తుర్లపాటి ఆలోచన సుగంధం
(తెలివితేటలు మసకబారితే ఏం చేయాలి?)
హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్
“కాకుల రొదలో కోకిల పాట”. ఈ టాపిక్ ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. ఈ సమాజం చిత్రమైనది. కాలం ఎంత మారుతున్నా, దశాబ్దాలు , శతాబ్దాలు దొర్లుతున్నా మనిషి నైజం మారడం లేదు. ఆ వివరాలు చెప్పే ముందు..
“మతి తప్పిన కాకుల రొద “ గురించి మాట్లాడుకుందాం.
ఒక అడవిలో చాలా కాలంగా పెద్ద వృక్షం మీద ఒక కాకుల మంద నివసిస్తున్నది. అదే అడవిలో చాలా చక్కగా పాడే కోకిలలు కూడా ఉన్నాయి. అందులో ఒక కోకిల పాడటంలో చాలా ప్రావీణ్యం సంపాదించింది. అయితే అనుకోకుండా అది కాకుల మంద ఉన్న చోటుకు వెళ్ళాల్సి వచ్చింది. అసలే కాకులు, ఆ పైన వాటి మతి చెడింది. ఇక వాటి రొద చెప్పనలవి కాకుండా ఉంది. అంతలో వసంత ఋతువు వచ్చింది. కొత్త ఆకులతో చెట్లు కళకళలాడిపోతున్నాయి. ఆ చిగుళ్లు తిన్న కోకిల చక్కగా పాడుతోంది. అయితే కాకులు ఆ పాటను చెవికెక్కించుకోవడం లేదు. పైగా కోకిలను ఎగతాళి చేస్తూ ఎడిపించసాగాయి. మతి తప్పిన కాకుల రొదలో మౌనమే మెరుగు అనుకున్నది కోకిల.
Among the Fools a wise one always be wrong అని అంటారు కదా. కోకిల పరిస్థితి అదే అయింది. సొసైటీలో ఇలాంటి కాకుల మందలు మనకు తారసపడుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి మందలకు భయపడి కోకిలలా మౌనంగా ఉండటమా లేక ఎదిరించడమా?? ఆలోచించండి. పాడటం మనేయకూడదు. ఇదే సరైన నిర్ణయం. ఆ మంద నుంచి వీలైనంత త్వరగా తప్పుకుని తన తెలివికి మరింత మెరుగు పెట్టాలి. ఈ కష్టకాలం ఎక్కువ కాలం ఉండదన్న స్పృహతో తన పని తాను చేసుకుంటూ పోవాలి.
చరిత్ర చెప్పిన సత్యాలు
మానవ ఆవిష్కరణ ల చరిత్ర తిరగేస్తే ఈ సత్యమే కనబడుతుంది.
ఈ మధ్య నేను సోషల్ మీడియాలో ఒక ఫొటో చూశాను. ఆ చిత్రంలోని విషయం గురించి కాస్తంత వివరంగా చెబుతాను. అది తప్పు చేసిన వారిని కఠినంగా ఉరి శిక్ష విధించే స్థలం. ఉరి శిక్ష అమలు చేయడం కోసం “ఎలక్ట్రిక్ బల్బు తల” గాడిని ఉరి తీయడానికి “కొవ్వొత్తి తలల ముఠా” లాక్కుని వెళుతుంటుంది. ఇది కేవలం చిత్రమే అయినా చరిత్రలో జరిగిన ఎన్నో విషాద సంఘటనలకు ప్రతీకగా నిలిచింది. ఎలక్ట్రిక్ బల్బు తల వాడంటే ఎలక్ట్రిక్ బల్బు ని ఆవిష్కరించిన వాడన్న మాట. ఇక కొవ్వొత్తి తలల వాళ్ళంతా కొత్తని స్వాగతించక పాత పద్ధతినే పట్టుకుని వ్రేలాడే వారు. వీరంతా మతి తప్పిన కాకుల్లా ప్రవర్తిస్తూ సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణ చేసిన వ్యక్తిపైనే నేరారోపణ చేశారు.
ఎలక్ట్రిక్ బల్బు తయారుచేసినప్పుడు అప్పటి వరకు వెలుగు కోసం కొవ్వొత్తులు వాడే వారికి తెగ కోపం వచ్చింది. అంతే స్థాయిలో భయం కూడా కమ్మేసింది. వారిలో చాలా మంది తిరుగుబాటు చేశారు. ఈ శాస్త్రీయ ఆవిష్కరణ వల్ల మానవ జాతికి ముప్పు తప్పదంటూ ఘాటుగా వ్యతిరేకించారు. ఎలక్ట్రిక్ బల్బు తాయారు చేయడానికి ప్రయత్నించే వారిపై అభియోగాలు మోపారనీ, వారిని శిక్షించేదాకా వదిలిపెట్ట కూడదని అర్థం వచ్చేలా ఈ చిత్రం ఉంది.
వేలసార్లు విఫలమైనా..
థామస్ ఎడిసన్ కి గానీ, హంప్రీ డేవ్, జోసెఫ్ విల్సన్ వంటి వారికి గానీ బహుశా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. అలా అని వారు తమ ప్రయోగాలు నిలిపివేసి ఉంటే ఈరోజున విద్యుత్ బల్బుల వినియోగం ఇంతగా పెరిగేదేనా? ఆలోచించండి. ఎవరు ఎంతగా ఈసడించుకున్నా ఎడిసన్ తన ప్రయోగాలు మానలేదు. తాను అనుకున్న లక్ష్యానికి చేరే లోపు ఎడిసన్ కొన్ని వేల సార్లు విఫలమయ్యారు. ప్రతి వైఫల్యాన్ని మెట్టుగా మలుచుకుని విజయ శిఖరం చేరుకున్నాడు. విఫలమైనప్పుడల్లా సమాజం నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాడు. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినా తన శక్తి మీద, విజ్ఞానం మీద నమ్మకం ఉంచి ఎడిసన్ చివరకు విజయం సాధించాడు. అప్పటి వరకు ఎగతాళి చేసిన వారే , ఎడిసన్ ఆవిష్కరణలను స్వాగతించారు.
సూటిపోటి మాటలు
మనం ఉండే సమాజపు పోకడ గురించి క్షుణ్నంగా తెలుసుకుంటే ఎంచుకున్న బాటలో మన నడక సజావుగా సాగుతుంది. అలా కాని పక్షంలో మతి తప్పిన కాకుల రొదలోనే మన ప్రయాణం సాగించాల్సి వస్తుంది. రాత్రికి రాత్రి సమాజాన్ని మార్చలేము. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న సమాజం క్షేమం కోసమే ఒక పని లేదా ఆవిష్కరణ సాగించినా దాన్ని వెంటనే సమాజం హర్షించదు. పైగా సూటి పోటి మాటలతో మనల్ని వెనక్కి తోస్తుంటుంది. పిచ్చి వాడని ముద్రవేస్తుంది.
కాకుల గోల చేస్తున్నా పట్టించుకోకుండా తన పనిని చక్కబెట్టుకోవడం చాలా కష్టమైన విషయం. కాకిగోల చేసే వారంతా ఒకటై “మా వాదనే కరెక్టు, నీ పోకడే తప్పు “ అని తీర్మానించేసుకుని మనల్ని తప్పుబడుతుంటారు. ఇలా గోల చేసే వారిలో మన స్నేహితులు ఉండవచ్చు. అలాగే మన బంధువులూ ఉండవచ్చు. వీళ్లు మారరు. మనల్ని మారనీయరు. చేతులకీ కాళ్లకు మాటలతో సంకెళ్లు వేస్తుంటారు. ఇలాంటి వాళ్ల ఆలోచనలు తప్పని తెలిసినా మనం వారి నుంచి దూరంగా పారిపోలేము. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఒక భాగం. తప్పు వారిదే అయినా ఒప్పుకోరు. అడ్డంగా వాదిస్తుంటారు. ఇలాంటి కాకులు ఏకమై మనల్ని శిక్షించాలనుకుంటారు. కట్టుబాట్లతో వేధింపులకు గురిచేస్తారు.
వేధింపులు - చాంధస భావాలు:
అత్తగారి వేధింపులతో కోడలికి ఉన్న పాజిటీవ్ ఆలోచనలు అధఃపాతాళానికి వెళ్ళిపోతుండటం అక్కడక్కడా మనం చూస్తూనే ఉన్నాం.
అమ్మానాన్నల చాంధస భావాల వల్ల పిల్లల ఎదుగుదల కుంటుపడవచ్చు. అలాగే స్నేహితుల నెగెటీవ్ థాట్స్ వల్ల మనలోని పాజిటివీ థింకింగ్ మసకబారిపోవచ్చు.
అందుకే అంటారు, నీ చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులను బట్టి నీ పోకడలను అర్థం చేసుకోవచ్చు. నీలోని మంచి ఆలోచనలు మసకబారే దాకా ఈ నెగెటీవ్ గ్రూప్ ఊరుకోదు. అనేక ఒత్తిళ్లకు గురిచేస్తుంటుంది.
కానీ ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ నిలబడి , అవమానాలు ఎన్ని ఎదురైనా ప్రయత్నం మానకుండా చివరకు విజయ శిఖరానికి చేరుకున్న వారు ఎందరో ఉన్నారు. వారినే మనం ఆదర్శంగా తీసుకోవాలి.
సుశృతుడు:
ఇక్కడ నేను భారతీయ వైద్యరంగం నిపుణుడైన సుశృతుడు గురించి ఆయన ఆవిష్కరణల గురించి గుర్తుచేస్తాను. ఆరవ శతాబ్దానికి చెందిన సుశృతుడు వైద్య రంగంలో విశిష్ట సేవలందించారు. మన దేశంలో ఆ రోజుల్లోనే ప్లాస్టిక్ సర్జరీ చేసిన మేధావి. ఒక సారి సైనికుడొకడు ముఖానికి అయిన గాయాలతో సుశృతుడి ఆశ్రమం దగ్గరకు వస్తే అతనికి శస్త్ర చికిత్స చేశాడాయన. ముక్కు చితికిపోతే నుదుటి మీద ఉన్న చర్మం తీసి ముక్కుకి అతికించాడు. దీన్నే మనం ఈనాడు “రినో ప్లాస్టీ “ అంటున్నాము. ఒక చోట ఉన్న చర్మం తో మరో చోటకు గ్రాఫ్టింగ్ చేసే ప్రక్రియను ఆనాడే చేసి చూపించిన అద్భుత సర్జన్ సుశృతుడు. ఆ రోజుల్లో ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు వికటించినప్పుడల్లా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయినా వెనుకడుగు వేయకుండా విమర్శించిన సమాజమే హర్షించే స్థాయికి ఎదిగాడు.
కోపర్నికస్:
ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేసిన కోపర్నికస్ అనే శాస్త్రవేత్త “హీలియో సెంట్రిక్ మోడల్ “ని ప్రతిపాదించినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. అప్పటి వరకు భూమి చుట్టూనే సూర్యుడు తిరుగుతుంటాడన్న పాత వాదనను విడిచిపెట్టి కోపర్నికస్ వాదనను అంగీకరించడానికి చాలారోజులే పట్టింది. మరో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో విషయంలోనూ అదే జరిగింది.
అంతాదాకా ఎందుకు అహింసావాదంతోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని మహాత్మా గాంధి అన్నప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. హింసకు హింసే సమాధానం అని రెచ్చగొట్టారు. కానీ చివరకు మన దేశానికి శాంతి, అహింసలే స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చాయి .
ఈ సందర్భంగా చాణిక్యుని గురించి ప్రస్తావిస్తాను.
రాజుని మార్చిన చాణక్యుడు:
చాణక్యుడు మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తి చంద్రగుప్తుని కి సలహాదారునిగా ఉండేవారు. ఆయన మహా మేధావి. రాజసభలో చుట్టూ చేరిన వందిమాగధులు చక్రవర్తిని అదేపనిగా పొగుడుతుండటంతో అహంకార మత్తు తలకెక్కిన చంద్రగుప్తుడు రాజసభలో ఒక ప్రకటన చేశారు. అదేమంటే, ఈ భూమి మీద తానే తెలివిగల రాజుననీ తనకు సాటి మరెవరూ లేరని ప్రకటించారు. అది తెలుసుకున్న చాణక్యుడు రాజుకు బుద్ధి చెప్పాలని వ్యూహం పన్నాడు. రాజు వెళుతున్న దారిలో అడ్డుగా పెద్ద బండరాయి ఉంచాడు. రాజు ఆ బాటలో వెళుతూ రాయిని చూసి ఆగిపోయాడు. “ఆ రాయిని తొలగించండి “ అంటూ భటులను ఆజ్ఞాపించాడు. అప్పుడు అక్కడకు చేరిన చాణక్యుడు రాజుతో...”రాజా భటులకు చెప్పడం ఎందుకు, మీరు చక్రవర్తి కదా..ఆ రాయినే మీరు ఆజ్ఞాపించండి. భయపడి అదే తొలిగిపోతుంది” - అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి “అదెలా సాధ్యం , రాయి ఎక్కడైనా కదలమంటే కదులుతుందా ?!“ అని ప్రశ్నించాడు. అప్పుడు చాణక్యుడు ఇలా అన్నాడు... “రాజా , రాయి లాగానే మీ ఆలోచనలకు తగ్గట్లుగా తమరు ఇచ్చే ఆజ్ఞలు పాటించే పరిథి ఈ లోకంలో చాలా స్వల్పం. రాజన్న వాడు మూర్ఖంగా ఆలోచించకూడదు. తమకున్న పరిథి తెలుసుకుని మెలగాలి” అని వివరించాడు. రాజుకు జ్ఞానోదయం అయింది. తనలోని ఛాందస భావాలకు స్వస్తి చెప్పాడు. ఫలితంగా మెరుగైన ఆలోచనలు, ఆవిష్కరణలతో రాజ్యం విరాజిల్లింది.
ఏప్రిల్ ఫూల్స్ :
“ఏప్రిల్ ఫూల్ “ అంటూ ఏప్రిల్ ఫస్ట్ నాడు - పొరపాటుబడిన వారిని ఫూల్స్ జాబితాలో చేర్చేసి ఆట పట్టించడం మనం చూస్తూనే ఉన్నాము. చరిత్ర తిరగేస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. జనవరి ఫస్ట్ ని నూతన సంవత్సర ఆరంభంగా భావించే పద్ధతి రాకముందు పురాతన రోమ్ లోనూ, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఏప్రిల్ 1వ తేదీని నూతన సంవత్సరాదిగా భావించేవారు. అయితే జనవరి 1న న్యూయిర్ డేగా చేసుకునే గ్రెగోరియన్ పద్ధతి వచ్చి జనంలో బాగా నాటుకుపోయినప్పటికీ అక్కడక్కడా కొంత మంది పాత పద్ధతిలోనే అంటే ఏప్రిల్ 1నాడే న్యూయర్ డే జరుపుకునే వారు. అలా జరుపుకునే వారిని “ఏప్రిల్ ఫూల్స్ “ అంటూ ఆటపట్టించడం అప్పుడే మొదలైంది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.
జనమంతా ఎటు ఉంటే మనమూ అటే ఉండాలా..లేక ఎవరేమనుకున్నా మన దారి మనదే అన్నట్లు ఉండాలా ?అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తలెత్తే సమస్య. దీనికి సరైన సమాధానం ఏమిటంటే, మన ఆలోచన సమాజానికి మేలు జరిగేదని పూర్తిగా విశ్వసించే పక్షంలో మిగతా వారి పోకడలను చూసి మనం భయపడకూడదు. మన విశ్వాసాన్ని , నమ్మకాన్ని చేతులారా నాశనం చేయకూడదు.
కొన్ని కుటుంబాలను నేను చూశాను. వారు ఎవ్వరినీ ఫాలో అవరు. ఆధ్యాత్మిక సంప్రదాయాల విషయం లో కానీయ్యండి, లేదా ఆచారాల పట్టింపు విషయంలో కానీ వారు ఇతరులను ఫాలో అవ్వరు. తమకు ఎది మంచిదని భావిస్తే దాన్నే ఆచరిస్తుంటారు. సొసైటీ పరంగా వీరు ఆడ్ గా బిహేవ్ చేస్తున్నట్లు లెక్క. కానీ వారి ఆలోచనలు సరైన కోణంలో ఉంటే మిగతా వారిని పట్టించుకోనక్కర్లేదు. “నీదారి నీదే సాగిపోరా..” అంటూ పోతుండాల్సిందే. కాకుల మందలో కోకిలలాగా ...తెల్ల గొఱ్ఱెల మందలో నల్ల గొఱ్ఱె లాగా ధైర్యంగా సాగిపోవాలి. సమాజం ఇవ్వాళ కాకపోతే రేపు నిన్ను గుర్తిస్తుంది. అంతిమ విజయం నీ సొంతం అవుతుంది.
- తుర్లపాటి నాగభూషణ రావు
(వ్యాస రచయిత మోటివేషనల్ స్పీకర్ మరియు సీనియర్ జర్నలిస్ట్)
ఫోన్ నెంబర్ : 9885292208
(WhatsApp)


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి