వీడ్కోలు విలాపం:
బొంబాయి (ప్రస్తుత ముంబయి)లో 1978 నుంచి రెండేళ్ల
చదువు కోసం ఉన్నప్పుడు ఈ “వీడ్కోలు విలాప” సన్నివేశాలు తరచూ కలవర
పరిచేవి. ఆ రోజుల్లో బొంబాయిలోని సెంట్రల్ స్టేషన్ ని విక్టోరియా టెర్మినస్
(వి.టి. ) అనేవారు (చూ.
6) ప్రయాణం ఉన్నప్పుడే
కాకుండా అడపాదడపా
ఈ స్టేషన్ కి వెళ్ళి కాసేపు
కూర్చుని కబుర్లు
చెప్పుకోవడం ఓ హాబీగా మారింది. ఈ
స్టేషన్ నుంచి ప్రతి రోజూ రాత్రి పది గంటలకు మీనార్ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ కి బయలుదేరుతుండేది.
ఈ ఎక్స్ ప్రెస్ రైలు (చూ. 7) ఏ నెంబర్ ప్లాట్ ఫాం మీద
ఉంటుందో ఆ ప్లాట్ ఫామ్ కి వెళ్ళి
బెంచీల మీద కూర్చునేవాళ్లం. మా కబుర్లకు అదనం ప్రయాణీకుల
మాటలు. అవి కూడా అచ్చ
తెలుగు మాటలు.
ఎందుకంటే ఈ ట్రైన్ ఎక్కేవాళ్లలో చాలా మంది తెలుగు
వారే. పైగా వారికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చే వారు
కూడా తెలుగువారై ఉంటారు కనుక ఆ రైలు వెళ్ళేదాకా
అక్కడంతా తెలుగు వాతావరణం పరచుకునేది. ఆ కాసేపు
నాకైతే మా ఊర్లో ఉన్నట్లే అనిపించేది. ఆ రైలు బయలు దేరడానికి ముందు ఫ్లాట్ ఫారమ్ మీద
ప్రయాణీకుల్లో కనిపించే భావోద్వేగాలు, వారి వీడ్కోలు విలాపాలు, విన్యాసాలు చూస్తుంటే నా మనసు సన్నగా మూలిగేది. కొన్ని ప్రేమ జంటలతై మరీను. ఏదో శాశ్వత ఎడబాటు కలగబోతుందన్నట్టుగా భోరున ఏడ్చేసేవారు. ఓదార్పు మాటలు, ఉత్సాహం కలిగించే కబుర్లు, కళ్లతోనే పలకరింపులు వెరసి మొత్తం సమాజపు సప్తవర్ణ చిత్రం అక్కడ సాక్షాత్కరించేది. కొంత మంది
చేసే చేష్టలు చిత్రంగా ఉండేవి. ఓ సారి.. వీడ్కోలు చెప్పేవాడు
కదులుతున్న రైలు ఎక్కేశాడు. రైలు వేగం పుంజుకుంటున్నది. ఆ గాభరాలో రైలు నుంచి దూకేసరికి
నిలదొక్కుకోలేక పడిపోయాడు.
“పాపం “ అనుకుంటూ జాలి పడేవాడ్ని. ఇవన్నీ
చూస్తున్నప్పుడే ఏదేదో రాసేయాలనిపించేది. ఆ
భావనతో నాలోని రచయిత లీలగా కదిలినట్లు అనిపించేది. కానీ ఆ రచయిత బయటకు వచ్చి
భవిష్యత్తులో నా చేత రేడియో నాటికలు
రాయిస్తాడనీ, వ్యాసాలు పుస్తకాలు రాయిస్తాడని
నేను అప్పట్లో అనుకోలేదు. మీనార్ ఎక్స్ ప్రెస్ కదలుతుంటే నాకు
కళ్ళెంబడి నీళ్లు వచ్చేవి. ప్రేమ అనేది మనుషులతోనే
కాదు, వస్తువులు, వాహనాలతో కూడా ముడిపడి ఉంటుందని
అనిపించేది. రైలు వెళ్లగానే ప్లాట్ ఫామ్ ఖాళీ అయ్యేది. నా మనసూ శూన్యంగా మారేది. దూరంగా వెళుతున్న రైలుకి టాటా చెప్తూ హాస్టల్ కి చేరినా ఆ సంఘటనలు వెంటాడుతుండేవి.
విటి స్టేషన్ చాలా పెద్దది. కట్టడం పురాతనమైనది.
కాసేపు రైల్వే స్టేషన్ కట్టడాల శైలి చూసి
మురిసిపోయేవాడిని. ఇంత పెద్ద టవర్లు,
గోపురాలు చూస్తుంటే ఆశ్చర్యమేసేది. నిశిత దృష్టితో చూడటం, వాటి గురించి
ఆలోచించడం మొదలైంది. కానీ ఈ మానసిక మార్పుని
గుర్తించలేదు. ఏదైనా కొత్త ప్రాంతం చూసినా,
వాటి గురించి రవ్వంత తెలుసుకున్నా అదనపు
సమాచారం తెలుసుకోవాలన్న తపన మొదలయ్యేది. ఈ తపన
చల్లార్చుకోవడానికి లైబ్రరీకి వెళ్ళి అధ్యయనం చేయడం, నోట్స్ రాసుకోవడం వంటివి చేసే వాడ్ని.
ఇప్పుడున్నట్లుగా విషయ సేకరణ క్షణాల్లో
అందుబాటులోకి వచ్చేది కాదు.
గూగుల్ వంటి సౌకర్యాలు లేని కాలంలో పాత పేపర్లు,
పుస్తకాలు గంటల కొద్దీ తిరగేస్తేనే కానీ అదనపు సమాచారం
రాబట్టలేని పరిస్థితి .
సరే, సేకరించిన సమాచారాన్ని పేపర్ మీద పెట్టేవాడ్ని
అయినప్పటికీ ఏ పత్రికకూ పంపేవాడ్ని కాదు. అసలు
ఎలా పంపాలో కూడా తెలియదు. పత్రికలో పాఠకుల రాసే లేఖల కోసం
ఒక వేదిక దాదాపు అన్ని పత్రికల్లో ఉండేది. ఈ లేఖల
కాలమ్ లో కనీసం
ఒక లేఖ అయినా పబ్లిష్
అవ్వాలని ఓ బలమైన కోరిక
డిగ్రీ చదువుతున్నప్పుడే కలిగింది. కానీ గట్టి
ప్రయత్నం
చేసినట్లు లేదు. చిత్రమేమంటే
ఇంతవరకు ఈ కోరిక
తీరనే లేదు. కాకపోతే లేఖ ప్రింట్ కాకపోయినా ఏకంగా పత్రికల్లో వందల కొద్ది వ్యాసాలు
రాసే అవకాశం మాత్రం వచ్చింది. వాటిలో కొన్ని ఎడిట్ పేజీలో కూడా వచ్చేవి.
అందుకే ఓ సినీ
కవి ఇలా అంటారు…
“కోరిక ఒకటి జనించు
తీరక ఎడద దహించు,
కోరనిదేదో వచ్చు, శాంతి
సుఖాలను తెచ్చు
ఏది వరమ్మో ఏది శాపమో
తెలిసీ తెలియక అలమటించుటే,
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము”
- నిజమే కదా
జీవితంలో
రాబోయే చిత్రమైన మలుపులకు
ప్రారంభాలు కూడా
విచిత్రంగానే ఉంటాయి. ఇది నా
జీవితంలో చాలా
స్పష్టంగా కనిపించింది. ముందు
ముందు నాలోని
రచయిత ఎదగడానికి ఈ
లక్షణాలు దోహదపడ్డాయి . ఈ విషయం అప్పట్లో అర్థం కాలేదు. పుస్తక పఠనం వల్ల మనిషి లోని ఆలోచనలు ఎలా ఎదుగుతాయో, అవి ఎలా పరిపక్వత చెందుతాయో మరో సారి చెబుతాను.
-
--- ఫుట్ నోట్ 6 ------
(చూ.6) విక్టోరియా టెర్మినస్ (వి.టి) : ఇది
బొంబాయి సెంట్రల్ స్టేషన్. దీన్నే ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ అని పిలుస్తున్నారు. బ్రిటీష్ వారి హయాంలో
కట్టిన రైల్వే స్టేషన్. దీన్ని 1878లో మొదలుపెట్టారట.
అంటే నేను బొంబాయి గడ్డమీద అడుగుపెట్టడానికి సరిగా
వందేళ్ల ముందు అన్నమాట. దీన్ని పూర్తి చేయడానికి పదేళ్లు పట్టిందని చెప్పేవారు. ఎత్తైన టవర్ చూస్తుంటే బ్రిటీష్ వారి పెత్తందారీతనానికి నిలువెత్తు నిదర్శనంగా
అనిపించేది. టవర్ క్లాక్ -శ్రమ ఎరుగని కార్మికుడు
పనిచేస్తున్నట్లుండేది. ఈ స్టేషన్ ని మొదటి సారి నేను
చూసింది మా నాన్నగారితో కలిసి. నన్ను
యూనివర్శిటీలో చేర్చడానికి ఆయన కూడా నా వెంట
వచ్చారు. ఆ సమయంలోనే నాన్నగారు మాటల మధ్యన , మగవాళ్ళు బంగారం ధరించడం గురించి మాట్లాడుతూ ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బులు కావలసి వచ్చినప్పుడు చేతికున్న ఉంగరమో కాకుంటే మెడలోని గొలుసో అమ్ముకుని గండం నుంచి బయటపడవచ్చని చెప్పారు. బంగారం పట్ల నాకైతే పెద్ద ఆసక్తి లేదుకానీ , నాన్నగారు చెప్పిన మాటలు మాత్రం ప్రభావం చూపాయి. కనీసం ఒక్క ఉంగరమైనా పెట్టుకోవాలనుకునేవాడ్ని.
సరే, వి.టి స్టేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా.. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ల గురించి చెప్పాలంటే ,
అంతకు ముందు మద్రాస్ వెళ్ళినప్పుడు
అక్కడ
కూడా పెద్ద రేల్వే స్టేషన్ చూడగలిగాను. బీఎస్సీ చదవుతున్నప్పుడు సైన్స్ టూర్ గా మద్రాసు (ప్రస్తుతం చెన్నై) వెళ్ళాము. అప్పటి దాకా నాకు తెలిసిన రైల్వేస్టేషన్లకీ దీనికీ పోలికే లేదు. రైళ్ళు వచ్చి ఆగడమే కానీ ముందుకు వెళ్ళవు. ఎందుకంటే రైల్వే ట్రాక్ లన్నీ అక్కడితో ఎండ్ అవుతాయి. అందుకే టెర్మినస్ అంటారని తెలిసింది అప్పుడే. బొంబాయిలో నేనప్పుడు చూసింది కూడా టెర్మినస్.
అసలు మా ఊరోళ్ళకు రైలు కూతలు వినబడవు. నందిగామకు దగ్గర్లో ఉన్న రైల్వేస్టేషన్ మధిర. అయితే మధ్యన మున్నేరు ఉండటంతో ఇటువైపు వాళ్ళు మధిరకు వెళ్ళి రైలెక్కడం సాహస యాత్ర లాంటిదే అవుతుంది. ఇప్పుడు పరిస్థితి మారింది. మున్నేరు మీద వంతెన వచ్చేసింది. దీంతో ఆటోల్లో కూడా మధిర రైల్వే స్టేషన్ కి ప్రయాణీకులు చేరగలుగుతున్నారు.
నందిగామ లాంటి రేల్వే స్టేషన్ లేని ఉర్లలో ఉన్న వారు
రైల్వే స్టేషన్ కి వెళ్లడమే గగనం. ఊర్లో
బస్టాండ్ ఉండటమే గొప్ప. నేను కాలేజీలో
చదువుతున్నప్పుడే ఉర్లో బస్టాండ్ కట్టారు.
అంతకు ముందు వరకు బస్సులు సెంటర్ లో
రోడ్డు పక్కనే ఆగేవి. దాన్నే ఇప్పుడు పాత బస్టాండ్
అంటున్నారు. కొత్త బస్టాండ్ కట్టాక వెళ్ళి చూస్తే బస్సులు
వచ్చే స్థలం ఆగే ప్లాట్ ఫామ్స్ చూసి మా మిత్రుడొకడు
“ఒరే ఇది విమానాశ్రయమేరా. రేపో మాపో మనూర్ళో
విమానాలు ఆగుతాయేమో” అన్నాడు. నా బోటి
అమాయకుడు వాడి విజ్ఞానానికి తల ఊచేవాళ్ళం.
అలాంటిది విక్టోరియా టెర్మినస్ చూడగానే అమితాశ్చర్యం చెందకుండా ఉండగలనా?
చర్చ్ గేట్ రైల్వేస్టేషన్ నుంచే లోకల్ రైళ్ళు బయలుదేరి పరుగులుపెడుతుంటాయి. సమయపాలన విషయంలో బొంబాయి జనాన్ని చూసి ఇవి నేర్చుకున్నాయా ? లేక ఈ లోకల్స్ ని చూసి బొంబాయి వాసులు నేర్చుకున్నారా ?
లోకల్ ట్రైన్స్ లో “డబ్బావాలాల” సందడి వర్ణనాతీతం. అసలు ఆ నెట్ వర్క్ చూసి ఎవరైనా విస్తుపోవలసిందే. ఎక్కడో దూరప్రాంతంలో ఉద్యోగం చేసేవారికి లంచ్ బాక్సులను టైమ్ కి చేర్చే వారు. డబ్బావాలాల చిత్తశుద్ధి, సమయపాలన చూసినప్పుడు అంతర్లీనంగా దాగున్న విజయ సూత్రం బోధపడింది.
-
ఫుట్ నోట్ 7 ----
(చూ.7) మీనార్ / కోణార్క్ కథ ఇది. 1978లో
నేను మొదటి సారి బొంబాయి వెళ్ళినప్పుడు
మీనార్ ఎక్స్ ప్రెస్ చూశాను. అంతకు ముందు
నాకు బాగా గుర్తున్న రైలు సర్కార్ ఎక్స్ ప్రెస్. ఈ
మీనార్ ఎక్స్ ప్రెస్ రైలు అప్పట్లో బ్లూ కలర్ లో
ముద్దొచ్చేలా ఉండేది. సికింద్రాబాద్ నుంచి
బొంబాయి వి.టికి వెళ్ళే రైలు అది.
నాకో విషయం
చిత్రంగా అనిపించేది. ఒకటే రైలు రెండు నెంబర్లు
అలాగే రెండు పేర్లు. మీనార్ ఎక్స్ ప్రెస్ బొంబాయి నుంచి సికింద్రాబాద్ వరకు ఆ తర్వాత రైలు అదే,
కానీ నేమ్ బోర్డ్లులు కోణార్క్ గా మార్చే వారు.
సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం
మీదగా భువనేశ్వర్ వెళ్ళే రైలుగా మారిపోతుంది.
నేను బొంబాయి నుంచి విజయవాడ వరకు ఈ
రైల్లో వచ్చేవాడిని కనుక నాకు ఈ విషయం బాగానే గుర్తుంది. ఈ మధ్యనే (2024 మార్చి 2) కోణార్క్
ఎక్కినప్పుడు ఈ పాత సంగతులు గుర్తుకువచ్చాయి.
ప్రతి రైలుకు చరిత్ర ఉంటుంది. అలాగే ప్రయాణీకులకు ఆ
రైలుతో అనుబంధం, ప్రేమ పెరుగుతుంటుంది. 2028లో కోణార్క్ సర్వీస్ స్వర్ణోత్సవం
జరుపుకుంటుందన్నమాట.
(మళ్ళీ కలుద్దాం)




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి