వ్యక్తిత్వ వికాసం ఓ పాఠం :
హాయ్ ఫ్రెండ్స్ , ఈరోజు నేను సమాజంలో థింకర్స్ కీ డూయర్స్ కి మధ్య ఉన్న తేడా గురించి చెబుతున్నాను.
ఈపాటికే మీలో చాలా మంది ఈ రెండు వర్గాల వారినీ చూసే ఉంటారు. లేదా ఈ రెంటిలో మీరు కూడా ఏదో ఒక వర్గానికి చెందిన వారై ఉండవచ్చు.
ఏ పని చేయాలన్నా ఆలోచన ముఖ్యం. సమస్య నుంచి బయటపడాలన్నా నలుగురి మెప్పు పొందాలన్నా ముందు మన ఆలోచన సరైనదిగా ఉండాలి. అయితే ఆలోచన అన్నది - ప్రారంభ సూచిక మాత్రమే. అది ఒక ఇన్సిపిరేషన్ టూల్ లాంటిది. ఆలోచనలను మధించడం వల్ల ఒక కార్యాచరణకు ప్రణాళిక సిద్ధమవుతుంది. దీంతో పనికి బీజం పడుతుంది. అంతే అక్కడితో ఆలోచన కు సంబంధించిన అంకం ముగుస్తుంది.
మరి అక్కడితో ఆగిపోతే ఏమవుతుంది? మనం కేవలం థింకర్స్ గానే మిగిలిపోతాము. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు కర్మ లేదా పని అన్నది అప్పుడు ప్రారంభం కాదు కదా. పని ప్రారంభం కానప్పుడు ఆ దేవుడైనా నిన్ను కాపాడలేడు కదా.
కర్తవ్యం నీ వంతు:
శ్రీకృష్ణ పాండవీయం అనే సినిమాలో ఓ చక్కటి పాట గుర్తుకు మీకు కూడా గుర్తుకు వచ్చే ఉంటుంది.
“మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా” - ఈ పాటలో ఓ చోట... “కర్తవ్యం నీ వంతు. కాపాడుట నా వంతు. చెప్పడమే నా ధర్మం వినకబోతే నీ కర్మం .
భగవద్గీత సారాన్ని కవి చక్కగా రెండు లైన్లలో చెప్పేశాడు .
ఇప్పుడు నేను ఓ కథ చెబుతాను.
అన్నదమ్ముల కథ :
ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో పెద్ద వాడు సోమయ్య, చిన్న వాడు శంకరయ్య. వాళ్ల నాన్న పోతూపోతూ ఇద్దరికీ సమానమైన స్థలాలు ఇచ్చాడు. అందులో హాయిగా ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉండమని చివరి మాటగా చెప్పాడు. సరే, పెద్ద వాడు సోమయ్య బుర్ర అమోఘం. ఆలోచించడంలో దిట్ట. ఈ విషయంలో ఊర్లో గొప్ప పేరే గడించాడు. తన ఆలోచనలను రచ్చబండ మీద గంటల కొద్దీ చెప్పినా గుమి గూడిన జనం జారుకునే వారు కాదు. “ఇంకా చెప్పండి..” అంటూ సంతోషంగా తలలు ఊపేవారు.
ఇక రెండో వాడు శంకరయ్య. ఇతగాడికి తన అన్నలా మాట్లాడే శక్తి అబ్బలేదు. మాటలతో అందర్నీ ఆకర్షించే శక్తి లేకపోవడంతో ఊర్లో వాళ్లు ఇతగాడిని పెద్దగా పట్టించుకునేవారు కారు. అయితే శంకరయ్యలో ఓ గుణం ఉంది. అదేమంటే, తన స్థాయికి తగ్గట్టుగా, స్తోమతకు తగ్గట్టుగా చక్కటి ఆలోచనలు చేసి, వాటిని కార్యాచరణలో పెట్టేవాడు. శంకరయ్య భార్య పార్వతమ్మ కూడా భర్తకు సహకరించేది. ఉన్నదాంతో వీరి కుటుంబం సంతోషంగా ఉండేది. సరే, తండ్రి ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుందామని భర్తకు చెప్పడంతో స్తోమతకు తగ్గట్టుగా తనకు లభించిన స్థలంలో శంకరయ్య చక్కటి పూరి గుడిసె వేసుకున్నాడు. “పొత్తు కుదిరితే పూరి పాకైన చాలు “ అన్న సినిమా పాటలో లాగా పార్వతమ్మ నిత్యం గౌరమ్మ తల్లిని పూజిస్తూ సంతోషంగా ఉంది.
ఇక అన్న సోమయ్య సంగతి చూద్దాం.సోమయ్య మంచి ఆలోచనాపరుడని ఊర్లో పేరుంది కదా. దీంతో ఇతగాడు తనకు అందిన స్థలంలో ఊరంతా మెచ్చుకునేలా ఇల్లు కట్టుకుంటాడని జనం అనుకున్నారు. అనుకోవడమేమిటీ, ఆ మాట సోమయ్యే రచ్చబండ దగ్గర పదేపదే చెప్పేవాడు.
“నా స్థలంలో పెద్ద భవంతి లేపుతాను. రాజ్ మహల్ లా ఉంటుందనుకో...” ఇలా బోలెడు కబుర్లు చెప్పాడు. ఇతగాడి వాక్ చాతుర్యానికీ, ఆలోచనా విధానికి జనం మెచ్చుకున్నారు.
కానీ, ఏళ్లు గడుస్తున్నా సోమయ్య ఇల్లు కట్టలేదు. శంకుస్థాపన మాత్రం చేసి ఊరుకున్నాడు. ప్లాన్ కాగితాలు మాత్రం ఇంట్లో దొంతరుగా అటక కూడా ఎక్కేసింది.
ధింకర్ : సగం దూరం నడిచిన బాటసారి:
ఈ కథలో లాగానే కొంత మంది తమ స్థాయికి మించి ఆలోచనలు చేసి, అవి తీరక చివరకు నిరాశ చెందుతుంటారు. అందుకే ఆలోచన చేసేటప్పుడే కార్యాచరణలో వచ్చే ఇబ్బందులను కూడా ఊహించి ప్లాన్ తయారు చేయాలి.
థింకర్స్ పరిధి ఊహాశక్తికి సంబంధించినది. ఆ తర్వాత పని యొక్క పరిధి ప్రారంభమవుతుంది.
ఆలోచనతో ఆగిపోయేవారు కలల ప్రపంచంలో కాలం వెల్లబుచ్చుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది...?
థింకర్ అన్న వాడు ఎలాంటి వాడంటే...సగం దూరం మాత్రమే ప్రయాణం సాగించిన వాడు. ఇంకా సగం ప్రయాణం (పని) మిగిలే ఉంది. అదే డూయర్ సగంలో ఆగిపోడు- సరైన ఆలోచనే చేయగానే దాన్ని విశ్లేషించుకుంటాడు.
తన ఆలోచనలను అమలు పరుస్తాడు. అందుకు శ్రమిస్తాడు. రేపు అన్న మాట రాకుండా ఏ రోజు పని ఆరోజు పూర్తి చేస్తాడు. కష్టం విలువ రాబడతాడు. దీంతో అనుకున్న సమయానికి పని యొక్క ఫలితాన్ని చక్కగా అందుకుంటాడు.
ఇక్కడ భగవద్గీత లోని మరో అంశం గుర్తుచేసుకోవాలి. కర్మలు లేదా పనులు చేసినంత మాత్రాన సానుకూల ఫలితం వస్తుందని అనుకోకూడదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అంటాడు... “కర్మల అందే నీకు అధికారము కలదు, లేదు కర్మ ఫలములందు “ అని.
ఈ టాపిక్ గురించి నేను కొంత మంది వ్యక్తులు వారి ఆలోచనలు, పనుల విషయం గురించి చెబుతాను.
జెఆర్ డి టాటా :
ముందుగా J.R.D. Tata గారిని తీసుకుందాం. ఆయన అతి గొప్ప ఆలోచనా పరులు. అంతే స్థాయిలో పనులు చక్కబెట్టగలిగిన ధీరుడు. భారతదేశపు విమానరంగంలో ఆధ్యుడు, పితామహుడు.
కిరణ్ మజుందార్ షా:
సరే మరో మహనీయుడు Kiran Mazumdar-Shaw వీరు భారత బయోటెక్నాలజీ రంగంలో ఆద్యులు. అంతర్జాతీయ బయో ఫార్మసిటికల్ రంగంలో పేరు గడించిన వ్యక్తి. తన ఆలోచనలను కార్యరూపంలో పెట్టడంలో దిట్ట.
రతన్ టాటా :
ఇక రతన్ టాటా గురించి మనలో చాలా మందికి తెలుసు కదా. దిగువ మధ్యతరగతి కుటుంబాల వారి వాహన కష్టాలు చూసి నానో కారుని తీసుకువచ్చిన మహానుభావుడు.
ఇక ప్రపంచ స్థాయిలో అనేక మంది తమ పనులతో పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతానికి రెండు మూడు పేర్లు ప్రస్తావిస్తాను.
ఎలన్ మస్క్ :
ఎలన్ మస్క్. ఈయన పారిశ్రామిక వేత్త. ఈయన పేరు చెప్పగానే “స్పేస్ ఎక్స్” గుర్తుకు వచ్చే ఉంటుంది. 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ మరో వ్యోమగామిని సురక్షితంగా భూమికి దింపే రెస్క్యూ ఆపరేషన్ లో ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ సాయపడింది. మస్క్, ఎలక్ట్రానికి కార్లు, సోలార్ సిటీ ...ఇలా వినూత్న ఆలోచనలతో దూరదృష్టితో మస్క్ సాగిపోతున్నాడు.
మలాలా :
Malala Yousafzai (మాలాలా యూసఫ్ జాయ్) ప్రతి ఆడ బిడ్డకు విద్యనభ్యసించే హక్కు కోసం పోరాటం చేసి నొబెల్ శాంతి బహుమతి అందుకున్న ధీర మహిళ. ఆమె పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో పుట్టారు. తాలిబాన్లు ఈ లోయను స్వాధీనం చేసుకుని బాలికల పాఠశాలను తగులబెట్టారు. ప్రతి ఆడబిడ్డకూ విద్యను అభ్యసించే హక్కు కోసం ఆమె అప్పటి నుంచి పోరాటం సలిపారు. ఆమెకు యావత్ ప్రపంచం అండగా నిలిచింది. ఉగ్రవాదుల అరాచకాలపై తీవ్ర స్థాయిలో గళమెత్తి పోరాటం చేసిన ధీర వనిత.
బిల్ గేట్ :
ఈ క్రమంలో మైక్రో సాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్ పేరుని కూడా ప్రస్తావించాలి.
ఆయన కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపకులే కాదు, దానశీలి, ప్రపంచ దేశాల వారంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన వ్యక్తి. అంతే కాదు, మారుమూల ప్రాంతాల వారు కూడా విద్య నేర్చుకునే సదుపాయాల కోసం పాటుపడుతున్న వ్యక్తి.
వీరందరూ ఈ స్థాయికి ఎదగడానికి ప్రధానమైనది వారి ఆలోచనా విధానమే. అయితే కేవలం ఆలోచనతో ఆగిపోకుండా కార్యోన్ముఖులై అఖండ విజయాలను అందకున్నారు.
చక్కటి ఆలోచన - సరైన పనితీరు ఉంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సమాజం హర్షించే స్థాయికి ఎదుగుతారు. ఈ సానుకూల దృక్పథం ఆలవాటు మనమంతా అలవాటు చేసుకుందాం.
-తుర్లపాటి నాగభూషణ రావు
(ఈ వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్, మోటివేషనల్ స్పీకర్)
సెల్ నెంబర్ : 9885292208


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి