15, ఫిబ్రవరి 2017, బుధవారం

ఆస్తులు కాజేసేవాళ్ల లక్షణాలు



సంపద పెంచుకోవడం కోసమే అవినీతికి పాల్పడుతుంటారని జయ -శశిళ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్ వ్యాఖ్యానించారు. తప్పుచేశామన్న భావన లేకపోవడమే అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం, ఇరుగు పొరుగువారి ఆస్తులు కాజేయడం ఎక్కువైపోయింది. దోషిగా తేలగానే ఎక్కడలేని అనారోగ్యాలు ముంచుకొస్తాయి. ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చినట్లు పడిపోతారు. దోపిడీ మనస్తత్వంఉన్న వారి లక్షణాలన్నీ ఒకేమోస్తరుగా ఉంటున్నాయని నేరపరిశోధకలు చెబుతున్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ధర్మదాతగానో, మేధావిగానో, గౌరవనీయ వ్యక్తిగానో చెలామణి కావాలని చూస్తుంటారు.
`మంచి' అన్న పెయింట్ పూసుకుని తనకేమీకాదని అనుకుంటారు. ఈ కవచాలన్నీ కరిగిపోతే చివరకు `నాకేం తెలియదు, ఎదో అలా జరిగిపోయింది. ఇంకా ఒత్తిడి తెస్తే, మరణమే శరణ్యం' వంటి మాటలు వల్లిస్తుంటారు. వీళ్లకి న్యాయస్థానాలంటే భయం ఉండదు. న్యాయమూర్తులనే బుట్టలో వేసుకోవాలని చూస్తుంటారు. సామదానబేధదండోపాయాలను అనుసరిస్తుంటారు. మైక్ ల ముందు ధర్మోపన్యాసాలు చేస్తుంటారు. పదవుల కోసం వెంపర్లాడుతుంటారు. రాజకీయాల్లో చేరాలని ఉవ్విళ్లూరుతుంటారు. తన గురించీ, తన కుటుంబసభ్యుల గురించి గొప్పలు చెబుతుంటారు. తాను తలచుకుంటే అథఃపాతాళానికి తొక్కేయగలమంటూ బెదరిస్తుంటారు. అంతలో తాము బుద్ధదేవునికి ప్రతిరూపాలమన్నట్టు ఫోజులిస్తుంటారు. క్షణమొకరకంగా ఊసరవెల్లిలా రంగులుమారుస్తూ చేసిన తప్పులు బయటపడకుండా పూర్తిగా సమాధి చేయాలని చూస్తుంటారు. ఈ లక్షణాలున్న వారితో తస్మాత్ జాగ్రత్త.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి