రచన : తుర్లపాటి నాగభూషణ రావు
———————
హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను “పిల్లల్లో అల్లరి - సృజనాత్మక తరంగాలు “ అన్న అంశం మీద కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పిల్లల ఆలనా పాలనా చూస్తున్న వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ప్రస్తావిస్తున్నాను.
ఆ మధ్య నేను మా స్నేహితుని అబ్బాయి వాళ్లింటికి వెళ్ళాను. దంపతులిద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉండటంతో పెళ్ళైన ఐదారేళ్ల లోనే లంకంత ఇల్లు కొనేశాడు. అంకుల్ మీరు తప్పకుండా గృహప్రవేశానికి రావాలంటూ బలవంతపెట్టాడు. ఫంక్షన్ కి వెళ్ళడం కుదుర లేదు. ఆ తర్వాత వీలు చూసుకుని నేనూ మా ఆవిడ ఆ అబ్బాయి వాళ్లింటికి వెళ్ళాము. ఈ దంపతులకు ఓ చిన్న బాబు ఉన్నాడని తెలిసి వాడి కోసం ఓ రెండు బొమ్మలు, చాక్లెట్లు తీసుకువెళ్ళాము. సరే, మేము వెళ్ళేటప్పటికే దంపతులిద్దరూ పిల్లవాడ్ని అరుస్తున్నారు. వాడేమో బిక్కుబిక్కుమంటూ ఓ మూలన కూర్చున్నాడు. మమ్మల్ని చూడగానే దంపతులు అరవడం ఆపేసి, రాని నవ్వుని ముఖం మీద పులుముకుని - “రండి అంకుల్ ..రండి..”అంటూ ఆహ్వానించారు. కానీ, వారి కళ్ళలో కోపం తగ్గలేదు. పిల్లవాడేమో బెదిరిపోతున్నాడు. ఇల్లంతా తేరపారా చూశాను. హాల్లో ఆటవస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. గోడల మీద రకరకాల రంగుల్లో వంకర టింకర గీతలు, రకరకాల విచిత్ర ఆకారాల్లో బొమ్మలు గీసి ఉన్నాయి. అప్పుడర్థమైంది. పిల్లవాడు కొత్త ఇంటి గోడలను పాడుచేశాడనే తల్లిదండ్రులు ఒకటై వాడ్ని అరుస్తున్నారని.
మనలో చాలా మంది ఇలాంటి సంఘటనలను చూసే ఉంటాము. ఇక్కడ ఒక సున్నితమైన విషయం ఆలోచించాలి. తల్లిదండ్రులేమో గోడ పాడైపోతుందనో లేదా ఇళ్లంతా చిందరవందర అయిపోయిందనో కంగారు పడిపోతుంటారు. సోపాలో పిల్లవాడు కూర్చుని ఆడుకుంటుంటే వాడి పై బోలెడు ఆంక్షలు పెడతారు. గోడలు పాడు చేస్తున్నాడని ఒక సారి, సోపా పాడైపోతుందని ఇంకో సారి, రకరకాల రంగు ద్రావకాలు నేలమీద పోసి ఫ్లోర్ పాడుచేస్తున్నాడని మరో సారి...ఇలా పిల్లలను అరిచే తల్లిదండ్రులను చూస్తూనే ఉంటాము.
అల్లరి కాదు..
నిజమే, ఇదంతా చూస్తుంటే పిల్లలు చేసే పనులు “అల్లరి చేష్టలు” గానే అనిపించవచ్చు. ఇక్కడ మనం ఓ విషయం గమనించాలి. అదేమంటే, ఇలా పిల్లలను అరుస్తూ పోతుంటే వారిలోని సృజనాత్మకతకు మనమే చేతులారా అడ్డుకట్ట వేసిన వారమవుతామన్న సంగతిని గమనించాల్సిందే. ఫూలిష్ గా కనిపించే పిల్ల చేష్టల్లో ఎంతో సృజనాత్మకత (క్రియేటివిటీ) ఉన్నదన్న సంగతి తరచి చూస్తేనే కాని అర్థం కాదు. అలా అని గోడలు, నేల పాడుచేసే పిల్లలను ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు. వారి ఆలోచనలకు తగ్గ వాతావరణం ఇంట్లో మనం కల్పిస్తున్నామా అన్నది ఆలోచించాలి. నాలుగైదు గదులున్న ఇంట్లో వారు స్వేచ్ఛగా తిరగడానికీ, వారనుకున్న ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి కనీసం..కనీసం ఒక్క గదన్నా ఇస్తున్నామా ? అని ఆలోచించాలి కదా. ఒక వేళ ఇచ్చినా అది కూడా మిగతా గదుల్లాగా అతి శుభ్రంగా ఉండాలనుకోవడం, ఇంటిని నీట్ గా ఉంచేలా పిల్లలు కూడా బిహేవ్ చేయాలనుకోవడం తల్లిదండ్రుల్లో చాలా మంది అనుకునేదే. మీకో విషయం తెలుసా? దాదాపు 60 శాతం మంది పిల్లల్లో క్రియేటివిటీ తగ్గిపోతున్నదని ఓ సర్వే చెప్పిన వాస్తవం.
సృజనాత్మకతకు ఉన్న ప్రాధాన్యత తల్లిదండ్రులు గమనించాలి. ఇక్కడే చాలా మంది పప్పులో కాలేస్తున్నారు. మనం తప్పు చేస్తూ ఆ తర్వాత మా వాడు సరిగా ఎదగడం లేదంటూ వాపోవడం ఏ మాత్రం సబబు చెప్పండి ?
అల్లరి నుంచి ఆవిష్కరణలు:
క్రియేటివిటీ నుంచే ఎన్నో ఆవిష్కరణలు వెలుగు చూశాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. అంతే కాదు, క్రియేటివిటీ వల్ల సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుంది. నైపుణ్యత పెరుగుతుంది. మరి వీటన్నింటినీ మొగ్గ దశలోనే త్రుంచి వేసే అధికారం ఈ పెద్దలకు ఎవరు ఇచ్చారు ?
మన దేశంలో ఎంతో మంది శాస్త్రవేత్తల ఆవిష్కరణల వెనుక ఉండే ఆలోచనల మూలాలు చిన్నతనంలో మొలకెత్తినవే. ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త ఆర్యభట్ట గురించి వినే ఉంటారు కదా. ఆయన తన చిన్నతనంలో సూర్య చంద్రాది ఖగోళ వింతల పట్ల ప్రభావితులై . బంక మట్టితో ఉండలు చేసి వాటినే గ్రహాలుగా భావించి తోటి స్నేహితులతో ఆడుకునే వారట. క్రీస్తుశకం 476 నుంచి 550 వరకు జీవించి ఉన్న ఆర్యభట్ట గణిత మేధావిగా, ఖగోళ శాస్త్రవేత్తగా ఎదగడానికి బీజాలు చిన్నతనంలో పడినవే.
“ఫ్లిప్ కార్ట్ “ పేరిట పాపులరైన ఇ- కామర్స్ వేదిక వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదిగాడంటే ఆయన తల్లిదండ్రులు చిన్నతనం నుంచి ఇచ్చిన ప్రోత్సాహమే కారణం.
పిల్లలు చేసే ప్రతి పనినీ అల్లరి క్రింద జమకట్ట కూడదు. వారిలోని ఆలోచనా తరంగాల పోకడను పసిగట్టాలి. అవి పాజిటీవ్ గా ఉంటే ప్రోత్సహించాలి. ఒక వేళ నెగిటీవ్ గా ఉంటే నేర్పుగా పిల్లల్లో మార్పు తీసుకురావడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి.
రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచన:
మన దేశపు ప్రముఖ సాహితీ వేత్త రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ, `నీ ఆలోచనలకు తగ్గట్టుగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని ఎప్పుడూ కలలు కనకండి. ఎందుకంటే వారు మీ ముందు తరం కాలానికి చెందిన వారు. ఈ విషయం గమనించండి' అని అనేవారట.
పిల్లల్లోని భావతరంగాలను అర్థం చేసుకుంటూ వారి ఎదుగదలకు సంబంధించి ప్రతి రోజూ కొంత టైమ్ కేటాయించాలి. అందుకు తగ్గ వాతావరణం ఇంట్లో కల్పించాలి. చక్కటి వాతావరణంలో విద్య నేర్పే స్కూల్స్ లో చేర్పించాలి. పిల్లల ఎదుట పాజిటీవ్ అంశాల గురించే ఎక్కువగా మాట్లాడుతుండాలి. వారి భవిష్య ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని అవసరమైనప్పుడు తల్లిదండ్రులు కూడా మారాలి.
అబ్దుల్ కలాం :
ఈ సందర్భంగా శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం గారి మాటలు గుర్తుచేసుకుందాం..
`మానవాళి భవిష్య విజయాలకు నేటి పిల్లల్లోని సృజనాత్మకతే కీలకమైనది. ఈ విషయాన్ని గుర్తించి తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి'
అల్లరోడు :
“పిల్ల చేష్టలు”, “అల్లరి” - వంటి పదాలను ప్రయోగించేటప్పుడు కాస్తంత ఆలోచించండి. నిజంగా మీ పిల్లలు చేసేది అల్లరేనా? అవి పిల్లచేష్టలేనా?
ఒక సారి మీ పిల్లవాడిని `అల్లరోడు' అని మీరే ముద్ర వేసేస్తే ఎలా చెప్పండి ! అప్పుడేమవుతుంది..భవిష్యత్తులో వాడు నిజంగానే అల్లరోడి గానే సమాజంలో గుర్తించబడతాడు. వాడిలోని పాజిటివ్ క్రియేటివిటీ క్షీణిస్తుంది. దీని వల్ల కేవలం మీ కుటుంబానికే కాదు, ఒక్కోసారి దేశానికి కూడా మీరు నష్టం కలిగించిన వారవుతారు.
పిల్లలు ఊహాలోకంలో విహరించడం తమ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రవర్తించడం తప్పు కాదు. ఈ విషయం పెద్దలు గ్రహించాలి.
ప్రముఖ శాస్త్రవేత్త ఐనిస్టీన్ ఇలా అనే వారు...`జ్ఞాన సంపాదన కంటే ఊహించడం, ఆలోచనా శక్తి పెంచుకోవడం గొప్ప “
మీ పిల్లవాడు గోడల మీద గీతలు గీసినా, గోళీలతో ఆడినా, అట్ట పెట్టలను చింపి కొత్త ఆకారాలను సృష్టించాలనుకుంటున్నా ఇవన్నీ అల్లరి పనులు కావు , అవి ఆ పిల్లవాని “భవిష్య లోకానికి బాటలు” అని గ్రహించాలి.
పిల్లవాడు - బురదలో కమలం :
ఒక పిల్లవాడు కొలను దగ్గర ఆడుకుంటూ ఉండగా వాడికో ఆలోచన వచ్చింది. వెంటనే బురద బురదగా ఉన్న కొలనులోకి దిగాడు. వొళ్లంతా బురద అంటింది. వేసుకున్న దుస్తులు పాడైపోయాయి. అయినా అతని ఆలోచన బురద లో నుంచే పుట్టిన కమలం మీదనే ఉంది. నేర్పుగా కమలం చేతికందిపుచ్చుకుని ఇంటికి చేరాడు. పిల్లవాడు బురద పూసుకుని రావడంతో తల్లి మందలించింది. కానీ వాడు అదేమీ పట్టించుకోకుండా కమలం వువ్వును నీటితో కడిగి దాన్ని ఇంట్లోని పూజా మందిరంలో ఉన్న అమ్మవారి పటం దగ్గర ఉంచాడు. ఆ దృశ్యం చూసిన తల్లికి తాను చేసిన తప్పు అర్థమైంది. అప్పటి నుంచి పిల్లవాడిలోని సృజనాత్మకత పెరిగేలా చక్కటి వాతావరణం సృష్టించింది. చివరకు అతను ఓ ప్రముఖ బోటనిస్ట్ గా ఎదిగాడు. సమాజానికి పనికొచ్చే ప్రయోగాలు ఎన్నో చేయగలిగాడు.
పిల్లల పెంపకంలో పెద్దలు గమనించాల్సిన అతి ముఖ్యమైన వాటిలో పిల్లల సృజనాత్మకత కూడా ఒకటి. పిల్ల కోసం అవసరమైతే మారడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి.
- తుర్లపాటి నాగభూషణ రావు
(ఈ వ్యాస రచయిత మోటివేషనల్ స్పీకర్ మరియు సీనియర్ జర్నలిస్ట్)
ఫోన్ నెంబర్: 9885292208



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి