9, అక్టోబర్ 2025, గురువారం

సామాన్యునిలో అసమాన్య ప్రజ్ఞ

 




తుర్లపాటి “జీవనరాగాలు”

——-


పుట్టింది ఓ  పల్లెటూరులో. స్వాతంత్రం వచ్చిన పదేళ్లకు (1957 ) ఆ ఊరు ఎలా ఉండేది? 

  ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని పల్లె అది. కరెంట్, వైద్యం, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా అప్పటికి రాలేదు. ఊరంతా కలిపినా పాతిక గడపలన్నా లేవు.  

“అలాంటి పల్లెలో ఓ రోజు ఆముద దీపాల వెలుగులో ఓ పెంకుటింట్లోని మారుమూల గదిలో ఎలుక పిల్లలా ఓ పిల్లాడు పుట్టాడు”-అంటూ తుర్లపాటి తన జీవన రాగాలు పలికించడం ప్రారంభించారు. బతికి ఏదో సాధిస్తాడన్న నమ్మకం ఎవ్వరికీ లేదు. స్నానం చేయిస్తుంటే కాళ్ల సందుల్లో నుంచి క్రిందకుజారిపోయేవాడని వాళ్ల బామ్మ చెబుతుండేది. దీనికి తోడు ఎప్పుడూ అనారోగ్యం. పల్లెలో వైద్యం అందక రోజులు లెక్కపెట్టిన సందర్భాలు అనేకం. 

పిల్లవాడు క్రమంగా ఎదుగుతున్నాడు. ఏ భగవంతుని ఆశీస్సులో అతగాడి మీద ఉన్నట్లున్నాయి. అక్షరాభాస్యం ఆలస్యంగా అయినా ఎక్కడా ఒక్క క్లాస్ లో కూడా ఫెయిల్ కాకుండా విద్య గడిస్తున్నాడు. 

బక్కపలచగా ఉండే ఈ కుర్రాడు తర్వాత తెలుగు భాష వికాసానికి కృషి చేస్తాడని కానీ, లేదా మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాడని గానీ ఏవ్వరూఊహించ లేదు. వివిధ రంగాల్లో చేసిన కృషికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకునే స్థాయికి చేరుకోవడం వెనుక `ఇద్దరమ్మలు' మూలకారణం అనిచెబుతున్నారు. “ఇద్దరమ్మలు” ఎవరని అడిగితే... 

తండ్రి గారు (టివిఎంవి. ప్రసాదరావు) , తల్లి స్వరాజ్య లక్ష్మి. తండ్రిది ఎండోమెంట్స్ శాఖలో ఆఫీసర్ ఉద్యోగం. ఈ కారణంగా కొంత కాలం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కూడా ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా ఉన్నారు. అప్పటికి ఈ పిల్లాడికి ఆరేడేళ్లు కూడా లేవు. కొండ మీదనే వీరి కాపురం. పిల్లవాడికి అమ్మ అంటే చాలా ఇష్టం. గుండ్రటి ముఖం. అలుపెరుగని చిరునవ్వు.  నుదిటిపై తీరైన కుంకుమ బొట్టు. అమ్మ ని చూస్తుంటే ఈ పిల్లాడికి గుడిలోని కనకదుర్గమ్మని చూస్తున్నట్లే అనిపించేది. అసలు తన అమ్మ బొమ్మనే గుడిలో పెట్టారని అనుకునే వాడు. అలాగే తన తోటి స్నేహితులతో వాదించే వాడు కూడాను. అప్పటి నుంచి తనకు “ఇద్దరమ్మలు” అంటూ గర్వంగా చెప్పుకుని మురిసిపోతుండే వాడు. ఎంత ఎదిగినా, 68 ఏళ్లు నిండబోతున్నా ఇదే భావన. అమాయకత్వం నుంచి పుట్టిన ఇద్దరమ్మల భావన చెక్కుచెదరలేదు. ఆ కనక దుర్గమ్మ తల్లే తనను ఆపదల నుంచి కాపాడుతుందని సంపూర్ణంగా నమ్ముతూ, జీవన రాగాలు పలికిస్తున్నాడు. 

   నేను పుట్టిన ఊరు అడవిరావులపాడు. ఈ కుగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ టీ ఆర్ జిల్లా (పూర్వ నామం కృష్ణా జిల్లా) లోని నందిగామ మండలం లో ఉంది. మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ పనులు బామ్మ అన్నపూర్ణమ్మ గారు చూసుకుంటుంటే నాన్నగారు ఉద్యోగ రీత్యా అనేక ఊర్లు తిరుగుతుండే వారు. అలా విజయవాడ కనకదుర్గమ్మ కొండపై కూడా కొన్నాళ్లు నివాసం ఉండాల్సి వచ్చింది.



తన ప్రతి విజయానికి ఆత్మబలానికి దైవ బలం తోడవడటమే కారణమని అని నమ్మిన వ్యక్తి.  ఈ మధ్యనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈయన లోని ప్రతిభను గుర్తించి 2025 టిబిఆర్ ఐకాన్ అవార్డు ని అందజేశారు. 

2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలోని “తెలుగు భాష సంఘం “ వీరికి తెలుగు భాష రత్న - జీవన సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది.  ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు శాఖ వారు విశాఖ లో వీరిని విశిష్ట అతిథిగా ఆహ్వానించి సత్కరించింది. 

     జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు. మరెన్నో ఎత్తుపల్లాలు. ఎన్నో సార్లు దారీతెన్ను లేని ప్రయాణం.  అపజయాల బాటలోనే విజయానికి పునాదులు వేసుకున్నారు. 

  తాను ఎంచుకున్నది ఏ దారైనా సంపూర్ణ అంకిత భావంతో పనిచేయడం అలవాటు. అది పత్రికా రంగం కావచ్చు, రేడియో రంగం కావచ్చు, నాటక రచన , వెబ్ మీడియో, టివీ మీడియా, గ్రంథ రచన...ఇలా ఏది ఎంచుకున్నా చిత్తశుద్ధితో పనిచేసి చివరకు పలువురి ప్రశంసలు అందుకోగలిగారు. వీరు “ఆకాశవాణి “ కోసం వ్రాసిన “అదిగో హరివిల్లు “ అన్న రూపకానికి జాతీయ ప్రతిభా పురస్కారం దక్కింది. జర్నలిస్ట్ గా అనేక మార్లు అవార్డులు, ప్రశంసలు సరేసరి. టివీ 5లో పనిచేస్తున్నప్పుడు వీరి రచనలో ప్రసారమైన డాక్యుమెంటరీ (నిప్పురవ్వ)కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగారు నంది అవార్డు అందజేసింది. వీరి ఆధ్వర్యంలోనే సాగిన టివీ చర్చా కార్యక్రమానికి “యునిసెఫ్ “ అవార్డు దక్కింది. తరంగా పేరిట ఏర్పాటైన ప్రైవేట్ ఇంటర్నెట్ రేడియో స్టేషన్ లో పనిచేస్తున్నప్పుడు భారతీయ సినిమాకు వందేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని వంద గంటల పాటు నిర్విరామంగా వంద కార్యక్రమాలను ప్రసారం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు.  ఐదు రోజుల పాటు ఇంటికి కూడా వెళ్ళ లేదు. అంకిత భావంతో కార్యక్రమాలను సమన్వయ పరుస్తూ ప్రొగ్రామ్ డైరెక్టర్ గా సఫలీకృతులయ్యారు. ఫలితంగా తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈవెంట్ నమోదైంది.  ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

  బోటనీ సబ్జెక్ట్ లో ముంబయి లో ఎమ్మెస్సీ చదివిన మీరు జర్నలిస్ట్ ఎలా అయ్యారు? అని అడిగితే, నవ్వుతూ- “సముద్ర తీరంలోని ఓ నాటు పడవ కారణం” అన్నారు. అదెలా? అని అడిగితే నాటు పడవలతో జీవనం సాగించే గంగ పుత్రుల వ్యథల గురించి ఈనాడు పత్రికకు వ్యాసం వ్రాయడం, వారు ప్రచురించడంతో జర్నలిజం పై ఆసక్తి పెరగడం, అటుపై ఈనాడులో చేరడం నాటకీయంగా జరిగిపోయాయి. తర్వాత జీవనయానంలో ఆంధ్రప్రభ, టివీ5, తరంగా వంటి సంస్థల్లో పనిచేశారు. పార్ట్ టైమ్ గా ఆకాశవాణి న్యూస్ రీడర్ గా సేవలందించడం మరో మలుపు అని చెబుతుంటారు. 

అరోగ్యం ఎప్పుడూ అంతంత మాత్రమే.  వారం రోజులు బాగుంటే రెండు రోజులు బాగుండదు. అయినప్పటికీ తాను చేపట్టిన వర్క్ విషయంలో అలక్ష్యం చేయకపోవడం ఓ విశిష్ట లక్షణం. 70వ వడికి దగ్గర అవుతున్నా ఇప్పటికీ తెల్లవారుఝామున ఐదుగంటలకే లేచి పని ప్రారంభిస్తుంటారు. 

అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న అలుపెరుగనిపోరాటయోధుడు తుర్లపాటి. అక్షరంలో అమ్మవారిని దర్శించుకుంటాను- అనిఅంటుంటారు. 

అమ్మవారిని మీరేం కోరుకుంటారని ? అన్నప్పుడు - “చివరి శ్వాస వరకు సమాజ హితమైన పనులు చేస్తుండేలా చూడు తల్లీ - అని కోరుకుంటా “ అని అన్నారు. 


కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న రోజుల్లో (2020) గుండెపోటు వచ్చింది. నాలుగు చోట్ల బ్లాక్స్ ఉన్నాయని బైపాస్ సర్జరీ చేశారు. రెండు నెలల పాటు లేవలేని పరిస్థితి. తాను నమ్ముకున్న కనకదుర్గమ్మే తనకు పునర్జన్మ ప్రసాదించిందని నమ్మిన తుర్లపాటి  వొంట్లో శక్తి పుంజుకోగానే తన సొంత ఛానెల్ (channel5am) ద్వారా సంగీత, సాహిత్య కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నారు. ఘంటసాల వర్ధంతి సందర్భంగా డిసెంబర్ నెలంతా “ఘంటసాల ఆరాధన - పాటల పల్లకి“ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఘంటసాల కుమారుడు రత్నకుమార్ ఈ కార్యక్రమాలను ప్రశంసించారు. అక్కడితో ఆగకుండా ఆధ్యాత్మిక చింతన పెంచేలా “హరోంహర”, “జై శ్రీరామ్”, “చైత్రమాసోత్సవం” వంటి విశిష్ట కార్యక్రమాలను ప్రసారం చేశారు. తెలుగు సినిమాకు 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా “తెలుగు సినిమాకు పట్టాభిషేకం “ పేరిట 90 రోజుల పాటు 90 కార్యక్రమాలను అందించి తెలుగు సినిమా కళామతల్లికి ఘన నీరాజనం అందించారు. తెలుగు పద్యాలపై ఉన్న మమకారంతో “పద్య పీఠం “ కార్యక్రమాలను సైతం నిర్వహించారు. పాత్రికేయ వృత్తిలో ఉన్నా, ఇటు రచనా ప్రవృత్తిలో ఉన్నా మాతృభాష వికాసానికి తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. మీడియాలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా తనను తాను మలుచుకున్నారు. అందుకే ప్రింట్ మీడియా నుంచి నేటి సోషల్ మీడియా వరకు అన్నింటా ప్రవేశంతో పాటుగా ప్రతిభ కనబరిచారు. అలాగే, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలోనూ ముందు వరసలో ఉండటం మరో విశిష్టత. ఇంటర్నెట్ సేవలనే కాదు, నేటి ఏ.ఐ సేవలను కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే `మీడియా గురు' గా గుర్తింపు పొందారు. 

జీవన సాఫల్య యాత్ర పేరిట వెబ్ డైనమిక్ పత్రిక `సంచిక'లో 40 వారాల పాటు ధారావాహిక గా “జీవనరాగాలు” పలికించి నిజమైన సాఫల్యతను సిద్ధింపజేసుకోగలిగారు. రెండు భాగాలుగా వెలువడిన “జీవనరాగాలు” పుస్తక  రచన ఎంతో మంది పాఠకులను ఆకర్షిస్తున్నది. 

“చదువుతున్న వారికి రచయిత కనబడకూడదు, అద్దం ముందు నిలబడిన వారికి తమ మోమే కనిపించిన చందాన చదువుతుంటే పాఠకునికి ఇది తన అనుభవాలే అనిపించాలి”  అంటారు తుర్లపాటి. అందుకే జీవనరాగాలు పట్ల ఆదరణ పెరిగింది. రచనలోని వైవిధ్యం మరో ప్రత్యేకత. ఒక చోట నాటకీయత, అంతలో హాస్యం, ఇంకో చోట గంభీరత..అంతలో చురకలు, మరో చోట పిల్లవాని మనస్తత్వం, ఇంతలోనే వ్యక్తిత్వ వికాస సూత్రాలు చెబుతూ మార్గదర్శకత్వం. రచనలో ఒక చోట ఉగ్ర గోదావరి, మరో చోట శాంత గోదావరి...ఇలా రచనలో భిన్న పోకడలు. తనను తాను ఎలుక పిల్లతో పోల్చుకుంటూ తన విదేశీ యాత్రా విశేషాలను వివరించిన తీరు ఓ కామిక్ బుక్ స్టోరీలా ఉంటుంది. “ఎలుక ఎగిరింది “ అన్న పేరిట వ్రాసిన ఈ చాప్టర్ చాలా మంది చిన్నారులకు నచ్చినట్లు వారి తల్లిదండ్రులు చెప్పడం గర్వంగా ఉందని అంటారు. 

దేశ, విదేశాల్లో తెలుగు వారు చాలా మందే ఉన్నారు. అయితే ఒక దురదృష్ట పోకడ నేటి తెలుగు సమాజంలో ప్రస్ఫుటంగా కనబడుతోందని ఆవేదన వెలుబుచ్చారు. పేరుకే తెలుగు వారు. కానీ తెలుగు చదవడం మరచిపోయారు. గత 40, 50 ఏళ్లుగా ఇంగ్లీష్ మీడియం చదువులు చోటు చేసుకోవడంతో “అమ్మా- నాన్నల సంస్కృతి” నుంచి “మమ్మీ-డాడీల సంస్కృతి”అనేక తెలుగు కుటుంబాల్లోకి ప్రవేశించింది. దీంతో నేటి తెలుగు యువతలో చాలా మంది తెలుగు చదవడం మరిచిపోయారు. తెలుగు మాట్లాడినా అందులో అరవై శాతం పదాలు ఆంగ్ల భాషవే. ఇక వారి పిల్లల గురించి చెప్పేదేముందని ఆవేదన వ్యక్తం చేశారు. రానూరానూ తెలుగులో మాట్లాడే వారంటేనే చులకన భావన. 

  తాను వ్రాసిన జీవనరాగాలు పుస్తకాన్ని అనివార్య పరిస్థితుల్లో రచయిత ఇంగ్లీష్ వర్సెన్ తీసుకురావాలనుకుంటున్నారు. “ఎందుకిలా?” అని అడిగితే, 1960, 70, 80.. దశాకాల్లో మన తెలుగు నాట పల్లెలు ఎలా ఉండేవి, మన చదువులు ఎలా సాగేవి, నాటి సామాజిక, ఆర్థిక పరిస్థుతులు ఎలా ఉన్నాయో నేటి యువతకు, పిల్లలకు తప్పకుండా తెలియాలి. కేవలం భాష అడ్డంకి కాకూడదు. వారికి తెలిసిన భాషలోనే సమాచారం అందించాలి.  నిదానంగా తెలుగు భాష పట్ల, తెలుగు వారి సంస్కృతి పట్ల మమకారం పెంచాలి. ఇంగ్లీష్ అనువాదం చదివి  కనీసం ఓ పదిమందిలో ఐనా మార్పు వచ్చి తెలుగు  చదవడం నేర్చుకోగలిగితే రచయితగా నేను సఫలీకృతుడిని అవుతాను అని అంటారు తుర్లపాటి. ఈ ఉద్దేశంతోనే “మెలొడీస్ ఆఫ్ లైఫ్” పేరిట రెండు వాల్యూమ్స్ గా “జీవనరాగాలు “ ఆంగ్ల అనువాద పని ప్రారంభించారు. 




    “తుర్లపాటి సాంస్కృతిక, విజ్ఞాన కేంద్రాన్ని “ స్థాపించి దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారిలోని ప్రతిభను గుర్తించి ప్రతి ఏటా వారిని సముచిత రీతిలో సత్కరించాలని భావిస్తున్నట్లు తుర్లపాటి చెప్పారు. 



తన స్వగ్రామమైన అడవిరావులపాడు గ్రామంలో విద్యనభ్యసిస్తున్న వారిలో తెలుగు భాష పట్ల ఆసక్తి పెంచడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించే పనిలో ఉన్నారాయన. ఈ వేదిక ఆధ్వర్యంలోనే సైన్స్, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ, మంచి పుస్తకాలను పిల్లలకు పంచడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 

సరే , ఇంతకీ తుర్లపాటిని ఏమని పిలవాలి..?

ఆయనలో ఒక పాత్రికేయుడున్నాడు. 

ఓ రచయిత ఉన్నాడు, 

నాటక కర్తే కాదు నటుడు కూడా. టివీ ప్రెజెంటర్, ఆకాశవాణిలో న్యూస్ రీడర్, సోషల్ మీడియాలో యాక్టివిస్ట్, విదేశాల్లో సైతం తెలుగుభాషా వికాసానికి దోహదం చేస్తున్న నిత్య  కృషీవలుడు. 

  నాన్న గారి పేరు, తల్లి పేరు ప్రస్తావించాను. ఇక సతీమణి గురించి….

——

  ఎమ్మెల్సీ గా పని చేసిన  గుంటూరు హిందూ కళాశాల అధ్యాపకులు మన్నవ గిరిధర రావు గారి కుమార్తె శ్రీదేవి ని 1985 లో వివాహం చేసుకున్నారు.   తాను చేపట్టే ప్రతి పనికి ఆమె అండదండగా ఉంటుందని చెప్తూ  తుర్లపాటి- “ఆమె లేనిదే నా రచన లేదు, అక్షర పూజ లేదు, చివరకు నేనే లేను” అంటూ భావోద్వేగంతో ప్రేమపూర్వకంగా సతీమణి శ్రీదేవి గురించి చెప్పారు. అలాగే వీరి సంతానం - కుమారుడు రాజేష్ కృష్ణ సాయి, కుమార్తె దివ్య శ్రావణి లు కూడా తాను చేపట్టే పనులకు అండదండగా ఉంటారని కూడా చెప్పారు. కోడలు బాల శ్రావ్య, అల్లుడు శ్రీపతి పండితారాధ్యుల సాకేత్ లు కూడా తనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్తూ మనవళ్లు విరాజ్, అద్వైత్, విహాన్ లకు తాను వ్రాసిన “ఎలుక ఎగిరింది” అన్న చాప్టర్ వినిపించుకుని “ద ఫ్లైయింగ్ మౌస్ రాజు తాత” అంటూ సంబరపడిపోతున్నారని చెప్తూ  ఈ తాత ఆనంద పడిపోతున్నప్పుడు ఆయనలో పసితనం ఛాయలు కనిపించాయి.  తుర్లపాటి గారిని వారి బంధువులు, చిన్ననాటి స్నేహితులు నాగరాజు అని పిలుస్తుంటారు.


బహు ముఖ ప్రజ్ఞాశాలి, ఘనాపాఠి మన తుర్లపాటి.

 అయినా తనను తాను ఓ సామాన్యుడిగానే చెప్పుకుంటారు.  అందుకే సామాన్యుడిలో అసమాన్య ప్రజ్ఞామూర్తి దాగున్నాడని అంటూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుందాం . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి