హాబీగా మారింది. ఈ స్టేషన్ నుంచి ప్రతి రోజూ రాత్రి పది గంటలకు మీనార్ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ కి బయలుదేరుతుండేది. ఈ ఎక్స్ ప్రెస్ రైలు (చూ. 7) ఏ నెంబర్ ప్లాట్ ఫాం మీద ఉంటుందో ఆ ప్లాట్ ఫామ్ కి వెళ్ళి బెంచీల మీద కూర్చునేవాళ్లం. మా కబుర్లకు అదనం ప్రయాణీకుల మాటలు. అవి కూడా అచ్చ తెలుగు మాటలు. ఎందుకంటే ఈ ట్రైన్ ఎక్కేవాళ్లలో చాలా మంది తెలుగు వారే. పైగా వారికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చే వారు కూడా తెలుగువారై ఉంటారు కనుక ఆ రైలు వెళ్ళేదాకా అక్కడంతా తెలుగు వాతావరణం పరచుకునేది. ఆ కాసేపు నాకైతే మా ఊర్లో ఉన్నట్లే అనిపించేది. ఆ రైలు బయలు దేరడానికి ముందు ఫ్లాట్ ఫారమ్ మీద ప్రయాణీకుల్లో కనిపించే భావోద్వేగాలు, వారి వీడ్కోలు విలాపాలు, విన్యాసాలు చూస్తుంటే నా మనసు సన్నగా మూలిగేది. కొన్ని ప్రేమ జంటలతై మరీను. ఏదో శాశ్వత ఎడబాటు కలగబోతుందన్నట్టుగా భోరున ఏడ్చేసేవారు. ఓదార్పు మాటలు, ఉత్సాహం కలిగించే కబుర్లు, కళ్లతోనే పలకరింపులు వెరసి మొత్తం సమాజపు సప్తవర్ణ చిత్రం అక్కడ సాక్షాత్కరించేది. కొంత మంది చేసే చేష్టలు చిత్రంగా ఉండేవి. ఓ సారి.. వీడ్కోలు చెప్పేవాడు కదులుతున్న రైలు ఎక్కేశాడు. రైలు వేగం పుంజుకుంటున్నది. ఆ గాభరాలో రైలు నుంచి దూకేసరికి నిలదొక్కుకోలేక పడిపోయాడు. “పాపం “ అనుకుంటూ జాలి పడేవాడ్ని. ఇవన్నీ చూస్తున్నప్పుడే ఏదేదో రాసేయాలనిపించేది. ఆ భావనతో నాలోని రచయిత లీలగా కదిలినట్లు అనిపించేది. కానీ ఆ రచయిత బయటకు వచ్చి భవిష్యత్తులో నా చేత రేడియో నాటికలు రాయిస్తాడనీ, వ్యాసాలు పుస్తకాలు రాయిస్తాడని నేను అప్పట్లో అనుకోలేదు. మీనార్ ఎక్స్ ప్రెస్ కదలుతుంటే నాకు కళ్ళెంబడి నీళ్లు వచ్చేవి. ప్రేమ అనేది మనుషులతోనే కాదు, వస్తువులు, వాహనాలతో కూడా ముడిపడి ఉంటుందని అనిపించేది. రైలు వెళ్లగానే ప్లాట్ ఫామ్ ఖాళీ అయ్యేది. నా మనసూ శూన్యంగా మారేది. దూరంగా వెళుతున్న రైలుకి టాటా చెప్తూ హాస్టల్ కి చేరినా ఆ సంఘటనలు వెంటాడుతుండేవి.
విటి స్టేషన్ చాలా పెద్దది. కట్టడం పురాతనమైనది. కాసేపు రైల్వే స్టేషన్ కట్టడాల శైలి చూసి మురిసిపోయేవాడిని. ఇంత పెద్ద టవర్లు, గోపురాలు చూస్తుంటే ఆశ్చర్యమేసేది. నిశిత దృష్టితో చూడటం, వాటి గురించి ఆలోచించడం మొదలైంది. కానీ ఈ మానసిక మార్పుని గుర్తించలేదు. ఏదైనా కొత్త ప్రాంతం చూసినా, వాటి గురించి రవ్వంత తెలుసుకున్నా అదనపు సమాచారం తెలుసుకోవాలన్న తపన మొదలయ్యేది. ఈ తపన చల్లార్చుకోవడానికి లైబ్రరీకి వెళ్ళి అధ్యయనం చేయడం, నోట్స్ రాసుకోవడం వంటివి చేసే వాడ్ని. ఇప్పుడున్నట్లుగా విషయ సేకరణ క్షణాల్లో అందుబాటులోకి వచ్చేది కాదు. గూగుల్ వంటి సౌకర్యాలు లేని కాలంలో పాత పేపర్లు, పుస్తకాలు గంటల కొద్దీ తిరగేస్తేనే కానీ అదనపు సమాచారం రాబట్టలేని పరిస్థితి . సరే, సేకరించిన సమాచారాన్ని పేపర్ మీద పెట్టేవాడ్ని అయినప్పటికీ ఏ పత్రికకూ పంపేవాడ్ని కాదు. అసలు ఎలా పంపాలో కూడా తెలియదు. పత్రికలో పాఠకుల రాసే లేఖల కోసం ఒక వేదిక దాదాపు అన్ని పత్రికల్లో ఉండేది. ఈ లేఖల కాలమ్ లో కనీసం ఒక లేఖ అయినా పబ్లిష్ అవ్వాలని ఓ బలమైన కోరిక డిగ్రీ చదువుతున్నప్పుడే కలిగింది. కానీ గట్టి ప్రయత్నం చేసినట్లు లేదు. చిత్రమేమంటే ఇంతవరకు ఈ కోరిక తీరనే లేదు. కాకపోతే లేఖ ప్రింట్ కాకపోయినా ఏకంగా పత్రికల్లో వందల కొద్ది వ్యాసాలు రాసే అవకాశం మాత్రం వచ్చింది. వాటిలో కొన్ని ఎడిట్ పేజీలో కూడా వచ్చేవి. అందుకే ఓ సినీ కవి ఇలా అంటారు… “కోరిక ఒకటి జనించు తీరక ఎడద దహించు, కోరనిదేదో వచ్చు, శాంతి సుఖాలను తెచ్చు ఏది వరమ్మో ఏది శాపమో తెలిసీ తెలియక అలమటించుటే, ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము” - నిజమే కదా జీవితంలో రాబోయే చిత్రమైన మలుపులకు ప్రారంభాలు కూడా విచిత్రంగానే ఉంటాయి. ఇది నా జీవితంలో చాలా స్పష్టంగా కనిపించింది. ముందు ముందు నాలోని రచయిత ఎదగడానికి ఈ లక్షణాలు దోహదపడ్డాయి . ఈ విషయం అప్పట్లో అర్థం కాలేదు. పుస్తక పఠనం వల్ల మనిషి లోని ఆలోచనలు ఎలా ఎదుగుతాయో, అవి ఎలా పరిపక్వత చెందుతాయో మరో సారి చెబుతాను. -
--- ఫుట్ నోట్ 6 ------ 
 (చూ.6) విక్టోరియా టెర్మినస్ (వి.టి) : ఇది బొంబాయి సెంట్రల్ స్టేషన్. దీన్నే ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ అని పిలుస్తున్నారు. బ్రిటీష్ వారి హయాంలో కట్టిన రైల్వే స్టేషన్. దీన్ని 1878లో మొదలుపెట్టారట. అంటే నేను బొంబాయి గడ్డమీద అడుగుపెట్టడానికి సరిగా వందేళ్ల ముందు అన్నమాట. దీన్ని పూర్తి చేయడానికి పదేళ్లు పట్టిందని చెప్పేవారు. ఎత్తైన టవర్ చూస్తుంటే బ్రిటీష్ వారి పెత్తందారీతనానికి నిలువెత్తు నిదర్శనంగా అనిపించేది. టవర్ క్లాక్ -శ్రమ ఎరుగని కార్మికుడు పనిచేస్తున్నట్లుండేది. ఈ స్టేషన్ ని మొదటి సారి నేను చూసింది మా నాన్నగారితో కలిసి. నన్ను యూనివర్శిటీలో చేర్చడానికి ఆయన కూడా నా వెంట వచ్చారు. ఆ సమయంలోనే నాన్నగారు మాటల మధ్యన , మగవాళ్ళు బంగారం ధరించడం గురించి మాట్లాడుతూ ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బులు కావలసి వచ్చినప్పుడు చేతికున్న ఉంగరమో కాకుంటే మెడలోని గొలుసో అమ్ముకుని గండం నుంచి బయటపడవచ్చని చెప్పారు. బంగారం పట్ల నాకైతే పెద్ద ఆసక్తి లేదుకానీ , నాన్నగారు చెప్పిన మాటలు మాత్రం ప్రభావం చూపాయి. కనీసం ఒక్క ఉంగరమైనా పెట్టుకోవాలనుకునేవాడ్ని. సరే, వి.టి స్టేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా.. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ల గురించి చెప్పాలంటే , అంతకు ముందు మద్రాస్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్ద రేల్వే స్టేషన్ చూడగలిగాను. బీఎస్సీ చదవుతున్నప్పుడు సైన్స్ టూర్ గా మద్రాసు (ప్రస్తుతం చెన్నై) వెళ్ళాము. అప్పటి దాకా నాకు తెలిసిన రైల్వేస్టేషన్లకీ దీనికీ పోలికే లేదు. రైళ్ళు వచ్చి ఆగడమే కానీ ముందుకు వెళ్ళవు. ఎందుకంటే రైల్వే ట్రాక్ లన్నీ అక్కడితో ఎండ్ అవుతాయి. అందుకే టెర్మినస్ అంటారని తెలిసింది అప్పుడే. బొంబాయిలో నేనప్పుడు చూసింది కూడా టెర్మినస్. అసలు మా ఊరోళ్ళకు రైలు కూతలు వినబడవు. నందిగామకు దగ్గర్లో ఉన్న రైల్వేస్టేషన్ మధిర. అయితే మధ్యన మున్నేరు ఉండటంతో ఇటువైపు వాళ్ళు మధిరకు వెళ్ళి రైలెక్కడం సాహస యాత్ర లాంటిదే అవుతుంది. ఇప్పుడు పరిస్థితి మారింది. మున్నేరు మీద వంతెన వచ్చేసింది. దీంతో ఆటోల్లో కూడా మధిర రైల్వే స్టేషన్ కి ప్రయాణీకులు చేరగలుగుతున్నారు. నందిగామ లాంటి రేల్వే స్టేషన్ లేని ఉర్లలో ఉన్న వారు రైల్వే స్టేషన్ కి వెళ్లడమే గగనం. ఊర్లో బస్టాండ్ ఉండటమే గొప్ప. నేను కాలేజీలో చదువుతున్నప్పుడే ఉర్లో బస్టాండ్ కట్టారు. అంతకు ముందు వరకు బస్సులు సెంటర్ లో రోడ్డు పక్కనే ఆగేవి. దాన్నే ఇప్పుడు పాత బస్టాండ్ అంటున్నారు. కొత్త బస్టాండ్ కట్టాక వెళ్ళి చూస్తే బస్సులు వచ్చే స్థలం ఆగే ప్లాట్ ఫామ్స్ చూసి మా మిత్రుడొకడు “ఒరే ఇది విమానాశ్రయమేరా. రేపో మాపో మనూర్ళో విమానాలు ఆగుతాయేమో” అన్నాడు. నా బోటి అమాయకుడు వాడి విజ్ఞానానికి తల ఊచేవాళ్ళం. అలాంటిది విక్టోరియా టెర్మినస్ చూడగానే అమితాశ్చర్యం చెందకుండా ఉండగలనా? చర్చ్ గేట్ రైల్వేస్టేషన్ నుంచే లోకల్ రైళ్ళు బయలుదేరి పరుగులుపెడుతుంటాయి. సమయపాలన విషయంలో బొంబాయి జనాన్ని చూసి ఇవి నేర్చుకున్నాయా ? లేక ఈ లోకల్స్ ని చూసి బొంబాయి వాసులు నేర్చుకున్నారా ?
లోకల్ ట్రైన్స్ లో “డబ్బావాలాల” సందడి వర్ణనాతీతం. అసలు ఆ నెట్ వర్క్ చూసి ఎవరైనా విస్తుపోవలసిందే. ఎక్కడో దూరప్రాంతంలో ఉద్యోగం చేసేవారికి లంచ్ బాక్సులను టైమ్ కి చేర్చే వారు. డబ్బావాలాల చిత్తశుద్ధి, సమయపాలన చూసినప్పుడు అంతర్లీనంగా దాగున్న విజయ సూత్రం బోధపడింది. -
 ఫుట్ నోట్ 7 ---- (చూ.7) మీనార్ / కోణార్క్ కథ ఇది. 1978లో నేను మొదటి సారి బొంబాయి వెళ్ళినప్పుడు మీనార్ ఎక్స్ ప్రెస్ చూశాను. అంతకు ముందు నాకు బాగా గుర్తున్న రైలు సర్కార్ ఎక్స్ ప్రెస్. ఈ మీనార్ ఎక్స్ ప్రెస్ రైలు అప్పట్లో బ్లూ కలర్ లో ముద్దొచ్చేలా ఉండేది. సికింద్రాబాద్ నుంచి బొంబాయి వి.టికి వెళ్ళే రైలు అది.
నాకో విషయం చిత్రంగా అనిపించేది. ఒకటే రైలు రెండు నెంబర్లు అలాగే రెండు పేర్లు. మీనార్ ఎక్స్ ప్రెస్ బొంబాయి నుంచి సికింద్రాబాద్ వరకు ఆ తర్వాత రైలు అదే, కానీ నేమ్ బోర్డ్లులు కోణార్క్ గా మార్చే వారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం మీదగా భువనేశ్వర్ వెళ్ళే రైలుగా మారిపోతుంది. నేను బొంబాయి నుంచి విజయవాడ వరకు ఈ రైల్లో వచ్చేవాడిని కనుక నాకు ఈ విషయం బాగానే గుర్తుంది. ఈ మధ్యనే (2024 మార్చి 2) కోణార్క్ ఎక్కినప్పుడు ఈ పాత సంగతులు గుర్తుకువచ్చాయి. ప్రతి రైలుకు చరిత్ర ఉంటుంది. అలాగే ప్రయాణీకులకు ఆ రైలుతో అనుబంధం, ప్రేమ పెరుగుతుంటుంది. 2028లో కోణార్క్ సర్వీస్ స్వర్ణోత్సవం జరుపుకుంటుందన్నమాట. (మళ్ళీ కలుద్దాం)

15, ఏప్రిల్ 2024, సోమవారం

2వ భాగం: కలలుకనే కళ్ళున్నాయి

కాలేజీలో లెక్చరర్ మాట్లాడే తీరు బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ తో రాసే ఆ స్టయిల్ చూసి అనుకునేవాడ్ని , ఎప్పటికైనా లెక్చరర్ అవ్వాలని. పరీక్షలొస్తున్నాయంటే చాలు మా ఇల్లు ఓ చిన్న ట్యూటోరియల్ కాలేజీగా మారిపోయేది. వరండాలోని ఓ గోడకు నల్లపెయింట్ వేయించాము. నా క్లాస్ మేట్స్ ఇద్దరో ముగ్గురితోనో కలిసి ప్రతి రోజూ సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే చదువుకునేవాళ్ళం . వారితో కలిసి చదువుకోవడం భలే సరదాగా ఉండేది. బ్లాక్ బోర్డ్, చాక్ పీసుల డబ్బా అమిరాయి. వినడానికి నా క్లాస్ మేట్సే ఉన్నారు. ఇకనేం, నాలోని లెక్చరర్ మేల్కొన్నాడు. నేను పాఠం చెప్పడం వాళ్ళు శ్రద్ధగా వినడం. నేను బోర్డ్ మీద రాయడం... వారు రాసుకోవడం , ఇదంతా బయట వాళ్లు చూస్తుంటే ఓ ట్యూటోరియల్ గా (చూ.4) అనిపించేది. ఉర్లో చదువుకుంటున్న కుర్రాళ్లకు ఇదేదో కొత్తగా అనిపించి ఇంటికి వచ్చి చూసి వెళ్ళేవారు. కలిసి చదువుకుంటే చక్కటి ఫలితమే అందుతుందని మా బీఎస్సీ మార్కులే తేల్చాయి. పీజీ చేసి ఇక లెక్చరర్ అవడమే ఆలస్యమనుకున్నాను. అమాయకత్వం.. బెనారస్ యూనివర్శిటీ, బొంబే యూనివర్శిటీ , ఆంధ్రా యూనివర్శిటీ ...ఇలా కొన్ని యూనివర్శిటీలకు అప్లై చేశాను. ఆంధ్రా యూనివర్శిటీ వాళ్లు బయో సైన్స్ ఇస్తామన్నారు. బొంబాయి యూనివర్శిటీ (ఇప్పుడు ముంబాయి యూనివర్శిటీ) వాళ్లేమో బోటనీలో మైకాలజీ- ప్లాంట్ పాథాలజీ సీటు ఇస్తామన్నారు. ఏది మంచిదో చెప్పమని మా లెక్చరర్స్ ని అడిగితే “అబ్బో, మైకాలజీ- ప్లాంట్ పాథాలజీ గొప్ప” అన్నారు. అన్నయ్యకీ, నాన్నకి చెబితే ఒకే అన్నారు.అంతే, నాన్నగారితో కలిసి బొంబాయి ప్రయాణం. ఆగని కన్నీళ్లు : బొంబాయి యూనిర్శిటీ వాళ్ల పరిథిలోనే ఉన్న గవర్నమెంట్ హాస్టల్ లో రూమ్ దొరికింది. ఇది చర్చ్ గేట్ కి సమీపంలోని సి- రోడ్డులో ఉంది. ప్రక్కనే బి-రోడ్డులో వాంఖేడ్ స్టేడియం (5) ఉంది. చదివిందేమో యూనిర్శిటీ పరిథిలోని ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ (కాలేజీ)లో.
ఈ కాలేజీకి ఘనమైన చరిత్రే ఉంది. అంతే స్థాయిలో మద్రాసీలంటే చిన్న చూపూ ఉంది. తెలుగు వారిని కూడా మద్రాసీల గాడిన కట్టేసి మాట్లాడే వారు. హాస్టల్ లో చేర్చి నాన్నగారు వెనక్కి వెళ్లిపోయారు. ఆ రాత్రి పడుకున్నప్పుడు తెలిసింది ఇంటి విలువ ఎంతో. పైన ప్యాన్ తిరుగుతోంది. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తెలుగు తప్ప వేరే భాష రాదు. ఇంగ్లీష్ లో మనకొచ్చినవి అత్తెసరు మార్కులే. పైగా నందిగామ వంటి చోట్ల ఇంగ్లీష్ మాట్లాడే మొనగాళ్లు ఒకళ్ళిద్దరే. ఎమ్మెస్సీ పూర్తి చేసి లెక్చరర్ అవ్వాలన్న కల నెరవేరుతుందా? ఆత్రేయ పాటలోని వాక్యాలు గుర్తుకు వచ్చాయి. కలలు కనే కళ్లున్నాయి, అవి కలతపడితే నీళ్లున్నాయి. ఆగని కన్నీళ్లను కర్చీప్ తో తుడుచుకునే ప్రయత్నంలో ఉండగానే తలుపు చప్పుడైంది. తలుపు తీస్తే ఇద్దరు - చొరవగా లోపలకు వచ్చేసి నా బెడ్ మీద కూర్చుని తెలుగువాళ్లమనీ, సీనియర్స్ మనీ చెప్పారు. అంటే ర్యాగింగ్ మొదలైందనే అనుకున్నాను. కానీ ఈ అన్నలు అలా కాదు. కొద్దిగా ఏడిపించినా అంతలో బాగా నవ్వించేవారు. నన్ను బొంబాయికి తగ్గట్టుగా నవ యువకునిగా మార్చేశారు. ఆ రోజులకు తగ్గట్టుగా బెల్ బాటమ్ ప్యాంట్. హిప్పీ క్రాఫ్ వచ్చేశాయి. నాకు అన్నివిధాలా క్లాస్ మేట్ కరీముద్దీన్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. మా స్నేహం నాలుగు పదులు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
డబ్బు విలువ తెలిసింది: నెలకు ఇంటి నుంచి 300 రూపాయలు వచ్చేవి. అప్పట్లో మనీ ఆర్డర్ రావడానికి వారం పది రోజులు పట్టేది “టెలిగ్రామ్ మనీ ఆర్డర్” అని మరో సౌకర్యం ఉండేది. కానీ పంపడానికి ఖర్చు ఎక్కువ. మనీ ఆర్డర్ వంటివి ఒకప్పుడు ఉండేవని చెబితే మా మనవళ్ళు నమ్మక పోవచ్చు. ఆ కాలంలో పోస్టాఫీసు అందించిన సేవల్లో కొన్ని నేడు కనుమరుగయ్యాయి. టెలిగ్రాం మనీయార్డర్ కంటే వేగంగా డబ్బులు ట్రాన్ఫర్ అయ్యే అవకాశం ఇప్పుడుంది. ఇక్కడే ఓ చిన్న విషయం గుర్తుచేసుకుంటున్నాను. మా నాన్నగారితో కలిసి బొంబాయి రాగానే రైల్వే స్టేషన్ కి దగ్గర్లోని ఓ లాడ్జిలో దిగాము. వెంట తెచ్చుకున్న డబ్బులు ఫీజులకు సరిపోయాయి. లాడ్జికి కట్టడానికి డబ్బులు లేవు. నేను కంగారు పడుతుంటే నాన్నగారు “మరేం ఫర్వాలేదులేరా, టెలిగ్రామ్ మనీ ఆర్డర్ పంపమని ఇంటికి టెలిగ్రామ్ ఇద్దాం” అన్నారు. సరే, ఇంటి నుంచి టెలిగ్రామ్ మనీ అర్డర్ కోసం టెన్షన్ తో ఎదురు చూపులు. రెండో రోజు పోస్టాఫీస్ కి వెళ్ళి అడిగితే వచ్చిందని పోస్ట్ మాన్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాం. లాడ్జి బిల్లు, ఇతర బిల్లులు చెల్లించేశాక, ఆ రాత్రికే నాన్నగారు రైలెక్కేశారు. నెలనెలా వచ్చిన డబ్బులతో హాస్టల్ ఫీజు, కాలేజీ ఫీజు అన్నీ పోగా డబ్బులు మిగుల్చుకుని టెక్స్ట్ పుస్తకాలు కొనుక్కునే వాడ్ని. అంతే కాదు, చర్చ్ గేట్ దగ్గరున్న ఎస్బీ ఐకి వెళ్ళి ఎకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెలా కొంత డబ్బు జమ చసేవాడ్ని. అలా పోగేసిన డబ్బుతో సెలవుల్లో ఇంటికి వెళ్ళేటప్పుడు మా అన్నగారి పిల్లలకు చిన్న చిన్న బొమ్మలు, గౌన్లు వంటివి తీసుకువెళ్ళేవాడిని. సేవింగ్స్ విలువ అప్పుడు తెలిసింది. 1980 నాటికి ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇక లెక్చర్ అవుతా, ఉత్తమ అధ్యాపకునిగా అవార్డ్ కొట్టేస్తా అనుకుంటూ పట్టా పుచ్చుకుని ఆనందంతో నందిగామ చేరాను. లెక్చరర్ గా కొంత కాలం పనిచేసినా దేవుడు నాకు వేరే దారి చూపాడు. విధి బలీయం. ఎవ్వరూ తప్పించలేరు. ఏదారెటు పోతుందో ఎవరికి ఎరుక. అనుకోని అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఆత్మబలంతో జీవన యానం సాగిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన కుర్రాడు ఇక నడిపిస్తాడు ముందుముందు ఈ కథని. 

 ----- ఫుట్ నోట్స్ ------ : 

(4) లెక్చరర్ కావాలన్న తపన ఎంతగా ఉండేదంటే ఎమ్మెస్సీ అయ్యాక కొంత కాలం ఖాళీగా ఉన్నప్పుడు మా బంధువు బండారు భృంగేశ్వర రావుని కలిసి మాట్లాడి చిన్న సైజ్ ట్యూటిరయల్ కాలేజీ పెట్టడం దాకా వెళ్ళింది. అయితే కాసుల కొరతతో కాలేజీ అటకెక్కింది. 

 (5) బొంబాయి వాంఖేడ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూడాలని తెగ ఆరాటపడేవాడ్ని. క్రికెట్ అంటే ఇష్టమే. కానీ కాలేజీలో కానీ, స్కూల్ లో గానీ నన్ను ఆడనిచ్చేవారు కాదు. బక్కగా, గాలికే పడిపోయేలా ఉన్నావంటూ హాస్యం ఆడేవారు.
హైస్కూల్ లో ఎన్.సి.సి లో ఉన్నప్పుడు ఆ లాగూ, షర్ట్ జారిపోతుండేవి. చిన్నప్పుడు వీధి క్రికెట్ ఆడేవాడ్ని. అక్కడా నన్ను చాలా దూరంలో బౌండ్రీ లైన్ దగ్గరే నిలబెట్టేవారు. బాలు తగలకుండా ఉంటుందిలే అని నేనూ అదే ప్రిఫర్ చేసేవాణ్ణి. సరే, బొంబాయి చేరాము కదా, అందునా స్టేడియం పక్కనే హాస్టల్ కదా, స్టూడెంట్ కన్సెషన్ ఉండేదాయె.
భారత - పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ (1979) జరుగుతుంటే ఐదు రోజుల ఆటలో ఒక రోజు ఆట చూసే అవకాశం అలా దక్కింది. ఒక టికెట్ కొంటే రోజుల వారీగా ఐదుగురం పంచుకునే వాళ్లం. ఐదు రోజుల పాటు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది వారి వారి అదృష్టం మీద ఆధారపడి ఉంటుందనుకోండి. నేను చూసిన ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ గా ఇమ్రాన్ ని చూశాను. ఇండియా కెప్టెన్ కపిల్ అనుకుంటా. మళ్ళీ ఓ టెస్ట్ మ్యాచ్ ఆట చూడటానికి 40 ఏళ్ళకు పైగానే పట్టింది. నేను యు.కె వెళ్ళినప్పుడు ఇండియా జట్టు ఇంగ్లండ్ జట్టుతో ఆడిన టెస్ట్ మ్యాచ్ (2022- ట్రెంట్ బ్రిడ్జ్ మ్యాచ్) మొదటి రోజు ఆట మా అబ్బాయితో కలిసి చూశాను. అప్పుడు ఈ వాంఖేడ్ ముచ్చట గుర్తుకొచ్చింది.

11, ఏప్రిల్ 2024, గురువారం

1వ భాగం : ఎలుక పుట్టింది

  "ఎలుక పుట్టింది" అంటూ ఒక మనిషి జీవన సాఫల్య యాత్ర విశేషాలు మొదలు పెట్టవలసి రావడం ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ సృష్టిలోని ఆశ్చర్య ఘటనలన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. ఏ ప్రాణి పుట్టుక ఎందుకో, ఆ ప్రాణికి ఎంత కాలం నూకలు ఈ భూమిపై ఉంటాయో, సదరు ప్రాణి చేత ఆ దేవుడు ఏ పనులు చేయించాలనుకుంటున్నాడో , ఏ స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటున్నాడో ఎవరికి తెలుసు. 

 ఈ ఎలుక పుట్టుక కూడా అంతేనేమో.. 

  అడవి రావుల పాడు. ఇదో పల్లెటూరు. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా (పూర్వ నామం :కృష్ణాజిల్లా) నందిగామ మండలంలోని కుగ్రామం. స్వాతంత్ర్యం వచ్చి ఏడుపదులు దాటినా ఇప్పటికీ కుగ్రామమే. కాకపోతే కరెంట్, వాటర్ వంటి కనీస వసతులు వచ్చాయి అంతే. ఇప్పుడే ఇలా ఉంటే స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్లకు అంటే 1957లో ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. ఆ రోజుల్లో చీకటి పడిందంటే భయం రాజ్యమేలుతుండేది. చిమ్మచీకట్లో ఓ పాతిక కొంపలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుండేవి. ఆముదం దీపాల వెలుగు.. అంతటా నిశ్శబ్దం. జనవరి 26, చలికాలం అవడంతో ఐదున్నరకే చీకట్లు అలుముకున్నాయి. పశువులు కూడా ఇళ్ళకు చేరి సేద తీరే వేళ అది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పెంకుటింట్లోని వెనుక గదిలో నుంచి పసికందు ఏడుపు. మంత్రసాని - `ఎఱ్ఱది` ఆ గది నుండి పరుగులాంటి నడకతో వచ్చి అన్న మాట - ఎలుక పుట్టింది.  

ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పెంకుటింట్లోని వెనుక గదిలో నుంచి పసికందు ఏడుపు.  మంత్రసాని - `ఎఱ్ఱది` ఆ  గది నుండి పరుగులాంటి నడకతో వచ్చి అన్న మాట - ఎలుక పుట్టింది.ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పెంకుటింట్లోని వెనుక గదిలో నుంచి పసికందు ఏడుపు. మంత్రసాని - `ఎఱ్ఱది` ఆ గది నుండి పరుగులాంటి నడకతో వచ్చి అన్న మాట - ఎలుక పుట్టింది. బామ్మ చెప్పిన మాటలు : ఓరేయ్ , నువ్వు పుట్టినప్పుడు ఎలుక పిల్లలా ఉండేవాడివిరా. మంత్రసాని ఎఱ్ఱది (1 చూ. ఫుట్ నోట్) లేదూ, అది వచ్చి చెబితే లోపలకి వెళ్ళి చూద్దును కదా, మీ అమ్మ ప్రక్కన జానెడు కూడా లేని ఆకారం కదులుతోంది. అసలే కరెంట్ లేదా, ఆముదం దీపం వెళుతురులో నువ్వు నిజంగానే ఎలుక పిల్లలా ఉన్నావ్రా. 

  ఇంకో సంగతి చెప్పనా.. ఈ ఎలుక పిల్లకు స్నానం చేయించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదిరా. కాళ్ళ సందుల్లో నుంచి దూరిపోయేవాడివనుకో. అంటుండేది. మా బామ్మ (అన్నపూర్ణమ్మ) శతవత్సరాలకు పైనే బతికిందని ఇంట్లో వాళ్లు చెప్పారు. బతికినంత కాలం మహారాణిలా బతికింది. వీధిలో వెళ్ళే ఎవరినైనా పేరు పెట్టి పిలవగల అధికార స్వరం ఆమెకు భగవంతుడు ఇచ్చాడు. వ్యవసాయ పనులు, ఇంటి పనులు ఆ అధికార స్వరంతోనే జీతగాళ్లు, పనివాళ్లతో చేయించుకునేది. అంతే ఉదారంగా వారిని ఆదుకునేది.  

  నా చిన్నతనం అంతా దినదిన గండంలా సాగేది. దేవుడిచ్చిన ప్రాణం ఎప్పుడు తీసుకువెళతాడో  తెలియని పరిస్థితి. పైగా ఊర్లో ముసురుకుంటున్న రోగాలు. పసరు వైద్యం, నాటు వైద్యం తప్ప ఉర్లో మందిచ్చే దిక్కేలేదు. అసలు అడవి రావుల పాడు (చూ . 2) అన్న గ్రామం పేరుకు తగ్గట్టుగా అప్పట్లో ఓ చిట్టడవి. ఈ పిల్లాడిని కాపాడటం పెద్ద సవాలైంది. ఇక దేవుడి మీదనే భారం.

  చిన్నతనంలో చీపురు పుల్లలా ఉండేవాడిని. ఎప్పుడూ ఏదో ఒక జబ్బు. ముఖ్యంగా బాల ఉబ్బసం. రాత్రి పడుకోగానే పిల్లి కోతలు వచ్చేవి. మా అమ్మకి నా కారణంగా నిద్రలేని రాత్రులు ఎన్నో. అర్థరాత్రి కుంపటి రాజేసి దానిపై ఉప్పు వేడి చేసి దాన్ని మూటగా కట్టి నా ఛాతీపై రుద్దేది. అలా చేస్తే నిమ్ము తగ్గుతుందని ఓ నమ్మిక. మేము మొత్తం ఐదుగురు సంతానం.  పై ఇద్దరు (ఒక అన్న, ఒక అక్క) రోగాల బారినపడి మరణించారు. కామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సరైన మందులు లేవు. కడపటి వాడినైన నన్ను కాపాడుకోవాలని అమ్మ (3) తెగ ఆరాట పడేది.   

  ఈ ఎలుక పెరిగి పెద్దదవుతోంది. విద్యాబుద్ధులు నేర్చింది.  తెలుగు మీడియంలోనే డిగ్రీ పూర్తి చేశాక మాస్టర్ డిగ్రీ చేయడం కోసం బొంబాయికి బయలుదేరింది. ఆ సంగతులు వచ్చే వారం చెబుతాను. 

  **************

   ఫుట్ నోట్ :

(1) ఎఱ్ఱది : నిజం పేరు ఏమిటో మాకు తెలియదు. ఊర్లో అందరూ ఎఱ్ఱది అనే పిలుస్తుంటారు. బాగా ముసలిదయిన ఎఱ్ఱదే నాకు గుర్తు. అంత పెద్దయ్యాకే ఇంత పసిమి ఛాయలో ఉన్నదంటే కుర్రదానిగా ఉన్నప్పుడు ఎలా ఉండోదో అన్న ఆలోచన అప్పట్లో రాలేదు కానీ, ఇప్పుడనిపిస్తోంది. మా ఊరి మంత్రసాని ఆవిడే అని చెప్పేవారు. డెలెవరీ కేసులు చిటికలో పరిష్కరించేదట. రోజులో ఎక్కువ సేపు అగ్రహారపు బ్రాహ్మణ కొంపల్లోనే ఉండేది. క్రమంగా కట్టు బొట్టు మాటతీరు బ్రాహ్మణ ఆడవారిలా ఉండేవి. నాకు ఊహ తెలిసాక ఒకటి రెండుసార్లు చూసిన గుర్తు. అంతే. . 


*********************

(2)  అడవి రావుల పాడు : ఇది అగ్రహారీకుల గ్రామం. పూర్వం జమిందార్ల నుంచి ఇనాము గా పొందిన చిట్టడివిలో మొదట్లో నాలుగు బ్రాహ్మణ కుటుంబాలు ఉండటంతో వారి అవసరాల కోసం నెమ్మదిగా ఇదో గ్రామంగా అవతరించింది. ఇప్పుడైతే బ్రాహ్మణ కుటుంబాలు క్రమక్రమంగా చెదిరిపోతున్నాయి. నందిగామ నుంచి చక్కటి lతారు రోడ్డు మార్గం ఇప్పుడుంది. నా చిన్నప్పుడు మట్టి దారి. వర్షాకాలంలో వాగులు  పొంగడంతో రాకపోకలు బంద్ అయ్యేవి. వేసవి కాలంలో మేము మంగళగిరి,గుంటూరు నుంచి నందిగామ వచ్చినప్పుడు మా బామ్మ మాకోసం గూడు వేసిన ఎడ్ల బండి పంపేది. మనవళ్లు, మనవరాళ్లు వస్తున్నారని తెగ సంబరపడిపోయేది. మా ఇంటి వ్యవసాయం నిలబెట్టడం కోసం ఆమె ఈ ఉర్లోనే ఉంటుండేది. మా నాన్న గారు (తుర్లపాటి వెంకట మల్లికార్జున వరప్రసాద రావు) ఎండోమెంట్ శాఖలో పనిచేస్తూ బదలీల మీద ఊర్లు మారుతుండేవారు. అలా మంగళగిరి, గుంటూరు వంటి చోట్ల ఉండేవాళ్లం. మా రాక ఆమెకు సంబరం. ఎడ్ల కొమ్ములకు రంగులు వేయించేది. మువ్వలు గంటలున్న బెల్టులు మెడలో వేయించేది. నడుముకు తళతళా మెరిసే బెల్టులు చుట్టించేది. వయ్యారం వొలకబోస్తూ ఎడ్లు బండి లాగుతుంటే ఫర్లాంగు దూరం నుంచే ఫలానా వారి బండి  వస్తుందని చెప్పేసే వాళ్లు. 


*****************

(3) అమ్మ : స్వరాజ్య లక్ష్మి కానూరి వారి ఆడపడుచు. ప్రముఖ ఇంజనీర్ కానూరి లక్షణ రావు (కెఎల్ రావు)కి బంధువులే.  కంకిపాడులో ఉండే  మా తాత (భైరవానందం)గారు  మా అమ్మ నాన్నలకి ఓ ఆవుని దానంగా ఇచ్చారట. ఈ ఆవు ఎఱ్ఱటి మచ్చలతో ఉండేది. అది వచ్చిన వేళా విశేషం. పాడి పంటల వల్ల ఇల్లు కళకళలాడుతుండేదని చెప్పేవారు. దాని సంతానం, వాటికి పుట్టిన సంతతే ఎటేటా పెరిగిపోతుండేది. 11 ఆవులు, నాలుగు కోడె దూడలు, రెండు జతల ఎడ్లు.. పశువుల కోష్టంలో ఉండటం నాకు తెలుసు. తువ్వాయిలంటే నాకు ప్రాణం. 

అవి కూడా నన్ను అంతగా ప్రేమించాయి. నేను ఊరు విడిచి వెళుతుంటే ఒక ఆవు దూడ ఊరి పొలిమేర దాటే దాకా బండి వెనకే వచ్చింది. దాన్ని వెనక్కి మళ్ళించడం చిన్న జీతగాడికి కష్టమైంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అమ్మ రాకతోనే పాడిపంటలు ఊపందుకున్నాయని మా బామ్మే చెబుతుండేది ఈ మాట.

 - తుర్లపాటి నాగభూషణ రావు 

 (తుర్లపాటి జీవన సాఫల్య యాత్రలో ఇది మొదటి భాగం. రెండవ భాగంలో మళ్ళీ కలుద్దాం - సంపాదకుడు - డైనమిక్ వెబ్ పత్రిక - సంచిక - 6-04-24)