ఈరోజు మా నాన్నగారు తుర్లపాటి వెంకటమల్లికార్జున వరప్రసాదరావు - (టీవీఎంవీ ప్రసాదరరావు - మల్లేశంగారు) ఆబ్దికం. ఆంగ్లసంత్సరం ప్రకారం ఆయన లింగైక్యమైన రోజు డిసెంబర్ 5 (2000 సంవత్సరంలో). అయితే నవమినాడు లింగైక్యమయ్యారుకనుక ఆబ్దికం ఈరోజు. ఆజానుబాహులు, స్ఫురధ్రూపి, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎలాంటి సమస్యలనైనా ఎదురొడ్డి పోరాడగలిగిన ధీశాలి అయిన మా పిత్రుదేవులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి ఫోటోతోపాటుగా మాత్రుమూర్తి స్వరాజ్యలక్ష్మి (ఫిబ్రవరి 28, 1986లో లింగైక్యం చెందారు) తో వారు దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేస్తున్నాను. మా నాన్నగారు శివైక్యం చెందిన తర్వాత (నందిగామలో) పార్థివ శరీరాన్ని స్వస్థలమైన అడవిరావులపాడుకు తీసుకువెళ్ళాము. అక్కడే అంత్యక్రియలు పూర్తిచేశాము. అక్కడి లింగైక్య స్థలిని ఈ మధ్యనే నేను అడవిరావులపాడు వెళ్ళినప్పుడు దర్శించుకుని శ్రద్ధాంజలి ఘటించాను.
సేవాతత్పరుడు
అడవిరావులపాడు గ్రామాభివృద్ధికి మల్లేశం గారు ఇతోధికంగా సేవలందించారు. ఆయన దేవాదాయధర్మాదాయ శాఖలో నాలుగు దశాబ్దాలపాటు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా పనిచేసినప్పటికీ, నిత్యం శివపూజలు చేస్తున్నప్పటికీ వారి మనసులో అన్యమతాల పట్ల ద్వేషభావం ఉండేది కాదు. అందుకే గ్రామంలో చర్చిల నిర్మాణం సమయంలో వీరు విరాళం ఇచ్చారు. ఆయన లింగైక్యం చెంది దశాబ్దం దాటినా అనేక మంది గుండెల్లో ఆయన ఇప్పటికీ నిలిచే ఉన్నారు.
నిరుద్యోగలపాలిట `దేవుడు'
దేవాలయాల్లో కానుకలను హుండీలోనే వేయాలనీ, అప్పుడే అవి దేవాలయ అభివృద్ధికి దోహదకారి అవుతాయని అంటుండేవారు. హారతి పళ్లెంలో వేస్తే అవి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే చెందుతాయనీ చెప్పేవారు. అనేక దేవాలయాల్లో పేదరికంతో బాధపడుతున్న అర్చక కుటుంబాలవారికి ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే ఇతర కులాలవారికి కూడా తనకు చేతనైన పరిథిలో ఉద్యోగాలు ఇప్పించేవారు.
![]() |
| పుణ్యదంపతులు |
మాట కటువు, మనసు వెన్న
ఎవరైనా వచ్చి, నా పరిస్థితి బాగోలేదు, సాయం చేయమని అడిగితే చాలు, తన జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చేవారు. వ్యక్తి స్వార్థం, కుటుంబ స్వార్థం కంటే, సమాజహితమే గొప్పదని చెబుతుండేవారు. మాట కటువుగా ఉన్నా, మనసు వెన్నపూస. కొంతమంది ఆయన మాటతీరుతో ఆయనది పాషాణ హృదయమనీ, ఆయనలో ప్రేమానురాగాలు లేవని అనుకునేవారు. కానీ అది నిజం కాదు. ప్రేమను వ్యక్తీకరించినమాత్రానే వారిలో ప్రేమ పొంగుతుందని అనుకోవడం భ్రమ. ఆ భ్రమ ముసుగులు తొలిగించి చూస్తే, హృదయంలోపల నిండుగా ఉన్న ప్రేమ సాక్షాత్కరిస్తుంది.
ధర్మమూర్తి
న్యాయం, ధర్మం ఆయనకు ఆరో ప్రాణం. అధర్మంగా ఎవరు మాట్లాడినా వారికి కోపం చిర్రెత్తుకొచ్చేది. అసలే ముక్కుసూటి మనిషి, ఆపైన నిజాయితీపరులు...అందుకే ఆయనవద్దకు వచ్చి అక్రమాల గురించి మాట్లాడటానికి ఎవ్వరూ సాహసించేవారు కారు. ఓసారి ఫోటో చూడండి. ఆ ముక్కుసూటి తనం మీకే తెలుస్తుంది.
(మా నాన్నగారి గురించిన మరికొన్ని విశేషాలు మరోసారి చెబుతాను)
- తుర్లపాటి నాగభూషణరావు (988 529 2208)


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి