8, మార్చి 2014, శనివారం

రామాలయం పునర్నిర్మాణం

చిన్న ఊరు. ఆ ఊరికి తగ్గట్టుగానే ఓ చిన్ని ఆలయం. అది రాములవారు కొలువైన ఆలయం. ఆంజనేయులవారు అభయం ఇస్తున్న ఆలయం. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలన్న సంకల్పం ఊరి పెద్దలకు కలిగింది. గుడి ఆనుకుని ఒక వైపు ఊరి ప్రధాన రోడ్డు ఉంది. దీంతో అటువైపు విస్తరించే అవకాశం లేదు. దానికి వ్యతిరేక దిశలో ఉన్న ఖాళీ స్థలంలో కొంతభాగాన్ని ఊరి రైతు మల్లయ్య ఆలయం కోసం  ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో ఈఏడాది శ్రీరామనవమి అయిన తర్వాత పునర్నిర్మాణ పనులు చేపడతారు. పనులన్నీ పూర్తయ్యాక ఈ ఫోటోలో మీరు చూస్తున్న రామాలయం కనిపించదు. కొత్త అందాలతో సాక్షాత్కరిస్తుంది.
రామాలయం విస్తరణకు స్థలం ఇచ్చిన రైతుతో తుర్లపాటి నాగ్

    మా ఊరి నడిబొడ్డున ఉన్న ఈ రామాలయానికి వెనుక వైపున మైయిన్ రోడ్డుపైనే ఉత్తర ముఖద్వారంతో మా ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎప్పుడూ సెంచరీ కొట్టేసింది. పడిపోవడానికి సిద్ధంగా ఉంది. మేము చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అడవిరావులపాడు వెళ్ళినప్పుడు మండుటెండలో ఆడుకోవడానికి ఈ రామాలయం మాకో వేదికగా ఉండేది. అక్కడి బండలమీద పచ్చీస్, మేక-పులి ఆటలు ఆడుకోవడానికి గళ్లు గీసి ఉండేవి. ఊర్లోని వాళ్లు అక్కడచేరి ఆటలు ఆడుకునేవారు. ఒక రకంగా చెప్పాలంటే మండువేసవిలో చల్లనినీడ ఇస్తుండేది ఈ రామాలయం. చల్లని పాలనకు సంకేతంగా నిల్చిన రామాలయం ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఆ శ్రీరాముడు మా ఊరుని చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాను.
                                                                                         - తుర్లపాటి నాగభూషణరావు - 988 529 2208

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి